অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మిరప

మిరప

వాతావరణ పరిస్థితులు, సాగు నేల స్వభావము, నీటివనరులు, ప్రాంతీయ ప్రాధాన్యతలు, చీడపీడల ఉధృతి మరియు ఎగుమతుల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అనువైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.

నారుమడి యాజమాన్యం

 • మీటరు వెడల్పు, 15సెం.మీ ఎత్తులో తయారు చేసిన నారుమళ్ళలో శుద్ధి చేసిన విత్తనాన్ని వరుసలలో విత్తుకోవాలి.
 • విత్తన మోతాదు: సూటిరకాలు: 650గ్రా; సంకర రకాలు 80-100గ్రా.
 • నాటిన తొమ్మిదవ రోజు మరియు 15 వ రోజున నారు మళ్ళపై కాపర్ ఆక్సీ క్లోరైడ్ (3గ్రా/లీ) ద్రావణాన్ని పిచికారి చేసి మొక్కలను ఆశించే నారుకుళ్ళు తెగులు నివారించాలి.
 • ఆరు వారాల వయస్సుగల మొక్క్లలను ప్రధాన పొలం లో నాటుకోవాలి.

పొలం తయారీ – నాట్లు వేయడం

 • పొలాన్ని వేసవిలో లోతుగా దున్ని, ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కి వేప. పిండి, 150 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ నువేయాలి.
 • 90కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండి 2కి. ట్రైకోడర్మా శిలీంధ్రపు పొడిని కలిపి 10-15 రోజులు నీడలో వుంచి ;;శిలీంధ్రము వృద్ధి చెందిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసినట్లైతే తొలి దశలో మొక్కల నాశించే తెగుళ్ళ నుండి కాపాడవచ్చును.
 • 10 లీటర్ల నీటికి 5మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మరియు 10గ్రా కార్బండిజమ్ మందులను కలిపి ఆ ద్రావణంలో నారుని5 నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి.
 • పంటకరాలైతే పాదుకు రెండు మొక్కలు, సంకర రకాలై తే ఒక మొక్క చొప్పున వరుసల మధ్య 75సెం.మీ మొక్కల మధ్య 45సెం.మీ. దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

 • ఎకరానికి 120 కిలోల నత్రజని (260కిలోలయూరియా) 24కిలోల భాస్వరం (150కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్), 48 కిలోల పొటాష్ (80 కిలోల మ్యూరేట్ పొటాష్) ఎరువులు వేయాలి.
 • భాస్వరం మొత్తాన్ని ఆఖరి దుక్కిలో వేసి నత్రజని, పొటాష్ ఎరువులను దఫాలుగా అందించాలి, అంటే ఎకరానికి 65 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున నాటిన 30, 60, 90 మరియు 120 రోజుల వయస్సులో వేయాలి.
 • జీవన ఎరువులైన అజోస్పెరిల్లమ్, అజటో బాక్టర్, పి. యస్ .బి. మైకోరైజాలను ఎకరానికి 2 కిలోల చొప్పున వేసినట్లైతే మొక్క్లను కావల్సిన స్థూల/సూక్ష్మ పోషకాలు అందించడంలో దోహదపడతాయి. మరియు రసాయన ఎరువుల వాడకాన్ని 25% వరకు తగ్గించవచ్చు.

అంతరకృషి, కలుపు యాజమాన్యం

 • నాట్లు వేసి పెంచే మిరప తోటల్లో కలుపు నివారణకు 1-2 రోజుల ముందు పొలంలో ఎకరానికి 1.3లీ పెండి మిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలను బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
 • నాటిన 25-30 రోజులనుండి 15-20 రోజుల వ్యవధితో అవసరాన్ని బట్టి 23 సార్లు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేసి కలుపును నివారించాలి.

నీటి యాజమాన్యం

 • మిరప అధిక తేమను, బెట్టను తట్టుకోలేదు.
 • డ్రిప్ పద్ధతిలో నీరు, ఎరువులు ఆదా అవడంతో కాయ నాణ్యత పెరుగుతుంది.
 • బెట్టకు గురైనప్పుడు మొక్కల ఎదుగుదల కోసం లీటరు నీటికి 20గ్రా యూరియా మరియు 3-5 గ్రా పొటాషియం నైట్రేట్ ను కలిపి పిచికారి చేయాలి.

సస్య రక్షణ

రసం పీల్చు పురుగులు

తామర పురుగులు (పై ముడత) ఆకు అడుగు భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకు పోతాయి. పురుగులు లేత కాయల్ని గీకుటవలన కాయల మీద చారలుగా (పొలుసు) ఏర్పడుతుంది.

తెల్లనల్లి (క్రింది ముడత) పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడంవలన ఆకులు వెనుకకు ముడుచుకు పోయి తెరగవేసిన పడవ ఆకారంలో కనిపిస్తాయి.

పేనుబంక పురుగులు ఆకులు, లేత కొమ్మలను ఆశించి రసాన్ని పీల్చడం వలనమొక్కలు నీరసించి, గిడసబారు తాయి. ఈ రసం పీల్చు పురుగులు నేరుగా మొక్కలకు కల్గించే నష్టం కంటే ప్రమాదకరమైన వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేయడం ద్వారా ఎక్కువ నష్టాన్ని కలుగ చేస్తాయి.

సమగ్ర నివారణ

 • కిలో విత్తనాన్ని 8గ్రా. ఇమిడాక్లోప్రిడ్ తో శుద్ధి చేసి విత్తుకోవాలి. ముడత ఆశించని ఆరోగ్యవంతమైన నారును మాత్రమే నాటుకోవాలి.
 • సాధ్యమైనంతవరకు నారుమడిలో గానీ, ప్రధాన పంటలో గానీ ఫిప్రోనిల్ గుళికలు, వేప పిండిసిఫారసు మేరకు వేసి పై ముడతను, పేనుబంక పురుగులను అరికట్టాలి.
 • నాటే ముందు నారుని 10 లీటర్ల నీటికి 5 మి.లీ ఇమి డాక్లోప్రిడ్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
 • రసం పీల్చు పురుగులను సమర్ధవంతంగా నివారించాలంటే పురుగు మందులు ఆకుల అడుగు భాగాన్ని బాగా తడిచేలా పిచికారి చేయాలి.
 • పొలం చుట్టూ రెండు మూడు వరుసల్లో జొన్న, మొక్క జొన్న వంటి రక్షక పంటలను వేసినట్లైతే రసం పీల్చు పురుగులు నియంత్రణలో వుంటాయి. మిత్ర పురుగుల సంఖ్య కూడ పెరుగుతుంది.
 • నాటిన 30-35 రోజులలో పంట పూతకు రాక ముందు   స్ప్రింకర్లతో నీరు పెట్టి తామర పురుగులను సులువుగా  అదుపు చేయవచ్చును.
 • 5% వేపగింజల కషాయాన్ని పురుగు మందులతో కలిపి పిచికారి చేయడం ద్వారా రసం పీల్చు పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చును.
 • పిప్రోనిల్ (2మి.లీ/లీ), డైఫెన్ త్యురాన్(1.25గా/లీ), స్పై నోసాడ్ (0.25 మి.లీ/లీ) మందులను పిచికారి చేసి పై ముడతను నివారించాలి.
 • పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ (0.3లీ) థయోమి థాక్సామ్ (0.3గ్రా/లీ) లేదా అసిటామిప్రిడ్ (0.3 గ్రా.లీ) మందులను మార్చుతూ పిచికారీ చేయాలి.
 • తెల్లనల్లి(క్రింది ముడత) నివారణకు ప్రోపర్ గైట్ (2 మి.లీ/లీ)లేదా స్పైరోమెసిఫెన్ (1మి.లీ/లీ) 10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.

కాయతొలుచు పురుగులు

మిరపను ప్రధానంగా లద్దెపురుగు, శనగ పచ్చ పురుగు మరియు పచ్చరబ్బరు పురుగు ఆశిస్తాయి పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు పంట నష్టంఎక్కువగా వుంటుంది.

సమగ్ర నివారణ

 • పురుగు ఉధృతి తగ్గించడానికి మిరపను మొక్కజొన్న, సోయాచిక్కుడు, మినుము, పెసర పంటలతో మార్పిడి చేయాలి.
 • ఆముదం, బంతి వంటి ఎర పంటలను పొలంలో అక్కడక్కడ నాటుకోవాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి.
 • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి, పురుగు ఉనికిని, ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించి, సస్యరక్షణచేపట్టాలి.
 • ఎదిగిన లార్వాలను, గ్రుడ్ల సముదాయాన్ని గమనించి ఏరి  నాశనం చేయాలి.
 • ఎకరానికి 10 -15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసిన ట్లయితే, పక్షులు గొంగళి పురుగులను ఏరుకొని తింటాయి.
 • ఎన్ పి.వి. ద్రావణాన్ని ఎకరానికి 250 ఎల్ ఇ.హెచ్ , తగినంత నీటిలో ఒక కిలో బెల్లం, 100మి.లీ శాండో విట్ లేదా టీపాల్ తో కలిపి, సాయంత్రం వేళల్లో పిచి కారి చేయాలి.
 • ఎదిగిన లార్వాలను విషపు ఎరలను ఉపయోగించి నివారించవచ్చు.
 • ఆఖరి అస్త్రంగా 0.75 మి.లీ మొవాల్యూరాన్ లేదా0.25 మి,లీ స్పైనోసాడ్ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ ఫ్లూబెండమైడ్ 0.5 గ్రామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వేరు పురుగు:మొక్కల మొదళ్ళ వద్ద త్రవ్వి చూసినట్లయితే వేరుపురుగులను గుర్తించవచ్చును. పశువుల ఎరువు, వేప పిండితో పాటు 10-12 కిలోల కార్బో ఫ్యూరాన్ గుళికలు (3%) ఆఖరు వేసి, కలియ దున్ని ఈ పురుగును నియంత్రించాలి.

పూత పురుగు:పురుగు మొగ్గదశలో ఆశిస్తే, మొగ్గలు విచ్చుకోవు, పూత దశలో ఆశిస్తే పూత ఎండీ, రాలిపోతుంది. పిందెదశలో ఆశిస్తే, కాయలు వంకర్లు తిరిగి గిడసబారి పొతాయి.నివారణకు 5% వేపగింజల కషాయంతోలీటరు నీటికి 1.25మి.లీ ట్రైజోఫాస్ మందు కలిపి పిచికారి చేసి వారం రోజుల తరువాత విధిగా క్లోరిఫైరిఫాస్ మందు (2.5 మి.లీ/లీ) పిచికారి చేయాలి.

తెగుళ్ల యాజమాన్యం

నారుకుళ్ళు (మాగుడు తెగులు):తెగులు సోకిన మొక్కల్ మొదళ్ళు మెత్తబడి,గుంపులుగా చనిపోతాయి. నారు ఒత్తుగా ఉన్నప్పుడు,తేమ అధికమైనపుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువయ్యే అవకశం ఉంది. నివారణకు నారుమళ్ళను మురుగునీటిసదుపాయం గల మెరకగానున్న స్థలాల్లో ఏర్పాటు చేయాలి. నారు పలుచగా వేయాలి. (సెంటు నారుమడికి650గ్రా. విత్తనం) విత్తే ముందు కిలో విత్తనాన్ని 3 గ్రాకాప్టాన్ మందుతో శుద్ధిచేయాలి. విత్తిన 9వ రోజు 15 వరోజున 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2 గ్రా. మెటలాక్సిల్లీటరు నీటిలో కలిపి నారు మళ్ళు బాగా తడిచేలా పిచికారి చేయాలి. కొయినోఫొరా ఎండు తెగులు:తెగులు సోకిన కొమ్మల మధ్య భాగంలో గోధుమ రంగునీటి మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవై కాండం కుళ్ళిమొక్కలు ఎండీపోతాయి. నివారణకు 10 లీటర్ల నీటికికాపర్ అక్సీక్లోరైడ్ మరియు 1 గ్రా.స్ట్రెప్టోసైక్లిన్ మందులనుకలిపి మొక్కలు బాగా తడిచేలా వారం రోజుల వ్యవధిలోరెండుసార్లు పిచికారి చేయాలి.
బాక్టీరియా ఆకుమచ్చ తెగులు:ఆకుల మీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చ లేర్పడి క్రమేపి పెద్దవై, జిగురు లాంటి పదర్ధం ఉత్పత్తిఅయి,నల్లటి గ్రీజు వంటి పొర మచ్చలా ఏర్పడుతుందిమచ్చలచుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 30గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ వ్యవధితో 2-3 సార్లు పిచికారి చేయాలి. వేరుకుళ్ళు: (ఎండుతెగులు)  నేలలోతగినంత తేమ ఉన్నపుటికీ అకులు, కొమ్మలు వ్రేలాడుతూ మొక్కలు వడలి ఎండినట్లు కనిపిస్తాయి.తెగులు సోకిన మొక్కలు ఒక్కసారిగా వడలి చనిపోతాయి. మురుగు నీటి సదుపాయం లేని ప్రాంతాలలో మిరప సాగు చేయరాదు. ట్రైకోడెర్మా కలిపిన పశువుల ఎరువును పొలం మరియు 1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ కలిపిన ద్రావణాన్ని15 రోలో చల్లాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని వడాలి. తెగులు వ్యాప్తిని వ్అరికట్టడానికి లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు ద్రావణాన్ని మొక్కల మొదళ్ళలో పోయాలి.
సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు:తెగులు ఆశించిన ఆకుల మీద గుండ్రంగా గోధుమరంగు మచ్చలేర్పడి, మచ్చల మధ్య భాగంలో తెల్లటిచుక్క ఏర్పడుతుంది. నివారణకు లీటరు నీటికి 1గ్రా.  కార్బండిజమ్  లేదా  2.5 గ్రా మాంకోజెబ్ లేదా 2.5గ్రా. కార్బండిజమ్  మరియు మాంకోజెబ్ మిశ్రమాన్ని పిచికారి చేయాలి.
కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు : కొమ్మలు, ప్రధాన కాండంపై గోధుమ రంగు మచ్చలేర్పడి. అవి క్రమేపి పెద్దవై, పొడుగాటి సన్నని   మచ్చలుగాతయారయి వాటి మధ్య నల్లటి చుక్కలు చిందరవందరగా ఏర్పడతాయి. తీవ్రత అధుకమైనపుడు కొమ్మలు చివర్ల నుండి క్రిందకు ఎండుతాయి. తెగులు ఆశించిన పండుకాయల మీద నల్లని మచ్చలేర్పడి, కుళ్ళిరాలిపోతాయి. నివారణకు విత్తనాన్ని తెగులు సోకని ఆరోగ్యవంతమైన కాయల నుండి సేకరించాలి. శుద్ధిచేసిన విత్తనాన్నే నాటాలి. లీటరు నీటికి 2.5గ్రా. మాంకోజెబ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1మి.లీ ప్రొపికొనజోల్ లేదా 0.5 మి.లీ డైఫెన్ కొనజోల్ లేదా 1 మి.లీ అజాక్సి స్ర్టోబిన్ మందును కలిపి, పదిరోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారిచేయాలి.శుద్ధి చేసిన విత్తనాన్ని వడాలి. తెగులు వ్యాప్తిని వ్అరికట్టడానికి లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు ద్రావణాన్ని మొక్కల మొదళ్ళలో పోయాలి.

వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం

 • వైరస్ ఆశించిన తరువాత నివారణ చర్యలు చేపట్టడం  కంటే తెగుళ్ళు పంటను ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా సమర్ధవంతంగా అరికట్టవచ్చు.
 • వైరస్ తెగుళ్ళను తట్టుకునే రకాలను సాగు చేయాలి అవకాశముంటే విధిగా పంటమార్పిడి పాటించాలి.
 • పచ్చిరొట్ట ఎరువును భూమిలో కలియదున్ని, ఎకరానికి 200కిలోల వేపపిండిని ఆఖరి దుక్కిలో వేయాలి.
 • పొలం గట్ల వెంబడి 2-3 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పైర్లను పెంచడం ద్వారా రసం పీల్చు పురుగులు ప్రవేశాన్ని అరికట్టవచ్చు.
 • విత్తనశుద్ధి విధిగా చేయాలి. కిలో విత్తనాన్ని 8గ్రా. ఇమిడాక్లోప్రిడ్ పురుగుమందుతో శుద్ధి చేసి తొలిదశలో మొక్క లకు రసం పీల్చే పురుగుల నుండి రక్షణ కల్పించాలి. పాలహౌస్ లెదా షేడ్ నెట్ క్రింద పెంచిన నారుకి రసం పీల్చు పురుగులు తాకిడి తక్కువ వుంతుంది. కాబట్టి వైరస్ సోకిన నారును నాటుకోవాలి.
 • పంటను ఎప్పటికప్పుడు గమనించి వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చి వేయాలి .
 • నాటేటప్పుడు ఎకరానికి 10-12 కిలోల కార్బోప్యూరాన్(3జి) గుళికలు వేస్తే, ప్రారంభదశలో రసం పీల్చు పురుగుల తాకిడి తగ్గుతుంది.
 • నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సిఫారసు మేరకు వీలైనంతవరకు సూటి ఎరువుల రూపంలో అందించాలి. విచక్షణారహితంగా కాంప్లెక్స్ ఎరువులు వాడడం వలన అధికమైన భాస్వరం భూమిలో స్థిరీకరింపబడి, ఇతర సూక్ష్మపోషకాలను మొక్కలు గ్రహించలేవు. తద్వారా చూసు మొక్కలు బలహీనమై వైరస్ బారిన పడతాయి.
 • పొలంలో అక్కడక్కడ అముదం/గ్రీజ్ పూసిన పసుపు అట్టలను ఉంచి తెల్లదోమ ఉధృతిని తెలుసికోవచ్చు.
 • మార్కెట్ అభ్యమవుతున్న జీవసంబంధ ఉత్పత్తులను(బెయోస్ ) విచక్షణా రహితంగా వాడరాదు.
 • పంటపై 5శాతం వేప గింజల కషాయం పిచికారీ చేసి తెల్లదోమను అరికట్టవచ్చు.

పురుగు మందులు పిచికారీ చేసిన తరువాత కనీసం 15 రోజుల వరకు కాయల్ని కోయరాదు. సేంద్రియ ఎరువులు, జీవసంబంధమైన, వృక్ష సంబంధమైన మందుల వాడకాన్ని పెంచుతూ, రసాయనాల వాడుకను వీలైనంత తగ్గించుకుంటూ, సమగ్ర సస్యరక్షణలో మూల సూత్రలను దృష్టిలో ఉంచుకొని సాగు చేసినట్లయితే అవశేషాలు లేని,ఎగుమతికి అనువైన మిరపను పొందవచ్చును.

కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి, రంగు తిరిగిన కాయల్ని వాతావరణం పొడిగా వున్న సమయంలో మాత్రమే కోయాఅలి.
 • కాయలను మొక్క మీద మరీ ఎక్కువగా పండనిస్తే ముడతలు పడటమేకాకుండా, సూర్యరశ్మి అధికంగా సోకి, రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి.
 • · కోసిన కాయల్ని రాశిగా పోసి, పట్టాతో ఒక రోజు కప్పి ఉంచినట్లయితే, కాయలన్నీ సరిసమానంగా పండుతాయి కాయలనుపాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితులలోను నేల మీద మరియు ఇసుక లేదా పేడతో అలికిన కళ్ళాలపై కాయల్ని ఆరబెట్టకూడడు.
 • కాయల్లో తేమ శాతం (10-11%) ఉండేలా చూసుకోవాలి.

నాణ్యత ప్రమాణాలకై రైతులు పాటించవలసిన రంగు జాగ్రత్తలు

 • సరియైన పక్వదశలో కాయలు కోసి, గ్రేడంగ్ చేసి ఆరబెట్టి నిర్ధేశించిన తేమ శాతం (10-11%) ఉండేలా చూసుకోవాలి.
 • అకాల వర్షాలకు రాత్రివేళ కురిసే మంచుకు కాయలు తడవకుండా జాగ్రత్త పడాలి.
 • ఎండు కాయలను టెక్కీలలో (గోనె సంచులు నింపేటప్పుడు కాయలపై నీరు చల్లకూడదు).

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మిరప పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate