హోమ్ / వార్తలు / మహిళా రైతు రాజ్యం
పంచుకోండి

మహిళా రైతు రాజ్యం

వివిధ అంశాలపై వర్క్‌షాపులు..

 

బాపట్ల : వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించే రైతమ్మ రాజ్యం రావాలని మహిళా కిసాన్‌ అధికార మంచ్‌ సభ్యురాలు డాక్టర్‌ అర్చనాసింగ్‌ ఆకాంక్షించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని డాక్టర్‌ బీవీ నాథ్‌ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మహిళా రైతుల జాతీయ సమ్మేళనం శుక్రవారం ప్రారంభ సభలో డాక్టర్‌ అర్చనాసింగ్‌ ప్రసంగించారు. ఆటుపోటులు ఎదుర్కొంటూ వ్యవసాయ రంగంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 60 శాతానికి పైగా ఉన్న మహిళలకు మరింత చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహిళా రైతు ప్రతినిధులు తమ అభిప్రాయాలను సమావేశంలో వివరించారు. మహిళల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఇడబ్ల్యుఓ ఫౌండర్‌ ఎల్బెన్‌భట్‌ , సమన్వయకర్త జిన్నీ శ్రీవాత్సవ, మహిళా కిసాన్‌ అధికారమంచ్‌ సభ్యులు డాక్టర్‌ ఉషా సీతాలక్ష్మీ ఆయా రాష్ర్టాల మహిళా రైతుల ప్రతినిధులు ప్రసంగించారు.

వివిధ అంశాలపై వర్క్‌షాపులు..
అనంతరం సమాంతర వర్క్‌షాపులు నిర్వహించారు. కార్యక్రమంలో సీ మా కులకర్ణి, సూర్యరజనీ, కీర్తీహోరా మహిళా రైతులకు భూమి హక్కు, నీటిహక్కులు కల్పించాలని అన్నారు. ఉషా, బానుజా మహిళారైతులు - సుస్థిర వ్యవసాయం అంశంపై వివరించారు. తమిళనాడుకు చెందిన ఫాతిమా బర్నాండ్‌, సేజల్‌ దండ్‌లు వేతనాలు, పని పరిస్థితులు, సామాజికభద్రత గురించి చర్చించారు. రైతు స్వరాజ్యవేదిక సభ్యురాలు డాక్టర్‌ ఉషాసీతాలక్ష్మీ మహిళా రైతుల భూమి హక్కుల గురించి వివరించారు. అర్చనా సింగ్‌, కల్పనా సతీష్‌, కవితాకురగంటిలు కూడా పలు అంశాలు తెలియజేశారు. వివిధరాష్ర్టాల మహిళా రైతుల స్థితి గతుల గురించి సోమకేపి, రుక్మిణిరావు , ఆశాలతలు తెలియజేశారు. జనచేతన సంస్థాన్‌ ప్రతినిధి రిచా అడిచ్య మహిళా రైతులు ఉమ్మడి వనరుల గురించి తెలిపారు. కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌ సభ్యులు కె.సజయ రైతుల ఆత్మహత్యలు- మహిళా రైతులపై ప్రభావం గురించి తెలియజేశారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రతినిధి రవి కన్నెగంటి మార్కెట్‌తో అనుసంధానం గురించి చర్చించారు. మహిళా ఆరోగ్యం, పర్యావరణం, సమాచారం, బాధ్యతకు పరికరాలు గురించి పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి


 

పైకి వెళ్ళుటకు