హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం / పర్యావరణ విద్య - పర్యావరణ అంశాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పర్యావరణ విద్య - పర్యావరణ అంశాలు

ప్రకృతి మన జీవనానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుతోంది.అన్ని సహజ వనరులను మనం ఉపయోగించుకొంటున్నాం.

పర్యావరణ అంశాలు

ప్రకృతి మన జీవనానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుతోంది. అన్ని సహజ వనరులను మనం ఉపయోగించుకొంటున్నాం. మనం వాటిని ఎలా వాడుతున్నాం? విచక్షణరహితంగా, అతిగా వాడుతున్నాం. అభివృద్ధి పేరుతో ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నాం. అడవులను నరికివేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్ని మరింతగా పెంచడం, గ్రీన్ హౌస్ వాయువులతో వాతావరణాన్ని, భూగోళాన్ని వేడెక్కించడం అభివృద్ధి అనిపించుకోదు. ఈ విషయాల గురించి ఆలోచించాలి. మనవంతుగా భూగోళాన్ని కాపాడటానికి ఏం చేయాలి? మనతో పాటు సమస్త జీవరాశి భూమిపై స్వేచ్ఛగా, స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.

భూమి మీద 33% అడవులు ఉన్నపుడే జీవరాశులకు తగినంత గాలి దొరుకుతుంది. తాగేందుకు నీరు ఉంటుంది. నేల సక్రమంగా పంటలు పండిస్తుంది. కానీ మన దేశంలో అటవీ భూముల విస్తీర్ణం 19% మాత్రమే ఉంది.

అడవులు నరికివేత - నష్టాలు:

 • వర్షాలు తగ్గిపోతాయి.
 • భూగర్భ జలం అడుగంటిపోతుంది.
 • నేల కోతకు గురవుతుంది.
 • వరదల తాకిడికి భూసారమంతా కొట్టుకుపోతుంది.
 • గాలిలో కార్బన్‌డైఆక్సైడ్ విపరీతంగా పెరిగి భూమి వేడెక్కుతుంది.
 • తీర ప్రాంతాల్లో మడ అడవులు నాశనమైతే సునామీ లాంటి విపత్తులతో అపార నష్టం కలుగుతుంది.
వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు తగ్గుతున్నాయి?
 • ప్రపంచ జనాభా 600కోట్లు దాటడం. (జనాభా పెరిగినంత మాత్రాన భూమి పెరగదు కదా!)
 • పరిమిత ప్రాంతంలోనే ఆహార ఉత్పత్తి జరగడం. అది పెరిగిన జనాభాకు సరిపోక కొరత ఏర్పడటం. కరవు తాండవించడం.
 • వ్యవసాయానికి అతిగా నీరు, ఎరువు, పురుగు మందుల వాడకం.
 • తగ్గిన నేలసారం.
 • రుతుపవనాలు మారడం, సమయానికి వర్షాలు రాకపోవడం.
సముద్ర వనరులు ఎందుకు తగ్గిపోతున్నాయి?
 • పరిశ్రమల మురుగు నీటి వల్ల దేశంలో నదులన్నీ కలుషితమవుతున్నాయి.
 • సముద్ర జలాలు ఫ్యాక్టరీల వ్యర్థపు నీటితో కలుషితమవుతున్నాయి.
 • చమురు రవాణాలో ప్రమాదాలు జరిగి సముద్రంలో కలవడం వల్ల సముద్ర జీవులు చనిపోతున్నాయి.
 • సముద్రాల్లో ఎక్కువగా చేపలు పట్టడం వల్ల కొన్ని జాతుల చేపలు అంతరించిపోతున్నాయి. ఉదా: హలిబల్, సాల్మన్ జాతులు
ఆర్థికాభివృద్ధిపై ప్రభావం:
 • అడవులు తగ్గితే విలువైన ఔషధ గుణాలున్న మొక్కలను, జీవజాతులను కోల్పోతాం.
 • రకరకాల పండ్లు, వనమూలికలు, తేనె, కుంకుళ్లు, జిగురు లాంటి అటవీ ఉత్పత్తులు తగ్గుతాయి.
 • వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే జనాభాకి తగినంత తిండి గింజలు దొరక్క ధరలు పెరుగుతాయి. ఆహారం కోసం పోటీ పెరుగుతుంది. పశుగ్రాసం లభించక పశుగణాభివృద్ధి కుంటుపడుతుంది. పాడి పరిశ్రమ నష్టపోతుంది.
పునరావాసం

మానవ మూర్ఖత్వానికి నిదర్శనం పర్యావరణ కాలుష్యం. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఆనకట్టల ప్రాంతాల్లో ముంపుకి గురయ్యే ప్రజలకు పునరావాసం కల్పించాలి. పొగ కమ్ముతూ, పట్టణాల చుట్టూ ఉండే ఫ్యాక్టరీల స్థలం మార్చాలి. ఆస్తులన్నింటికీ పునరావసం కల్పించడం చాలా కష్టం. అమూల్యమైన వన్య సంపద, జీవులు నాశనమైతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని మరో ప్రదేశానికి తరలించడం పునరావాసం కాదు. కొత్త సమస్యలు లేని ప్రదేశంలో స్థిరనివాసం ఏర్పరచడం జీవానికి అవకాశాలు కలిగించడమే పునరావాసం.

పట్టణాలు, గ్రామాల్లో ఇంధనాల కొరత:

ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇంధన వనరులే ముఖ్యం. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇంధన శక్తికి అత్యంత ప్రాముఖ్యం ఏర్పడింది.

ఇంధన వనరులు రెండు రకాలు:

సంప్రదాయ ఇంధన వనరులు: ఇవి పునరుత్పత్తి చెందని వనరులు

ఉదా: చెక్క, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, చమురు, యురేనియం, థోరియం

సంప్రదాయేతర ఇంధన వనరులు: ఇవి ఎంత ఉపయోగించినా తరగనివి.

ఉదా: సౌరశక్తి, వాయుశక్తి, భూమిలోపల ఉష్ణశక్తి, సముద్ర అలల శక్తి

మనం ఏం చేస్తున్నాం?

ప్రస్తుతం మనం ఉపయోగించేవన్నీ పునరుత్పత్తి చెందని వనరులు. వాటిని అతిగా వాడేస్తున్నాం. అవసరానికి మించి వినియోగిస్తున్నాం.

నష్టాలు:
 • అడవులు తగ్గిపోయి, వర్షం నీరు నదుల్లోకి చేరడం లేదు.
 • ఫలితంగా జల విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోంది.
పరిష్కారం
 • ఈ సమస్యల్ని ఎదుర్కోవాలంటే వనరులను సక్రమంగా పొదుపుగా వాడుకోవాలి.
 • సంప్రదాయేతర ఇంధన వనరులను పెంచడానికి, వినియోగంలోకి తీసుకురావడానికి కృషిచేయాలి.

గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్(హరిత గృహ ప్రభావం), భూమి వేడెక్కడం

గ్రీన్‌హౌస్ వాయువులు: CO2, నైట్రోజన్ ఆక్సైడ్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్‌లు, హైడ్రో కార్బన్‌లు, మీథేన్ మొదలైనవాయువులు.

గ్రీన్‌హౌస్ వాయువులు ఎలా విడుదలవుతాయి?
 • శిలాజ ఇంధనాన్ని మండిస్తే CO2 విడుదలవుతుంది.
 • బొగ్గు నుంచి విద్యుత్తు పుట్టించినపుడు, పరిశ్రమలు ఇంధనాలను మండించినపుడు CO2, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు విడుదలవుతాయి.
 • చల్లబరిచే యంత్రాల నుంచి, లోహాన్ని కరిగించే కొలిమిలు, వ్యోమగామ శకటాలను నడిపే సాధనాలు, ఆటోమొబైల్ యంత్రాలు, వాహనాల నుంచి హైడ్రో ఫ్లోరో కార్బన్ వాయువులు విపరీతంగా వెలువడతాయి.
 • పంట పొలాలపై క్రిమినాశక మందులు చల్లడం వల్ల విపరీతంగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్‌లు, మీథేన్ వాయువులు గాలిలో కలుస్తున్నాయి.
గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్:

గ్రీన్‌హౌస్ వాయువులు భూమి మీద కొంత ఎత్తులో ఒక పొరలాగా ఏర్పడతాయి. సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన షార్ట్‌వేవ్ రేడియేషన్ సైతం భూమిని తాకుతుంది. భూమి కొంతవేడిని గ్రహించి మిగతా వేడిని పరారుణ వికిరణ రూపంలో తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తుంది. భూగోళంపై పొరలా ఏర్పడిన క్లోరో ఫ్లోరో కార్బన్లు, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్‌లు, హైడ్రో కార్బన్లు ఈ వేడిని ఆపి మళ్లీ భూమి మీదకే పంపిస్తాయి. ఫలితంగా భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటారు.

భూమి వేడెక్కడం:

భూమి వేడెక్కడం మనకి తక్షణ ముప్పులా తయారైంది. దీనికి ముఖ్యకారణం గ్రీన్‌హౌస్ వాయువులు, జనాభా విస్ఫోటనం, పరిశ్రమలు పెరగడం, అడవుల నరికివేత.

భూమి వేడెక్కడం వల్ల నష్టాలు:
 • భూ ఉపరితలం వేడెక్కడం వల్ల ధ్రువాల్లో ఉన్న మంచు కరుగుతుంది. దానివల్ల సముద్ర మట్టాలు ఆరు అడుగుల ఎత్తు వరకు పెరిగి కోస్తా తీరాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.
 • నదుల్లో సముద్రపు నీరు చేరి ఉప్పు నీటి కయ్యలుగా మారుతాయి.
 • వాతావరణంలో మార్పులు జరిగి అకాల వర్షాలు కురుస్తాయి. ఫలితంగా క్రిమికీటకాలు, దోమలు విజృంభిస్తాయి. మలేరియా, డయేరియా, డెంగీ లాంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి.
 • కొన్ని దేశాల్లో అనావృష్టి, కరవు కాటకాలే కాకుండా నీటి కొరత విపరీతంగా ఉంటుంది.
మనం ఏం చేయాలి:
 • సామాజిక వనాలు, చెట్లను బాగా పెంచాలి.
 • రాలిన చెట్ల ఆకులను నేలలో గొయ్యితీసి పూడ్చాలి. కంపోస్టుగా మార్చాలి.
 • సముద్ర జలాల్లో ఫైటో ప్లాంక్టన్ వృక్షజాలాలు విపరీతంగా అభివృద్ధి చెందేలా చూడాలి. ఇవి వాతావరణంలో CO2వాయువును తగ్గిస్తాయి. ఫలితంగా భూమి వేడి తగ్గుతుంది.
 • ఓజోన్ పొరని నాశనం చేసే క్లోరో ఫ్లోరో కార్బన్‌లను తగ్గించాలి.
 • CFC లేని ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషనర్లనే ఉపయోగించాలి.
 • పరిశ్రమల వ్యర్థ వాయువులను నియంత్రించాలి.
 • వాహనాల నుంచి వెలువడే NO2ను నియంత్రించడానికి, వాహనాలకి కెటలిటిక్ కన్వర్టర్లు ఉపయోగించాలి. దీనివల్ల NO2 విడిపోయి నైట్రోజన్, నీరుగా మారుతుంది.
 • వ్యవసాయంలో సేంద్రీయ ఎరువులు వాడాలి.

ఓజోన్ పొర క్షీణత

భూమిపై వ్యాపించిన గాలి పొరను వాతావరణం అంటారు. ఇది 1000 కి.మీ. వరకు వ్యాపించి ఉంది. దీన్ని ట్రోపో ఆవరణం (12 కి.మీ.), స్ట్రాటో ఆవరణం (45), మీసో ఆవరణం (80 కి.మీ.), ఉష్ణావరణం (400 కి.మీ.), ఎక్సో ఆవరణం అనే ఐదు పొరలుగా వర్గీకరించారు. స్ట్రాటో ఆవరణంలోని 17 నుంచి 48 కి.మీ. ఎత్తులో సహజంగా తయారైన ఓజోన్ పొర ఉంటుంది. దీన్ని O3 సంకేతంతో సూచిస్తారు. ఈ పొర లేత నీలిరంగులో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వెలువడే ప్రమాదకర అతినీలలోహిత UV(B) కిరణాలను ఆపి వాటి వేడి నుంచి కాపాడుతుంది. క్లోరో ఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరను పలచగా చేస్తాయి.

ఓజోన్ క్షీణించడానికి కారకాలు:
 • వాహనాలు, పరిశ్రమలు, సూపర్‌సోనిక్ జెట్ విమానాల నుంచి విడుదలైన నైట్రోజన్ ఆక్సైడ్‌లు స్ట్రాటో ఆవరణంలో చేరి ఓజోన్ అణువులను క్షీణింపజేస్తాయి.
 • రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్‌లు, ఫోమ్ బ్లోయింగ్‌ల్లో ఉపయోగించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (CFC) మంటలు ఆర్పే యంత్రాల్లోని హాలోన్లు ఓజోన్ అణువులను నాశనం చేస్తాయి. (వీటి స్థానంలో తక్కువ నష్టం కలిగించే పదార్థాలు వాడాలి).
 • వ్యవసాయంలో వాడే క్రిమిసంహారక మందుల నుంచి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు, మీథేన్లు ఓజోన్ క్షీణతకు దోహదం చేస్తున్నాయి.
ఓజోన్ పొర క్షీణిస్తే నష్టం ఏమిటి?
 • సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతాయి.
 • మొక్కలు తేలికగా తెగుళ్ల బారిన పడతాయి.
 • శైవలాల లాంటి ఏకకణ నీటి మొక్కలు చనిపోవడం వల్ల, ఆహార గొలుసు క్రమం తప్పి ఆవరణ వ్యవస్థ నాశనం అవుతుంది.
 • మనలో రోగ నిరోధక శక్తి తగ్గి చర్మక్యాన్సర్, వ్యాధులు వస్తాయి.
 • దృష్టి లోపాలు, తెల్లగుడ్డులో శుక్లాలు ఏర్పడి కంటి జబ్బులు వస్తాయి.
 • సముద్రపు జీవులు నశించిపోతాయి.

ఆమ్ల వర్షాలు

వాహనాల నుంచి వెలువడే పొగతో SO2, NO2 గాలిలో చేరి, ఎన్నో వేల కిలోమీటర్లు పయనిస్తాయి. అవి వర్షంతో కలిసి, సల్ఫ్యూరిక్ ఆమ్లంగా, నత్రికామ్లంగా మార్పు చెంది వర్షంతో పాటు భూమిపై కురుస్తాయి. ఇదే ఆమ్లవర్షం.

ఇది మంచు, పొగమంచు, గట్టిపడ్డ మంచు రూపంలోనూ ఉండవచ్చు.

ఆమ్లవర్షాల ప్రభావం:
 • చెరవులు, సరస్సుల్లో, నీటిలో ఆమ్లత్వం పెరిగి కలుషితమవుతాయి.
 • జలచరాలు చనిపోతాయి.
 • నీటి అడుగున ఉన్న బయోమాస్‌ను వియోగం చెందించే బ్యాక్టీరియాలాంటి జీవులు నశించిపోవడం వల్ల ఆహార గొలుసు క్రమం తప్పి జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
 • ఆకులపై పత్రహరితం నశించి ఆకులు తెల్లగా మారతాయి.
 • ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగక పంట దిగుబడి తగ్గుతుంది.
 • లక్షల ఎకరాల అడవులు నాశనమవుతాయి.
 • భూమి పొరలో ఆమ్లత్వం పెరిగి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది.
 • మొక్కలకు పోషకాలు అందక కొత్త వ్యాధులు వస్తాయి.
 • అడవులు నశిస్తాయి.
 • అపురూప పురావస్తువులు, శిలావిగ్రహాలు, వంతెనలు, కంచె తీగలు, రైలు పట్టాలు, అద్భుత భవనాలు, అనేక కట్టడాలు ఆమ్ల వర్షాల వల్ల శిథిలావస్థకు చేరుతాయి.

ప్రకృతి వైపరీత్యాలు

సహజసిద్ధంగా వచ్చేవి: భూకంపాలు, తుపాన్లు, వరదలు, కరవు కాటకాలు, వడగాల్పులు, చల్లటి గాలులు, ఎల్‌నినోలు లానినాలు, సునామీలు.

మానవ కార్యాకలపాల వల్ల వచ్చేవి: కాలుష్య ప్రభావాలు

తగ్గించే పద్ధతులు:
 • జరగబోయే సంఘటనను ముందుగా గుర్తించడం, నష్టాన్ని అంచనా వేయడం, ఏం చేయాలో తెలుసుకోవడం.
 • హెచ్చరికలు చేయడం
 • ఒత్తిడి చేసి ఆ హెచ్చరిక పాటించేలా చేయాలి.
 • ప్రాణనష్టం జరగకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి.
 • అత్యవసర పథకాలు తయారు చేసి అమలు తీరును జాగ్రత్తగా పర్యవేక్షించాలి.

ఆధారము: ఈనాడు

3.04069767442
సాయికుమార్ Jan 22, 2016 02:59 PM

జనభా విస్పోటనం

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు