অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేసవిలో పశుసంరక్షణ, వేసవికి అనువైన పశుగ్రాసాలు

సాధారణంగా ప్రతి వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండవచ్చుననీ, దానితో పాటు భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి ఎద్దడి కూడా తీవ్రంగానే ఉండవచ్చుననీ వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రభావం పాడిపరిశ్రమ మీద తీవ్రంగానే ఉండవచ్చు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే పాడి పశువుల నిర్వహణ కష్టతరం కావచ్చు. కాబట్టి పాడి రైతులతో పాటు ప్రభుత్వం కూడా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకొని పాడి పరిశ్రమను కాపాడుకునేందుకు సిద్ధపడాలి.

పాడి పశువులు ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు వాటి దూడలు, ముర్రాజాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉండి, వాతావరణంలోని అధిక తాపం వల్ల తమ ఉత్పాదకతతో పాటు, ప్రత్యుత్పాదకశక్తిని, ఆరోగ్యాన్ని తుదకు వడగాడ్పులవల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు, సాధారణంగా వేసవిలో ఎదురైయే పచ్చి గ్రాసాల కొరత కూడా పాల దిగుబడి మీద ప్రతికూల ప్రభావాన్నిచూపుతుంది.

వాతావరణ తీవ్రత నుండి రక్షణ

చెమట ద్వారా శరీరంలోని అధిక వేడిని విసర్జించే అవకాశాలు పాడి పశువులకు చాలా తక్కువ. నల్లని చర్మం ద్వారా వాతావరణంలోని వేడి శరీరంలోకి ఎక్కువగా ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది. పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే హార్మోను వ్యవస్థ అధిక తాపానికి సులువుగా లోనై, పాల ఉత్పత్తి ప్రత్యుత్పత్తి మీద తీవ్రమైన ప్రతికూలతను చూపుతుంది. వడగాల్పుల రోజుల్లో గర్భస్రావాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వేసవిలో పాడి పశువుల్ని, దూడల్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వదలకూడదు. ఇది జంతు హింసా నివారణ చట్టరీత్యా కూడా నేరమే. పాకల చుటూ మామిడి, జామ, సపోట, అవిశె, అడవి పత్తి, మునగ, గానుగ, సుబాబుల్ వంటి బహుళ ప్రయోజనకర మొక్కలను నీడకోసం పెంచడం, పెడు రేకుల మీద తెల్లని రంగు వేసి, ఆపైన అరటి, తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం వంటి చర్యల ద్వారా ఎండ వేడి పెడ్లలోపలికి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మద్యాహ్న సమయాల్లో పాకల చుటూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం మంచిది. అత్యధిక పాలనిచ్చే సంకరజాతి ఆవులకు, ముర్రాగేదెలకు, ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయడం కూడా అవసరమే. ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా, పాకల చుటూ తగినంత ఖాళీ స్థలంతో పాటు, పాకల ఎత్తులో ఉండే విధంగా నిర్మించుకోవాలి. పాడి గేదెల్ని మధ్యాహ్న సమయాల్లో వీలును బట్టి చెరువులు, కాల్వలు, నదులు, మడుగులలోకి వదలడం, లేదా వాటిపై చన్నీటిని రోజులో 2-3 సార్లు చల్లడం, తడి గోతాలు పరవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించాలి. పాకలు శుభ్రంగా ఉండే విధంగా తగినంత వాలుతో పటిష్టమైన కాంక్రీటు నేలను నిర్మించాలి. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేని రీతిలో గడ్డివాములను, చెత్త కుప్పలు, విద్యుత్ వైర్లు, పొయ్యిలు వగైరాల విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

నీటి సరఫరా

వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపు అవుతాయి. చల్లని శుభ్రమైన నీటిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటి తొట్లను నీడలో ఉంచడం, మధ్యాహ్న సమయాలలోనైనా, తాజాగా బావి నుండి తోడిన చల్లని నీటిని, లేదా ఐసు కలిపిన నీటిని గానీ అందిస్తే మంచది. కనీసం రెండు రోజులకు సరిపడా తాగునీటిని నిల్వ చేసుకుంటే విద్యుత్ కోతల వల్ల సమస్య ఉండదు.

మేత

సమృద్ధిగా సాగునీరు లభిస్తే దాదాపు అన్ని రకాల పశుగ్రాస పంటలూ వేసవిలోనే ఎక్కువగా దిగుబడినిస్తాయి. ఇందుకు పాకలలోని వ్యప్థ జలాలు, వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవాలి. మాగుడుగడ్డి, ఎండుగడ్డిగా ముందే నిల్వ చేసుకున్న గ్రాసాల వల్ల వేసవిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. వరిగడ్డిని యూరియా - ఖనిజ లవణ మిశ్రమాలతో బలవర్ధపరచడం, యూరియా మొలాసెస్ - మినరల్ దిమ్మలను పశువులు నాకే విధంగా అందుబాటులో ఉంచడం, పచ్చిమేత కొరతకు అనుగుణంగా సమీకృత దాణాల మోతాదును పెంచడం వంటి చర్యలు వేసవిలో అవసరం అవుతాయి. కరువు ప్రాంతాలకు ఎగుమతి చేసే వరిగడ్డిని ముందుగా యూరియా - ఖనిజ లవణాలతో బలవర్థపరచి, బేళ్ళుగా చేసి రవాణా చేస్తే రవాణా ఖర్చులు మూడోవంతుకు తగ్గటమే కాక, పశువులకు మేలైన మేత లభిస్తుంది. అజొల్లా అనే ఫెర్న్ జాతికి చెందిన అత్యంత పోషక విలువలు కలిగిన పైరును, పటిష్టమైన నీరు ఇంకని టార్పాలిన్తో ఏర్పాటు చేసుకున్న మడులలో పెంచగలిగితే అతి సులువుగా ఎంతో విలువైన మేతను ప్రతి రైతూ తన ఇంటి ఆవరణలోనే కాక, ఇంటి కాంక్రీటు శాబుల మీద కూడా అతి తక్కువ నీటి వినియోగంతో ఉత్పత్తి చేసుకోవచ్చు.

నిర్వహణ

వేసవి తీవ్రత ముదరక ముందే, చూడి పరీక్షలు జరిపించి, లోపాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. గాలికుంటు, జబ్బవాపు, గురక, దౌంసులీరియూసిన్, స్థానికంగా కనిపించే అంటువ్యాధుల నివారణకు టీకాలను ముందుగానే వేయించాలి. గేదెలకు, దూడలకు వెంట్రుకలను కత్తిరించి, పేలు, పిడుదులు, గోమార్లు నివారణ చర్యలు తీసుకోవాలి. వేసవిలో పశువుల రవాణాకు, యాజమాన్య మార్పులకు గురిచేయడం మంచిది కాదు. వేసవిలో ఎక్కువగా సంభవించే అగ్ని ప్రమాదాలు, ఆ తర్వాత వరాకాలంలో వచ్చే వరదలు తుపాన్లు వంటి ఇతర ముప్పల వల్ల సంభవించే పశువుల మరణాల వల్ల కలిగే నష్టాల నుండి పరిహారం పొందడానికి, మార్చి నెలలోనే పశువులన్నింటికీ బీమా చేయించుకోవడం, ఇందుకు ప్రభుత్వాలు, పాడి సంస్థలు, ప్రైవేటు డైయిరీలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.

అలాగే పాడికి ఆధారం పచ్చిమేత. మేలైన పశుపోషణలో పాడి పశువులకు పచ్చిమేతను ప్రతిరోజు తప్పక అందించాలి. పచ్చిగడ్డి సులభంగా జీర్ణమవడమే కాకుండా అవసరమైన మాంసకృత్తులు, విటమిను, ముఖ్యమైన ఖనిజాలను పశువులకు అందిస్తుంది. వేసవి కాలంలో నీటి వసతి ఉన్నప్పుడు పండించడానికి అనువైన పశుగ్రాసాలలో జొన్న మొక్కజొన్న సజ్జ వంటి ధాన్యపు జాతి గ్రాసాలు, అలసందలు, పిల్లిపెసర వంటి కాయజాతి గ్రాసాలు ముఖ్యమైనవి.

జొన్న

మన రాష్ట్రంలో జొన్న పంటని ప్రధాన పశుగ్రాసంగా చెప్పుకోవచ్చు. ఇది ఏపుగా పెరిగి 3-4 కోతలలో అధిక పశుగ్రాసాన్నిస్తుంది. ఈ పంటను అన్ని రకాల భూములలో ఇసుక, చవుడు భూములలో కూడా సాగుచేసుకోవచ్చు. ఎండాకాలపు పంటగా దీన్ని జనవరి నుండి మే వరకు ఎప్పుడైనా విత్తుకోవచ్చు. జొన్న పంటలో ఒకే కోత నిచ్చే రకాలు, పలుకోతలనిచ్చే రకాలు ఉన్నాయి. ఒకే కోత రకాలలో ముఖ్యమైనవి సి.ఎస్.వి-15, సి.ఎస్.ఎచ్-13, ఎస్.ఎస్.వి.- 84, యు.పి. చారి మొదలైనవి. పలుకోతలనిచ్చే రకాలలో ఎస్.ఎన్.జి. -59-3, ఎన్.ఎన్.జి. -988, హరాసోనా, పూసా చారి మొదలైనవి ముఖ్యమైనవి. నేలను 2-3 సార్లు దున్ని చదును చేసుకోవాలి. ఎకరాకు 8-10 కిలోల విత్తనాన్ని 30 సెం.మీ. ఎడంగా ఉన్న చాళ్లలో విత్తుకోవాలి. దుక్మిలో ప్రతి హెక్టారుకు 25 బండ్ల పశువుల ఎరువు, 30 కిలోల నత్రజని, 40-50 కిలోల భాస్వరమునిచ్చే ఎరువు, 30 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తరువాత హెక్టారుకి 30 కిలోల నత్రజనిని పైపాటుగా వేసి నీరు పెట్టాలి. పలుకోత రకాలైతే, కోత కోసిన వెంటనే హెక్టారుకు 30 కిలోల నత్రజని చొప్పున వేసి నీరు పెట్టాలి. సాగునీటిని 10-15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఇవ్వాలి.pashugrasalu.jpg ఏక కోత రకాలైతే నాటిన 60-65 రోజలుకు అంటే 50 శాతం పూత దశలో 8% తీసుకోవచ్చు. పలుకోత రకాలైతే మొదటి కోత 50 శాతం పూత దశలో అంటే నాటిన 55-60 రోజులకు, తరువాత కోతలు 40-45 రోజుల వ్యవధిలో తీసుకోవచ్చు. నీటి వసతి కింద 3-4 క్రోత్రలలో జొన్న హెక్టారుకు 60-70 టన్నుల పచ్చిమేత దిగుబడినిస్తుంది.

మొక్కజొన్న

ఇది అధిక పౌష్టిక విలువలు గల రుచికరమైన ధాన్యపు జాతి పంట. ఈ పంట చాలా త్వరగా పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ పచ్చిమేతనిస్తుంది. అన్ని దశలలో పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఇది ఒక కోతనిచ్చే పశుగ్రాస పంట. నీటి వసతి ఉంటే ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. మరుగు నీటి అసౌకర్యం ఉంటే అన్ని రకాల నేలల్లోను ఈ పంటను పండించవచ్చు. ఆఫ్రికన్ టాల్, జె-1006, గంగాసఫేద్ -2 అనే రకాలు అనుకూలమైనవి. అవసరాన్నిబట్టి నేలను బాగా దున్ని దుక్కిలో 25 బండ్ల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 16-20 కిలోల విత్తనాన్ని 60 సెం.మీ. ఎడంగా ఉన్న బోదెలకు 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. హెక్టారుకు 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఎరువులను వాడుకోవాలి. నత్రజనినిచ్చే ఎరువును వితే సమయాన ఒకసారి, విత్తిన 35 రోజులకు రెండవ సారి వేసుకోవాలి. 10-15 రోజులకు ఒకసారి నీటి తడి అవసరం ఉంటుంది.

విత్తిన 60-65 రోజుల తరువాత, 50 శాతం పూత దశనుండి కండె పాల దశలో ఉన్న మొక్కజొన్నని పచ్చిమేతగా కోయాలి. హెక్టారుకు 50-60 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. ఈ గ్రాసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకు మేపడం లాభదాయకం.

సజ్జ

తగినంత నీటి వసతి లేని చోట ఈ పంటను సాగుచేసుకోవచ్చు. జొన్నకన్నా అధిక శాతం మాంసకృత్తులు కలిగిన పుష్టికరమైన పశుగ్రాసం. ఈ పంటకోత కోసినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి 2-3 కోతల వరకు తీసుకోవచ్చు. ఎండాకాలపు పంటగా జనవరిలో నాటుకోవచ్చు. అన్నిరకాల నేలలు అనుకూలం. జైంట్ బాజ్రా, ఎ.పి.ఎఫ్-బి-2, రాజ్కో బాబ్రజా, బి.ఎ.ఐ.ఎఫ్. బాజ్రా అనే రకాలు అనుకూలం. ఎకరాకు 5-6 కిలోల విత్తనాన్ని 30-35 సెం.మీ. దూరంలో ఉన్న చాళ్లలో విత్తుకోవాలి. విత్తనాలు భూమిలో 3 సెం.మీ. కన్నా లోతులో వేయకూడదు. దుక్మిలో 20 బండ్ల పశువుల ఎరువు వేసుకోవాలి. హెక్టారుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 80 క్రిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును వితే సమయాన, విత్తిన 35 రోజులకు వేసుకోవాలి. పలుకోత రకాలకు ప్రతికోత తరువాత 25-30 కిలోల నత్రజనినిచ్చే ఎరువును వేయాలి. వేసవిలో 10-15 రోజుల కొకసారి నీటి తడి అవసరమవుతుంది. మొదటి కోత విత్తిన 60-70 రోజులకు, తదుపరి 40-45 రోజులకు 2వ కోత తీసుకోవచ్చు. రెండు కోతలలో హెక్టారుకు 25-30 టన్నుల పశుగ్రాస దిగుబడి లభిస్తుంది.

అలసందలు

ఇది ఏక వార్షిక పశుగ్రాసం. ఇది మంచి పుష్టికరమైన పోషక విలువలు గల కాయజాతి రకానికి చెందింది. దీనిని సంవత్సరం పొడవునా పండించుకోవచ్చు. బుందేల్తోబియా, రష్యన్ జైంట్, యు.పి.సి.-5286, 4200 మొదలైన రకాలు అనుకూలమైనవి. ఈ పంటసాగుకు మధ్య రకపు, తేలిక నేలలు అనుకూలం.

ఎకరాకు 10-15 కిలోల విత్తనాన్ని 30 సెం.మీ. ఎడంగా ఉన్న చాళ్లలో విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరమునిచ్చే ఎరువులను ఆఖరి దుక్మిలో వేసుకోవాలి. వేసవిలో 7-10 రోజులకొకసారి నీటి తడి అవసరమవుతుంది. పంట 50 శాతం పూత దశలో అంటే విత్తిన రెండు నెలల తరువాత కోతకు వస్తుంది. ఎకరాకు 10–12 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. అలసందను మిశ్రమ పంటగా జొన్న మొక్కజొన్న సజ్ఞతో పండించినట్లయితే లాభదాయకంగా ఉంటుంది.

హైబ్రిడ్ నేపియర్

బహువార్షిక పశుగ్రాసాలలో ముఖ్యమైనవి నేపియర్ బాబ్రజా హైబ్రిడ్ అధిక మొత్తంలో సంవత్సరం పొడవునా పచ్చిగడ్డిని అందిస్తుంది. దీనిని నేపియర్ గడ్డి, సజ్జలతో సంకరం వేసి అభివృద్ధి పరిచారు. మిగతా పశుగ్రాసాలతో పోల్చినప్పుడు త్వరగా, వత్తుగా పెరగటమే కాకుండా సంవత్సరం పొడవునా అధిక పోషక విలువలున్న గడ్డిని అందిస్తుంది. దీనిలో 9-10 శాతం ముడి మాంసకృత్తులు ఉంటాయి. ఈ గడ్డిని నాటుకోవడానికి ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలమైనవి. ఎండాకాలంలో పిలకలు వృద్ధి చెంది మే మాసంలో కోతకు వస్తుంది. అందువలన నీటి వసతి ఉన్న ప్రాంతాలలో వేసవిలో కూడా పచ్చిమేత లభిస్తుంది. ఎకరాకు 12 వేల కాండపు ముక్కలు అవసరం అవుతాయి. ఈ మొక్కలను 60 సెం.మీ. దూరంలో ఉన్న బోదెలకు ఒక పక్కగా ఒక కణుపు పూర్తిగా భూమిలోకి ఉండేటట్లు 45 డిగ్రీల ఏటవాలులో నాటుకోవాలి. చివరి దుక్మిలో ఎకరానికి 20 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నాటేటప్పుడు బోదెలలో 12 కిలోల నత్రజనిని కాండపు ముక్కల దగ్గరగా వేయాలి. వేసవిలో 7-10 రోజులకొకసారి నేలను బట్టి నీరు పెట్టాలి. మొదటి కోత 70-75 రోజులకు, తదుపరి కోతలు ప్రతి 45 రోజుల కొకసారి తీసుకోవచ్చు. హెక్టారుకు 6-8 కోతలలో 200-250 టన్నుల పచ్చిమేత లభిస్తుంది. ఈ నేపియర్ గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలతో పచ్చిమేతగా పశువులకు పెట్టాలి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మొక్కలను తీసివేసి మళ్ళీనాటాలి.

పిల్లిపెసర

పశువులు ఇష్టంగా తినే పంటల్లో ప్రధానమైన పంట పిల్లి పెసర, అన్ని రకాల భూముల్లో ఈ పశుగ్రాసాన్ని సాగుచేసుకోవచ్చు. వరి కోసిన తరువాత భూమిలోని తేమతో కూడా ఈ పశుగ్రాసాన్ని సాగుచేసుకోవచ్చు. సాధారణ భూములకు పచ్చిరొట్టగా వాడినట్లయితే భూమికి సతువ చేకూరుతుంది. ఈ పంటను వరి తరువాత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 8–10 కిలోల విత్తనాన్ని భూమిలో వరి కోసిన తరువాత వెదజల్లవచ్చు. రెండు, మూడు కోతలు గ్రాసంగా పొందవచ్చు. మొదటికోత 50 రోజులకు అంటే 50 శాతం పూత దశలో తీసుకోవచ్చు. కోత పూరైన తరువాత ఎకరాకు 20 కిలోల నత్రజనిని యూరియా రూపంలో వేసి నీటితడి ఇస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఎకరాకు 6-8 టన్నుల పశుగ్రాసాన్ని దిగుబడిగా పొందవచ్చు.

వర్షాభావ పరిస్థితుల్లో రైతుల పొలం గట్లమీద, సేద్యపు బావుల దగ్గర, బీడు భూముల్లో పశుగ్రాసపు చెట్లను పెంచుకోవాలి. తోటల్లో ఆరుతడి పదునులో అలసందలు, స్టెలో వంటి పశుగ్రాసాలను సాగుచేయవచ్చు. నీరు నిలవ ఉన్న ప్రదేశాలలో, చెరువు గట్లపైన పారాగడ్డిని పెంచవచ్చు. పచ్చిక బయళ్ళలో సెంక్రస్ గడ్డిని, స్టెలోతో కలిపి సాగుచేస్తే మంచిది.

ఈ విధంగా వేసవికి అనువైన పశుగ్రాసాలను పాడి పశువులకు అందిసూ, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవిలో కూడా పాల దిగుబడి తగ్గకుండా, రైతులు లాభాలు పొందవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate