অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచ ఆహార దినోత్సవంను ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం అక్టోబరు 16 తేదిన జరుపుకుంటారు. దీనికి కారణం 1945 సంవత్సరం అక్టోబరు 16వ తేదిన ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయక సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థను ఆంగ్లంలో FAO అంటారు. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ గౌరవార్థం ఈ సంస్థ ఏర్పడిన అక్టోబరు 16 తేదిని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు.

మనిషి ప్రాధమిక అవసరాల్లో అతిముఖ్యమైనది ఆహారము . రుచులు , రకాల్ని పక్కనపెడితె తిండిలేనిదే మనుగడ అనేది ఉండదు . ఆహారలేమితో అనేక రకాల జబ్బులు తప్పవు.

ఐరాస ఆహర-వ్యవసాయక సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవస్థాపక దినమైన 1945 అక్టోబరు 16 వతేదీని ప్రతి యేటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించినది . దీనిని మొదటి సారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి క్రమం తప్ప కుండా ప్రతి సంవత్సరం ఒక్కో సందేశాన్ని ఇది ముందుకు తెస్తుంది. తొలి ఆహార దినోత్సవం నాడు ఆహారానికి తొలి ప్రాధాన్యత అన్నది ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది అంటే 28వ అహార దినోత్సవం సందర్భంగా సంక్షోభ సమయంలో ఆహార భద్రత అన్న దానిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. 2010 సంవత్సరానికి గాను ఆకలిపై సమిష్టి పోరు జరపాలని ఎఫ్‌ఎఓ పిలుపు నిచ్చింది. గత సంవత్సరం జరిగిన ప్రపంచ ఆహార భద్రతా సదస్సు ఆమోదించిన ఏక గ్రీవ తీర్మానంలో ఆకలిని భూమ్మీద నుంచి సాధ్యమైనంత త్వరగతా తుడిచిపెట్టాలని పిలుపునిచ్చింది. ప్రపంచంలో డెబ్బయి శాతం మందికి జీవనాధారంగా వున్న వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్న విషయాన్ని ఈ సదస్సులో అన్ని దేశాలు అంగీకరించాయి. వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి, పేదరికం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాలని కోరింది.

ఆహారం లేనిదే జీవం లేదు. కానీ తగినంత ఆహారం లేకుండా ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే వీలుకూడా లేని ప్రదేశాలు ఇంకా ఉండడం మన అభివృద్ధికి అవమానం. అసలు అభివృద్ధి అన్న విషయమే అనుమానం.

ప్రకృతితో సహజీవనం చేస్తున్నప్పుడు సమస్యలు తరచూ అనూహ్యంగా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో కూడా ఆహారం లభించడం ముఖ్యం. ఆ దిశలో 'పాలకుల' ధ్యాస ఉండాలి. ప్రణాళికలు తయారవ్వాలి. ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్టనిపిస్తున్నా ఎక్కడో ఏదో లోపం ఉందనిపిస్తుంది. అందుకు నిదర్శనమే ఈ నాటికీ అన్నం లేక విలవిల్లాడుతున్న దేశాలు. కారణం కరువు కావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థికంగా వెనుకబాటుతనమూ కావచ్చు. ఫలితం మాత్రం మానవబాధ.

ప్రపంచ ఆహార దినోత్సవం--ఈ విషయాన్ని ఏడాదికోసారి గుర్తు చేయడానికన్నట్టు యునైటెడ్‌ నేషన్స్‌ ప్రతి అక్టోబరు 16వ తేదీని ప్రపంచ ఆహారదినంగా పరిగణిస్తోంది. ముఫ్పైఏళ్ల క్రితం 1979 నవంబరులో ఈ ప్రతిపాదన చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా 150 కంటే ఎక్కువ దేశాలలో ఆహారదినం పాటిస్తున్నారు.

ప్రపంచంలో ప్రతి మనిషీ ధనికుడు కాకపోయినా, కనీసం ఏరోజూ ఆహారం లేక అలమటించకూడదన్నది ఆలోచన. లెక్కలు చూస్తే అంతా బాగానే ఉన్నట్టనిపిస్తుంది. తలసరి ఆహారం ఎక్కువై లావైనవాళ్ల సంఖ్య, ఆహారలోపం బారిన పడ్డవాళ్ల సంఖ్యకంటే ఎక్కువుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 852 మిలియన్ల మంది దీర్ఘకాలంగా అతి పేదరికం కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు.

ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు అనేకం. విపరీతమైన జనాభా పెరుగుదల, వాతావరణ మార్పు, ఆహార ధాన్యాలను జీవఇంధనాల కోసం ఉపయోగించడం, మౌలిక ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గించి లాభదాయకమైన వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపడం... ఇలా ఎన్నో కారణాలు. వీటి పర్యవసానంగా ఆహార ధాన్యాల ధరలు అందుబాటులోకి లేనంతగా పెరగడం మరో సమస్య.ప్రపంచ జనాభాలో దాదాపు సగం పట్టణాలు, నగరాలలో జీవిస్తున్నారు.

ఆహార సరఫరాలో ఏమాత్రం తగ్గింపు కనిపించినా అది అతితక్కువ సమయంలో ఈ 'అర్బన్‌' జనాభాపై బహుళప్రభావం కనబరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 70 శాతం కంటే ఎక్కువ మంది పల్లెల్లో నివసిస్తున్నారు. అయినా అనేక కారణాలవల్ల వ్యవసాయం కుంటుపడింది. ఆఫ్రికాలో కొన్ని దేశాలలో కరువు నిత్యం తాండవిస్తూనే ఉంది. ఆసియాలో దాదాపు 60 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అదే ఆఫ్రికాలో ఆ శాతం 75 దాటింది. దాదాపు 22 దేశాలలో (వాటిలో 16 ఆఫ్రికాలోవే) పోషకాహారలోపం 35 శాతం దాటిందని తేలింది.

ఈ మధ్య దివంగతుడైన (సెప్టెంబరు 12, 2009) వ్యవసాయ పరిశోధకుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత నార్మన్‌ బోర్లాగ్‌ హరిత విప్లవానికి మూలపురుషుడు. మనదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ కూడా పొందిన బోర్లాగ్‌ ప్రపంచ ఆహార సమస్యపైనే పరిశోధించాడు. ఆయన కారణంగా కోట్ల జనాభా ప్రాణాలు నిలబెట్టుకుంది. ఆయన సూచించిన పద్ధతుల వల్ల ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఆహారోత్పత్తి అధికమైంది.

సంప్రదాయేతర ఆహారం

కానీ రాబోయే కాలంలో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరిగిపోయే ప్రమాదముంది. మారుతున్న వాతావరణ, సామాజిక, ఆర్థిక సమతుల్యతల వల్ల అనూహ్యరీతిలో ఆహార సమస్య ఎదురయ్యే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

ఆ దిశలో సంప్రదాయేతర ఆహారాన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్రాలలోని ఆల్గే నుండి పౌష్టికాహారం తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 'స్పిర్సులీనా' అనేది రూపొందింది. కానీ ప్రజలందరూ తినగలిగినంత మోతాదులోనూ, ఇష్టపడే రుచిలోనూ ఇంకా రావలసిఉంది. మాంసకృత్తుల నిధిగా ప్రచారం చేసిన సోయాచిక్కుళ్లు అనుకున్నంత ప్రాచుర్యం పొందలేదు. బోర్లాగ్‌ రూపొందించిన అధిక దిగుబడి గోధుమ, వరి అధికంగా తినే వారికి ఉపయోగపడలేదు. వరిపొలాలు చేపల చెరువులయ్యాయి.

ఉన్న పొలాలు నీరు లేక కొంతా, నీరు ఎక్కువై కొంతా నష్టపోతున్నాయి. లాభాలు కనిపించక రైతులు వ్యవసాయం మానుతున్నారు. ఇటు జనాభా ఏమాత్రమూ తగ్గే దిశలో లేదు. ఆహార సమస్య (డబ్బున్న వాళ్లకి లేకపోతే పోవుగాక) మాత్రం తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.ఆహారంలో అంతగా ఉపయోగపడని టమాటాలూ, ఉల్లిపాయలూ ధరలు పెరిగితే వాటిని మానేయలేనంతగా అలవాటుపడ్డ మనం నిజంగా ఆహార సమస్య వస్తే తట్టుకోగలమా?

అత్యధిక స్థాయిలో అన్నార్తులు : ఆహార సంక్షోభం, ఆర్థిక మాంద్యమే కారణాలు.----

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార సంక్షోభం, ఆర్థికమాంద్యం అన్నీ కలిసి ప్రపంచంలో అన్నార్తుల సంఖ్యను ఆమోదయోగ్యం కాని విధంగా అత్యధిక స్థాయిలో పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య వంద కోట్లు దాటిపోయినట్లు ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జాక్వెస్‌ డియోఫ్‌ తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతపై ఇటీవల రోమ్‌లో నిర్వహించిన 36వ అంతర్‌ ప్రభుత్వాల కమిటీ సమావేశంలో డియోఫ్‌ ప్రపంచంలో అన్నార్తులు పెరిగిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ప్రపంచ ఆహార దినాన్ని పురస్కరించుకొని ఈ సమావేశం నిర్వహించారు. 1996లో నిర్వహించిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాల అధినేతలు అన్నార్తుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు కట్టుబడ్డామని చెప్పారని, కానీ అప్పుడున్న వారి కంటే ఇప్పుడు అన్నార్తుల సంఖ్య మరింత పెరిగిపోయిందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన ఆకలి, పోషకాహార లోపం, దారిద్య్రం, దుర్బల ప్రజల రక్షణలో అసమర్థత మొదలైనవి తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలని చెప్పారు. ఆహార అభద్రత సమస్యకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో అన్ని రకాల వ్యవసాయోత్పుత్తుల వృద్ధి రేటు తగ్గుతోందన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 910 కోట్లకు పెరగవచ్చనేది అంచనాగా ఉందని, ఆ ప్రజలకు ఆహారం అందించాలంటే ప్రపంచంలో వ్యవసాయోత్పత్తులు 70 శాతం మేరకు పెరగాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో రెండింతలు కావాలని అన్నారు. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని, ప్రకృతి వనరులను రక్షించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌, ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం అధిపతులు పాల్గొన్నారు.

ఆధారము: ప్రజాశక్తి మరియు డే సెలబ్రేషన్స్ బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate