హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / వేసవిలో సాగు-ఎల్లంపల్లి జలాశయ పరికివాహక ప్రాంతాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేసవిలో సాగు-ఎల్లంపల్లి జలాశయ పరికివాహక ప్రాంతాలు

ఎల్లంపల్లి జలాశయం వల్ల వేసవిలో సాగు

మంచిర్యాల పట్టణం, లక్సెట్టిపేట, న్యూస్‌టుడే: పూడుకు పోయిన కడెం కాల్వలు... వేసవి వచ్చిందంటే అడుగంటే భూగర్భ జల మట్టాలు... తలాపున గోదావరి పారుతున్నా తీర గ్రామాల రైతాంగం సాగునీటి కష్టాలు మాత్రం తీరేవి కావు. ప్రస్తుతం సాగునీటి కటకటతో కునారిల్లిన గ్రామాలపై ఎల్లంపల్లి జలాశయం రూపంలో గోదారమ్మ కరుణించింది. జలాశయ నిర్మాణం పూర్తవడంతో పరివాహక గ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరిగింది. ప్రస్తుతం మండు వేసవిలో సైతం రెండో పంటగా వరిని సాగు చేస్తుండటం గమనార్హం. కరెంటు ఉంటే బావుల్లో నీరుండక.. బావుల్లో చాలినంత నీరు ఉన్నా కరెంటు కోతలతో సతమతమైన రైతాంగానికి జలాశయంలో తగినంత నీరు వచ్చి చేరడానికి తోడు తగినంత విద్యుత్‌ సరఫరా అవుతుంటంతో లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లోని గోదావరి తీర గ్రామాలు వేసవిలోనూ పచ్చదనాన్ని పర్చుకుని కనులవిందు చేస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండు సంవత్సరాలుగా కడెం చివరిఆయకట్టులో ఖరీఫ్‌లో సైతం సాగునీరందక నియోజక వర్గంలోని చాలా గ్రామాల్లో కరువు ఛాయలు కనిపిస్తుండగా మండు వేసవిలో రెండో పంటగా వరి సాగు చేయడం విశేషం.

పూర్తి స్థాయిలో నిలువ చేస్తే మరింతమేలు
ఎల్లంపల్లి నిర్మాణం కారణంగా జలాశయాన్ని ఆనుకుని ఉన్న లక్సెట్టిపేట, మోదెల, ఇటిక్యాల, పోతపల్లి, సూరారం, గుల్లకోట, మిట్టపల్లి గ్రామాలతోపాటు మంచిర్యాల మండలం పడ్తనపల్లి, కర్ణమామిడి, రాపల్లి, నర్సింగాపూర్‌ గ్రామాలకు దండేపల్లి మండలంలోని గూడెం, రంగంపల్లి, నంబాల, వెల్గనూరు, ద్వారక గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. జలాశయం పూర్తి నీటి మట్టం దాదాపు 21 శతకోటి ఘనపుటడుగులు కాగా పునరావాస పనులు పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో స్పిల్‌వే వరకు మాత్రమే నీరు నిలిపి ఉంచారు. ప్రస్తుతం జలాశయంలో కేవలం ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నప్పటికీ పరివాహక గ్రామాల్లో చాలావరకు భూగర్భ జలమట్టం పెరిగింది. దీంతో లక్సెట్టిపేట మండలంలోని లక్సెట్టిపేట, ఇటిక్యాల, మోదెల, పోతపల్లి, సూరారం గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగగా బావుల్లో తగినంత నీరు చేరి రెండో పంటకు ఆస్కారం ఏర్పడింది. పునరావాస పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో 21 టీఎంసీల మేర పూర్తి స్థాయిలో నీరు నిలువ చేయగలిగితే నియోజక వర్గంలోని మంచిర్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతాంగానికి సాగు నీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది.

పంటలు పండుతున్నాయి

కట్ల చద్రయ్య, రైతు, సూరారం,
కొంత భూమిలో వరిపంట, మరికొంత భూమిలో కూరగాయాలు, ఆకు కూరలు వేశాం. ఎల్లంపల్లి జలాశయంతో ఇటిక్యాల గ్రామ శివారులోని గోదావరినదిలో నిండుగా నీళ్లు ఉన్నాయి. వ్యవసాయ బావుల్లో ఉన్న నీటిని కరంటు పంపులు పెట్టి పంటలు పండిస్తున్నాం. ఈసారి వరిపొలాలు బాగా పండుతున్నాయి. ఇక్కడ పండించిన కూరగాయాలు మంచిర్యాల మార్కెట్‌కు తరలిస్తున్నాం.

బావుల్లో సమృద్ధిగా నీరు

గోర్ల పోచయ్య, రైతు, ఇటిక్యాల,
ఎల్లంపల్లి జలాశయంలో నీళ్లు ఆపడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బావుల్లోకి గోదావరి వూట నీరు ఎక్కుగా వచ్చి చేరుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నాను. గతంలో రెండో పంటకు సాగునీరు అందక ఎండిపోయి నష్టం వచ్చేది. ఇపుడు నీటి సమస్య లేదు. ఐదు ఎకరాల్లో వరి పొలం సాగు చేశాను. వ్యవసాయ బావిలో విద్యుత్‌ మోటార్‌ పెట్టి వరిపంట పండిస్తున్నాను.

ఆధారము : ఈనాడు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు