పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శిలావాయువు విప్లవం

ఇంధన రంగంలో పెను విప్లవం! ఆర్థికవృద్ధికి గొప్ప చోదక శక్తి అయిన ఇంధన వనరులు అంతరించిపోతున్నాయనుకుంటున్న దశలో భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కొత్త శకం.

ఇంధన రంగంలో పెను విప్లవం! ఆర్థికవృద్ధికి గొప్ప చోదక శక్తి అయిన ఇంధన వనరులు అంతరించిపోతున్నాయనుకుంటున్న దశలో భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కొత్త శకం! భూగర్భంలో పొరలు పొరలుగా పేరుకుని ఉన్న శిలాఫలకాల్లో నిక్షిప్తమైన అపార సహజవాయువు నిల్వలు భారత్‌ సహా పలు దేశాల ఆర్థికముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇంధనం కోసం దిగుమతులపై ఆధార పడే చాలా దేశాలు స్వావలంబన సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంధనం ధరలు గణనీయంగా తగ్గుతాయి. అమెరికాలో పదేళ్లుగా శిలావాయువు (షేల్‌గ్యాస్‌) ఉత్పత్తిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఈ అభిప్రాయానికి వస్తున్నారు. దీనిని శిలావాయువు విప్లవంగా వారు అభివర్ణిస్తున్నారు. కఠిన శిలలకు పై భాగంలో ఉండే సంప్రదాయ సహజవాయువు నిల్వలకు భిన్నంగా మడ్డి వంటి అవక్షేపాలతో ఏర్పడే శిలల్లో నిక్షిప్తమై ఉన్న సహజవాయువును శిలావాయువు అంటారు.

ఇంధనరంగంలో అమెరికా ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో ఆ దేశం ఈ రంగంలో స్వావలంబన సాధించనుంది. అక్కడ వచ్చిన శిలావాయు విప్లవం అమెరికాకు మాత్రమే కాకుండా మిగతా దేశాలకూ మేలు చేస్తుందనేది నిపుణుల విశ్లేషణ. శిలావాయువు కూడా సహజవాయువే. అయితే ఇది సంప్రదాయేతరమైనది. వెలికితీతలో భిన్నమైనది. ఇది అగ్రరాజ్యానికే పరిమితమైన వనరు కాదు. పలు దేశాల్లో ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.

భూమిలో కర్బన సంబంధ వనరు సమృద్ధిగా ఉన్న ప్రదేశంలో ఆవిర్భవించిన వాయువు అక్కడి నుంచి మరలి కఠినంగా ఉండే కొన్ని శిలల పైభాగంలో నిక్షిప్తమై ఉంటుంది. భూ ఉపరితలం నుంచి ఆ ప్రదేశం వరకూ నిట్టనిలువుగా బోరుబావి తవ్వి సహజవాయువును వెలికితీస్తారు. దీన్ని సంప్రదాయ సహజవాయు ఉత్పత్తి అంటారు. అవసరాలు పెరుగుతున్నందున ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సంప్రదాయేతర సహజవాయువుల వెలికితీతపై బాగా దృష్టిపెడుతున్నారు. వీటిల్లో శిలావాయువు (షేల్‌గ్యాస్‌), కోల్‌ బెడ్‌ మీథేన్‌, హైడ్రేట్స్‌, టైట్‌గ్యాస్‌ ముఖ్యమైనవి. మెత్తటి శిలల పొరల్లో నిక్షిప్తమై ఉండే శిలావాయువును సంప్రదాయ పరిజ్ఞానంతో వెలికితీయలేరు. ఇందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. వేల మీటర్ల లోతున ఉన్న శిలావాయువును వెలికి తీసే ప్రక్రియలో రెండు దశలుంటాయి. బోరు బావిని తవ్వడం మొదటి దశ కాగా సహజ వాయువును ఇముడ్చుకున్న శిలల్లోకి నీరు-ఇసుక-ఇతర రసాయనాలతో కూడిన మిశ్రమాన్ని అమితమైన పీడనంతో పంపించి ఆ పలకలకు పగుళ్లు చేసి అందులోని సహజవాయువును వెలికి తీయడం రెండో దశ.

అమెరికా ముందడుగు

శిలా వాయువు అమెరికా ఇంధన రంగంపై బలమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సహజవాయువు ధరలు తగ్గాయి.. ఇది శిలావాయువు విప్లవం వల్ల అమెరికా తొలిదశలో పొందుతున్న ఫలితమని, తదుపరి దశలో అమెరికాలో ఇతర ఇంధనాల ధరలూ తగ్గుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.... సహజవాయువును వాహనాలకూ ఇంధనంగా వాడవచ్చు. అమెరికాలోని పట్టణప్రాంతాల్లో సహజవాయువును ఇళ్ళకు, కార్యాలయాలకు, సూపర్‌మార్కెట్లకు నేరుగా సరఫరా చేసే పైప్‌లైన్‌ వ్యవస్థ ఇప్పటికే ఏర్పాటై ఉంది. సహజవాయువు ధర ఇంకా తగ్గాక ప్రత్యేక కిట్‌లను అందుబాటులోకి తెస్తే ప్రజలు తమ గ్యారేజీల్లోనే వాహనాల ట్యాంకులను నింపుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇటువంటి ప్రత్యామ్నాయాల ద్వారా చమురు, సహజవాయువు రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తే ఎగుమతులపై భారీగా ఆధారపడి ఉన్న గల్ఫ్‌ దేశాలు, రష్యాలకు కష్టాలు ఎదురయ్యే అవకాశమూ ఉంది.

  • అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఈఐఏ) తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో వెలికితీయదగిన మొత్తం సహజవాయు నిక్షేపాలు 2,543 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగులు. అందులో శిలావాయువు నిల్వలు.. 862 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగులు.
  • అమెరికాలో సహజవాయువు ఉత్పత్తి 2011లో 23.0 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగులు. 2040 నాటికి ఇది 33.1 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగులకు చేరుతుందని, అంటే 44 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. ఈ వృద్ధి అంతా కూడా శిలావాయువు ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల వల్లే సాధ్యం కాబోతుంది.

మిషెల్‌ కార్పొరేషన్‌ చొరవ

1950 కంటే ముందు శిలా వాయవు వెలికితీతకు కొన్ని ప్రయోగాలు జరిగినా ఆ తర్వాతే వూపందుకున్నాయి. అమెరికాలో మిషెల్‌ ఎనర్జీ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 1980, 90ల్లో టెక్సాస్‌లోని బర్నెట్‌ నిక్షేపాల్లో శిలావాయువు ఉత్పత్తిని వాణిజ్యప్రాతిపదికన చేయగలడం పెద్దముందడుగు. ఇక్కడి నిక్షేపాలు బాగా లోతైనవి. ఈ సంస్థ విజయాలు చూసి మిగతా కంపెనీలు ఈ రంగంలోకి దూసుకువచ్చాయి. ఫలితంగా బర్నెట్‌ నిక్షేపాల్లోనే 2005 నాటికి ఏటా అర ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగుల సహజవాయువు ఉత్పత్తి జరిగింది. తదనంతరం ఉడ్‌ఫోర్డ్‌, ఈగిల్‌ ఫోర్డ్‌ తదితర ప్రాంతాలకు ఉత్పత్తి వేగంగా విస్తరించింది.

ప్రపంచవ్యాప్త ప్రభావం

  • శిలావాయువు రంగంలో అమెరికాలో జరిగిన అభివృద్ధితో తొలుత కెనడా స్ఫూర్తి పొందింది. ఆ తర్వాత అనేక ఇతర దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి.
  • అంతర్జాతీయంగా శిలావాయువు నిక్షేపాల ఏమేరకు ఉన్నయో అంచనాలు రూపొందించేందుకు అడ్వాన్సుడ్‌ రీసోర్సెస్‌ ఇంటర్నేషనల్‌ ( ఏఆర్‌ఐ) అనే సలహాసంస్థకు ఈఐఏ బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ మొత్తం 32 దేశాలలోని 48 పరీవాహక ప్రాంతాల్లో అధ్యయనం చేయగా 5760 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగుల వరకు సహజవాయువును వెలికి తీయవచ్చని తేలింది. అమెరికాలో గుర్తించిన 862 ట్రిలియన్‌ క్యూబిక్‌ అడుగులకు ఇవి అదనం. వనరులను విశ్లేషించేందుకు అవసరమైన తగన భౌగోళిక సమాచారం, గణాంకాలు అందుబాటులో ఉన్న దేశాలను ఈ అంచనాల కోసం ఎంపిక చేసుకున్నారు. భవిష్యత్తులో అదనపు సమాచారం వస్తే నిల్వలకు సంబంధించిన అంచనాలలోనూ మార్పులు ఉంటాయి.
  • ప్రస్తుతం అనేక దేశాలు తమ వద్ద శిలావాయువు వనరులపై మరింత సమగ్రమైన అంచనాలు రూపొందించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్లోబల్‌ షేల్‌ గ్యాస్‌ ఇనీషియేటివ్‌ (జీఎస్‌జీఐ) అనే సంస్థ ఇందుకు చేయూతనిస్తోంది.

పర్యావరణ సవాళ్లూ ఉన్నాయ్‌!

బొగ్గు, చమురుతో పోలిస్తే సహజవాయువు నిర్మలంగా మండుతుంది. అతి తక్కువ స్థాయిలోనే బొగ్గుపులుసు వాయువు, సల్ఫర్‌ డయాక్సైడ్‌ విడుదలవుతాయి. అయినప్పటికీ సంప్రదాయేతర సహజవాయువు అయిన శిలావాయువు ఉత్పత్తివల్ల పర్యావరణ సమస్యలు కొన్ని ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

  • జలశక్తితో భూమిలోని శిలలను పగులకొట్టే ప్రక్రియ కోసం భారీ ఎత్తున నీరు అవసరం. దీనివల్ల ఈ ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో ఇతర అవసరాల కోసం నీరు దొరకడం తగ్గిపోవచ్చు.
  • భూగర్భంలోకి పంపే నీటిలో కొన్ని ప్రమాదకర రసాయనాలనూ కలుపుతారు. బావి నిర్మాణంలో లోపాల వల్ల కానీ, లీకేజీల వల్ల మరే ఇతర కారణాలవల్ల ఈ ద్రవం బయటకు వస్తే భూగర్భజలాలు కలుషితం అవుతాయి.
  • జలశక్తితో భూమిలోని శిలలను పగులకొట్టిన తర్వాత పెద్ద ఎత్తున వృథా జలం కూడా బయటకు వస్తుంది. కరిగిన రసాయనాలతోపాటు మరికొన్ని కలుషితాలూ అందులో ఉంటాయి. శుద్ధి చేయకుండా వాటిని పారబోసినా, వినియోగించినా ప్రమాదం.
  • అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే విభాగం విశ్లేషణ ప్రకారం భూమిలోని శిలలను జలశక్తితో పగల కొట్టడం ప్రకంపనలకూ కారణమవుతుంది. వ్యర్థపు నీటిని తిరిగి భూ ఉపరితలంపైకి పంపేక్రమంలో ఈ ప్రకంపనలు ఏర్పడతాయి.

డ్రిల్లింగ్‌ దశ

బోరు తవ్వే యంత్రం

సహజవాయువు నిక్షేపాలను ఇముడ్చుకున్న శిలలు (షేల్‌) ఎంత లోతున ఉన్నాయన్న దాన్ని బట్టి ఒక్కో బోరు బావిని తవ్వడానికి మూడు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది.

భూమిలోని నీటి వనరుల సంరక్షణ

నీరు-ఇసుక-రసాయనాలను పంపించే గొట్టానికి లీకులు ఏర్పడి, భూగర్భజలం కలుషితమయ్యే ప్రమాదం లేకుండా ఆ గొట్టం చుట్టూ ఉక్కు కేసింగులు అమరుస్తారు.

శిల(షేల్‌) అంటే..

మడ్డి వంటి అవక్షేపాలు పేరుకుపోయి ఇవి ఏర్పడతాయి. పొరలు పొరలుగా ఉండడం వీటి ప్రత్యేకత. వీటిల్లో కొన్ని రకాల పలకలు కర్బన సంబంధింత పదార్థాలను ఏళ్ల తరబడి శోషించుకుని ఉండడం వల్ల వాటిల్లో సహజవాయువు చేరి ఉంటుంది. ఇవిభూగర్భంలో దాదాపుగా వెయ్యి నుంచి 2,500 మీటర్ల లోతున ఉంటాయి.మలుపు కేంద్రం

(కిక్‌-ఆఫ్‌ పాయింట్‌)

ఉపరితలం నుంచి నిట్టనిలువుగా వచ్చిన డ్రిల్‌.. క్షితిజ సమాంతరంగా అంటే అడ్డంగా తిరిగే చోటు. శిలాపలకలకు దాదాపు 150 మీటర్ల ఎత్తున ఇది క్షితిజ సమాంతరంగా వంపు తిరుగుతుంది.

బోరు గొట్టం ద్వారా

ముందుగా శిలలకు రంధ్రాలు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక జెట్‌గన్‌ ఉపయోగిస్తారు.

వ్యర్థాల గొయ్యి

బోరు బావి తవ్వడం ద్వారా వచ్చే మడ్డి వంటి వ్యర్థాలను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా గోతులు ఏర్పాటు చేస్తారు.

శిలలను ఛిద్రం చేసే దశ (హైడ్రాలిక్‌ ఫ్రాక్చరింగ్‌)

ఎక్కువ మొత్తం నీటిలో ఇసుకను, కొన్ని రసాయనాలను కలిపి అమితమైన పీడనంతో బోరుబావిలోకి పంపింగ్‌ యంత్రం సహాయంతో పంపిస్తారు. ఆ నీరు లోపలికి ఎంత బలంగా వెళుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా మనకు అందుబాటులో ఉండే అన్ని గ్యాస్‌ సిలిండర్లలో 250 కంటే లోపే పీఎస్‌ఐ (పౌండ్స్‌ పర్‌ ఇంచ్‌ - ప్రతి చదరపు అంగుళానికి ఉండే పీడనం) ఉంటుంది. బోరుబావిలోకి దాదాపు 18,000 నుంచి 20,000 పీఎస్‌ఐతో నీటిని పంపిస్తారు. ఇందుకోసం భారీ కంప్రెషర్లను ఉపయోగిస్తారు.

శిలలలో పగుళ్లు చేయడానికి

ఒక్కో బోరు బావికి దాదాపు 500 ట్యాంకర్ల నీరు, 1,800 టన్నుల ఇసుక, మరో వంద టన్నుల రసాయనాలు అవసరమవుతాయి.

అత్యధిక పీడనంతో పంపించిన నీరు-ఇసుక మిశ్రమం..

జెట్‌ గన్‌ ద్వారా శిలలకు చేసిన రంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి మరిన్ని పగుళ్లు చేస్తుంది. తద్వారా అక్కడి హైడ్రోకార్బన్‌ బంధనాలను విముక్తి చేస్తుంది. శిలలనుంచి ఇలా బయటకువచ్చిన వాయువు బోరుబావిద్వారా బయటకు వస్తుంది.

మిశ్రమాన్ని లోపలికి పంపించడం

ఆతరువాత సహజవాయువు వెలుపలకి రావడం ఇలా ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు పదిరోజుల సమయం పడుతుంది. సహజవాయువును అక్కడే ట్యాంకుల్లో నిల్వ చేసి ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తారు.

భారత్‌లో భారీ నిల్వలు: డాక్టర్‌ ఎ.ఎం. దయాళ్‌

భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలకంటే అధిక పరిమాణంలో శిలావాయువు నిక్షేపాలున్నాయని భావిస్తున్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణుడు, హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ( ఎన్‌జీఆర్‌ఐ) గౌరవ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.ఎం.దయాళ్‌ తెలిపారు. ఆయన సుదర్ఘీకాలం ఈ సంస్థలో పెట్రోలియం జియోకెమిస్ట్రీ గ్రూపు అధిపతిగా పనిచేశారు. ఎన్‌జీఆర్‌ఐ మరో రెండు కేంద్ర సంస్థలతో కలిసి జార్ఖండ్‌లోని దామోదరబేసిన్‌లో శిలావాయువు నిక్షేపాలపై అధ్యయనానికి చేపట్టిన ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తున్నారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. అక్కడ ఇప్పటికే బొగ్గు తవ్వకాలు జరుపుతున్న ప్రదేశాల్లో శిలావాయువు నిల్వలను తెలుసుకోవాలని బొగ్గుమంత్రిత్వ శాఖ సంకల్పించింది. డాక్టర్‌ దయాళ్‌ ఈనాడుకు చెప్పిన ముఖ్యవిషయాలు ఇవి...

  • మన దేశంలోని అన్ని బేసిన్లలో పకడ్బందీగా అధ్యయనాలు జరిపిన తర్వాత మాత్రమే వాస్తవంగా నిల్వలు ఎన్ని ఉన్నాయి? వాటిల్లో ఎన్ని వెలికితీయగలిగినవి అని అంచనా వేయగలం.
  • శిలావాయువు వెలికితీత సంక్లిష్టమైనది అయినప్పటికీ, బయటకు తీశాక దానిని నేరుగా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. సంప్రదాయ సహజవాయువును వెలికి తీసినప్పుడు దానిలో నీరు, గంధకం వంటివి కలిసి ఉంటాయి. వాటిని సాంకేతిక ప్రకియ ద్వారా విడదీసి వాడుకోవాల్సి ఉంటుంది.
  • అమెరికాలో శిలావాయువు అభివృద్ధి అత్యంత వేగంగా ఉంది. నాలుగైదు సంవత్సరాల్లో దానికి ఇక ఇంధన దిగుమతులు అవసరం కాకపోవచ్చు. చైనాకూడా ఈ విషయంలో వేగంగా ఉంది. ప్రస్తుతం అక్కడ నాలుగు పరీవాహక ప్రాంతాల్లో వెలికితీత జరుగుతోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.
  • శిలావాయువు వెలికితీతవల్ల భూగర్భజలం పాడయ్యే అవకాశం బాగా తక్కువ. ఎందుకంటే సాధారణంగా 1500 అడుగులకంటే ఎక్కువ లోతులోనే శిలావాయువు వెలికితీత జరుగుతుంది.

భారత్‌లో వెలికితీతకు సన్నాహాలు

చమురు, సంప్రదాయ సహజవాయువు రంగంలో మాదిరిగానే శిలా వాయువు రంగంలోనూ ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ జాతీయ వెలికితీత విధానాన్ని వెలువరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత బ్లాకులవారీగా ప్రాంతాలను వేలం వేస్తుంది. మనదేశంలోని ప్రఖ్యాతసంస్థలు శిలావాయువు రంగంలోకి ప్రవేశించేందుకు అవసరమైన సన్నాహాలలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నాయి. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయనే అంచనాలతో కొన్ని సంస్థలు ఆ ప్రాంతంలో జరగనున్న వెలికితీతలో పాత్ర పోషించేందుకు ప్రాథమిక సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాదు మన దేశీయ సంస్థలు అమెరికాలో శిలావాయువు వెలికి తీస్తున్న అక్కడి కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి భాగస్వాములుగా చేరుతుండటం గమనార్హం. శిలావాయువు అభివృద్ధి ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో సహజవాయువు ధరలు తగ్గాయి. ఈ విషయంలో తొలిదశలో అమెరికాకు అందిన ప్రయోజనం ఇది అని, భవిష్యత్తులో ఇతర ఇంధనాల ధరలపైనా దీని ప్రభావం ఉంటుందని నిపుణుల అంచనా. అమెరికాలో ఆర్థిక పునరుజ్జీవానికి కీలక చోదకశక్తిగా భావిస్తున్న శిలావాయువు ఇంధనం.. రాబోయే రోజుల్లో భారత్‌కు, ప్రపంచానికి ఎలాంటి మేలు చేయనుందో వేచి చూడాలి.

భారత కంపెనీల భారీ పెట్టుబడులు

  • మూడు సంవత్సరాలుగా అమెరికాలో శిలా వాయువు రంగంలో భారత్‌ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆయిల్‌ ఇండియా, గెయిల్‌ సంస్థలు ఇలా అమెరికా శిలావాయువురంగంలో ప్రవేశించాయి.
  • స్వేచ్ఛా విపణి ఒప్పందాని(ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌)కు వెలుపల ఉన్న భారత్‌ వంటి దేశాలకు సహజవాయువును ఎగుమతి చేయడం అమెరికాలో నిషిద్ధం. అయినప్పటికీ భారత్‌కు ఒక ఓడ ద్వారా శిలావాయువు తరలించేందుకు అమెరికా ఇటీవల గెయిల్‌ మినహాయింపును ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా నిక్షేపాలు!

మన రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకప్రాంతాల్లోనూ ఈ నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు దేశంలోని కాంబే (గుజరాత్‌), గొండ్వానా (మధ్యభారత్‌), కావేరి (తమిళనాడు), అస్సాం-అరకన్‌ పరీవాహక ప్రాంతాలలోనూ నిక్షేపాలు ఉన్నట్లు బయటపడింది. అమెరికాకు చెందిన ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఈఐఏ) మనదేశంలోని శిలావాయువు నిక్షేపాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషించింది. తదుపరి అధ్యయనం కోసం భారత పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జీఎస్‌) సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ సంస్థ జరుపుతున్న పరిశీలనలోనూ మనవద్ద నిక్షేపాలు నిర్ధారణ అవుతున్నాయి.

రాష్ట్రంలో విద్యుత్తు కోతే ఉండదు

  • రాష్ట్రంలో విద్యుత్తు అవసరం 13,400 మెగావాట్లు. సరఫరా 10,925 మెగావాట్లు మాత్రమే. లోటు 2,475 మెగావాట్లు.
  • రాష్ట్రప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న సహజవాయువు ఆధార ప్రాజెక్టుల సామర్థ్యం 2,770 మెగావాట్లు. కేంద్రం సహజవాయువు సరఫరా చేయకపోవడం వల్ల సుమారు 300 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో వాయువును సరఫరా చేస్తే 80% సామర్థ్యంతో పనిచేసినా 2,216మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
  • నిర్మాణం దాదాపు పూర్తయిన దశలో దాదాపు 4,500 మెగావాట్ల ప్లాంట్లు ఉన్నాయి. సహజవాయువు కొరతను దృష్టిలోపెట్టుకుని వాటి పనులను ఆయా కంపెనీలు నిలిపివేశాయి. వీటిన్నిటికి సహజవాయువును ఇవ్వగలిగితే మన రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేయవచ్చు.

ఇంధనాల ధరలు తగ్గుతాయి: టి.ఎల్‌. శంకర్‌

శిలావాయువు రంగం అభివృద్ధివల్ల అంతిమంగా ఇంధనాల ధరలు తగ్గే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, పద్మభూషణ్‌ టి.ఎల్‌.శంకర్‌ తెలిపారు. సహజవాయువు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 2003లో వేసిన నిపుణుల కమిటీకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు. శిలావాయువుపై ఈనాడుకు ఆయన చెప్పిన విషయాలు ఇవి...

  • అమెరికాలో ఇటీవలి కాలంలో సహజవాయువు ధర తగ్గి ఎంఎంబీటీయూకు 3.3 డాలర్ల స్థాయిలో ఉంది. ఆ దేశంలో శిలావాయువు రంగం అభివృద్ధి చెందడం ఒక ప్రధాన కారణం.
  • అమెరికా ప్రస్తుతం చమురు తదితర ఇంధనాలను ఒకవైపు దిగుమతి చేసుకుంటూనే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతులనూ బాగా చేస్తోంది. దీన్ని బట్టి అది ఇప్పటికే ఇంధన రంగంలో స్వావలంబన సాధించినట్లు భావిం చాలి.
  • టెక్సాస్‌ వంటి చోట్ల నివాసప్రాంతాలకు బాగా దగ్గరగానూ అమెరికా శిలావాయువు వెలికితీస్తోంది. మనదేశం ఇక్కడి నుంచి నిపుణులను అలాంటి చోట్లకు పంపి అధ్యయనం చేయించాలి.

ఆధారము: ఈనాడు ప్రతిభ.నెట్

3.0438247012
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు