ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్
1989 సెప్టెంబర్ 11న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై... ఎస్సీ, ఎస్టీలు కానివారు చేసే వేధింపులు శిక్షార్హమైన చర్యగా పరిగణించారు. ఆ వివరాలు పూర్తిగా ఇక్కడ తెలుసుకోవచ్చు.
- Contents
రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధం. దీనికి అనుగుణంగా పార్లమెంట్ 1995లో అంటరానితనం నిషేధ చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని 1976లో పౌరహక్కుల చట్టంగా మార్చారు. ఈ చట్టం కేవలం అంటరానితనాన్ని గురించి మాత్రమే ప్రతిపాదించింది. అంతేకాక అంటరానితనాన్ని పాటించినా, ప్రోత్సహించినా విధించే శిక్షలు ఈ చట్టంలో అతి తక్కువగా ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం కనీస శిక్ష 30 రోజులు జైలు లేదా రూ. వంద జరిమానా లేదా రెండూ. గరిష్ఠంగా శిక్ష ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 500 జరిమానా లేదా రెండూ నిర్దేశించిన శిక్షలు తక్కువగా ఉండటంతో అంటరానితనం తగ్గలేదు. పైగా వేధింపులు పెరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని 1989 సెప్టెంబర్ 11న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై... ఎస్సీ, ఎస్టీలు కానివారు చేసే వేధింపులు శిక్షార్హమైన చర్యగా పరిగణించారు.
చట్టంలో పేర్కొన్న ప్రధానాంశాలు
1. ఎస్సీ, ఎస్టీలపై జరిగే చిన్న నేరాలు వాటి కి శిక్షలు
2. ఎస్సీ, ఎస్టీలపై జరిగే పెద్ద నేరాలు వాటికి శిక్షలు
3. ప్రత్యేక న్యాయస్థానాలు
4. ఈ చట్టం అమలు ప్రభుత్వ బాధ్యత
చిన్న నేరాలు - శిక్షలు
ఈ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలు కానివారు ఎస్సీ, ఎస్టీలపై కింద పేర్కొన్న ఆకృత్యాలకు పాల్పడితే వాటిని చిన్న నేరాలుగా పరిగణించి శిక్షిస్తారు.
- తినకూడని పదార్థాలు తినాలని, తాగకూడని పదార్థాలు తాగాలని బలవంతం చేయడం.
- కులం పేరుతో అవమానించడం
- ఇళ్లలో చెత్తచెదారాలను పారబోయడం
- ఇంటి నుంచి నెట్టివేయడం
- ఆస్తులను ఆక్రమించుకోవడం
- బేగార్ లేదా వెట్టిచాకిరి చేయించడం
- అభిష్టానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని బలవంతం చేయడం
- ఎస్సీ, ఎస్టీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం
- ఎస్సీ, ఎస్టీలు ఉపయోగించే చెరువులు, బావులు, రిజర్వా యర్లు, కాలువలను కలుషితం చేయడం.
- బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశంపై నిషేధం విధించడం
పెద్ద నేరాలు - శిక్షలు
కింద పేర్కొన్న చర్యలను ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణించి శిక్ష విధిస్తారు.
- మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న తప్పుడు కేసులు బనాయించడం, అటువంటి కేసుల్లో సాక్ష్యం చెప్పడం. అది తప్పుడు కేసు అని కేసు పరిశీలనలో ఉండగా నిరూపితమైతే కేసు పెట్టినవారికి, సాక్ష్యం చెప్పినవారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఒకవేళ మరణశిక్ష విధించిన తరవాత తప్పుడు కేసు అని నిరూపితమైతే కేసు పెట్టినవారికి, సాక్ష్యం చెప్పినవారికి మరణశిక్ష విధిస్తారు.
- ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న తప్పుడు కేసు పెట్టినా లేక ఆ కేసులో సాక్ష్యం చెప్పినా అలాంటివారికి 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ. 25,000 జరిమానా విధించవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు ఆకతాయితనంగా నిప్పుపెట్టినా, వారి ఇళ్లపై పేలుడు పదార్థాలు విసిరినా 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష రూ. 25000 వరకు జరిమానా విధించవచ్చు. ఆకతాయి చర్య వలన సంబంధిత నివా సం పూర్తిగా నాశనమైతే రూ.2,50,000 వరకు జరిమానా లేదా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు.
- ఒక ప్రభుత్వోద్యోగి ఈ చట్టంలో పేర్కొన్న నేరాలకు పాల్పడితే ఆ నేరానికి సంబంధించిన శిక్షతో పాటు అధనంగా ఏడాది జైలు శిక్ష విధిస్తారు.
- ఒక ప్రభుత్వోద్యోగి సమక్షంలో వేధింపులు జరుగుతుండగా దానిని నివారించడానికి ప్రయత్నించకపోతే 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చు.
- ఒక వ్యక్తి ఈ చట్టం ఆధారంగా శిక్షకు గురైన తరవాత కూడా అదే నేరానికి పాల్పడితే ఆ నేరానికి సంబంధించిన గరిష్ట శిక్షతో పాటు అదనంగా ఏడాది జైలుశిక్ష విధిస్తారు. వేధింపులకు పాల్పడిన ఒక నేరస్థుడు శిక్ష అనుభవించిన తరవాత తిరిగి వేధింపులకు పాల్పడతాడని భావిస్తే ఆ వ్యక్తిని ఆ ప్రాంతం నుంచి మూడు సంవత్సరాల వరకు బహిష్కరించవచ్చు. ఈ సమయంలో అతడు ఆ ప్రాంతం లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తే ఏడాది జైలు శిక్ష, బహిష్కరణ కాలాన్ని పొడిగిస్తారు.
ప్రత్యేక న్యాయస్థానాలు
చట్టంలో పేర్కొన్న నేరాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయవచ్చు. వాటి ఏర్పాటుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో అవసరమైతే జిల్లాల్లో ఉండే సెషన్స కోర్టులనే ప్రభుత్వం ప్రత్యేక కోర్టులుగా ప్రకటించవచ్చు. ఈ సెషన్స కోర్టుల్లో బాధితుల తరఫున వాదించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలి. అతడికి అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్లు అనుభవం ఉండాలి. ఈ చట్టం కింద నమోదైన కేసులను స్పెషల్ కోర్టులు రెండు సంవత్సరాల లోపు పరిష్కరించాలి.
ప్రభుత్వ బాధ్యతలు
ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కింది చర్యలు చేపట్టాలి.
- వేధింపులు తరచూ జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో వేధింపుల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. దానికి జిల్లా మేజిస్ర్టేట్ లేదా కలెక్టర్ లేదా డిఎస్పి అధ్యక్షుడిగా వ్యవహరించాలి.
- బాధితులకు ఉచిత న్యాయసహాయం అందించే ప్రక్రియ లో భాగంగా కోర్టు ఖర్చులే కాకుండా కోర్టుకు వచ్చి వెళ్లడానికి టి.ఎ, డి.ఎ చెల్లించాలి. ఈ ఖర్చులను బాధితుడి తరపున సాక్షికి కూడా చెల్లించాలి.
- ఈ చట్టం ఆధారంగా నమోదయ్యే కేసులను పరిష్కరిం చడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. వాటిలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలి.
- ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి విస్తృత ప్రచారం చేపట్టాలి.
- ఈ చట్టం అమలు జరుగుతున్న తీరుపై వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. కేంద్రం ఆ నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది.
- చట్టం అమలవుతున్న తీరు
అమలులో సానుకూల అంశాలు
నిధుల కేటాయింపు: కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలుచేయడానికి రాష్ర్టాలకు గ్రాంట్లు ఇస్తుంది. ఈ చట్టం అమలు చేయడానికి ఉన్న పాలన, న్యాయ యంత్రాంగాలను బలోపేతం చేయటానికి ఈ నిధులు ఉపయోగించాలి. దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి.
ఉదా: 2004-05 ఆర్థిక సంవత్సరంలో రూ. 35 కోట్లుగా ఉన్న బడ్జెట్ 2007-08 నాటికి రూ. 38 కోట్లకు పెరిగింది.
కేసుల నమోదు: గడచిన ఐదేళ్లలో ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
ప్రత్యేక సెల్స్: ఈ చట్టం అమలు, పర్యవేక్షణకు స్పెషల్ సెల్స్ కూడా ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం 17 రాష్ర్టాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
సున్నిత ప్రాంతాల గుర్తింపు: ఆకృత్యాలు విస్తృతంగా జరిగే అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను 10 రాష్ర్టాల్లో గుర్తించారు.
స్పెషల్ కోర్టులు: 24 రాష్ర్టాల్లో ఈ చట్టం ద్వారా నమోదైన కేసులను పరిశీలించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు.
ప్రతికూల అంశాలు
ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు తగ్గ లేదు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కంబాలపల్లె గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని సజీవ దహనం చేసిన సంఘటన, బీహార్‌లో రణ్వీర్ సేన దళితులపై చేసిన ఊచకోత ఘటనలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి.
కారణాలు:
- ఫిర్యాదులు తీసుకోవడానికి పోలీసులు ఆసక్తి చూపడం లేదు, కొన్ని సందర్భాల్లో పోలీసులు ఫిర్యాదుదారులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. లేదా బూటకపు ఎనకౌంటర్లు జరుగుతున్నాయి.
- ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న పేదరికం కారణంగా వారు ఇంకా వెట్టిచాకిరి చేస్తూనే ఉన్నారు. అక్కడ వేధింపులకు గురైనా తమ యజమానులపై ఫిర్యాదు చేస్తే ఉపాధి కోల్పోతా మనే భయంతో ఫిర్యాదు కూడా చేయడం లేదు.
- చట్టం అమలు విషయంలో బ్యూరోక్రాట్లలో నెలకొన్న నిర్లిప్తత వలన కూడా చట్టం సరిగా అమలుకావడం లేదు. కొన్ని సందర్భాల్లో ఉన్నత కులస్థులతో కుమ్మక్కై దళితులకు, గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
- అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం వెట్టిచాకిరిలో నిమగ్నమైన వేలమంది దళిత మహిళలు తమ యజమానుల చేతుల్లో లైంగిక దోపిడికి గురవు తున్నా, ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు.
- 73వ రాజ్యాంగ సవరణతో ఎస్సీ, ఎస్టీ మహిళలు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పొందారు. వీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఉన్నత కులాలు చేసే తప్పుడు ఫిర్యాదులతో అధికారం కోల్పోతున్నారు.
- దళిత సమస్యలపై విస్తృత రచనలు చేసిన పి. సాయినాథ్ అనే జర్నలిస్ట్ ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై వేఽధింపులు వేల సంవత్సరాలుగా భారతీయ సమాజంలో ఒక దుస్సాంప్రదాయంగా, దురాచారంగా కొనసాగుతోంది. ఒకే చట్టంతో ఈ వేధింపులను అణిచివేయడం కుదరదు.
- కొన్ని సందర్భాల్లో ఈ చట్టం ఆధారంగా ఏర్పాటైన స్పెషల్ కోర్టు న్యాయమూర్తులే కేసులను ఉపసంహరించు కోవాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు.
- ప్రభుత్వాలే కుల స్వభావం కలిగి ఉండటంతో ఈ చట్టం అమలును అనుమానించాల్సి ఉంటుంది.
- కొన్ని రాష్ర్టాల్లో వేధింపులకు సంబంధించిన ఇతర చట్టాల లోపాలతో కూడా చట్టం సమర్థంగా అమలు కావడం లేదు.
2007 జూన 14, 15 తేదీల్లో వివిధ రాష్ర్టాల సోషల్ వెల్ఫేర్ కార్యదర్శుల సమావేశంలోనూ, 2008 జనవరి 28న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ, మధ్యప్రదేశ, మహారాష్ట్ర, తమిళనాడు, పాండిచ్చేరి, అండమానలలో ఈ చట్టం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఈ చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించారు. అవి..
- ప్రతి ప్రభుత్వోద్యోగికి వేధింపుల నివారణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
- యుపిఎస్సి, ఎస్ఎస్సి నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల సిలబస్‌లో ఈ చట్టం గురించి వివరించే అధ్య యనాన్ని తప్పనిసరిగా చేర్చాలి.
- వేధింపుల నివారణకు ఎనజిఒలను ప్రోత్సహించాలి.
- కులాంతర వివాహాలకు రూ.50,000 ఇంటెన్సివ్‌గా ఇవ్వాలి. ఇందులో 50ు కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇప్పటికే గుజరాతలో రూ.50,000, గోవాలో రూ. లక్ష, ఆంధ్రప్రదేశ, తెలంగాణలో రూ. 10,000 ఇస్తున్నారు.
- వేధింపుల నివారణ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నవారికి రాష్ట్రస్థాయిలో కూడా అవార్డులు ఇవ్వాలి. 2006 నుంచి ఈ విధానం జాతీయ స్థాయిలో అమలవు తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత రివార్డు రూ.2 లక్షలు, ఎనజిఒ రివార్డు రూ.5 లక్షలు జాతీయస్థాయిలో ఇస్తారు.
- National campaign on dalit rights వంటి స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను మరింత విస్తరింపచేయాలి
ఆధారము: ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన కథనం ఆధారంగా
ప్రతికూల అంశాలల్లో 4 వ పాయింట్ మొదట్లో "అనే స్వచ్చంద సంస్థ" అని ఉంది. అక్కడ సంస్థ పేరు మిస్ అయినట్టుంది.