অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భూమిలోని శిలీంధ్రాల నివారణకు చేపట్టాల్సిన సమగ్రయాజమాన్య పద్దతులు

భూమిలోని శిలీంధ్రాల నివారణకు చేపట్టాల్సిన సమగ్రయాజమాన్య పద్దతులు

వివిధ పంటలలో భూమిలో ఉండె కొన్ని జాతుల శిలీంద్రాలు ప్రధానంగా రైజోక్టోనియా, స్ల్కిరోషియం, ప్యూజేరియం, వర్జీసీలయం, ఫిథియం, పైటాప్తేరా, సేవలోస్పోరియం లాంటివి భూమిలోపల భూమిపైన, భూమిపై ఉన్న పంట అవశేషాలపై, పంటలేని సమయంలో భూమిపై ఉన్న గడ్డి జాతులపై ఆవాసముండి, తదనంతర పంటలకు తెగుళ్ళను కలుగచేస్తుంటాయి. ఈ శిలీంద్రాలు భూమిలో ఆవాస మంటు దాదాపు అన్ని రకాల పంటలలో వరి, మొక్కజొన్న నూనెగింజలు, వేరుశనగ, పండ్లతోటలు, పూలతోటలు, కూరగాయల తోటలలో వివిధ రకాల తెగుళ్ళను కలుగచేస్తాయి. ఉదాహరణకు మొక్కజొన్నలో వడలు తెగులు, మసికాండం కుళ్ళు తెగులు, వేరుశనగలో వేరుకుళ్ళ మొదలు కుళ్ళు కాండం కుళ్ళు, కంది, పెసర, మినుములో ఎండు తెగుళ్ళు తెగులు ఉధృతిని బట్టి పంట నష్టం 70-90 శాతం కూడా ఉండవచ్చు.

పంటలపై ఈ తెగుళ్ళు వీటి ద్వారా, ఏదశలో, ఏ విధంగా వస్తాయన్న విషయంపై చాలా మంది రైతులు వూరిగా అవగాహన లేక నివారణలో విఫలమవుతున్నారు.

ఈ భూమి ద్వారా వచ్చే తెగుళ్ళనుండి పంటలను కాపాడటానికి రైతులు, సమగ్ర తెగుళ్ల యాజమాన్య పద్దతులైనటువంటి, మంచి సాగు పద్ధతులు అవలంబించడం, విత్తనశుద్ధి, పంటమార్పిడి, తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం, జీవ నియంత్రణ పద్ధతులు ఆచరించడం, సమగ్ర నీటి, ఎరువుల, కలుపు యాజమాన్యం, భూమిశుద్ధి వెుదలైన పద్ధతులపై అవగాహన కలిగి ఆచరించినట్లయితే ఈ తెగుళ్ళను అదుపులో ఉంచుకోవచ్చు.

సమగ్ర తెగుళ్ళ యాజమాన్యంలో భాగంగా రాబోయే పంట కాలంలో భూమిద్వారా వచ్చే శీలీంద్రాల తెగుళ్ళ నుండి పంటను కాపాడడానికి ప్రస్తుతమున్న పంట కోత సమయం నుండే సరి అయిన జాగ్రత్తలు పాటించాలి.

గత పంట, గడ్డిజాతి మొక్కల అవశేషాలను తొలగించడం

కోత సమయంలో పంట మొక్కలను / కుదుళ్ళను నేల మట్టానికి కోయాలి, పంట అనంతరం పొలంలో మిగిలిన పంట అవశేషాలను పొలంలో, గట్లపై మిగిలిన గడ్డిజాతి మొక్కలను పూర్తిగా నిర్మూలించాలి. ఎందుకంటే గత పంట అవశేషాలు, గడ్డిజాతి మొక్కలు తెగుళ్ళ కారకాలకు రిజర్వాయర్లుగా పనిచేసి తెగులు వ్యాప్తికి తోడ్పడుతాయి.

భూమిని లోతుగా దున్నటం

వేసవి కాలంలో శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ళ ఉధృతి తగ్గించడానికి తోడ్పడే అతి ప్రధాన ఆయుధం భూమిని లోతుగా దున్నడం. ఈ లోతు దుక్కులు బహుళ ప్రయోజన కారిగా ఉండి, పంటకు, భూమికి అనేక రకాలుగా ఉపయుక్తంగా ఉంటాయి.

దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్ళతో 9-10 అంగుళాల లోతు దుక్కులు దున్నాలి. ఇలా లోతు దుక్కులు వేసవిలో చేసినప్పుడు, నేలలో దాక్కునే లేదా నిద్రావస్థలో ఉండే తెగుళ్ళు కలుగ చేసే శిలీంధ్ర బీజాలతో పాటు, నులిపురుగులు, బ్యాక్టీరియా, కీటకాలకు సూర్యరశ్మి సోకుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్, మే నెలల్లో మండే అధిక ఉష్ణోగ్రతలు, దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ నుండి 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలకు ఈ తెగుళ్ళ కారకాలు చాలా వరకు నశించి తగ్గుతాయి. అంతే కాకుండా మొండిజాతి కలుపు మొక్కల కాయలు, వేర్లు, దుంపలు పెకిలింపబడి, వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు నశించే అవకాశం ఉంటుంది. నేల గుల్లబారి నీటిని పీల్చుకునే శక్తి పెరుగుతుంది.

సాయిల్ సోలరైజేషన్

భూమి ద్వారా సంకంరమించే తెగుళ్ళ ఉధృతిని తగ్గించడానికి పర్యావరణానికి, జీవరాశులకు నష్టం కలుగకుండా అందుబాటులోకి వచ్చిన రసాయనేతర పద్ధతి ఈ సాయిల్ సోలరైజేషన్ ఇది సులభమైన, సరళమైన, హానికరం కానీ సమర్థవంతమైన విధానం. దీనిని ఉద్యానవనాలు, పండ్లతోటలు, పూలు, కూరగాయలు, హరిత గృహాలు, ల్యాండు స్కేపింగ్ లోను ఉపయోగించవచ్చు.

ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో నేలను తడిపి, తేమ నేలను 25 మైక్రాన్ల దళసరి పారదర్శక షీట్తో కప్పాలి. షీట్ అంచుల నుండి గాలి చొరబడకుండా సీలింగ్ చేసి, షీట్ కింద తగినంత వేడిమి, తేమ నిలిచేలా 4-6 వారాలు కప్పి ఉంచాలి. ఈ విధంగా చేయడం ద్వారా నేలలో ఉష్ణోగ్రతలు పెరిగి, భూమి పైపొరలలో 30 సెం.మీ. లోతు వరకు ఉన్న శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, నులిపురుగులు నశిస్తాయి. భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడి, ఉపయుక్త జీవులైన మైకోరైజా, హానికర శిలీంధ్రాలపై దాడి చేసే బ్యాక్టీరియా, ప్రభావాన్ని చూపుతాయి.

భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం

ఈ విధానం అతి సులువైన, ఆర్థికంగాను ఆచరించదగినది. ప్రస్తుతం వివిధ పంటలలో ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలను అభివృద్ధి పరచి రైతులకు అందుబాటులో ఉన్నాయి.

ఉదాహరణ :

 • మొక్కజొన్నలో వడలు తెగులు, మసికాండం కుళ్ళను తట్టుకోవడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేసిన డి.ఎచ్.ఎం.-117, కరీంనగర్ మక్క-1 రకాలు అందుబాటులో ఉన్నాయి.
 • కందిలో ప్యూజేరియం ఎండు తెగులుకు పి.ఆర్.జి-158. ఆశ.
 • శనగలో ఎండుతెగులును తట్టుకొనే జె.జి-11, జాకీ 9218.

పంట మార్పిడి (క్రాప్ రొటేషన్)

పంట మార్పిడి చేయడం ద్వారా కూడా భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే తెగుళ్ళ ఉధృతిని తగ్గించవచ్చు. రెండు పంటలకు మించి ఏ ఒక పంటను ఒకే భూమిలో వేయకూడదు.

పరిశుభ్రమైన సాగు పద్దతులు

సాగులో ఉపయోగించే వివిధ యంత్రాలను, పనిముట్లను పరిశుభ్రంగా ఉంచాలి. తెగులు ఆశించిన పొలంలో వాడిన యంత్రాలను, పనిముట్లను శుభ్రపరచకుండా వేరే పొలంలో వాడితే పనిముట్లకు అంటిన మట్టిద్వారా శిలీంధ్ర కారకాలు ఆరోగ్యవంతమైన పొలానికి వచ్చే అవకాశం ఉంది.

సమగ్ర నీటి యాజమాన్యం

పంటకు అవసరం అయినంత వరకు మాత్రమే నీటి తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువైన లేదా తక్కువైన కూడా శిలీంధ్రాల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మొక్కజొన్నలో అధికంగా తేమ ఉన్నట్లయితే ఫిథియం స్టాక్రాట్, నీటి ఎద్దడి ఉన్నట్లయితే, మాక్రోపోమిన మసికుళ్ళు తెగులు, ఫ్యూజేరియం వడలు తెగులు వచ్చే అవకాశం ఉంది. కావున తగు మోతాదులో మాత్రమే పంటకు నీరు అందించాలి.

సమగ్ర ఎరువుల యాజమాన్యం

రసాయని ఎరువులను కూడా పంటకు తగు మోతాదులో సిఫారుసు మేరకు మాత్రమే వేయాలి. ఉదాహరణకు నత్రజని ఎరువుల మోతాదు ఎక్కువైతే తెగుళ్ళ ఉధృతి పెరుగుతోంది. పొటాషియం తక్కువైతే కూడా తెగుళ్ళ ఉధృతి పెరుగుతోంది. సమపాళ్లలో ఎరువును మొక్కలకు అందించినప్పుడు తెగుళ్ళను తట్టుకునే శక్తి మొక్కలలలో పెరుగుతుంది. సూక్ష్మపోషకాలను కూడా అవసరం ఉన్నంత వరకు పంటలకు అందించడం వలన తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది.

కలుపు నివారణ

సకాలంలో కలుపును నివారించడం వలన కూడా తెగుళ్ళ ఉధృతిని తగ్గించవచ్చు. వివిధ రకాల గడ్డిజాతి కలుపు మొక్కలు శిలీంధ్రాలకు ఉధృతికి దోహదపడతాయి. అందువల్ల సకాలంలో కలుపు తీయాలి.

విత్తనశుద్ధి

ఫార్మలేషన్గా అభివృద్ధి పరిచిన ఉపయుక్త జీవ శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియాను పొడి రూపంలో కానీ, ద్రవ రూపంలోగానీ విత్తనాలకు పట్టించి, నేల ద్వారా లేదా విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా చేసే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు. ఇలా విత్తనశుద్ధి చేయడం ద్వారా మొలకెత్తే విత్తనాలకు నేల ద్వారా లేదా విత్తనం ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడటంతో పాటు మొలక శాతాన్ని వృద్ధి చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో తెగుళ్ళను అదుపులో ఉంచవచ్చు.

ఉదాహరణ:

 1. వరి : కిలో వరి విత్తనానికి 3 గ్రా. కార్చండిజమ్ కలిపి విత్తనాన్ని 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. లేదా దంపనారు మడికైతే లీటరు నీటికి ఒక గ్రా. కార్భండిజమ్ను కలిపిన నీటిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి మొలక వచ్చిన తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనం నానబెట్టడానికి లీటరు నీరు సరిపోతుంది.
 2. మొక్కజొన్న/ జొన్న/సజ్ఞ : కిలో విత్తనానికి 3 గ్రా, మాంకోజెబ్ లేదా ధైరం లేదా కాప్లాన్తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ళ బారినుండి కాపాడవచ్చు.
 3. కంది: 2 గ్రా. కార్చండిజమ్ కిలో విత్తనానికి
 4. వేరుశనగ : కార్చండిజమ్ 2-3 గ్రా. క్రితో విత్తనానికి లేదా, టెబుకొనజోల్ (రాక్సిల్) 5 గ్రా, కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా విత్తనశుద్ధి

జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటలను తెగుళ్ళు పురుగుల నుండి కాపాడడానికి ప్రకృతిలోని వివిధ జీవరాసులు ఉపయోగపడుతున్నాయి. వీటిలో భూమి ద్వారా వచ్చే తెగుళ్ళ నివారణకు శీలింధ్రం టైకోడెర్మా బ్యాక్టీరియా సూడోమోనాస్, బాసిల్లస్ ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా వృద్ధి చేసి మార్కెట్లో వివిధ రకాల ఫార్మలేషన్ పేరుతో రైతులకు అందుబాటులోకి వచ్చాయి. రెండు పంటలకు ఆశించే చాలా రకాల తెగుళ్ళ శిలీంధ్రాలను నాశనం చేసే శక్తి కలిగి ఉన్నాయి.

టైకోడెర్మా

ధాన్య పంటలు, అపరాలు, మిరప, నూనె గింజల పంటల్లో వేరుకుళ్ళ కాండం కుళ్ళు నివారణకు టైకోడెర్మా విరిడి కిలోకు 5-10 గ్రా. చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.

 • కూరగాయల పంటల్లో నారుకుళ్ళ, కాండం కుళ్ళు, వేరుకుళ్ళ నివారించడానికి లీటరు నీటికి 5 గ్రా, టైకోడెర్మా విరిడి చొప్పున కలిపి నర్సరీ బెడ్లను విత్తేముందు బాగా తడపాలి.
 • పత్తి, పసుపు, అల్లం, కంది, వేరుశనగ, టమాట, వంకాయ, మిరప, ఉల్లి, అరటి, ఇతర పంటలలో నేలల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు, వేరుకుళ్ళ తెగుళ్ళను సమర్థవంతంగా నివారించడానికి 2 కిలోల టైకోడెర్మా విరిడి కల్చరును 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి పది నుండి 15 రోజుల పాటు నీడలో అభివృద్ధి పరిచి తగినంత తేమ పొలంలో ఉన్నప్పుడు నేలలో వేసి కలియదున్నాలి.

సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్

అన్ని రకాల పంటలలో కూడా టైకోడెర్మా విరిడి మాదిరి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను విత్తనశుద్ధికి, పొలంలో చల్లుకొని భూమిలోని శిలీంద్రాలను తగ్గించుకొనవచ్చు. ఉదాహరణకు---

 1. మొక్కజొన్న : వడలు తెగులు నివారణకు కిలో విత్తనానికి 10 గ్రా, చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అలానే ఎకరానికి 3 కిలోల సూడోమోనాస్ ఫార్మలేషన్ 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కిలో కలియదున్నాలి.
 2. పత్తి - వేరుకుళ్ళ, ఎండు తెగులు : కిలో విత్తనానికి 10 గ్రా, చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అలానే ఎకరానికి 2.5 కిలోల సూడోమోనాస్ ఫార్మలేషన్ 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి నాటిన 30 రోజులకు పొలంలో చల్లుకోవాలి.
 3. అపరాలు : కిలో విత్తనానికి 6 గ్రా, కలిపి విత్తనశుద్ధి చేసిన భూమి ద్వారా వచ్చే ఎండు తెగుళ్ళను తగ్గించవచ్చు.
 4. అరటి - ఎండు తెగులు, ఆకు ఎండు తెగులు : ఎకరానికి 2.5 కిలోలు 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి నాటినప్పుడు, 3 నెలల తర్వాత పొలంలో చల్లుకోవాలి.

సప్రెన్సిస్ సాయిల్స్

వివిధ పంటలలో ఈ భూమి ద్వారా వచ్చే తెగుళ్ళను పరిశీలించినప్పుడు, కొన్ని పొలాల్లో ఈ శిలీంధ్రాల తెగుళ్ళ ఉధృతి బాగా ఎక్కువగా ఉండి మరికొన్నింటిలో చాలా తక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా ఆయా భూముల్లో ఉండే ఉపయుక్త జీవరాశులు, రసాయనిక లక్షణాల ఆధారంగా ఉంటుంది. తెగుళ్ళు తక్కువగా వచ్చే పొలాల నుండి మట్టిని సేకరించి, ఎక్కువ తెగుళ్ళు వచ్చే పొలంలో కలియదున్నడం వలన కూడా కొంత వరకు భూమి ద్వారా వచ్చే తెగుళ్ళను అదుపులో ఉంచుకోవచ్చు.

రసాయనిక పద్ధతులు

రసాయనిక శిలీంధ్ర నాశినులను విచ్చల విడిగా ఉపయోగించడం వలన భూమి ద్వారా పించే శిలీంద్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదు కాని పర్యావరణ కాలుష్యం ఏర్పడి మానవాళి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపడమే కాక, రైతులకు ఆర్థికంగా అధిక భారమవుతుంది. కావున తప్పని పరిస్థితుల్లో మాత్రమే శిలీంధ్రనాశిని ద్రావణంతో పొలంలో తెగులు సోకిన ప్రత్యేక ప్రాంతంలో భూమిని తడిపి కొంత వరకు తెగులు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. కానీ చిట్ట చివర ఆయుధంగా మాత్రమే రసాయనాలను భూమి ద్వారా ఆశించే శిలింద్రాల నివారణకు వాడాలి.

ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న తెగుళ్ళ యూజమన్య పద్దతులన్నింటిని సమపాళ్లలో సమర్థవంతంగా ఉపయోగించుకున్నట్లయితే, భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ, భూమి ద్వారా వ్యాపించే శిలీంద్రాలను కూడా పూర్తిగా, లాభ దాయకంగా కూడా నివారించవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate