హోమ్ / వార్తలు / టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పంచుకోండి

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

3,028 కేంద్రాలు.. 6,57,595 మంది విద్యార్థులు

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. పరీక్షల నిర్వహణపై గురువారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 6,57,595 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, అందులో 3,43,040 మంది బాలురు, 3,14,555 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. 3,028 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 10,941 పాఠశాలలకు నామినల్‌ రోల్స్‌ జాబితాలను పంపామని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖ అధికారులను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని, కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఆర్టీసీ, వైద్య ఆరో గ్యం, ట్రాన్సకో, పోలీసు, పోస్టల్‌ శాఖలను సమన్వయంచేస్తూ వెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 సున్నితమైన పరీక్ష కేంద్రాలను గుర్తించామని, అందులో 5 కేంద్రాలు అతిసున్నితమైనవి ఉన్నాయని తెలిపారు. వాటన్నింటిలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 156 ఫ్లైయింగ్‌స్క్వాడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సి కేటగిరీలోని 633 పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వీరుకాకుండా జిల్లాకు ఒకరు చొప్పున పరీశీలన అధికారులను నియమించామని, వారు ప్రతిరోజూ పరీక్ష జరుగుతున్న తీరుపై నివేదికలు పంపుతారని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూస్తామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి ఒకరోజు ముందుగానే వెళ్లి వివరాలు తెలుసుకోవాలని, పరీక్ష కేంద్రానికి విద్యార్థులు 8.30 గంటల్లోపు వచ్చేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు అవసరమైనవన్నీ సమకూర్చాలన్నారు. పరీక్ష హాలులో మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి


పైకి వెళ్ళుటకు