శతాబ్దాల కాలంగా ఎన్నో కరువు కష్టాలను ఓర్చి తెలంగాణ గొల్లలను కురువలను ఆర్థికంగా కాపాడుతూ, ఎన్నో రకాల జబ్బులు, కఠిణమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని తమదైన శైలిలో మన్ననలందుకున్న ప్రత్యేకమైన గొర్రెజాతి "దక్కని జాతి".
నల్లని రంగులో, సంవత్సరానికి 250 నుండి 500 గ్రాముల ముతక ఉన్నినిస్తూ దాదాపు నెలకు 2 ½ నుండి 3 కిలోల బరువు పెరుగుతూ 8 నెలల వయస్సులో తొలి ఎదకు వచ్చి 13 - 14 నెలల వయసులో తొలి ఈత ఈనగలిగిన గొర్రెలు ఈ దక్కని జాతి కొదమలు.
ప్రతి 8 నెలలకు ఒక ఈత ఈనుతూ కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని తీవ్రమైన కరువులో సైతం వేప, సుబాబుల్, దురుసన్ చెట్లు, అవిశ చెట్లు, బెరడు, తుమ్మ కాయలతో కడుపు నింపుకుని దృఢంగా, బలిష్టంగా పెరిగి నాణ్యమైన రుచికమైన మాంసాన్ని అందించ గలుగుతుంది.
|
మగ (పొట్టేళ్ళు) |
ఆడ (గొర్రెలు) |
పుట్టినప్పుడు పిల్ల బరువు |
2.5 నుండి 3.5 కిలోలు |
2.5 నుండి 3.0 కిలోలు |
శరీర ఎత్తు |
30 అంగుళాలు |
24 – 28 అంగుళాలు |
శరీర పొడువు |
32 – 34 అంగుళాలు |
28 – 30 అంగుళాలు |
బరువు (అత్యధికంగా) |
35 – 50 కిలోలు |
25 – 30 కిలోలు |
నాసిరకం పశుగ్రాసం, లేదా ముళ్లచెట్ల ఆకులు, కాయలు, చిగురు తిని బ్రతుక గలుగుతుంది. అనేక రకాల జబ్బులకు లోనవకుండా మనగలుగుతుంది. అనగా గాలికుంటు, జబ్బ వాపు, గొంతువాపు, పారుడు వ్యాధి, మూతి పుండ్లు, గిట్ట పుండ్లు మొదలగు జబ్బల బారిన పడకుండా ఎక్కువగా శరీరంలో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. షెడ్లు అవసరం లేకుండా ఎండా, వాన, చలి మొదలగు వాతావరణ ప్రతికూల పరిస్థితులలో సైతం నెలకు 2 ½ నుండి 3 కిలోల బరువు పెరగ గలుగుతుంది. మిశ్రమ దాణా, నాణ్యమైన పచ్చిగడ్డి ఇచ్చి సాంద్ర పద్ధతిలో పోషిస్తే నెలకు 3 ½ నుండి 4 కిలోలు బరువు కూడా పెరుగగలవు.
ఇంతటి లాభాలు, ప్రత్యేకతలున్న గొర్రెలైన దక్కని జాతిని మనం నిర్లక్ష్యం చేయుట వలన ఆ జాతి అంతరించి పోవడానికి తయారైంది. ఇతర జాతి పొట్టేళ్ళను మన దక్కని జాతి మందలలో చేర్చటం వలన రాను రాను మన దక్కని జాతి లక్షణాలు కనుమరుగై ఎటూ పోల్చుకోలేని కలగూర గంపగా గొర్రెల మందలు మనకు దర్శన మిస్తున్నాయి. దీని వలన భవిష్యత్తులో ఫలాన జాతి జీవాలు అని చెప్పకునే పరిస్థితి ఉండక పోవచ్చును.
ఈ అనాలోచిత చర్యల వలన జాతుల సంకరం క్రమంగా జీవాలలోని లక్షణాలను మార్చుకుంటూ, రోగ నిరోధక శక్తి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోయి చిన్న చిన్న జబ్బులకు కూడా అపార ప్రాణ నష్టం వాటిల్లుతుంది. వివిధ జాతుల సంకరం వలన తాత్కాలికంగా ఆర్థిక లాభం చేకూరినట్లు కనిపించినప్పటికీ, భవిష్యత్తు తరాలలో మాత్రం నష్టాలను చవిచూడక తప్పదు. ఇది మన స్వయంకృతాపరాధంగా బాధ పడవలసి వస్తుంది.
తద్వారా రైతులు నష్టాలను చవిచూస్తారు. అనేక రకాల అంతర, బాహ్యపరాన్నజీవులను కూడా తట్టుకునే శక్తి దక్కని జాతి గొర్రెల కుంది. అదే ఇతల జాతి గొర్రెలు పిడుదులు, గోమార్లు, అంతర పరాన్నజీవుల వల్ల కూడా నీరసించి మృత్యువాత పడుతుంటాయి. దక్కని జాతి గొర్రెలలో సహజంగానే పునరుత్పత్తి సమస్యలు, ఈసుకుపోవటం, గొడ్డు మోతు తనం మొదలగు సమస్యలు చాలా తక్కువ.
దక్కని జాతి గొర్రెలను సాంద్ర పద్ధతిలో పోషించినట్లయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలవు.
గొర్రెకు ఒక చదరపు మీటరు నీడనిచ్చు పెద్ద భాగం, 4 చ.మీ పెద్ద బయట ఆరుబయట ప్రాంతం అవసరమౌతుంది. దాణా, నీళ్ళ తొట్ల ఏర్పరచుకోవటం కూడా అవసరం ఎత్తైన గొర్రెల షెడ్లు తక్కువ పని మనుషుల నిర్వహణకు వీలుగా చెక్కల ఫ్లోర్ ఏర్పరచుకుని, కోళ్ళ ఫారాల్లో వలె సులభంగా యాజమాన్యం చేసే పద్ధతులు కూడా ఆచరణలో ఉన్నాయి.
|
3 – 6 నెలల వయస్సు పిల్లలు |
6 – 12 నెలల వయస్సు జీవాలు |
పెద్ద గొర్రెలు లోదా పొట్టేళ్ళు |
ధాన్యపు జాతి పప్పు మేత |
1 ½ - 2 కిలోలు |
2½ - 3½ కిలోలు |
3½ - 4 కిలోలు |
కాయ జాతి పచ్చి మేత |
½ కిలో – 1 కిలో |
- 2 కిలోలు |
1 – 2 కిలోలు |
మిశ్రమ దాణా |
150 – 200 గ్రా. |
250 – 350 గ్రా. |
250 – 350 గ్రా. |
పైన పట్టికలో తెలిపిన పోషణ అందిస్తే సరాసరి రోజుకు 100 నుండి 150గ్రా. శరీర బరువు పెరిగి రైతుకు మంచి లాభాలు అందించుటలో దక్కని జాతి గొర్రెలు ప్రధమమైనవిగా ఉంటాయి.
వేరే జాతికి తీసిపోని ఇన్ని లాభాలున్న దక్కని జాతి గొర్రెలను పోషించి నాసిరకం వ్యవసాయపు వ్యర్థ పదార్థాలను నుండి నాణ్యమైన మాంసాన్ని ఉత్పత్తి చేసుకుందాం. మన తెలంగాణ నల్ల బంగారమైన దక్కని జాతి గొర్రెలను సంరక్షించుకుందాం. భావి తరాలకు మన జాతి గొర్రెలను ఫోటోలలో కాకుండా వారు కూడా ఈ జాతి గొర్రెల వల్ల లాభ పడేలా చేద్దాం. వాటి ప్రత్యేకత ప్రపంచానికి చాటి చెప్పదాం.
ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 9100956353