অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖచ్చిత వ్యవసాయం

ఖచ్చిత వ్యవసాయం

ఖచ్చిత వ్యవసాయం అంటే ఏమిటి ?

 • ఖచ్చిత సాగు లేదా ఖచ్చిత వ్యవసాయం అనేది ఆధునిక పరిజ్ఞానాలను, సేకరించిన పొలం సమాచారాన్ని సరైన సమయంలో, సరైన చోట, సరైన రీతిలో వాడే ఒక కొత్త పంథా. సేకరించిన సమాచారాన్ని  విత్తడానికి  కావలసిన  సరైన సాంద్రతనూ, ఎరువుల అవసరాలనూ, ఇతర వస్తువుల అవసరాలను అంచనావేయడానికి దిగుబడిని ఖచ్చితంగా అంచనావేయడానికి వాడతారు.
 • స్దానిక నేల, వాతావరణ పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఒక పంటకు అవశ్యమైన అలవాట్లను మానడానికి ఇది ఎంతో తోడ్పడ్తుంది. అంటే, ఇది పనివారిసంఖ్య, నారు, ఎరువులు, క్రిమి సంహారకాలవంటి   వాటి అనవసర ఖర్చులను నివారించి, నాణ్యమైన ఉత్పత్తులకు దోహదం చేస్తుంది.

ఖచ్చిత వ్యవసాయం ప్రాజెక్ట్ - తమిళనాడు

ఈ పథకం గురించి :

 • ఖచ్చిత వ్యవసాయం అనేది తొలిసారిగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో 2004-05లో ఆరంభమైంది. ఆరంభంలో 250 ఎకరాల్లో దీన్ని అమలు చేశారు. తర్వాత 2005-06లో 500 ఎకరాలకు, 2006-07లో 250 ఎకరాలకు దీన్ని అమలు చేశారు. ఈ పనికి తమిళనాడు ప్రభుత్వం బాధ్యతలను తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి  అప్పగించింది.
 • డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రు. 75000, పంటల ఉత్పత్తికి 40000 ఇవ్వడం జరిగింది. మొదటి సారి పంటవేయడానికి శాస్త్రజ్ఞుల పూర్తి సహకారాన్ని విశ్వవిద్యాలయం అందించింది. ఆ తర్వాత వరసగా 5 పంటలను రైతులే 3 ఏళ్లలో  స్వయంగా వెయనారంభించారు.
 • మొదటి సారి పంటవేయడానికి రైతులు సుముఖతే చూపలేదు. కారణం, 2002 నించి వరసగా 4 ఏళ్లు కరువు రావడంవల్ల  వ్యవసాయం పట్ల వారికి అప్పటికే ఒకరకమైన విముఖత ఏర్పడింది. ఐతే, తొలి 100మంది రైతుల విజయాన్ని , మార్కెట్లో హెచ్చుధర పలకడాన్నీ చూశాక రైతులు క్రమంగా రెండు(90 శాతం సబ్సిడీ), మూడు(80 శాతం సబ్సిడీ),  సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో తమ పేర్లను ఈ ప్రాజెక్ట్  కింద నమోదు చేసుకోవడానికి ముందుకు రావడం ఆరంభించారు.

 

పరిజ్ఞానాలు

ఉపగ్రహాధార భూమి సంబంధ మ్యాపులు :

ఎరువుల వాడకం, నేలనిర్వహణల కోసం ఉపగ్రహాధార భూమి సంబంధ మ్యాపులను వాడటం జరిగింది. దీనివల్ల పంటవేయడానికి నిర్ధారించిన భూమిలో పోషక విలవలేపాటి ఉన్నాయో తెలుసుకోవడానికి వీలు ఏర్పడింది.

ఉలితో దున్నడం:

చాలా కాలంగా ట్రాక్టర్ల వాడకంవల్ల, నీటిని ముంపుగా పెట్టడం వల్ల నేలలో పై పొర 45 సెం.మి దాకా గట్టిపడిపోయింది. ఇది నీరు సరిగ్గా పారడాన్ని నింరోధిస్తుంది, గాలి సరిగ్గా పారనీయదు. దీన్ని నివారించడానికి నేలను ఉలితో దున్నడం మంచి పద్ధతి. ఏడాదికి రెండు సార్లు ఇలా చెయడం మంచిది.

డ్రిప్ ఇరిగేషన్ :
 • డ్రిప్ వరసలను  1.5 x 0.6   మి. ఖాళీ జాగాతో ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి.
 • ఒక ఎకరానికి కావలసిన నీరు, ఎరువుల అవసరం తగ్గుతుంది.
 • నేలపై పొర పొడిబారి ఉండటంవల్ల కలుపు తాకిడి తగ్గుతుంది.
 • నేలలో సరైన చెమ్మ, గాలి  నిర్వహణవల్ల పూలు, పండ్లు రాలిపోవడం తగ్గుతుంది.
 • గాలిలో తేమ శాతాన్ని 60 శాతం కన్నా తక్కువగా నిర్వహించి ఉంచడంవల్ల  పంటకి చీడపట్టడం, రోగాలు రావడం తగ్గుతుంది.
 • 40 శాతం అదనంగాగాలిపారడంవల్ల మొదలు పెరుగుదల వేగతరమౌతుంది.

సమూహ నర్సరీ:

ఖచ్చితసాగు చేసే రైతులు విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల సలహాలతో 100 శాతం ఆరోగ్యదాయకమైన కాయగూరల విత్తులనుత్పత్తి చేయడానికి సమూహ నర్సరీలను అభివృద్ధి చెస్తారు.

చీడ, వ్యాధుల నియంత్రణ:

వాతావరణ పరిస్థితులు, అవసరాన్నిబట్టి క్రిమిసంహారకాలను, బూజుని నివారించే మందుల వాడకం వల్ల ఖర్చులో మూడోవంతు ఆదా అయ్యింది.

ఖచ్చిత రైతు సంఘం

ప్రతి 25 నించి 30 మంది లబ్దిదారులైన రైతులు ఒక రిజిస్టరు చెసిన ఖచ్చిత సాగు రైతు సంఘంగా ఏర్పడటం జరిగింది. ఈ సంఘాలు కింద చెప్పిన వివిధ రకాల పనులలో పాల్గొంటాయి :

 • ముడి సరకులు కొనడంలో  వ్యవసాయ వ్యాపారస్థులతో బేరసారాలు సాగించడం.
 • నిర్ణీత సమయాలకుకాయగూరలను  పండించే అవకాశాలను చర్చించడం.
 • వివిధ మార్కెట్లను సందర్శించి మార్కెట్‌ సమాచారాన్ని పోగుచేయడం
 • తమతమ అనుభవాలను తోటి సభ్యులతో పంచుకోవడం
 • ఖచ్చిత సాగులో తమతమ అనుభవాలను తమిళనాడు రాష్ట్రం వెలుపలనించి వచ్చినవారితో పంచుకోవడం.

మార్కెటింగ్‌ ఏర్పాట్లు

 • ఉత్పత్తులకు మార్కెట్‌ లో హెచ్చు ధర పలికేలా శాస్త్రజ్ఞులు సాయం చేశారు. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి పంటలు ఎంపిక చెయడం, సరైన సీజన్‌లో వాటిని పండించడం జరిగింది.
 • టిఎన్‌ఏయు నిపుణుల సాయంతో ఒక ప్రత్యేకమైన లోగో కూడా ఏర్పాటు చేశారు. దానిని ఖచ్చితసాగు ప్రాంతాలనుంచి మార్కెట్‌చెసే ఉత్పత్తులకు వాడతారు.
 • వాటి నాణ్యత మూలంగా,  ఖచ్చితసాగు ప్రాంతాలనుంచి వచ్చే ఉత్పత్తులకు అన్ని మార్కెట్లలో హెచ్చు ధరలు పలుకుతున్నాయి.

డా. ఇ. వడివెలు
నోడల్‌ అధికారి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్‌స్టెన్షన్‌
తమిళనాడు ప్రెసిషన్‌ ఫార్మింగ్‌ ప్రాజెక్ట్‌
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం
కోయంబత్తురు - 641 003, తమిళనాడు
ఫోన్‌  : 0422-6611233
ఇ - మేయిల్‌  : dee@tnau.ac.in

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

భూసార పరీక్షలు

భూసార వివరాలు

నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణం లో నేలలో సహజంగా వుంటాయి. అయితే వీటిలో ఎంతో వ్యత్యా సాలు ఉండే అవకాశం వుంది. నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంత అవసరమో నిర్దారించి ఎరువులు వాడాలి. కావున భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

భూసార పరీక్షల ముఖ్య ఉద్ధేశ్యము :

 1. నేలలో సహజంగా వున్న పోషకాల స్థాయిని తెలుసుకొని, వేయబోవు పంటలకు ఎరువుల మోతాదులను నిర్ణయించుటకు.
 2. చౌడు, ఆమ్ల గుణాల స్థాయిని నిర్దారించి సరిచేయుటకు. తద్వారా అధిక దిగుబడులు సాధించడానికి.

భూసార నమూనాల సేకరణ

పొలమంతా ఒకే రకంగా వున్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక్క నమూనా చొప్పున తీయాలి. మట్టినమూనా తీయదల్చిన పొలంలో 10 నుండి 12 చోట్ల మట్టి సేకరించాలి. మట్టినమూనా తీయదల్చిన చోట నేలపై వున్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేయాలి.
పార ఉపయోగించి “ v ’’ ఆకారంలో 6 – 8 అంగళాలు (15 సెం.మీ) అంటే నాగటి చాలంతా గుంత తీయాలి. పై నుంచి దిగువ వరకు ఒకే మందంలో పలచని పొరవచ్చే విధంగా మట్టిని తీయాలి. ఇలా అన్ని చోట్ల నుండి సేకరించిన మట్టిని గోనెపట్టా, పాలీధీన్ పట్టా లేదా గట్లమీద వేసి మట్టి గడ్డలు చిదిమి బాగా కలిపి చతురస్రాకారంగా పరచి నాలుగు సమ భాగాలుగా విభజించాలి. ఎదురు, ఎదురుగా ఉన్న 2 భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని తీసివేయాలి. మరల నాలుగు బాగాలుగా చేయాలి .
ఈ విధంగా అరకిలో మట్టి నమూనా మిగిలే వరకు చెయ్యాలి. పండ్ల తోటలు వేయదలచిన పొలంలో చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందులో 3 అడుగుల గొయ్యితీసి ప్రతీ అడుగుకు పై నుండి క్రిందికి ఒక్క మట్టినమూనా చొప్పున సేకరించి వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి.
నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో గాని, ఫ్లాస్టిక్ సంచిలో గాని నింపాలి. సంచి లోపల రైతు పేరు, తండ్రి పేరు, గ్రామము, సర్వే నెంబరు, వేయదలచిన పంట మొదలగు వివరాల లో. మట్టినమూనాను దగ్గరలో వున్న భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి.

మట్టి నమూనా సేకరించటంలో మెళకువలు

 1. చెట్ల క్రింద, గట్ల ప్రక్కన, కంచెల వద్ద, కాలిబాటల్లో నమూనాలు తీయకూడదు, బాగా సారవంతమైన చోట్ల, మరీ నిస్సారవంతమైన చోట్ల మట్టిని కలిపి తీయకూడదు.
 2. సమస్యాత్మక భూముల్లో నమూనాలు విడిగా తీయాలి, రసాయన ఎరువులు వేసిన 45 రోజుల లోపు నమూనాలు తీయకూడదు.
 3. నమూనా తీసేటప్పుడు నేలపై నున్న ఆకులు చెత్తాచెదారము తీసివేయాలి, నీరు నిలిచి బురదగా వున్న నేల నుండి నమూనా తీయకూడదు. తప్పని సరిగా తీయవలసి వచ్చినపుడు నీడన ఆరబెట్టి పరీక్షా కేంద్రానికి పంపించాలి.
 4. మెట్ట / ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసినపుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి, చౌడు భూముల్లో 0 – 15 సెంమీ, 15 - 30 సెంమీ లోతులో రెండు నమూనాలు తీయాలి.

భూసార పరీక్షకు ఇదే సమయం

భూ భౌతిక, రసాయనిక లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎన్ని ఎరువులు వాడినా రైతులు ఆశించిన పంట దిగుబడులు పొందలేకపోతున్నారు. రైతులు భూ స్వభావానికి అనువైన పంటలు పండించాలి. అలాగే పంటకు అనుగుణంగా భూ స్వభావాన్ని, భూసార స్థితిని మార్చుకోవాలి. ఈ రెండు విషయాలపై అవగాహన ఏర్పడాలంటే రైతన్నలు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. అందుకు ఈ వేసవి కాలమే అనువైన సమయం.

భూసార పరీక్ష అంటే...
రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు భౌతిక, రసాయనిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నమూనాలలోని సస్య పోషక పదార్థాల పరిమాణాన్ని లెక్కగడతారు. ఆ తర్వాత వివిధ పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వేసుకోవాల్సిన ఎరువుల్ని, వాటి మోతాదుల్ని సిఫార్సు చేస్తారు.

మట్టి నమూనా ఎప్పుడు తీయాలి?
పొలంలో పైరు లేకుండా ఉండే వేసవి కాలంలో మట్టి నమూనా తీయడం మంచిది. పంట వేసే ముందు లేదా పైరు కోసిన తర్వా త నమూనాలు తీయవచ్చు. మాగాణి భూముల్లో నీరు పెట్టకముందే నమూనాలు సేకరించాలి. ఎరువులు వేసిన నెల రోజుల తర్వాత మాత్రమే నమూనాలు తీసుకోవాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు మట్టి పరీక్షలు చేయించి, వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆ పరికరాలు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

ఎలా తీయాలి?
పొలానికి ఒక నమూనా సరిపోతుంది. అయితే పొలం మరీ పెద్దదిగా ఉంటే ప్రతి అయిదు ఎకరాలకు ఒక నమూనా చొప్పున తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు నీటి పారుదల సౌకర్యం, నేల ఏటవాలు, స్వభావం, పంటల సరళి, యాజమాన్య పద్ధతులు వంటి విషయాల్లో తేడా ఉన్నట్లయితే పొలం చిన్నదైనప్పటికీ వేర్వేరు నమూనాలూ సేకరించాల్సిందే.
నమూనాల సేకరణకు ముందు నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు వంటి వాటిని తీసేయాలి. పలుగు/పార ఉపయోగించి మట్టిని సేకరించవచ్చు. ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో 6-8 అంగుళాల లోతులో గొయ్యి తవ్వాలి. అందులో పక్కగా అంగుళం మందాన గొయ్యి అడుగు అంచు వరకూ మట్టిని తీయాలి. దీనిని ఉప నమూనా అంటారు. ఇదే విధంగా 8-10 చోట్ల ఉప నమూనాలు సేకరించాలి. వాటిని ఒక శుభ్రమైన బకెట్‌లో వేసి బాగా కలపాలి. తడిగా ఉన్నట్లయితే మట్టిని నీడలో కాగితం లేదా గుడ్డ పైన ఆరబెట్టాలి. ఆ తర్వాత మట్టిలో గడ్డలు ఉంటే వాటిని పగలగొట్టి బాగా కలపాలి.

అనంతరం మెత్తని మట్టిని ఒక పొరగా చదును చేసి నాలుగు సమాన భాగాలుగా విభజించాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకొని, మిగిలిన మట్టిని పారేయాలి. ఈ విధంగా రెండు మూడు సార్లు చేసి అర కిలో మట్టి నమూనా వచ్చే వరకూ వేరు చేయాలి. ఆ తర్వాత నమూనాను శుభ్రమైన చిన్న గుడ్డ సంచి/ప్లాస్టిక్ కవరులో నింపాలి. రైతు పేరు, గ్రామం, భూమి సర్వే నెంబరు, గతంలో వేసిన పంట వివరాలు, నీరు-ఎరువుల యాజమాన్యం, రాబోయే సీజన్‌లో వేయదలచుకున్న పంట, నమూనా సేకరించిన తేదీ తదితర వివరాలన్నీ ఒక మందపాటి కాగితం పైన రాసి ఆ కవరు లోపల పెట్టాలి. అనంతరం స్వయంగా లేదా పోస్ట్ ద్వారా లేదా మండల వ్యవసాయాధికారి ద్వారా భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.

ఎంత లోతు నుంచి తీయాలి?
పొలంలోని మట్టినంతా పరీక్షించడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని మట్టి నమూనాల్ని సేకరించాలి. ఎంత లోతు నుంచి నమూనాను సేకరించాలనేది మనం పండించే పంట, నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పైరు పంటలకు ఆరు అంగుళాలు, పండ్ల తోటలకు అయిదు నుంచి ఆరు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి మట్టిని సేకరించాలి. కారు చౌడు, ఆమ్ల నేలలైతే మూడు అడుగుల లోతు (అడుగుకు ఒక నమూనా చొప్పున) నుంచి నమూనాలు తీసుకోవాలి.

ఈ భూముల్లో సేకరించొద్దు
మట్టి నమూనాల్ని అప్పుడే ఎరువులు వేసిన పొలం, పెంట కుప్పలు వేసిన స్థలం, నీటిలో వుునిగి ఉన్న ప్రదేశం నుంచి సేకరించకూడదు. గట్లు, చెట్లు, బావులు, రహదారులకు దగ్గరగా నమూనాల్ని తీసుకోకూడదు.

కేంద్రాలు ఎక్కడున్నాయి?
ప్రతి జిల్లా కేంద్రంలోనూ వ్యవసాయశాఖ వారి భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి రెవెన్యూ డివిజన్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా నమూనాల్ని పరీక్షించి, సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తారు.

ప్రయోజనాలివే
భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషక పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. మీ పొలంలో ఏ పంట వేయవచ్చో, దాని నుంచి ఎంత దిగుబడి సాధించవచ్చో తెలుసుకోవచ్చు. సాగుకు అనువుగా లేని కారు చౌడు, ఆమ్ల భూముల స్థాయిని, ఆ భూముల్ని సాగు యోగ్యంగా వూర్చడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షలో వెల్లడైన అంశాలను బట్టి భూమికి ఏయే ఎరువులు ఎంత మోతాదులో, ఏ రూపంలో వేయాలో తెలుసుకోవచ్చు. ఎరువుల్ని అవసరమైన మోతాదులోనే వాడతాము కనుక వృథా ఖర్చు తగ్గుతుంది. ఈ పరీక్షల వల్ల నేల రంగు, స్వభావం, ఆమ్ల -క్షారాలు, సేంద్రియ కర్బన పరిమాణాల గురించి తెలుసుకోవచ్చు. రైతు కోరితే సూక్ష్మపోషకాల లభ్యత గురించి కూడా తెలియజేస్తారు.

-బెరైడ్డి సింగారెడ్డి, ఎమ్మెస్సీ అగ్రికల్చర్,
అగ్రానమిస్ట్, ఖమ్మం, ఫోన్: 9440797854

ఆధారము: రైతు బ్లాగ్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate