హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / ఎర్ర గొంగళిపై సమర భేరి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎర్ర గొంగళిపై సమర భేరి

ఎర్ర గొంగళి పురుగు నివారణ

  • పరిశోధనకు తిరుపతి శాస్త్రవేత్తల శ్రీకారం


పచ్చటి పంటలపై ఎర్ర గొంగళి పురుగు దాడి రైతులను హడలెత్తిస్తోంది. రసాయన మందులను సైతం లెక్కచేయని ఎర్రగొంగళిని ప్రారంభ దశలోనే అంతం చేసేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఆధునిక పరిజ్ఞానంతో లింగాకర్షక ఎరలద్వారా ఎర్రగొంగళి అంతానికి తిరుపతి వ్యవసాయ శాస్త్రవేత్తలు పంతంపట్టారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో చేపట్టిన పరిశోధనలు ఫలిస్తే ఎర్రగొంగళి నుంచి వేరుశనగ, కూరగాయల రైతులకు రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆంధ్రప్రదేశలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధికంగా పండే వేరుశనగ, కూరగాయ పంటలకు ఎర్రగొంగళి బెడద తీవ్రంగా ఉంది. ప్రధానంగా వేరుశనగపై తరచూ తామర పురుగు, పచ్చదోమ, ఆకుముడత పురుగుతోపాటు ఎర్ర గొంగళి దాడులు ఎక్కువ. అధికశాతం పంటను నష్టపరిచే ఎర్ర గొంగళి నివారణకు రైతులు పొలం గట్లపై మంటలు వేయడం, రాత్రివేళల్లో కాంతి ఎరలు ఏర్పాటు చేయడంవంటి చర్యలు చేపడుతున్నారు. అయినా ఎర్రగొంగళి నివారణలో విఫలమవుతున్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఎంటమాలజీ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ మురళీకృష్ణ ఆధునిక పద్ధతుల్లో ఎర్రగొంగళి నివారణపై దృష్టి సారించారు. ఈ దిశగా ఆయన చేపట్టిన ప్రాజెక్టుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాల్సిందిగా కోరుతూ తొలి విడత నిధులు కూడా మంజూరు చేసింది.

 

భూమి నుంచే బయటకు వచ్చే ఎర్ర గొంగళి

సాధారణంగా ఎర్రగొంగళి కోశస్థ దశలో భూమి లోపల దాగి ఉంటుంది. అనంతరం జూన్‌-జూలై మాసాల్లో కురిసే తొలకరి వర్షాలకు నేల తడిసే లోతునుబట్టి రెక్క పురుగులుగా బయటకు వస్తాయి. ఆ తర్వాత వాటి జీవన క్రమం మొదలై ఎర్ర గొంగళి పంటలపై తరచూ దాడులు చేస్తుందని శాస్త్రవేత్త మురళీకృష్ణ తెలిపారు. కోశస్థ దశ నుంచి రెక్క పురుగులుగా బయటకు వచ్చే ఎర్ర గొంగళి పురుగులు చీకటి పడిన తరువాత కనిపించే వెలుతురుకు బాగా ఆకర్షితమవుతాయి. దీంతో పొలం గట్లుపై చీకటి పడిన తరువాత రాత్రి 7- 10 గంటల మధ్య కాంతి ఎరల (లైట్‌ ట్రాప్స్‌)ను వినియోగించినట్లయితే రెక్కల పురుగులు అందులోకి వచ్చి మృతి చెందుతాయని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు ఇచ్చారు. కొందరు రైతులు విద్యుత్తు సౌకర్యం లేనప్పుడు పొలం గట్లుపై మంటలువేసి పురుగులను నివారించేందుకు అష్టకష్టాలూ పడుతున్నారు. అయితే ఈ విధానాలవల్ల పూర్తి స్థాయిలో ఎర్రగొంగళి ఉదృతిని తగ్గించలేమని తేలింది.

 

లింగాకర్షక ఎరలతో ఎర్ర గొంగళికి చెక్‌

ఎర్రగొంగళి పురుగును అంతంచేసేందుకు కాంతి ఎరల స్థానంలో లింగాకర్షక ఎరలను వినియోగిస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తేల్చారు. మొదటగా ఎర్రగొంగళి తల్లి పురుగులనుంచి లింగాకర్షక ఫెర్మోన్‌ (ఆకర్షక దేహ రసాయనం)ను సేకరించి అందులోని పదార్థాన్ని, వాసనలను గుర్తిస్తారు. ఆ తరువాత తల్లి పురుగుల ఫెర్మోన్‌కు ఏమాత్రం తేడా లేకుండా వివిధ రసాయన సమ్మేళనంతో కృత్రిమం గా తయారుచేస్తారు. అనంతరం పొలం గట్లపై ఏర్పాటు చేసే లింగాకర్షక ఎరల్లో ఈ కృత్రిమ ఫెర్మోన్‌ను ఉంచుతారు. లింగాకర్షక ఎరల్లోని ఈ పదార్థంపట్ల ఎర్రగొంగళి మగ పురుగులు ఆకర్షితమై చిక్కుకుపోవడటమేగాక బయటకురాలేక అక్కడే మృతిచెందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లింగాకర్షక ఎరలతో మగ పురుగులను అంతంచేస్తే పునరుత్పత్తి తగ్గించి క్రమేణా ఎర్రగొంగళి నివారణకు వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన విజయవంతమైతే పలు జిల్లాల్లో పంటలతోపాటు భూమిని నాశనంచేస్తున్న ఎర్ర గొంగళిని అంతం చేయవచ్చని వారు ఆశాభావంతో ఉన్నారు.
వేరుశనగ రైతులకు భరోసా

ఎర్ర గొంగళి తల్లి పురుగుల ఫెర్మోన్‌కు సరిసమానమైన కృత్రిమ రసాయనాన్ని తయారు చేసేందుకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత రసాయన సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన సంస్థ సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ముందుగా కృత్రిమ రసాయనం తయారుచేసుకుని, ఆ తరువాత పొలం గట్లపై లింగాకర్షక ఎరలను ఏర్పాటు చేయించి, మగ పురుగులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటాం. ఈ విధానంతో ఎర్ర గొంగళి పునరుత్పత్తిని నియంత్రించి పంటలపై దాడి జరగకుండా కాపాడగలమన్న నమ్మకం ఉంది.

- డాక్టర్‌ మురళీకృష్ణ, శాస్త్రవేత్త; ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, తిరుపతి
- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, తుమ్మలగుంట
3.00349344978
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు