অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ సూచనలు

వ్యవసాయ సూచనలు

పశు సంపదకు బీమా రక్షణ

 • పాడి పసువు ధర జాతిని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 45 వేల వరకు పలుకుతోంది. స్థానిక, విదేశీ, సంకరజాతి పశువులకు బీమా చేయొచ్చు. 2-10 ఏళ్ల ఆవులకు, 3-10 ఏళ్ల గేదెలకు బీమా చేయొచ్చు.
 • వీటి ఖరీదులో 5% మేరకు బీమా ప్రీమియం ఉంటుంది. బీమా చేసిన పశువుకు చెవిపోగు వేస్తారు. చెవిపోగు ఊడిపోతే ఏజెంట్‌కు చెప్పి వెంటనే వేయించుకోవాలి.
 • బీమా ఉన్న పశువు మరణిస్తే ఏజెంట్‌కు చెప్పి, కళేబరాన్ని ఫోటో తీయించాలి. పశువుల వైద్యునితో పోస్టుమార్టం చేయించి, ఆ నివేదికతోపాటు చెవిపోగును అధికారులకు ఇచ్చి పరిహారం పొందాలి.
 • సబ్సిడీపై కొన్న పశువు చనిపోతే పాల సహకార సంఘం అధ్యక్షుడితో సంతకం చేయించి బ్యాంకు ద్వారా బీమా పరిహారాన్ని పొందాలి.

- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా.

చేపల రైతులు పాటించాల్సిన అదనపు జాగ్రత్తలు

వానాకాలం అయినప్పటికీ తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. ఫలితంగా మార్కెట్ సైజుకు పెంచే చేపల చెరువుల్లో నీటి లోతు దాదాపు సగానికి (6 అడుగుల నుంచి 3 అడుగులకు) తగ్గిపోయింది. అంటే.. చేపలకు సాధారణంగా లభించే నివాస స్థలం సగానికి తగ్గి.. చెరువుల్లో చేపల సాంద్రత రెట్టింపవుతుందన్నమాట.

ఇటువంటప్పుడు చెరువు నీటిలోని మొత్తం ఆక్సిజన్ పరిమాణం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది. పైగా తీవ్ర వేడిమి వల్ల నీటికి ఆక్సిజన్‌ను పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. సేంద్రియ పదార్థం కుళ్లడం వల్ల ఏర్పడే కాలుష్యం సాంద్రత కూడా పెరుగుతుంది.

చేపలు, ముఖ్యంగా రోహు చేపల పెరుగుదల తగ్గిపోవచ్చు. కాబట్టి రోజువారీ వాడే మేత పరిమాణాన్ని తగ్గించి వాడాలి.

తెల్లవారుజామున, ఉదయం పూటల్లో ఆక్సిజన్ లోటుతో చేపలు చెరువు పై భాగానికి వస్తుంటాయి. చెరువులోకి మళ్లీ నీరు తగినంత తోడుకునే వరకు రైతులు మేత, ఎయిరేషన్ విషయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్ సైజుకు వచ్చిన చేపలను పట్టేయడం మంచిది.

- డా. రావి రామకృష్ణ (98480 90576)
సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు.

రొయ్య అనాలోచితంగా గుల్లకొట్టదు!

 • రొయ్యల్లో పెరుగుదల మోల్టింగ్(నిర్మోచనం) అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. దీన్నే గుల్లకొట్టడం అంటారు.
 • రొయ్య తన శరీర పరిమాణం పెంచుకోవాలనుకున్నప్పుడు, గాయాలైనప్పుడు, ప్రత్యుత్పత్తి సమయంలోనూ సహజంగానే గుల్లకొడుతుంది. ఆడరొయ్య గుల్లకొట్టిన సమయంలోనే కలయిక జరుగుతుంది.
 • ఇటువంటి పరిస్థితి లేనప్పుడు.. రైతులు రసాయనాల వాడకం ద్వారా బలవంతంగా గుల్లకొట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
 • గుల్లకొట్టడం అనే జీవ ప్రక్రియ రొయ్యకు పునర్జన్మ వంటిది. అటువంటి సంక్లిష్ట ప్రక్రియను రొయ్య అనాలోచితంగా చేసే సమస్యే లేదు.
 • చెరువు యాజమాన్య ప్రక్రియ సక్రమంగా ఉంటే రొయ్యల పెరుగుదల ఆగే సమస్యే లేదు.
 • - ప్రొఫెసర్ పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా

ముదిరిన తోటల్లో ఆహార భద్రత సాధ్యమేనా?

 

‘అర ఎకరంలో ఒక కుటుంబానికి కావలసిన అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పులు, నూనెగింజలు, ధాన్యాలు అన్నపూర్ణ పంటల పద్ధతి ద్వారా పండించుకోవచ్చని ‘సాక్షి-సాగుబడి’లో ప్రచురితమవుతున్న వ్యాసాల ద్వారా మాకు భరోసా కలిగింది. కానీ, మామిడి వంటి పండ్ల మొక్కలు ఏటేటా పెరుగుతున్న కొలదీ కొమ్మలు విస్తరించి మట్టి పరుపులన్నిటికీ నీడ వ్యాపిస్తుంది. దీని వలన అప్పటి వరకు మట్టి పరుపుల్లో సాగవుతున్న కూరగాయల నుంచి, ఇతర పంటల నుంచి వస్తున్న దిగుబడులు తగ్గి, ఆ మేరకు ఫలసాయం.. ఆదాయం తగ్గుతుంది. అప్పుడు కుటుంబ ఆహార భద్రత ఎలా సాధ్యపడుతుంది? వందలాది మంది రైతు సోదరులు, సోదరీమణులు ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రశ్నలో చాలా వాస్తవముంది. అయితే, పంటలకు కావలసిన సూర్యరశ్మిని బట్టి, పండ్ల చెట్లకు కత్తిరింపు పద్ధతులను అనుసరిస్తూ సాగు చేయడం వలన ఇది వరకు పండిస్తున్న పంటలను కొనసాగిస్తూనే పండ్ల మొక్కల నుంచి కూడా అధిక దిగుబడులను సాధించవచ్చు. పండ్ల చెట్ల నీడ విస్తరించడం వలన అధిక సూర్యరశ్మి అవసరమయ్యే కూరగాయల దిగుబడి ఏటేటా తగ్గుతూ వస్తూంటుంది. అందు వలన చెట్ల కింద పెరిగే పసుపు, అల్లం, చేమదుంపలను సాగు చేసుకోవాలి. అయితే, వీటి పంట కాలం 6 నెలల నుంచి 9 నెలల దీర్ఘకాలం ఉండడం వలన కూరగాయల నుంచి వచ్చినంత ఆదాయం వీటి ద్వారా రాదు.

కానీ, మొదటి సంవత్సరంలో 9 అడుగుల దూరంలో వేసుకున్న అరటి, బొప్పాయి వంటి పండ్ల మొక్కల నుంచి అదనపు ఆదాయం రావడం మొదలవుతుంది. రెండు, మూడో సంవత్సరాల నుంచి 18 అడుగుల దూరంలో వేసుకున్న జామ, సపోటా, బత్తాయి, నిమ్మ చెట్ల నుంచి కూడా ఫలసాయం.. ఆదాయం రావడం మొదలవుతుంది. 4-5 సంవత్సరాల వయసు వచ్చే సరికి ప్రధాన పండ్ల జాతికి చెందిన మామిడి చెట్ల నుంచి ఫలసాయం.. ఆదాయం రావడం మొదలవుతుంది. ఇది కూరగాయల పంటల నుంచి తగ్గిన ఫలసాయం.. ఆదాయం కంటే ఎక్కువే.

- డి. పారినాయుడు (9440164289),
అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా రూపశిల్పి

ఖరీఫ్ గడువు: తెలంగాణలో 10, ఏపీలో 15 వరకు!

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డెరైక్టర్ జనరల్ డా. ఎస్. అయ్యప్పన్, ప్రొ. ఎమ్మెస్ స్వామినాథన్, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. ఎ. పద్మరాజు, ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇటీవల హైదరాబాద్‌లో సమావే శమై దేశంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సమీక్షించారు. అదను, పదను చూసుకొని విత్తుకోవడం, పశుగ్రాసాల కొరత నివారణ చర్యలు, తక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఈ సూచనలతో పోస్టర్లను ముద్రించి వ్యవసాయ శాఖ ద్వారా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి రైతులకు మేలు చేకూర్చడానికి కృషి జరుగుతున్నది.

తెలంగాణలో జూలై 10వ తేదీ వరకు, జూలై 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఖరీఫ్ పంటలను విత్తుకోవచ్చు. నేల బాగా పదునైన తర్వాతే విత్తుకోవాలి. అరకొర పదునుతో విత్తుకోకూడదు. పెసర పంటను జూలై 30వ తేదీ తర్వాత విత్తుకోకూడదు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, బెండ, కంది, తీగజాతి కూరగాయలు, చిక్కుడు తదితర పంటలను విత్తుకోవచ్చు. వంగ, టమాట, మిరప వంటి కూరగాయ పంటల ను ఎత్తయిన మడులపై పెంచుకో వాలి. అలసంద, జొన్న, మొక్క జొన్న, సజ్జ వంటి పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవాలి.

ప్రస్తుతం వేసుకోదగిన అంతర పంటలు: వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి అంతర పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. పత్తి- సోయాబీన్, పత్తి-అపరాలు, జొన్న-సజ్జ, కంది-సోయాబీన్, మొక్కజొన్న-కంది, వేరుశనగ-కంది, వేరుశనగ-ఆముదం, ఆముదం -పెసలు, ఆముదం-అలసంద, ఆముదం-వేరుశనగ, ఆముదం- మినుములు, ఆముదం-కంది, పసుపు-ఆముదం, పసుపు- మొక్కజొన్న మొదలైన పంటలను కలిపి సాగు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రమ వ్యవసాయం చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది. పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, పెరటి కోళ్లు, కుందేళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టు పురుగుల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు.

- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్

అతిసన్నని గింజ.. అన్నమెంతో నాణ్యం!

 

‘సాగుబడి’ 19-5-2014 సంచికలో ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం వరి విభాగం రూపొందించిన ఆర్‌ఎన్‌ఆర్ 15048 గురించి ప్రచురించిన కథనం చదవి మన రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి రైతు సోదరులు అమితాసక్తిని చూపారు. ఈ నేపథ్యంలో వరి విభాగం శాస్త్రవేత్తలను ‘సాగుబడి’ సంప్రదించగా.. గత ఖరీఫ్‌లో ఈ పంటను సాగు చేసి రైతువారీ విత్తనాన్ని తయారు చేసుకున్న పలువురు రైతుల వివరాలను అందించారు.

ఆసక్తి గల రైతులు విత్తనం కోసం ఈ రైతులను సంప్రదించవచ్చు:

 • టి. ప్రసాద్ (కర్నూలు జిల్లా) - 9550082333
 • సత్యనారాయణ (కరీంనగర్ జిల్లా)- 9908608696
 • పుల్లారావు (కరీంనగర్ జిల్లా)- 9959420390
 • బాల్‌రెడ్డి (మెదక్ జిల్లా)- 9912989934
 • భాస్కర్‌రెడ్డి (మెదక్ జిల్లా)- 9989625236
 • కర్రావుల శ్రీనివాస్‌రావు (నల్లగొండ జిల్లా)- 9640642002
 • జానార్దన్‌రెడ్డి (నల్లగొండ జిల్లా)- 9393685123
 • శర్మ (మహబూబ్‌నగర్ జిల్లా)- 9441303150
 • సుదర్శన్ రెడ్డి (మహబూబ్‌నగర్ జిల్లా)- 9989625228
 • సయ్యద్‌పాషా (నిజమాబాద్ జిల్లా)- 9652465272
 • నాగేశ్వరరావ్ (సిందనూర్, కర్నాటక)- 09740029979.

తక్కువ నత్రజనితో దిగుబడి అధికం!

ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంగడం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించి మార్గదర్శకత్వం నిర్వహించిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేంద్రరాజు రైతు సోదరులు పాటించాల్సిన మెలకువలను అందిస్తున్నారు. ‘సన్న గింజ రకాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రాజేంద్రనగర్ వరి విభాగం కొన్ని సంవత్సరాలుగా కృషి చేసి 15048 రకాన్ని రైతులకు అందిస్తోంది. ఇది ఎంటీయూ 1010కి దాదాపు సమానమైన దిగుబడి ఇస్తోంది. తక్కువ కాలంలో అతి నాణ్యమైన అధిక దిగుబడి రైతుకు అందుతోంది. ఖరీఫ్ అనగానే సన్నగింజ రకమైన సాంబమసూరి 5204 విత్తనాలు వెతుక్కోవడం పరిపాటైంది. ఇది దీర్ఘకాలిక రకం కనుక రోహిణీ కార్తె నుంచే నార్లు పోసుకోవడం మొదలవుతుంది. ఆలస్యంగా నార్లు పోసుకున్నట్లయితే నాట్లు ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. ఆర్‌ఎన్‌ఆర్ 15048 స్వల్పకాలిక రకం కనుక జూలైలో నార్లు పోసుకోవడానికి చాలా అనుకూలమైనది.

ఇది తక్కువ కాలపరిమితిగల వంగడమే కాకుండా అగ్గి తె గులును తట్టుకొని మనగలుగుతుంది. ఈ వంగడాన్ని జూన్ కంటే జూలైలో నాట్లు వేసుకుంటే మంచిది. అలాగే నత్రజని ఎరువు సాధారణం కంటే 25 శాతం తగ్గించినప్పుడు మంచి దిగుబడులు నమోదయ్యాయి. సిఫారసు చేసిన దానికి మించి నత్రజని వాడినప్పుడు వరి మరింత ఎత్తు పెరిగి పడిపోయే అవకాశాలెక్కువ. కాండం తొలిచే పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దోమపోటు రాకుండా కాలిబాటలు తీసుకోవాలి. పంటను గమనిస్తూ పురుగు ఉనికిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోగలిగితే మంచి దిగుబడి రైతుల సొంతం’ అని డాక్టర్ సురేంద్రరాజు(98490 59297, ఞటటజీఛ్ఛి2009ః జఝ్చజీ.ఛిౌఝ) వివరించారు. రైతు సోదరులు సందేహాలుంటే 040-24015817 ఫోన్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు.

పశువుల పునరుత్పత్తిలో పోషణ ప్రాముఖ్యత

మన దేశంలో పశుసంపద ఎక్కువగా ఉన్నా ఉత్పాదక శక్తి తక్కువ. జన్యుపరమైన, హార్మోను, వ్యాధి, పోషణ సంబంధమైన అంశాలే ఇందుకు కారణం.

దూడలకు చిన్న వయసు నుంచే విటమిన్ ఏ, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మేత మేపాలి. అప్పుడు త్వరగా ఎదిగి, ఎదకు వస్తాయి. గర్భసంచి, ఓవరీస్ బాగా ఎదగ డానికి భాస్వరం తగినంత అందించాలి.చూడి పశువుకు పోషణ సరిగ్గా అందకపోతే.. తల్లి తన శరీర పోషక నిల్వల నుంచి, గర్భంలోని దూడ నుంచి కూడా పోషకాలను గ్రహిస్తుంది. రాగి లోపం ఉంటే పిండం మరణాలు సంభవిస్తాయి.విటమిన్ ఏ, ఈ అయోడిన్, మాంగనీసు లోపం వల్ల చూడి పశువులు ఈసుకుపోతాయి. పోషణ లోపం లేకుండా జనేంద్రియాలు బాగా అభివృద్ధి చెందితే ఈత సమస్యలు రావు.

పోషణ మరీ ఎక్కువైతే పశువు వెనుక కొవ్వు పెరిగి ఈత ఇబ్బందులెదురవుతాయి. ఈనిన తర్వాత 4-6 వారాల్లో అధిక పాల ఉత్పత్తికి చేరుకుంటుంది. ఈ దశలో పోషకాలు సరిగ్గా ఇవ్వకపోతే పాల ఉత్పత్తి కోసం శరీర నిల్వలను వాడుకుంటుంది. దీని వల్ల ఎదకు రావడం కష్టమవడం, తిరగపొల్లడం వంటి సమస్యలొస్తాయి.

- డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా.

మునగాకు సాగు మేలు

ఈ రైతన్న దారే వేరన్నా..

 • మునగాకు సాగుతో ఎకరానికి రూ. లక్షన్నర వరకు ఆదాయం
 • 20 రకాల పశుగ్రాసాల నర్సరీ, విత్తన నిధి ఏర్పాటు
 • సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై చిన్న రైతులకు ఉచిత సేవలు
 • కొత్త పంటలతో రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న విద్యాధిక రైతు రాజేంద్రరెడ్డి

ఉన్నత వ్యవసాయ విద్యను అభ్యసించి..వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన వాళ్లేమి చేయాలి? ఆ ప్రాంతంలో సాధారణ రైతుల ఊహకు కూడా అందని కొత్త దారి తొక్కాలి.. విభిన్నమైన పంటలు పండించాలి.. తక్కువ ఖర్చుతో అధికాదాయం వచ్చే పంటల సాగు చేయాలి.. పర్యావరణహితమైన, అత్యాధునికమైన సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు లోకానికి అన్ని విధాలా మార్గదర్శకులుగా నిలవాలి.. అప్పుడే వారి చదువుకు సార్థకత చేకూరుతుంది.. జన్మనిచ్చిన గడ్డ రుణం కొంతైనా తీరుతుంది! ఎమ్మెస్సీ పట్టాపొంది.. సేంద్రియ వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన సన్నాడి రాజేంద్రరెడ్డి సరిగ్గా ఇదే చేస్తున్నారు!! అందరూ పండించే పంటల జోలికిపోకుండా.. విలక్షణమైన పంటలతో కొత్త బాటలు వేస్తున్నారు..

రాజేంద్రరెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా తొట్టంబేడు వుండలంలోని రౌతుసూరవూల. తాతల కాలం నుంచి వారిది వ్యవసాయ కుటుంబం. ఢిల్లీలో ఏజీ ఎమ్మెస్సీ చదివి పదేళ్ల పాటు సుస్థిర వ్యవసాయ సలహాదారుగా వివిధ సంస్థల్లో పనిచేశారు. ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్‌లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రెండేసి వారాల పాటు అక్కడి రైతులకు శిక్షణనిచ్చిన అనుభవం ఆయన సొంతం. తండ్రి సురేంద్రనాథ్‌రెడ్డి మరణంతో స్వగ్రామానికి చేరుకొని 20 ఎకరాల సొంత పొలంలో ఎనిమిదేళ్లుగా ఆదర్శప్రాయమైన వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు ఖర్చును సగానికి సగం తగ్గించుకుంటూనే చక్కటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

మునగాకు సాగు ఇలా..

మునగ ఆకును పండించి విదేశాలకు ఎగుమతి చేస్తూ.. ఎకరానికి ఏడాదికి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి 160 మొక్కలు చొప్పున ఐదెకరాల్లో మామిడి, ఎకరంన్నరలో సపోటా, అరెకరంలో జామ తోటలు వేసిన రాజేంద్రరెడ్డి.. మరో మూడున్నర ఎకరాల్లో మునగ తోటను కాయల కోసం కాకుండా కేవలం ఆకు కోసమే సాగు చేస్తున్నారు. అడుగుకొకటి చొప్పున ఎకరానికి 43,000 మునగ మొక్కలు(పీకేఎం, కరుంబు మునుంగ రకాలు) వేస్తున్నారు. 6 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటు చేసిన మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పిచికారీ చేయడంతో ఆకులపై దుమ్ము, పురుగుల గుడ్లు ఎప్పటికప్పుడు కడిగినట్లయి నాణ్యమైన దిగుబడి వస్తోంది. ఎకరానికి టన్ను- టన్నున్నర వర్మీ కంపోస్టు, టన్ను వేప పిండి వేస్తున్నారు. ఆవు మూత్రం, పేడ, మజ్జిగ, లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా తదితరాలను కలిపి తయారు చేసుకున్న ‘బయో బూస్టర్’ను 10-15 రోజులకోసారి.. 1:9 పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. గొంగళి పురుగు నివారణకు వావిలాకు కషాయాన్ని పిచికారీ చల్లుతున్నారు. 45 రోజులకోసారి మునగ కొమ్మలు నరికి ఆకును ఎండబెడతారు. ఎకరంలో ఏడాదికి టన్ను- టన్నున్నర బరువైన ఎండు మునగాకు దిగుబడి వస్తుంది. ఎకరానికి రూ. 30 వేల వరకు ఖర్చవుతున్నదని రాజేంద్రరెడ్డి చెప్పారు. ముందస్తు ఒప్పందం మేరకు ‘ఆర్గానిక్ ఇండియా’కు ఎండు మునగాకును కిలో రూ. వంద ధరకు అమ్ముతున్నారు. ఆ సంస్థ మునగాకును అమెరికాకు ఎగుమతి చేస్తోంది. క్యాల్షియం లోపాన్ని తీర్చి, 350-400 వ్యాధులను అరికట్టే సేంద్రియ మునగాకుకు అమెరికాలో గిరాకీ ఉందంటూ.. అయితే ‘పేదలు తినే ఆహారం’గా భావిస్తూ మునగాకును మన వాళ్లు దీన్ని విస్మరిస్తున్నారని రాజేంద్రరెడ్డి అన్నారు. వుునగాకుతో తయూరు చేసిన తేనీరును తాగితే రోగనిరోధకశక్తి పెంపొందడమే కాకుండా దీర్ఘకాలిక రోగాలు కూడా దూరవువుతాయుని శాస్త్రీయుంగా రుజువైనట్లు ఆయన చెప్పారు.

గడ్డి మొక్కల నర్సరీ, విత్తన నిధి!

డెయిరీలు నెలకొల్పుతున్న పాడి రైతులు మేలైన వివిధ గడ్డి జాతుల పిలకలు, విత్తనాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ అవసరాన్ని గుర్తించిన రాజేంద్రరెడ్డి వుధ్యప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి సేకరించి.. బహుశా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఐదెకరాల్లో 20 రకాల మేలైన గడ్డి జాతుల నర్సరీని, విత్తన నిధిని ఏర్పాటు చేశారు. కో-4 వంటి అధిక దిగుబడినిచ్చే గడ్డి జాతి నుంచి బెట్టను తట్టుకునే జాతులు, గొర్రెలు, మేకల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన గడ్డి జాతులను ఆయన సాగు చేస్తూ రైతాంగానికి అందుబాటులో ఉంచారు. 45 రోజులకోసారి గడ్డి కోతకు వస్తుంది. ఎకరంలో ఏడాదికి 160 టన్నుల గడ్డి దిగుబడిని పొందుతున్నారు. పిలకలు లేదా విత్తనంతో నిరంతరాయంగా పదేళ్ల వరకు గడ్డిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.

గొర్రెలు, మేకలు, ఆవులు

వ్యవసాయుక్షేత్రంలో పంటలతో పాటు ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే 60 నారీ సువర్ణ రకపు గొర్రెలను పెంచుతున్నారు. ఇవి రెండేళ్లలో మూడు సార్లు ఈనుతాయి. 20 తలచూర్ మేకలతోపాటు.. టీటీడీ సౌజన్యంతో గోశాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. సువూరు 50 వరకు ఒంగోలు, నాటు ఆవులు ఉన్నాయి. కబేళాకు తరలించే వాటిని రక్షించి తెచ్చి పెంచుతున్నానని, వీటిని ఆప్యాయుంగా నివుురుతుంటే గొప్ప ఆత్మానందం కలుగుతుందని రాజేంద్రరెడ్డి అంటున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయు నిపుణులు, రైతులు సందర్శించి స్ఫూర్తి పొందుతుంటారు. వుహారాష్ట్రలోని నివ్కుర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ చందానివ్కుర్, ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయుం(తిరుపతి) వీసీ డాక్టర్ ప్రభాకర్ రావు సందర్శించి ఆయన కృషిని అభినందించారు. వుదనపల్లిలోని రిషివ్యాలీ స్కూల్ విద్యార్థులు ఈ క్షేత్రాన్ని సందర్శించి సాగు విజ్ఞానాన్ని వుదినిండా పదిలపరుచుకొని వెళ్లారు. అందరూ పండించే సాధారణ పంటలు కాకుండా.. తనకు మంచి ఆదాయాన్నివ్వడంతోపాటు ఇతర రైతులకూ ఉపయోగపడే పంటలను పండిస్తూ.. తక్కువ ఖర్చుతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం దిశగా దృఢ చిత్తంతో అడుగులు వేస్తున్న రాజేంద్ర రెడ్డి రైతాంగం మదిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు. వ్యవసాయాన్ని కొత్త ఆలోచనలతో సుస్థిరం చేసే సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తున్నారు.

- చెంచురెడ్డి, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా.

సేంద్రియ సాగుతో ఖర్చు తగ్గుతుంది!

అన్ని పనులూ స్వయంగా చేసుకోగలిగిన రైతులకు సేంద్రియ వ్యవసాయం ఎంతో ఉపయోగం. ఖర్చు 50% తగ్గుతుంది. అన్ని పనులకూ కూలీలపై ఆధారపడితే మాత్రం ఖర్చు తగ్గదు. సేంద్రియ ఫలసాయానికి 25% వరకు అధిక ధర వస్తుంది. ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం కల్పించగలిగితే రైతు సులభంగా సుస్థిర వ్యవసాయం వైపు మొగ్గుతాడు. ఎరువులు, పురుగుమందుల దుకాణదారుల మాటలపై ఆధారపడుతున్న రైతులకు సకాలంలో సరైన సలహా ఇవ్వగలిగితే వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రతి రైతునూ సేంద్రియ రైతుగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. చిన్న రైతులకు ఉచితంగానే సలహాలు సూచనలు ఇస్తున్నా. గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ సలహాదారులుగా తీర్చిదిద్దాలి.

- సన్నాడి రాజేంద్రరెడ్డి(9347021752),
సేంద్రియ రైతు, సుస్థిర వ్యవసాయ నిపుణుడు,
రౌతుసూరవూల, తొట్టంబేడు మండలం, చితూరు.

పప్పులే కాదు.. భూమికి బలాన్నీ ఇస్తాయి!

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలకరి జల్లులు పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రైతులు పెసర, మినుము విత్తనాలు వేసుకుంటున్నారు. మార్కెట్‌లో పప్పు ధాన్యాలకు మంచి రేటు పలుకుతుండడంతో చాలా మంది రైతన్నలు ఇప్పుడు వీటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పైగా ఇవి అతి తక్కువ కాలంలో చేతికొస్తాయి.

గాలిలోని నత్రజనిని రైజోబియుం బాక్టీరియూ సాయంతో స్థిరీకరించి, పంట ఎదుగుదలకు దోహదపడడంతో పాటు ఎకరానికి 16-20 కిలోల నత్రజని ఎరువును అందిస్తాయి. పంట తీసుకున్న తర్వాత భూమిలో కలియదున్నితే పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడి భూసారాన్ని పెంచుతాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకొని, తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు...

పెసర పంటే ఎందుకు?

పెసరను పంటమార్పిడి పైరుగా, అంతరపంటగా కూడా వేసుకోవచ్చు. ఆయుకట్టు ప్రాంతాలలోనూ, చెరువులు-వ్యవసాయ బావులు వంటి నీటి వనరుల కింద వరి పండించే భూముల్లోనూ ముందుగా పెసర వేసుకొని, ఆ తర్వాత వరి వేసుకోవచ్చు. అయితే పైరు ఒకేసారి కోతకు రాకపోవడం, చీడపీడలకు సులభంగా లోనవడం వంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెసరను అన్ని రకాల నేలల్లో సాగు చేయువచ్చు. కానీ చౌడు నేలలు, మరుగు నీరు నిలిచే భూములు పనికిరావు.

అనువైన రకాలివే

ఎల్‌జీజీ-407 రకం పంటకాలం 70-75 రోజులు. మొక్కలు నిటారుగా పెరిగి కాయులు మొక్క పైభాగాన కాస్తారుు. గింజలు మెరుస్తూ వుధ్యస్థ లావుగా ఉంటారుు. ఈ రకం ఎల్లో మొజారుుక్, నల్ల ఆకువుచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. ఎల్‌జీజీ-410 రకం 75 రోజుల పంట. మొక్కలు నిటారుగా, గుబురుగా పెరుగుతారుు. గింజలు పెద్దవిగా మెరుస్తూ ఉంటారు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్‌జీజీ-450 రకం పైరు 65-70 రోజుల్లో కోతకు వస్తుంది. మొక్కలు వుధ్యస్థ ఎత్తులో ఉండి, గుబురుగా కన్పిస్తారుు. పంట చేతికొచ్చే సవుయుంలో వర్షాలు కురిసినప్పటికీ గింజలు కొంతమేర చెడిపోవు.

పూసా-105 రకం పంటకాలం 65-70 రోజులు. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. కాయులన్నీ పైభాగంలోనే ఉండి ఒకేసారి కోతకు వస్తాయి. ఈ రకం పల్లాకు, ఆకువుచ్చ తెగుళ్లను కొంతమేర తట్టుకుంటుంది. ఎంజీజీ -295 రకం 65-70 రోజుల పంట. మొక్కలు నిటారుగా పెరుగుతారుు. ఈ రకం నల్లవుచ్చ తెగులును తట్టుకుంటుంది. గింజ వుధ్యస్థ లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. డబ్ల్యూజీజీ-37 రకం పంటకాలం 60-65 రోజులు. గింజలు ఆకర్షణీయుంగా, పచ్చగా మెరుస్తుంటారు. దీనిని అన్ని ప్రాంతాల్లో సాగు చేయువచ్చు. పైరు ఒకేసారి కోతకు వస్తుంది. ఎల్లో మెజారుక్ తెగులును తట్టుకుంటుంది.

ఎల్‌జీజీ-460 రకం 60-65 రోజుల పంట. కాయులు గుత్తులుగా ఉండి కోయుడానికి సులువుగా ఉంటుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఎంఎల్-267 రకం 65 రోజుల పంట. అన్ని ప్రాంతాలకూ అనువైనది. మొక్క నిటారుగా ఉండి కింది నుండి పై దాకా కాస్తుంది. పెసర రకాలన్నీ ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడిని అందిస్తాయి.

తేమను నిలుపుకునే నేలల్లో...
మినుమును నల్లరేగడి భూవుుల్లో పొగాకు పంటకు వుుందు ఎక్కువగా సాగు చేస్తారు. పంటల సరళిలో దీనిని పంటవూర్పిడి పైరుగా, అంతరపంటగా వేస్తారు. అయితే తొలకరిలో వేసే మినువుు పంట నీటి ఎద్దడిని త ట్టుకోలేదు. కాబట్టి తేవును నిలుపుకోలేని తేలికపాటి భూవుులు, ఎర్ర నేలలు మినువుు సాగుకు పనికిరావు. ఖరీఫ్ పైరుకు పల్లాకు, ఆకుముడత తెగుళ్లు ఎక్కువగా సోకుతాయి.

ఈ రకాలు వేసుకోవచ్చు

ఎల్‌బీజీ-20 రకం ఆకులు సన్నగా, పొడవుగా వుుదురాకుపచ్చ రంగులో ఉంటారుు. ఈ రకం పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు నల్లగా మెరుస్తుంటారుు. పైరు 70-75 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. డబ్ల్యుబీజీ-26 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. గింజలు సాదాగా ఉంటారు. ఈ రకం పల్లాకు తెగులును కొంతమేర తట్టుకోగలదు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి

సుమారు 5 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది.

ఎల్‌బీజీ-623 రకం కాయులు పొడవుగా, లావుగా ఉంటాయి. వాటి పైన నూగు చాలా తక్కువగా ఉంటుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటారుు. మొక్కలు గుబురుగా పెరుగుతారుు. ఈ రకం బూడిద తెగులును కొంతమేర తట్టుకుంటుంది. దీని పంటకాలం 75-80 రోజులు. ఎకరానికి 7 క్వింటాళ్లకు పైగా దిగుబడిని అందించగలదు. టీ-9 రకం మొక్కలు గుబురుగా, పొట్టిగా ఉంటారుు. ఆకులు సన్నగా, వుుదురాకుపచ్చ రంగులో ఉంటారు. దీని పంటకాలం 70-75 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

సాగు ఇలా...

పెసర పంటకు ఎకరానికి 6-7 కిలోలు, మినుముకు 8-10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 30 గ్రాముల కార్బోఫ్యూరాన్ మందును పట్టించి శుద్ధి చేయాలి. పైరును తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/థయోమిథాక్సామ్ చొప్పున కలపాలి. ఈ పైర్లను కొత్తగా సాగు చేసే వారు రైజోబియం కల్చర్‌ను కూడా కలిపితే మంచి దిగుబడులు వస్తాయి.

నారుమడిని నష్టపరిచే పురుగులివే

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొంతమంది రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నారు పోసుకుంటున్నారు. వరిలో మంచి దిగుబడులు సాధించాలంటే చీడపీడలు ఆశించని ఆరోగ్యవంతమైన నారును పెంచాల్సిన అవసరం ఉన్నదని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.వసంతభాను, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి నారుమడిని ఆశించే హిస్పా, కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు పురుగుల నివారణకు వారు అందిస్తున్న సూచనలు...

రైతులు ముందుగా తమ ప్రాంతానికి అనువైన, చీడపీడల్ని తట్టుకునే వంగడాల్ని ఎంపిక చేసుకోవాలి. తెగుళ్లు చాలా వరకు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన పొలం నుంచే విత్తనాలను సేకరించాలి. లేదా విత్తనాలను విధిగా శుద్ధి చేయాలి. ఇందుకోసం లీటరు నీటిలో ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ మందు ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత మండె కట్టాలి. నారుమడిని ప్రతి రోజూ గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

ముందుగా గడ్డిని ఆశ్రయించి...

తొలకరిలో కురిసిన వర్షాలకు పొలం గట్ల పైన, పొలంలో గడ్డి బాగా పెరుగుతుంది. నారు పోయకముందే హిస్పా పురుగులు ఈ గడ్డిని ఆశ్రయిస్తాయి. ఆ తర్వాత నారుపై దాడి చేస్తాయి. హిస్పా అనేది నీలం, నలుపు రంగులతో కూడిన పెంకు పురుగు. దీని శరీరంపై ముళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. తల్లి పెంకు పురుగు కూడా నారుమడిని నష్టపరుస్తుంది. ఈ పురుగులు ఆశించడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు, తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి.

వర్షాలు ఆలస్యమైతే...

తొలకరి వర్షాలు జూన్ మొదటి వారంలో పడి, నారుమడులు సకాలంలో పోసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు తాకిడి ఉండదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జూలై ప్రవేశించినా వరుణుడు కనికరించడం లేదు. ఒకవేళ ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ నారుమడిని కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. దీని రెక్కల పురుగులు పసుపు రంగులో ఉంటాయి. రెక్కల ముందు, రెక్కల మధ్యలో నల్లని మచ్చలు కన్పిస్తాయి. ఒక్కో పురుగు ఆకుల చివరి భాగంలో 20-70 గుడ్లను సముదాయాలుగా పెట్టి, వాటిని వెంట్రుకలతో కప్పుతుంది. ఈ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వచ్చి, మూడు రోజుల్లో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తాయి. దీనివల్ల మొవ్వు ఆకు ఎండి చనిపోతుంది.

అంకురం వృద్ధి చెందదు

గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాకు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉల్లికోడు పురుగు ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాలకూ వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఉల్లికోడు పురుగులు పిలక దశ తర్వాతే పంటపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంట సాగు ఆలస్యమవుతుండడంతో ఈ పురుగు తాకిడి నారుమడి దశలోనే కన్పిస్తోంది. ఉల్లికోడు పురుగులు ముదురు ఎరుపు రంగులో దోమల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆకులపై విడిగా కానీ లేదా 2-3 గుడ్లను కలిపి కానీ పెడతాయి. వీటి నుండి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. అవి అంకురం వద్దకు చేరి, అక్కడ ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టంగా మారి, ఉల్లికోడు మాదిరిగా బయటికి వస్తుంది.

ఇవి కూడా...

నారుమడి పోసిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురైతే... ముఖ్యంగా మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి. ఒకవేళ నారుమడి పోసిన తర్వాత వర్షాలు బాగా కురిసి మొక్కలు ముంపుకు గురైతే వాటిని నారును కత్తిరించే లద్దె పురుగులు ఆశిస్తాయి. ఇవి రాత్రి సమయంలో నారుమడిని ఆశించి, మొక్కల్ని కొరికేస్తాయి. పగటి వేళ కలుపు మొక్కల పైన, భూమిలోనూ ఉంటాయి.

ఏం చేయాలి?

నారు పోసిన ఏడవ రోజు నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్/ప్రొఫెనోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకుంటే నారు తీయడానికి వారం రోజుల ముందు 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 50 గ్రాముల ఫోరేట్ 10జీ గుళికల్ని ఇసుకలో కలిపి సెంటు నారుమడిలో చల్లుకోవాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు పలచగా ఉండాలి. నారుమడిని లద్దె పురుగు ఆశిస్తే పైన తెలిపిన మందుల్ని సాయంత్రం వేళ పిచికారీ చేసుకోవాలి.

ప్రకృతికి దగ్గరి నేస్తం ‘అన్నపూర్ణ’!

 

ప్రకృతికి అనుగుణంగా ఏరువాక..

ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకొని రేపటికి దాచే గుణం కలిగినదే ‘అన్నపూర్ణ’ పంటల నమూనా
ఆచ్ఛాదన.. సంప్రదాయ విత్తనం.. సేంద్రియ సాగు విధానాలు నీటి ఎద్దడిని తట్టుకోగల అదనపు శక్తినిస్తాయి

రుతుపవనాలు ప్రవేశించాయన్న శుభవార్త రైతులల్లో కోటి ఆశలు రేపింది. కానీ, మృగశిరతోపాటే ఆరుద్ర కార్తె కూడా దాటిపోతున్నా.. వరుణ దేవుడు కరుణించకపోయే సరికి.. ఆ ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. చల్లటి గాలులు వీచాల్సిన రోజుల్లో వడగాడ్పులు వీస్తుండడం రైతాంగంలో తీవ్ర ఆందోళన కలిగించడం సహజమే. ఇటువంటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ‘అన్నపూర్ణ’ నమూనా ప్రకృతి వ్యవసాయం ఎంతవరకు తట్టుకొని నిలబడుతుంది? చాలా మంది రైతులు ఈ సందేహాన్నే వ్యక్తం చేస్తున్నారు..
నిజమే.. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న పట్ల కన్నెర్రజేసిన ప్రకృతి మాతకు ఎదురొడ్డి సాగు చేయడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే పనికాదు. కానీ, ప్రకృతికి అనుగుణంగా ఏరువాక నడిపిస్తే కొంతలోకొంత నిలదొక్కుకోగలుగుతాం. అదెలాగో తెలుసుకుందాం..
‘సాగుబడి’లో ప్రచురితమవుతున్న ‘అన్నపూర్ణ- అక్షయపాత్ర’ వ్యాస పరంపరలో గతంలో మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నట్లు.. అన్నపూర్ణ పంటల నమూనా ప్రకృతికి చాలా దగ్గరి నేస్తం.

వానలు కురిపించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్న వాన దేవుడు రాల్చిన చిన్న చిన్న చినుకులను ఒడిసిపట్టుకొని చాలా జాగ్రత్తగా రేపటికి దాచేగుణం ‘అన్నపూర్ణ’ది. ఈ పంటల నమూనాలో అంతర్భాగంగా కందకాలు, తల్లి కాలువలు చేస్తున్న ఉపకారమేంటో మనకు బాగా తెలుసు. దీంతోపాటు.. కురిసిన చినుకులు ఎండకు ఆవిరైపోకుండా కాపాడేది ‘మల్చింగ్’. కరుడుగట్టిన కరువులో సైతం నేలను చీల్చుకుంటూ మొలకై, మొక్కై పంటను అందించే శక్తి మన స్థానిక విత్తనాలకుంది.వర్షాభావ పరిస్థితుల్లో మల్చింగ్‌కి, స్థానిక విత్తనాలకు ఎంతటి ఎంతో ప్రాధాన్యత ఉంది.

మల్చింగ్: దీన్నే ‘ఆచ్ఛాదన’ అని కూడా పిల్చుకుంటున్నాం. మన శరీరానికి కప్పిన నూలు వస్త్రం చెమటను పీల్చుకొని తనలో ఇముడ్చుకునే విధంగా.. ఆచ్ఛాదన నేలలో పడిన చినుకులు ఎండకు, గాలికి ఆవిరైపోకుండా తనలోనే ఇముడ్చుకొని మొక్కలకు తేమను అందిస్తుంది. అందుకే అన్నపూర్ణ నమూనాలో మట్టి పరుపునకు మట్టి పరుపునకు మధ్య వేసిన కాలువల్లో పరుపుల మీద నుంచి తీసిన కలుపు మొక్కలు, పంట వ్యర్థాలను వేయడం వలన.. నేలలో తేమ ఎక్కువ రోజులు నిలుస్తుంది. పొలం చుట్టూ, పొలం బయట రాలే ఆకులను మట్టి పరుపు మీద అక్కడక్కడా వేసుకునే పండ్ల మొక్కల పాదుల చుట్టూ ఆచ్ఛాదనగా పేర్చుకోవాలి. ఈ ఆకులు కుళ్లి ఎరువుగా మారి తిరిగి మొక్కకు పోషకాలను అందిస్తాయి.

వర్షాలు లేవని కూరగాయల విత్తనాలతో నారు పోసుకో కుండా ఎదురు చూడొద్దు. నారుపోసిన స్థలంలో ఒకటి రెండు అడుగుల ఎత్తులో చిన్న చిన్న కర్రలతో పందిరి వేసుకొని, దాని మీద కొబ్బరి లేదా తాటాకు మట్టలను వేసుకుంటే ఎండవేడిమి తగ్గి.. నారు బాగా పెరుగుతుంది. ఈ లోపు అప్పుడప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి. కాబట్టి అదనుచూసి మొక్కలు నాటు వేసుకోవచ్చు. నారు పోసే టప్పుడు గానీ, ఊడ్చేటప్పుడు గానీ బీజామృతంలో శుద్ధి చేసుకోవడం వల్ల కూడా వర్షాభావ పరిస్థితుల నుంచి కొంతకాలం తనను తాను కాపాడుకోగలుగుతుంది. నాటిన మొక్కల చుట్టూ లేదా మట్టి పరుపు అంతటా గడ్డి లేదా ఆకులతో ఆచ్ఛాదన చేసుకుంటే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. పండ్ల మొక్కల నీడ కూడా ఆచ్ఛాదనే.. వాటి కింద కూడా నారు పోసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయనుకున్నప్పుడు తప్పకుండా తక్కువ నీటితో పండే పంటలను వేసుకోవడం శ్రేయస్కరం.
మరొక్క ముఖ్య విషయమేమిటంటే.. స్థానికంగా దొరికే సంప్రదాయ విత్తనాలు నీటి ఎద్దడికి, మారుతున్న వాతావ రణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలుగుతాయి. సేంద్రియ సాగు విధానాలు నీటి ఎద్దడిని తట్టుకోగల అదనపు శక్తిని సమకూరుస్తాయి. హైబ్రిడ్ విత్తనాలకంటే ఈ విత్తనాలను నాటుకోవడమే మంచిది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడే క్రమంలో నీటి అవసరం కూడా పెరుగు తుంది. కాబట్టి సేంద్రియ సాగు విధానాలను ఆచరించడమే మేలు. అలాగే ప్రతి ఏటా విత్తనాల కోసం అధికారుల చుట్టూ, వ్యాపారస్థుల చుట్టూ తిరిగేకంటే మన విత్తనాలను భద్రపరచుకోవడానికి అలవాటు పడితే రైతు బలపడతాడు.. సుస్థిరంగా నిలబడగలుగుతాడు.

- డి. పారినాయుడు (9440164289),
అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా రూపశిల్పి

పొలమే అతని ప్రయోగశాల

 

ఆధునికత పెరిగి, వ్యవసాయంలో కూడా కొత్త పరిణామాలు వచ్చాక, దేశవాళీ సేద్యపు విధానాలే కాదు... ఆ విత్తనాలూ కనుమరుగవుతున్నాయి. మనదైన పంట పండించుకోవడానికి మనదంటూ విత్తనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటున్నాడో సాధారణ రైతు. దేశవాళీ విత్తనాలను కాపాడేందుకు వీలైనంతగా శ్రమిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతానికి చెందిన జై ప్రకాశ్ సింగ్ చేస్తున్న కృషి, సాధించిన విజయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ మామూలు రైతు ఇప్పటి దాకా 460 రకాల దేశవాళీ వరి విత్తనాలు, 120 రకాల గోదుమ విత్తనాలు, 30 రకాల పప్పు ధాన్యాల విత్తనాలు, 4 రకాల ఆవాల విత్తనాలను భద్రపరిచాడు. ఈ దేశవాళీ విత్తనాలతో రైతులు ఎవరైనా సరే ఆ యా పంటలు వేసుకొని, భారీగా దిగుబడులు సాధించవచ్చని సాక్షాత్తూ సర్కారు వారు కూడా రాజముద్ర వేశారు.

అన్నదాత జై ప్రకాశ్ సింగ్ కాపాడిన దేశవాళీ గోదుమ విత్తన రకంతో పంట వేస్తే, హెక్టారుకు ఏడు టన్నులకు పైగా పంట పండుతోంది. అలాగే, సర్వసాధారణంగా దీర్ఘకాలం పట్టే వరి రకంతో పంట చేతికి రావడానికి 150 నుంచి 160 రోజులు పడుతుంది. కానీ, జై ప్రకాశ్ దగ్గరున్న వరి కేవలం 130 రోజులకే విరగపండుతుంది. ఇలా ఆయన కాపాడుతున్న బ్రహ్మాండమైన దేశవాళీ విత్తనాలు, వాటి లక్షణాలపై ఇప్పటికే దేశం నలుమూలల నుంచి పలు వ్యవసాయ, పరిశోధక సంస్థలు పరిశోధన సాగించాయి. వారణాసికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని తండియా గ్రామం ఈ రైతు - శాస్త్రవేత్తది. కేవలం 60 గడపలున్న గ్రామం అది. చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, పదో తరగతి తప్పాక, ఆయన చదువు కొనసాగించలేక పోయాడు. అదే సమయంలో ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన తండ్రి ఆయనను చదివించలేకపోయారు. తరువాతి రోజుల్లో క్రమంగా సేద్యం వైపు ఆకర్షితుడైన జై ప్రకాశ్ పంటపొలాల్లో తన ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాలు, సేద్యాన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయాలనే కృషే ఇవాళ ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

దాదాపు పాతికేళ్ళుగా సాగుతున్న తన కృషి దేశంలోని రైతులందరికీ ఉపయోగపడాలన్నది ఈ ఆదర్శ రైతు ఆశయం. అందుకే ఆయన తాను కాపాడుతున్న ఈ దేశవాళీ విత్తన రకాలను విక్రయించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నారు. తన దగ్గర కొన్న విత్తనాలను వేరే ఎవరికైనా విక్రయించాలనుకుంటే, కొన్న ధరకే విక్రయించాలంటూ ఏకంగా పత్రాల మీద సంతకాలు కూడా చేయించుకుంటున్నారు. ‘విత్తనాల కోసం భారీగా పెట్టుబడి పెట్టలేని చిన్న సన్నకారు రైతులందరికీ ఈ దేశవాళీ రకాలను అందుబాటులో ఉంచాలన్నదే నా ప్రయత్నం’ అని గర్వంగా చెబుతారు. దేశానికి అన్నభిక్ష పెట్టడం కోసం ఈ సామాన్యుడు సాగిస్తున్న కృషి చూసి సర్కారు వారు సైతం సలామ్ చేశారు. వందలాది దేశవాళీ విత్తన రకాలను కాపాడి, అందుబాటులో ఉంచుతున్నందుకు గాను జై ప్రకాశ్ సింగ్ 2002లో, 2009లో రెండు సార్లు అప్పటి రాష్ట్రపతుల నుంచి అవార్డులు అందుకున్నారు. అలాగే, ‘ప్లాంట్ జీనోమ్’ అవార్డు కూడా దక్కింది.

ఈ ఆదర్శ వ్యవసాయదారుడు మాత్రం వచ్చిన అవార్డులను చూసుకొని మురిసిపోవడం లేదు. ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందంటూ వ్యవస్థను నిలదీస్తున్నాడు. "రానున్న ఆహార కొరతను అధిగమించాలంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ దేశవాళీ విత్తనాలను పరిరక్షించుకోవడం, సమర్థంగా వాడడం అవసరమని మన ప్రభుత్వాలు గ్రహించాలి. జన్యుమార్పిడి విత్తనాలకూ, వాటి సేద్యానికీ అనవసరంగా బోలెడంత డబ్బు తగలేస్తున్నాం"అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. దేశం కోసం తపన ఉన్న ఇలాంటి అన్నదాత కృషిని అవార్డులతో కాక, ఆచరణలో ప్రోత్సహిస్తే, వందల రకాల దేశవాళీ విత్తనాలను కాపాడగలిగితే మన జన్మభూమిని బంగారుభూమిగా మార్చుకోవడం కష్టమేమీ కాదు.

టాబ్లెట్‌తో వ్యవ‘సాయం’!

 

విత్తులు చల్లింది మొదలు పంట చేతికొచ్చేవరకూ ప్రతి దశలోనూ రైతు ఒంటరే. సలహా సూచనలిచ్చే విస్తరణ అధికారుల వ్యవస్థ నామమాత్రంగా పని చేస్తూండటం.. తీరా దిగుబడులు వచ్చాక మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయిస్తూండటం ఈ పరిస్థితికి కారణాలు. ఈ నేపథ్యంలో రాయచూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. వ్యవసాయ విస్తరణ అధికార వ్యవస్థకు ఎలక్ట్రానిక్ ప్రత్యామ్నాయంగా ఈ-శాప్ పేరుతో ఓ ఆధునిక అప్లికేషన్ ను సిద్ధం చేసింది. రైతుతోపాటు వ్యవసాయ అధికారులకూ ఎంతో ఉపయోగపడగల ఈ అప్లికేషన్‌ను ‘సాక్షి’ స్వయంగా పరిశీలించి చూసింది. ఆ వివరాలు మన రైతుల కోసం...

పంట అన్నాక చీడపీడల బాధ సహజం. సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటి ద్వారా వచ్చే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కానీ ఫలానా చీడకు ఫలానా మందు వేయాలని, చీడపీడల దశ, తీవ్రతను బట్టి మందులు ఉపయోగించాలని రైతులకు ఎవరు సూచించాలి? వ్యవసాయ విస్తరణాధికారులు తక్కువగా ఉండటం.. ఉన్నవారూ క్షేత్రస్థాయిలో తిరగకపోవడం, ఫలితంగా రైతుకు సకాలంలో ఈ సూచనలు అందడం లేదు. దీంతో రైతు ఇతరులెవరో చెప్పినట్లు లేదా తన అనుభవాల ఆధారంగానో విచ్చలవిడిగా మందులు చల్లేస్తున్నాడు. దీనివల్ల ఖర్చు పెరిగిపోవడంతో పాటు పంటలు విషతుల్యమవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యలన్నింటికీ ఓ టాబ్లెట్ పీసీతో చెక్ పెట్టేందుకు చేపట్టిన ప్రయత్నమే ఈ-శాప్!

ఏమిటిది? ఒక్కమాటలో చెప్పాలంటే ఒక టాబ్లెట్ పీసీలో వ్యవసాయ సంబంధమైన సమాచారం మొత్తాన్ని చేర్చడం. ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం వల్ల రైతు లేదా వ్యవసాయ విస్తరణ అధికారి నేరుగా శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపేందుకు వీలు ఏర్పడుతుందన్నమాట. చీడపీడలకు సంబంధించి రైతుకు ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా టాబ్లెట్ పీసీతో మొక్కల ఫొటోలు కొన్ని తీస్తే చాలు... ఏ రకమైన చీడ ఆశించింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సమాచారం తెరపై ప్రత్యక్షమవుతుంది.

ఎలాంటి పనులు? ఈ అప్లికేషన్ అటు రైతులు, ఇటు ప్రభుత్వ అధికారులకూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ముందుగా రైతు ప్రయోజనాలు చూస్తే...సాగుకు సంబంధించిన సలహా సూచనలు అందుతాయి. ఫొటోలతోపాటు ఆడియో ద్వారా కూడా ఈ పనులు నిర్వహించవచ్చు. చీడపీడల తీవ్రత, విసృ్తతిని తెలుసుకోవచ్చు. ఈ సమాచారం మొత్తాన్ని జీఐఎస్ ద్వారా గూగుల్ మ్యాప్‌ల ద్వారా చూసుకోవచ్చు. తద్వారా తగిన జాగ్రత్తలు చేపట్టవచ్చునన్నమాట. ఏదైనా గుర్తించని చీడ సోకినప్పుడు... రైతు టాబ్లెట్ పీసీ ద్వారా పంపే సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేపట్టి నిర్వహణ సమాచారాన్ని రైతుకు చేరవేస్తారు. రైతులకు సంబంధించిన సమాచారం మొత్తం ఒకేచోట ఉండటం మరో ప్రయోజనం. ఇక ప్రభుత్వ అధికారులకు కలిగే ప్రయోజనాలు... ఏ పంటకు ఏ రకమైన తెగులు ఆశించింది? ఎంత విస్తీర్ణంలో ఉంది? అక్కడి పరిస్థితులు ఏమిటి? అన్నది ఎప్పటికప్పుడు తెలుస్తూంటుంది. తద్వారా సులువుగా నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలేర్పడుతుంది. సమాచార విశ్లేషణ ద్వారా కొత్తకొత్త నిర్వహణ పద్ధతులను ఆవిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. వరి, కందు లు, శనగలు, పత్తి, వేరుశనగ, మిర్చి, పొద్దుతిరుగుడు వంటి ఏడు పంటల సమాచారం ఈ-శాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఏ రకమైన పంట సమాచారాన్ని అయినా ఇట్టే చేర్చుకోగల సౌకర్యం దీంట్లో ఉంది.

ఇంగ్లీషు తెలిసుండాలా?ప్రస్తుతానికి ఈ-శాప్ ద్వారా అందే సమాచారం ఇంగ్లీషులోనే ఉంది కానీ త్వరలోనే కన్నడలో కూడా అందుబాటులోకి తెస్తామని ఈ-శాప్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎ.ప్రభురాజ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ అప్లికేషన్‌ను వాడుకునేందుకు భాష ఏమాత్రం అడ్డంకి కాదని ఆయన స్పష్టం చేశారు. పంటల సమాచారాన్ని ఇప్పటికే కన్నడలో తయారు చేశామని, దానికి సంబంధించిన లింక్‌ను టాబ్లెట్ పీసీకి చేర్చాల్సి ఉందని ఆయన వివరించారు. అంతేకాకుండా తాము ప్రస్తుతం చేపట్టింది పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని, ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారులు 15 మందికి టాబ్లెట్ పీసీలు అందజేశామని చెప్పారు. ఈ అప్లికేషన్ ఉపయోగాలను స్వయంగా చూసిన రైతులు సొంతంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.

 • తొంభై ఎకరాల భూమి..! తొండలు గుడ్లు పెట్టాయి.
 • నాగళ్లు మెలితిరిగాయి. రెక్కలు ముక్కలయ్యాయి.
 • నారు మాడిపోతోంది. నీరు రసాయనమైపోతోంది!
 • సేద్యమా? బలుసాకు భక్ష్యమా?
 • రైతులు ఆశలు వదులుకున్నారు.
 • భూమాతకొక దండం పెట్టారు.
 • అప్పుడొచ్చారు... సబర్మతి! గుప్పెట్లోకి ఇంత మట్టి తీసుకుని ‘నిన్ను బతికించుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశారు.
 • ఇప్పుడా భూమిలో వెయ్యిజాతుల చెట్లు, పంటలు, పూలమొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి.
 • ఎవరీ సబర్మతి? ఆమె చేతుల్లో ఏముంది?
 • మాయా? మంత్రమా? వట్టి విత్తనమా?

‘విత్తనం ప్రకృతి మనకిచ్చిన సంపద’ అంటారు సబర్మతి. 44 ఏళ్లక్రితం పూరి (ఒరిస్సా)లో పుట్టారు సబర్మతి. గ్రామీణాభివృద్ధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పర్యావరణంలో వ్యవసాయ కోర్సు చేశారు. ప్రస్తుతం ‘ఒరిస్సాలో శ్రీవరి సాగు-సాధక బాధకాలు’ అనే అంశంపై డాక్టరేట్ చేస్తున్నారు. ఇంతవరకే అయితే ఆమె గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆమెకు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధాసక్తులుండేవి. ఆమెలో ఈ బీజం పడడానికి కారణం తండ్రి రాధామోహన్. ఆయన ప్రొఫెసర్, జీవవైవిధ్య పరిరక్షణే జీవిత లక్ష్యంగా కొనసాగుతున్న మహనీయుడు. తండ్రి లక్ష్యాన్ని అందిపుచ్చుకున్న సబర్మతి ‘సంభవ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జీవవైవిధ్య పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, గ్రామీణ పారిశుద్ధ్యం, లింగ వివక్షపై గత రెండు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన దేశవాళీ విత్తన మేళాలో ఆమెకు ‘బీజనిధి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

‘సంభవ్’ పుట్టిందిలా...

మధ్యప్రదేశ్‌లో, ఆక్స్‌ఫామ్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత ఒరిస్సాలోని నయాగర జిల్లా కొండ ప్రాంతంలో నిస్సారమై వ్యవసాయానికి పనికిరాకుండా పోయిన 90 ఎకరాల భూమిని తీసుకొని చెట్లు పెంచడం ప్రారంభించారు సబర్మతి. ఇది ఇరవై రెండేళ్ల నాటి మాట. చిక్కటి అడవిని నరికి 12 ఏళ్ల పాటు సాగిన రసాయనిక సేద్యం వల్ల నిస్సారమై, గడ్డి కూడా మొలవని స్థితికి చేరింది. దానినే సవాలుగా తీసుకున్న సబర్మతి ‘సంభవ్’ అనే పేరుతో 1989 మార్చి 8న మహిళాదినోత్సవం రోజున స్వచ్ఛందసంస్థను నెలకొల్పారు. ఆ భూమిని దశల వారీగా ప్రకృతికి హాని కలగని రీతిలో సేంద్రియ పద్ధతుల్లో సాగులోకి తేవటానికి పదకొండేళ్లు కష్టపడ్డారు. ఆమె పడ్డ కష్టం వృథాపోలేదు. ఒకప్పటి నిస్సారమైన ఆ నేల ఇప్పుడు దాదాపు వెయ్యి జాతుల చెట్లు, పూలమొక్కలతో పచ్చగా కళకళలాడుతోందని చెపుతున్న సబర్మతి ప్రయోజకులైన బిడ్డల్ని తలుచుకుంటున్న తల్లిలా కనిపించారు..

వైవిధ్యం దేశవాళీ వరి వంగడాలు...!

ఇరవెరైండేళ్లనాడు నాటిన సంభవ్ బీజం మొలకెత్తి ఫలాలనిస్తోందా అంటే... "వందల దేశవాళీ వరి వంగడాలతోపాటు, మామిడిలో 65 రకాలు, కొబ్బరి వంగడాలు... మరెన్నో వృక్షజాతులు పెరుగుతున్నాయి ‘సంభవ్’ ఫార్మ్‌లో. వందలాదిరకాల దేశవాళీ వరి వంగడాలు ఏటా మొలుస్తూనే ఉంటాయి. గత ఏడాది ఒకటిన్నర ఎకరాల పొలంలో 380 రకాల వరి వంగడాలను పెంచాం. ఒక్కోరకాన్ని 50 మొక్కలైనా శ్రీ పద్ధతిలో సాగుచేస్తాం" అన్నారు సబర్మతి. వందల రకాలనగానే వీటిపేర్లను గుర్తు పెట్టుకోవడమైనా సాధ్యమవుతుందా అని సందేహం కలుగుతుంది కానీ ఆమె 360 రకాల వరివంగడాల పేర్లు, వాటి లక్షణాలను అనర్గళంగా చెప్పగలరు. మరో ఇరవైరకాల వివరాలు సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉందంటూ, ఎప్పటికైనా వాటిని గుర్తించగలిగినవారు తమ క్షేత్రానికి రాకపోతారా అని ఎదురుచూస్తున్నాను అన్నారామె.

స్వయంపోషక ‘సంభవ్’!

"సంభవ్ నిలదొక్కుకోవటానికి తొలిదశలో ఎనిమిదేళ్లపాటు వివిధ సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకున్నాను. ఇప్పుడు నిరంతరం శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ వచ్చిన పారితోషికంతో‘సంభవ్’ తనను తాను పోషించుకుంటున్నది. ఏటా 60 నుంచి 65 శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఒక్కొక్క బ్యాచ్‌కు 45 మంది వరకు ఉంటారు. ఆ మేరకు వసతి ఏర్పాట్లున్నాయి మా దగ్గర. రైతులు, ప్రభుత్వ అధికారులు, అటవీ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు, విద్యార్థులు ‘సంభవ్’ నుంచి నేర్చుకునేందుకు వస్తుంటారు. ‘సంభవ్’లో నాతోపాటు మరో పదిమంది గ్రామీణులు పనిచేస్తున్నారు. ఒక ఎడ్లబండి, ఒక ట్రాలీ... ఈ రెండే సంభవ్‌కున్న వాహనాలు. ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం, దానికి ముందు రోజు బాలల దినోత్సవం నిర్వహిస్తాం. ఆ సందర్భంగా బడిపిల్లలకు దేశవాళీ విత్తనాన్ని సేకరించటంలో పోటీ పెడతాం. ఒకసారి ఒక గ్రామీణ విద్యార్థిని 1,301 రకాల వృక్ష జాతుల విత్తనాలను సేకరించింది. రైతులు, పిల్లలు, గిరిజనులు, మహిళలు జీవవైవిధ్య పాఠాలను ఆకళింపుచేసుకోవడంలో ముందుంటారు. వారికి ప్రకృతి మనకిచ్చిన సంపదమీద ఆసక్తి కలిగించడంలో విజయవంతం అయితే చాలు, ఇక బాణంలా ముందుకు దూసుకుపోగలరని అనుభవంలో తెలుసుకున్నాను" అంటున్నారు సబర్మతి.

మన రైతు శ్రమజీవి!

తిరుపతి పర్యటన అనుభవంతో ఆమె మనరైతులు శ్రమజీవులని కితాబిచ్చారు. "ఇక్కడి రైతులు కష్టజీవులు, కొత్త విషయాలను గ్రహించే తత్వం కలిగినవారు. అయితే, రాష్ట్రంలో పంటల జీవవైవిధ్యం దారుణంగా దెబ్బతిన్నది. ఈ పరిస్థితిని పోగొట్టాలంటే రైతులు ఒక్కొక్కరు తమకు తోచిన పంటలో కనీసం ఒక దేశవాళీ విత్తనాన్ని అయినా నాటి, అలా మొలకెత్తిన మొక్కను బిడ్డ మాదిరిగా చూసుకుంటే.. ఒక్క ఏడాదిలోనే ఎన్నో దేశవాళీ వంగడాల పరిరక్షణ సాధ్యమవుతుంది. సంభవ్ నుంచి కనీసం 300 మంది రైతులు తలా ఒక దేశవాళీ వంగడాన్ని తీసుకున్నారు. అలా తీసుకెళ్లిన వాళ్లు మరికొందరికి ఆ విత్తనాలను పంచుతున్నారు. ఎవరి ప్రమేయం లేకుండానే వేలాది దేశవాళీ విత్తనాలను రక్షించే రైతన్నలు ఎందరో ఉన్నారు. పూర్వీకులు మనకు ఇచ్చిన సంపదను కాపాడుకోవటానికి రైతే కానవసరం లేదు. తపన ఉన్న వారెవరైనా ఈ పని చేయవచ్చు. మేడమీద ఐదారు కుండీల్లో రెండు, మూడు రకాల మిర్చి వేసినా దేశవాళీ విత్తనాన్ని అంతరించిపోకుండా నిలబెట్టుకోవచ్చు" అంటూ... మన సంపదను కాపాడే బాధ్యత మనందరి మీదా ఉందని సూచిస్తూ, దానిని ఎవరూ మర్చిపోకూడదంటున్న సబర్మతి హెచ్చరికలను పట్టించుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.

వడ్ల గింజలో బియ్యపు గింజలు! మంటలేని వంట!!

నిజమే! వడ్లగింజలో ఒక బియ్యపుగింజ కాదు, బియ్యపు గింజలుంటాయి. సబర్మతి దగ్గరున్న ‘జుగల్’ రకం వడ్ల గింజలో రెండు బియ్యపు గింజలుంటాయి. ‘కోమల్’ రకం బియ్యాన్ని వండక్కర్లేదు. బియ్యాన్ని నీటిలో పోస్తే అన్నమవుతుంది. మరో రకం తులసి బసో. దీని విశేషం ఏమిటంటే ఒక్కసారి నాటితే మూడు పంటలు వస్తాయి. ధాన్యం సువాసనభరితంగా ఉంటుంది. ఇలా సుగంధాన్ని వెదజల్లే వడ్ల రకాలు ఈమె దగ్గర 48 ఉన్నాయి. ఫలితాలు సాధించిన తర్వాత చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ ప్రస్థానంలో ఎదురైన ఒడిదొడుకులు, సాధకబాధకాలను అధిగమించేందుకు ఏకంగా ఎనిమిదేళ్లు శ్రమించానన్నారామె.

ఆధారము: అగ్రికల్చర్ గేట్వే.బ్లాగ్ స్పాట్.ఇన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate