অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వినూత్న సస్యరక్షణ మందులు – వాడకంలో మెళకువలు

వివిధ పంటల్లో ఆశించే చీడపీడల నుండి తమ పంటలను కాపాడుకోవటానికి రైతులు ఎక్కువగా సస్యరక్షణ మందుల పైనే ఆధారపడుతున్నారు. వీటిని విచక్షణా రహితంగా వాడటం వల్ల మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు కలుషితం అవుతోంది. ఇది ఎన్నో ప్రాణాంతక వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ , కిడ్నీ, లివర్ , కళ్ళ జబ్బులు, చర్మ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, జన్యుపరమైన అవలక్షణాలు, పిండ మరణాలు, రక్తహీనత, నరాల బలహీనత, నపుంసకత్వం మరియు మానసిక రోగాలకు కారణమవుతుంది. ఇదే కాక పర్యావరణానికి, ఇతర జంతువులకు కలిగే హాని అపారం, రోగ నిరోధక శక్తి పెంపొందడం వల్ల క్రొత్త పురుగుల ఉధృతి పెరిగి సస్య రక్షణ మందుల వాడకం మరింత పెరిదే అవకాశం ఉంది. తద్వారా ఖర్చులు పెరిగి నికరాధాయం తగ్గి వ్యవస్సయం వ్యవసాయంగా మారి రైతు ఆత్మహత్యలకు దారి తీస్తుంది.

హానికారక పురుగు మందులు

  • ఆర్గానోక్లోరిన్స్ (డైకోఫాల్ , లిండేన్ మొదలగునవి)
  • ఆర్గానోఫాస్గేట్స్ (ఎసిఫేట్, క్లోరిఫైరిఫాస్, డైక్లోర్ వాస్ ట్రైయజోఫాస్, ఇధియాన్, డైమిథోయేట్, మలాథియాన్, మోనోక్రోటోఫాస్, ప్రొఫెనోఫాస్ మొదలగునవి).
  • కార్బమేట్స్ (కార్బరిల్, కార్బోఫూరాన్)
  • సింథటిక్ పైరథ్రాయిడ్స్ (సైపర్ మెథ్రిన్ , డెల్టామెథ్రిన్ , ల్యామ్డా సైహలోథ్రిన్ , ఫెన్ వలరేట్ )
  • నియోనికోటినాయిడ్స్(ఇమిడాక్లోప్రిడ్     థయామిథోక్సామ్ , క్లోథయానిడిన్ ,థయాక్లోప్రిడ్)
  • ఫినైల్ పైరజోల్ (ఫిప్రొనిల్)
  • నియోనికోటినాయిడ్స్ తరగతికి చెందిన మందులు మరియు ఫిప్రొనిల్ ముఖ్యంగా తేనెటీగలకు చాలా హానికారకంగా పరిశోధనాల్లో వెల్లడయ్యింది. దీనివల్ల పలు పంటల్లో పరపరాగ సంపర్కం తగ్గి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలి.

అంత హానికారకంకాని పురుగు మందులు

  • ఇప్పటి వరకు మార్కెట్ లో అందుబాటులో వున్న పురుగు మందుల్లో స్పినోశాడ్ , ఎసిటామిప్రిడ్ , కార్టాప్ హైడ్రోక్లోరైడ్ , డయాఫెన్ త్యురాన్ , వెట్టబుల్ సల్ఫర్ , టెబు ఫెనోజైడ్ , మిథాక్సీ ఫెనాజైడ్ , ఎమామెక్టిన్ బెన్ జోయేట్ , బ్యూప్రొఫెజిన్ , పైరిప్రాక్సిఫెన్ , పైమెట్రోజైన వంటి వాటి వల్ల ఎటువంటి అవలక్షణాలు నిరూపణ కాలేదు. అయినప్పటికి వీటి వాడకంలో తగు జాగ్రత్తలు అవసరం.

హానికారక తెగుళ్ళ మందులు

  • బినోమిల్, కాప్టాన్, క్లోరోథాలోనిల్, ధయోఫానేట్ మిథైల్ , థైరమ్ , హెక్సాకొనజోల్ , ప్రాపికొనజోల్, డైనోక్యాప్, ప్రొపినెబ్, కార్బండాజిమ్, ఇప్రొడయోన్, మాంకోజెబ్, ఎడిఫెన్ ఫాస్, ట్రెబ్యుకొనజోల్ .

అంతహానికారకం కాని తెగుళ్ళుమందులు

  • కాపర్ ఆక్సీక్లోరైడ్, ట్రైసైక్లోజోల్, మెటలాక్సిల్, వాలిడామైసిన్, స్ట్రాబ్యులిన్స్ (అజాక్సీ స్ట్రాబిన్, ట్రైప్లోక్సీ స్ట్రాబిన్, పైరాక్లోస్టాబిన్, క్రిసాక్స్మ్ మిథైల్). సరైన అవగాహన లేకుండా అనేక పురుగు మందులను ఒకేసారి లేదా పురుగు/ తెగుళ్ళ మందులను కలిపి కొట్టడం వల్ల మరిన్ని వ్యధుల బారిన పడే అవకాశం వుంది. కాబట్టి అందుబాటులో ఉన్న యాజమాన్య పద్ధతులను పాటించి, చివరి అస్త్రంగా మాత్రమే సస్యరక్షణ మందులను వాడాలి.

సస్యరక్షణ మందుల వాడకంలో జాగ్రత్తలు

  • వివరాలను పొందపరచిన రసీదును తీసుకోవాలి.
  • పంటకు సిఫారసు చేసిన మందులను సిఫారసు చేసిన మోతాదులోనే వాడాలి
  • తక్కువ వాడితే మందు పనిచేయదు. ఎక్కువగా వాడితే పురుగు త్వరగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది.
  • ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు కమ్మినప్పుడు, వర్షం కురిసే ముందు మందులు వాడరాదు.
  • పిచికారి చేసిన తర్వాత కనీసం 6 గంటలు వర్షం కురవరాదు. మంచు ఆరిన తర్వాతే పిచికారి చేపట్టాలి.
  • గాలికి వ్యతిరేక దిశఓ (ఎదురుగాలిలో) పిచికారి చేయరాదు.
  • పూతదశలో ఉన్న పైరులో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
  • సస్యరక్షణ మందులు నేరుగా పంపులొ పోయరాదు.
  • ఎకరాకి కావల్సిన ద్రావణాన్ని ఒకేసారి తయారుచేసుకుని పంపులో నింపే ముందు ప్రతీసారీ కలియబెట్టి వాడుకోవాలి.
  • మందు మోతాదు కొలవడానికి డబ్బామూతలు, ఇతర పద్ధతులుకాక, సూచించబడిన కొలమానుకనే వాడాలి.
  • చేతి పపులో అయితే 200లీటర్లు, తయ్ వాన్ పంపులో 150లీటర్లు, పవర్ పంపుతో 100లీటర్ల మందు ద్రావణం ఎకరా పొలానికి సరిపోతుంది.
  • మందు ద్రావణ పంపుని బట్టి మారినా ఎకరానికి వాడే మందు మోతాదు మారదు. ఉదా: ఎసిఫేట్ ఎకరాకు 300 గ్రా. అయితే, పంపేదయినా సూచించిన మోతాదును, పంపుకు పట్టే ద్రావణంలో కలిపి వాడుకోవాలి.
  • పిచికారి సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌజులు, ముక్కుకి కళ్ళకు రక్షణ కవచాలు విధిగా ధరించాలి.
  • పిచికారి అనంతరం వీటిని శుభ్రంగా కడిగి, బట్టలను ఉతికి, సబ్బుతో స్నానం చేయాలి.
  • మందులను పిచికారి చేసే సమయంలో నీరు త్రాగడం, ఆహారం తినడం, గుట్కాతినడం, పొగత్రాగడం వంటివి చేయరాదు.
  • ఆహార పంటలపైన, కూరగాయలు, పండ్లతోటల్లో పశుగ్రాస పంటలపై సస్యరక్షణ మందులు వాడినప్పుడు సఫారసు చేసిన వేచి ఉండవలసిన సమయం (సుమారు 7-10 రోజులు) తర్వాతనే కోసి మార్కెట్ కు పంపాలి.
  • పశువులను మేపకుండా జాగ్రత్త వహించాలి.
  • పంతకాలంలో 2-3 సార్లు పిచికారి చేయవల్సినప్పుడు ఒకే మందును కాకుండా మందులను మార్చి పిచికారి చేయాలి.
  • నిపుణుల సలహా లేనిదే 2-3 రకాల పురుగు లేదా తెగుళ్ళ మందులను కలిపి పిచికారి చేయరదు. లేకపోతే పైరు దెబ్బతినే అవకాశముంది.
  • కాలపరిమితి దాటిపోయిన మందులను పంటలపై వాడరాదు.
  • పంటలలో మొక్క మొలకెత్తిన తర్వాత అట్రాజిన్ లేదా 2,4-డి లేదా గ్లైపోసేట్ వంటి మందులు పిచికారి చేసేటప్పుడు హుడ్ వాడుకోవాలి.
  • స్ప్రేయర్ల వాడకంలో మెళకువలు
  • వివిధ పంపులకు సూచించిన మోతాదులోనే మందు ద్రావణాన్ని వాడాలి.
  • పంపును ఎప్పుడు మందు ద్రావణంతో పూర్తిగా నింపరాదు.
  • విధిగా పంపుకు కేటాయించిన జాలీ ద్వారానే మందు ద్రావణాన్ని పోయాలి.
  • స్ప్రేయర్ ను వాడే ముందు స్రేయర్ లోని వివిధ భాగాలను మంచి నీటితో శుభ్రం చేసుకొని, ముఖ్యంగా హాస్ పైపు, లాన్స్ ద్వారా నీరు బైటికి పడేవిధంగా సరిచూసుకోవాలి.
  • నాజిల్ నుండి నీరు ధారలా కాకుండా పొగమంచులా (చిన్న తుంపర్లలా) పడేవిధంగా చూసుకోవాలి.
  • పవర్ పంపు వాడినప్పుడు సూచించిన మేరకు నక్షత్రపు (ఎర్రమార్కు) మార్కు వద్ద ఉంచాలి. ఎట్టి పరిస్థితులలో సూదితోగానీ, దబ్బనంతోగానీ దాని రంధ్రాన్ని పెద్దది చేయరాదు.
  • పైరులో ఆశించిన పురుగు/ తెగుళ్ళను బట్టి స్ప్రేయర్ తోపిచికరిలో చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదా; వరిలో సుడిదోమ, పొడ తెగులు వంటివి ఆశించినప్పుడు మొక్కల మొదళ్ళపై పడేవిధంగా పిచికారి చేయాలి. అవసరమైతే పాయలు తీసి పిచికారి చేయాలి. మిరపలో నల్లి నివారణకు ఆకుల క్రింద భాగం తడిచేలా చూడాలి.
  • పవర్ స్ప్రేయర్ /తైవాన్ స్ప్రేయర్ వాడే ముందు తగిన సామర్ధ్యంతో పని చేయాలంటే, ఇంజన్ అయిల్ ను సరి చూసుకోవాలి.
  • కలుపు మందులు వాడేటప్పుడు విధిగా ఫ్లడ్ జెట్ నాజిల్ గాని, ఫ్లాట్ పాన్ నాజిల్ గాని వాడాలి.
  • పిచికారి అనంతరం స్ప్రేయర్లు, వాటి విడి భాగాలు ముఖ్యంగా నాజిల్ , త్రుప్పుపట్టకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.

మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ ,సస్యరక్షణమందుల అవశేషాల విభాగము, రాజేంద్రనగర్ , హైదరాబాద్ ,ఫోన్ నెం . 040- 20022457, 9949928831

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/12/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate