హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / ‘జీవామృతం’తో జవజీవాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

‘జీవామృతం’తో జవజీవాలు

జీవామృతం తయారీ,పిచికారీ విధానము

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు  ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు. వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి.. బీజామృతం, ఆచ్ఛాదన, నీటి యాజమాన్యం.

జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)

200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
10 కిలోల పశువుల (ఆవు, ఎద్దు, గేదెల) పేడ
5 నుంచి 10 లీటర్ల పశువుల మూత్రం
1 నుంచి 4 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్ఠమైనది)
కిలో పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి.. ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
పొలం గట్టు మట్టి.. పిడికెడు.

జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతోపాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు..  పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.

జీవామృతం తయారీ విధానం:

ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి.  పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. అప్పటి నుంచి వారం రోజుల్లోగా ఉపయోగించాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు.. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

పంటలపై జీవామృతం పిచికారీ ఇలా..

3 నెలల్లో (60-90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):

మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ. నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. ‘నీమాస్త్రం’ను కలిపి చల్లాలి.
నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు).

6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి):

మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్ల జీవామృతం కలిపి చల్లాలి.
రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ. నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి.
నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి.
ఐదోసారి: (30 రోజుల తర్వాత ) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి.
ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి.

ఆధారము: సాక్షి

3.00781686209
Vijay Feb 25, 2019 09:35 AM

It's very good knowledge for non IPM farmers.

రామాంజి May 16, 2016 07:51 PM

నీమాస్త్రం గురించి తెలియ చేయండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు