অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మాఘీ జొన్న – యాజమాన్యంలో మెళకువలు

మాఘీ జొన్న – యాజమాన్యంలో మెళకువలు

magijonnaతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నల్గొండ, కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్న రైతు సోదరులు మాఘీ జొన్నను సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి తేలికపాటి, నల్లరేగడి నేలలు నాణ్యత ఎక్కువగా ఉండడం వలన మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఊ రెండు రాష్ట్రాలలో కొద్దిపాటి నీటి వసతి కలిగిన రైతు సోదరులు మాఘీజొన్నను సాగుచేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు.

మాఘీజొన్న పంటను సెప్టెంబర్ మొదటి వారంలో విత్తుకోవాలి. లేని పక్షంలో మొవ్వ చంపే ఈగ ఉదృతి అధికంగా ఉండి మొక్కల ,సాంద్రత పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ మాఘీ జొన్నకు అనువైన రకాలు, సంకర రకాలు అనేకం మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి -

  1. నంద్యాల తెల్లజొన్న-1 (ఎన్.టి.జె-1): ఈ రకం మాఘీ, రబీ పంటలకు అనువైనది. ఈ రకం 105-110 రోజులలో కోతకు వస్తుంది. ఇది బెట్టను తట్టుకొని ఒక ఎకరాకు 10-12 క్వింటాళ్ళు దిగుబడిని ఇస్తుంది. గింజరాలటంలో ఎలాంటి ఇబ్బంది లేనిది ఈ రకం.
  2. నంద్యాల తెల్లజొన్న-2 (ఎన్.టి.జె-2) : ఈ రకం కూడా మాఘీ, రబీ పంటలకు అనువైనది. పంట త్వరగా కోతకు వస్తుంది. ఎందుకంటే దీని కాలపరిమితి 95-100 రోజులు మాత్రమే. దీని గింజలు తెల్లగా ఉండి గింజలు సులువుగా కంకి నుండి రాలుతాయి. ఈ రకం సుమారు 12-14 క్విటాళ్ళ దిగుబడి ఒక ఎకరానికి వస్తుంది.
  3. నంద్యాల తెల్లజొన్న-3 (ఎన్.టి.జె-3) : ఇది బెట్టను తట్టుకొని, చొప్పకూడా ఎక్కువగా ఇచ్చే మాఘీకి, రబీకి అనువైన రకం. ఇది 100-105 రోజుల్లో ఒక ఎకరాకు 12-14 క్విటాళ్ళ దిగుబడి ఇస్తుంది. ఆకుపచ్చ తెగులును కూడా తట్టుకునే రకం.
  4. ఎన్-13 : జొన్న మల్లె సమస్య, బెట్ట సమస్య ఉన్న ప్రాంతాలకు అనుమైన రకం. తక్కువ కాలపరిమితి అంటే 95-100 రోజుల్లో కాపుకు వచ్చి ఒక ఎకరాకు 7-8 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. ఈ రకం జొన్న దిగుబడి కూడా అధికంగా ఉంటుంది.
  5. ఎస్-14 : ఈ రకం ఎన్-13 కంటే అధిక గింజ దిగుబడి (10-12 క్వి/ఎ), 110-115 రోజుల్లో కోతకు వస్తుంది.
  6. నంద్యాల తెల్లజొన్న – (ఎన్.టి.జె-4) : ఈ రకం మొవ్వ చంపు ఈగ, శనగపచ్చ పురుగు ఉధృతిని కొంత మేర తట్టుకుంటుంది. తక్కువ కాలంలో అంటే 90-98 రోజుల్లో పంట కోతకు వస్తుంది. దీని గింజ దిగుబడి 13-15 క్వి/ఎ ఉండి నల్లకాండం కుళ్ళు తెగులును కొంత మేరకు తట్టుకుంటుంది.
  7. mjtwoఎం.జె-278 (కిన్నెర) : ఈ రకం తెలంగాణలోని అన్ని ప్రాతాలకు అనువైనది. ఇది బెట్టకు తట్టుకొని 12-16 క్వి/ఎ గింజ దిగుబడిని ఇస్తుంది. దీని కాలపరిమితి 115-120 రోజులు.
  8. ఎం.35-1 : గింజలు, చొప్ప నాణ్యం కలిగిన రకం. ఈ రకం 115-120 రోజులు కలిగి 10-12 క్వి/ఎ దిగుబడిని ఇస్తుంది.

ఈదే కాకుండా ఇండియన్ ఇన్ట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, హైదరాబాద్ వారిచే విడుదల చేయబడిన సంకర రకాలు సి.ఎస్.ఎచ్-13 ఆర్., సి.ఎన్.ఎచ్-15 ఆర్ కూడా మాఘీ, రబీకి అనువైనది.

మాఘీ జొన్న పంటకు ఒక ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాలను వరుసకు వరుసకు మధ్య 45 సెం.మీ. దూరంలో, మొక్కకు మొక్కకు మధ్య దూరం 12-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. ఈ విత్తనాలను 3-5 సెం.మీ. లోతులో బోదెలకు మధ్య భాగంలో విత్తుకోవలి. ఇలా విత్తుకున్నట్లయితే మనకు ఒక ఎకరాకు సుమారుగా 68 వేల నుండి 72 వేల మొక్కలు ఉంటాయి.

జొన్న దున్నిన దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువును ఒక ఎకరాకి ఆఖరి దుక్కిలో వేసుకొని కలియదున్నాలి. ఈ మాఘీ జొన్న పంటకు విత్తే సమయంలో 16 కిలోల నత్రజని ఇచ్చే, 16 కిలోల భాస్వరానిచ్చే, 12 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత అంటే పైరు మోకాలు ఎత్తులో ఉన్నప్పుడు 16 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను పై పాటుగా వేసుకోవాలి.

విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను  తీసివేయాలి. దీనిని చేసేటప్పుడు ఎడమచేతి చూపుడు, మధ్య వేళ్ళను ‘వి’ ఆకారంలో ఉంచి మంచిగా ఉన్న మొక్కను ఈ వేళ్ళతో అదిమి పట్టుకొని మిగితా మొక్కలను తీసివేయాలి. ఇలా చేయడం ద్వారా ఉంచిన మొక్క వేర్లు కదలకుండా ధృఢంగా ఉంటాయి. కలుపు మొక్కలను అంతరకృషి ద్వారా తొలగించడమే ఉత్తమమైన మార్గం. ఒక వేళ కలుపు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అట్రజిన్ 50 శాతం మందుని ఎకరాకు 800 గ్రా. చొప్పున 200 నుండి 250 లీటర్ల నీటిలో కలిపి జొన్న విత్తిన తరువాత లేదా రెండవ రోజు భూమి తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. ఇలా చేయడం వలన పొలంలో 20 నుండి 25 రోజుల వరకు మనం కలుపు మొక్కల్ని సమర్థవంతంగా అదుపు చేయవచ్చు.

మామూలుగా అయితే జోన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో నీటి వసతి ఉన్నవారు 30-35 రోజులు (నాటిన తరువాత) పంట మోకాలి ఎత్తులో ఉన్నప్పుడు ఒకసారి, నాటిన 60 నుండి 65 రోజుల తర్వాత అంటే పొట్ట దశలో 70-75 రోజుల తర్వాత అంటే పూత దశలో చివరగా 90-95 రోజులకు అంటే గింజ పాలుపోసుకునే దశలలో తడులు ఇచ్చినట్లయితే అధిక దిగుబడి, నాణ్యమైన గట్టిగా ఉండే గింజలు తయారవుతాయి. ఈ పంటను ఆశించే పురుగుల్లో ప్రధానమైనవి మొవ్వ పంపు ఈగ, కాండం తొలిచే పురుగు, కంకి నల్లి, లద్దె పురుగు.

మొవ్వ చంపే ఈగ ఉధృతి పంట నాటిన మొదటి నెల వరకు ఉంటుంది. ఈ మొవ్వ చంపే ఈగ ఆశించిన మొవ్వ మొదటగా ఎండిపోయి తరువాత చనిపోయి చివరగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన మొవ్వ లాగినప్పుడు సులువుగా వస్తుంది. దీని ఫలితంగా ఆశించిన మొక్కలు అధికంగా పిలకలను వేస్తాయి. దీని నివారణకు గాను మొదటి మూడు వారాలలో వారానికి ఒకసారి అవసరాన్ని బట్టి 1.5 గ్రా. ధయోడికార్బ్ లేదా 2 మి.లీ. సైపర్ మెత్రిన్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నిర్ణీత సమయంలో పంటను విత్తుకోవాలి.

కాండం తొలిచే పురుగు ఉధృతి పంట విత్తిన 30 రోజుల తరువాత అధికంగా ఉంటుంది. ఈ పురుగు మొదట దశలో ఆకులపై గుండ్రని రంధ్రాలు ఏర్పరచుతుంది. తరువాత మొవ్వను చంపి తెల్ల కంకులను ఏర్పడేలా చేస్తుంది. దీని నివారణకు గాను కార్బోప్యూరాన్ 3 శాతం గుళికలు లేదా పొడి మందును వీలును బట్టి వాడుకోవాలి. గుళికలను మొక్క సుడులలో 4 క్వి/ఎ వేయాలి. లేదా పొడి మందును 8 క్వి/ఎ మొక్కలపై పిచికారి చేయాలి.

గింజలు పాలుపోసుకునే దశలో కంకి నల్లి, లద్దె పురుగులు ఆశించి గింజలలోని రసాన్ని పూర్తిగా పీల్చి గింజలలో నొక్కులు లేదా పొట్టలను ఏర్పడతాయి. కార్బరిల్ 5 శాతం పొడి మందు 8 క్వి/ఎ చొప్పున కంకులపై చల్లి వీటిని నివారించుకోవచ్చు.

వర్షాకాలంలో సామాన్యంగా గింజలపై వచ్చే తెగులు గింజ బూజు తెగులు, గింజ పరిపక్వ దశలో వచ్చే వర్షాలు ఈ గింజ బూజూ తెగులును ధృతం చేస్తాయి. దీని నివారణకు గాను 2 గ్రా. కాప్టాన్, 2 గ్రా. అరియోఫంగిన్ మందులను 10 లీ. నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధితో పెండు నుండి మూడు సార్లు పిచికారి చేయాలి. ఇదే కాకుండా ప్రొపికొనజోల్ 0.5 మి.లీ. ఒక లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. గింజ పూర్తిగా ఏర్పడిన తర్వాత గింజ కింద భాగంలో నల్లని చార ఏర్పడుతుంది. ఇది గింజ పక్వాన్ని తెలియజేస్తుంది. ఈ చార ఏర్పడిన తరువాత ఆలస్యం చేయకుండా రైతుసోదరులు పంటను కోసుకున్నట్లయితే ఈ తెగులు నుండి జొన్న పంటను రక్షించుకోవచ్చు.

వర్షాకాలంలో పంట పూత దశలో చల్లని, తేమ నిండిన గాలులు, మబ్బులు పట్టిన ఆకాశం లాంటి వాతవరణ పరిస్థితులు తోడైతే తేనె బంక లేని బంకకారు తెగులు అధికంగా మొక్కలను ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన పూలు ఫలదీకరణం చేసుకోలేకపోతాయి. కనుక తీయ్యని బంకలాంటి పదార్థం కంకులపై నుండి కారుతుంది. ఈ తెగులు నివారణకు గాను 1 గ్రా. బెనలేట్ లేదా 2 గ్రా. మాంకోజెబ్ లేదా 0.5 మి.లీ. ప్రొపికొనజోల్ మందులను మార్చి మార్చి ఏడు రోజులలో రెండు సార్లు పిచికారి చేయాలి.

పంట కోతకు గింజ పరిపక్వ దశను సూచించే గింజ కింద భాగంలో ఉన్న నల్లటి చారను గమనించిన తర్వాత , కంకిలోని గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెలుపు రంగులోకి మారిన తరువాత కూడా పంట కోతకోయవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate