హోమ్ / వార్తలు / గంటల ప్రాతిపదికన బస్సులు అద్దెకు
పంచుకోండి

గంటల ప్రాతిపదికన బస్సులు అద్దెకు

గంటల ప్రాతిపదికన బస్సులు అద్దెకు

అద్దె ప్రాతిపదికన బస్సులు ఇచ్చే విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ సరళీకరించింది. అన్ని రకాల బస్సులు అద్దెకు ఇచ్చే నూతన విధానానికి సోమవారం నుంచి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల అవసరాల మేరకు గంటల వ్యవధి కోసం కూడా బస్సులను అద్దెకు ఇచ్చే నూతన విధానాన్ని రూపొందించినట్లు ఆర్టీసీ ఎండీ జి.వి.రమణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఆదాయాన్ని పెంచుకునే ప్రక్రియలో భాగంగా ప్రజల అవసరాల కోసం బస్సులను అద్దెకు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఛార్టెడ్‌ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. గరుడ, గరుడ ప్లస్‌, రాజధాని, మినీ ఏసీ, నాన్‌ ఏసీ, సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌, శీతల్‌, పల్లెవెలుగు బస్సుల్లో ఏది కావాలన్నా అద్దెకు ఇస్తాం. వీటిని ఆన్‌లైన్‌లో కూడా బుక్‌ చేసుకోవచ్చు. బస్సులు అద్దెకు తీసుకున్నవారు అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేసుకుంటే డిపాజిట్‌ పూర్తిగా నష్టపోకుండా ప్రణాళిక రూపొందించాం. 48 నుంచి 24 గంటల్లోపు రద్దు చేసుకుంటే 10 నుంచి 30 శాతం మాత్రమే రద్దు చేసుకుని మిగిలిన సొమ్ము వెనక్కిస్తాం. ఒకరోజు ముందుగా సహేతుకమైన కారణాన్ని చూపితే అపరాధ రుసుము లేకుండా ప్రయాణాన్ని తరువాత రోజుకు వాయిదా వేసే సదుపాయాన్ని కూడా కల్పించాం. కనీసం రెండు గంటల నుంచి గరిష్ఠంగా 16 గంటలకు అంతకు మించి కూడా బస్సును అద్దెకు ఇస్తాం. రాజధాని బస్సులు 24 గంటల వ్యవధిలో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే రూ.29,500 వసూలు చేస్తాం. గరుడకైతే రూ.34,500, గరుడ ప్లస్‌ అయితే రూ.40,500 తీసుకుంటాం. బస్సు వినియోగించుకున్న తరవాత 48 గంటల్లో బిల్లులను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఆ గడువులోపల చెల్లించలేకపోతే ఆ డిపాజిట్‌పై ప్రభుత్వ నిబంధనల మేరకు వడ్డీని కూడా వినియోగదారులకు చెల్లిస్తాం’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు