অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సరఫరా అర్థం మరియు దాని పరిధి

సరఫరా అర్థం మరియు దాని పరిధి

  1. జీఎస్టీ కింద పన్ను విధించదగిన సందర్భం ఏది?
  2. జీఎస్టీ చట్టం ప్రకారం ‘సరఫరా’ పరిధి ఏమిటి?
  3. పన్ను విధించదగిన 'సరఫరా' అంటే ఏది?
  4. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టం కింద 'సరఫరా'గా పరిగణనకు అవసరమైన అంశాలేమిటి?
  5. ఏదైనా లావాదేవీలో పైన వివరించిన అంశాలలో ఏదో ఒకటి, అంతకన్నా ఎక్కువ లోపించినా జీఎస్టీ కింద సరఫరాగా పరిగణించవచ్చా?
  6. సెక్షస్ 7లో వస్తువుల దిగుమతి అంశానికి స్థానం లేకపోవడం ప్రస్పుటమవుతోంది... ఎందుకని?
  7. స్వీయ సరఫరాలు జీఎస్టీ కింద పన్ను విధించదగినవేనా?
  8. ఏదైనా లావాదేవీని వస్తు సరఫరాలో భాగంగా పరిగణించడానికి హక్కు బదిలీ/స్వాధీనం లేదా రెండూ అవసరమా?
  9. “వ్యాపార విస్తరణ లేదా అందులో భాగంగా చేసిన సరఫరా" అంటే అర్థమేమిటి?
  10. ఒక వ్యక్తి సొంత వాడకం కోసం కారును కొని, ఏడాది తర్వాత ఓ కార్ల వర్తకుడికి అమ్మితే ఆ లావాదేవీ సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంకింద సరఫరా అవుతుందా? అలా పరిగణించేట్లయితే కారణాలేమిటి?
  11. ఒక ఎయిర్ కండిషనర్ల వ్యాపారి తన వ్యాపార సరుకు నిల్వనుంచి ఓ ఎయిర్ కండిషనర్ను తన నివాసంలో వ్యక్తిగత వాడకం కోసం శాశ్వత బదిలీ చేశాడు... ఈ లావాదేవీ సరఫరా కిందకు వస్తుందా?
  12. ఒక సంఘం లేదా సమాజం లేదా క్లబ్బు తమ సభ్యులకు సేవలు లేదా వస్తువులు అందించడాన్ని సరఫరాగా పరిగణించాలా లేదా?
  13. జీఎస్టీ చట్టం కింద ఎన్ని రకాల సరఫరాలు ఉన్నాయి?
  14. అంతర్రాష్ట్ర సరఫరాలు, రాష్ట్రాంతర సరఫరాలంటే ఏమిటి?
  15. వస్తు వినియోగ హక్కు బదిలీ వస్తు సరఫరా అవుతుందా... సేవ సరఫరా అవుతుందా? అయితే ఎందుకు?
  16. పనుల ఒప్పందాలు ఆహార (కేటరింగ్) సేవలను వస్తు లేదా సేవ సరఫరాలలో ఏదిగా పరిగణించాలి? ఎందుకు?
  17. సాఫ్ట్ వేర్ సరఫరాను జీఎస్టీ చట్టం కింద వస్తు లేదా సేవ సరఫరాలలో ఏదిగా పరిగణించాలి?
  18. అద్దె కొనుగోలు ప్రాతిపదికన వస్తు సరఫరా చేస్తే దాన్ని వస్తు లేదా సేవ సరఫరాలలో ఏదిగా పరిగణించాలి?
  19. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ చట్టాలకింద సంయుక్త సరఫరా అంటే ఏమిటి?
  20. జీఎస్టీ కింద సంయుక్త సరఫరాపై పన్ను బాధ్యతను ఎలా నిర్ధారిస్తారు?
  21. మిశ్రమ సరఫరా అంటే ఏమిటి?
  22. జీఎస్టీ కింద మిశ్రమ సరఫరాపై పన్ను బాధ్యతను ఎలా నిర్ధారిస్తారు?
  23. వస్తువుల సరఫరా లేదా సేవల సరఫరాగా పరిగణించ వీల్లేని కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయా?
  24. జీఎస్టీ చట్టం కింద సున్నా రేటింగ్ సరఫరా అంటే ఏమిటి?
  25. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని సేవల దిగుమతి జీఎస్టీ కింద పన్ను విధించదగినదేనా?

జీఎస్టీ కింద పన్ను విధించదగిన సందర్భం ఏది?

వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా తగిన ప్రతిఫలం స్వీకరించి వస్తువులు, సేవలు లేదా రెండు సరఫరా చేయడాన్ని జీఎస్టీ కింద పన్ను విధించదగిన సందర్భంగా పరిగణిస్తారు. ప్రస్తుత పరోక పన్ను చట్టాల కింద పన్ను విధించదగిన తయారీ, అమ్మకం లేదా సేవాప్రదానం వంటి కార్యకలాపాలన్నీ ఇకపై ‘సరఫరా'గా వ్యవహరించే పన్ను విధించదగిన అంశంలో భాగమవుతాయి.

జీఎస్టీ చట్టం ప్రకారం ‘సరఫరా’ పరిధి ఏమిటి?

‘సరఫరా’ అనే పదానికి విస్తృత అర్థం ఉంది. అన్నిరూపాల్లోని వస్తువులు, సేవలు లేదా రెండూ దీని పరిధిలోకి వస్తాయి. ఆ మేరకు ఒక వ్యక్తి వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ప్రతిఫలాపేక్షతో అమ్మకం, బదిలీ, వస్తుమార్పిడి, పరస్పర బదిలీ, లైసెన్స్ అద్దె, లీజు, విక్రయం వంటివి చేయడం. లేదా వీటన్నిటిపైనా అంగీకారం ‘సరఫరా'లో భాగంగా ఉంటాయి. అలాగే సేవల ప్రదానం కూడా అంతర్భాగంగా ఉంటుంది. ప్రతిఫలాపేక్ష లేని కొన్ని లావాదేవీలను కూడా ‘సరఫరా'లో భాగంగానే పరిగణించాలని జీఎస్టీ నమూనా చట్టం పేర్కొంటోంది.

పన్ను విధించదగిన 'సరఫరా' అంటే ఏది?

‘పన్ను విధించదగిన సరఫరా' అంటే... జీఎస్టీ చట్టం కింద పన్ను వేయదగిన వస్తువలు, సేవలు లేదా రెండింటినీ సరఫరా చేయడం.

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టం కింద 'సరఫరా'గా పరిగణనకు అవసరమైన అంశాలేమిటి?

'సరఫరా'గా పరిగణనలోకి వచ్చేందుకు కింద పేర్కొన్న అంశాలన్నీ అవసరం:-

  1. వస్తువులు, సేవలు లేదా రెండింటి సరఫరాలో భాగం కాగల కార్యకలాపాలు;
  2. ప్రత్యేకంగా పేర్కొనకపోతే తప్ప ప్రతిఫలాపేక్షతో చేసే సరఫరాలు;
  3. వ్యాపారం కొనసాగింపులో భాగంగా సరఫరాలు చేయడం;
  4. పన్ను విధింపు పరిధిలో చేసిన సరఫరా;
  5. పన్ను విధించదగిన సరఫరా;
  6. పన్ను విధించదగిన వ్యక్తి చేసిన సరఫరా;

ఏదైనా లావాదేవీలో పైన వివరించిన అంశాలలో ఏదో ఒకటి, అంతకన్నా ఎక్కువ లోపించినా జీఎస్టీ కింద సరఫరాగా పరిగణించవచ్చా?

పరిగణించవచ్చు... వ్యాపార కొనసాగింపులో భాగంగా కాకపోయినా కొన్ని పరిస్థితులలో ప్రతిఫలాపేక్షతో సేవలను దిగుమతి చేసుకోవడం (సెక్షన్ 7(1)(బి) వంటివి లేదా సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టం పెడ్యూల్-1లో నిర్దేశించిన విధంగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన సరఫరాలను... 4వ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్న అంశాలలో ఒకటి అంతకన్నా ఎక్కువ లోపించినా 'సరఫరా'లుగానే పరిగణించి జీఎస్టీ కింద పన్ను విధించవచ్చు.

సెక్షస్ 7లో వస్తువుల దిగుమతి అంశానికి స్థానం లేకపోవడం ప్రస్పుటమవుతోంది... ఎందుకని?

వస్తువుల దిగుమతిని కస్టమ్స్ చట్టం-1962 ప్రత్యేకంగా పర్యవేకిస్తుంది. దానిపై కస్టమ్స్ టారిఫ్ చట్టం-1975 కింద ప్రాథమిక కేంద్ర సుంకంతోపాటు అదనపు కస్టమ్స్ సుంకంగా సమీకృత జీఎస్టీ (IGST) విధిస్తారు.

స్వీయ సరఫరాలు జీఎస్టీ కింద పన్ను విధించదగినవేనా?

సరుకు నిల్వల బదిలీ, శాఖాపరమైన బదిలీ వంటి అంతర్రాష్ట్ర స్వీయ సరఫరాలు లేదా సరుకు అప్పగింత అమ్మకం తదితర లావాదేవీలు ప్రతిఫలాపేక్ష లేకుండా సాగినప్పటికీ ఇవన్నీ ఐజీఎస్టీ కింద పన్ను విధించదగినవే. జీఎస్టీ నమూనా చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం... ఏదైనా రాష్టం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి పన్ను విధించదగిన వస్తువలు, సేవలు లేదా రెండింటినీ సరఫరాచేసే ప్రతి ఒక్కరూ ఆయా పరిధులలో నమోదు చేసుకోవాల్సిందే. అయితే, ప్రత్యక్ష వ్యాపార కార్యకలాపాల కింద నమోదు ఎంచుకోని పక్షంలో రాష్ట్రం లోపల స్వీయ సరఫరాలు పన్ను విధించదగినవి కావు.

ఏదైనా లావాదేవీని వస్తు సరఫరాలో భాగంగా పరిగణించడానికి హక్కు బదిలీ/స్వాధీనం లేదా రెండూ అవసరమా?

ఏదైనా లావాదేవీని వస్తు సరఫరాగా పరిగణించాలంటే హక్కు, స్వాధీనం రెండింటినీ బదిలీ చేయాల్సిందే. హక్కును బదిలీ చేయని పక్షంలో ఆ లావాదేవీని షెడ్యూల్-II (1) (b) ప్రకారం సేవాప్రదానంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాలలో తక్షణ స్వాధీనం సాధ్యమైనప్పటికీ ఆమోదం ప్రాతిపదికన అమ్మకం లేదా అద్దె కొనుగోలు ఒప్పందం వంటి పరిస్థితులలో లావాదేవీ తర్వాతి తేదీన హక్కు బదిలీ కావచ్చు. అటువంటి లావాదేవీలను కూడా వస్తువుల సరఫరాగా పరిగణించవచ్చు.

“వ్యాపార విస్తరణ లేదా అందులో భాగంగా చేసిన సరఫరా" అంటే అర్థమేమిటి?

సెకన్ 2(17) నిర్వచిస్తున్న ప్రకారం. నగదు రూపేణా లబ్దికోసం చేయకపోయినా ఏదైనా వర్తకం, వాణిజ్యం, తయారీ, వృత్తి, ఉద్యోగం వంటివన్నీ "వ్యాపారం"లో అంతర్భాగమే. అలాగే పైన పేర్కొన్న కార్యకలాపాలకు సహాయకంగా లేదా సందర్భవశాత్తూ చోటుచేసుకునే కార్యాచరణ లేదా లావాదేవీ కూడా వ్యాపారంలో భాగమే అవుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా స్థానిక పాలన సంస్థ ప్రభుత్వ అధికార స్థానాల హోదాలో అటువంటి కార్యాచరణను చేపట్టినా ప్రత్యేకార్థంలో వ్యాపారంగానే పరిగణించాలి. వీటన్నిటినీబట్టి వ్యాపార విస్తరణ లేదా ప్రోత్సాహానికి సంబంధించిన నిర్వచనంలో భాగంగా చేపట్టే కార్యాచరణ ఏదైనా జీఎస్టీ చట్టం కింద సరఫరా కిందకే వస్తుందని గమనించవచ్చు.

ఒక వ్యక్తి సొంత వాడకం కోసం కారును కొని, ఏడాది తర్వాత ఓ కార్ల వర్తకుడికి అమ్మితే ఆ లావాదేవీ సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంకింద సరఫరా అవుతుందా? అలా పరిగణించేట్లయితే కారణాలేమిటి?

లేదు... వ్యాపార విస్తరణ లేదా అందులో భాగంగా సదరు వ్యక్తి సరఫరా చేయలేదు కాబట్టి ఆ విధంగా పరిగణించలేం. అంతేగాక వ్యాపారేతర వినియోగం కోసం కారు కొనుగోలు చేసినందున ఆ సమయంలో ఉత్పాదక పన్ను జమ (ఐటీసీ)ను చట్టం అనుమతించదు.

ఒక ఎయిర్ కండిషనర్ల వ్యాపారి తన వ్యాపార సరుకు నిల్వనుంచి ఓ ఎయిర్ కండిషనర్ను తన నివాసంలో వ్యక్తిగత వాడకం కోసం శాశ్వత బదిలీ చేశాడు... ఈ లావాదేవీ సరఫరా కిందకు వస్తుందా?

అవును. పెడ్యూలు-I లోని వరుస సంఖ్య 1 ప్రకారం... అటువంటి వ్యాపార ఆస్తులపై ఐటీసీని వినియోగించుకున్నందున వాటి శాశ్వత బదిలీ లేదా వినియోగంలో ప్రతిఫలాపేక్ష లేకపోయినా ఆ లావాదేవీ జీఎస్టీ కింద 'సరఫరా’ పరిధిలోకి వస్తుంది.

ఒక సంఘం లేదా సమాజం లేదా క్లబ్బు తమ సభ్యులకు సేవలు లేదా వస్తువులు అందించడాన్ని సరఫరాగా పరిగణించాలా లేదా?

పరిగణించాలి... ఒక సంఘం లేదా సమాజం లేదా క్లబ్బు లేదా ఏదైనా అటువంటి సంస్థ తమ సభ్యులకు సౌకర్యాలు కల్పించడాన్ని సరఫరాగానే పరిగణలోకి తీసుకోవాలి. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని సెక్షన్ 2 (17) కింద ఇచ్చిన నిర్వచనం దీన్ని "వ్యాపారం"గా పేర్కొంటోంది.

జీఎస్టీ చట్టం కింద ఎన్ని రకాల సరఫరాలు ఉన్నాయి?

  1. పన్ను విధించదగిన, మినహాయించదగిన సరఫరాలు;
  2. అంతరాష్ట్ర రాష్ట్రాంతర సరపురాలు;
  3. సంయుక్త మిశ్రమ సరఫరాలు;
  4. సున్నారేటింగ్ గల సరఫరాలు.

అంతర్రాష్ట్ర సరఫరాలు, రాష్ట్రాంతర సరఫరాలంటే ఏమిటి?

సమీకృత జీఎస్టీ (IGST) చట్టంలోని సెకన్లు 7(1), 7(2), 8(1), 8(2) కింద అంతరాష్ట్ర రాష్ట్రాంతర సరఫరాలు నిర్దిష్టంగా నిర్వచించబడ్డాయి. విస్తృతార్థంలో... సరఫరాదారు ఉన్న ప్రదేశం, సరఫరాలు చేరే ప్రదేశం ఒకే రాష్ట్రంలో ఉన్నట్లయితే వాటిని రాష్టాంతర సరఫరాలుగా పరిగణించాలి. సరఫరాదారు ఉన్న ప్రదేశం, సరఫరా చేసే ప్రదేశం వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్లయితే వాటిని అంతర్రాష్ట్ర సరపురాలుగా పరిగణించాలి.

వస్తు వినియోగ హక్కు బదిలీ వస్తు సరఫరా అవుతుందా... సేవ సరఫరా అవుతుందా? అయితే ఎందుకు?

ఇటువంటి లావాదేవీలలో వస్తువులపై హక్కు కాకుండా వస్తువుల వినియోగానికి మాత్రమే హక్కు బదిలీ అయినందువల్ల ఇది సేవ సరఫరా కిందికే వస్తుంది. సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ చట్టంలోని పెడ్యూల్-I ప్రకారం ఇటువంటి లావాదేవీలను ముఖ్యంగా సేవల సరఫరాగానే పరిగణిస్తారు.

పనుల ఒప్పందాలు ఆహార (కేటరింగ్) సేవలను వస్తు లేదా సేవ సరఫరాలలో ఏదిగా పరిగణించాలి? ఎందుకు?

పనుల ఒప్పందాలు, ఆహార సేవలను జీఎస్టీ చట్టం పెడ్యూల్-IIలోని వరుస సంఖ్య 6(ఎ), (బి) నిర్దేశిస్తున్న మేరకు సేవల సరఫరాగానే పరిగణించాలి.

సాఫ్ట్ వేర్ సరఫరాను జీఎస్టీ చట్టం కింద వస్తు లేదా సేవ సరఫరాలలో ఏదిగా పరిగణించాలి?

సమాచార సాంకేతికత సాఫ్ట్ వేర్ అభివృద్ధి, రూపకల్పన, నిర్దేశీకరణ, అనుకూలీకరణ, అనుసరణం, స్థాయి పెంపు, వికాసం, ఆచరణలను జీఎస్టీ నమూనా చట్టం పెడ్యూల్-IIలోని వరుస సంఖ్య 5(2) (డి) కింద పేర్కొన్న మేరకు సేవల సరఫరాగానే పరిగణించాలి.

అద్దె కొనుగోలు ప్రాతిపదికన వస్తు సరఫరా చేస్తే దాన్ని వస్తు లేదా సేవ సరఫరాలలో ఏదిగా పరిగణించాలి?

అద్దె కొనుగోలు ప్రాతిపదికన వస్తు సరఫరా చేసినప్పటికీ ఆ తర్వాతి తేదీన సహజంగానే హక్కు బదిలీ అవుతుంది కాబట్టి సదరు లావాదేవీని వస్తువుల సరఫరాగానే పరిగణించాలి.

సీజీఎస్టీ/ఎస్టీఎస్టీ/యూటీజీఎస్టీ చట్టాలకింద సంయుక్త సరఫరా అంటే ఏమిటి?

వ్యాపార సపూజ లేదా సాధారణ నిర్వహణ క్రమంలో భాగంగా పన్ను విధించదగిన వ్యక్తి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు/సేవలు లేదా రెండూ కలిపి లేదా ఒక ప్రధాన వస్తువుతో మరొక వస్తువుజతగా చేసే సరఫరాను ‘సంయుక్త సరఫరా’గా పరిగణిస్తారు. ఉదాహరణకు... వస్తువులను 'కట్టగట్టి ' ‘బీమా’తో ‘రవాణా’ చేసినప్పుడు సదరు వస్తువులు, కట్టగట్టే సామగ్రి, రవాణా, బీమా... అన్నీ కలిపి సంయుక్త సరఫరా కిందకు వస్తాయి. ఇక్కడ వస్తువులను ప్రధాన సరఫరాగా పరిగణించాలి.

జీఎస్టీ కింద సంయుక్త సరఫరాపై పన్ను బాధ్యతను ఎలా నిర్ధారిస్తారు?

ఒక ప్రధాన సరఫరాతో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సరఫరాలు కలిసి ఉన్న సంయుక్త సరఫరాను ప్రధాన వస్తు సరఫరాగా పరిగణిస్తారు.

మిశ్రమ సరఫరా అంటే ఏమిటి?

మిశ్రమ సరఫరా అంటే… పన్ను విధించదగిన వ్యక్తి విడివిడిగా సరఫరా చేయదగిన రెండు అంతకన్నా ఎక్కువ సమ్మేళనంతో కూడిన వస్తువులు/సేవలను లేదా రెండింటి మిశ్రమాన్ని లేదా ఒకదానికొకటి జతగా ఒకే ధరకు సరఫరా చేస్తే దాన్ని మిశ్రమ సరఫరాగా పరిగణించవచ్చు. ఇది సంయుక్త సరఫరా కిందకు రాదు. ఉదాహరణకు.. కేన్లలో ఆహార పదార్థాలు, మిరాయిలు, చాక్లెట్లు, కేకులు, ఎండు ఫలాలు, సోడావంటి వాయుపూరిత పానీయం, పండ్లరసం తదితరాలను ఒకే ధరకు సరఫరా చేసినప్పుడు దాన్ని మిశ్రమ సరఫరాగా పరిగణిస్తారు. వీటిలో ప్రతిదాన్నీ విడివిడిగా సరఫరా చేసే వీలుండటమేగాక ఇవి ఒకదానితో మరొకటి ముడిపడినవి కావు. అందువల్ల వీటిని వేర్వేరుగా సరఫరా చేస్తే అది మిశ్రమ సరఫరా కిందకు రాదు.

జీఎస్టీ కింద మిశ్రమ సరఫరాపై పన్ను బాధ్యతను ఎలా నిర్ధారిస్తారు?

రెండు లేదా అంతకన్నా ఎక్కువ సరఫరాలు కలిసి ఉన్న మిశ్రమ సరఫరాలో దేనిపై ఎక్కువ పన్నుశాతం వర్తిస్తుందో సదరు నిర్దిష్ట సరఫరాగా పరిగణిస్తారు.

వస్తువుల సరఫరా లేదా సేవల సరఫరాగా పరిగణించ వీల్లేని కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయా?

ఉన్నాయి... జీఎస్టీ నమూనా చట్టంలోని షెడ్యూలు-III ప్రకారం...

  1. విధులకు సంబంధించి లేదా అందులో భాగంగా యజమానికి ఉద్యోగి అందించే సేవలు
  2. ఏదైనా చట్టం కింద ఏర్పాటైన న్యాయస్థానం లేదా ధర్మాసనం సేవలు
  3. పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక పాలనా సంస్థల సభ్యులతోపాటు రాజ్యాంగ బాధ్యతలుగలవారు నిర్వర్తించే విధులు
  4. అంత్యక్రియలు, ఖననం, దహనశాల, శవాగారం
  5. భూ విక్రయం
  6. లాటరీ, బెట్టింగ్, జూదం వంటివి మినహా దావాహక్కుతో రాబట్టగల క్లెయిములు తదితరాలన్నీ అటు వస్తు సరఫరాగా లేదా సేవల సరఫరాగా పరిగణనలోకి రావు.

జీఎస్టీ చట్టం కింద సున్నా రేటింగ్ సరఫరా అంటే ఏమిటి?

సున్నా రేటింగ్ సరఫరా అంటే... వస్తువులు/సేవల లేదా రెండింటి ఎగుమతి. లేదా ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) యూనిట్ లేదా దాన్ని అభివృద్ధి చేసేవారికి వస్తువులు/సేవలు లేదా రెండూ అందించడం.

ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని సేవల దిగుమతి జీఎస్టీ కింద పన్ను విధించదగినదేనా?

సహజ సూత్రం ప్రకారం ప్రతిఫలాపేక్ష లేని సేవల దిగుమతిని జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 7 సరఫరాగా పరిగణించదు. అయితే, పన్ను విధించదగిన ఒక వ్యక్తి తన వ్యాపార విస్తరణ లేదా అందులో భాగంగా సంబంధిత వ్యక్తినుంచి లేదా దేశం వెలుపలున్న తన ఇతర సంస్థల నుంచి సేవలను దిగుమతి చేసుకోవడంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకపోయినా ఆ లావాదేవీలను పెడ్యూల్-1 లోని వరుస సంఖ్య 4 ప్రకారం సరఫరాగానే పరిగణించాలి.

ఆధారం: సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate