హోమ్ / వార్తలు / డిజిటల్ విప్లవానికి భారతదేశం సిద్ధంగా ఉంది: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్
పంచుకోండి

డిజిటల్ విప్లవానికి భారతదేశం సిద్ధంగా ఉంది: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్

డిజిటల్ విప్లవానికి భారతదేశం సిద్ధంగా ఉంది: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్

వంద కోట్లకు పైగా మొబైల్ ఫోన్ లు, ఆధార్ కార్డులు ఉన్న 110 కోట్ల ప్రజలు, 1.35 లక్షల బ్యాంకు శాఖలు, 1.55 లక్షల పోస్టాఫీసులు, ఒకటిన్నర లక్షల మంది బిజినెస్ కరెస్పాండెంట్ లతో భారతదేశం డిజిటల్ విప్లవానికి సన్నద్ధమై ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఆయన మంగళవారం నాడిక్కడ స్వర్ణ భారతి ట్రస్ట్ కు చెందిన అక్షర స్కూల్ లో జరిగిన విత్తీయ సాక్షరత అభియాన్ (డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్) కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్రమం భారతదేశాన్ని నగదు ప్రధాన సమాజం వైపు నుంచి నగదు రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఒక భాగం.

ఈ సందర్భంగా శ్రీ ప్రకాశ్ జావడేకర్ ఒక ప్రెజెంటేషన్ ను ఇస్తూ, యువతీయువకులు మార్పునకు ప్రతినిధులుగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ఎవరైనా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోర్టల్ లోకి ప్రవేశించి తమను తాము వినియోగదారుగా రిజిస్టర్ చేసుకోవాలని, డిజిటల్ లావాదేవీలను గురించి నేర్చుకొని, డిజిటల్ లావాదేవీని పూర్తి చేయడాన్ని గురించి అభ్యాసం చేయాలని, వారి కుటుంబాన్ని డిజిటల్ జ్ఞానం కలిగిన కుటుంబంగా మలచుకొని, ఒక్కొక్క యువ ప్రతినిధి పది ఇతర కుటుంబాల సభ్యులను డిజిటల్ పరిజ్ఞానం కలిగిన కుటుంబంగా మార్చాలని వివరించారు. ఇప్పటికే 2,27,000 మంది విద్యార్థులు తమను తాము స్వచ్ఛంద సేవకులుగా నమోదు చేసుకొన్నారని మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

ప్రజలు మార్పును స్వీకరించడానికి తయారుగా ఉన్నారని, 2016 డిసెంబరు 2 నుంచి 20వ తేదీల మధ్య కాలంలో పెట్రోల్ బంకులలో డిజిటల్ లావాదేవీలు 20 నుంచి 70శాతానికి పెరిగాయని శ్రీ ప్రకాశ్ జావడేకర్ అన్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన 500 నగరాలలో డిజిటల్ లావాదేవీలు జరిగినా, మొత్తం లావాదేవీలలో 60 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు లెక్కకు రాగలుగుతాయని మంత్రి అన్నారు.

డిజిటల్ చెల్లింపులలోని వివిధ పద్ధతులను గురించి శ్రీ ప్రకాశ్ జావడేకర్ చెబుతూ, పిఒఎస్, ఇ-వ్యాలెట్, యుపిఐ, ప్రి-పెయిడ్ కార్డులు తదితర అయిదు రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.  ఆధార్ కార్డు సాయంతో డిజిటల్ లావాదేవీ ని ఎలా జరపవచ్చో ఆ విధానాన్ని గురించి మంత్రి సభలో తాను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.

అంతక్రితం కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ‌ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, డిజిటల్ వైపునకు మొగ్గితే అవినీతి తగ్గగలదని, లావాదేవీలను పారదర్శకమైన పద్ధతిలో  ముగించుకోవచ్చన్నారు.  నల్లధనంపైన, ఉగ్రవాదులపైన, అవినీతిపైన ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధర్మ యుద్ధం చేస్తున్నారని, సమాంతర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి తద్వారా రూపాయి నిజమైన విలువను పునరుద్ధరించవచ్చని శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు.

2016 డిసెంబర్ 30 తరువాత నగదు కొరత క్రమంగా తగ్గిపోతుందని, అయితే అదే సమయంలో నల్లధనం కూడబెట్టుకొన్న వర్గాలకు సమస్యలు పెరిగిపోతాయని కూడా మంత్రి చెప్పారు. సంస్కార గా పేరు పెట్టిన ఈ కార్యక్రమానికి నెల్లూరు, నెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేరు వేరు బ్యాంకులు నగదురహిత లావాదేవీలు జరిపే పద్ధతులపై అవగాహనను కలిగించడం కోసం సభాస్థలం వద్ద స్టాళ్లు ఏర్పాటు చేశాయి

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు