హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / చెరకు చెత్తతో సేంద్రియ ఎరువు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చెరకు చెత్తతో సేంద్రియ ఎరువు

చెరకు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు

చెరకు చెత్తే కదా అని కాల్చేయొద్దు

చెరకు తోటలు నరికిన తర్వాత చాలా మంది రైతులు చెత్తను కాల్చేస్తుంటారు. అయితే దీనివల్ల వారికి ఎంతో నష్టం జరుగుతోంది. ఎందుకంటే ఈ చెత్త చెరకు పైరు సాగులో పలు రకాలుగా ఉపయోగపడుతుంది. చెరకు చెత్తను కాల్చేయడం వల్ల నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలనే కాకుండా భూసారాన్ని, భూ భౌతిక స్వభావాన్ని పెంచే సేంద్రియ పదార్థాన్ని కూడా నష్టపోతున్నాము.కాబట్టి చెరకు చెత్తను పైరులో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై రైతులు అవగాహన కలిగి ఉండడం అవసరం.చెరకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుళ్లబెడితే చివికిన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది పైరుకు పోషక పదార్థాల్ని అందిస్తుంది. చెరకు చెత్తను మొక్క, పిలక తోటల్లో వేసుకోవచ్చు.

ఎలా కుళ్లబెట్టాలి?

చెరకు చెత్తను కుళ్లబెట్టే శిలీంద్రాలు ఉంటాయి. రెండున్నర ఎకరాల తోటకు మూడు కిలోల శిలీంద్రాలు అవసరమవుతాయి. బాగా చివికిన పశువుల ఎరువు లేదా ఫిల్టరు మడ్డికి ఈ శిలీంద్ర సముదాయాన్ని కలపాలి. దానిపై పలచగా నీరు చల్లి నీడలో ఉంచాలి. దానిపై గోనె సంచి లేదా వరి గడ్డి కప్పాలి. ఆ తర్వాత శిలీంద్రం వృద్ధి చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. అనంతరం దానిని సాళ్ల మధ్య పరచిన చెరకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఆ సమయంలో కొద్దిపాటి తేమ ఉండాలి.

ఎలా వాడాలి?

పైన తెలిపిన విధంగా అభివృద్ధి చేసిన శిలీంద్ర సముదాయాన్ని మొక్క తోటల్లోనూ, కార్శి తోటల్లోనూ వాడుకోవచ్చు. మొక్క తోటల్లో అయితే ముచ్చెలు నాటిన మూడో రోజున చెరకు చెత్తను పొలంలో పలచగా పరవాలి. ఇందుకోసం ఎకరానికి సువూరు 1.25 టన్నుల చెత్త అవసరమవుతుంది. వర్షాకాలంలో కాలువలు ఎగదోసే సమయంలో 1.25 కిలోల శిలీంద్రం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌ను కలిపి ఆ మిశ్రవూన్ని ఎకరం విస్తీర్ణంలో పరచిన చెరకు చెత్తపై చల్లి మట్టితో కప్పాలి. అప్పుడు ఆ చెత్త మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది.

ఇక కార్శి (పిలక) పంట తీసుకునే వారు మొక్క తోటలు నరికిన తర్వాత చెరకు చెత్తను (ఎకరానికి 1.25 టన్నులు) సాళ్లలో వేసి, దానిపై ఎకరానికి 10 కిలోల చొప్పున సూపర్ ఫాస్ఫేట్, ఎనిమిది కిలోల యూరియా, 1.25 కిలోల శిలీంద్రం కలిపి చేనంతా కలిసేలా చల్లాలి.కార్శి మోళ్లకు ఆనుకొని లోతుగా నాగలితో దున్నినట్లయితే మొదళ్ల వద్ద ఉన్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు పుట్టుకొస్తాయి. అప్పుడు కొత్తగా వచ్చే పిలకలు బాగా మొలుస్తాయి. నేలలో వేసిన చెరకు చెత్త కుళ్లి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మిగిలిపోయిన చెరకు చెత్తను సాళ్ల మధ్య పలచగా పరచుకోవచ్చు.

ఉపయోగాలివే

చెరకు చెత్తను సాళ్లలో పరిచి, కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకుంటే పలు ప్రయోజనాలు చేకూరుతాయి. సాళ్ల మధ్యలో చెరకు చెత్తను కప్పితే తేమ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. వర్షాధారపు చెరకు సాగుకు ఇది ఎంతో ఉపయోగకరం.

సాళ్లలో చెత్తను పరిస్తే నాటిన/కార్శి చేసిన తొలి దశలో కలుపు మొక్కలు మొలవకుండా నివారించవచ్చు. అంతేకాదు... పీక పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.చెరకు చెత్తను కప్పడం వల్ల భూమిలో తేమ చాలా కాలం పాటు అలాగే ఉంటుంది. వేసవిలో తోటకు సరిగా నీరు పెట్టలేకపోయినప్పటికీ భూమిలో నిల్వ ఉన్న తేమ వల్ల పైరు వడలిపోదు. నీటి తడులు తక్కువగా ఇచ్చినా సరిపోతుంది. చెరకు చెత్తను కాలిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని సాళ్ల మధ్య పరవడం ద్వారా ఆ కాలుష్యాన్ని నివారించవచ్చు. పాల చౌడు, చౌడు భూముల్లో చెరకు చెత్తను సాళ్లలో పరిచి తేమను కాపాడి, భూమిలోని లవణాల్ని వేర్ల దగ్గరికి రాకుండా చేయడం వల్ల పైరు బలంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తుంది.

చెత్తను నేరుగా...

చెరకు చెత్తను నేరుగా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. టన్ను చెరకు చెత్తను కంపోస్ట్‌గా మార్చాలంటే మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల పొడవుతో గొయ్యి తీయాలి. అందులో 15 సెంటీమీటర్ల మందాన చెరకు చెత్త పరిచి, తేమగా ఉండేందుకు నీరు చిలకరించాలి.

దాని పైన పేడ నీటిని చల్లాలి. మళ్లీ దాని పైన కిలో శిలీంద్ర సముదాయం, ఎనిమిది కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి. ఆ తర్వాత ఒకటి రెండు సెంటీమీటర్ల మందాన మట్టి కప్పాలి. నాలుగు నెలల్లో చెరకు చెత్త కుళ్లి కంపోస్ట్‌గా మారుతుంది. దానిని నేరుగా పొలంలో వేసుకోవచ్చు. ఇలా పొరలు పొరలుగా చెరకు చెత్తను గోతిలో వేస్తూ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవచ్చు.

ఈ పోషకాలు లభిస్తాయి

చెరకు చెత్తలో 0.41 శాతం నత్రజని, 0.16 శాతం భాస్వరం, 0.72 శాతం పొటాష్‌తో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు 0.2 నుండి 0.9 శాతం వరకూ ఉంటాయి.- వలేటి గోపీచంద్
ఎమ్మెస్సీ అగ్రికల్చర్
ఆకాశవాణి, హైదరాబాద్

ఆధారము: రైతు బ్లాగ్

3.00115807759
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు