హోమ్ / వార్తలు / సాగర మాల ప్రాజెక్టు తో ఆంధ్ర ప్రదేశ్ కు అవకాశాల వెల్లువ: కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ
పంచుకోండి

సాగర మాల ప్రాజెక్టు తో ఆంధ్ర ప్రదేశ్ కు అవకాశాల వెల్లువ: కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ

సాగర మాల ప్రాజెక్టు తో ఆంధ్ర ప్రదేశ్ కు అవకాశాల వెల్లువ: కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ

సాగర మాల ప్రాజెక్టు తో ఆంధ్ర ప్రదేశ్ కు అవకాశాలు అధికం అవుతాయని కేంద్ర ఉపరితల రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ మరియు ప్రమోషన్ విభాగం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు సిఐఐ లు సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఈ రోజు నిర్వహించిన పారిశ్రామిక కారిడార్ల వల్ల కలిగే వృద్ధిపై జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్ కరీ మాట్లాడుతూ, అన్నిరంగాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. అనేక మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. డిసెంబరు నాటికి రూ.3.50 లక్షల కోట్ల మేర రహదారుల నిర్మాణంపై వ్యయం చేయనున్నామని ఆయన చెప్పారు. ఇందులో ఇప్పటికే రూ.లక్ష కోట్ల విలువ మేరకు ఖరారు చేసినట్లు తెలిపారు. పోర్టులతో అనుసంధానం చేసి రహదారులను నిర్మించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. గత ఏడాది రోజుకు 18 కిలోమీటర్ల మేర మాత్రమే రహదారులను నిర్మించగా, ప్రస్తుతం రోజుకు 30 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్లు వివరించారు. రహదారులు సక్రమంగా లేకపోవడం వల్ల ఏడాదికి 5 లక్షల వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. 18 శాతం ట్రాఫిక్ జాతీయ రహదారులపైన జరుగుతున్నట్లు చెప్పారు.

సాగర మాల ప్రాజెక్టును రూ.15 లక్షల కోట్లతో చేపడుతున్నట్లు శ్రీ నితిన్ గడ్ కరీ వెల్లడించారు. దీనిని ఇప్పటికే రూ. లక్ష కోట్ల తో ప్రారంభించినట్లు తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో 7,500 కిలోమీటర్ల మేర రహదారులు వస్తున్నాయని చెప్పారు. సాగర మాల ప్రాజెక్టు వల్ల లాజిస్టిక్ వ్యయాలు తగ్గుతాయని ఆయన అన్నారు. సాగర మాల ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ తదితర విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో 40 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో కోస్టల్ ఎకనామిక్ జోన్ లు వస్తున్నాయని శ్రీ నితిన్ గడ్ కరీ చెప్పారు. వీటిలో 2 జోన్ లు ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి రూ.8 లక్షల కోట్లు వ్యయం కాగలదని, తద్వారా 40 లక్షల మంది వరకు ప్రత్యక్షంగాను, 60 లక్షల మంది వరకు పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. వీటిలో రూ.20,000 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ లో వ్యయం జరుగుతుందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సెంట్రల్ రోడ్ ఫండ్ కింద రూ.1,000 కోట్లు, 30 రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఒబి) లకు రూ.3,500 కోట్లు మంజూరు చేస్తామని శ్రీ గడ్ కరీ ప్రకటించారు. ఈ పనులను ఈ సంవత్సరం ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు అభివృద్ధికి రూ.6,000 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. ఇందులో రూ.1,665 కోట్లతో పనులు పూర్తి అయ్యాయని, మరో రూ.2,200 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. వీటితో పాటు మరిన్ని పనులు చేపట్టడం కోసం రూ.1,500 కోట్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి వివరించారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము .

పైకి వెళ్ళుటకు