హోమ్ / వార్తలు / ప్రైవేటు ఉపాధ్యాయులకు ‘టెట్‌’ తప్పనిసరి
పంచుకోండి

ప్రైవేటు ఉపాధ్యాయులకు ‘టెట్‌’ తప్పనిసరి

ప్రైవేటు ఉపాధ్యాయులకు ‘టెట్‌’ తప్పనిసరి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పాసైన అభ్యర్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో టెట్‌ పాసైన వారు మాత్రమే ఉపాధ్యాయులుగా ఉండాలన్న నిబంధనపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టెట్‌ పాసవడమే కాకుండా డీఎస్సీ ద్వారా అభ్యర్థులు ఎంపికవ్వాలి. ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ పాసైన వారు, డిగ్రీ తప్పిన వారు...ఇంకా చెప్పాలంటే 10వ తరగతి పాసైన వారిని తీసుకున్నా అడిగే వారే లేరు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు బడుల్లో బోధనా సిబ్బందికి టెట్‌ తప్పనిసరి. అయితే ఇప్పటివరకు ఆ నిబంధన అమలుపై విద్యాశాఖ దృష్టి పెట్టలేదు. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు పడిపోతున్నాయి. మరోవైపు 1-10వ తరగతి విద్యార్థుల్లో 52 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. రాష్ట్రంలో 11 వేల ప్రైవేటు బడులుండగా వాటిల్లో 2 లక్షల మందికిపైగా ఉపాధ్యాయులున్నారు. ఈక్రమంలో వాటిపై కూడా పర్యవేక్షణ పెంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే గత నెలలో ప్రత్యేక బృందాల తనిఖీల సందర్భంగా ప్రైవేటు బడుల్లో తనిఖీ చేసేటప్పుడు తప్పనిసరిగా టెట్‌ పాసైన ఉపాధ్యాయులు ఎందరున్నారో లెక్కించాలని విద్యాశాఖ సంచాలకుడు కిషన్‌ ఆదేశించారు. ఆ సర్వే ప్రకారం ప్రాథమిక స్థాయి ప్రైవేటు బడుల్లో 36 శాతం, ఉన్నత పాఠశాలల్లో 48 శాతం మంది మాత్రమే టెట్‌ ఉత్తీర్ణులైన వారున్నారని తేలింది.
ఆధారం: ఈనాడు
పైకి వెళ్ళుటకు