పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయం లో మెళకువలు

సేంద్రియ ఎరువులద్వారా వ్యవసాయసాగు విధానము

సహజ జీవనము, సహజ సేద్యం! బాగుపడ్డాం... హాపీగా ఉన్నాం!

వెలుగులు విరజిమ్ముతున్న సేంద్రియ వ్యవసాయ సంస్కృతి

అప్పులపాలైన బడుగు రైతు బతుకు ఏం చేస్తే నిజంగా బాగుపడుతుంది?

అదికూడా.. ఎడతెగని కరవుకు, అన్నదాతల ఆత్మహత్యలకు నెలవైన అనంతపురం జిల్లా నుంచి వలస పోయి పొట్టపోసుకుంటున్న

రైతు జీవితాన్ని ఆకుపచ్చగా మార్చడానికి ఏం చేస్తే బాగుంటుంది?

నాలుగేళ్ల క్రితం కల్యాణ్ అనే ఓ కార్పొరేట్ ఉద్యోగి తనకు తాను ఇవే ప్రశ్నలు వేసుకున్నాడు. నెలకు రూ.2 లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. ఈ ప్రశ్నలకు బాధ్యత గల పౌరుడిగా చిత్తశుద్ధితో సమాధానాలు వెతికాడు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం, స్వయం సమౄద్ధ జీవనాన్నే కల్యాణ్ కలగన్నాడు. ఈ కలను సాకారం చేసుకోవడానికి నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణాత్మక కృషి సత్ఫలితాలనిస్తోంది. ఓ చిన్న రైతు కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి, వలస వెతల నుంచి రక్షించి సగర్వంగా తన కాళ్లపై తనను నిలబెట్టింది. ఆ అదృష్టవంతుడైన రైతు పేరు లచ్చన్నగారి రామచంద్రారెడ్డి. దండగ మారి ‘గవర్నమెంటు ఎరువులు’ వదిలేసి.. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నాడాయన. ఇప్పుడా రైతు కుటుంబానికి ఆదాయ భద్రతతోపాటు బతుకుపై భరోసా కూడా చేకూరింది! దిశానిర్దేశం చేసి, తగిన తోడ్పాటునందిస్తే బడుగు రైతు బతుకు శాశ్వతంగా బాగుపడుతుందనడానికి రామచంద్రారెడ్డి అనుభవమే ఉదాహరణగా నిలుస్తుంది.

లచ్చన్నగారి రామచంద్రారెడ్డి(36), సుగుణమ్మ దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఆనంద్‌రెడ్డి ఉన్నాడు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఆరుమాకులపల్లి వారి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామచంద్రారెడ్డి చదువు పదో తరగతితో ముగిసింది. 3 ఎకరాల్లో పొలంలో ‘గవర్నమెంటు(రసాయనిక) ఎరువుల’తో వ్యవసాయం చేస్తే.. రూ. 1.75 లక్షల అప్పులు మిగిలాయి. కాడి కింద పడేసి పొట్టచేతపట్టుకొని కుటుంబ సమేతంగా బెంగళూరెళ్లి కూలి పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటుండగా.. హిందూపురానికి చెందిన విశ్రాంతాచార్యులు రాజారావు కుమారుడు కల్యాణ్ తారసపడ్డాడు. తిరిగి సొంతూరు వచ్చేస్తే పచ్చగా పంటలు పండించుకుంటూ బతుకును బాగు చేసుకునే దారి చూపుతానన్నాడు. వలస బాటపట్టిన రామచంద్రారెడ్డి ఆ విధంగా మరల సేద్యానికి మళ్లాడు. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత.. ‘అప్పులు తీరిపోయాయి. ఆనందంగా ఉన్నాం’ అంటున్నాడు. అంతేకాదు.. వ్యవసాయం దండగ కాదు.. పండగ చేసుకునే దారిదీ అని నలుగురికీ చెప్ప గలిగే స్థితికి ఎదిగాడు.

పంటకు, ఇంటికీ సొంత ఇంధనమే!

ఎంబీఏ చదివి జెనరల్ ఎలక్ట్రికల్‌లో నెలకు రూ. 2 లక్షలు సంపాదించే కల్యాణ్ గ్రామీణ పేదలకు సేవ చేసే లక్ష్యంతో ‘ఇంటిగ్రేటర్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. ఆయన సమకూర్చిన మౌలిక సదుపాయాలు, పర్యావరణహితమైన స్వతంత్ర జీవన విధానం, సేంద్రియ సాగు పద్ధతి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టింది. సొంతంగా తయారు చేసుకున్న పంకాతో ఇంటి అవసరాలకు పవన విద్యుత్ అందుతోంది. సోలార్ విద్యుత్‌తో బోరు నడుస్తోంది. బయోగ్యాస్‌తో వంట అవసరాలు తీరుతున్నాయి. రామచంద్రారెడ్డి కుటుంబంతోపాటు కల్యాణ్ కుటుంబం, ఇంతియాజ్ అనే మరో విద్యాధిక యువకుడు కూడా పొలంలో నిర్మించిన మట్టి ఇళ్లలో నివాసం ఉంటూ.. పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు. 3 ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం 300 అడుగులు తవ్విన బోరు నుంచి ఇప్పటికీ 3 అంగుళాల నీరు వస్తుండడంతో పొలానికి సాగునీటి సమస్య తీరిపోయింది. భూమిని రామచంద్రారెడ్డి దంపతులే స్వయంగా చదును చేసుకున్నారు. మూడు సొంత నాగళ్లతోనే దుక్కి దున్నడం అంతా. వ్యవసాయ పనులేవైనా సాధ్యమైనంత వరకు సొంతంగా చేసుకోవడమే. మరీ అవసరమైనప్పుడే కూలీలను పెట్టుకునేది. ఈ ఏడాది 3 ఎకరాల సాగుకు రూ. 10 వేలకు మించి కూలీలకు ఖర్చు పెట్టలేదు. 26 గిర్ ఆవులతో కల్యాణ్ ఏర్పాటు చేసిన డెయిరీ అందుబాటులో ఉండడంతో.. రామచంద్రారెడ్డి వ్యవసాయానికి పశువుల పేడ, మూత్రం కొరత లేకుండాపోయింది. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టు, జీవామృతం, పంచగవ్యతో వ్యవసాయం చేస్తున్నారు. మరీ అవసరమైతే తప్ప ఏమీ కొనకూడదన్నది సూత్రం. ఈ ఏడాది బెల్లం, వస్త్రాలు తప్ప ఏమీ కొనలేదని రామచంద్రారెడ్డి చెప్పారు.

రైతుబజారులో రెట్టింపు ధరకు అమ్మకాలు

సొంతానికి అవసరమైన అన్ని పంటలూ పండించుకోవడం, అదనంగా ఉన్న పంట దిగుబడులను మాత్రమే అమ్మటం- ఇదే మూల సూత్రం. రామచంద్రారెడ్డి తమ సేంద్రియ ఉత్పత్తులను హిందూపురం రైతుబజారుకు తీసుకెళ్లి రెట్టింపు ధరకు విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోంది. గడచిన ఖరీఫ్‌లో పంటల ద్వారా చక్కటి ఆదాయం పొందారు. అరెకరంలో 30 బస్తాల ధాన్యం పండించి, సొంత వినియోగం కోసం ఉంచుకున్నారు. అరెకరంలో 800 కిలోల రాగులు పండించి కొన్ని అమ్మారు. అరెకరంలో 800 కిలోల వేరుశనగలు పండించారు. ఎకరంలో కొత్తిమీర వేసి 45 రోజుల్లోనే రూ. లక్ష ఆదాయం పొందారు. టమాటా నాటబోతున్నారు. అరెకరంలో మిర్చి వేశారు. వారం వారం కాయలు కోసి రైతుబజార్‌కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఇప్పటికి రూ. 42 వేల ఆదాయం వచ్చింది. మరో రూ. 50 వేలు వస్తుందని అంచనా వేస్తున్నారు. 3 ఎకరాల్లో పంటల సంగతి అట్లా ఉంచితే.. ఇంటి వద్ద 3ఁ5 సైజ్ గల 8 ఫైబర్ టబ్‌ల(వికింగ్ బెడ్స్)లో ఇంటికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ ఎరువులతో పండించుకుంటున్నారు. రామచంద్రారెడ్డి సాధించిన విజయం గ్రామంలో పలువురు రైతులను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది కొందరు రైతులు ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రైతులందరకూ ఈ తరహా జీవన శైలిని, విషరహిత వ్యవసాయ పద్ధతిని అలవరచుకొని నిశ్చింతగా బతికేలా శిక్షణ ఇవ్వాలని.. గ్రామీణ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కల్యాణ్ (097417 46478) ఆశిస్తున్నారు.
- హెబ్బార్ చక్రపాణి, హిందూపురం, అనంతపురం జిల్లా

విషం లేని ఆహారం పండిస్తున్నాం..

కల్యాణ్ సారు చెప్పినట్టు చేస్తూ.. విషం లేని ఆహారం పండించి తింటున్నాం. ఖర్చు లేని వ్యవసాయం చేస్తున్నాం. పెద్దోళ్లు చేసిన వ్యవసాయం ఇది. మొదటి ఏడాది సరిగ్గా దిగుబడి రాలేదు. తర్వాత బాగుంది. భూమి రంగు మారి సత్తువ పెరిగింది. అప్పులు తీరాయి. బాగుపడ్డాం. హాపీగా ఉన్నాం. ఇతర రైతులూ ఇలాగే బాగుపడాలని అడిగిన వారికి చేతనైన సాయం చేస్తున్నాం.
- లచ్చన్నగారి రామచంద్రారెడ్డి (85009 86728),
ఆరుమాకులపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా.

మాంసం, వరి పొట్టుతో పంచగవ్య!

ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారు చేసే ‘పంచగవ్య’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి పంచగవ్య తయారు చేస్తే.. మరింత శక్తిమంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా.వీ.ఎల్. నెనె. ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డెరైక్టర్ అయిన ఆయన ఆసియన్ అగ్రికల్చర్ హిస్టరీ ఫౌండేషన్(ఏఏహెచ్‌ఎఫ్) గౌరవాధ్యక్షుడుగా సేవలందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సాధారణ పంచగవ్య కన్నా ఈ పంచగవ్య అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని డా. నెనె అంటున్నారు.
తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం(గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరి నీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.

తయారు చేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే పంచగవ్య తయారీకి వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరి పొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతోపాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతి గల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి.. పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి.. నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల పంచగవ్యను కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి. ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీని వల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది. సందేహాలుంటే సూర్య 984 991 5774 నంబరులో సంప్రదించవచ్చు. ఈ మెయిల్: aahfhyd@gmail.com

ఇటు వ్యాయామం... అటు సహజాహారం!

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే, ఆ వ్యాయామం కోసమే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టునే పండించుకోవడానికి కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే రేణుకుంట్ల శ్రీరాములు తన ఇంటిపైన 3 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు.

హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ మాజీ ఉద్యోగైన శ్రీరాములు(61) కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో స్థిరపడ్డారు. ఇంతకుముందున్న ఇంటి వద్ద పెరట్లో చాలా ఖాళీస్థలం ఉండడంతో పూలమొక్కలు, కూరగాయ మొక్కలు పెంచే అలవాటుంది. కొద్ది నెలల క్రితం 3 అంతస్థుల కొత్త ఇంట్లోకి మారిన తర్వాత.. మేడ మీద గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. గుండ్రంగా ఉండే పెద్ద గ్రోబాగ్స్ పది, 50కి పైగా చిన్న కుండీల్లో టమాటా, బీర, పొట్ల, సొర, దోస, గోంగూర, పాలకూర, చుక్కకూర సాగు చేస్తున్నారు. మొక్కలకు ఎండాకాలంలో మొక్కలకు షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షించుకోవడానికి టైపైన పక్కాగా ఇనప ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. మొక్కలంటే ప్రాణం కాబట్టి కొంత ఖర్చయినప్పటికీ ఈ ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు.
దసరా పండుగ తర్వాత గ్రోబాగ్స్ తెచ్చి టై కిచెన్ గార్డెన్‌కు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్ ఎర్రమట్టి, అర ట్రాక్టర్ చివికిన పశువుల ఎరువుతోపాటు కోకోపిట్, వేపపిండితో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొక్కలకు రోజ్‌క్యాన్‌తో తగుమాత్రంగా నీరు పోయడంతో శ్రీరాములు దినచర్య ప్రారంభమవుతుంది. కనీసం గంట సేపు చక్కని వ్యాయామం దొరుకుతోందని ఆయన చెప్పారు. దీంతోపాటు మొక్కలను దగ్గరగా పరిశీలించడం వీలవుతోందన్నారు.

నలుగురు కుటుంబానికి అవసరమయ్యే ఆకుకూరలు, కూరగాయల్లో 60% వరకు ప్రస్తుతం తామే పండించుకుంటున్నామన్నారు. 15-20 రోజులకోసారి వేపనూనెను మొక్కలపై పిచికారీ చేస్తామని, అంతకుమించి మరేమీ అవసరం రావడం లేదని ఆయన తెలిపారు. రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలను సొంతంగా మేడ మీద పండించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కూరగాయలు, ఆకుకూరలను కోసిన 5 నిమిషాల్లోనే వండుకునే వీలుండడం, రుచి చాలా బాగుండడం సంతృప్తినిస్తోందన్నారు. ప్రగతినగర్ మాజీ సర్పంచ్ అయిన శ్రీరాములు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. టైలు ఖాళీగా ఉంచేకన్నా ఉన్నంతలో సహజాహారాన్ని పండించుకోవడం మేలని తన చేతల ద్వారా చాటుతున్నారు.

సిరుల పంట ‘కినోవా’

సాగు నీటి కొరత తదితర కారణాల వల్ల వరి సాగు లాభదాయకంగా లేకపోవటంతో నల్లగొండ జిల్లా (పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట)కు చెందిన అభ్యుదయ రైతు వంగాల ప్రతాప రెడ్డి(9885949265) కినోవా అనే కొత్త పంటను సాగు చేస్తున్నారు. బొలీవియా దేశం నుంచి తెప్పించిన తెల్ల రకం కినోవాను ఖరీఫ్‌లో ఎకరంన్నరలో సాగు చేసి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. రూ. 95 వేల నికరాదాయం పొందారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయటంతో రూ. 15 వేలు మాత్రమే ఖర్చయిందన్నారు. తాను పండించిన కినోవా ధాన్యం కిలో రూ. 100లకు విక్రయించారు. వరి సాగు చేసినా ఎకరాకు రూ. 10 వేలు కూడా మిగలటంలేదని, దీనికి బదులు కినోవాను ఆరుతడి పంటగా సాగు చేస్తే ఎకరాకు మంచి ఆదాయం పొందవ చ్చని ఆయన అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన రబీలో రెండెకరాల్లో కినోవాను సాగు చేస్తున్నారు. ట్రేలలో నారు పెంచి, నాట్లు వేశారు.

అరటికి గెలాక్సినేషన్ - మొక్కలకు వ్యాక్సినేషన్

యువ సైంటిస్ట్ వినూత్న ఆవిష్కరణ
పిల్లలకు జబ్బు చేయకుండా టీకాలు వేయడం చూశాం. కానీ మొక్కలకు కూడానా?! అవునండి.. ఇది నిజం. మొక్కలకొచ్చే చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడిని పొందేందుకు ఈ టీకాలు అవసరం అంటున్నారు హైదరాబాద్ యూసఫ్‌గూడాలోని సెయింట్ మేరీస్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీతా పాణిగ్రహి. ఇటీవల వైజాగ్‌లో జరిగిన ఆరో అంతర్జాతీయ సదస్సు (భవిష్యత్‌లో డీఎన్‌ఏ-లెడ్ టెక్నాలజీ)-2014లో అరటి

మొక్కలకు వ్యాక్సినేషన్ అనే థీసిస్‌కు ఆమె ‘యంగ్ సైంటిస్ట్ అవార్టు’ లభించింది. వ్యాక్సినేషన్‌తో మొక్కల్లో ఫినాల్ శాతం పెరుగుతుందన్న అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి గతేడాది కూడా అదే సదస్సులో సునీత ఇదే అవార్డును అందుకున్నారు. నిజానికి సునీత వ్యవసాయ కుటుంబంలోంచి రాలేదు. అయినా రైతులకు ఏదైనా చేయాలన్న తపనే ఆమెను ఈ రంగంలోకి తీసుకొచ్చింది...

ఓ వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రాణిస్తూ మరోవైపు పరిశోధనలతో దూసుకుపోతున్న ఈ 32 ఏళ్ల యువ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త ఎనిమిదేళ్లు కృషి చేసి అరటి మొక్కలకు టీకాల పద్ధతిని కనుగొన్నారు. నిరుపేదల నుంచి ధనికుల వరకు అందరికీ చౌక ధరలో దొరికే పండు ఒక్క అరటేనని నమ్మి ఆమె ఈ పరిశోధన మొదలు పెట్టారు. ఈ పరిశోధనకు ముందు ఆమె కందులు, శనగలపై ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత అరటిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.

"వ్యాక్సిన్‌ను సహజసిద్ధ మృత్తికలతో మా కాలేజీ ల్యాబ్‌లోనే తయారు చేశాను. దీన్ని అరటి మొక్కలకు ఇస్తే అవి ఆరోగ్యంగా పెరిగి ఆరు నెలల్లో ఇవ్వాల్సిన దిగుబడిని రెండు నెలల్లోనే ఇస్తాయి. ప్రభుత్వ సాయంతో రైతులందరికీ టీకాలు వేసిన అరటి మొక్కలు అందించాలన్నదే నా ధ్యేయం" అని అంటున్నారు సునీత. ఇద్దరు పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఇంటినీ, ఉద్యోగాన్నీ, పరిశోధనల్ని సమన్వయ పరచుకుంటూ ముందుకు సాగుతున్న సునీతకు భర్త శ్రీధర్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది.

"కుటుంబ మద్దతు లేకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. అందులోనూ నా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న మహిళను నేనొక్కదాన్నే. నాకు ఇద్దరు అబ్బాయిలు. నా భర్త ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం మా నాన్నగారు త్రినాథ్ పాణిగ్రాహి, భర్త శ్రీధర్. మా స్వస్థలం వైజాగ్. నా విద్యాభ్యాసమంతా అక్కడే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేస్తున్నాను. 2007లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఈ కాలేజీలోనే పని చేస్తున్నాను. నా పరిశోధనలు సజావుగా సాగడానికి సహోద్యోగులు, విద్యార్థులు అందిస్తున్న సహకారం మరువ లేనిదే" నంటారు సునీత.

సునీత చిన్నప్పటి నుంచే ఒకవైపు వాలీబాల్, త్రోబాల్ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు సైన్స్‌లో చిన్న చిన్న పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. ఈ యంగ్ సైంటిస్ట్‌కు స్నేహితులతో ముచ్చటించడం, స్విమ్మింగ్, సైక్లింగ్ అంటే ఇష్టం. పుస్తకాలు చదవడం తక్కువే అయినా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడం అలవాటు. హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి, హీరో సాయి ధరమ్‌తేజ్ సునీత విద్యార్థులే.
- నిఖిత నెల్లుట్ల

సోలార్ డ్రయ్యర్‌తో మేలు

ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అయినకాడికి తెగనమ్ముకోవడమో లేక చెత్తకుప్పలో పారేయడమో కాకుండా.. వ్యవసాయోత్పత్తులను చక్కగా శుద్ధిచేసి, రూపం మార్చి అమ్ముకోగలిగితే రైతు కుటుంబాలు లేదా రైతు సంఘాల ఆదాయం బాగా పెరుగుతుంది. ఉదాహరణకు.. టమాటా మార్కెట్ ధర బాగా తగ్గిపోయినప్పుడు టమాటాలను ముక్కలు కోసి ఒరుగులుగా ఎండబెట్టి, పొడి చేసి అమ్ముకునే వీలుంది. సంప్రదాయ పద్ధతుల్లో కన్నా సోలార్ డ్రయ్యర్ల సహాయంతో ఈ పనిచేస్తే వేగంగా పని కావడంతోపాటు, సరుకు నాణ్యత కూడా చాలా బాగుంటుంది. టమాటాతోపాటు కొబ్బరి, ద్రాక్ష, అంజూర, క్యారెట్, మామిడి, ఉల్లి, కరివేపాకు, అల్లం, గోధుమగడ్డి వంటి వ్యవసాయోత్పత్తులతోపాటు మాంసం, చేపలు, రొయ్యలను కూడా ఈ పద్ధతిలో వేగంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఎండబెట్టవచ్చు. మాంసాన్ని సోలార్ డ్రయ్యర్‌లో ఒక్క రోజులోనే దుమ్మూ ధూళి పడకుండా ఎండబెట్టవచ్చని, కిలో మాంసం ఎండబెడితే అరకిలో ఒరుగులు వస్తాయని ఎన్‌ఐఆర్‌డీ కన్సల్టెంట్ ఖాన్ ‘సాక్షి’తో చెప్పారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీ- రాజేంద్రనగర్, హైదరాబాద్) ఇందుకు మార్గం చూపుతోంది. ఎన్‌ఐఆర్‌డీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రామీణ సాంకేతిక ప్రదర్శనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు సోలార్ డ్రయ్యర్లను ప్రదర్శించాయి. సొసైటీ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్(040-23608892) 8 కిలోలు, 50 కిలోలు, 100 కిలోల సామర్థ్యం కలిగిన సోలార్ డ్రయ్యర్లను అందుబాటులోకి తెచ్చింది. టీవేవ్ పవర్‌టెక్ సంస్థ (040-27266309) సోలార్ డ్రయ్యర్లను ప్రదర్శనకు ఉంచింది. డ్రయ్యర్లను కొనుగోలు చేసే మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి 40 శాతం రాయితీ లభించే వీలుందని చెబుతున్నారు. సోలార్ ఫ్రిజ్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే రైతులు, మత్స్యకారులు, యువతీ యువకులు సోలార్ డ్రయ్యర్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. వివరాలకు ఎన్‌ఐఆర్‌డీలోని గ్రామీణ మౌలిక సదుపాయాల కేంద్రం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ శివరాం (94408 46605 టజీఠ్చిః జీటఛీ.జౌఠి.జీ)ను సంప్రదించవచ్చు.

www.nird.org.in

ఆక్వాపోనిక్ పద్ధతి : మట్టి లేకుండా సేంద్రియ ఇంటిపంటలు

టై మీద, పెరట్లో మట్టి వాడకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకునే అవకాశం ఉంది. వీటితోపాటు మంచినీటి చేపలు లేదా అక్వేరియం చేపలను కూడా కలిపి ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సాగు చేయవచ్చని స్వానుభవంతో చెబుతున్నారు డా. ఎన్‌ఎంకే సూరి.

బాల్కనీల్లో, టైల పైన, పెరట్లో మట్టి లేకుండానే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుకోవాలంటే సులువైన విధానం హైడ్రోపోనిక్స్. కొబ్బరి పొట్టులో వర్మీకంపోస్టు(2:1 నిష్పత్తిలో) కలిపి సేంద్రియ ఇంటిపంటగా రసాయన రహిత ఆహారాన్ని పెంచుకోగల అవకాశాలు మెండు. తక్కువ నీటి వసతి ఉన్న చోట ఈ పద్ధతి బాగా ఉపయోగ పడుతుంది.

ఆక్వాపోనిక్ పద్ధతి ద్వారానైతే.. ప్రత్యేకంగా నీరు పోయాల్సిన శ్రమ ఉండదు. అదనంగా చేపలు కూడా పెంచుకోవచ్చు. చేపలు పెంచుకోవడానికి అక్వేరియం ఒకటి ఏర్పాటు చేసుకొని, దానిలో నుంచి చేపల నీటిని పంపు ద్వారా మొక్కలకు అందేలా పైపు అమర్చుకోవాలి.

అక్వేరియంలో నీటిని మార్చే శ్రమ కూడా వద్దనుకుంటే, మొక్కలకు అందించిన నీటినే తిరిగి అక్వేరియంలోకి చేరేలా మరో పైపును అమర్చి నిరంతర నీటి ప్రవాహం జరిగే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. అక్వేరియం, మొక్కల కుండీలు, మోటారు పంపు, పైపులు ఏ సైజులో ఎట్లా ఉండాలి? అనేది మీరు ఎంపికచేసుకునే స్థలాన్ని బట్టి ఉంటుంది. తినడానికి పనికివచ్చే మంచినీటి కార్పు చేపలు లేదా అక్వేరియానికి పనికి వచ్చే ఆర్నమెంటల్ ఫిష్ గానీ, మన అవసరాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. మొక్కలను కుండీల్లో పెట్టుకోవచ్చు లేదా వీలైన సైజులో ఒక గ్రోటబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో అక్వేరియం సామగ్రిని అమ్మే వారి వద్ద దొరికే స్టోన్స్(3/4‘)ను నింపుకొని.. ఆ టబ్‌లో ఆకుకూరలు, కూరగాయ మొక్కలను నాటుకోవచ్చు.

పోషకాలు అందేదెలా?

చేపల విసర్జితాలు కలిసే నీరే మొక్కలకు ప్రధాన పోషక వనరు. జీవామృతం లేదా వర్మీ వాష్ వంటి ద్రావణ ఎరువులను అదనంగా వాడొచ్చు. ఆకుకూరల మొక్కలకు వారానికోసారి, కూరగాయపంటలకు వారానికి రెండుసార్లు వాడాలి. సాధారణంగా చెరువుల్లో పెరిగే రోహు, తిలాపియా వంటి ఏ చేపలనైనా పెంచొచ్చు. ఇవి ఎదగడానికి 6-9 నెలల కాలం పడుతుంది. ట్యాంకు సైజు ఎంత పెద్దగా ఉంటే చేపలు అంత బాగా పెరుగుతాయి.

ఆక్వాపోనిక్స్‌ను ఇంటి పెరట్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. స్టెయిన్‌లెస్ స్టీల్ ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఇంట్లో పెట్టుకోవచ్చు. మా టై మీద ప్లాస్టిక్ ట్యాంకులలో 4X4X4 ప్రయోగాత్మకంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించాను. దీన్ని 30X20 లకు విస్తరింపచేయబోతున్నాను. ఔత్సాహికులు చిన్న అక్వేరియం అంతటి పాత్రలను ఏర్పాటు చేసుకొని సేంద్రియ ఆక్వాపోనిక్స్ పద్ధతిలో అలవాటు చేసుకోవచ్చు. అక్వేరియం చేపలు, మొక్కల పెంపకం గురించి కొంత అవగాహన ఉన్న వారికి ఆక్వాపోనిక్స్ అంతగా కష్టమేమీ అనిపించదు. సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.

చింత తీర్చేది చిరుధాన్యాలే

జొన్న రొట్టె, సజ్జ మలీద, రాగి సంకటి... ఇవన్నీ తెలంగాణ ఆహార వ్యవస్థ నుంచి విడదీయలేని వంటలు. పెళ్లిళ్లలో జొన్న తలంబ్రాలు.. మన చేలల్లో జొన్న పంటలు. సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, దేశీ మక్కలు(మొక్కజొన్నలు) ఇవ న్నీ తెలంగాణ వైశిష్ట్యాలు. తెలంగాణ మెట్ట భూముల దిక్కు చూస్తే 60 నుంచి 70 శాతం వరకూ ఈ చిరుధాన్యాలనే సాగు చేసేవారు. అయితే, ఎప్పుడైతే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో బియ్యాన్ని చేర్చారో అప్పటి నుంచి చిరుధాన్యాల సంస్కృతి కనుమరుగవుతున్నది.
కిలో బియ్యం రూ. 2కు, రూ.1కు, ఉచితంగా ఇవ్వటంతో జొన్నలు, సజ్జలు, కొర్రలు తినేటి జనం ఆహార భ్రష్టులై బియ్యానికి బానిసలయ్యారు. ఇప్పుడు బియ్యం కబంధ హస్తాలు తెలంగాణ జనాన్ని సంపూర్ణంగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. కిలో రూ.2కే బియ్యం ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే మెదక్ జిల్లాలో చిరుధాన్యాలు పండే లక్ష హెక్టార్ల భూమిని రైతులు బీళ్లుగా వదిలేశారు. అప్పటి నుంచి సంప్రదాయక ఆహార పద్ధతుల పతనం ప్రారంభమైంది. క్రమంగా చిరుధాన్యాలనేవి మాయమయ్యే పరిస్థితి వచ్చింది.

మధుమేహం, రక్తపోటు బియ్యం పుణ్యమే

పీడీఎస్ ద్వారా ప్రభుత్వం బియ్యం సరఫరా చేసిన ప్రభావం కేవలం సాగు భూములపైనే కాక ప్రజల ఆరోగ్యం, ప్రత్యేకించి పిల్లల పౌష్టికత మీద తీవ్ర ప్రభావం చూపింది. బియ్యం వాడకంతో పోషకాల కొరత ఏర్పడి ప్రజలు మధుమేహం, రక్తపోటు సహా పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకే రకమైన ఆహార పదార్థాలను పదేపదే తినటం ద్వారా పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది. ప్రజల ఆహారపు అలవాట్లకు స్కూల్, హాస్టల్, అంగన్‌వాడీ భోజనాలు గండి కొట్టాయి. వీటన్నింటా పిల్లల ఆహారంలో వరి బియ్యం తప్ప మరే ఆహారానికి చోటు లేదు. జొన్నరొట్టె, రాగి సంకటి, కొర్ర బువ్వను తిన్న పేద పిల్లలు సైతం బలంగా ఎదిగేవారు. చిరుధాన్యాలలో పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి అవసరమైన ఇనుము, సున్నం, కాల్షియం, బీటాకెరోటిన్, నియాసిన్, ఇతర సూక్ష్మ పోషకాలు దండిగా ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు, ఆరోగ్యానికి, వాళ్ల శరీరంలో శక్తి నింపడానికి చాలా అవసరమైనవి ఈ పోషకాలు. బియ్యంలో వీటి కొరత చాలా ఎక్కువ. కానీ, ఈ పరిస్థితుల్లో కార్డుల మీద 6 కిలోల చొప్పున, హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలన్న నిర్ణయంప్రజల ఆరోగ్యానికి మేలు చేయబోదనే విషయం ప్రభుత్వం గుర్తించాలి. చిరుధాన్యాలను ఆహారంగా అందిస్తే పోషక లోపాన్ని సవరించటం సాధ్యమవుతుంది. తద్వారా వీటి సాగు పెరుగుతుంది.

కరువు కాలానికి తగిన పంటలు

తెలంగాణలో సాగునీటి కొరత చాలా ఎక్కువ. ఈ సమస్యకు సరైన సమాధానం సాగు నీరు అవసరం లేని పంటలైన చిరుధాన్యాలు పండించడమే. పోయిన దశాబ్దం కరువు దశాబ్దంగా గడిచింది. వాతావరణ మార్పు వల్ల రాబోయే కాలంలో నీటి కొరత ఇంకా తీవ్రమవుతుంది. ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయి. వీటితోనే అపౌష్టికత కూడా పెద్ద సమస్యవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొత్త సేద్య ప్రణాళికను రూపొందించుకోకుండా.. వరి, చెరకు సాగును ప్రోత్సహిస్తూ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిపెడుతూ ఉంటే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో మనం చిరుధాన్యాల గురించి ఇంకోసారి ఆలోచించాలి.
తెలంగాణను చిరుధాన్యాల రాష్ట్రంగా ప్రకటించాలి. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రోత్సహించాలి. అప్పుడే మనం ఒక కొత్త రాష్ట్రంలో భవిష్యత్తు గురించి సవ్యంగా ఆలోచిస్తున్నామని చెప్పుకోగలం. వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి, గోధుమ సాగు మరింతగా సమస్యల మయం కాబోతున్నందున దేశ ఆహార భద్రత ప్రమాదంలో చిక్కుకోనుంది. ఈ తరుణంలో మనకు అండగా నిలిచేది చిరుధాన్యాలే. ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఒక చిరుధాన్యాల రాష్ట్రం అయితే.. ఈ దేశపు ఆహార భద్రతను కాపాడిన రాష్ట్రంగా మనం భవిష్యత్తులో ఒక స్థానాన్ని పొందగలుగుతాం.

(వ్యాసకర్త డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ డెరైక్టర్)
satheeshperiyapatna@gmail.com

చిరుధాన్యాలకు సారవంతమైన భూములు అవసరం లేదు. సారం అంతగా లేని భూముల్లో కూడా ఇవి పెరుగుతాయి.వర్షాధార పంటలైన చిరుధాన్యాలకు నీటి తడులు పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ వర్షాలు కురిసినా మంచి దిగుబడులొస్తాయి. చిరుధాన్యాలు పోషకాల భాండాగారాలు. పౌష్టికాహార లోపాన్ని జయించడానికి ఇవి ఆధారంగా నిలుస్తాయి.

అధిక సాగు నీరు అవసరమయ్యే వరి, గోధుమ సాగులో సమస్యలు జటిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణను చిరుధాన్యాల సాగు ప్రధాన రాష్ట్రంగా ప్రకటించడం మేలన్న డిమాండ్ ముందుకొస్తోంది. కరువు కాలంలోనూ ప్రజలకు పౌష్టికాహారాన్ని, ఆహార భద్రతను అందించగలిగేది చిరుధాన్యాలేనన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలంటున్నారు పీ వీ సతీష్.

పుస్తక జ్ఞానంతోనే ప్రకృతి సేద్యం!

 

బతుకును పచ్చగా మార్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉన్న పట్టభద్రుడైన ఒక యువ రైతు జగదీశ్వర్‌రెడ్డి కేవలం పుస్తకాలు చదివి, వీడియోలు చూసి ప్రకృతి సేద్యాన్ని నేర్చుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి తొలుత వ్యతిరేకత వచ్చినా దీక్షతో ముందడుగేసి.. వారితోనే శభాష్ అనిపించుకుంటున్నాడు. విద్యుత్ సంక్షోభాన్ని సౌర విద్యుత్ మోటారుతో అధిగమిస్తున్నాడు. తాను పండించిన బియ్యం,కూరగాయలను సొంత దుకాణం ద్వారా సహజాహార ప్రేమికులకు అమ్ముతున్నాడు. చక్కని ఆదాయాన్ని పొందుతూ
తోటి అన్నదాతలకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తపుంతలు తొక్కే గుణమే అన్నదాతలకు శ్రీరామరక్ష అని రుజువు చేస్తున్నాడు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గడ్డం జగదీశ్వర్ రెడ్డి(41). కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం రాంపూర్‌లో పుట్టిన ఆయన బీఎస్సీ మ్యాథ్స్ పాసై.. కంప్యూటర్ శిక్షణ, సేల్స్, సర్వీసింగ్ రంగాలలో ఆరేడేళ్లపాటు కష్టపడినా ఫలితం లేకపోవడంతో వ్యవసాయంపైన దృష్టి పెట్టాడు.

పాలేకర్ పుస్తకాలు.. వీడియోలు..

పదెకరాల సొంత భూమిలో సాగుకు రసాయన ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. లక్ష వరకు ఖర్చయ్యేది. ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి అప్పులే మిగులుతుండడంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం మానేద్దామనుకున్నాడు. అటువంటి సమయంలో మహారాష్ట్రకు చెందిన సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి తెలిసింది. పాలేకర్ పుస్తకాలు తెప్పించుకొని నాలుగైదు సార్లు క్షుణ్ణంగా చదివి.. యూట్యూట్‌లో వీడియోలు చూసి వ్యవసాయంలో తాను చేస్తున్న తప్పులేమిటో.. చేయాల్సిందేమిటో తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో క్రమంగా, దశలవారీగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తూ మూడేళ్లలో పూర్తిస్థాయి ప్రకృతి సేద్యంలోకి మారాడు. నాటు ఆవును కొని షెడ్డు వేసి, ఆవు మూత్రం ఒక పక్కకు వచ్చి నిలిచేలా ఏర్పాటు చేశాడు. ఆవు మూత్రంతో ఘన జీవామృతం, జీవామృతం తయారు చేసి పంటలకు వేస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయం రైతుకు ఎంత లాభదాయకమో తెలుసుకున్న ఆయన తల్లితండ్రులతోపాటు, ఇతర రైతులూ ఆశ్చర్యపోతున్నారు.

జీవామృతం.. ఆవు మూత్రం

4 ఎకరాల్లో వరి పొలం, మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, రెండెకరాల్లో పండ్ల తోటలు, ఎకరంలో కూరగాయలు, పూలను 2014 ఖరీఫ్ నుంచి పూర్తిగా ప్రకృతి సేద్యపద్ధతుల్లోనే సాగు చేస్తున్నాడు. పంట ఏదైనా దుక్కిలో యూరియా, డీఏపీకి బదులు ఎకరానికి క్వింటా చొప్పున ఘనజీవామృతం, వేపపిండి, ఆముదం పిండి వేస్తాడు. తర్వాత ప్రతి 15 రోజులకోసారి జీవామృతం సాగు నీటిలో కలిపి పంటలకు అందిస్తాడు. పురుగులేమైనా కనిపిస్తే 15 లీటర్ల నీటికి 2 లీటర్ల ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తాడు. సాగు ఖర్చు సగానికి సగం తగ్గింది. పంటలు నిగ నిగలాడకపోయినా ఆరోగ్యంగా పండుతున్నాయి.

ఆదుకున్న సౌర విద్యుత్తు

బోర్లు, వ్యవసాయ బావులే ఆధారం. ఎకరం తడవడానికి సరిపోయేంత సిమెంటు తొట్టిని కట్టించి, నీటిని అందులోకి తోడి.. డ్రిప్, స్ప్రింక్లర్లు, కాలువల ద్వారా పంటలకు అందిస్తున్నాడు. విద్యుత్ కోతలతో మోటర్లు నడవక రెండెకరాల్లో వరి, కొంత పసుపు ఎండిపోయింది. మిగిలిన పంటలనైనా రక్షించుకోవాలంటే సౌర విద్యుత్తే దిక్కని సకాలంలో గుర్తించి.. అప్పుచేసి మరీ రూ.3.5 లక్షలతో 5 హెచ్‌పీ సోలార్ పంపును పెట్టించాడు. ఇప్పటికీ కరెంటు రోజు మార్చి రోజు ఇస్తున్నారని, సోలార్ పంపు లేకపోతే పంటేదీ చేతికొచ్చేది కాదని జగదీశ్వర్‌రెడ్డి చెప్పాడు.

మూడింతల నికరాదాయం

2014 ఖరీఫ్ సీజన్‌లో జై శ్రీరాం అనే సన్న రకం వరిని జగదీశ్వర్ రెడ్డి సాగు చేసాడు. నాలుగెకరాలకు విత్తనాలు, కూలీలు ఇతర ఖర్చుల రూపేణా రూ. 70 వేల వరకు ఖర్చు చేశాడు. కానీ, కరువుతో రెండెకరాల్లో వరి పంట ఎండిపోయింది. ధాన్యం మర పట్టిస్తే 30 క్వింటాళ్ల బియ్యం చేతికొచ్చాయి. నేరుగా వినియోగదారులకు అమ్మితేనే గిట్టుబాటు ధర వస్తుందని గ్రహించిన జగదీశ్వర్‌రెడ్డి సొంతంగా సహజాహార దుకాణం తెరిచాడు. జై శ్రీరాం బియ్యం క్వింటా ధర మార్కెట్లో రూ. 4 వేలుండగా రూ.6,500కు అమ్ముతున్నాడు. కిలో రూ.10-15 అధిక ధరకు కూరగాయలు అమ్ముతున్నాడు. తక్కువ ఖర్చుతో పండించడం, శ్రమకోర్చి నేరుగా తానే అమ్ముతున్నందున సాధారణ రైతులతో పోల్చితే ప్రతి పంటలోనూ మూడింతల నికరాదాయం పొందుతున్నాడు. తనంతట తానే నేర్చుకున్న ప్రకృతి సేద్యం జగదీశ్వర్‌రెడ్డికి ఆదాయ భద్రతను, వినియోగదారులకు ఆరోగ్య భద్రతను ఇస్తుండడం హర్షదాయకం.
- పన్నాల కమలాకర్ రెడ్డి,
జగిత్యాల అగ్రికల్చర్, కరీంనగర్ జిల్లా

ఖర్చంతా కూరగాయల ద్వారా రాబట్టాలి!

గత మూడేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటలు పండిస్తున్నా. పెట్టుబడి ఎకరానికి రూ. 5 వేల వరకు తగ్గింది. ఇప్పుడిప్పుడే ఇతర రైతులూ ఈ వ్యవసాయం వైపు చూస్తున్నారు. మా బియ్యం, కూరగాయలు తిన్న వాళ్లు తేడా గుర్తిస్తున్నారు. మార్కెట్‌లో కొన్న కూరగాయలు వండినప్పుడు పురుగుమందు వాసన వస్తుంటే పారేశామని చెప్పినవాళ్లున్నారు. కూరగాయ పంటల ద్వారా ఖర్చులన్నీ రావాలి.. వరి, పసుపు తదితర ప్రధాన పంటలపై ఆదాయం నికరంగా మిగలాలి. వచ్చే ఏడాది నుంచి ఈ లక్ష్యం సాధిస్తా.

- గడ్డం జగదీశ్వర్‌రెడ్డి (93915 11076),
రాంపూర్, మల్యాల మండలం, కరీంనగర్ జిల్లా

ఊరెళ్తున్నారా..?

 

ఇంటిల్లిపాదీ ఎక్కువ రోజులు ఊరెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రీతిపాత్రమైన ఇంటిపంటలను, పూలమొక్కలను, ఔషధమొక్కలను బతికించుకోవడం ఎలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సమస్యకు ‘ఇంటిపంట’ బృంద సభ్యురాలు కాట్రగడ్డ వరూధిని సృజనాత్మకతను జోడించి.. ఖర్చులేని చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు. ఆమె 4 పొడవాటి కుండీల్లో ఆకుకూరలు పెంచుతున్నారు. వీటికన్నా ఎత్తులో ఒక స్టూల్‌పైన బక్కెట్ ఉంచి.. అందులో నీటిని నింపారు.

ఒక నూలు తాడును తీసుకొని.. ఒక చివరను బక్కెట్‌లో వేసి.. రెండో చివరను కుండీలోని మట్టిలో పెట్టారు. కదిలిపోకుండా చిన్న రాయిని కట్టారు. 4 కుండీలకూ ఇలాగే చేశారు. ఆ తాళ్ళ ద్వారా మొక్కల వేళ్లకు అవసరం మేరకు నీటి తేమ అందింది. 12 రోజుల తర్వాత ఆమె ఊరు నుంచి వచ్చి చూస్తే.. బక్కెట్‌లో చాలా నీరు ఖర్చయింది. ఆకుకూరలు ఏపుగా పెరుగుతూ పలకరించడంతో పట్టలేని సంతోషం కలిగింది! ఆ సంతోషాన్ని ఆమె ‘ఇంటిపంట’ ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యులతో పంచుకున్నారు... ఇంకేముంది లైకుల పంట పండింది!

చక్కని పురుగులమందు ‘చేపల కునపజలం’!

 

మిగిలిపోయిన చేపలు/రొయ్యలు.. వీటి వ్యర్థాలూ వాడొచ్చు
ఏ పంటలపైనైనా పిచికారీ చేయొచ్చు

సేంద్రియ సాగు ద్వారా ఆరోగ్యదాయకమైన, రుచికరమైన, సకల పోషకాలతో కూడిన సహజాహారాన్ని పండించే క్రమంలో సేంద్రియ ద్రవరూప ఎరువుల పాత్ర చాలా కీలకమైనది. పంటల దిగుబడిని పెంచేందుకు ‘కునపజలం’ అనే ద్రావణ ఎరువును మన పూర్వీకులు పంటలకు వాడేవారని వెయ్యేళ్ల నాటి సురాపాలుడి రచన ‘వృక్షాయుర్వేదం’ చెబుతోంది. స్థానికంగా రైతుకు అందుబాటులో ఉండే వనరులతో తయారు చేసుకోవడంతో పాటు.. ఏ దశలో ఉన్న పంటకైనా వాడటానికి అనువైనదై ఉండటం కునపజలం (వివరాలకు.. 2014-10-09 నాటి ‘సాగుబడి’ పేజీ) ప్రత్యేకత. ఆసియన్ అగ్రికల్చర్ హిస్టరీ ఫౌండేషన్(ఏఏహెచ్‌ఎఫ్) ‘వృక్షాయుర్వేదా’న్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత కొందరు రైతులు సేంద్రియ ద్రావణ ఎరువుగా కునపజలాన్ని వాడుతున్నారు. అయితే, సాధారణ ‘కునపజలం’ దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగపడితే, ‘చేపల కునపజలం’ ప్రభావశీలమైన పురుగుల మందుగా ఉపయోగపడుతుందని డా. వీ ఎల్ నెనె (ఏఏహెచ్‌ఎఫ్ గౌరవాధ్యక్షులు, ‘ఇక్రిశాట్’ మాజీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్) ‘సాక్షి’తో చెప్పారు.

‘చేపల కునపజలం’ తయారీకి కావలసినవి:

2:10 నిష్పత్తిలో చేపలు, ఆవు మూత్రం. అంటే.. 2 కిలోల చేపలు లేదా చేపల వ్యర్థాలకు 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి పులియబెట్టాలి. చేపల మార్కెట్‌లో లభ్యమయ్యే వ్యర్థాలు లేదా స్వల్ప ధరకు లభించే అమ్ముడుపోని లేదా మెత్తబడిపోయిన చిన్న/పెద్ద చేపలను, రొయ్యల వ్యర్థాలను కూడా వాడొచ్చు. ఆవు మూత్రానికి బదులు మనుషుల మూత్రం కూడా వాడొచ్చు. నత్రజని, అమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారి మూత్రం మరింత ప్రభావశీలంగా ఉంటుంది. నీడన ఏర్పాటు చేసిన డ్రమ్ములో లేదా తొట్టిలో చేపలు/చేపల వ్యర్థాలను మూత్రంతో కలిపి(ఉడకబెట్టాల్సిన పని లేదు) పులియబెట్టాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కలియదిప్పాలి. వారం రోజుల తర్వాత ద్రావణాన్ని వడకట్టి నిల్వచేసుకోవాలి.

ఇలా సిద్ధమైన చేపల కునపజలంతో సిద్ధం చేసుకున్న 5% ద్రావణాన్ని పంటలపై పిచికారీ చేయాలి. అంటే.. 5 లీటర్ల చేపల కునపజలాన్ని 95 లీటర్ల నీటిలో కలిపి.. పిచికారీ చేయాలి. ఏ పంటలపైనైనా పిచికారీ చేయొచ్చు. ఇలా పిచికారీ చేస్తే పెద్ద పురుగులను సైతం సమర్థవంతంగా అరికట్టవచ్చనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని డా. నెనె తెలిపారు. చేపల కునప జలాన్ని 3 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. డా. నెనెను 040 27755774 నంబరులో సంప్రదించవచ్చు.

రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా...ఆచంట శిగలో ఆకుపచ్చని వరి!

 

కరువు కాటకాల్లోనూ మంచి దిగుబడులనిచ్చే దేశవాళీ వరి వంగడాలు కొత్త ఏడాదిలో అందుబాటులోకి రానున్న సంగతులు గత వారం ‘సాగుబడి’లో చదువుకున్నాం. ఆ విశిష్ట వంగడాలు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ) నుంచి ప.గో. జిల్లా ఆచంట ముంగిటకు ఇంతకుముందే చేరుకున్నాయి. ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు ట్రేలలో నారును అపురూపంగా పెంచుతున్నారు. ప్రత్యేక మడుల్లో రేపో మాపో ఊడ్చబోతున్నారు. ఐఆర్‌ఆర్‌ఐ లో ఈ వంగడాల సాగు వైభవాన్ని కొద్ది నెలల క్రితమే ప్రత్యక్షంగా చూసొచ్చిన రైతు ఆయనొక్కరే కావడం విశేషం. ‘సాక్షి’కి ఆయన వెల్లడించిన వివరాలు.. మీ కోసం..

ఆచంట.. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్రామం. అంతేకదా.. అనుకునేరు. వరి సాగులో ప్రపంచస్థాయి రికార్డులను బద్దలుకొట్టిన ఊరు ఆచంట. దానికి మూలపురుషుడు నెక్కంటి సుబ్బారావు అనే రైతు శాస్త్రవేత్త. ఎస్సెస్సెల్సీ పూర్తి చేసి 1967లో పూర్తిస్థాయిలో వ్యవసాయ వృత్తిని చేపట్టిన యువ రైతు సుబ్బారావు తొలి హరిత విప్లవ కాలం నుంచి మొదలుకొని.. ఇప్పటి వరకు విత్తనోత్పత్తిలో అందెవేసిన చేయి ఆయనదే. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, అరటి సాగులో తనదైన సరికొత్త ఒరవడిని నెలకొల్పి.. సాగు విజ్ఞానపు వెలుగులు పంచిన రైతు శాస్త్రవేత్తగా సుబ్బారావు ఎదిగారు. సాగును కొత్త పుంతలు తొక్కించాలనుకునే చైతన్యవంతుడైన రైతుకు మేలైన విత్తనమే వజ్రాయుధమంటారాయన. 1967 నాటి ఐఆర్8 వరి వంగడం దగ్గరి నుంచి.. ఇప్పటి ‘గ్రీన్ సూపర్ రైస్’ వరకు అద్భుతమైన వంగడం ఏదైనా ఆయన చేతుల మీదుగానే రైతుల పొలాల్లోకి రావాల్సిందే. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్‌ఆర్‌ఐ)తోపాటు దేశీయ పరిశోధనా సంస్థలకూ ఆయనపై ఉన్న గురి అలాంటిది. సృజనాత్మక రైతుగా అహరహం తపించే తత్వమే సుబ్బారావుకు గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఎరువులతో 18 బస్తాలు.. ఎరువుల్లేకుండా 40 బస్తాలు: 1967లో ఐఆర్8 వరి వంగడాన్ని ఐఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఆచంట వచ్చి.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసి సాగు చేశారు. తీరా ఎకరానికి వచ్చిన దిగుబడి కేవలం 18 బస్తాలు! మిగిలిపోయిన నారుతో 10 సెంట్లలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా సుబ్బారావు నాట్లు వేయగా 4 బస్తాల(ఎకరానికి 40 బస్తాల చొప్పున) దిగుబడి వచ్చింది! సారవంతమైన డెల్టా భూముల్లో రసాయనిక ఎరువుల అవసరమే లేదనే విషయం తెలియక, దాళ్వాలో ఊడ్చాల్సిన ఐఆర్8 వంగడాన్ని సార్వాలో ఊడ్చటం ద్వారా.. అప్పట్లో శాస్త్రవేత్తలు పప్పులోకాలేశారన్నమాట. ఆ నమ్మకంతో సుబ్బారావు ఆధ్వర్యంలో దాళ్వాలో వెయ్యి ఎకరాల్లో ఐఆర్8 వంగడాన్ని రైతులు విజయవంతంగా అధిక దిగుబడి తీశారు. సగటున ఎకరానికి 40 బస్తాలు దిగుబడి వస్తే, సుబ్బారావుకు 46 బస్తాల దిగుబడి వచ్చింది! అప్పటికి అదే కళ్లు చెదిరే రికార్డుకావడంతో ఆచంట పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది! ఆ తర్వాత ఎన్నో రికార్డులు.. అవార్డులు.. ఆచంటను, సుబ్బారావును వెతుక్కుంటూ వచ్చాయి.

సుబ్బారావు చేతికి ‘గ్రీన్’ వంగడాలు!

వరి వంగడాల పరిశోధనపై అమితాసక్తి కలిగిన సుబ్బారావుకు ఐఆర్8 నాటి కాలం నుంచే ఐఆర్‌ఆర్‌ఐతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2014 అక్టోబర్‌లో రైతుల దినోత్సవం సందర్భంగా సుబ్బారావు ఫిలిప్పీన్స్‌లోని ఐఆర్‌ఆర్‌ఐని సందర్శించారు. వివిధ దేశాల నుంచి 200 మంది అభ్యుదయ రైతులు ఈ కార్రక్రమంలో పాల్గొన్నారు. ‘గ్రీన్ సూపర్ రైస్’ గురించి తనకు అప్పుడే తొలిసారి తెలిసిందన్నారాయన. తెలుగు శాస్త్రవేత్తయిన డాక్టర్ జవహర్ ఆలి సారథ్యంలో ఐఆర్‌ఆర్‌ఐలో గ్రీన్ సూపర్ రైస్ పరిశోధనలు పదిహేనేళ్లుగా కొనసాగుతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా.. కరువు కాలంలోనూ సగటుకన్నా అధిక దిగుబడినిచ్చే సూటి వంగడాల రూపకల్పనే ఈ ప్రాజెక్టు విశిష్టత. డా. ఆలి ఆహ్వానం మేరకు ఐఆర్‌ఆర్‌ఐ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న గ్రీన్ సూపర్ రైస్ పొలాన్ని సుబ్బారావు ఒక్కరే స్వయంగా చూసి.. ఉత్తేజితులయ్యారు. దేశ విదేశాల్లోని పరిశోధనా స్థానాల్లో గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు హెక్టారుకు 12 టన్నుల వరకు దిగుబడినిచ్చాయని చెబుతున్నారు. ఇక రైతులతో ప్రయోగాత్మకంగా సాగు చేయించడానికి ఐఆర్‌ఆర్‌ఐ శ్రీకారం చుట్టింది. ఇప్పటికున్న సమాచారం మేరకు.. దేశంలోకెల్లా తొలిగా ఈ వంగడాలను సాగు చేయబోతున్న రైతు సుబ్బారావేనంటే ఆశ్చర్యం కలగకమానదు. నేలతల్లిని నమ్ముకున్న సృజనాత్మక రైతుగా 5 దశాబ్దాల జీవన యానంలో శాస్త్రవేత్తల వద్ద సంపాయించుకున్న అపార నమ్మకమే ఆయనను ఇందుకు యోగ్యుడ్ని చేశాయి.

110 రోజుల పంటే!

ఇప్పుడు సుబ్బారావు చేతిలో అపూర్వమైన 7 రకాల ‘గ్రీన్’ వరి వంగడాలున్నాయి. మన రైతులకు ఏ యే వంగడాలు నప్పుతాయో తేల్చే గురుతర బాధ్యత ఇప్పుడు 77 ఏళ్ల సుబ్బారావు భుజస్కంధాలపై ఉంది. నారు పోసిన రోజు నుంచి 110 రోజుల్లో ధాన్యాన్ని చేతికందించే స్వల్పకాలిక వంగడాలివి. ఐఆర్‌ఆర్‌ఐ అంచనాల ప్రకారం.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు స్వల్ప మోతాదుల్లో వాడితే ఎకరానికి 65-70 బస్తాల దిగుబడి రావాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు అసలు వాడకపోతే 30-35 బస్తాలు రావాలి (సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వరి సాగు వ్యయం ఎకరానికి, కౌలు మినహా, రూ. 25 వేలు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సేద్యం చేస్తే ఈ ఖరీఫ్ సగటు ధాన్యం దిగుబడి 25 బస్తాలే). ఒక్కో రకం వంగడాన్ని 250 గ్రాముల చొప్పున ఐఆర్‌ఆర్‌ఐ సుబ్బారావుకు అందించింది. గత నెల 20న ట్రేలలో నారు పోశారు. త్వరలో నాట్లు వేస్తారు. ఒక వంగడాన్ని రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా పండిస్తానని సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. మార్చి దిగుబడిపై అంచనా వస్తుంది. ఏప్రిల్‌లో నూర్పిళ్లతో కచ్చితంగా తేలుతుంది. ‘గ్రీన్’ వంగడాల్లో మనకు ఏ యే వంగడాలు ఉపయోగకరమో స్పష్టమవుతుంది. వచ్చే ఖరీఫ్ నుంచే.. గ్రీన్ వరి వంగడాల విప్లవం సాకారమవుతుందన్నమాట! - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

ఈ భాగ్యం నా ఒక్కడికే దక్కింది!

మనీల సమావేశానికి 200 మంది రైతులొచ్చినా.. గ్రీన్ సూపర్ రైస్ పొలాలు స్వయంగా చూసే భాగ్యం నా ఒక్కడికే కలిగింది. అది డా. జవహర్ అలి పుణ్యమే. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండించే గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు అందుబాటులోకి వస్తే.. ఎకరానికి కనీసం రూ. 7-8 వేల మేరకు ఖర్చు తగ్గుతుంది. సేంద్రియ ధాన్యం దిగుబడి 30- 35 బస్తాలు వచ్చినా.. రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఉప్పునీటి సమస్య ఉన్నా.. పొట్ట దశలో కరువు కాటకాలొచ్చి పొలం బీటలు వారినా.. పంట తట్టుకుంటుంది. అటువంటి అననుకూల పరిస్థితుల్లోనూ సగటు దిగుబడి కన్నా ఎక్కువగానే దిగుబడినిస్తుందన్న నమ్మకం నాకుంది. బోర్ల కింద వరి సాగు చేసే రైతులకు ఈ వంగడాలు ఎంతో ఉపయోగకరం.
- నెక్కంటి సుబ్బారావు
(94912 54567),
ప్రముఖ రైతు శాస్త్రవేత్త,
ఆచంట, ప. గో. జిల్లా

‘గ్రీన్’ వరి విప్లవం!

 

చైనా- ఐఆర్‌ఆర్‌ఐ కృషితో అందుబాటులోకి రానున్న‘గ్రీన్ సూపర్ రైస్’ వంగడాలు
రసాయనిక ఎరువులు, పురుగుమందులు అక్కర్లేదు..
ఉప్పు నీరు సమస్యే కాదు.. కరువు కాలంలోనూ అధిక దిగుబడి!
తగ్గనున్న సాగు వ్యయం.. పర్యావరణానికీ మేలు తెలుగునాట అధిక దిగుబడులిచ్చిన 8 ‘గ్రీన్’ వంగడాలు కొద్ది నెలల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 10 లక్షల హెక్టార్లకు విత్తనాలు

అవును.. కొత్త సంవత్సరం వరి చేలల్లో బహుముఖ విప్లవమే తేబోతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోయినా.. ఉప్పునీటి తాకిడి ఉన్నా.. అంతేకాదు, కరువు మేఘాలు కమ్ముకున్నా సరే.. చీడపీడలను తట్టుకొని.. ఇప్పుడున్న వంగడాల సగటు కన్నా ఎక్కువగా (ఎకరానికి 6 టన్నులకు పైగా) దిగుబడినిచ్చే వరి వంగడాలు రాబోతున్నాయట! ఇవేవో ‘జన్యుమార్పిడి’ వంగడాలేమోననుకునేరు.. సుమా! కాదు. చైనా, ఫిలిప్పీన్స్, భారత్‌లో ప్రభుత్వరంగ సంస్థలే అందిస్తున్న, తిరిగి వాడుకోదగిన విత్తనాలే కాబట్టి రైతులకు భారం కాబోవు. వందలాది దేశవాళీ వంగడాల్లోని సద్గుణాలను నూటికి నూరుపాళ్లూ పుణికి పుచ్చుకున్న వంగడాలివి! అందుకే వీటిని ‘గ్రీన్ సూపర్ రైస్’ అని పిలుస్తున్నారు! ఇదేదో అందమైన ఊహ కాదండోయ్.. ముమ్మాటికీ నిజం. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం జరుపుకుంటున్న 2015లో ప్రధాన ఆహార పంటైన వరి సాగును గుణాత్మక మలుపు తిప్పగల గ్రీన్ వంగడాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషదాయకం.

అది ఫిలిప్పీన్స్ దేశం. బొహొల్ ప్రాంతంలో ఒక వరి పొలం. ఉప్పు నీరు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ పొలంలో రైతు ధైర్యంగా వరి నాటేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎడాపెడా వర్షాలు కురిశాయి.. పంట పొట్ట దశకు పెరిగేటప్పటికి నీటి కొరత వచ్చిపడింది. పొలం బీటలు వారింది. కడదాకా చుక్క నీరు అందలేదు... అయినా ఆ పొలంలో హెక్టారుకు 3,300 కిలోల ధాన్యం పండింది! ఈ నాటకీయమైన దిగుబడి ఎలా సాధ్యమైన్నట్లు?

ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా అయితే కిలో ధాన్యం కూడా చేతికి రాదు. కానీ, ‘గ్రీన్ సూపర్ రైస్’ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన ప్రత్యేక వంగడాన్ని సాగు చేయడం వల్లనే ఈ అద్భుతం సాధ్యమైందని డాక్టర్ జాహర్ ఆలి ఇటీవల చెప్పారు. ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు.

రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితేనే అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను ఇప్పుడు సాగు చేస్తున్నందున భూములు నిస్సారమవుతున్నాయి. నదులు, సముద్రాలు కలుషితమై మత్స్య సంపద మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ సమస్య పరిష్కారానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల్లేకుండా చక్కని దిగుబడులనిచ్చే ఈ వంగడాల వల్ల రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూమి, నీరు, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గనుంది.

ఇదీ గ్రీన్ సూపర్ రైస్ సంగతి..

వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో వరి సాగును కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం ‘గ్రీన్ సూపర్ రైస్’(జీఎస్‌ఆర్) విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని 1998లో చేపట్టారు. చైనా అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రపంచ దేశాల నుంచి సేకరించిన 250 దేశవాళీ వరి వంగడాలు, హైబ్రిడ్లలోని మేలైన లక్షణాలను (ఇంట్రికేట్ క్రాస్‌బ్రీడింగ్, బాక్ క్రాస్‌బ్రీడింగ్ పద్ధతుల ద్వారా) ఒడిసిపట్టి కొన్ని ‘గ్రీన్’ వంగడాలను దేశ విదేశీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తొలి దశలో 16 దేశాల్లో, మలి దశలో మరో 16 దేశాల్లో ‘గ్రీన్’ వంగడాల రూపకల్పన, ప్రయోగాత్మక సాగు చేపట్టారు. రెండో దశ ఇప్పుడు ముగింపు దశలో ఉంది. ఈ వంగడాలను వివిధ దేశాల్లో వీటిని పండించి చూశారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా.. ఉప్పు నీరున్నభూముల్లో.. బెట్ట పరిస్థితుల్లో.. చీడపీడలను తట్టుకొని సగటు దిగుబడులకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే విధంగా ‘గ్రీన్’ వంగడాలను రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజల రుచి, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉండే వంగడాలను రూపొందించామని డా. ఆలి వివరించారు. సాధారణ వరి వంగడాలు అసలు మనుగడ సాగించలేని పరిస్థితుల్లోనూ సగటుకన్నా అధిక దిగుబడినివ్వడం ‘గ్రీన్’ వంగడాల ప్రత్యేకత. వియత్నాంలో 25 వేల హెక్టార్లు, ఫిలిప్పీన్స్‌లో 5,700 హెక్టార్లలో వీటిని అనేక సీజన్ల పాటు సాగు చేయించారు. ఫిలిప్పీన్స్‌లో ఎకరానికి 6 టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రావచ్చని ఆశిస్తున్నామన్నారు.

ఇలా ఉండగా, గ్రీన్ వంగడాల వార్త తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త, దేశీ వరి విత్తనాల సంరక్షకుడు డా. అనుపమ్ పాల్ పెదవి విరిచారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు సేంద్రియ ఎరువులూ లేకుండానే హెక్టారుకు 5-6 టన్నుల దిగుబడినిచ్చే దేశీ వరి వంగడాలు పూర్వం నుంచే మన దగ్గరున్నాయని, విస్మరణకు గురయ్యాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా అనేక వంగడాల్లో సద్గుణాలతో కూడిన గ్రీన్ వంగడాల రాక కచ్చితంగా శుభపరిణామమే కదా..!

అధిక దిగుబడులిచ్చిన 8 ‘గ్రీన్’ వంగడాలు!
జీఎస్‌ఆర్ మలి దశ పరిశోధనల్లో హైదరాబాద్(రాజేంద్రనగర్)లోని డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కూడా పాలు పంచుకుందని ప్రాజెక్టు డెరైక్టర్(ఎ) వీ రవీంద్రబాబు ‘సాక్షి’కి వెల్లడించారు. 2011లో కొన్ని ‘గ్రీన్’ వంగడాలను స్వల్ప మోతాదులో రసాయనిక ఎరువులు వాడి అనేక చోట్ల పండించగా.. వాడుకలో ఉన్న వంగడాల కన్నా 11 ‘గ్రీన్’ వంగడాలు అధిక దిగుబడినిచ్చాయన్నారు. నత్రజని, ఫాస్ఫరస్ నిల్వలు తక్కువగా ఉన్న భూముల్లోనూ దిగుబడి బాగుందన్నారు. వీటిలో నుంచి మేలైన 8 వంగడాలను ఎంపికచేసి మళ్లీ పండిస్తున్నామన్నారు. చౌడు, క్షార గుణం కలిగిన భూముల్లోనూ ఒక వంగడం సాగవుతోందని డా రవీంద్రబాబు తెలిపారు. ఈ వంగడాలు 2015 ఏప్రిల్ నాటికి సిద్ధమవుతాయన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి గ్రీన్ వంగడాలు మన రైతులకూ అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.

ఆధారము: అగ్రికల్చర్ గేటు వే.బ్లాగ్ స్పాట్.ఇన్

ఇక్రిశాట్ రైతుకోసం రైతే లోకం

పేద రైతులకు ఒక వరం...
తగిన వర్షపాతం లేని కరవు దేశాలకు ఆలంబన...
ఉష్ణమండల ప్రాంత పంటల అభివృద్ధికి దిక్సూచి...
భారత్‌సహా 55 దేశాల్లోని కోట్లాది పేద రైతులకు వెలుగుదారి...
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ‘ఇక్రిశాట్’ ఘనత ఇది!
తన సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అందుకొన్న ఈ సంస్థ ప్రస్తుతం 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది..
ఈ సందర్భంగా.. సమాజానికి ఇక్రిశాట్ అందించిన కొన్ని ‘రత్నాల’ గురించి తెలుసుకుందాం...

వాటర్‌షెడ్‌లతో సుస్థిర గ్రామీణాభివృద్ధి

సామాజిక కోణంలో వాటర్‌షెడ్‌ల నిర్వహణ తో సమీకృత గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. వర్షపాతం తక్కువగా ఉండే ఉష్ణమండల పొడినేలల ప్రాంతాల్లో నీటికొరతే పేదరికానికి తొలి కారణమవుతోంది. సహజవనరుల లేమితోపాటు పంటల దిగుబడి చిన్న రైతులకు సవాలే. దీనికి చెక్ పెట్టేందుకు ఇక్రిశాట్ సామాజిక వాటర్‌షెడ్ నిర్వహణను చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలను, పౌర, వ్యవసాయ సంఘాలను సంఘటితం చేసి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది.
ఇవీ ఫలితాలు... రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి సుస్థిర అభివృద్ధి సాధించిన గ్రామంగా రికార్డులకెక్కింది. సైన్స్ ఆధారిత గ్రామీణాభివృద్ధికి మార్గదర్శిగా మారింది. ఇక్రిశాట్ సహకారంతో అమలుచేసిన ఆద ర్శ్ వాటర్‌షెడ్ నిర్వహణ , ఇతర కార్యక్రమాలే గ్రామ రూపురేఖలు మార్చేశాయి. వాటర్‌షెడ్‌లతో నీటి లభ్యత పెంచడం, కూరగాయలతోపాటు విలువ గల పంటలు పండించడం, దిగుబడులు పెంచడం వల్లే ఇది సాధ్యమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని పవర్‌గూడ గ్రామంలోనూ పశుపోషణ, ఆయిల్ విత్తనాల పంటలు, నర్సరీలు, వర్మీ కంపోస్టింగ్ వంటివాటితో గ్రామస్థుల సగటు ఆదాయం ఏకంగా 77% పెరిగింది. రాజస్థాన్‌లో భూగర్భజలాలు 5.7 మీటర్ల వరకూ పెరిగాయి. దిగుబడులు 2-3 రెట్లు పెరిగాయి. పంటల విస్తీర్ణం 51% పెరిగింది. చైనా, వియత్నాం దేశాల్లోనూ ఈ వాటర్‌షెడ్‌లను ఇక్రిశాట్ అమలు చేస్తోంది. దీనివల్ల ఆసియాలో కనీసం 2 కోట్ల మంది జీవితాలు మారిపోయాయని అంచనా.

సూక్ష్మమోతాదులతో భారీ ప్రయోజనాలు..

సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఎరువులను సూక్ష్మ మోతాదులో వినియోగించడం ద్వారా వ్యవసాయంలో భారీ ప్రయోజనాలను పొందే ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాంతంలోని పలు దేశాల్లో ఇక్రిశాట్ అమలుచేసింది. పంట విత్తే సమయంలో పొలమంతా ఎరువులు చల్లకుండా విత్తనంతోపాటే కొద్ది మోతాదులో- అదీ నేలకు అవసరమైన ఎరువునే వేసే ఈ పద్ధతి వల్ల పంట దిగుబడి, ఆదాయం గణనీయంగా పెరిగింది. జొన్న, తృణధాన్యాల దిగుబడులు సుమారుగా 44-120 శాతం వరకూ పెరిగాయి. జింబాబ్వే తదితర దేశాల్లోని వేలాది పేద రైతుల ఆదాయం ఏకంగా 50-130 శాతం వరకూ పెరిగింది. 2012 చివరికల్లా ఈ పద్ధతిని ఆఫ్రికాలో 3.60 లక్షల మంది రైతులకు నేర్పించాలన్నది ఇక్రిశాట్ ప్రాంతీయ ప్రాజెక్టు లక్ష్యం.

వ్యవసాయ అభివృద్ధికి గ్రామస్థాయి అధ్యయనాలు...

గ్రామస్థాయిలో ప్రజలను ఆధారం చేసుకుని అంతర్జాతీయ అధ్యయనం ద్వారా ఉష్ణమండల ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ఉన్న మార్గాలు, ఆటంకాలను గుర్తించే గ్రామస్థాయి అధ్యయనాలకు శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని ఒకచోటికి చేర్చి డాటా బ్యాంక్‌గా అందుబాటులో ఉంచేందుకు నడుం కట్టింది. ఇక్రిశాట్ 1975 నుంచి సేకరిస్తున్న ఈ సమాచారమే ఇప్పుడు అనేక అంతర్జాతీయ పరిశోధనలకు కీలకమవుతోంది.

ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్...

శిలీంధ్రాల నుంచి విడుదలయ్యే ఎఫ్లాటాక్సిన్ అనే విషపూరిత రసాయనం నుంచి వేరుశనగ తదితర పంటలకు అతితక్కువ ఖర్చుతోనే విముక్తి కలిగిస్తూ పేదదేశాల రైతులకు ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశంతో చేసిన ఆవిష్కరణ ఇది. ఎఫ్లాటాక్సిన్ విషపూరిత రసాయనం వల్ల వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, మిరప వంటి అనేక పంటలు కలుషితమవుతాయి. ఎఫ్లాటాక్సిన్ బీ1 అనే రసాయనం పశువులకు, మనుషులకూ చాలా ప్రమాదకరం. అందుకే వెనకబడిన దేశాల రైతుల పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పడిపోతోంది. అయితే, తేలికైన, చవకైన ఎఫ్లాటాక్సింగ్ టెస్టింగ్ కిట్ వల్ల పంటలను పరీక్షించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సులభం కావడంతో భారత్ సహా ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

రైతు నేస్తాలుగా ఇక్రిశాట్ వంగడాలు...

ఆసియా, ఆఫ్రికా దేశాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మంచి దిగుబడులనిచ్చే జొన్న, సజ్జ, కంది, శనగ తదితర పంటల వంగడాలను ఇక్రిశాట్ రూపొందించింది.

కరవును తట్టుకునే వేరుశనగ...

వ్యాధులను, కరవును తట్టుకునేలా ఇక్రిశాట్ రూపొందించిన నాణ్యమైన వేరుశనగ వంగడం.. 60 ఏళ్లుగా వాడకంలో ఉన్న అనేక వంగడాల స్థానాన్ని ఆక్రమించి లక్షలాది బడుగు రైతుల్లో వెలుగులు నింపింది. ఇక్రిశాట్ రూపొందించిన అనంతజ్యోతి వంగడం ఇప్పుడు ఆ జిల్లా రైతులకు లబ్ధి కలిగిస్తోంది.

40 శాతం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది...

సంప్రదాయ కందివంగడాలతో పోల్చితే 40% వరకూ అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ కంది వంగడాలను ప్రైవేటు సంస్థలతో కలిసి ఇక్రిశాట్ రూపొందించింది. కెన్యా, మలావీ తదితర ఆఫ్రికా దేశాల రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంది వంగడాలు నాణ్యమైన దిగుబడులతో వారి ఆదాయాన్ని 80 శాతం వరకూ పెంచాయి. ఆసియా, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాల్లో ప్రధాన పంటల్లో ఒకటైన కంది జీనోమ్ (జన్యుపట ం)ను కూడా ఇక్రిశాట్ ఆవిష్కరించి పంట అభివృద్ధికి అనేక మార్గాలు అవలంబించేందుకు కృషిచేసింది.

తీపి జొన్న...

ఇక్రిశాట్ రూపొందించిన ఈ వంగడం బహుళ ప్రయోజనకరం. ఆహారంగా మాత్రమే కాకుండా పీచు, ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. కరవును, వాతావరణ మార్పును తట్టుకుంటుంది. జొన్న, మొక్కజొన్న కంటే రైతులకు ఎంతో లాభదాయకమైనది.

అందరికీ అందుబాటులో విజ్ఞానం...

ఆహార భద్రతను పెంపొందించేందుకోసం ఇక్రిశాట్ జన్యు వనరులతో కూడిన జీన్‌బ్యాంకును నిర్వహిస్తోంది. ఈ బ్యాంకులో 1,20,000 జన్యువనరులు ఉన్నాయి. ఇక్రిశాట్ వెబ్‌సైట్‌లో ఇంటర్నేషనల్ పబ్లిక్ గూడ్స్ (ఐపీజీఎస్) పేరుతో పొందుపర్చిన జన్యువనరుల సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ పేరెంట్స్ రీసెర్చ్ కన్సార్షియం పేరుతో నిర్వహించే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య శాస్త్రీయ ఆవిష్కరణలు, ఉత్పత్తులు పేదలకు ఐపీజీఎస్‌లో అందుబాటులో ఉంటాయి. సంస్థాగతమైన అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు, ప్రాజెక్టుల వివరాలను కూడా భాగస్వాములు, ఔత్సాహికులు ఉచితంగానే పొందవచ్చు.

పేదల జీవనాధారం మెరుగుపర్చింది...

ఇక్రిశాట్‌కు 40వ ఏడాది అయిన 2012 సంవత్సరాన్ని మైలురాయిగా భావిస్తున్నాం. ఉష్ణమండల ప్రాంత పేద ప్రజలకు ఇన్నేళ్లుగా సంస్థ చేసిన సేవలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ‘ద జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ పుస్తకాన్ని ప్రచురించాం. ఆసియా, ఆఫ్రికాలలోని 55 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సుమారు 80 కోట్లమందికి ఇక్రిశాట్ సేవలు అందుతున్నాయి. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇక్రిశాట్ చేపట్టిన అనేక కార్యక్రమాలు గ్రామీణుల జీవనాధారాన్ని మెరుగుపర్చాయి. ఇక్రిశాట్ భాగస్వామిగా ఉన్న సీజీఐఆఏఆర్ సంస్థ పెట్టిన ప్రతి డాలరుకీ 17 డాలర్ల ప్రతిఫలాన్ని నమోదుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాముల వల్లే ఈ ఘన విజయాలు సాధ్యమయ్యాయి.
- ‘ది జివెల్స్ ఆఫ్ ఇక్రిశాట్’ ముందుమాటలో ఆ సంస్థ డెరైక్టర్ జనరల్ విలియం డీ డార్

స్నేహ నర్సరీ : యూరోపియన్ పద్ధతిలో ఆమె సాగు చేయిస్తున్న నారుమడు

నారు నవ్వింది

ఇటు వంకాయ అటు కర్బూజ నడుమ టొమాటో...

పొత్తిళ్లలోని పిల్లలను జాగ్రత్తగా పెంచే స్త్రీలు నారుమడుల పెంపకానికి నడుం బిగిస్తే ఇక ఆ నారుకు ఢోకా ఏమిటి? దానిని పొందిన రైతుకు దిగుబడి విషయంలో సందేహం ఏమిటి? పూలు, పండ్లు కూరగాయల నారునూ యూరోపియన్ పద్ధతిలో సాగు చేసి అందిస్తున్నారు అనురాధ. ఆమె లాభం ఆశిస్తున్నారనడం కంటే రైతుకు లాభం కలిగిస్తున్నారనడమే సరైన మాట.

"నారు పసిపాప లాంటిది. పొత్తిళ్లలోని పాపాయిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, నారుని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి" అంటారు అనురాధ. ఆమెను కలవడం విశేషమే. కాని... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, కొంగరకలాన్ గ్రామంలోని ఏడు ఎకరాల్లో యూరోపియన్ పద్ధతిలో ఆమె సాగు చేయిస్తున్న నారుమడులను చూడటం మాత్రం ఇంకా విశేషం.

పసిపిల్లల్లా నవ్వుతున్న ఆ మడులను చూసి ఈ ఆలోచన ఎలా కలిగిందని అడిగితే ఆ వివరాలను ఇలా మన ముందుంచారు- "మాది వ్యవసాయ కుటుంబం. అలా నాకు చెట్లు చేమలంటే ప్రాణమ య్యాయి. పెళ్లయి నగరానికి వచ్చాక స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. అందుకే సిటీకి దూరంగా కొంపల్లి లో ఇల్లు కట్టుకున్నాం. ఇంటి ఆవరణలో పూలు, పళ్లు, కూరగాయ మొక్కలు... ఇలా మొత్తం పచ్చదనంతో నింపేశాను. నా ఇష్టాన్ని గమనించి రోజూ ఎన్నో పక్షులు వచ్చి పలకరిస్తుంటాయి. ఆ ఇష్టం వ్యవసాయం మీద కూడా చూపించాలని ఉండేది. మా పుట్టిన ఊరికి, మన రాష్ట్రంలో బోరుబావుల మీద ఆధారపడిన ఊళ్లకు వెళ్లినప్పుడు అక్కడి వ్యవసాయ పరిస్థితులు చాలా బాధ కలిగించేవి. నారు ఇష్టం వచ్చినట్టుగా పీకడం, మూటలుగా కట్టి బళ్లు, బస్సులు, సైకిళ్ల మీద తీసుకెళ్లడం చూసి మనసు చివుక్కుమనేది.

‘తలలు వేలాడేసుకుని, పాలిపోయి కనిపించే ఈ నారు... రైతుకు ఏ విధమైన ప్రయోజనం ఇస్తుంది’ అనుకునేదాన్ని. ‘బలంగా, ఆరోగ్యకరంగా ఉన్న నారును ఆధునిక పద్ధతులతో పెంచి మన రైతులకు అందజేస్తే...!’ అనే ఆలోచన కలిగింది. అదీగాక అంతంతమాత్రపు నీళ్లు, కరెంటు కోత ఉన్నప్పుడు సొంతంగా నారు వృద్ధి చేసుకోవడం ఇబ్బంది. అలాగే విత్తనాల ధరలూ చుక్కలనంటుతున్నాయి. ఆ విత్తనాలు నకిలీవైతే మొక్కలు మొలిచేంతవరకు రైతుకు టెన్షనే. ఈ పరిస్థితులను కొంతవరకైనా తప్పించగలిగితే బాగుంటుందనే విషయాన్ని మా ఇంట్లోవారికి చెప్పి, వారి సహకారంతో ‘స్నేహ నర్సరీ’ పేరుతో నారుమడులకు పాలీ హౌజ్‌లను ఏర్పాటు చేశాను.

మొదట విమర్శలు వినిపించాయి. ఈ నారుతో ఏం లాభం అన్నారు. ఇప్పుడు అందరూ ముచ్చటపడుతున్నారు. కాని ఈ పని అంత సులువు కాలేదు. మినరల్ వాటర్ ప్లాంటేషన్, సాయిల్ టెస్టులకు నిపుణులను సంప్రదించడం, వారితో కలిసి ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం, ట్రేలను ప్రత్యేకంగా తయారు చేయించడం, ... నారుకు కావలసిన వనరులన్నీ ప్రత్యేకంగా రూపొందించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఏడాది సమయం పట్టింది. పుణే నుంచి తెప్పించిన కోకోపిట్, నాణ్యమైన విత్తనాలు, మ్యాట్స్, తెరలు, పంపింగ్ మిషనరీ... వీటితో పాటు పనివారిని కేటాయించుకోవడం... ఒక పెద్ద యుద్ధమే అయింది. ఇప్పటికి విజయం లభించింది. టొమాటో, మిరప, క్యాప్సికమ్, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోస, పుచ్చ, కర్బూజ, కాకర, ఆనప, లెట్యూస్, పార్‌స్లీ, బ్రకోలి, సెలెరి, బంతి, సీజనల్ ఫ్లవర్స్, బొప్పాయి, అరటి, మునగ... వంటి నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రేడింగ్ చేసి మరీ అందిస్తున్నాను.

రైతులు మొదట నమ్మలేదు. ‘నారుకు ఇంత కష్టపడాలా? అంత పద్ధతిగా పెంచిన నారు సరైన విధంగా ఎదుగుతుందా...’ అంటూ రకరకాల సందేహాలు లేవనెత్తారు. వారి సందేహ నివృత్తి కోసం వారి పొలంలోనే అర ఎకరం పొలంలో ఉచితంగా ఈ మొక్కలు నాటించాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. 20-25 రోజుల తేడాతో వచ్చిన కూరగాయల దిగుబడిని చూసి వాళ్లు సంతృప్తి చెందారు. అలా రైతుల నోటిమాట ద్వారా నారు కొనుగోలు స్థాయి పెరిగింది. ఇప్పుడు నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కడప, అనంతపూర్, మెదక్, కరీంనగర్... జిల్లాలకు కూరగాయలు, అరటి, పూల సాగు కోసం నారు వెళుతోంది. కొంతమంది రైతులు యూనిట్‌గా ఏర్పడి మరీ ‘నారు’కోసం ఆర్డర్లు ఇస్తున్నారు.

కూరగాయల విత్తనాలను నేరుగా పొలంలో నాటితే అంకురోత్పత్తి తక్కువగా ఉంటుంది. లేత మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి. అదే గ్రేడింగ్ చేసిన ఆరోగ్యకరమైన నారు నాటితే... మొక్కలన్నీ ఒకే సైజులో పెరిగి, దిగుబడి కూడా ఒకే సమయంలో వస్తుంది. కూరగాయలు, పళ్లు, పూల మొక్కల మధ్య నిడివి బట్టి ఎంత స్థలానికి ఎన్ని మొక్కలు సరిపోతాయి? అక్కడ రవాణా సదుపాయాలు ఏవిధంగా ఉన్నాయి?... వంటి విషయాల్లో రైతులకు సూచనలు ఇస్తాను. నేను సృష్టించిన ఈ ‘నారు’తో రైతుల లాభాలు పొందడం, వారి ఆనందాన్ని కళ్లార చూసినప్పుడు ఎంతో సంతృప్తి కలుగుతుంది" అని తెలిపారు అనురాధ.

నారుమడుల సేద్యం గురించి అనురాధ చెబుతున్న అధునాతన పద్ధతులు విన్న రైతులు ఆశ్చర్యపోతుంటారు. సందేహాలను నివృత్తి చేసుకొని, ఫలసాయాన్ని పొంది ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. నారును తీసుకెళ్లడానికి పోటీపడుతుంటారు. అనురాధ సృష్టించిన స్వచ్ఛమైన నవ్వుల నారు రైతులకు సిరుల బాంఢాగారాలు అవుతున్నాయి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.

మల్లెతీగ గుబురుగా పెరగాలంటే...

మల్లెతీగను పెంచుతున్నాను, దానికి పందిరి పెట్టడం కష్టంగా ఉంది. గుబురులాగ పెరగాలంటే ఏం చేయాలి?

పందిరి మల్లె ఏడాదంతా పూస్తుంది. కానీ పూత తక్కువ ఉంటుంది. ఆది తీగ, ఆధారం ఉంటే పైకి పాకుతుంది. పందిరి వేయడం కుదరకపోతే ఇంటి గోడకు ఆసరా చేసి అల్లించవచ్చు. బొండుమల్లె సమ్మర్ సీజన్‌లో పూస్తుంది. మొగ్గలు ఎక్కువగా వస్తాయి. దీనిని గుట్టమల్లె అని కూడా అంటారు. దీనికి నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రూనింగ్ (ఆకులు, రెమ్మలు కత్తిరించడం) చేయాలి. ఫిబ్రవరి నుంచి పూలు పూస్తాయి. ప్రూనింగ్ చేయడానికి సాధ్యం కానంత చిన్న చెట్టు అయితే ఆకులను దూసివేయాలి. ఆకు దూస్తే కొత్తఆకుతోపాటు మొగ్గ వస్తుంది. ఈ మొక్క ఒకటి చాలు ఇంటికి. చాలా పూలు పూస్తుంది. పందిరిమల్లెకు ఆకు దూయడానికి సీజన్ ఉండదు. ఒకసారి మొగ్గలు వచ్చి పూలు పూసిన తర్వాత కొంత విరామం వస్తుంది. అప్పుడు ఆకుదూయడం లేదా ప్రూనింగ్ అవసరం.

మల్లెతీగను ఏడాదిలో ఎప్పుడైనా నాటవచ్చు. నేల మీద పాకుతూ ఉండే తీగలను కొద్దిగా కాండం చెక్కి పుల్ల అడ్డుగా పెట్టి మట్టితో కప్పేస్తే చాలు... అక్కడ వేర్లు పుడతాయి. కొత్త మొక్క వస్తుంది.

మల్లెకు తెగుళ్లు అంటే... ప్రధానమైనది ఆకుతెగులు. లీఫ్ ఈటింగ్ క్యాటర్‌పిల్లర్ అంటారు దీన్ని. ఆకు అలాగే ఉంటుంది, పచ్చదనం పోతుంది. లీఫ్ మైనర్ పురుగు ఆకు పొరల మధ్యలో దాక్కుని రసం పీలుస్తుంది. సక్కింగ్ పెస్ట్ అని మరో రకం కూడా ఇలాగే చేస్తుంది. ఇవన్నీ సాధారణ క్రిమిసంహారిణి ఏది చల్లినా నశిస్తాయి.

కాగడామల్లె అని మరో రకం ఉంటుంది. ఇది వాసన రాదు. పూలదండల్లో వాడుతారు. సువాసన వెదజల్లే మల్లెపూవుకంటే తెల్లగా ఉంటుంది కాగడామల్లె.
- ఎం. అనంత్ రెడ్డి, అడిషనల్ డెరైక్టర్, హార్టికల్చర్ (రిటైర్డ్)

మనిషంటే మల్లేశం!

మల్లేశ్ స్పర్శలో సమస్త జీవరాశులు కొత్త చైతన్యాన్ని నింపుకుంటు న్నాయి. ఒక సాధారణ రైతు ఇంత అసాధారణమైన పని చేస్తున్నప్పుడు మనమెందుకు చేయలేకపోతున్నాం?!

మీరిప్పుడు చదవబోతున్న అసామాన్య కథలో కథానాయకుడు మల్లేశం గౌడ్ అను ఒక సామాన్యుడు. మట్టిలో పూసిన గడ్డిపూవు లాంటివాడు. ప్రతినాయకుడు ఆధునిక మానవుడు అలియాస్ భస్మాసురుడు. మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గరి కలివేములకు చెందిన మల్లేశం కూడా ఆధునిక మానవ జాతికి చెందినవాడే కానీ ఆధునికత పేరిట విధ్వంసానికి పాల్పడే తరహా ఆధునికుడు కాదు. ప్రకృతి సృష్టించిన జీవరాశిని పదిలంగా కాపాడే జీవవైవిధ్య సంరక్షకుడు. ద సేవియర్ ఆఫ్ బయోడైవర్సిటీ.

ఒక్కోసారి వ్యవస్థ వైఫల్యం చెందినప్పుడు వ్యక్తులే ముందడుగు వేస్తారు. అలాంటివాళ్లు వేసిన అడుగు చూడాలి. అది ఎంత పెద్ద బాటకు తొలి అడుగో వెదుక్కుంటూ వెళితే, అక్కడ మన తాతలూ వాళ్ల తాతలు, వాళ్ల చెమటలో పెరిగిన పచ్చని పంటలు, వాటిమీద నుంచి ఎగిరే పైరగాలులు, తెలిమంచు తెరలో మెరిసే మంచు బిందువులు, వాటిలో ముఖం చూసుకుని మెరిసే లేలేత సూర్యకిరణాలు, రంగులకు బ్రాండ్ అంబాసిడర్‌లా తిరిగే సీతాకోకచిలుకలు, కొండల మధ్య ఉదయించే అందమైన సూర్యుడికి నేపథ్య సంగీతంలా పక్షుల కిలకిలలు, ఇంటి పెరట్లో రకరకాల వర్ణాల్లో పూల పరిమళాలు, లేగదూడల అరుపులు, కోళ్లు, కుక్కలు, గొర్రెలు, మేకలు, వీటన్నిటినీ సవరించే అమాయక మనుషుల ప్రేమలు... చెప్పుకుంటూపోతే జీవితం ఒక జీవవైవిధ్య జాతరలా కనిపిస్తుంది.

అటు నుంచి లెఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్లీ లెఫ్ట్ తీసుకుని అలా అలా వేలవేల మలుపులు తీసుకుని, వందల సంవత్సరాలు దాటి ముందుకొస్తే, స్ట్రెయిట్‌గా నరకానికి దగ్గరి దారి కనిపిస్తుంది. అక్కడినుంచి అంతా వన్ వే. టర్నింగ్‌కు నో వే. నాగరికత పెరిగినకొద్దీ సృష్టిలో అన్నీ తనకోసమేనన్న ఆలోచన మనిషిలో ప్రబలింది. ఫలితంగా చెట్టు, పుట్ట, గుట్ట, పూలు, పళ్లు, పక్షులు, జంతువులు ఒక్కొక్కటిగా అన్నీ మనిషి స్వార్థానికి బలైపోయాయి. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్టు తయారైంది. చివరకు అభివృద్ధి పేరిట మనిషి సాధించినదేమిటి? ప్రకృతి సహజమైనవి ధ్వంసం చేసి కృత్రిమమైనవి సృష్టించి పొందినదేమిటి? కలుషిత నీరు, కాలుష్యపు గాలి, విషపూరితమైన పళ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలు.

మనిషి నరాల్లో నెత్తురు బదులు విషం ప్రవహిస్తోంది. వచ్చే రోగాలు మనిషి జీవితంలో చీకట్లు వంపితే కార్పొరేట్ హాస్పిటళ్లు కళ్లలో వెలుగులు నింపుతున్నాయి. రేడియేషన్ దెబ్బకు ఊళ్లలో ఊరపిచ్చుకలు, తూనీగలు మాయమయ్యాయి. మైనింగ్ వేడికి అడవులు ఆవిరయ్యాయి. వనరులు తరిగిపోయాయి. గిరిపుత్రుల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, ఏ బాటలో వెళ్లాలో తెలియక, అమాయకులైన అడవి బిడ్డలు తల్లడిల్లుతున్నారు. మనిషి పాపాలకు నగరం నరకమైంది, బతుకు శాపమైంది. పల్లె వల్లకాడైంది. సేద్యం చిన్నబోయింది. భూమి వేడెక్కింది. వాతావరణం గాయపడింది. మొత్తంగా ఆధునిక మానవుడి అభివృద్ధి యాగంలో లక్షలాదిగా జీవజాతి సమిధ అయింది. మరోవైపు ఈ దేశం నుంచి ఎవరు ఏదైనా దర్జాగా సరిహద్దులు దాటించొచ్చన్న నమ్మకంతో బహుళ జాతి దొంగలు మన జాతి జన్యు సంపదను దోచుకుని పేటెంట్లు దక్కించుకుంటున్నారు.

మన జాతిసంపద గొప్పతనం అవతలివాడు ఎత్తుకెళ్లే వరకు మనకు తెలియకుండా పోయింది. ఇంత జరిగినా ఏ చట్టానికీ ఏం పట్టకుండా ఉంది. ఏది ఏమైనా తన అవసరం కోసం దేనినైనా నాశనం చేయాలన్న స్వభావం చివరకు సృష్టిని సంక్షోభంలోకి నెట్టేసింది. జీవవైవిధ్యం చరిత్ర పొరల్లో ఎక్కడో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. మితిమీరిన స్వార్థం వల్ల, స్వయంకృతం కారణంగా మానవ మనుగడకే ప్రమాదం వచ్చేసరికి అంతర్జాతీయంగా ఇప్పుడు జీవ వైవిధ్యమంటూ చర్చలు, నినాదాలు మొదలుపెట్టారు. ఇది పేషెంట్ ప్రాణం పోయాక ట్రీట్‌మెంట్ మొదలెట్టినట్టుంది. ఇలాంటి సమయంలో నాకు మల్లేశ్ గుర్తుకొచ్చాడు. అతని స్ఫూర్తిని అందరితో పంచుకోవడానికి ఇది సరైన సమయమనిపించింది.

ఒక వ్యవసాయ కార్యక్రమ షూటింగ్ కోసం సంగారెడ్డి దగ్గర కలివేముల గ్రామంలో మల్లేశం క్షేత్రానికి వెళ్లాను. అక్కడ కేవలం పదెకరాల్లో మల్లేశ్ చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయాను. ఐదెకరాల్లో మల్బరీ తోట, అర ఎకరం పసుపు, అర ఎకరం అరటిలో అంతర పంటగా పసుపు, అల్లం, అర ఎకరం మొక్కజొన్న, మూడెకరాల పశువుల మేత సాగుచేస్తున్నాడు. ఇంత తక్కువ స్థలంలో ఇన్ని పంటలు ఎందుకంటే, ఒకే రకమైన పంట వేస్తే భూములు తరువాత ఎందుకూ పనికిరావన్నాడు. అంతేకాకుండా ఉన్న భూమిలో రకరకాల పంటలు వేస్తే రైతుకు అంతగా నష్టాలు ఉండవన్నాడు.

తరువాత పట్టుపురుగులు పెంచే షెడ్, పది ఆవులతో నడిచే డెయిరీని చూపించాడు. పక్కనే ఆవులు సేదదీరడానికి చిన్న మడుగు తవ్వించాడు. వంగ, టమాటా వంటి కూరగాయలు, లిల్లీ, మల్లె, బంతి, గులాబీ... రకానికి రెండు మూడు పూలచెట్లు, పూల పుప్పొడితో ఆడుకుంటున్న తూనీగలు, నేలలోంచి ఎక్కడపడితే అక్కడ తొంగిచూస్తున్న వానపాములు ఆ క్షేత్రానికి సొబగును తీసుకొచ్చాయని గమనించాను. అక్కడ రాతిస్తంభాల ఫెన్సింగ్‌కు తీగలా అల్లుకున్న చెట్టును చూపించి, ఇది ప్యాషన్ ఫ్రూట్ అని చెప్పి, దాని జ్యూస్ ఒక్కసారి తాగితే మర్చిపోలేరని అప్పటికప్పుడు తయారుచేసి ఇచ్చాడు. తాగాక మళ్లీ ఇంకో గ్లాస్ తాగాలనిపించే రుచి. మొహమాటం కారణంగా అడగలేకపోయాను. ఇంతలో పక్కన పొదల్లోంచి నెమలి అరుపులు వినిపించాయి.

ఆశ్చర్యపోయి మల్లేశాన్ని అడిగాను. సాయంత్రమైతే మందలు మందలుగా బయటకు వస్తాయని అన్నాడు. మరి వాటిని ఎవరూ పట్టుకోరా అంటే అలాంటిదేం లేదని నవ్వాడు. ఇక్కడ చుట్టుపక్కల ముప్పై గ్రామాల్లో నెమలిని పీర్ల పక్షిగా కొలుస్తారని, దాన్ని వేటాడితే తమకు కీడు జరుగుతుందని ప్రజలు వాటి జోలికి వెళ్లరని చెప్పాడు. ఎంతకాదనుకున్నా ఒక్కోసారి నమ్మకాలు, విశ్వాసాలు మంచి చేస్తాయనిపించింది. ధ్వంసం చేయడం తెలియకపోవడం వల్లే అతడు నిర్మిస్తున్నాడా? ఏమో! ఏదైతేనేం అతడు చేస్తున్నది అందరూ మనసా వాచా కర్మణా ఆచరించదగిన పరమ పవిత్ర కార్యం. కేవలం పదెకరాల్లో మల్లేశ్ సృజించిన ప్రకృతి రమణీయ కావ్యం.

సాయంత్రమయ్యాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇంట్లోకి వెళ్లి స్కూల్‌బ్యాగ్ పెట్టి, చేతిలో అన్నం ప్లేటుతో వచ్చారు. మల్లేశ్ తమ్ముని కూతురు ఎనిమిదేళ్ల విజయలక్ష్మి పశువుల మడుగులో అన్నం విసురుతుంటే అర్థం కానట్టు చూశాను. గమనించిన మల్లేశ్ అందులో చేపలు పెంచుతున్నామని చెప్పాడు. పిల్లలను చూసి అంతసేపూ తోటలో ఆడుకున్న నాలుగు చిన్నచిన్న కుక్కపిల్లలు వాళ్ల కాళ్ల చుట్టూ తిరుగుతూ ఆడుకోవడం మొదలుపెట్టాయి. వీటిని చూసి దూరంగా ఉన్న కోళ్లు, బాతులు కూడా వీళ్ల దగ్గరికి వచ్చాయి. మల్లేశ్ స్పర్శలో సమస్త జీవరాశులూ కొత్త చైతన్యాన్ని నింపుకుంటున్నాయే మోననిపించింది. ఒక సాధారణ రైతు ఇంత అసాధారణమైన పని చేస్తున్నప్పుడు మనమెందుకు చేయలేకపోతున్నాం?!

ఊరికొక మల్లేశుంటే జీవవైవిధ్యం గురించి ఇన్ని సభలు, సదస్సులు అవసరం ఉండకపోవచ్చనిపించింది. ఐక్యరాజ్యసమితి ఆమోదిస్తే మల్లేశానికి బయోడైవర్సిటీ సదస్సులో సన్మానం చేసి ‘ద సేవియర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఫర్ దిస్ సెంచరీ’ అని ఓ అవార్డు కూడా ఇవ్వాలనుంది (కుదరదని తెలిసినా నా మనసులో నేను మల్లేశ్‌కు ఇచ్చుకున్న గౌరవం).
వైవిధ్యంలోనే జీవుల మనుగడ ఉంది. సృష్టిలో ఒక జాతి మరోజాతి మనుగడకు సహకరిస్తుంది. కొత్త జాతుల ఆవిర్భావానికి దారులు తీస్తుంది. అది సృష్టి నిర్మాణంలో దాగిన రహస్యం. ఆ సహజ అమరిక ఇప్పుడు ధ్వంసమైంది. ఒక్క మానవజాతి ఉనికి ఇన్ని కోట్ల జీవజాతుల మనుగడకు ప్రమాదం తెస్తుందనుకుంటే సృష్టి తన లిస్ట్ నుంచి మానవ జాతి పుట్టుకను రద్దు చేసేదేమో!

జీవవైవిధ్యం మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. అందుకే మల్లేశ్ వర్ధిల్లాలి. మల్లేశ్ ఆచరణావిధానం వర్ధిల్లాలి.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి
డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్

ఇంటికి పూల తోరణం

బోగన్‌విల్లాలు ఎన్ని రంగులు ఉంటాయి? వీటిని ఎలా పెంచాలి?
- కె. శారద, అడుసుమిల్లి

బోగన్ విల్లాలలో 35 నుంచి 40 రకాలు ఉంటాయి. వీటిని నేల మీద, పాట్‌లలోనూ పెంచుకోవచ్చు. ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. వీటికి తెగుళ్ల బాధ ఉండదు. నీటి వినియోగం కూడా పెద్దగా ఉండదు. ఇవి తలలో పెట్టుకోవడానికి, పూజకు పనికిరావు. ఇంటీరియర్ డెకరేషన్‌కు కూడా పెద్దగా ఉపకరించవు. అయితే పూలతో నిండిన చెట్టే ఇంటికి అందం, పెద్ద అలంకరణ. తోరణంగా అల్లించవచ్చు.

మనోరంజనం చెట్టును ఇంట్లో పెంచకూడదని, ఆ వాసనకు పాములు వస్తాయని విన్నాను. నాకు ఆ పూలు చాలా ఇష్టం. ఇంట్లో పెంచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా?
- ఆర్. మానస, తిరుపతి

నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. నిజానికి పాములకు వాసన, రంగు తెలియదు. ఆ సువాసనకు పాములు వస్తాయనడం కేవలం అపోహ మాత్రమే. మనోరంజనం మొక్కలను నర్సరీలలో పెంచుతుంటారు, వాటిని ఇష్టమైన వాళ్లు కొనుక్కు వెళ్లి ఇళ్లలో పెంచుకుంటుంటారు. దీనిని సంపంగి అని కూడా అంటారు. పువ్వు కూడా ఆకుపచ్చగా ఉండి వంపు తిరిగిన ఐదు రెక్కలతో అందంగా ఉంటుంది. తుంచితే విరిగిపోయేటంత సున్నితంగా ఉంటాయి ఈ రెక్కలు. ఆకులతో కలిసిపోయినట్లుంటే ఈ పువ్వు ఉనికి తెలిసేది దీని సువాసన ద్వారానే. దీనిని కుండీల్లో పెంచుకోవచ్చు. ఎండాకాలం పాదు ఎక్కువ సేపు తేమగా ఉండడానికి కొబ్బరి రజను చల్లాలి. ఇది కొబ్బరి పీచు నుంచి రాల్చిన పొట్టు. ఈ పొట్టు నీటిని నేలలో ఇంకి పోనివ్వకుండా ఆపుతుంది.

చిన్న గన్నేరు చెట్టును పెంచుకోవాలని నాకు చాలా ఇష్టం. ఇది కొమ్మ బతుకుతుందా లేక మొక్కనే నాటాలా? తెలియచేయగలరు.
- రమ్య, తాడేపల్లి గూడెం

చిన్న గన్నేరు షబ్ ్రజాతి చెట్టు. దీని పూలు అందంగా సువాసన భరితంగా ఉంటాయి. దీనికి తెగుళ్లు ఉండవు. కాబట్టి ఇంటి ఆవరణలో పెంచుకోవడం చాలా సులభం. దీనిని కొమ్మను నాటవచ్చు, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. వేర్లు త్వరగా రావు. కొమ్మను నాలుగైదు నిమిషాల సేపు 2000 పిపిఎమ్ ఐబిఎ మిశ్రమంలో నానబెట్టిన తర్వాత నాటితే వేర్లు త్వరగా వస్తాయి.

ఇందులో ఎరుపు, గులాబీ, తెలుపు, లేత పసుపురంగు... ఇలా చాలా షేడ్స్ వస్తున్నాయి. కొన్ని ఆకులు రెండు రంగుల కలయికగా కూడా వస్తున్నాయి. డ్వార్ఫ్ వెరైటీలో ఆకులు లేత గులాబీరంగులో ఉంటాయి. గన్నేరులో ఏ రకమైనా సరే కాలుష్యం, తెగుళ్లను తట్టుకుని బతకగలదు. ఈ చెట్లను ఎక్కువగా నేల మీద పెంచుతారు, పెద్ద పాట్‌లలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఏడాదంతా పచ్చగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఏ కాలంలోనూ ఆకులు రాలవు. ఏడాదంతా పూస్తుంది. ఒకసారి పూలు పూసిన తర్వాత కొంత విరామం తీసుకుంటుంది. ఆ సమయంలో ప్రూనింగ్(రెమ్మలను కత్తిరించడం) చేయాలి.

ఏడాది పొడవునా పూసే నందివర్ధనం

నందివర్ధనం మొక్కను పెంచుతున్నాను. దీనికి తరచుగా ఆకులన్నీ ముడుచుకునిపోతున్నాయి, మళ్లీ కొంతకాలానికి కొత్తగా చిగుర్లు వేస్తోంది. ఎందుకిలా జరుగుతోంది?
- ఎం. వినీల, రావినూతల

నందివర్ధనం పూలను ఎక్కువగా దేవుని పూజకు వాడతారు. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. ఇందులో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి. రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి వర్షాకాలం, ఎండాకాలం ఎక్కువ పూస్తాయి, శీతాకాలంలో తక్కువగా పూస్తాయి. కొత్త ఆవిష్కరణల్లో భాగంగా పువ్వు రంగులో మార్పు రాలేదు కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చ - తెలుపు రంగులు మిళితమై వస్తున్నాయి. ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి.

తాజా ఆవిష్కరణల్లో వీటిని కుండీల్లో పెంచడానికి వీలుగా ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే పెరిగేటట్లు చేస్తున్నారు. నందివర్ధనం పూలు సీజన్‌లో లెక్కలేనన్ని పూస్తాయి. ఎక్కువ రోజులు పూస్తాయి. పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు అడిగినట్లు ఈ చెట్టుకు ఆకు ముడత గురించి చెప్పాలంటే... ఇదొక తెగులు. వర్షాకాలం మొదట్లో ఈ తెగులు మొదలవుతుంది. పురుగు ఆకులోని రసం పీల్చేస్తుంది. ఈ పురుగులను బొచ్చు పురుగులు అంటాం. బొచ్చు పురుగుకి రక్షణ కవచం.

మనం పైన స్ప్రే చేసిన మందులు పురుగును చేరకుండా బొచ్చు అడ్డుకుంటుంది. పురుగు లేత దశలో అంటే రక్షణ కవచం ఏర్పడక ముందే జాగ్రత్త పడాలి. అప్పుడైతే ఏ సాధారణమైన పురుగుమందు చల్లినా పురుగు చనిపోతుంది. ఈ పురుగు పోవడానికి చల్లే మందులను నందివర్ధనం మొక్క ఆకుల మీద చల్లకూడదు, చెట్టు మొదట్లో చల్లాలి.

- ఎం. అనంత్ రెడ్డి, అడిషనల్ డెరైక్టర్, హార్టికల్చర్ (రిటైర్డ్)

రంగుల మందారాలు

హైబిస్కస్‌లో ఇప్పుడు లెక్కలేనన్ని రంగులు వస్తున్నాయి. దాదాపుగా 200 షేడ్స్‌ని సృష్టించారు. మనకు మొదట్లో ఐదు రెక్కల ఎర్ర మందారం ఉండేది. ఇది పువ్వు పెద్దదిగా ఉంటుంది, చెట్టుకు వంద పూలు కూడా పూస్తాయి. హైబ్రీడ్ హైబిస్కస్‌లో పెద్ద పూలు పూస్తున్నాయి, సంఖ్య కాస్త తగ్గుతుంది.

మన దేశీయ మందారను హువైన్ మందారతో కలిపి అంటు కట్టడం ద్వారా రకరకాల మందారచెట్లు వస్తాయి. రంగురంగుల పూలు మాత్రమే కాదు ఆకుల్లో కూడా రెండు షేడ్‌లు తీసుకురావచ్చు. అయితే దేశీయ చెట్టు తట్టుకున్నట్లు హువైన్ హైబిస్కస్ ఎండ వేడిని తట్టుకోలేదు. చెట్టుకు ఎండ తగలాలి కానీ వేడిగా ఉండరాదు. వీటిని పెద్ద పాట్‌లో వేసుకుంటే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వేరే చోటుకు మార్చుకోవచ్చు.

అనేక రంగుల మందారాలను వరుసగా నాటితే చాలా అందంగా ఉంటాయి. ఇందుకు విశాలమైన ఖాళీస్థలం ఉంటే చాలా బాగుంటుంది. అయితే స్థలం లేకపోయినా సరే కుండీలలో నాటవచ్చు. పాట్‌లలో పెంచుకునేవాళ్లు వర్షాకాలం వచ్చిన తర్వాత కుండీని మారిస్తే చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. పాట్‌ను వంచి పాత మట్టి రాలేటట్లు చేయాలి. పాట్ నుంచి మొక్కను వేర్లతో సహా రూట్‌బాల్ డిస్టర్బ్ కాకుండా తీయాలి. మరో పెద్ద పాట్‌లో కొత్త పాట్‌మిక్స్చర్(మట్టి పోషకాల మిశ్రమం) వేసి చెట్టును నాటాలి.

మందార పూలకు సెల్ఫ్‌లైఫ్ ఉండదు, కాబట్టి ఫ్లవర్‌వాజుల్లో అమర్చడానికి పనికిరావు. పువ్వు చెట్టుకు ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ కోసిన కొద్దిసేపటికే వాడిపోతుంది. కాబట్టి కుండీలను ఒక క్రమంలో అమర్చుకుంటే బాగుంటుంది.

- ఎం. అనంత్ రెడ్డి, అడిషనల్ డెరైక్టర్, హార్టికల్చర్ (రిటైర్డ్)

3 ఆకుకూరలు... 3 ముచ్చట్లు

గుడ్ ఫుడ్

ఆకుకూరల ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. అవన్నీ మనిషికి మేలుచేసేవే అనడంలో సందేహం లేదు. మూడురకాల ఆకుకూరల్లోని మూడు ముచ్చట్లివే...

పాలకూర: ఒకపూట భోజనంలో తినదగ్గ (అంటే ఒక సర్వింగ్ = 80 గ్రాముల్లో) పాలకూరలో ఒక వ్యక్తికి ఒక రోజుకు కావాల్సినంత విటమిన్-ఏ లభిస్తుంది. అంతేకాక 80 గ్రాముల పాలకూరలో ఒక రోజుకు ఒక వ్యక్తికి అవసరమైన విటమిన్-సిలో సగభాగం లభ్యమవుతుంది. దీనికి తోడుగా గుండెజబ్బులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దోహదపడే ఫోలేట్ కూడా పాలకూరలో పుష్కలంగా ఉంటుంది. ఈ ఫోలేట్ కేవలం గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పించడం మాత్రమే కాదు... పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రెటీనాను పరిరక్షించి కంటిచూపు మెరుగుపడటానికి దోహదపడతాయి.

క్యాబేజీ: ఇందులో గ్లుటామిన్ అనే అమైనోయాసిడ్ ఉంటుంది. దీనికి వాపు, మంటల నుంచి ఉపశమనం కలిగించే గుణం (యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ) ఉంది. అందుకే జీర్ణకోశ వ్యవస్థ పొడవునా మంట-వాపులను నిరోధించడంతో పాటు పెద్దపేగుల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్)ను నివారిస్తుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.

బ్రకోలీ: ప్రధాన నగరాలతో పాటు ఇప్పుడిప్పుడే పట్టణాల్లోనూ లభ్యమవుతున్న ఈ బ్రకోలీ ఆకుకూర శరీరానికి హానిచేసే ఫ్రీ-రాడికల్స్ కారణంగా గాయపడే కణాలను (సెల్యులార్ డ్యామేజీ) సమర్థంగా అడ్డుకుంటుంది. ఇందులో సైతం మంట-వాపులను అడ్డుకునే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ స్వభావంతో పాటు, వైరల్ ఇన్ఫెక్షన్‌లను సమర్థంగా ఎదుర్కొనే (యాంటీవైరల్) గుణం ఉంది. క్యాన్సర్‌ను శక్తిమంతంగా ఎదుర్కొనే గుణం బ్రకోలీకి ప్రత్యేకం. ఇక ఇందులో సెలీనియం, డై-ఇండోలైల్ మిథేన్, గ్లూకోరెఫానిన్ అనే రసాయనాలు (ఫైటో కెమికల్స్) ఉన్నాయి. ఇవి శరీరానికి హానిచేసే ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి.

రైతులకోసం e-వ్యవసాయం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతిఫలాలను రైతులకు కూడా అందించే సదుద్దేశంతో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు రైతుల కోసం ఒక వెబ్ సైటుని రూపొందించారు. ఎపిఅగ్రిస్నెట్.జిఓవి.ఇన్ అనే ఈ సైటులో రైతులకు ఉపయోగపడే భూసార పరిక్షల వివరాలు,పంటల సాగులో మెళుకువలు,పంటలకు వాడవలసిన ఎరువులు,రైతుల అనుభవాలు,ఎరువుల ధరలు వంటి అనేక విషయాలను తెలుగులో అందుబాటులో ఉంచారు.

ఆధారము: ఎపిఅగ్రిస్నెట్.జిఓవి.ఇన్

పోషకాల మిశ్రమాలివి!

పాట్ మిక్స్చర్ అంటే...
పోషకాల మిశ్రమం. ఇందులో సాధారణ మట్టి ఒక భాగం, వర్మీకంపోస్టు లేదా కంపోస్టు రెండు భాగాలు, లీఫ్ మోల్డ్ ఒక భాగం కలపాలి. వెర్మీకంపోస్టు తయారీ ఇలా!... కూరగాయల తొక్కల వంటి వంటింటి వ్యర్థాలను నిల్వ చేసి అందులో ఎర్త్‌వార్మ్‌లను వదలాలి. రెండు- మూడు వారాల్లో ఎరువు తయారవుతుంది.

కంపోస్టు తయారీ!...
ఇది కూడా వంటగది వ్యర్థాలతో తయారయ్యే ఎరువే. కానీ వానపాములను వదలరు. ప్లాస్టిక్ పాత్రలో వ్యర్థాలను నిల్వ చేస్తే రెండు నెలలకు ఎరువు తయారవుతుంది. పాత్రలోని వ్యర్థాలను వారానికోసారి కిందకు పైకి కలపాలి. లీఫ్ మోల్డ్ తయారీ! చెట్ల ఆకులను ఒక డ్రమ్‌లో వేసి పేడనీళ్లు చల్లాలి. 45 రోజులకు ఆకులు ఎరువుగా మారతాయి. డ్రమ్‌లో నీరు ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

కుండీలో పెంచే మొక్కలకు క్రమం తప్పకుండా పాట్‌మిక్స్చర్ వేయాలి. లేకపోతే సరిపడినంత పోషకాలు అందక మొక్క బలహీనపడుతుంది. ఆకులు రంగుమారి రాలిపోతాయి. మొత్తం మిక్స్చర్‌ను మార్చకపోయినా పైన వెర్మీకంపోస్ట్ లేదా సాధారణ కంపోస్ట్ వేయాలి. నీమ్‌కేక్ వేసినా మంచి ఫలితం ఉంటుంది. నీమ్ కేక్ అంటే వేప గింజల నుంచి నూనె తీసిన తరవాత వచ్చే చెక్క.

మొక్కల పెంపకంలో మల్చింగ్ (మట్టిని గుల్లబారేటట్లు చేయడం)ని మర్చిపోకూడదు. ఈ ప్రక్రియ ఎంత ప్రధానమైనది అంటే... రెండు మొక్కలను ఒకేసారి నాటి ఒకే రకమైన పోషకాలను వేస్తూ ఒకదానికి మల్చింగ్ చేస్తూ ఒకదానికి చేయకుండా వదిలేస్తే మొక్క ఎదుగుదలలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మల్చింగ్ చేస్తే తేమ ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది. అప్పటి వరకు మొక్కకు వేసిన పోషకాలను గ్రహించి పెరిగిన కలుపు మొక్కలు మల్చింగ్ చేసినప్పుడు మట్టిలో కలిసిపోయి మొక్కకు ఎరువుగా మారతాయి.

"హరిత విప్లవ పిత" గా పేరొనబడే ఎమ్‌.ఎస్‌. స్వామినాధన్‌

"హరిత విప్లవ పిత" గా పేరొనబడే ఎమ్‌.ఎస్‌. స్వామినాధన్‌ భారత వ్యవసాయరంగంలో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం. నేడు మనకు తగినంత ఆహారం పొందడం అంటు జరుగుతోంది అంటే దీని కారణం అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్. ఈయన ఒక ఆదర్శ శాస్త్రవేత్త మరియు ఈయనను హరిత విప్లవం కారకుడుగా చెప్పుకోవచ్చు. ఎం.ఎస్. స్వామినాథన్ ఆగష్టు 7, 1925 న గల కుంభకోణం లో జన్మించాడు. స్వామినాథన్కు 11 ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. స్వామినాథన్ భారతదేశం లో వున్నా శాస్త్రవేత్తలలో గొప్ప జన్యుశాస్త్రవేత్త మరియు ప్రఖ్యాత అంతర్జాతీయ నిర్వాహకుడు, ఉంది "హరిత విప్లవం," ఒక కార్యక్రమం ఇది కింద గోధుమ, బియ్యం మొలకల అధిక దిగుబడి రకాలు పేద రైతుల రంగాలలోనాటింపచేశారు . స్వామినాథన్ భారతదేశం లో గోధుమ అధిక దిగుబడి రకాల పరిచయంచేసి మరియు అభివృద్ధి పరిచారు, తన నాయకత్వం మరియు విజయం కోసం "భారతదేశం లో హరిత విప్లవం తండ్రి", అని అంటారు. అతను ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గా వున్నారు. అతని పేర్కొంది దృష్టి ఆకలి మరియు పేదరికం ప్రపంచం ఉద్యమించారు. డా స్వామినాథన్ ముఖ్యంగా పర్యావరణపరంగా స్థిరమైన వ్యవసాయం ఉపయోగించి, స్థిరమైన అభివృద్ధికి భారతదేశం కదిలే ఒక న్యాయవాది ఉంది, స్థిరమైన ఆహార భద్రత కలిగించారు మరియు ఒక "సతత హరిత విప్లవం" అని పిలిచే జీవవైవిధ్యం చూపించారు, విప్లవం యొక్క సంరక్షణ 1972 నుండి 1979 వరకు ఆయన అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్గా, మరియు అతను 1979 నుండి 1980 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అతను అంతర్జాతీయ వరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (1982-88) డైరెక్టర్ జనరల్ పనిచేశాడు మరియు 1988 లో ప్రకృతి మరియు సహజ వనరుల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అధ్యక్షుడు అయ్యాడు. డాక్టర్ స్వామినాథన్ ప్రాథమిక మరియు అనువర్తిత ప్లాంట్ బ్రీడింగ్, వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి మరియు సహజ వనరుల పరిరక్షణకు లో సమస్యలు విస్తృత న సహచరులు మరియు విద్యార్ధులు సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పని చేసింది. స్వామినాథన్ "ఎకనామిక్ ఎకాలజీ యొక్క తండ్రి" గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వర్ణించారు. డాక్టర్ స్వామినాథన్ అనేక అసాధారణ అవార్డులు మరియు బహుమతులు అందుకున్నాడు. ఈ బహుమతులు కొనసాగటానికి మరియు తన పని విస్తరించేందుకు సహాయం చేసింది, ఇది పెద్ద మొత్తంలో డబ్బు, ఉన్నాయి. జీవ ఒక పర్యావరణ సంబంధిత నిలకడగా ఆధారంగా ఉత్పాదకత, మరియు "1991 జీవ వైవిధ్య పరిరక్షణా ప్రోత్సాహకం. అతను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నుండి 50 గౌరవ డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉంది. జాతీయ అవార్డులు అతను దేశం ప్రయోజనకరంగా తన పని కోసం భారతదేశం లో పలు అవార్డులను సన్మానించారు చెయ్యబడింది. ఇన్ని చేసిన ఇంత గొప్ప హరిత విప్లవకారుడు ఎం.ఎస్. స్వామినాధన్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎం.ఎస్. స్వామినాధన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కావునా. ఆయనకీ మన బ్లాగ్ ద్వారా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఎం.ఎస్. స్వామినాధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.

సుభాష్ పాలేకర్ : ఓ రైతు గాథ

పొలం ఆయన మాట వింటుంది!

భారతదేశం సుసంపన్న వ్యవసాయ దేశం. ఇది మనమందరం గర్వపడే విషయం! రసాయనిక ఎరువుల వాడకంలోనూ అగ్రగామి మనదేశం. ఇది మనమందరం బాధపడాల్సిన విషయం! ఇంతకు ముందుతరాలలో వేల సంవత్సరాలపాటు అవసరం లేని మందుల వాడకం ఇప్పుడు ఎందుకు ఇంతగా పెరిగింది? పురుగుమందులు వాడకుండా వ్యవసాయం చేయలేమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు

వెతికి, వాటిని రుజువు చేసిన ఓ రైతు గాథ ఇది.

సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలోని కరవు ప్రాంతం విదర్భకు చెందినవాడు. దాంతో సహజంగానే వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గరగా చూశాడు. అందుకే తన విద్యను, అధ్యయనాన్ని వ్యవసాయం మీదనే కొనసాగించాడు. ఫలితంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. కొంతకాలానికి సొంతపొలంలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు. అలా సుమారు పదేళ్లపాటు అంటే 1972 నుంచి 82 వరకు మంచి దిగుబడితో పంటలు పండించాడు. ఎందుకో ఆ తర్వాత అంతకుముందు వచ్చినన్ని దిగుబడులు రాలేదు. దీంతో స్వయంగా పరిశోధనలలోకి దిగాడు. నిపుణులను అడిగాడు. సర్వేనివేదికలు తెప్పించుకుని చూశాడు.దిగుబడి పెంచుకోవడానికి అప్పటికి ఆయనకు కనిపించిన ఒకటే మార్గం మరిన్ని రసాయనిక మందులు వాడటం. ‘సరే, ఇప్పుడంటే మందులు ఎక్కువ వాడతాను, మరలా కొన్నేళ్లకు దిగుబడులు పడిపోతే ఏంటి పరిస్థితి? అపుడింకా ఎక్కువ వాడాలా? మందులవాడకాన్ని ఎంతకాలమని ఇలా పెంచుకుంటూ పోతాం…’ అన్న అంతర్మథనం ఆయనలో మొదలైంది. దీనికేదో ఒక మార్గం కనిపెట్టాల్సిందే అనుకున్నాడు. రసాయనిక ఎరువుల లాభ-నష్టాలపై మూడేళ్లపాటు పరిశోధిస్తే, దానికన్నా ఆర్గానిక్ వ్యవసాయమే మెరుగ్గా అనిపించింది. ముందుగా భూసారంపై పరిశోధనలు చేశారు.

సేంద్రియ ఎరువుల వల్ల నేల కలుషితం కాదు, పంటల్లో రసాయనాలు ఉండవు, అంతవరకు బాగానే ఉంది కానీ అది చాలా క్లిష్టమైన పద్ధతి. ఒక రకంగా ఖరీదైనదే. ఎక్కువ శ్రమతో కూడినదీ. అందుకే ఆదివాసీ వ్యవసాయ ప్రాంతాలకు వెళ్లాడు. వారి పద్ధతులు గమనించాడు. ప్రకృతి సృష్టించిన జీవ వైవిధ్యమే పాత్ర పంట దిగుబడుల్లో ప్రధాన పోషిస్తోంది గాని మందులు కాదు అని తెలుసుకున్నాడు.

మొక్క కేవలం రెండు శాతం మాత్రమే భూమిలో పోషకాలను ఉపయోగిస్తుంది. మిగతా అంతా గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే గ్రహిస్తుందని గ్రహించాడు. ఆ రెండింటినీ సరైన మోతాదులో సరిగ్గా అందించగలిగితే చాలనుకున్నాడు. తన పరిశోధనల్లో భాగంగా మన ప్రాచీన గ్రంథాలను కూడా పరిశీలించాడు.

ఆవుపేడ, గోమూత్రం … ఈ రెండింటికీ మించిన ఎరువు లేదని ఆయనకు అర్థమైంది. దానిపై పరిశోధనలు చేశారు. చివరకు విజయం సాధించారు. కేవలం ఒక ఆవు ఎరువు 30 ఎకరాలు పండించడానికి సరిపోతుందట. పదికిలోల ఆవుపేడ, పదిలీటర్ల గోమూత్రం, రెండుకేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాడు. ఈ మందుకు ఆయన పెట్టిన పేరు ‘జీవ మూత్ర’. దాన్నే పొలంలో వాడారు. దాంతో అత్యధిక దిగుబడులు సాధించారు.

ఒక్క బెల్లం తప్ప బయటనుంచి కొనేదేమీ లేది ఇందులో. పురుగు మందులు అతిగా వాడి పాడైన పొలాలను జీవ మూత్ర మందు మళ్లీ యథాతథ స్థితికి తేగలదు. ఎందుకంటే ప్రతి గ్రాము ఆవు పేడలో 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులుంటాయిట. ఇవి మట్టిని సారవంతం చేస్తాయి. అయితే, విదేశాల నుంది దిగుమతి చేసుకున్న జెర్సీ, ముర్రా జాతి ఆవుల పేడ ఇందుకు పనికిరాదట!

తన పరిశోధన ఫలాలు అందరికీ అందించడం కోసం రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాడు పాలేకర్. సుమారు ఇప్పటివరకు 2000 శిబిరాల కంటే ఎక్కువే నిర్వహించాడు. అరవైలలోనూ అలసి పోకుండా తన పయనం కొనసాగిస్తున్నారు. పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం (జీరో బడ్జెట్ ఫర్ నేచురల్ ఫామింగ్) ప్రధానాంశంగా పలు పుస్తకాలు రాశారు.

తన పరిశోధన ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వాటిపై రూపాయి కూడా లాభం వేసుకోకుండా ఉత్పాదక వ్యయానికే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, వ్యవసాయంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలిచ్చేందుకు ఇంటర్‌నెట్ ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు.

కుటుంబమంతా భూమిపుత్రులే!

సుభాష్ పాలేకర్ మాత్రమే ఆ కుటుంబంలో అందరూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. సుభాష్ వారసుడు అమోల్ కూడా తండ్రి మార్గంలో నడిచారు. ఇందుకోసం ఆయన తన ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తండ్రి, అన్నల బాటలో అమిత్ తన అడుగులు వేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ కటుంబం మొత్తంతో భూమిపుత్రులుగా మారి, రసాయనిక వ్యవసాయంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. సుభాష్ కోడళ్లు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు చేసే ఫోన్ కాల్స్‌కు సమాధానాలిస్తూ వీరితో పాటు ప్రకృతి వ్యవసాయంలో తమ పాత్ర పోషిస్తున్నారు.

మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే సుభాష్ పాలేకర్ అనుసరించే వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే www.palekarzerobudgetnaturalfarming.com ను సంప్రదించవచ్చు. అందులో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పంటల పండగ సంక్రాంతి రోజున సుభాష్‌కు సలాం!

"కేవలం ఒక ఆవు పేడ 30 ఎకరాలు పండించడానికి సరిపోతుంది. పది కిలోల ఆవు పేడ, పది లీటర్ల గోమూత్రం, రెండు కేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాను. దాన్నే పొలంలో వాడాను. దాంతో అత్యధిక దిగుబడులు సాధించాను. మందులు అతిగా వాడి పాడైన పొలాలను ఈ జీవ మూత్ర మందు మళ్లీ యథాస్థితికి తేగలదు."

గులాబీలు

శ్రద్ధ కొద్దీ ఎదుగుదల...

గులాబీలు చాలా రకాలుంటాయి. ప్రధానంగా హైబ్రీడ్ టీ రోజెస్, ఫ్లోరీ బండా, మినియేచర్ రోజెస్ అని మూడు రకాలు ఉంటాయి. ఇందులో ప్రతి రకంలోనూ వెయ్యికి పైగా ఉపజాతులు ఉన్నాయి.

- హైబ్రీడ్ టీ రోజ్... పువ్వు పెద్దది, రెక్కలు కూడా బలంగా ఉంటాయి. పువ్వు జీవితకాలం కూడా ఎక్కువ. అంటే ఎక్కువ రోజులు రెక్కలు రాలకుండా తాజాగా ఉంటుంది.

- ఫ్లోరీబండా... పువ్వు సైజు పెద్దదే కానీ రెక్కలు సున్నితంగా ఉంటాయి. రెక్కలు త్వరగా రాలిపోవడానికి అవకాశం ఎక్కువ.

- మినియేచర్ రోజ్... దీనినే బటన్ రోజ్ అంటారు. ఇవి చాలా చిన్న పూలు. తలలో పెట్టుకోవడానికి పనికిరావు. నేలను ఫ్లవర్ బెడ్‌తో అందంగా ఉంచడానికి దోహదం చేస్తాయి.

- మనం వాడే పూలలో ఎడ్వర్డ్ రోజెస్ కూడా ఉంటాయి. వీటిని కాకినాడ గులాబీలు అంటారు. అలాగే ప్రతి వెరైటీలోనూ వాసన వచ్చేవి, రానివి ఉంటాయి. వాసనలో కూడా అనేక ఫ్లేవర్ల గులాబీ రకాలు ఉన్నాయి. గులాబీ చెట్లు అంటే మొక్కగా నాటి మానుగా ఎదిగిన క్రమమే మనకు పరిచయం. కానీ ఇప్పుడు గులాబీలలో క్లైంబింగ్ వెరైటీలు వచ్చాయి. అంటే సన్నజాజి తీగలాగ పైకి అల్లుకునే రకాలన్నమాట.
- ఎం. అనంత్ రెడ్డి, అడిషనల్ డెరైక్టర్, హార్టికల్చర్ (రిటైర్డ్)

గులాబీ రెమ్మలు కత్తిరించాక...

గులాబీ మొక్కకు ఆకురాలుతుంటే... సాధారణంగా నీరు సరిగా పట్టకపోవడం లేదా ఎక్కువ నీరు పట్టడం రెండూ కారణాలు కావచ్చు. కారణాన్ని గుర్తించి తగిన విధంగా నీటి మోతాదును మార్చుకోవాలి. కొన్నిసార్లు ఈ రెండూ సరిగానే ఉన్నా కూడా ఆకులు రాలుతుంటాయి. అది పోషకాల లోపం కారణంగా కావచ్చు. అప్పుడు పాట్‌మిక్చర్(మొక్క నాటడానికి కుండీలో నింపిన మట్టి, పోషకాల మిశ్రమం)లో పై పోషకాలను వేసి మల్చింగ్ (చిన్న పలుగులాంటి సాధనంతో మట్టిని తవ్వి గుల్లబరచడం) చేయాలి.

దీని వల్ల పోషకాలు మొక్కకు బాగా పడతాయి. ఏదైనా మొక్కఆకులు... ఆకు పచ్చ రంగులో ఉన్నన్ని రోజులు ఆకు జీవించి ఉన్నట్లు. ఏ కారణం చేత రంగు మారడం మొదలైనా ఆకు జీవితం ముగిసినట్లే. అలాగే గులాబీ మొక్క పెంపకంలో తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలు...

గులాబీ మొక్కకు రెమ్మలను కత్తిరించిన తర్వాత కషాయం లేదా పేడనీటిని చిలకరించడం తప్పనిసరి. గట్టి కొమ్మలను కత్తిరించినప్పుడు పేడను ముద్దగా చేసి కత్తిరించిన చోట అతికించాలి. ఇలా చేయకపోతే తెగులుసోకి మొక్క ఎండిపోతుంది.

చలికాలంలో గులాబీ మొక్కలకు పౌడరీ విండ్యూ అనే తెగులు వస్తుంటుంది. దానినే బూజు తెగులు అంటాం. ఇది పోవాలంటే కషాయంలో ఇంగువ కలిపి మొక్క మీద స్ప్రే చేయాలి.
వారానికోసారి మల్చింగ్ చేయాలి, అది కూడా నేల పొడిగా ఉన్నప్పుడే చేస్తే మంచిది.

గార్డెనింగ్ : గులాబీ పెద్దగా పూయాలంటే...

గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో దాని ముళ్లు అంత కఠినంగా ఉంటాయని కవులు భాష్యం చెబుతారు. అలాగే గులాబీ ఎంత అందంగా ఉంటుందో దాని పెంపకంలో అన్ని సమస్యలు ఉంటాయని చెప్పవచ్చు. వీటిని నాటడానికి సీజన్‌తో పని ఉండదు, ఎప్పుడైనా చేయవచ్చు. పూలు ఏడాదంతా పూస్తాయి. అయితే వీటిని ఏడాది పొడవునా పూయించుకోవడం లేదా ప్రత్యేకమైన సందర్భం కోసం పూయించుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రూనింగ్ (రెమ్మలను కత్తిరించడం) చేసే టైమ్‌టేబుల్‌ని బట్టి మనకు కావల్సిన విధంగా పూయించుకోవచ్చు. లైట్ ప్రూనింగ్... ఇందులో ముదురు కొమ్మలను కత్తిరించకూడదు, పైపైన లేత కొమ్మలను మాత్రమే కత్తిరించాలి. ప్రతి కొమ్మ నుంచి మొగ్గలు వస్తాయి, అయితే సన్న కొమ్మల ఆధారంగా పూసే పూలు చిన్నవిగా ఉంటాయి. పువ్వు పెద్దదిగా అందంగా ఉండాలంటే... ప్రధానమైన కాండానికి అనుబంధంగా ఉన్న పెద్ద కొమ్మలను ఉంచి, చిన్న కొమ్మలను తీసేయాలి.

ముదురు కొమ్మల నుంచి పెద్ద పూలు పూస్తాయి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలా సాధారణంగా ఫ్లవర్ షోల సందర్భంలో చేస్తుంటాం. ఇంట్లో కూడా బర్త్‌డే పార్టీల వంటివి ఉన్నప్పుడు ఆ సమయానికి తగినట్లు ప్రూనింగ్ చేసుకుంటే పెద్ద పూలు పూస్తాయి. మన సందర్భానికి 50 రోజుల ముందుగా ప్రూనింగ్ చేస్తే... ఫంక్షన్ నాటికి అవి

ఇంటి కప్పుపైనా మొక్కలు పెంచుదాం

మాకు ఇంటి ముందు ఖాళీ జాగా లేదు. ఇంటి కప్పు మీద మొక్కలు పెంచుకోవచ్చా?
- ఎం. సుగుణ, హైదరాబాద్
టై మీద అన్ని రకాల మొక్కలనూ పెంచవచ్చు. ఆహారధాన్యాల నుంచి కరివేపాకు, నిమ్మ, మునగ వంటి కూరగాయల చెట్లనూ టై మీద పెంచుకోవచ్చు.

ఆకుకూరలు త్వరగా కోతకు వస్తాయి. గింజలు చల్లిన 25 రోజుల నుంచి కోసుకోవచ్చు. మొదటి సారి కోసిన తర్వాత పది నుంచి 15 రోజుల్లో రెండవ కోత కోసుకోవచ్చు. తోటకూర, పాలకూర, మెంతికూర... ఇలా ఏదైనా సరే మూడు నుంచి నాలుగు కోతలు వస్తాయి. ఆకు కూరలను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. టై మీద పెంచాలంటే ఇటుకలతో మడిని తయారు చేసుకోవాలి.

ఇటుకలను రెండు వరుసలుగా ఒకదాని మీద ఒకటి పేర్చి ఆ పైన 800 గేజ్ పాలిథిన్ షీట్ పరవాలి. షీట్ మీద పాట్ మిక్చర్ (ఒక భాగం మట్టి, ఒక భాగం వర్మీకంపోస్టు లేదా కంపోస్టు, ఒక భాగం లీఫ్‌మోల్డ్ మిశ్రమం) వేసి ఆరు నుంచి తొమ్మిది అంగుళాల మందాన సర్దాలి. ఆ తర్వాత గింజలు చల్లాలి. గింజలను గింజ మందానికి రెండింతల లోతుగా చల్లాలి. మరీ లోతుగా చల్లితే మొలక వస్తుంది కానీ అది పైకి రాలేక అక్కడే నశిస్తుంది. గింజలు చల్లిన తర్వాత రోజూ ఒకటి - రెండుసార్లు నీటిని చిలకరించినట్లు చల్లాలి. మొలక వచ్చే వరకు పై పొర తేమగా ఉండాలి. మట్టి చెక్కులా బిగుసుకుపోతే మొలక పైకి చొచ్చుకుని రాలేదు.

ఆకు కూరలను ఒకసారి కోసిన తరవాత పాట్ మిక్చర్‌లో పై పోషకాలను వేయాలి. తరచుగా మట్టి పై పొరను గుల్లబరచాలి. ఈ క్రమంలో మొక్కకు పోషకాలు బాగా పట్టడంతోపాటు కలుపు మొక్కలు నశిస్తాయి. మడిలో ఎక్కువైన నీరు బయటకు పోవడానికి పాలిథిన్ షీట్‌కు ఒక చివర రంధ్రం చేయాలి. ఆకు కూరలను ఏడాది పొడవునా పెంచుకోవచ్చు.

ఆధారము: అగ్రికల్చర్ గేటు వే.బ్లాగ్ స్పాట్.ఇన్

3.00682593857
గోపాలకృష్ణ గుజ్జుల Jan 26, 2020 05:34 PM

సర్...నేను మొక్కజొన్న పంట సాగుచేస్తున్నాను. ప్రస్తుతం పంట వయసు 35 రోజులు.. కత్తెర పురుగు నివారణ మరియు అధిక దిగుబడి కోసం ఏమి చేయాలి

Sravani Jan 16, 2020 08:18 PM

మీరు ప్రభుత్వంలో ఒక సభ్యురాలు అయితే రైతు సహాయం చేసే పనులు ఏవి

Anonymous Jun 24, 2017 10:16 PM

కూరగాయల పంటలు

దినేష్ Feb 06, 2017 12:09 AM

సార్ నెను కూరగాయలు వేసాను దానిలొ ఏవీదిమైన ఎరువులు వడలి చెప్పాగలరు

Anonymous Nov 07, 2015 07:45 PM

మిరప తోటలో వైరస్ నివారణకు మందులు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు