పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కేంద్ర బడ్జెట్ 2015-16

ఈ పేజి లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2015-16 కి గాను, వివిధ అంశాల వారీగా అందుబాటులో ఉంటుంది.

ఉపాధి కల్పన, సామాజిక భద్రత, వృద్ధిరేటు పెంపు ప్రధానాంశాలుగా 2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం విలువ రూ.17,77,477 కోట్లు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.4,65,277 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు.

వివిధ రంగాలు - కేటాయింపులు

ఆరోగ్య రంగం

 • ఈసారి ఆరోగ్య రంగానికి రూ.33,152 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపు రూ.35,163 కోట్లు.
 • ప్రజలందరికీ ఆరోగ్యం కల్పించే లక్ష్యంతో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రజలను ఆరోగ్యబీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు బడ్జెట్ ద్వారా ప్రోత్సాహ మార్గాన్ని వేశారు.
 • జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ల ఏర్పాటు. బిహార్‌లో ఎయిమ్స్ లాంటి సంస్థ ఏర్పాటు.
 • ఖాతాదారులెవరూ తమదిగా ప్రకటించుకోని పీపీఎఫ్ ఖాతాల్లోని భారీ మొత్తం నుంచి, ఈపీఎఫ్ మూలనిధి' నుంచి సేకరించిన మొత్తంతో 'వృద్ధుల సంక్షేమ నిధి ఏర్పాటు.
 • దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వికలాంగ వృద్ధులకు అవసరమైన పరికరాలను అందించేందుకు కొత్త పథకం ఆరంభం.
 • ఏడాదికి రూ.330 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా కల్పించే 'ప్రధాన్‌మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన'కు శ్రీకారం. 18 - 50 ఏళ్లవారికి ఉద్దేశించిన ఈ పథకం కింద ప్రమాద, సహజ, ఎలాంటి మరణాలకైనా పరిహారం.
 • ఏడాదికి రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు త్వరలో 'ప్రధాన్‌మంత్రి సురక్షా బీమా యోజన' ఆరంభం.
 • ఆరోగ్య సేవలకు ప్రస్తుతం మన జీడీపీలో వెచ్చిస్తున్న 1.2 శాతాన్ని (తలసరి వ్యయం రూ.957) 2.5 శాతానికి పెంచాలన్నది ప్రతిపాదన. (తలసరి రూ.3,800).
 • 'జాతీయ ఆరోగ్య హామీ మిషన్' కింద వచ్చే నాలుగేళ్లలో రూ.1.6 లక్షల కోట్లు వెచ్చించనున్నారు.

పట్టణాభివృద్ధి శాఖ:

 • పట్టణాభివృద్ధి శాఖకు 2015 - 16 బడ్జెట్‌లో రూ.16,832 కోట్లు కేటాయించారు.
 • గత బడ్జెట్‌లో ఇది రూ.11,013 కోట్లు. గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.5,634.37 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇది రూ.3,400 కోట్లు.
 • దేశంలో ప్రజలందరికీ 2022 నాటికి సొంతింటి కలను సాకారం చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.22,407 కోట్లు కేటాయించారు.

నిర్భయ నిధి:

 • మహిళల భద్రత, రక్షణ, చైతన్య కార్యక్రమాల నిమిత్తం 'నిర్భయ నిధి'కి మరో వెయ్యి కోట్లు కేటాయించారు.

ఐసీడీఎస్:

 • సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి (ఐసీడీఎస్) రూ.8,754 కోట్లు కేటాయించారు. ఒకవేళ పన్నుల ద్వారా మరింత ఆదాయం సమకూరితే ఐసీడీఎస్‌కు రూ.1500 కోట్లు, సమగ్ర శిశు సంరక్షణ పథకానికి (ఐసీపీఎస్) రూ.500 కోట్లు అదనంగా ఇస్తామంటూ ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు.

సుకన్య సమృద్ధి యోజన:

 • బాలికల చదువులు, భవిష్యత్తు కోసం ఉద్దేశించిన పథకమే 'సుకన్య సమృద్ధి యోజన'. ఆడపిల్లల పేరిట ప్రారంభించే బ్యాంకు ఖాతాలకు ఆకర్షణీయమైన వడ్డీ, చక్కటి రాయితీలు కల్పించారు. అరుణ్‌జైట్లీ ఈ ఖాతాల డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇతరాలకు పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించారు.
 • 'బేటీ బచావో - బేటీ పఢావో'కు రూ.100 కోట్లు కేటాయించారు.

శాస్త్ర సాంకేతిక శాఖ:

 • ప్రస్తుత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.7,288 కోట్లు కేటాయించారు. 2014 - 15కు సంబంధించిన సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది రూ.1793 కోట్లు ఎక్కువ.
 • కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖలో మూడు ఉప విభాగాలు ఉన్నాయి. ఇందులోని శాస్త్ర, సాంకేతిక విభాగానికి అత్యధికంగా రూ.3,401 కోట్లు దక్కాయి. కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలికి (సీఎస్ఐఆర్) రూ.2,280 కోట్లు, బయోటెక్నాలజీ విభాగానికి రూ.1606 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
 • భూ విజ్ఞాన శాస్త్రాలకు రూ.1179 కోట్లు, సాగర పరిశోధనకు రూ.669 కోట్లు, వాతావరణ పరిశోధనకు రూ.425 కోట్లు కేటాయించారు.

రోడ్లు, జాతీయ రహదార్ల రంగం:

 • బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.42,913 కోట్లు కేటాయించారు. 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి జరిపిన కేటాయింపులు రూ.28,882 కోట్లు మాత్రమే. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో దేశంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం, స్వర్ణ చతుర్భుజి పథకం పరిధిలో నిర్మించిన రోడ్లను ఎక్స్‌ప్రెస్ రహదారులుగా మార్చడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో ఆరు వరుసలతో రహదారి విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు.
 • దేశంలోని 1,78,000 మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యమే లేదు. వాటికి ఆ సౌకర్యం కల్పించడానికి లక్ష కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయించారు.
 • ప్రస్తుతం రోజుకు 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
 • రోజుకు 30 కిలోమీటర్ల మేర హైవేలను నిర్మించాలన్న లక్ష్యంతోపాటు నిలిచిపోయిన ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసింది.

ఆధార్:

 • యునిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా అమలు చేస్తున్న 'ఆధార్ కార్డు' పథకానికి 23.63 శాతం అధికంగా నిధులు కేటాయించారు. గతేడాది రూ.1,617.73 కోట్లు ఖర్చు చేసినట్లు సవరణ బడ్జెట్‌లో చూపించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2,039.64 కోట్లు ఇచ్చారు. ఇంతవరకు దేశవ్యాప్తంగా 77.91 కోట్ల మందికి ఆధార్ కార్డులు మంజూరైనట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు.

అణు విద్యుత్:

 • 2015 - 16 బడ్జెట్‌లో రూ.10,912 కోట్లు కేటాయించారు. 2014 - 15 బడ్జెట్‌లో రూ.10,446.59 కోట్లు కేటాయించగా సవరించిన 2014 - 15 బడ్జెట్‌లో ఇది రూ.8912.60 కోట్లుగా ఉంది.
 • ముంబయిలోని భాభా అణు ఇంధన కమిషన్‌కు, కల్పకంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రానికి కలిపి రూ.1912 కోట్లు ఇస్తారు. అణు పరిశోధనల్లో ఈ రెండు సంస్థలు దేశంలో ప్రతిష్ఠాత్మకమైనవిగా భావిస్తారు.
 • అణు ఇంధన విభాగం (డి.ఏ.ఈ.) ఆధ్వర్యంలో జరిగే పరిశోధనలకు రూ.200 కోట్లు మంజూరు చేశారు.

స్వచ్ఛభారత్:

 • దేశవ్యాప్తంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమానికి నిధుల సమీకరణకు ప్రత్యేకంగా 2 శాతం 'స్వచ్ఛ భారత్ పన్ను' విధించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అన్ని లేదా నిర్ణీత పన్ను పరిధిలోని సేవలపై 2 శాతం చొప్పున స్వచ్ఛ భారత్ పన్ను విధిస్తారు. ప్రకటించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
 • కార్పొరేట్లు సహా ఇతర వర్గాల నుంచి ఈ కార్యక్రమానికి నిధుల సేకరణకు 'స్వచ్ఛ భారత్ నిధి (కోశ్)' ఏర్పాటు చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఈ నిధికి విరాళం ఇచ్చే వారికి 100 శాతం పన్ను రాయితీ ప్రకటించారు. అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఈ నిధికి విరాళం ఇచ్చే వారికి పన్ను రాయితీ ఉండదు.
 • స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం 2019 నాటికి రూ.62 వేల కోట్లను వెచ్చించే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం నిధులను సమకూరుస్తాయి. ఈశాన్య, ప్రత్యేక రాష్ట్రాలకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రమే అందిస్తోంది.

డిజిటల్ ఇండియా:

 • ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఈసారి నిధులు పెంచారు. ఈ బడ్జెట్‌లో రూ.2510 కోట్లు కేటాయించారు. రూ.లక్ష కోట్ల వ్యయ అంచనాలతో, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 'డిజిటల్ ఇండియా'ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని అయిదింతలు చేశారు. సమాచార, సాంకేతిక రంగంలో కొత్తగా కంపెనీలు ప్రారంభించాలనుకునేవారికి ప్రోత్సాహకంగా రూ.1000 కోట్లను కేటాయించారు. ఈ రంగంలో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది ఉద్యోగులున్నారు.
 • దేశ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసే సత్తా ఉన్న పథకం 'డిజిటల్ ఇండియా'. 2018 నాటికి మొత్తం ప్రభుత్వ సేవలన్నింటినీ ఎలక్ట్రానిక్ విధానంలోనే (ఆన్‌లైన్‌లో) అందించడం, అందరికీ సాంకేతికత సదుపాయాలను అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం.
 • ఈ పథకం కింద 2.5 లక్షల గ్రామాలను హైస్పీడ్ ఆప్టికల్ కేబుళ్లతో అనుసంధానం చేసి బ్రాడ్‌బ్యాండ్, దూరవాణి సేవలకు విస్తరిస్తారు.
 • 2.5 లక్షల పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అంతర్జాల (ఇంటర్నెట్) సదుపాయం కల్పిస్తారు.
 • సాధారణ పౌరుల కోసం 4 లక్షల అంతర్జాల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల్లో వై-ఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తారు.
 • దేశవ్యాప్తంగా 1.55 లక్షల కేంద్రాల్లో ఉన్న తపాలా కార్యాలయాలను కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా సద్వినియోగం చేసుకోనున్నారు. ప్రధానమంత్రి జన్‌థన్ యోజనను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా తపాలా కార్యాలయాలను 'చెల్లింపు బ్యాంకులు'గా మార్చనున్నారు.

అంతరిక్ష రంగం:

 • ఈ బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.7388.19 కోట్లు కేటాయించారు. 2014 - 15 సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.5826 కోట్లుగా ఉంది.
 • ఈసారి ప్రధానంగా వాహక నౌకల పరిజ్ఞాన ప్రాజెక్టులకు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారు. వీటికి రూ.2148 కోట్లు కేటాయించారు. ప్రయోగ వ్యవస్థకు తోడ్పాటు, ఉపగ్రహాల గమనాన్ని పరిశీలించడానికి రూ.651 కోట్లను ప్రత్యేకించింది.
 • ఇన్‌శాట్ కార్యక్రమానికి (జీశాట్, ఇన్‌శాట్ ఉపగ్రహాలు) రూ.1281 కోట్లు, 40 ట్రాన్స్‌పాండర్లతో కూడిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 15 ప్రయోగానికి రూ.165 కోట్లు, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి రూ.385 కోట్లు, చంద్రయాన్‌కు రూ.40 కోట్లు, సూర్యుడిపై అధ్యయనం కోసం ఉద్దేశించిన 'ఆదిత్య' ఉపగ్రహానికి 20 కోట్లు కేటాయించారు.

సూక్ష్మ నీటిపారుదల రంగం:

 • దేశంలోని ప్రతి రైతు పొలానికి నీరందించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యానికి అనుగుణంగా గత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లతో 'ప్రధానమంత్రి గ్రామ సించయీ యోజన' (పీఎంజీఎస్‌వై) ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సూక్ష్మ నీటిపారుదలను ప్రోత్సహించేందుకు, వాటర్‌షెడ్ల అభివృద్ధికి 'పీఎంజీఎస్‌వై'కు రూ.5,300 కోట్లు కేటాయించారు.
 • పీఎంజీఎస్‌వైలో భాగంగా జిల్లా స్థాయిలోనే చెరువులు, జల వనరుల అభివృద్ధికి ప్రణాళిక రచించి కేంద్రానికి పంపాలి. ఆ తర్వాత ఉపగ్రహం ద్వారా 3 - డి ఫొటో తీసి గ్రామీణులకు ఇచ్చి, వాటి సంరక్షణకు ఏమి చేయాలన్న దానిపై ప్రభుత్వం సలహాలు కోరుతుంది. దీనికి అభ్యుదయ రైతుల సహకారం తీసుకుంటారు. దీన్ని ఉపాధి హామీ, ఇతర పథకాలతో అనుసంధానం చేస్తారు. నిధుల్లో కేంద్ర వాటా 75 శాతం కాగా, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.

జల వనరులు:

 • ఈ బడ్జెట్‌లో రూ.2232.43 కోట్లు కేటాయించారు. 2014 - 15 సవరించిన బడ్జెట్ ప్రకారం ఇది రూ.2728.76 కోట్లుగా ఉంది.
 • బడ్జెట్‌లో కేంద్ర జలవనరుల శాఖకు కేటాయింపులు తగ్గినా ఆ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 'గంగా ప్రక్షాళన' (క్లీన్ గంగ) కార్యక్రమానికి నిధులు పెంచారు. గంగా ప్రక్షాళన్‌కు రూ.2,100 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ (సవరించిన)తో పోల్చితే ఇది రూ.600 కోట్లు ఎక్కువ. జాతీయ శుద్ధ ఇంధన నిధి (ఎన్‌సీఈఎఫ్) నుంచి దీనికి ఈ మొత్తం ఇస్తారు.
 • గంగా ప్రక్షాళన నిధికి ఇచ్చే విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు ఇచ్చారు. కార్పొరేట్ల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ల భాగంగా ఇచ్చే విరాళాలకు మాత్రం ఇది వర్తించదు.

నదుల అనుసంధానం:

 • బడ్జెట్‌లో నదుల అనుసంధానానికి రూ.4,232.43 కోట్లు కేటాయించారు. నదుల అనుసంధానానికి సంబంధించిన సమగ్ర పథక నివేదిక (డీపీఆర్) తయారీకి రూ.100 కోట్లు, వరదల నివారణకు రూ.244.64 కోట్లు ఇచ్చారు.

విద్యుత్ రంగం:

 • ప్రస్తుత బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ.61,404 కోట్లను కేటాయించారు. 2014 - 15 సవరించిన అంచనా ప్రకారం రూ.55,488 కోట్లు వ్యయం చేశారు.
 • దేశంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టాలని 2022 నాటికి 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న పలు ప్రాంతాల్లో 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను (యూఎంపీపీ) రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
 • ఇంతవరకు నాలుగు యూఎంపీపీలను దేశంలో చేపట్టారు. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్), సనన్ (మధ్యప్రదేశ్), తిలాయియా (ఝార్ఖండ్), ముంద్రా (గుజరాత్)లలో ఇవి ఉన్నాయి. మొదటి మూడింటిని రిలయన్స్ పవర్, నాలుగో దాన్ని టాటా పవర్ నిర్వహిస్తున్నాయి.
 • 4 వేల మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను యూఎంపీపీలుగా పేర్కొంటారు.

ఉపాధి హామీ పథకం:

 • ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.34,699 కోట్లు కేటాయించారు. 2014 - 15 సవరించిన బడ్జెట్ ప్రకారం ఇది రూ.31,000 కోట్లు. అనుకున్న విధంగా ఖజానాకు నిధులు సమకూరితే మరో రూ.5000 కోట్లను అదనంగా కేటాయిస్తామని కూడా జైట్లీ ప్రకటించారు.

పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం

 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రూ.41,000 కోట్లు పీఎస్‌యూలలో తక్కువ వాటా విక్రయంపై, మరో రూ.28,500 కోట్లు లాభాలు ఆర్జిస్తున్న, నష్టాలు తెస్తున్న కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

వ్యవసాయ రంగం

 • ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.24,909 కోట్లు కేటాయించారు. 2014-15 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.21,062 కోట్లు.
 • రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాళ్లలో ఒకటని చెప్పిన ఆర్థిక మంత్రి రుణ, మార్కెట్ సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాలకు రూ.8.5 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది గతేడాదికంటే రూ.50,000 కోట్లు అధికం. రైతులకు 7 శాతం వడ్డీకి గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు పంట రుణం ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ 4 శాతంగా ఉంటుంది.
 • చిన్న, సన్నకారు రైతులకు సులువుగా రుణాలు ఇవ్వడానికి ఉద్దేశించిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆధ్వర్యంలోని గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ.25,000 కోట్లు కేటాయిచారు.
 • దీర్ఘకాలిక గ్రామీణ రుణ నిధికి రూ.15,000 కోట్లు.
 • స్వల్పకాలిక సహకార గ్రామీణ రుణ నిధికి రూ.45,000 కోట్లు.
 • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణ నిధికి రూ.15,000 కోట్లు.
 • జాతీయ ఆహార భద్రత మిషన్ సహా పది పథకాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి 'కృషోన్నత్ యోజన'ను ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని కేంద్ర సాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. ఇందుకు రూ.9,000 కోట్లు కేటాయించారు.
 • సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'పరంపరాగత్ కృషి వికాస్ యోజన'కు సహకారం.
 • డెయిరీ వికాస్ అభియాన్‌కు రూ.481.5 కోట్లు.
 • నీలి విప్లవానికి రూ.410 కోట్లు.
 • 'ప్రతి బొట్టుకూ మరింత పంట' అనే నినాదంతో ప్రతి పొలానికి సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
 • వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు లభించేలా చూడటానికి నీతి ఆయోగ్, రాష్ట్రాల సహకారంతో ఉమ్మడి జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, అవసరమైతే ఇందుకోసం రాజ్యాంగంలోని నిబంధనలను సవరిస్తామని ప్రకటించారు.
 • ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ రంగం 4 శాతం అభివృద్ధి సాధించేలా లక్ష్యం పెట్టుకున్నారు. తమ ప్రభుత్వ ప్రాధామ్యాల్లో వ్యవసాయరంగం కూడా ఒకటని ప్రకటించారు.
 • దేశంలో వ్యవసాయమే ఉపాధిగా ఉన్న ప్రజలు 54.6%. పాడిపరిశ్రమలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. గోధుమ, వరిల్లోనూ మనదే అగ్రస్థానం. చక్కెర ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది.
 • పరిశోధన ఫలితాలు ప్రయోగశాల నుంచి పొలానికి అందేలా కృషి చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
 • జీడీపీలో వ్యవసాయం వాటా: 13.9%

పర్యటక రంగం:

 • పర్యటక రంగ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1,573.07 కోట్లను జైట్లీ కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది 33 శాతం అధికం.
 • ఇప్పటి వరకు 43 దేశాలకే ఉన్న వీసా ఆన్ అరైవల్ (విమానాశ్రయంలో దిగాక వీసా పొందే) సౌకర్యాన్ని 150 దేశాలకు విస్తరించారు. భారత్‌కు వచ్చే ప్రపంచ పర్యటకుల సంఖ్య 0.6 శాతమే. తాజా నిర్ణయంతో వారిని బాగా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు.

రక్షణ రంగం

 • రక్షణ రంగానికి బడ్జెట్ పెరిగింది. 2014-15 సవరించిన అంచనాలతో (రూ.2.22 లక్షల కోట్లు) కేటాయించారు. 10.95 శాతం మేరకు పెరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,46,727 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టడంతో కేటాయింపులు పెరిగాయి.
 • 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చు (రూ.17,77,477 కోట్లు)లో రక్షణ బడ్జెట్ 13.88 శాతంగా ఉంది. అయితే రక్షణ రంగం కోసం చైనా చేస్తున్న ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. 2014-15లో చైనా అధికారికంగా ఈ రంగానికి వెచ్చించిన మొత్తం సుమారు రూ.8 లక్షల కోట్లు.
 • తాజా బడ్జెట్‌లో మొత్తం రక్షణ బడ్జెట్‌లో 38 శాతం అంటే రూ.94,588 కోట్లు మిలటరీ ఆధునికీకరణ కోసం కేటాయించారు.

హోం శాఖ:

 • 2015-16 బడ్జెట్‌లో హోం శాఖకు రూ.62,124.52 కోట్లు కేటాయించారు. గతేడాది హోంశాఖకు రూ.56,372.45 కోట్లు ఇచ్చారు. మహిళల రక్షణ, అంతర్గత భద్రత, కశ్మీరీ పండిట్ల పునరావాసంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
 • నిర్భయ నిధికి రూ.1000 కోట్లు, కశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం రూ.580 కోట్లు కేటాయించారు.
 • నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లతో పాటు తరచూ అంతర్గత భద్రత విధుల్లో పాల్గొనే ప్రపంచంలోనే పెద్దదైన పారామిలటరీ దళం సీఆర్‌పీఎఫ్‌కు రూ.14,089.38 కోట్లు కేటాయించారు. బీఎస్ఎఫ్‌కు రూ.12,517.82 కోట్లు. ఐటీబీపీకి రూ.3,736.47 కోట్లు కేటాయించారు. దేశంలోని చాలావరకు విమానాశ్రయాలు, అణుకేంద్రాలు, పరిశ్రమలు తదితరాలకు రక్షణగా ఉండే సీఐఎస్ఎఫ్‌కు రూ.5,196.65 కోట్లు కేటాయించారు. ఎన్ఎస్‌జీ, ఐబీ, దిల్లీ పోలీసు విభాగానికి కూడా కేటాయింపులు చేశారు.

విద్యారంగం

 • కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులను గతేడాది కంటే 2 శాతం తగ్గించింది. తాజా బడ్జెట్‌లో పాఠశాల, ఉన్నత విద్యకు కలిపి మొత్తం రూ.69,074 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రంగానికి కేటాయించిన నిధులు సవరించిన మొత్తం రూ.70,505 కోట్ల కంటే ఇది 2.02 శాతం తక్కువ.
 • 2015-16 బడ్జెట్‌లో పాఠశాల విద్యకు గతేడాది కంటే 9.79 శాతం నిధులను తగ్గించి రూ.42,219 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు ప్రాధాన్యమిచ్చి గతేడాది కంటే 13.31% పెంచి రూ.26,855 కోట్లు కేటాయించారు.
 • విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాలు, "ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం" ద్వారా అమలు చేస్తున్న విద్యారుణ పథకాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని జైట్లీ ప్రతిపాదించారు.
 • స్కూలు సర్టిఫికెట్ లేని మైనారిటీ యువత ఉపాధి పొందేందుకు 'నయీమంజిల్' పేరుతో సమగ్ర విద్య, ఉపాధి పథకాన్ని ఈ ఏడాదిలో ప్రారంభిస్తామని ప్రకటించారు.
 • ప్రతి విద్యార్థికీ 5 కి.మీ. పరిధిలో సీనియర్ సెకండరీ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 80 వేలకు పైగా సెకండరీ పాఠశాలలను, 75 వేల జూనియర్/మాధ్యమిక పాఠశాలల్ని సీనియర్ సెకండరీ స్థాయికి పెంపు.

తీర ప్రాంత భద్రత

 • తీరప్రాంత భద్రతకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. 7,517 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యక్రమాలను అరికట్టేందుకు సంచార చెక్‌పోస్టుల ఏర్పాటు కోసం రూ.710 కోట్లు కేటాయించారు. గతేడాది దీని కోసం ఖర్చు పెట్టిన రూ.39.37 కోట్ల కంటే ఈ మొత్తం 18 రెట్లు ఎక్కువ.

ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)

 • 2015-16లో కేటాయింపు రూ.10,025 కోట్లు. 2014-15లో కేటాయింపు రూ.16,000 కోట్లు.
 • దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
 • మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000 కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రెడేషన్‌కు రూ. 15,000 చొప్పున సాయం అందిస్తారు.
 • మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే స్వచ్ఛ భారత అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై):

 • 2015-16 కేటాయింపులు రూ.14,291 కోట్లు (0.7 శాతం తగ్గింపు). 2014-15లో కేటాయింపులు రూ.14,391 కోట్లు.
 • గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి పూర్తిగా కేంద్రమే నిధులు అందిస్తోంది. 2005లో దీన్ని భారత నిర్మాణ్‌లోకి యూపీఏ చేర్చింది.
 • 500 మందికి పైగా జనాభా ఉన్న మైదాన ప్రాంతాలకు, 250 మందికి పైగా జనాభా ఉన్న కొండ, ఎడారి ప్రాంత గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలనేది ప్రస్తుత లక్ష్యం.
 • ఈ పథకం కింద 1,74,184 మారుమూల గ్రామాలను రోడ్డు సౌకర్యంతో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ప్రకారం 3.7 లక్షల కిలోమీటర్ల కొత్త రోడ్లను నిర్మించాలి.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన:

 • 2015-16లో కేటాయింపు రూ.6,800 కోట్లు (432.19 శాతం పెంపు). 2014-15లో కేటాయింపు రూ.5,144 కోట్లు.
 • దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్న 2.34 కోట్లు కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది.
 • రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా గత యూపీఏ ఈ ప్రారంభించిన భారత నిర్మాణ పథకం పేరును మోదీ సర్కారు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా మార్చింది.
 • బీపీఎల్ కుటుంబాలకు కనెక్షన్‌కు రూ.2,200 చొప్పున 100 శాతం సబ్సిడీ. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17)లోనూ ఈ స్కీమ్‌ను పొడిగించారు. సబ్సిడీని రూ.3,000కి పెంచారు.
 • ఈ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా పొలాలు, గృహావసరాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేరు చేసి గ్రామాల్లో సరఫరా ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యాన్ని సర్కారు నిర్దేశించుకుంది. బడ్జెట్‌లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,500 కోట్లు, ఫీడర్లను వేరు చేసే కార్యక్రమానికి రూ.2,300 కోట్లు కేటాయించారు.
 • ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 2.22 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

జాతీయ గ్రామీణ తాగునీటి పథకం

 • 2015-16లో రూ.2,611 కోట్లు కేటాయించారు. 2014-15లో కేటాయింపు రూ.11,000 కోట్లు.
 • దేశంలో తాగునీటి సౌకర్యం లేని అన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం.
 • గతేడాది ఏప్రిల్ నాటికి దేశంలోని మొత్తం 16.97 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను 12.50 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన, తగినంత తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు.

గ్రామీణ టెలిఫోన్

 • 2015-16లో కేటాయింపులు రూ.2,400 కోట్లు (32% తగ్గింపు). 2014-15లో కేటాయింపు రూ.3,553 కోట్లు.
 • గ్రామాల్లో ప్రతి 100 మందికీ 40 మందిని టెలిఫోన్ వినియోగదారులు (టెలి డెన్సిటీ 40%)గా చేయాలనేది లక్ష్యం. ఇది సాకారమైంది.
 • దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హెస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ (జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్-ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటితో పాటు పంచాయతీ స్థాయిలో భారత నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 • మొత్తం 7.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఇందుకోసం వేయనున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు.

ఆయుష్

 • ఆయుష్ (ఆయుర్వేదం, హోమియో, యునాని, సిద్ధ, ప్రకృతి వైద్య) విధానాలను ప్రోత్సహించడానికి నిధులు భారీగా పెంచారు. గతేడాది రూ. 117 కోట్లు ఉండగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.300 కోట్లకు పెంచారు.

ఇతర ముఖ్యాంశాలు

 • 'భారత్‌లో తయారీ' కార్యక్రమానికి ఈ బడ్జెట్‌లో పెద్దఎత్తున మద్దతు లభించింది. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్లో తగ్గింపుల ద్వారా తయారీ రంగానికి ఊతమిచ్చారు.
 • 1993లో మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో తయారీ రంగం వాటా 14.6 శాతం, కానీ ఇరవై ఏళ్ల తర్వాత కూడా అది 15 శాతానికి మించడం లేదు. దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, దేశీయ వాణిజ్యం ఘోరంగా దెబ్బతింది. ఉద్యోగ కల్పన నామమాత్రమే అయింది. 'మేక్ఇన్ ఇండియా' నినాదంతో 2025 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను కనీసం 30 శాతానికి పెంచాలనేది ప్రధాని లక్ష్యం.
 • విదేశాల్లోని ఆస్తుల వివరాలను, వాటిపై ఆదాయాన్ని దాచినా, సదరు ఆస్తులపై పన్ను ఎగవేసినా తీవ్రనేరంగా పరిగణిస్తారు. పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. నల్లధనం మీద పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కేటాయింపులు 10 శాతం (రూ.41.34 కోట్ల నుంచి రూ.45.39 కోట్లకు) పెంచారు.
 • దేశ విదేశీ రుణ చెల్లింపుల భారం ఏటా పెరుగుతోంది. వీటిలో అసలు కంటే వడ్డీనే ఎక్కువగా ఉంటోంది. దీనివాటా మొత్తం బడ్జెట్‌లో 38.35 శాతంగా ఉంటోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో విదేశీ రుణాల చెల్లింపులు రూ.5,37,231 కోట్లు (వాస్తవ వ్యయం) ఉండగా, 2014-15 బడ్జెట్ అంచనాలు రూ.6,43,301 కోట్లు, సవరించిన అంచనాలు రూ.6,12,309 కోట్లుగా ఉన్నాయి. తాజాగా 2015-16 బడ్జెట్ అంచనాలు రూ.6,81,719 కోట్లుగా పేర్కొన్నారు.
 • సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్), కొత్త పింఛను పథకం (ఎన్‌పిఎస్)లో తమకు నచ్చిన పథకంలో చేరే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే వైద్య సేవలకు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ), ఆరోగ్య బీమా పథకాల్లో దేనినైనా ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చింది.
 • పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంట భారీగా రహదారులను నిర్మించడానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. భారత్‌కు ప్రత్యేకించి చైనాతో 4,056 కి.మీ. పొడవైన సరిహద్దు ప్రాంతం ఉంది. దీని వెంబడి సైనిక బలగాలు సులభంగా కదిలేందుకు వీలుగా జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో కారాకోరం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ రోడ్ల ఏర్పాటుకు వీలుగా తాజా బడ్జెట్‌లో రూ. 300 కోట్లను కేటాయించారు.
 • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మౌలిక వసతుల వృద్ధి, సామర్థ్య శిక్షణ పథకానికి తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. హైదరాబాద్‌లో దీన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. దేశంలో మొత్తం పది రాష్ట్రాలకు ఇవి మంజూరు కాగా అందులో తెలంగాణ ఒకటి.
 • గ్రామీణ యువతలో ఉద్యోగ సాధన నైపుణ్యాల పెంపునకు 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన' పథకాన్ని ప్రారంభించినట్లు జైట్లీ చెప్పారు. దీనికి రూ.1500 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో అర్హులైన విద్యార్థులకు డిజిటల్ వోచర్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా ఉపకార వేతనాలను జమ చేస్తారు.
 • బడ్జెట్ ఉపన్యాస పత్రాలను ఎప్పుడూ నీలిరంగు వస్త్రంలో చుట్టి తీసుకురావడం సంప్రదాయం. దీనికి భిన్నంగా తొలిసారిగా జాతీయ జెండాలోని మూడు రంగులు ఉన్న వస్త్రాన్ని ఉపయోగించారు. 'స్థూలంగా బడ్జెట్', 'ఆదాయం-వ్యయం వివరాలు' తదితర పత్రాల దస్త్రం మీద పార్లమెంటు ఫొటోను ముద్రించారు. ఇలా చేయడం ఇదే తొలిసారి.
 • భారతీయులందరికీ సార్వత్రిక సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సగటు భారతీయుడికి కూడా బీమా, పింఛను లభించే పథకాలను ఆర్థికమంత్రి 2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అటల్ పింఛను పథకం (అటల్ పెన్షన్ యోజన) పేరిట ప్రారంభించిన కొత్త పథకంలో చేరే వ్యక్తి ఎంత మొత్తమైతే తన చందాగా చెల్లించదలుస్తాడో ఆ మొత్తంలో సగాన్ని ప్రభుత్వం కూడా జత చేస్తుంది. ఏడాదికి ప్రీమియం పరిమితి రూ.1000. అయిదేళ్ల పాటు ఇలా ప్రభుత్వం ప్రీమియం జత చేస్తుంది. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీలోగా ఈ పథకంలో చేరే వారికి ఇది వర్తిస్తుంది.
 • ఎస్సీ, ఎస్టీ, మహిళల సంక్షేమానికి వరుసగా రూ.30,851 కోట్లు, రూ.19,980 కోట్లు, రూ.79,258 కోట్లను కేటాయించారు.
 • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రాథమికంగా రూ.20 వేల కోట్ల కార్పస్ నిధితో ముద్ర (MUDRA -మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రకటించింది.
 • హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహి సమాధులు, గోవాలోని చర్చిలు, కర్ణాటకలోని హంపి, రాజస్థాన్‌లోని కుంబల్ గఢ్‌కోట, గుజరాత్‌లోని రాణి వావ్, జమ్మూకశ్మీర్‌లోని లేహ్ ప్యాలెస్, లడఖ్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి గుడి, పంజాబ్‌లోని అమృత్‌సర్, జలియన్‌వాలాబాగ్ లాంటి చారిత్రక కట్టడాల వద్ద సౌకర్యాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2015-16 ఆర్థిక సంవత్సరానికి వర్తించే పన్ను శ్లాబులు

(వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు)

60 ఏళ్ళ లోపు వారందరికి

ఆదాయ పరిమితి పన్ను రేటు
రూ. 2,50,000 లేదు
రూ. 2,50,001 - 5,00,000 10%
రూ. 5,00,001 - 10,00,000 20%
రూ. 10,00,001 -  ఆ పైన 30%

60 - 80 ఏళ్ళ మధ్య వారందరికి

ఆదాయ పరిమితి పన్ను రేటు
రూ. 3,00,000 లేదు
రూ. 3,00,001 - 5,00,000 10%
రూ. 5,00,001 - 10,00,000 20%
రూ. 10,00,001 - ఆ పైన 30%

80 ఏళ్ళ పైబడిన వారందరికి

ఆదాయ పరిమితి పన్ను రేటు
రూ. 5,00,000 లేదు
రూ. 5,00,001 - 10,00,000 20%
రూ. 10,00,001 - ఆ పైన 30%
 • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో చెప్పిన హామీల అమలుకు 2015-16 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.394.26 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.100 కోట్లే అత్యధికం. జాతీయ విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్‌లకు రూ.40 కోట్ల చొప్పున ఇచ్చారు. విజయవాడ, విశాఖ మెట్రోలకు రూ.5.63 కోట్లు చొప్పున ఇచ్చారు.
 • ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో నోటిఫై చేసిన ప్రాంతాల్లో 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 మధ్య ఏర్పాటు చేసే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు 15 శాతం అదనపు పెట్టుబడి భత్యం, 15 శాతం అదనపు తరుగుదల ప్రయోజనం కల్పిస్తారు. మూడు శాతం వడ్డీ రాయితీ కింద ఏపీ, తెలంగాణలకు రూ.100 కోట్లు ఇచ్చారు. దీనిలో జనాభా ప్రాతిపాదికన ఏపీకి రూ.58 కోట్లు, తెలంగాణకు రూ.42 కోట్లు వస్తాయి.
 • ప్రధాన రాయితీల భారాన్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో వీటికి కేటాయింపుల్లో కోత పెట్టింది. 2015-16 బడ్జెట్‌లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం రాయితీల కేటాయింపులను రూ.2,27,387.56 కోట్లుగా చూపారు. గత బడ్జెట్‌లో ఇది రూ.2,53,913.12 కోట్లు. కొత్త బడ్జెట్‌లో ఆహార రాయితీకి రూ.1,24,419 కోట్లు ప్రత్యేకించగా, అందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు రూ.65 వేల కోట్లు కేటాయించారు. పెట్రోలు, డీజిల్ రెండింటిపైనా నియంత్రణ తొలగిపోవడంతో ప్రస్తుతం ఎల్‌పీజీ, కిరోసిన్ మాత్రమే రాయితీ పరిధిలో ఉన్నాయి. ఇంధన రాయితీలో ఎల్‌పీజీ వాటా రూ.22 వేల కోట్లు కాగా, కిరోసిన్ వాటా రూ.8 వేల కోట్లు. ఎరువుల రాయితీలో దేశీయ యూరియా వాటా రూ.38,200 కోట్లు. దిగుమతయ్యే యూరియా వాటా రూ.12,300 కోట్లు. యూరియా తప్ప మిగతా ఎరువులపై కంపెనీలకు రాయితీ కోసం కేటాయించిన సొమ్ము రూ.22,468.56 కోట్లు.
 • సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక పూర్తిగా తమ నిధులపైన ఆధారపడాల్సి ఉంటుంది. దీనికి కారణం తాజా బడ్జెట్‌లో సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి (ఏఐబీపీ) నిధుల కేటాయింపులో భారీగా కోత పడటమే. గత బడ్జెట్‌లో రూ.9 వేల కోట్లు కేటాయించగా 2014-15 సవరించిన బడ్జెట్‌లో రూ.3276 కోట్లకు తగ్గించారు. 2015-16కు కేవలం రూ.1000 కోట్లు కేటాయించారు. అంటే రాష్ట్రాలకు నామమాత్రంగా కూడా వచ్చే అవకాశం లేదు.
 • విద్యుత్ వాహనాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)గా పిలిచే ఈ పథకం కోసం 2015-16 ఏడాదికి ప్రాథమికంగా రూ.75 కోట్లను కేటాయించింది.
 • ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు. వృద్ధులకిది రూ.30 వేలు.
 • సంపద పన్ను రద్దు.
 • సేవల పన్ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంపు.
 • రవాణా భత్యంపై పన్ను మినహాయింపు పరిమితి రూ.800 నుంచి రూ. 1600కు పెంచారు.
 • రూ.కోటికి పైగా సంపాదించే వారిపై 2% అదనంగా సర్‌ఛార్జి విధింపు.
 • అన్నిరకాల పన్ను చెల్లింపుదారులపై విద్యా సెస్ 2 శాతం, ఉన్నత విద్యా సెస్ 1 శాతం కొనసాగింపు.
 • ప్రత్యక్ష పన్నుల కోడ్ ఉపసంహరణ 2016 ఏప్రిల్ 1 నాటికి జీఎస్‌టీ అమల్లోకి పన్ను రహిత ఇన్‌ఫ్రా బాండ్లను తిరిగి జారీ చేశారు.
 • కార్పొరేట్ పన్ను వచ్చే నాలుగేళ్లకు 30% నుంచి 25 శాతానికి తగ్గింపు.
 • 2015-16లో వృద్ధి రేటు 8% - 8.5% మధ్య ఉంటుందని అంచనా.
 • 2015-16లో ద్రవ్య లోటు జీడీపీలో 3.9 శాతం, 2017-18 నాటికి ఇది 3 శాతానికి తగ్గింపు.
 • 2015-16లో రెవెన్యూ లోటు జీడీపీలో 2.8 శాతం.
 • లోక్‌పాల్‌కు రూ.7.18 కోట్ల కేటాయింపు. గతేడాది కంటే ఇది మూడు రెట్లు తక్కువ.
 • కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు రూ.27.68 కోట్లు.
 • విదేశాంగ శాఖకు రూ.14,966.83 కోట్లు.
 • పౌరవిమానయాన శాఖకు మొత్తం ప్రణాళికా కేటాయింపు రూ.5,360.95 కోట్లు.
 • కేంద్ర సిబ్బంది శాఖకు రూ.208.91 కోట్లు.
 • యువజన వ్యవహారాలు, క్రీడల శాఖకు రూ.1389.48 కోట్లు.
 • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కు రూ.200 కోట్లు.
 • స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ)కు రూ.127.86 కోట్లు.
 • సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు రూ.7 వేల కోట్లు.
 • న్యాయ మంత్రిత్వ శాఖకు రూ.1555.40 కోట్లు.
 • సమాచార, ప్రసారాల శాఖకు రూ.3711.11 కోట్లు.
 • స్వచ్ఛ భారత్‌కు రూ.3,625 కోట్లు కేటాయింపు.
 • బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా టైర్ 1 మూలధనాన్ని కలిగి ఉండేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రూ.7,940 కోట్ల మూలధనాన్ని కేటాయించారు.
 • బంగారం కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా సావరిన్ గోల్డ్ బాండ్ అమల్లోకి వస్తుంది. దీనికి నిర్దిష్ట వడ్డీ రేటు ఉంటుంది.
ఇదీ బడ్జెట్ స్వరూపం... (రూ. కోట్లలో)
2013-14 2014-15 2015-16
బడ్జెట్ అంచనాలు
1. రెవెన్యూ వసూళ్లు (2 + 3) 1014724 1126294 1141575
2. పన్ను ఆదాయం 815854 908463 919842
3. పన్నేతర ఆదాయం 198870 217831 221733
4. మూలధన వసూళ్లు (5 + 6 + 7) 544723 554864 635902
5. రుణాల రికవరీ 12497 10886 10753
6. ఇతర వసూళ్లు 29368 31350 69500
7. అప్పులు, ఇతరత్రా వసూళ్లు 502858 512628 555649
8. మొత్తం వసూళ్లు (1 + 4) 1559447 1681158 1777477
9. ప్రణాళికేతర వ్యయం (10 + 11 + 12) 1106120 1213224 1312200
10 రెవెన్యూ ఖాతా 1019040 1121897 1206027
11. వడ్డీ చెల్లింపులు 374254 411354 456145
12. మూలధన ఖాతా 87080 91327 106173
13. ప్రణాళికా వ్యయం (14+15) 453327 467934 465277
14. రెవెన్యూ ఖాతా 352732 366883 330020
15. మూలధన ఖాతా 100595 101051 135257
16. మొత్తం వ్యయం (9+13) 1559447 1681158 1777477
17. రెవెన్యూ వ్యయం (10+14) 1371772 1488780 1536047
18. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 129418 131898 110551
19. మూల ధన వ్యయం (12+15) 187675 192378 241430
20. రెవెన్యూ లోటు (171) 357048 362486 394472
21. ద్రవ్యలోటు (16-(1+5+6) 502858 512628 555649
22. ప్రాథమిక లోటు (21-11) 128604 101274 99504
వివిధ రాష్ట్రాల్లో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుపై జైట్లీ ప్రతిపాదనలు
రాష్ట్రాలు సంస్థలు
ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్ ఐఐఎం
కర్ణాటక ఐఐటీ
జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, అసోం ఎయిమ్స్
నాగాలాండ్, ఒడిశా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్
పంజాబ్ (అమృత్‌సర్) పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్, రిసెర్చ్, ఎడ్యుకేషన్
మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చ్
అరుణాచల్ ప్రదేశ్ (ఈశాన్య రాష్ట్రాల కోసం) సెంటర్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్
హరియాణా ఉత్తరాఖండ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్

ఆధారము: ఈనాడు ప్రతిభ

3.0773480663
guru prasad Dec 01, 2016 09:23 PM

"స్వర్ణ భారత్ అభియాన్" పథకం గురుంచి తెలియ చేయగలరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు