অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యసాయంలో రైతుకి సూచనలు

వ్యసాయంలో రైతుకి సూచనలు

 1. కొబ్బరి పాలు + పుల్ల మజ్జిగ..!
 2. పుట్టగొడుగుల సాగు
 3. పాడి రైతుకు బాసట మొలక గడ్డి మూట!
 4. సేద్య ‘సంజీవని’!
 5. చదువుల తల్లి ఒడిలో ఇంటిపంటల కొలువు!
 6. తూటి కషాయంతో చీడ పీడలు దూరం
 7. కాయకల్ప చికిత్స ప్రకృతి సేద్య కళతో పునరుజ్జీవనం!
 8. పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం!
 9. మేకల పెంపకం లాభదాయకం
 10. ఇక్కట్లు లేని ‘ఇంటిపంట’లకు దారిది!
 11. సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు!
 12. సిరుల ‘ఫ్లవర్’
 13. రూపు మార్చితేనే రూకలు!
 14. కిలో టమోటాలతో 50 గ్రాముల పొడి!
 15. రైతుల శ్రమ తగ్గించాడు
 16. ఇంటిపంట’ స్ఫూర్తితో... మేడపైనే పండ్లు, కూరగాయలు!
 17. ఇక ద్రోన్ల శకం!
 18. నేలమ్మా.. మన్నించమ్మా!
 19. జంతువులను పాము కాటు నుండి .....
 20. వాతావరణ పరిస్థితులు -రైతులకు సూచనలు

కొబ్బరి పాలు + పుల్ల మజ్జిగ..!

పంట పెట్టడం ఒకెత్తయితే.. అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు. మార్కెట్‌లో నూరారు పేర్లతో గ్రోత్ ప్రమోటర్లను అమ్ముతున్నారు. అయితే, వీటిని కొనకుండా కొద్దిపాటి శ్రమతో ఇంటి వద్దే పెద్ద ఖర్చేమీ లేకుండా తయారు చేసుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే అక్సిన్స్, గిబ్బర్లిన్ తదితరాలు ‘నర్రెంగ’ మొక్కలో దండిగా ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ‘అల్బీజీయా అమరా’. నర్రెంగ ఆకులను ఒక కిలో తీసుకొని.. ఐదు లీటర్ల పుల్ల మజ్జిగలో వేసి.. వారం రోజుల పాటు పులియబెట్టాలి. ఆ తరువాత వడకట్టి లీటర్ ద్రావణాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

నర్రెంగ మొక్కలు దొరక్కపోతే? మరో మార్గం ఉంది. పచ్చి కొబ్బరిని రుబ్బి, పాలు తీయాలి. ఐదు లీటర్ల కొబ్బరి పాలకు ఐదు లీటర్ల మజ్జిగను చేర్చి.. ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకొని పులియబెట్టు కోవాలి. వారం తరువాత ద్రావకాన్ని వడకట్టుకొని లీటరు ద్రావణాన్ని 20 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రెండు ద్రావణాలు పంటల ఎదుగుదలకే కాకుండా పూత, పిందె బాగా రావడానికి ఉపయోగపడతాయి.

పుట్టగొడుగుల సాగు

సేంద్రియ కూరగాయల కన్నా సులభం
గ్రీన్‌హౌస్‌లో ఏడాది పొడవునా పెంచుకోవచ్చు శుభారంభానికి ఇదే తరుణం

టై మీద ఆకుకూరలు, కూరగాయలే కాదు పౌష్టికాహారమైన పుట్టగొడుగులను కూడా సేంద్రియ పద్ధతుల్లో నిక్షేపంగా పెంచుకోవచ్చు. పుట్టగొడుగుల సాగు కష్టమేమో అనుకోకండి. నిజానికి కూరగాయలకన్నా వీటిని పెంచడమే సులభం అంటున్నారు పవిత్ర ప్రియదర్శిని.

‘ఇంటిపంట’ ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యురాలైన పవిత్ర కోయంబత్తూరు నివాసి. రసాయనాలు వాడి పెంచిన పుట్టగొడుగులు కొని తినడం ఇష్టం లేక.. తన ఇంటిపైనే చిన్న గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.. ‘కాస్త మనసు పెట్టి ప్రణాళికతో పనిచేస్తే చాలు.. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇంటిపట్టునే పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. ఇంటర్‌నెట్ ద్వారా అధ్యయనం చేసిన జ్ఞానంతో.. ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించా. బటన్ పుట్టగొడుగుల కంటే ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచడం తేలిక...’ అంటున్నారామె. తెల్ల, లేత ఎరుపు పుట్టగొడుగులను ఆమె పెంచుతుండడం విశేషం.
టైపై సేంద్రియ పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సినవి

 1. వరి గడ్డి
 2. ఆయిస్టర్ మష్రూమ్ స్పాన్(విత్తనం)
 3. ప్లాస్టిక్ బ్యాగ్‌లు

గడ్డి బ్యాగ్‌ల తయారీ ఇలా...
వరి గడ్డిని చిన్న ముక్కలు చేయాలి. వాటిని పెద్ద పాత్రలో వేసి నీరుపోసి మూతపెట్టి.. చిన్న మంట మీద గంట సేపు ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత న్యూస్‌పేపర్ నేలపై పరచి.. దానిపై గడ్డిని వేసి.. నీరు పూర్తిగా కారిపోయే వరకు ఆరబెట్టాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌లు తీసుకొని 3 అంగుళాల ఎత్తు వరకు గడ్డిని నొక్కి పెట్టాలి. గుప్పెడు స్పాన్‌ను తీసుకొని.. గడ్డి బ్యాగ్ అంచుల్లో వేయండి. ఆపైన 2 అంగుళాల మందాన మళ్లీ గడ్డిని నింపండి. గడ్డిపైన అంచుల్లో మళ్లీ స్పాన్ వేయండి... ఈ విధంగా 3 పొరలుగా వేయండి. చివ రన గడ్డి పొర వేసి ప్లాస్టిక్ బ్యాగ్ మూతిని బిగుతుగా కట్టేయాలి.ప్లాస్టిక్ బ్యాగ్‌పైన, చుట్టూతా, అడుగున కొన్ని బెజ్జాలు పెడితే గడ్డికి గాలి తగులుతుంది.

పుట్టగొడుగుల పెంపకం ఇలా...

మీ ఇంట్లో ఒక మూలన చీకటిగా, చల్లగా ఉండే చోటులో.. అది కాంక్రీటు షెల్ఫ్ కావచ్చు, కప్‌బోర్డు కావచ్చు లేదా మంచం కింద పెట్టె కావచ్చు.దాని శుభ్రం చేసి, దాని లోపల అంతటా డెటాల్ నీటితో శుభ్రం చేసి.. తడి ఆరనివ్వండి. గడ్డి బ్యాగ్‌లను అందులో పెట్టి... నల్లని వస్త్రం లేదా గోనెసంచితో కప్పండి.వాతావరణం వేడిగా ఉన్నట్లయితే.. ఆ వస్త్రం లేదా గోనెసంచిపై రోజుకు రెండుసార్లు నీటిని చిలకరించి తడిగా ఉండేలా చూడండి. 3,4 రోజుల్లో స్పాన్ ఉన్న చోట తెల్లని బూజులాంటిది(మైసీలియం) కనిపిస్తుంది. బ్యాగ్‌లో ఏమైనా ఆకుపచ్చని బుడిపెల్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడండి. అలాంటివి ఉంటే చెడిపోయినట్లు లెక్క. అటువంటి బ్యాగ్‌ను తీసి పక్కకు పెట్టేసి.. ఆకుపచ్చగా ఉన్న చోట బ్యాగును కత్తిరించి చిటికెడు ఉప్పును చల్లండి. అంతా సవ్యంగా ఉంటే.. 2 వారాల్లో బ్యాగ్ మొత్తం తెల్లగా పొరతో నిండిపోతుంది.

అప్పుడు బ్యాగులను బయటకు తీసి, శుభ్రమైన కత్తి మొనతో బ్యాగ్‌పై ఎక్స్ ఆకారంలో గాట్లు పెట్టి.. ఇంట్లోనే నీడపట్టున కొంచెం వెలుతురుగా ఉండే చోట పెట్టాలి. రోజుకు 3-5 సార్లు నీటిని చిలకరించాలి.నేనైతే మేడ మీద గ్రీన్ షేడ్‌నెట్‌తో షెడ్డు వేశాను. షెడ్డులో ముందువైపు చాలా ఖాళీ వదిలేసి, ఒక మూలకు గ్రీన్‌షేడ్‌నెట్‌తో చిన్న గదిలాగా ఏర్పాటు చేశాను. దాని పైన, బయటి వైపు కొబ్బరి ఆకులు కప్పాను. లోపల గోనె సంచులను వేలాడదీశాను. గోనె సంచులను చల్లదనం కోసం మధ్యాహ్న వేళల్లో నీటితో తడుపుతూ ఉంటాను.

బ్యాగ్‌లకు గాట్లు పెట్టిన చోట్ల బుడిపెలు పెరుగుతూ ఉంటాయి. అవి తేమ ఆరిపోకుండా రోజుకు 5 సార్లు నీటిని చల్లుతుండాలి. 3 నుంచి 5 రోజుల్లో ఈ బుడిపెలు పుట్టగొడుగులుగా విస్తరిస్తాయి. గ్రీన్‌హౌస్‌లో 28-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. వేడి వాతావరణంలోనూ పుట్టగొడుగులు పెంచవచ్చు. గ్రీన్‌హౌస్‌లో నేల మీద ఇసుకపోసి తడుపుతూ ఉంటే చల్లగా ఉంటుంది.
పుట్టగొడుగుల అంచులు కిందికి వంగి ఉండగానే.. కోసి కూరవండుకుంటే రుచిగా ఉంటాయి. ముదిరితే అంచులు పైకి ముడుచుకుంటాయి. అప్పుడు రుచి తగ్గుతుంది. పుట్టగొడుగుల పెంపకంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. పుట్టగొడుగుల పెంపకం ప్రారంభానికి అనువైనది శీతాకాలమే. ఇంకెందుకు ఆలస్యం..! (పుట్టగొడుగుల పెంపకంపై సందేహాలుంటే పవిత్ర ప్రియదర్శిను 099941 20017 నంబరులో ఏ రోజైనా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆంగ్లంలో మాత్రమే సంప్రదించగలరు.)

పాడి రైతుకు బాసట మొలక గడ్డి మూట!

 • ఇంటి దగ్గరే ట్రేలలో మొలక గడ్డిని పెంచుకోవచ్చు..
 • పాడి పశువులతోపాటు గొర్రెలకూ మేపొచ్చు
 • మొక్కజొన్నలతో 8 రోజుల్లోనే పుష్టికరమైన మొలక గడ్డిని పెంచొచ్చు
 • 15-20% వరకు పెరిగిన పాల దిగుబడి..

పాడి రైతులకు వరప్రసాదంగా మారిన
మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ అధికారుల కృషి

చిన్న, సన్నకారు రైతుల్లో చాలా మందికి పంటల ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికరాదాయం వస్తున్న మాట వాస్తవం. అటువంటి పాడికి ఆధారం పచ్చిమేత. పశువులకు సంపూర్ణ ఆహారం అందించాలంటే పచ్చిమేత తప్పనిసరి. ఏడాదిలో 365 రోజులూ పచ్చిమేతను పాడి పశువులకు అందించడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. నేల, కూలీల కొరతకు కరువు తోడవడంతో పాడి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ‘మొలక గడ్డి’ సాగు! మొలక గడ్డిని తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే సులభంగా పెంచుకునే పద్ధతిని మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో మొలకగడ్డిని నిక్షేపంగా పెంచుకొని అధికాదాయం పొందవచ్చని రుజువు చేస్తున్నారు పలువురు పాడి రైతులు.

విస్తారమైన నేల అవసరం లేకుండానే ఇంటిపట్టున ఏడాది పొడవునా నిశ్చింతగా పచ్చిమేత పెంచుకునే కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కరువు బారిన పడి విలవిల్లాడుతున్న పాడి రైతులకు సులువైన ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కోనేటి వెంకట రమణ మొలక గడ్డి(హెడ్రోపోనిక్ ఫాడర్) పెంపకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా చేపట్టి సత్ఫలితాలు సాధించారు. ఆ తర్వాత ఈ పద్ధతిని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. భూమి లేని నిరుపేదలు కూడా తక్కువ ఖర్చుతో పచ్చిమేతను పండించుకోవచ్చు.

కిలో గింజలతో 10-12 కిలోల మొలకగడ్డి

బార్లీ, సజ్జ, మొక్కజొన్నలతో మొలకగడ్డిని పెంచవచ్చు. కిలో మొక్కజొన్నలతో ఒక ట్రేలో 9 రోజుల్లో 10-12 కిలోల మొలక గడ్డిని పెంచవచ్చు. ఒక్కో పశువుకు రోజుకు 10-15 కిలోల మొలక గడ్డిని అందించవచ్చు. ప్రతి పశువుకూ రోజూ ఈ గడ్డి అందుబాటులో ఉండాలంటే.. 9 ట్రేలను సమకూర్చుకొని రోజుకో ట్రేలో మొలక కట్టిన గింజలను ట్రేలో వత్తుగా ఉండేలా పోయాలి. తరచూ నీటితో తడుపుతూ ఉండాలి. 9 రోజులు గడిచేటప్పటికి మొదటి రోజు పెట్టిన ట్రేలో మొలక గడ్డి వాడకానికి సిద్ధమవుతుంది. ఎటువంటి ఎరువులూ వేయనక్కర్లేదు. గింజల్లోని పోషకాలతోనే గడ్డి పెరుగుతుంది.

అత్యధికంగా పోషకాలు

ఈ మొలక గడ్డి దాణాతో సమానం. సాధారణ పచ్చిమేతలో 7-10% ప్రొటీన్లుంటాయి. కానీ, మొలక గడ్డిలో 17.2% ప్రొటీన్లున్నాయి. 25.4% పీచుపదార్థంతోపాటు ఏ, ఈ విటమిన్లు.. కాల్షియం, భాస్వరం తదితర లవణాలు అధికంగా ఉన్నాయి. పాల దిగుబడి 20-30 శాతం పెరుగుతుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. తొందరగా ఎదకు వస్తాయి.

గ్రీన్ షేడ్ నెట్‌తో షెడ్ ఏర్పాటు ఇలా..

నలువైపులా గ్రీన్ షేడ్ నెట్‌ను కప్పిన గదిలో మొలక గడ్డిని పెంచాలి. మొదట చతురస్రాకారంలో కర్రలు, తడికలు లేదా కొబ్బరి మట్టల సహాయంతో ఒక గదిని నిర్మించాలి. ద్వారం కూడా ఏర్పాటు చేయాలి. వాటి చుట్టూ గ్రీన్‌షేడ్ నె ట్‌ను కప్పాలి. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల మధ్య, గాలిలో తేమ 60-65% ఉండేలా చూడడానికి ఇది అవసరం.

5 పాడి పశువులకు 6్ఠ6్ఠ12 అడుగుల షెడ్ నిర్మించాలి. కట్టెలతో షెడ్ వేయడానికి రూ. 1,500, గ్రీన్ షేడ్‌నెట్‌కు రూ. 500, పశువుకు 8 ట్రేల చొప్పున 40 ట్రేలు, నీటి సరఫరా పైపులకు కలిపి రూ. 8,000 చొప్పున మొత్తం రూ. 10 వేలు ఖర్చవుతుంది. 10 పాడి పశువులకు 12X12X12 అడుగుల షెడ్ నిర్మించాలి. 80 ట్రేలు కావాలి. మొత్తం ఖర్చు రూ. 20 వేలవుతుంది.

నానబెట్టి మొలక కట్టాలి..

నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. వీటిని ట్రేలో వేయడానికి ముందు 5 లీటర్ల నీటిలో 100 గ్రాముల సున్నం కలిపి అందులో 10 నిమిషాలు నానబెట్టి రెండు సార్లు శుద్ధి చేయాలి. తర్వాత మంచినీటిలో 24 గంటలపాటు నానబెట్టాలి. నానిన గింజలను గోనె సంచిలో మూటగట్టాలి. 24 గంటల తర్వాత గింజలను ట్రేలో వత్తుగా పోసి.. ట్రేను 50% గ్రీన్ షేడ్ నెట్ చుట్టిన గదిలో పెట్టాలి. ట్రేలో నీరు నిలబడకుండా అడుగున అక్కడక్కడా బెజ్జాలు పెట్టాలి.

రోజుకు 8 సార్లు నీరు చల్లాలి

8 రోజుల పాటు 2-3 గంటలకోసారి రాత్రి పూట 3 సార్లు, పగలు 5 సార్లు ట్రేలలో గింజలను నీటితో తడపాలి. 5-10 పశువులున్న రైతులు రోజ్ క్యాన్ ద్వారా లేదా నాలాను ఏర్పాటు చేసుకొని బాత్రూమ్ షవర్ ద్వారా నీరందించవచ్చు. 10-100 పశువులున్న పెద్ద రైతులు 3/4 ఇంచుల పైపులతో మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీరందించవచ్చు. 2 గంటలకోసారి నీటిని పిచికారీ చేసేలా టైమర్‌ను అమర్చుకోవచ్చు. ఎటువంటి ఎరువూ వేయనవసరం లేకుండానే మొలక గడ్డి పెరుగుతుంది. అయితే, గింజలు వేసిన 6,7 రోజుల్లో 1 లీటరు నీటిలో 20 గ్రాముల యూరియా కలిపి 2% ద్రావణాన్ని తయారు చేసి, ఆ రెండు రోజుల్లో రోజుకోసారి పిచికారీ చేస్తే అధిక మొలక గడ్డి దిగుబడి వస్తున్నదని గుర్తించామని డా. వెంకటరమణ తెలిపారు. విత్తనాలు వేసిన తొమ్మిదో రోజు మొలక గడ్డిని పశువులకు ఏ వేళల్లోనైనా మేపవచ్చు. మహబూబ్‌నగర్ పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మొలక గడ్డి పెంపకం షెడ్డును చూసి స్ఫూర్తిని పొందిన 25 మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తూ అధికాదాయం పొందుతుండడం విశేషం.

- బొక్కలంపల్లి మల్లేష్ మహబూబ్‌నగర్ వ్యవసాయం

పాడి పశువులతోపాటు మేకలకూ మేపొచ్చు!

కరువు కాలంలో పాడి రైతుల ఇబ్బందులు చూడలేక మొలక గడ్డిపై ప్రయోగాలు చేశా. మంచి ఫలితాలు రావడంతో రైతులకు నేర్పించా. ఇప్పటికి 25 మంది రైతులు పెంచుతున్నారు. 6-8 లీటర్ల పాలిచ్చే ఆవుకు లేదా 6 లీటర్ల పాలిచ్చే గేదెకు రోజుకు 10-15 కిలోల మొలకగడ్డి పెడితే.. ఇక దాణా అక్కర్లేదు. కొంత ఎండు మేత వేస్తే చాలు. పొలంలో పచ్చి గడ్డి 90 రోజులకు కోతకొస్తే.. మొలక గడ్డి 9వ రోజే చేతికొస్తుంది. పొలంలేని, కరెంటు లేని నిరుపేదలూ ఈ గడ్డిని పెంచుకొని పాడి పశువులను పోషించుకోవచ్చు. పొట్టేళ్లు, గొర్రెలకు రోజుకు కనీసం 2 కిలోల మొలక గడ్డి వేస్తే మంచిది.
- డా. కోనేటి వెంకట రమణ,
సంయుక్త సంచాలకులు, పశుసంవర్ధక శాఖ,
మహబూబ్‌నగర్ జిల్లా.
ఫోన్: 9989997489, 7702644456
ఇ-మెయిల్: jdahmbnr@gmail.com

ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది!
నాకు ఎకరం పొలముంది. పచ్చిగడ్డి లేక కొన్ని గేదెలు అమ్ముకున్నా. ఇప్పుడున్న 12 గేదెల్లో5 పాలిస్తున్నాయి. డా. వెంకటరమణ చెబితే 2 నెలల నుంచి మొలక గడ్డి పెంచుతున్నా. గేదెకు ఒక పూట దాణా, మరో పూట 10 కిలోల మొలకగడ్డిని మేపుతున్నా. గేదెకు 2 లీటర్ల పాల దిగుబడి పెరిగింది. వారం నుంచే తేడా కనిపించింది. ఖర్చు తగ్గి, ఆదాయం పెరిగింది.

- జిల్లెల వెంకటేష్ (9441542969, 9032138211),
యువ రైతు, చిన్నదర్పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా

సేద్య ‘సంజీవని’!

నిస్సారమైన భూముల పునరుద్ధరణకు బాటలు వేస్తున్న ‘సంజీవని’ ఎరువు
పండ్ల తోటలు.. కూరగాయల సాగుకు చాలా ఉపయోగకరం
విషరహిత ఆహారోత్పత్తికి దోహదపడుతున్న సృజనాత్మక రైతు ఆవిష్కరణ

రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి.. మంచి దిగుబడులు సాధించే క్రమంలో రైతులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఈ బాలారిష్టాలను అధిగమించేందుకు తమ స్థానిక పరిస్థితులు, వనరులకు అనుగుణంగా సృజనాత్మక రైతులు కొత్తదారులు వెదుకుతూనే ఉన్నారు. రైతు స్థాయిలో అటువంటి నిరంతరాన్వేషణలో నుంచి పుట్టినదే ‘సంజీవని’ సేంద్రియ ఎరువు. సృజనాత్మక రైతు విజయకుమార్ ఈ ఎరువు తయారీ పద్ధతిని రూపొందించి, వ్యాప్తిలోకి తెస్తున్నారు. తక్కువ ఖర్చుతో విషరహిత ఆహారోత్పత్తికి కృషి చేస్తున్న రైతులకు ఇది భరోసానిస్తుండడం విశేషం.

భూమాతా.... దీవించమ్మా... తెలియక ఇన్నాళ్లూ మేము తప్పు చేశాం. ఇక నుంచి నీకు బాధ కలిగించం. సేంద్రియ పద్ధతుల్లో నిన్ను సారవంతంగా మార్చుకొని.. నీవందించే ఫలాలు పొంది కుటుంబాలను పోషించుకుంటాం. విషపూరితం కాని సేంద్రియ పంట దిగుబడులను పండించి సమాజానికి అందిస్తామని అంటున్నారు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల ప్రాంత రైతులు. 21 గ్రామాలకు చెందిన 240 మంది రైతులు ‘పున్నమి సేంద్రియ రైతుల సహాయ సహకార సంఘా’న్ని మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకమైన ‘సంజీవని’ సేంద్రియ ఎరువును, ద్రావణాలను సొంతంగా తయారు చేసుకొని పండ్ల తోటలు, కూరగాయల సాగులో వాడుతూ అనేక ఏళ్లుగా చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. వేంపల్లె మండలం టి వెలంవారిపల్లె గ్రామానికి చెందిన సేంద్రియ రైతు, వెన్నెల రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు కొమ్మూరి విజయకుమార్ వీరికి మార్గదర్శకుడిగా నిలిచారు. 4వ తరగతికి మించి చదువుకోనప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి, సేంద్రియ సేద్య పద్ధతులను ఆయన అధ్యయనం చేశారు. వీటి ఆచరణలో ఎదురైన లోటుపాట్లను అధిగమించేందుకు సృజనాత్మక రైతుగా సొంత ఆలోచనతో ‘సంజీవని’ సేంద్రియ ఎరువు తయారీ పద్ధతిని ఆయన రూపొందించారు. ఆరుతడులకు నీటి వసతి ఉన్న పండ్ల తోటలకు, కూరగాయల సాగుకు ఇది బాగా ఉపకరిస్తున్నదని రైతులు చెబుతున్నారు.

కషాయాల కన్నా ద్రావణాలు మిన్న

సాధారణంగా ఔషధ మొక్కల ఆకులను నీటిలో మరగబెట్టి తయారు చేసే కషాయాలను చీడపీడల నియంత్రణకు వాడుతుంటారు. అయితే, ఆకులను నీటిలో ఊరబెట్టి తయారుచేసే ద్రావణాలు ఈ కషాయాలకన్నా ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని విజయకుమార్ అనుభవపూర్వకంగా గుర్తించారు. ఉడికించడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి. ఆకులను, కాయలను, పండ్లను ఊరబెట్టడం(మురగబెట్టడం) మాత్రమే చేస్తాను. ఈ ద్రావణాలను ఆరు నెలల వరకు నిల్వ ఉంచి వాడుకోవచ్చు. పండ్ల తోటలు, పత్తి వంటి పంటల్లో దోమ, రెక్కల పురుగుల నివారణకు పేడ, బెల్లం ద్రావణం ఉపయోగపడుతుందని అంటున్నారాయన. గత ఏడేళ్లుగా రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రైతులకు శిక్షణ ఇస్తున్న విజయకుమార్ సేవలను వివిధ జిల్లాల రైతులు వినియోగించుకుంటుండటం విశేషం.

పొలంలో మట్టికి భిన్నమైన మట్టితో..

ఎకరం పొలానికి సంజీవని సేంద్రియ ఎరువు తయారీకి కావలసినవి: 2 టన్నుల(ట్రాక్టర్) చివికిన పశువుల ఎరువు. ఆవులు/గేదెలు/ఎద్దుల ఎరువు ఏదైనా పనికొస్తుంది. 4 టన్నుల (2 ట్రాక్టర్ల) మట్టి, 50 కిలోల వేప పిండి, 80 కిలోల వేరుశనగ/ఆముదం/కానుగ చెక్క(కొంచెం నూనె ఉన్నది కావాలి), 50 కిలోల బెల్లం (తక్కువ ధరకు దొరికే బంక/నల్లబెల్లం సరిపోతుంది), అన్నీ కలిపి 18 కిలోల మేరకు 9 రకాల ధాన్యాలు. గింజలో రెండు బద్దలుండే పప్పు జాతి, ఒకటే గింజ ఉండే ధాన్యం రకాలు కలిసి ఉండాలి. కొర్రలు, రాగులు, జొన్నలు, పెసలు, కందులు, బుడ్డ శనగలు, ఉలవలు, మినుములు, సజ్జలు వంటివి వాడొచ్చు.

7-8 టన్నుల ముడిపదార్థాలను వాడితే.. 21 రోజులకు సుమారు 12 టన్నుల సంజీవని ఎరువు తయారవుతుంది. ఏ పంటకైనా ఒకసారి ఈ సంజీవని ఎరువు వేస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పోషకాలను అందిస్తుంది. ఏ పొలం కోసం ఈ ఎరువు తయారు చేస్తున్నామో.. ఆ పొలంలోని నేల రకానికి భిన్నమైన రకానికి చెందిన మట్టిని ఈ ఎరువు తయారీకి ఉపయోగించడం ముఖ్యం. అంటే.. ఎర్రమట్టి భూములకు నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములకు ఎర్ర మట్టి, ఇసుక నేలలకు బంక మట్టి, బంక నేలలకు ఇసుక(తువ్వ)మట్టి వాడాలి.

సంజీవని ఎరువును తయారు చేసే పద్ధతి:

తొమ్మిది మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో నీడన బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్లను ఏర్పాటు చేసేటప్పుడు నేలపై మట్టిని కొద్దిగా తొలగించాలి. ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి. సేకరించుకున్న మట్టిని ఒక పొరలాగా వేసుకొని, పానకం చల్లాలి. దానిపై పశువుల ఎరువును 2, 3 అంగుళాల మందాన చల్లాలి. వేరుశనగ/ఆముదం/కానుగ చెక్కను చల్లాలి. దానిపై మళ్లీ బెల్లం పానకం చల్లాలి. ఇలా అనేక దొంతర్లుగా వేస్తూ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్డుపై రోజుకోసారి తగినంత నీరు చల్లుతుండాలి. ఆరో రోజు బెడ్డులో మట్టిని కలియ తిప్పి.. పైన చదునుగా చేయాలి. నవధాన్యాలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత బెడ్లపైన చ ల్లాలి. గింజలు కనిపించకుండా మట్టిని ఎగదోయాలి. మట్టికి తడి ఉండేలా చూసుకోవాలి.21 రోజుల వరకు బెడ్లపైన ఉన్న గింజలు/మొలకలను పక్షులు, కోళ్లు తినకుండా దోమ తెరలాంటి గుడ్డనుగాని, వలనుగాని,షేడ్‌నెట్‌ను గాని ఏర్పాటు చేసుకోవాలి.22వ రోజుకు నవధాన్యాలు బెడ్లపైన మొలిచి ఏపుగా పెరుగుతాయి. సంజీవని ఎరువు వాడకానికి సిద్ధమవుతుంది.

సంజీవని ఎరువు ఎలా వాడాలంటే..

బెడ్లలో తయారైన ఎరువును ఒక వరుస నుంచి కలియబెడుతూ కుప్పగా చేసుకుంటూ, దాన్ని గంపలతో అప్పకటిప్పుడు పంటలకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు ఇరువైపులా కొమ్మల కింద భూమిని నులివేర్లు బయటకు కనపడే వరకు తవ్వి ఈ ఎరువును గాడిలో పోసి పైమట్టిని కప్పాలి. కూరగాయల మొక్కల వద్దనే సంజీవని ఎరువు వేసి మట్టితో కప్పాలి. డ్రిప్ ఉంటే.. డ్రిప్పర్ల దగ్గర వేయాలి. కూరగాయల మొక్కలకు 4 కిలోల చొప్పున వేయాలి. ఏడాది వయసున్న పండ్ల మొక్కలకు 10 కిలోలు వేయాలి. ఆపై ప్రతి ఏడాది వయసుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఉదా: రెండేళ్ల మొక్కకు 20 కిలోలు. వేరుశనగ పంటకైతే.. విత్తనం వేశాక 40 రోజుల్లోపు కలుపు తీసి.. పైరుపై సంజీవని ఎరువును చల్లి నీటి తడి అందిస్తే చాలా చక్కగా పంట ఎదుగుతుంది.

కూరగాయ పంటను తొలగించి మళ్లీ కూరగాయలను పండించాలనుకుంటే.. గతంలో ఉన్న మొక్కల స్థానంలో కాసింత వేప ద్రావణం చల్లి మొక్కను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వరి పొలంలో దమ్ము చేయడానికి ముందు నల్ల నేలైతే ఎకరానికి 4-5 టన్నులు, ఇతర భూములైతే 5-6 టన్నుల సంజీవని ఎరువు వాడాలి. పొలానికి వేయగా మిగిలిన సంజీవని ఎరువును బస్తాల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం పానకం చల్లి.. కలియదిప్పి పొలానికి వేసుకోవచ్చు. టన్ను ఎరువులో 5 కేజీల పేడ, 5 కిలోల బెల్లంను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.
- మాచుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్

ఖర్చు సగం తగ్గింది..!

నాకు రెండెకరాల్లో ఏడేళ్ల నిమ్మ తోట ఉంది. మొదట రెండేళ్లు యూరియా, పురుగుమందులు వాడా. ఐదేళ్ల నుంచి సంజీవని ఎరువు, ద్రావణాలు వాడుతున్నా. యూరియా, పురుగుమందులు వాడిన రైతులకు ఎకరానికి రూ. 40 నుంచి 50 వేలు ఖర్చవుతుంటే, నాకు రూ. 20 వేలు అవుతోంది. సంజీవని ఎరువు, దశపత్ర ద్రావణం తయారు చేసి వాడుతున్నాను. బాగా ఉపగయోగపడుతున్నాయి. ఆకుముడత పోయింది. గజ్జి తెగులు బాగా తగ్గింది. పూత, పిందె బాగున్నాయి. నిమ్మకాయలు అమ్మితే మొదటిసారి రూ. లక్షన్నర, రెండోసారి రూ. 3 లక్షల ఆదాయం వచ్చింది.
- మోడపోతుల రాందాస్
(89784 58872),
సేంద్రియ నిమ్మ రైతు,
వేంపల్లె, వైఎస్సార్ జిల్లా.

దేశంలో ఎన్ని రకాల సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతులున్నా.. మన స్థానిక పరిస్థితులకు అనువైన పద్ధతులను రూపొందించుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు విపరీతంగా వాడి నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేయాలన్నా, సేంద్రియ వ్యవసాయం సత్ఫలితాలనివ్వాలన్నా సంజీవని ఎరువు వాడటం మేలని మా అనుభవంలో తేలింది. సారం ఉన్న భూముల్లో అయితే జీవామృతం సరిపోతుంది. జీవామృతం కన్నా పంచగవ్య మెరుగైన ఫలితాలనిస్తోంది. పంచగవ్యను పంటపై ఏటా 3 దఫాలు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాలొస్తున్నాయి. కషాయాలకు బదులు ద్రావణాలు బాగా పనిచేస్తున్నాయి. విష రసాయనాల వాడకం మానేసే రైతులకు సేవ చేయగలగడం సంతోషాన్నిస్తోంది.
- కొమ్మూరి విజయకుమార్ (98496 48498),
సంజీవని ఎరువుల రూపశిల్పి, సేంద్రియ రైతు, టి వెలంవారిపల్లె, వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా

మట్టిని తాకితే మనసు తేలికపడుతుంది!

దిగులుగా ఉంటున్నదా? అయితే, మట్టిని తాకండి! ఎందుకంటారా.. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు మనోల్లాసాన్ని కలిగిస్తాయని అధ్యయనాల్లో తేలింది! ఒక చెంచా మట్టిలో 5 వేల కోట్లకు పైగా సూక్ష్మజీవులుంటాయట. మైకోబాక్టీరియం వాక్సే అనే సూక్ష్మజీవి వీటిలో ఒకటి. మట్టిలో పనులు చేసే మనుషుల దిగులును తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఎలాగంటారా? సెరొటోనిన్ అనే హార్మోన్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వ్యాకులతను, మనోవ్యధను తగ్గిస్తుంది. అందుకే దీన్ని ‘హేపీ హార్మోన్’ అని పిలుస్తుంటారు. ఇది జంతువులు, మనుషుల్లో సెరొటోనిన్ అనే రసాయనం విడుదలకు సహజ ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కుంగుబాటు ఉపశమనానికి వాడే ప్రొజాక్ వంటి ఔషధాల మాదిరిగానే ఈ సూక్ష్మజీవి కూడా.. హేపీ హార్మోన్ విడుదలకు సహజ ఉత్ప్రేరకంగా పనిచేస్తోందని ప్రయోగాల్లో తేలింది. పొలం పనులు, ఇంటిపంటల పనుల్లో చేతులకు మట్టి అయ్యేలా పనిచేయడం వల్ల మనోల్లాసం కలగడం ఇందుకేనన్నమాట. మట్టి మనుషులకు ప్రకృతి చేదోడుగా నిలుస్తుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణేం కావాలి చెప్పండి..! అంటే.. మట్టిని పలకరిస్తుంటే మనోవ్యాధి దానంతట అదే పరారవుతుందన్న మాట. ప్రకృతి చికిత్స పద్ధతుల్లో రోగి ఒంటిపై మట్టితో పట్టీలు వేయడం, వళ్లంతా మట్టి పూసి స్నానం చేయించడం ఇందుకేనేమో!

ఎండు మట్టే ‘బంగారం’!

భూమిలో నుంచి తవ్వి ఎండబెట్టిన మట్టి (సబ్ సాయిల్) సకల పోషకాలతో కూడిన ఎరువుతో సమానం అంటారు సికింద్రాబాద్ ఆల్వాల్‌కు చెందిన రైతుశాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి. కొన్ని అడుగుల లోతు నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టినే ‘మట్టి ఎరువు’గా వాడే పద్ధతిని ఆవిష్కరించిన ఆయన అనేక దేశాల్లో పేటెంట్ పొందారు. వినూత్నమైన ఈ ‘మట్టి ఎరువు’ సాగు పద్ధతిలో అనేక ఏళ్లుగా వరి, ద్రాక్ష, గోధుమ, కూరగాయ పంటలను ఆయన సాగుచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుందనపల్లిలోని తన సొంత భూమిలో ఈ ఖరీఫ్‌లో బీపీటీ 5204 వంగడం సాగు చేసి ఎకరానికి 36 బస్తాల(75 కిలోలు) ధాన్యం దిగుబడి పొందారు. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు.. నాలుగు దఫాలుగా మట్టి ఎరువును వాడారు. బోరు నుంచి పొలంలోకి పారుతున్న నీటిలో ఈ మట్టిని కలపడం ద్వారా ‘ఒండ్రు నీటి’ని పొలానికి అందిస్తున్నారు. ఇలా సాగైన బియ్యంలో బాలల్లో రేచీకటిని నివారించే ‘విటమిన్ ఎ’ తదితర పోషకాలు నిక్షిప్తమవుతున్నట్లు గతంలో చేయించిన పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని వెంకటరెడ్డి(98668 83336) తెలిపారు(విటమిన్ ఎ కలిగి ఉండే జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’పై భారీ ఖర్చుతో అంతర్థాతీయ స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే). కొద్ది నెలల క్రితం మట్టి ఎరువుతో సాగవుతున్న వెంకటరెడ్డి ద్రాక్ష తోటను సందర్శించిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డా. అయ్యప్పన్ ఇలా అభివర్ణించారు: ‘ఇది భూలోకంలో వైకుంఠం’!

దశపత్ర ద్రావణంతో చీడపీడలకు చెక్

పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులను దశపత్ర ద్రావణం అరికడుతుంది. ప్రధానంగా ఈ ద్రావణం తయారీకి తుంచితే పాలుగారే కొన్ని రకాల ఆకులను వాడాలి. జిల్లేడు, జుట్లపాకు, పలవరేణి, బొప్పాయి, వేప, ముష్టి, తంగేడు, వావిలాకు, కొండ వావిలాకు(నల్లది), వయ్యారిభామ, వెంపలి, వెర్రి మిరప(గబ్బాకు) వాడాలి. చీకాకు, ఉమ్మెత్త ఆకులనూ వాడొచ్చు. ఒక్కో రకం ఆకు ఒక కిలో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. 5 కిలోల పేడ(బర్రె లేదా ఆవు పేడ), 10 లీటర్ల ఆవు లేదా బర్రె మూత్రం, 200 లీటర్ల నీరు తీసుకొని ఒక డ్రమ్ములో పోసి మురగపెట్టాలి.

ఉదయం, సాయంత్రం ఈ ద్రావణాన్ని బాగా కలియబెడుతుండాలి, వారం రోజులపాటు కలియబెట్టి, నిల్వ చేసుకోవాలి. ఈ ద్రావణం తయారైన 6 నెలల వరకు పురుగులు, తెగుళ్ల నివారణకు వాడుకోవచ్చు. పంటకు 25వ రోజు నుంచి, పూతకు ముందు, పిందె ఏర్పడిన తరువాత ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కూరగాయల తోటలకు పిచికారీ చేసే ఒక (12-15 లీటర్ల) డ్రమ్ముకు తొలిసారి పావు లీటరు, తర్వాత రెండుసార్లు అర లీటరు దశపత్ర ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటలకైతే డ్రమ్మునకు అర లీటరు ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి.

చదువుల తల్లి ఒడిలో ఇంటిపంటల కొలువు!

 

ఏడాది పొడవునా ఇంటిపంటలతోనే కూరలు... వెయ్యి చదరపు గజాల
కిచెన్ గార్డెన్‌తో 3 కుటుంబాలకు పూర్తిస్థాయిలో కూరగాయలు
ఇంటి నుంచి బడికి పాకిన ఇంటిపంటలు.. స్కూలు విద్యార్థులకూ శిక్షణ

పచ్చని ఆకుకూరలు, కూరగాయ మొక్కలు నిండుగా కొలువుదీరిన ఇంటిపంటల దర్బారు ఆ రెండంతస్తుల మేడ పైకప్పు. ఆకుపచ్చని జీవన శైలిని నెత్తికెత్తుకున్న ఆ కుటుంబం ఏడాది పొడవునా స్వచ్ఛమైన, తాజా ఇంటిపంట దిగుబడులపైనే ఆధారపడుతూ నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తోంది. ముచ్చటగొలిపే ఇంటిపంటల సాగును స్కూలు విద్యార్థులకూ నేర్పిస్తుండడం విశేషం. ‘రసాయనాలతో విషతుల్యం కాని సహజ ఇంటిపంటలను ఇక మీరూ పండించుకోండ’ంటూ వారి కిచెన్ గార్డెన్ చూపరుల మదిలో ఆకుపచ్చని ఆలోచనను మొలకెత్తిస్తున్నాయి!

ఆరోగ్యదాయకమైన జీవనశైలికి సేంద్రియ ఇంటిపంటల సాగును జోడించినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని ఆచరణాత్మకంగా చాటి చెబుతోంది హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు చెందిన దుబ్బాక దయాకర్‌రెడ్డి కుటుంబం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరెడలో పుట్టిన దయాకర్‌రెడ్డి నగరానికి వచ్చిన కొత్తల్లో ఆల్విన్‌లో కొంతకాలం పనిచేశారు. ప్రగతినగర్ రూపశిల్పుల్లో ఒకరైన ఆయన స్థానిక ఎంపీటీసీగా, ప్రగతి సెంట్రల్ స్కూల్‌కు కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

దృఢమైన సంకల్పం, ఆరోగ్యంపై శ్రద్ధ మెండుగా ఉంటే.. మహానగరంలో నివాసం ఉంటూ కూడా.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా ఇంటిపట్టునే పండించుకోవచ్చని దయాకర్‌రెడ్డి కుటుంబం రుజువు చేస్తోంది. మేడపైన వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇంటిపంటలు పండిస్తున్నారు. ఇటుకలతో నిర్మించిన 8 బెడ్స్, గుండ్రటి సిల్పాలిన్ బెడ్లు పది, వందకుపైగా పెయింట్ డబ్బాలూ వాడుతున్నారు. 8 రకాల ఆకుకూరలు, 6 రకాల కూరగాయలు, బీర, సొర, కీరతోపాటు బీట్‌రూట్, క్యారట్ కూడా పండిస్తున్నారు. టై మొత్తానికీ 8 అడుగుల ఎత్తులో అమర్చిన ఇనుప ఫ్రేమ్‌కు సొర, బీర తీగలను పాకిస్తున్నారు. ఎండాకాలంలో షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతోంది. ఎర్రమట్టి 40% + కొబ్బరి పొట్టు 40% + పశువుల ఎరువు 20% కలిపిన మట్టిమిశ్రమాన్ని వాడుతున్నారు. తగినంత నీరు పోయడం తప్ప వేటినీ పిచికారీ చేయడం లేదని, జీవామృతం వాడదామని అనుకుంటున్నామని దయాకర్‌రెడ్డి తెలిపారు. దయాకర్‌రెడ్డి భార్య అరుణ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కుమారుడు డా. రాహుల్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నారు. తీరిక వేళల్లో ఇంటిపంటల పనులతో రిలాక్స్ అవడం కుటుంబ సభ్యులందరికీ ఎంతిష్టమో మొక్కల పచ్చదనమే చాటిచెబుతోంది.

- పంతంగి రాంబాబు
ఫొటోలు: మిరియాల వీరాంజనేయులు

ఏడాది పొడవునా ఇంటి కూరలే!

మా టై కిచెన్ గార్డెన్‌లో అన్ని కాలాల్లోనూ పూర్తిగా ఆధారపడదగిన రీతిలో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం. 3 చిన్న కుటుంబాలకు పూర్తిస్థాయిలో, మరో కుటుంబానికి పాక్షికంగా సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు అందుతున్నాయి. ఎండాకాలంలోనూ 2 కుటుంబాలకు అందాయి. చాలా మంది బంధుమిత్రులు చూసి వెళ్తున్నారు. నలుగురైదుగురు తమ ఇళ్లపైన సాగు చేస్తున్నారు. ఇటుకలతో పక్కా బెడ్స్ నిర్మించటం కన్నా.. అటూ ఇటూ మార్చుకోవడానికి వీలయ్యే సిల్పాలిన్ బెడ్సే ఉపయోగకరం. ఆరోగ్యదాయకమైన ఇంటిపంటల సాగును మా స్కూల్ విద్యార్థులకూ నేర్పిస్తున్నాం.
- దుబ్బాక దయాకర్‌రెడ్డి (93910 08248), ప్రగతినగర్, హైదరాబాద్

తూటి కషాయంతో చీడ పీడలు దూరం

 

శక్తిమంతమైన కీటకనాశినిగా గుర్తించిన విదర్భ కేవీకే

వ్యవసాయ పెట్టుబడిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులదే సింహ భాగం. వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో పైరు పెట్టడం కంటే దాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ రంగంలోని సృజనశీలురు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తూటేరు (ఇంపోమియా ఫిస్టులోసా) లేదా తూటి ఆకుల కషాయం శక్తివంతమైన కీటకనాశినిగా గుర్తించారు.

తూటేరును లొట్టపీచు, కాంగ్రెస్ కంప, బేషరమ్ అని కూడా తూటి మొక్కను పిలుస్తారు. కంది, మినుము, పత్తి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, వంగ తదితర పురుగుల బెడద ఎక్కువగా ఉండే అన్ని పంటల సస్యరక్షణకు ఈ కషాయం వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నారు. క్యాబేజీ పంటను తీవ్రంగా నష్టపరిచే డైమండ్ బ్యాక్ మాత్‌పై తూటేరు కషాయం పిచికారీ చేస్తే పంట నష్టం కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

అయితే, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు పంట నష్టం దాదాపు 11 నుంచి 12 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తూటేరు కషాయ వినియోగం విదర్భ ప్రాంతం అంతటా వ్యాపించింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్ల తోటలు సాగుచేసే రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఆ ప్రాంత రైతుల సామూహిక ప్రయోగాల ఫలితంగా తూటేరు కషాయం పత్తిలో కాయతొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, తలనత్త పురుగు, పచ్చపురుగు, రాగిలద్దె పురుగు, డైమండ్ బ్యాక్ మాత్, గొంగళి పురుగు, ముక్కుపురుగులను కాండం తొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించడానికి శక్తివంతంగా పనిచేస్తోందని తేలింది.
తూటి కషాయం తయారీ విధానం: ఒక కిలో తూటేరు లేత ఆకులను సేకరించాలి. ఆకులను మెత్తటి ముద్దగా నూరి.. 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లకు తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన కషాయానికి మరో అర కిలో తూటేరు ఆకుల ముద్దను కలిపి.. కషాయం సగానికి తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన 2.5 లీటర్ల కషాయాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. 2.5 లీటర్ల కషాయాన్ని 200 లీటర్లలో కలపాలి. లీటరు కషాయానికి 0.5 మిల్లీ లీటర్ల చొప్పున ఎమల్సిఫయర్‌ను కలిపిన తర్వాత పిచికారీ చేసుకోవాలి.

కాయకల్ప చికిత్స ప్రకృతి సేద్య కళతో పునరుజ్జీవనం!

ప్రకృతి వ్యవసాయోద్యమంలో కలిసి పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వరి

పకృతి సేద్య కళను ఉద్యమ స్ఫూర్తితో రైతులకందిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ
అన్నదాతల ఆత్మహత్యల్లేని ఆరోగ్యదాయక సమాజం కోసం విస్తృతంగా రైతు శిక్షణ శిబిరాలు
6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయులకు శిక్షణతో ఊరూరా శిబిరాలు.. ఉచిత కాల్‌సెంటర్..
{పకృతి వ్యవసాయ పంచాంగం రూపకల్పన.. రైతుల భాగస్వామ్యంతో స్వతంత్ర మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు యత్నాలు
తెలుగునాట రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయ విప్లవం తథ్యం.. ఐదేళ్లలో పూర్తిగా రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పతి సాధ్యమే..
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల సారథి పులిమామిడి రామకృష్ణారెడ్డి వెల్లడి

తెలుగునాట సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న అన్నదాతలకు ప్రకృతి వ్యవసాయాన్ని ‘జీవన కళ’తో మేళవించి అందిస్తోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఆధ్యాత్మిక సంస్థ. రైతుల జీవితాలను, భూములను పునరుజ్జీవింపజేయడానికి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా సులువుగా సాధ్యమవుతుందని ఏఒఎల్ విశ్వసిస్తున్నదని తెలుగు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు పులిమామిడి రామకృష్ణారెడ్డి (98490 57599) ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించిన పారిశ్రామికవేత్త రామకృష్ణారెడ్డి ఏఓఎల్‌కు ఎనిమిదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అప్పులు, ఆత్మహత్యల్లేని వ్యవసాయాన్ని రైతులు.. విషరహిత ఆహారాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే గత ఆర్నెల్లుగా ‘రుషి కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ఇస్తు న్నామని చెప్పారు. మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుందంటూ.. జీవన కళతో మేళవించిన వ్యవసాయ శిక్షణ సత్ఫలితాలనిస్తున్నదన్నారు. ఇలాఉండగా, హైదరాబాద్‌కు చెందిన చక్కిలం ఉమామహేశ్వరి(90004 08907) ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యకలాపాలను సమన్వయపరుస్తున్నారు. బ్యాంకులో ఉన్నతోద్యాగాన్ని పదేళ్లు ముందే వదిలేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు ఆమె పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆవుల జాడే లేదని, వయసులో ఉన్న వారు పొట్టచేతపట్టుకొని పట్నాలకు వలస పోగా వృద్ధులే గ్రామాల్లో మిగిలారన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చే శక్తి ప్రకృతి సేద్యానికే ఉందని ఆమె విశ్వసిస్తున్నారు.

వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి సేద్యమే పరిష్కారమా?

అవును. యూరప్‌కు రెండు, మూడు వేల ఏళ్లు, అమెరికాకు రెండొందల ఏళ్లకు క్రితమే వ్యవసాయం తెలుసు. మనది పది వేల ఏళ్ల నాటి సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి. మన దేశప్రజల డీఎన్‌ఏలోనే వ్యవసాయ సంస్కృతి ఉంది. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం వల్ల ఈ సంస్కృతి ధ్వంసమైంది. 30 శాతం సాగు భూమి నిస్సారమైపోవడమో, చౌడుదేలడమో అయ్యింది. ఇప్పుడు తిరిగి ప్రకృతి వ్యవసాయ సంస్కృతిని అలవరచుకోవడమే సంక్షోభానికి పరిష్కారం.

పకృతి సేద్యంపై శిక్షణ ఇచ్చే క్రమంలో అవరోధాలను ఎలా అధిగమిస్తున్నారు?

మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుంది. అలవాటు లేని ప్రకృతి సేద్య పద్ధతి గురించి తెలియజెప్పడానికి ముందు జీవన కళ గురించి పరిచయం చేస్తున్నాం. టన్నుల కొద్దీ పశువుల ఎరువు అవసరం లేని, దుక్కి అవసరంలేని, స్వల్ప ఖర్చుతో చేసుకునే పాలేకర్ పద్ధతిని తెలియజెపుతున్నాం. ఒక ఆవు ద్వారా 10-15 ఎకరాల్లో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు తయారు చేసుకునే పద్ధతులు నేర్పిస్తున్నాం. ఆవును కొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు.. ఆరు నెలల్లో ఆవు ఖరీదు తిరిగొచ్చేస్తోంది. రైతుల ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణకు స్పందించని రైతులు సైతం మా శిక్షణకు స్పందిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాం.

శిక్షణ పొందిన రైతులకు ఎటువంటి తోడ్పాటునందిస్తారు?

ఒకసారి శిక్షణ పొందిన రైతు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో జీవిత సభ్యుడవుతాడు. ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఉచిత కాల్‌సెంటర్‌ను రెండు నెలల్లో ఏర్పాటు చేస్తున్నాం. 24 మంది శాస్త్రవేత్తల బృందం నిరంతరం అన్ని భాషల్లోనూ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. కరువు బారిన పడకుండా వ్యవసాయం చేసే మెలకువలతో కూడిన ‘ప్రకృతి వ్యవసాయ పంచాగం’ సిద్ధమవుతోంది. మారిన వాతావరణాన్ని బట్టి వ్యవసాయ పనులు 1 లేదా 2 కార్తెలు ముందుకు జరగాలన్నది మా అభిప్రాయం. వర్షాల తీరు మారింది. స్థానికంగా చెట్లు, అడవి ఎక్కువగా ఉన్న చోటే కురుస్తున్నాయి. శాస్త్రబద్ధమైన ఈ విషయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ద్వారా.. వారిలో చెట్ల పెంపకం, చెట్ల జాతులతో కలిపి వార్షిక పంటలు పండించడంపై ఆసక్తిని పెంచుతున్నాం. భూసారం పెంపుదల, చౌడు భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవడం ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారానే సాధ్యం.. వీటన్నిటినీ నిరంతరం సమన్వయం చేయడానికి శ్రీశ్రీ కిసాన్ సంఘాలను, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం.

రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ అందేదెలా?

మా సంస్థకు విస్తృతమైన యంత్రాంగం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే నైపుణ్యం, దాతల మద్దతు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇచ్చేదిశగా కదులుతున్నాం. జూన్ నుంచి వారానికో శిబిరం నిర్వహిస్తున్నాం. రాబోయే 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి సేద్యం నేర్పించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఎందరో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించారు. వీరి అనుభవాలు చెప్పించి రైతుల్లో పూర్తి భరోసా కలిగిస్తున్నాం. ప్రతి గ్రామంలో కొందరికి సరిగ్గా నేర్పితే చాలు.. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకుంటారు. విరాళాలు, ప్రభుత్వ తోడ్పాటుతో రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇస్తాం. ఏదేమైనా ఐదేళ్లలో 100% విష రసాయనాల అవశేషాల్లేని ఆహారోత్పత్తి జరిగేలా చూడాలన్నది మా లక్ష్యం. సహజాహారంపై చైతన్యం వినియోగదారుల్లోనూ పెరుగుతోంది.
{పకృతి వ్యవసాయదారుల మార్కెటింగ్ సమస్యలపై మీ అభిప్రాయం?

వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వారికి ఖర్చు తగ్గింది. ఆదాయం పెరిగింది. సరుకును మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన బాధే లేదు. మంచి ఆహారం కావాల్సిన వాళ్లు రైతుల ఇళ్లకొచ్చి కొనుక్కెళ్తున్నారు. రైతుల భాగస్వామ్యంతో విశ్వసనీయమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. రైతులకు నిరంతరం అండగా ఉండి నడిపించేందుకు ఏ లోటూ లేకుండా చూస్తున్నాం.

పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం!

 

ఇంటిపంటల సాగులో దేశంలోనే బెంగళూరు ముందంజ
10 వేల మందికిపైగా శిక్షణ ఇచ్చిన శాస్త్రవేత్త డా. విశ్వనాథ్

‘పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినేదాన్నే పండిద్దాం’ ఇదీ బెంగళూరులోని సేంద్రియ ఇంటిపంట ప్రేమికుల లక్ష్యం. గార్డెన్ సిటీగా పేరొందిన ఈ నగరంలో విషరహిత ఆహారంపై మక్కువ కలిగిన సుమారు 5 వేల మంది ఇప్పుడు ఇంటిపంటల సాగులో నిమగ్నమయ్యారు. దేశంలోనే ఇది రికార్డు. ఇందుకు పునాది వేసిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. విశ్వనాథ్. ఇంటిపంటల వ్యాప్తికి పాటుపడిన తొలి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన గణుతికెక్కారు.

నగరీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో పొలాలు మేడలవుతుంటే.. మేడల పైన ఖాళీ స్థలాలు పొలాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది బెంగళూరు నగరం. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బీ ఎన్ విశ్వనాథ్ కడూర్ ఇందుకు ఆద్యుడు. బెంగళూరు పరిసరాల్లోని మైలసంద్ర గ్రామంలో వ్యవసాయక కుటుంబంలో జన్మించిన డా. విశ్వనాథ్ వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ పొంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటకశాస్త్ర నిపుణుడిగా 16 ఏళ్లు పనిచేశారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి హాలీవుడ్‌లో శిక్షణ పొందాక వ్యవసాయంపై డాక్యుమెంటరీ తీశారు. జీవన ఎరువుల పరిశ్రమ కొన్నాళ్లు నిర్వహించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మేడ మీద సేంద్రియ ఇంటిపంటల సాగు వైపునకు విశ్వనాథ్ దృష్టి మళ్లింది. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌పై 1995లో బెంగళూరు ఐఐటీలో తొలి వర్క్‌షాప్ నిర్వహించారు. డా. వీరేష్ వంటి స్నేహితులతో కలిసి అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌ను నెలకొల్పి.. సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సమావేశాన్ని, టై ఫార్మింగ్‌పై తొలి అంతర్జాతీయ మహాసభను నిర్వహించారు.

మట్టి + కంపోస్టు + వర్మీ కంపోస్టు + కొబ్బరి పొట్టు

శిక్షణ పొందే వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అవగాహన కల్పించడంతోపాటు.. మట్టి, కంపోస్టు/పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కొబ్బరి పొట్టులను సమపాళ్లలో కలిపి మట్టి మిశ్రమంతో కుండీలను సిద్ధం చేయడం వంటి పనులను స్వయంగా నేర్పిస్తారు. అతి తక్కువ చోటుండే బాల్కనీల్లోనూ పెంచుకోదగిన ‘పైప్ గార్డెన్’లలో ఆకుకూరలు, కూరగాయ మొక్కలు, ఔషధ మొక్కలను పెంచే పద్ధతులు నేర్పిస్తున్నారు.

‘ఊట ఫ్రం యువర్ తోట’..!

పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం! అనే నినాదంతో డా. విశ్వనాథ్ మిత్రులు డాక్టర్ జయరాం, డాక్టర్ రాజేంద్ర హెగ్డేతో కలిసి 2011లో ‘గార్డెన్ సిటీ ఫార్మర్స్’ (జ్చటఛ్ఛీ ఛిజ్టీడజ్చటఝ్ఛటట.ౌటజ) అనే ట్రస్టును ప్రారంభించారు. ఆర్గానిక్ టై గార్డెనింగ్ (ఓటీజీ) పేరుతో ఈ సంస్థ ప్రారంభించిన ఫేస్‌బుక్ బృందంలో 20 వేలకు పైగా సభ్యులున్నారు. ‘ఊట ఫ్రం యువర్ తోట’ (మీ గార్డెన్ నుంచి ఆహారం) పేరుతో సేంద్రియ సంతలు అడపా దడపా నిర్వహిస్తున్నారు. తమ అవసరాలకు మించి ఇంటిపంటలు పండించే నగరవాసులు, వినియోగదారులు ఈ సంతల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌కు పెద్ద దిక్కుగా నిలిచిన డా. విశ్వనాథ్ కృషి ఫలితంగానే నేడు ఈ రంగంలో బెంగళూరు దేశంలోనే ముందంజలో నిలిచింది.
- ఇంటిపంట డెస్క్

‘పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినేదాన్నే పండిద్దాం’ ఇదీ బెంగళూరులోని సేంద్రియ ఇంటిపంట ప్రేమికుల లక్ష్యం. గార్డెన్ సిటీగా పేరొందిన ఈ నగరంలో విషరహిత ఆహారంపై మక్కువ కలిగిన సుమారు 5 వేల మంది ఇప్పుడు ఇంటిపంటల సాగులో నిమగ్నమయ్యారు. దేశంలోనే ఇది రికార్డు. ఇందుకు పునాది వేసిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. విశ్వనాథ్. ఇంటిపంటల వ్యాప్తికి పాటుపడిన తొలి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన గణుతికెక్కారు.

నగరీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో పొలాలు మేడలవుతుంటే.. మేడల పైన ఖాళీ స్థలాలు పొలాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడలపైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నది బెంగళూరు నగరం. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బీ ఎన్ విశ్వనాథ్ కడూర్ ఇందుకు ఆద్యుడు. బెంగళూరు పరిసరాల్లోని మైలసంద్ర గ్రామంలో వ్యవసాయక కుటుంబంలో జన్మించిన డా. విశ్వనాథ్ వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ పొంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటకశాస్త్ర నిపుణుడిగా 16 ఏళ్లు పనిచేశారు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి హాలీవుడ్‌లో శిక్షణ పొందాక వ్యవసాయంపై డాక్యుమెంటరీ తీశారు. జీవన ఎరువుల పరిశ్రమ కొన్నాళ్లు నిర్వహించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మేడ మీద సేంద్రియ ఇంటిపంటల సాగు వైపునకు విశ్వనాథ్ దృష్టి మళ్లింది. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌పై 1995లో బెంగళూరు ఐఐటీలో తొలి వర్క్‌షాప్ నిర్వహించారు. డా. వీరేష్ వంటి స్నేహితులతో కలిసి అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌ను నెలకొల్పి.. సేంద్రియ వ్యవసాయంపై అంతర్జాతీయ సమావేశాన్ని, టై ఫార్మింగ్‌పై తొలి అంతర్జాతీయ మహాసభను నిర్వహించారు.

మట్టి + కంపోస్టు + వర్మీ కంపోస్టు + కొబ్బరి పొట్టు

శిక్షణ పొందే వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో అవగాహన కల్పించడంతోపాటు.. మట్టి, కంపోస్టు/పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కొబ్బరి పొట్టులను సమపాళ్లలో కలిపి మట్టి మిశ్రమంతో కుండీలను సిద్ధం చేయడం వంటి పనులను స్వయంగా నేర్పిస్తారు. అతి తక్కువ చోటుండే బాల్కనీల్లోనూ పెంచుకోదగిన ‘పైప్ గార్డెన్’లలో ఆకుకూరలు, కూరగాయ మొక్కలు, ఔషధ మొక్కలను పెంచే పద్ధతులు నేర్పిస్తున్నారు.

‘ఊట ఫ్రం యువర్ తోట’..!

పండించుకున్న ఆహారాన్నే తిందాం.. తినే ఆహారాన్నే పండిద్దాం! అనే నినాదంతో డా. విశ్వనాథ్ మిత్రులు డాక్టర్ జయరాం, డాక్టర్ రాజేంద్ర హెగ్డేతో కలిసి 2011లో ‘గార్డెన్ సిటీ ఫార్మర్స్’ (జ్చటఛ్ఛీ ఛిజ్టీడజ్చటఝ్ఛటట.ౌటజ) అనే ట్రస్టును ప్రారంభించారు. ఆర్గానిక్ టై గార్డెనింగ్ (ఓటీజీ) పేరుతో ఈ సంస్థ ప్రారంభించిన ఫేస్‌బుక్ బృందంలో 20 వేలకు పైగా సభ్యులున్నారు. ‘ఊట ఫ్రం యువర్ తోట’ (మీ గార్డెన్ నుంచి ఆహారం) పేరుతో సేంద్రియ సంతలు అడపా దడపా నిర్వహిస్తున్నారు. తమ అవసరాలకు మించి ఇంటిపంటలు పండించే నగరవాసులు, వినియోగదారులు ఈ సంతల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టై ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌కు పెద్ద దిక్కుగా నిలిచిన డా. విశ్వనాథ్ కృషి ఫలితంగానే నేడు ఈ రంగంలో బెంగళూరు దేశంలోనే ముందంజలో నిలిచింది.

మేకల పెంపకం లాభదాయకం

 

వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి, సేద్యం చేయలేని పరిస్థితులు తలెత్తాయి. ఒక వేళ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతోంది. పైగా జిల్లాలో అతివృష్టి, అనావృష్టి సమస్య ైరె తులను నిత్యం వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జీవాల పెంపకంపై దృష్టిసారిస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని, ముఖ్యంగా మేకల పెంపకం మంచి ఆదాయాన్నిస్తుందని పశుసంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ ఎన్ రజనీకుమారి పేర్కొన్నారు. మేకల పెంపకంలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆమె ‘సాక్షి ’కి వివరించారు.

మేకలను ఇలా మేపుకోవచ్చు
మేకలు స్వల్ప ఆహారం ఎక్కువసార్లు తీసుకుంటాయి. త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడా మేతను అందించాలి. రోజుకు 8-10 గంటల వరకు మేకలను మేపాల్సి ఉంటుంది. మేకలు ఉంచే ప్రాంతం చుట్టూ ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. ఇవి ఎక్కువగా ఆకులు, అలములు, పండ్లు, తొక్కలు, కూరగాయల ఆకులను తింటాయి. అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప, సుబాబుల్ మొదలైనవి నాటుకుని వాటి నుంచి ఆకులను కోసి మేపుతుండాలి. వీటితోపాటు కాయ జాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్స్ మొదలైనవి పెంచాలి. పచ్చి మేత వేసేటప్పుడు మూడు కిలోల ఇతర పశుగ్రాసాలను ఇవ్వాలి.

పిల్లల పోషణ ఇలా..
మేక పిల్లల పోషణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై పొరలను తీసివేయాలి. బొడ్డుకు టింకర్ అయోడిన్ పూయాలి. పిల్లలను ఉంచిన ప్రదేశంలో 10 శాతం ఫినాయిల్ చల్లాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు తాగించాలి. ముర్రుపాలు బాగా తాగిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు పాలు తాగించాలి. మొదటిసారి ముర్రుపాలను పుట్టిన ఆరుగంటల వ్యవధిలో తాగించాలి.

రెండు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలి. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. రెండు వారాల సమయంలో 10 గ్రాముల దాణా ఇవ్వాలి. పిల్లల షెడ్ లేదా పాక శుభ్రంగా ఉంచాలి. అలా చేయకపోతే పిల్లలు నేలను నాకి అనారోగ్యానికి గురవుతాయి. షెడ్లు లేదా పాకల్లో ఉప్పు లవణ మిశ్రమ ఇటుకలు ఏర్పాటు చేయాలి. ముందు జాగ్రత్తగా రోగాలు రాకుండా టీకాలు వేయించాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం, నూక, జొన్నలు, లవణ మిశ్రమం ఉండేలా చేయాలి.

విత్తన మేకపోతుల పెంపకం
విత్తన మేకపోతులను ప్రత్యేకంగా పెంచాలి. వసతి కల్పించాలి. ఒక్కోదానికి 300 గ్రాముల మిశ్రమ దాణా ఇవ్వాలి. మేకలను దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రాములు ఇవ్వాలి. రోజూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. పోతులు, పెద్ద మేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 శాతం మొక్కజొన్నలు, 50 శాతం వేరుశనగ పిండి, 20 శాతం గోధుమ పొట్టు, 20 శాతం తవుడు, 18 శాతం బియ్యం నూకలు, జొన్నలు, సజ్జలు, రెండు శాతం లవణ మిశ్రమం, ఒక భాగం ఉప్పు ఉండాలి. స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించి కావాల్సిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమం తయారు చేసుకోవచ్చు.

సకాలంలో టీకాలు వేయించాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు ఉండే ప్రాంతాల్లో మేపాలి. ఈ పరిస్థితుల్ల తినే గడ్డి, ఇతర ఆకులతో పాటు ఏలిక పాములు, బద్దె పురుగులు వాటి శరీరంలో చేరి పోషకాల్ని పీల్చి పిప్పి చేస్తాయి. దీంతో మేకలు అనారోగ్యానికి గురై మరణించే ప్రమాదం ఉంది. సకాలంలో టీకాలు వేయించాలి. మూడు నెలలు దాటిన తర్వాత పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి. ఇంకా పేలు, పిరుదులు, గోమార్లు మొదలైనవి శరరీంలో రక్తాన్ని పీల్చుతాయి. వీటి నివారణకు పశువైద్యాధికారిని సంప్రదించి వారు సూచించిన మందులను వాడాలి. మందులను శరీరానికి పిచికారీ చేసినప్పటి నుంచి ఆరిపోయే వరకు మూతులకు చిక్కంలాగా ఉట్టి లాంటి తాడు కట్టాలి. అలా చేయకపోతే మందును నాలుకతో నాకే ప్రమాదం ఉంది.

ఇక్కట్లు లేని ‘ఇంటిపంట’లకు దారిది!

 

ఇంటి పంట

ఆరవై నాలుగు కళల్లో వ్యవసాయం ఒక అద్భుతమైన కళ. ఆయా కళలు ఇంద్రియానుభూతులను సంతుష్టి పరిస్తే.. వ్యవసాయ కళ అన్ని ఇంద్రియాలకూ ఇంధనమైన అన్నాన్ని ఆర్జించి పెడుతుంది. అందుకే వ్యవసాయం అద్భుతమయింది. ఆధునికత పేర వచ్చిన మార్పులు టన్నులకొద్దిగా దించిన రసాయనాలు ఇప్పుడు నింగిని, నేలనే కాదు తినే తిండిని కూడా విషతుల్యంగా మార్చాయి. ఈ నేపథ్యంలో గ్రామసీమల్లో ప్రకృతి వ్యవసాయం, పట్టణ ప్రాంతాల్లో ఆర్గానిక్ అర్బన్ ఫార్మింగ్ క్రమంగా ఉద్యమ రూపం తీసుకుంటున్నాయి. ‘ఇంటిపంట’ల సాగుదారులకు అందుబాటులో ఉన్న వనరులతో చేపట్టే సస్యరక్షణ పద్ధతులనందించి వారి కృషికి తోడ్పడడమే ఈ వ్యాసం ఉద్దేశం. సేంద్రియ ఇంటిపంటలు సాగుచేసే మిత్రులు దృష్టిలో ఉంచుకోదగిన ముఖ్యవిషయం: చీడపీడల నివారణ కాదు నియంత్రణే ప్రధానం. మొక్కలను చీడపట్టిన తరువాత, తెగుళ్లు సోకిన తరువాత నివారణ చర్యలను చేపట్టడం కాకుండా.. మొక్కలు వేసింది మొదలు క్రమానుగతంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి.

‘జనరల్ పర్పస్ స్ప్రే’

‘జనరల్ పర్పస్ స్ప్రే’ తయారీకి కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ 1 మిరపకాయ 1 వెల్లుల్లి గడ్డ 1
ఈ మూడింటినీ మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి. వడకట్టి ద్రావణంలో 1:5 రెట్ల నీరు కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసే ముందు చిటికెడు సర్ఫ్ పొడి కలిపితే మొక్క ఆకులకు మందు అంటుకోవడానికి ఉపయోగపడుతుంది.

సబ్బు నీరు: సబ్బు నీరు పిచికారీతో పచ్చదోమ, తెల్లదోమ, పాకుడు పురుగులు, పిండి నల్లి, ఆకు దొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారదోలవచ్చు. తయారీ విధానం: 30 గ్రాముల బార్ సబ్బును సన్నగా తురుము కోవాలి. (డిటర్జెంట్ కాదు) దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

వెల్లుల్లి రసం: గొంగళి పురుగు, క్యాబేజీ ఫ్లై, దోమలు, నత్తలు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. దీనికి తోడు ఆకు ముడత, ఆకు మచ్చలు, తేనే మంచు, బూడిద తెగులును నిరోధిస్తుంది. తయారీ విధానం: 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి రెండు చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లీ లీటర్ల నీటిలో నానబెట్టాలి. రెండు రోజుల తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బుపొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి.

వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం: ఇది వెల్లుల్లి రసం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుంది. తయారీ విధానం: 10 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చి మిరపకాయలు, 3 ఓ మోస్తరు ఉల్లిపాయలు మెత్తగా రుబ్బుకొని మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి మరిగించాలి. రెండు, మూడు పొంగుల తరువాత దించి చల్లారనివ్వాలి. వడపోసుకున్న ద్రావణాన్ని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. పిచికారీ మోతాదు: ఒక కప్పు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి ఒక షాంపూ ప్యాకెట్ లేదా కుంకుడు రసం లేదా పచ్చి పాలు కొంచెం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత వచ్చిన మొక్కలకు వరుసగా వారం రోజుల పాటు పిచికారీ చేసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది.

పచ్చిపాల ద్రావణం: పచ్చిపాల ద్రావణం బూడిద తెగులుపై బాగా పనిచేస్తుంది. పచ్చి పాలను రెట్టింపు నీటితో కలిపి పిచికారీ చేస్తే వైరస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా మొజాయిక్ వైరస్‌పై ఇది బాగా పనిచేస్తుంది.

పుల్ల మజ్జిగ: నాలుగైదు రోజులు పులియబెట్టాలి. ఈ పుల్ల మజ్జిగను ఒకటికి తొమ్మిది పాళ్లు నీరు కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ వివిధ కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను నశింపజేస్తుంది.

కీటకాల రసం: పంట మీద ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే.. ఆ పురుగులు కొన్నిటిని ఏరి రెండు కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రసాన్ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి.దవనం ఆకుల కషాయం: ఒక లీటర్ నీటిలో గుప్పెడు దవనం ఆకులను కలిపి మరిగించాలి. ఈ కషాయానికి రెట్టింపు నీరు చేర్చి పిచికారీ చేస్తే దోమ, పెంకు పురుగు, నత్తలు, క్యాబేజీ తొలిచే పురుగులు వైదొలగుతాయి.

ఉప్పు నీళ్ల స్ప్రే: 60 గ్రాముల ఉప్పు, 2 చెంచాల సబ్బు పొడి, 4.5 లీటర్ల గోరు వెచ్చటి నీటిలో బాగా కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణం క్యాబేజీని తొలిచే పురుగులపై బాగా పనిచేస్తుంది.

ఎప్సమ్ సాల్ట్: వైరస్ ఆశించిన మొక్కల ఆకులు పచ్చగా మారి బలహీన పడతాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పండుటీగ నిరోధక ద్రావణం: 15 లీటర్ల నీటిలో ఒక కిలో పంచదార వేసి కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించిన నీటితోపాటు.. ఒక లీటరు బెల్లం ద్రావణం లేదా డయటోమసియా ఎర్త్ లేదా పుట్టమన్నును కరిగించి.. వడకట్టి నీరు కలిపి పిచికారీ చేయాలి. పలుమార్లు పిచికారీ చేస్తే పండుటీగ హాని తొలగిపోతుంది.
- జిట్టా బాల్‌రెడ్డి

సహజ ‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు!

సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన వివరిస్తున్నారు.

జీవామృతం

కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచితం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, మగ్గిన అరటిపండ్లు 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము.

తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. డ్రమ్ములో వేసి చేతితో బాగా కలపాలి. తరువాత ఆవు పంచితం వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రమ్ములో వేసి 35 లీటర్ల నీటిని పోయాలి. దీన్ని నీడలోనే ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి వైపు తిప్పుతూ కలపాలి. 4వ రోజు నుంచి వాడొచ్చు.

వాడే విధానం: 7-10 రోజుల్లోగా జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు లేదా పిచికారీ చేయొచ్చు.
ఘన జీవామృతం

కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు పంచితం తగినంత.
తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు పంచకం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు.
వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు చైతన్యవంతమవుతాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి.

వేపకషాయం

కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, నాటు ఆవు పంచితం అర లీటరు.

తయారీ విధానం: మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచితం చేతితో కలిపి, 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో
రోజున వస్త్రంతో వడబోసి వాడుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.
కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్)

కావలసిన పదార్థాలు:

పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచితం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.

తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు ఊరబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎంతపాతదైతే అంత ఉత్తమం.

ఎగ్ అమైనో ఆమ్లం

కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా (లీటరు ద్రవం పట్టేది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, (సేంద్రియ)బెల్లం పావు కేజీ.

తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి కలపాలి. మళ్లీ పది రోజుల వరకు నీడలో భద్రపరచాలి. 28 రోజులకు సిద్ధమవుతుందన్నమాట.

పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో

మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూసిన పూత రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది.

బూడిద - పసుపు మిశ్రమం
కావలసిన పదార్థాలు: నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. తగినంత బూడిద తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.

ఆచ్ఛాదన (మల్చింగ్)

కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన (మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఎండిన ఆకులు, గడ్డీగాదంతో 7 -10 అంగుళాల మందాన మల్చింగ్ చేయవచ్చు. దీనివల్ల కుండీల్లో మట్టి తేమను ఎక్కువ రోజులుంటుంది. వానపాములకు అనువైన వాతావరణం ఏర్పడి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. (డా. శ్రీనివాసరావును 94922 93299 నంబరులో
సాయంత్రం 7-8 గంటల మధ్య మాత్రమే సంప్రదించాలి)

సిరుల ‘ఫ్లవర్’

 

ఆత్మకూరు : ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు.. వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా అధిక పోషకాలు కలిగిన, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కాలీఫ్లవర్ సాగుపై మక్కువచూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమ యం.. అధిక లాభాలు ఉండడంతో పంట విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పంటను మండలంలో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. కాలీఫ్లవర్ సాగు-పంటకు వచ్చే చీడపీడలు-నివారణ చర్యలను హార్టికల్చర్ ఆఫీసర్ సంజీవరావు వివరించారు.

చలికాలం చివరి వరకునాటుకోవచ్చు..
మెలకువలు పాటిస్తే కాలీఫ్లవర్‌లో అధికదిగుబడి సాధించవచ్చు. ఈ పంటను చలికాలం చివరివరకు నాటుకోవచ్చు. వేసవి తీవ్రత మొదలుకాకముందే పంట చేతికి వస్తుం ది. కాలీఫ్లవర్‌లో ముఖ్యంగా నల్లి, మచ్చతెగులు, ఆవాలరంపపు పురుగు, తొలుచు పురుగు, డైమండ్ బ్యాక్‌మాస్(మచ్చలు)తో పాటు కొరడా తెగులు, బ్రౌనింగ్, రైజీనెస్, పేనుబంక, బట్టరింగ్ లాంటి సమస్యలు వస్తాయి. సకాలంలో వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.

చీడపీడలు-నివారణ
డైమండ్ బ్యాక్‌మాస్ : దీని లార్వాలు ఆకుల కణజాలాన్ని గీకి జల్లలాగా మారుస్తాయి. పెద్ద లార్వాలు ఆకుపై రంధ్రాలు చేస్తాయి. చెట్టు రంధ్రాలతో కనిపిస్తుంది. దీని నివారణకు ముందు గుడ్లను నాశనం చేయాలి. 100 మిల్లీలీటర్ల నీటిలో 5శాతం వేపగింజల కశాయాన్ని పిచికారీ చేస్తే గుడ్లు కుళ్లిపోతాయి. మలాథియాన్ లేదా క్లోరో ఫైరిఫాస్ లీటరు నీటికి 2మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
పేనుబంక : పేను బంక వారణకు లీటరునీటిలో ఒక మిల్లీలీటరు రోగోర్‌ను కలిపి పిచికారీ చేయాలి.
రైజీనెస్ : దీని లక్షణం పువ్వు వదులుగా ఉండడం. గడ్డమీద నూగు ఉంటుంది. దీంతో విలువ తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పువ్వులు వదులవుతాయి. దీని నివారణకు పూలను సమయానికి కోయాలి.
కొరడా తెగులు : ఆకులు పసుపు రంగుగా మారుతాయి. అంచులు తెల్లబడుతాయి. మధ్యభాగం ఈనె కొరడా లాగా బయటకు కనబడుతుంది. మాలిబ్డినమ్ లోపం వల్ల, నత్రజని ఎక్కువ కావడం వల్ల ఈతెగులు వస్తుంది. దీని నివారణకు సిఫారసు మేరకే ఎరువులు వాడాలి. ఎకరానికి 400 గ్రాముల అమ్మోనియం మాలిబిడేట్‌ను 200లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.
బ్రౌనింగ్ : బోరాన్ లోపం వల్ల పువ్వుపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. పువ్వుపెరిగే దశలో లీటరు నీటిలో 3గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8కిలోల బోరాక్స్ వేయాలి.
బట్టరింగ్ : కాలీఫ్లవర్‌లు చిన్న పరిమాణంలో ఉండడాన్ని బట్టరింగ్ అంటారు. ముదిరిన నారు నాటడం వల్ల బట్టరింగ్ వస్తుంది. స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా వేయొద్దు. తగిన మోతదులో ఎరువులు వేయాలి. సిపారసు చేసిన ఎరువులనే వాడాలి.

- సంజీవరావు(83744 49385),హార్టికల్చర్ ఆఫీసర్

నారు నర్సరీలో పోసుకోవాలి
నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. నారు నర్సరీలో పోసుకోవాలి. 30రోజుల సమయం పడుతుంది. సాగు చేసిన తర్వాత సుమారు మూడునెలల్లో పంట చేతికి వస్తుంది. రెండున్నర నెలల్లో ఫ్లవర్ కోయడానికి 15రోజులు అనువుగా ఉంటుంది. ఈపదిహేను రోజుల్లోనే మార్కెటింగ్ చేసుకోవాలి. అయితే హోల్‌సేల్‌గా అమ్మేదానికంటే రిటైల్‌గా అమ్ముకుంటేనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ పంట సాగుకు తేమలేకుండా ఉండే నేల అనుకూలం. మొక్కలు పెట్టేముందు భూమిని చదునుచేసుకోవాలి. తర్వాత సాళ్లు తీసి భూమిని తడిపి గడ్డిమందు పిచికారీ చేయా లి. తర్వాత మొక్కలు పెట్టాలి. ఎకరానికి 14వేల మొక్కలు పెట్టాలి. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి అవుతుంది. రూ.80వేల వరకు లాభం పొందవచ్చు.

- బిల్లా విష్ణువర్ధన్‌రెడ్డి(98667 06483), గుడెప్పాడ్

చీడపీడలు ఆశించకుండా చూసుకోవాలి
నేను ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగుచేశాను. ఈ పంటకు ఎక్కువగా లద్దె పురుగు, పచ్చ పురుగులు ఆశిస్తాయి. ఇవి రాకుండా చూసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. నిరంతరం పంటను జాగ్రత్తగా చూసుకోవాలి. వాణిజ్య పంటలకటే కాలీఫ్లవర్ సాగు చాలా లాభదాయకం. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తే బాగుంటుంది.

- తీనేటి ఇంద్రారెడ్డి(97046 31975), గుడెప్పాడ్

రూపు మార్చితేనే రూకలు!

వ్యవసాయ సంక్షోభ సాగరాన్ని రైతు సజావుగా దాటెయ్యాలంటే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడం ఒక్కటే చాలదు! పండించిన పండ్లను అయినకాడికి అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు. వాటిని ఎండబెట్టో, వివిధ రకాల ఉత్పత్తులుగా తయారుచేసో అమ్మితే ఆదాయం పెరుగుతుంది. స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాలకో, విదేశాలకో ఎగుమతి చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలన్నా, ఆచరణలోకి తేవాలన్నా ఒంటరి రైతులకున్న శక్తి సామర్థ్యాలు చాలవు. ఆరుగాలం చమటోడ్చి ఆశల దిగుబడులు తీసే అన్నదాతలు సహకార సంఘాలుగా ఏర్పడితే అధికాదాయాన్నిచ్చే మెరుగైన ప్రత్యామ్నాయాలు వెతకడం అసాధ్యమేమీ కాదనడానికి రుజువులెన్నో... కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్‌కు చెందిన 20 మంది సభ్యుల బృందం అటువంటి వెలుగుదారులనే వెతుకుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. అరటి ఆధారిత ఉత్పత్తుల తయారీ, విదేశాలకు ఎగుమతులపై ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ రైతు విజ్ఞాన యాత్రలకు నాబార్డ్ ఆర్థిక సాయమందించింది. రైతు బృందాల యాత్రలు కొత్తకాకపోయినప్పటికీ.. చైతన్యవంతులైన ఈ అరటి రైతుల సంఘటిత మహాప్రయత్నం ఇతర ప్రాంతాల రైతులు, ఇతర పంటల రైతులకూ వెలుగుబాట కావాలని ‘సాక్షి’ ’సాగుబడి’ ఆశిస్తోంది.

ఎండు (డ్రై) అరటి, సేంద్రియ అరటి పండ్ల ఎగుమతితో అధికాదాయం

పొరుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ కొత్తదారులు వెతుకుతున్న రైతులు

టమోటాలను పారబోసే బదులు.. ఒరుగులు, పొడిగా మార్చితే మేలంటున్న శాస్త్రవేత్తలు

ఎండు అరటి ఎగుమతి మేలు

అరటి తోటలో గెలలు కిందకు దించగానే మార్కెట్‌కు తరలించి విక్రయిస్తుంటారు. ఆలస్యమైతే కాయలపై మచ్చలు వచ్చి నాణ్యత పడిపోతుందనే బెంగ రైతును వెంటాడుతుంటుంది. అయితే, అరటి కాయలను ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడితే ఆ బాధ ఉండదు. మంచి ధరకు అమ్ముకోవచ్చునని రుజువు చేస్తున్నారు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తొట్టాయం రైతులు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల తొట్టాయం వెళ్లి సుబ్రహ్మణ్యన్ అనే రైతు సోలార్ డ్రయ్యర్‌తో అరటి కాయలను ఎండబెడుతున్న తీరును పరిశీలించింది. జర్మనీ అగ్రికల్చర్ బ్యాంక్ ఆర్ధిక సాయంతో సోలార్ డ్రయ్యర్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సౌర విద్యుత్‌తో నడిచే నీటిపంపు ద్వారా బిందు సేద్యం చేస్తుండడం సుబ్రహ్మణ్యన్ ప్రత్యేకత.

నెలకు 2 టన్నుల డ్రై అరటి ఎగుమతి

తొట్టాయం నుంచి నెలకు 2 టన్నుల ఎండు అరటిపండ్లు ఫిలిప్పీన్స్, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా స్థానాన్ని కూడా రైతుల బృందం సందర్శించి శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ ద్వారా అరటి సాగులో సరికొత్త విధానాలను రైతులు తెలుసుకున్నారు. అరటి నారతో చాపలు, మ్యాట్‌లు, అలంకరణ వస్తువుల తయారీని పరిశీలించారు. అరటి పండుతో డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ తయారీ తీరును అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అనువైన కో-1, రసాలి, నైంద్రన్, కర్పూర అరటి రకాల సాగు వివరాలను ఆకళింపు చేసుకున్నారు.

సేంద్రియ అరటి ఎగుమతితో 3 రెట్ల రాబడి

గుజరాత్ నౌసారిక్ ప్రాంతంలో సేంద్రియ అరటి రైతులు సహకార సంఘంగా ఏర్పడి సంఘటిత శక్తిని చాటుతున్నారు. గ్రాండ్‌నైన్ రకం అరటి పండ్లను సేంద్రియ పద్ధతుల్లో పండించి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలార్జిస్తున్నారు. అక్కడి విక్రమ్ దేశాయ్ అనే రైతు అరటితోటల్ని చాగంటిపాడు అరటి రైతుల క్లబ్ సభ్యుల బృందం ఇటీవల సందర్శించింది. నేస్తం స్వచ్ఛంద సంస్థ జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ ఆధ్వర్యాన ఈ యాత్ర సాగింది. అరటి తోటలను రైతులు ఆర్నెల్లు పెంచిన తర్వాత ‘దేశాయి’ అనే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. వారు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల మేరకు ప్రత్యేక శ్రద్ధతో తోటలను పెంచుతారు. అరటి కాయలకు మచ్చలు పడకుండా ఉండేందుకు రంధ్రాలున్న పాలిథిన్ సంచుల్ని గెలలకు తొడుగుతారు. గెలలను కాకుండా నైలాన్ దారంతో హస్తాలనే కోసి, సబ్బుతో రుద్ది కడిగి శుభ్రం చేస్తారు. పాలిథిన్ కవర్లలో పెట్టిప్రత్యేక అట్టపెట్టెల్లో ప్యాక్‌చే సి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. దేశాయి సంస్థ నుంచి ఆన్‌లైన్ ద్వారా గల్ఫ్ దేశాలు అరటి కాయలను విరివిగా కొనుగోలు చేస్తున్నాయి. ఏడాదిలోఎకరానికి రూ. 60 వేలు ఖర్చవుతోందని, రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని విక్రమ్ దేశాయ్ తెలుగు రైతు బృందానికి చెప్పారు. కిలో రూ.11.70 చొప్పున 40 కిలోల గెలను రూ.468లకు అమ్ముతున్నామన్నారు. తాము అమ్ముతున్న ధరకు ఇది మూడు రెట్లని రైతు బృంద సభ్యులు తెలిపారు.

అధిక దిగుబడి సాధించడంతోపాటు రైతులు మార్కెటింగ్‌లోనూ ముందుండాలన్న లక్ష్యంతోనే ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి రైతులకు శిక్షణ ఇప్పిస్తున్నామని ‘నేస్తం’ స్వచ్ఛంద సంస్థ కృష్ణా జిల్లా డెరైక్టర్ వీసం సురేష్ తెలిపారు. అరటి ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పడానికి బ్యాంకు రుణాలిప్పించేందుకు నాబార్డ్ ఏజీఎం ఎన్.మధుమూర్తి సంసిద్ధత తెలిపారు. రెండు రాష్ట్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరిన రైతులు అరటి ఉత్పత్తుల తయారీ దిశగా కదులుతుండడం శుభసూచకం.
- అయికా రాంబాబు, గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా

అరటి నార తీసే యంత్రం కొన్నాం

తిరుచ్చి(తమిళనాడు)లో అరటి నుంచి తయారయ్యే వివిధ ఉత్పత్తులను చూసిన తర్వాత అరటి పీచు తీసే యంత్రాన్ని కొన్నాం. ఉప ఉత్పత్తుల్ని తయారుచేస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాం.
- చంద్రమోహనరెడ్డి (94915 85202) ముఖ్య సమన్వయకర్త, అరటి రైతుల క్లబ్, చాగంటిపాడు, కృష్ణా జిల్లా

డ్రై అరటి లాభసాటి!

అరటి కాయలను ఎండబెడితే.. కోరుకున్న ధర వచ్చేంత వరకూ నిల్వ ఉంచవచ్చు. ఇది రైతుకు లాభసాటిగా ఉంటుంది. రైతు సుబ్రహ్మణ్యన్ సౌర విద్యుత్తుతోనే డ్రయ్యర్‌ను, సాగు నీటి పంపును నడపడం ఒకెత్తయితే, విదేశాలకు ఎగుమతి చేయడం మరో ఎత్తు.
- గుత్తా రాము (94901 79306)
పీఏసీఎస్ అధ్యక్షుడు,
తోట్లవల్లూరు

సేంద్రియ అరటి పండ్ల ఎగుమతి బాగుంది!

గుజరాత్‌లో అరటి రైతులు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లు పండించి ఎగుమతి చేస్తుండడం నచ్చింది. గ్రాండ్‌నైన్ రకం మన దగ్గర కూడా బాగా పండుతుంది.

- జె.రామ్మోహనరెడ్డి (94402 42205)
మాజీ సర్పంచ్, దేవరపల్లి,
తోట్లవల్లూరు మండలం

అరటి ఉత్పత్తులు అమోఘం

అరటి నారతో తయారు చేస్తున్న ఉత్పత్తులు అమోఘంగా ఉన్నాయి. అరటి పండుతో డ్రింక్, అరటి బిస్కెట్లు, చాక్లెట్లు, వైన్, జామ్, జ్యూస్ పరిశ్రమలపై శిక్షణ పొందడం ఉత్సాహాన్నిచ్చింది.

- ఎ.శ్రీనివాసరెడ్డి (94924 88845) బద్రిరాజుపాలెం,
తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా

కిలో టమోటాలతో 50 గ్రాముల పొడి!

 

నిలకడ లేని ధరలతో టమోటా రైతు చిత్తవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ టమోటాల సాగు ఉన్నప్పటికీ అత్యధికంగా పండించేది రాయలసీమ జిల్లాల్లోనే. చిత్తూరు జిల్లా టమోటాల సాగుకు పెట్టింది పేరు. మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం మేలు రకం టమోటా పది కిలోల ధర రూ. 130 ఉంది. ఇది రూ. 100కి పడిపోయే సందర్భాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతిదాకా వచ్చిన విలువైన ఆహారం వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో టమోటాలను ఒరుగులు(ఎండు ఒప్పులు)గా, పొడిగా మార్చి నిశ్చింతగా వాడుకోవచ్చని అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం(08554 200418) సూచిస్తోంది. టమోటా ఒరుగులు, పొడులను నిల్వ ఉంచి వాడినా రుచిలో తేడా లేదని, పోషకాల నష్టం కూడా ఏమీ లేదని కేవీకే అధ్యయనంలో తేలింది.

7-10 రోజులు ఎండబెడితే చాలు

టమోటా ఒరుగులు, పొడి తయారీకి నాణ్యమైన కాయలను ఎన్నుకోవాలి. టమోటాలను శుభ్రంగా నీటిలో కడగాలి. నాలుగు నుంచి 8 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ షీట్ మీద 34 డిగ్రీల సెల్షియస్ అంతకుమించిన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు.. 7 నుంచి 10 రోజుల వరకూ ఎండబెట్టాలి. ఒరుగుల మీద మంచు పడకుండా జాగ్రత్తపడాలి. పూర్తిగా ఎండిన ఒరుగులను గాలి ప్రసరించే ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటే పాడైపోకుండా ఉంటాయి. కేజీ టమోటాల నుంచి 60 గ్రాముల ఒరుగులు తయారవుతాయి. ఒరుగులను పొడి చేయవచ్చు. కేజీ టమోటాలతో 50 గ్రాముల పొడి తయారవుతుంది.

రుచికి, పోషకాలకూ ఢోకా లేదు

నిల్వ చేసిన ఎండు వరుగులను 4 నుంచి 6 గంటల వరకూ నీటిలో నానబెట్టి కూరల్లో వేసుకోవచ్చు. టమోటా పొడిని నేరుగా కూరలోనూ, రసంలోనూ వేసుకోవచ్చు. సూప్ తయారు చేసుకోవచ్చు. రెడ్డిపల్లి కేవీకే ప్రయోగాత్మకంగా కొందరు మహిళలకు టమోటా ఒరుగులు, పొడిని ఇచ్చి వాడించి చూసింది. వీటితో చేసిన వంటకాల రుచి తాజా టమోటాలు వేసినప్పటి మాదిరిగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైందని కేవీకే పోగ్రాం డెరైక్టర్ డాక్టర్ పీ లక్ష్మిరెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు నిల్వ చేసిన టమోటా ఒరుగులు, పొడులపై వ్యవసాయ విశ్వవిద్యాలయ(రాజేంద్రనగర్) నాణ్యతా నియంత్రణ కేంద్రంలో పరీక్షలు జరిపారు. దాదాపుగా తాజా టమోటాల్లో మాదిరిగానే విటమిన్ సి, లైకోపెన్ తదితర పోషక విలువలుండడం విశేషం.

రైతుల శ్రమ తగ్గించాడు

 

చదువున్నా.. లేకున్నా అనుభవాలు పాఠాలు నేర్పుతాయనటానికి మెకానిక్ వెంకటేష్‌ను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 7వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన తన వృత్తిలో అనుభవాలను రంగరించి సొంత పరిజ్ఞానంతో రైతుల శ్రమను తగ్గించేందుకుఓ సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. దోమ మండలం కమ్మం నాచారం గ్రామానికి చెందిన వెంకటేష్ (27) పరిస్థితులు అనుకూలించక 7వ తరగతితోనే చదువు మానేశాడు. అనంతరం కూలిపనులు, చేను పనులు చేసేవాడు.

అనంతరం తెలిసిన వారి దగ్గర మోటార్ వైండింగ్ మెకానిక్ నేర్చుకున్నాడు. పరిగిలో ఓ దుకాణం ఏర్పాటు చేసుకుని తన వృత్తి కొనసాగిస్తున్నాడు. రైతుల బోరుబావుల్లోంచి పాడైన మోటార్లు తీయడటం, వాటిని బాగుచేసి మళ్లీ బోరుబావుల్లో దించటం చేస్తుంటాడు. ఈ సమయంలో 10 మంది అతికష్టమ్మీద బోరుబావుల్లోంచి పైపులు, మోటార్లను తీయాల్సివస్తోంది. మోటార్ తీయాల్సిన ప్రతిసారి రైతులు 10 మంది కూలీలను వెతుక్కోవాల్సి ఉంటుంది. కూలిడబ్బులు కూడా భారంగా మారుతు న్నాయి. రైతులకు ఎంతో ఇబ్బందిగా మారుతోంది. ఈ పనిని సులువుగా మార్చేందుకు వెంకటేష్‌కు ఓ ఆలోచనతట్టింది.

కొత్త పరికరం తయారీకి శ్రీకారం..
చేతిపంపు హ్యాండిల్ పైకి కిందకు కదపటం ద్వారా ఎంతో లోతులో ఉన్న నీరు పైకి ఉబికి వ చ్చే సూత్రాన్ని వినియోగించి అలాంటిదే ఓ కొత్త పరికరం తయారు చేశాడు. కొన్ని పైపులు ఒక దగ్గర చేర్చి వాటికి వెల్డింగ్ చేసి పరికరంగా మార్చాడు. తయారు చేసిన పరికరంతో ఒకరు మాత్రమే పట్టుకుని హ్యాండిల్‌ను పైకి కిందకు అంటుంటే పైపులు, మోటారుతో సహా పైకి వస్తాయి.

ఇవి పైకి వచ్చే క్రమంలో వాటిని టైట్ చేస్తూ పైకి లాగేందుకు మరొకరు అవసరం అవుతారు. ఇలా 10 మంది చేసే పనిని ఈ పరికరం వినియోగించి ఇద్దరు వ్యక్తులే సులువుగా చేయగలుగుతున్నారు. దీంతో రైతులకు మోటార్ పైకి లాగేటప్పుడు బాగు చేశాకా మళ్లీ దించే సమయంలో రూ. 2 వేల నుంచి 3 వేల వరకు ఖర్చు తగ్గుతుందని వెంకటేష్ పేర్కొంటున్నాడు. మోటార్‌ను వెలికితీసేందుకు పరికరం అవసరమైన రైతులు వెంకటేష్‌తోనే ఈ పనిని కానిస్తున్నారు. కూలిడబ్బులు, శ్రమను తగ్గించేలా పరికరాన్ని కనుగొన్న వెంకటేష్‌ను పలువురు రైతులు అభినందిస్తున్నారు.

ఇంటిపంట’ స్ఫూర్తితో... మేడపైనే పండ్లు, కూరగాయలు!

 

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి రేణుక తమ మేడపైన పచ్చని ఫుడ్ ఫారెస్ట్‌ను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఆమె ‘ఇంటిపంట’ స్ఫూర్తితో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ప్రారంభించారు. తమ కుటుంబం కోసం ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. అప్పుడప్పుడూ ఇరుగు పొరుగు వారికీ రుచిచూపిస్తున్నారు. ఈ టై తోటను మెచ్చిన ‘చిన్న పిచ్చుక’ అందులోనే ఓ బుజ్జి గూడు కట్టుకుని.. సంతానం వృద్ధి చేసుకుంది!

ఆదిలాబాద్‌లోని ద్వారకానగర్‌లో వ్యాపారి అరుణ్‌కుమార్ ఖత్రి (9849267774), రేణుక ఖత్రి కుటుంబం మూడంతస్తుల సొంత భవనంలో నివాసం ఉంటోంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని గృహిణిగా జీవనం కొనసాగిస్తున్న రేణుకకు పూల మొక్కలంటే ఇష్టం. అయితే, నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ చదివిన తర్వాత ఆమె దృష్టి సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లింది. హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌కు చెందిన వేగేశ్న రామరాజు గారి టై గార్డెన్‌పై కథనం చదివి.. స్వయంగా వెళ్లి చూసి స్ఫూర్తి పొందానని ఆమె తెలిపారు. అప్పటి నుంచి తమ మేడ మీద సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ‘ఇంటిపంట’ కాలమ్ అందిస్తున్న మెలకువలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కాంక్రీటు మేడల మధ్య వీరి టై పచ్చగా అలరారుతోంది.
100 చదరపు గజాల టైపై 25 ప్లాస్టిక్ డ్రమ్ములు, 40 మట్టి కుండీలు ఏర్పాటు చేసి రేణుక నిక్షేపంగా ఇంటిపంటలు పండిస్తున్నారు. నల్లమట్టి, ఎర్రమట్టి, ఆవు పేడ ఎరువు, వరిపొట్టు, వేపపిండి, వర్మీకంపోస్టుతో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. సీతాఫలం, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, సపోట, మామిడి, రేగు తదితర 15 రకాల పండ్ల చెట్లతోపాటు వివిధ కూరగాయ మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. రెండేళ్లుగా సొంత పండ్లు, సొంత కూరగాయలపైనే ఎక్కువగా వాడుతున్నామని రేణుక వివరించారు. వంటింటి వ్యర్థాలతో తయారైన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని సొంతంగా తయారు చేసి కిచెన్ గార్డెన్‌కు 15 రోజులకోసారి వాడుతున్నారు.

నాటు విత్తనాలతోనే టమోటా, గోరుచిక్కుడు, మిరప, చిక్కుడు, బీర, కాకర, వంగ, బెండ, చేమగడ్డ, మునగ, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తమ ఇంటిపంటను అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుకీ పంచుతున్నారు. భర్త సహాయ సహకారాల్లేకుండా ఇంటిపంటల సాగు సాధ్యమయ్యేది కాదని, ఆయన తోడ్పాటుతోనే హైదారాబాద్, కడియం నర్సరీల నుంచి కోరుకున్న మొక్కలు తెప్పించుకుంటున్నానన్నారు రేణుక. సంధ్యా సమయాల్లో టై తోట పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ మానసికోల్లాసాన్ని కలిగిస్తోందన్నారు రేణుక. గత ఏడాది నాగమల్లి చెట్టుపై చిన్న పిచ్చుకలు గూడు పెట్టడం.. మూడు పిల్లల్ని చేయడం.. తమ ‘ఇంటిపంట’లో మరువలేని మధుర జ్ఞాపకంగా మిగిలిందని ఆమె తృప్తిగా చెప్పారు.

ఇక ద్రోన్ల శకం!

పంటల స్థితిగతులపై తాజా సమాచారాన్ని చప్పున తెలుసుకునేందుకు అత్యాధునిక ద్రోన్‌లను వినియోగించడం సంపన్న దేశాల్లోనే కాదు.. మన దేశంలోనూ ప్రారంభమైంది. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్లాంట్‌పెథాలజీ విభాగం అద్దె పద్ధతిన ద్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. చిన్న విమానం మాదిరిగా ఉండి గాలిలో ఎగురుతూ నిర్దేశిత పనిని చక్కబెట్టే ఈ పరికరాన్ని ద్రోన్ లేదా క్వాట్రా క్యాఫ్టర్ అని అంటారు. వేరుశెనగ వంటి చిన్న పంటల నుంచి కొబ్బరి, వక్క, కాఫీ వంటి ఉద్యాన తోటలకు చీడపీడలేమైనా సోకాయా? తీవ్రత ఎలా ఉంది? వంటి విషయాలను తక్కువ సమయంలో తెలుసుకోవచ్చని విశ్వవిద్యాలయం చెబుతోంది.

45 నిమిషాలు చార్జ్ చేస్తే ఈ పరికరం 20 నిమిషాల పాటు గాలిలో ఎగరగలుగుతుంది. గంటకు ఒక ఎకరా విస్తీర్ణంలోని పంటల పరిస్థితిని పరిశీలించవచ్చు. దీనికి అమర్చి ఉండే కెమెరా పంటను వీడియో తీసి ఎప్పటికప్పుడు పంపిస్తుంది. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లో చూస్తూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. విస్తారంగా కొబ్బరి, వక్క, సరుగుడు వంటి తోటలు సాగు చేసే రైతులకు.. వ్యవసాయ పరిశోధన, విస్తరణ సేవలకు ద్రోన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా ఈ ద్రోన్‌ను నియంత్రించవచ్చు. అతివృష్టి, అనావృష్టి వంటి సందర్భాల్లో పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, రైతులు అప్పటికప్పుడు అనుసరించదగిన వ్యవసాయ సూచనలు, సలహాలివ్వడానికి.. బాధిత రైతులను త్వరితగతిన ఆదుకోవడానికి కూడా ద్రోన్ ఉపకరిస్తుందని చెబుతున్నారు. దీనికి రోజుకు అద్దె రూ. పది వేలు! ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రైతులు దీని సేవలు వినియోగించుకున్నారట. మరిన్ని వివరాలకు: బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్లాంట్‌పెథాలజీ విభాగాన్ని సంప్రదించవచ్చు.
ఫొన్: 080 23330153, 23636826

నేలమ్మా.. మన్నించమ్మా!

 

జీవానికి మూలాధారమైన నేలతల్లి నిర్లక్ష్యమై వట్టి పోతోంది. సకల జీవకోటికీ స్తన్యం పడుతున్న నేలమ్మే నాగరికతకు పునాది. మానవులతోపాటు భూమిపైన, భూమి లోపల సకల జీవులకూ ప్రాణాధారం భూమాతే. అన్నదాత చేతుల మీదుగా మన కంచాల్లోకి వస్తున్న ఆహారంలో 99% భూమాత ప్రసాదమే! ఆహారం, నీరు, వాతావరణం, జీవవైవిధ్యం, జీవితం.. వీటన్నిటికీ ప్రాణ దాతైన భూమాతతో సజీవ సంబంధాన్ని కొనసాగించడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. అందుకే.. అంతటి చల్లని తల్లికే పుట్టెడు కష్టం వచ్చిపడింది. సాగు భూమిలో 25% ఇప్పటికే నిస్సారమైంది. జీవాన్ని.. సేంద్రియ పదార్థాన్ని కోల్పోయింది. చౌడు తేలింది. చట్టుబండైంది. నీటిని గ్రహించే శక్తి నశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల సాగుకు పనికిరాకుండా పోయింది.. నాశనమవుతూనే ఉంది..

ప్రతి ఏటా రెండున్నర కోట్ల ఎకరాల్లో సుసంపన్నమైన నేల నాశనమైపోతున్నది. అంటే.. ప్రతి నిమిషానికి 30 ఫుట్‌బాల్ కోర్టులంత మేర సారవంతమైన భూమి పనికిరాకుండా పోతోంది.

ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) నివేదిక ప్రకారం.. నేలతల్లి ప్రాణాలను అనుక్షణం మనమే చేజేతులా తోడేస్తున్నాం. ఈ విధ్వంసం అంతా వ్యవసాయం పేరిట సాగిపోతోంది.. జీవనాధారంగా ప్రారంభమైన వ్యవసాయం.. విచక్షణారహితంగా వాడుతున్న వ్యవసాయ రసాయనాల వల్లనే ముఖ్యంగా నేల నిర్జీవమవుతోంది.

తల్లి ఆరోగ్యం పాడైతే బిడ్డ బాగుంటుందా? అతిగా రసాయనిక అవశేషాలున్న ఆహారం తిన్న నేలతల్లి బిడ్డల ఆరోగ్యం కూడా అంతకంతకూ క్షీణిస్తోంది. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే.. నెత్తికెక్కిన కళ్లను నేల లోతులకు మళ్లించాలి. వనరుల విధ్వంసం ఆగాలంటే.. పారిశ్రామిక దేశాలు రుద్దిన సాంద్ర వ్యవసాయ పద్ధతిని వదిలేసి, ప్రకృతికి దగ్గరవ్వాలని ఎఫ్‌ఏవో మొత్తుకుంటున్నది.

ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలకు భూమి ఆరోగ్యం ప్రాణావసరమన్న స్పృహను పాలకుల్లో, ప్రజల్లో రగిలించడం తక్షణావసరం. ఇందుకోసమే 2015ను ‘అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5(రేపు) నుంచే భూముల పరిరక్షణకు పాలకులు, రైతులు, ప్రతి మనిషీ కదలాలని పిలుపునిచ్చింది. భూసారాన్ని పునరుద్ధరించుకుంటూనే నిశ్చింతగా జీవనాధారమైన పంటల సాగుకు ప్రపంచమంతా కంకణబద్ధులు కావాల్సిన తరుణమిది. వాతావరణ మార్పుల ప్రతికూల పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తీక్షణంగా దృష్టిసారించాలి.
భూసార విధ్వంసక విధానాలకు, అసపవ్య సాగు పద్ధతులకు పాతరేద్దాం.. ప్రకృతికి కీడు చేయని పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ అన్నదాతలకు జేజేలు పలుకుదాం.. నిస్సారమైన నేలకు తావు లేని రోజు కోసం అందరం ఉద్యమిద్దాం. జీవిత కాలంలో సెంటీమీటరు నేలను కూడా మనం సృష్టించలేం. అలాంటప్పుడు భూమిని పాడు చేసే హక్కు మనకెక్కడిది? ఆ తల్లి స్తన్యం తాగి రొమ్ము గుద్దడం మాని, నేలమ్మను పరిరక్షించుకుంటే పోయేదేమీ లేదు.. ఆహారోత్పత్తి 58% పెరగటం(ఎఫ్‌ఏఓ అంచనా) తప్ప!

మనిషి పనుల మూలంగా నేలమ్మ చాలా వేగంగా సారాన్ని కోల్పోతూ సాంఘిక, ఆర్థిక, ఇతర సమస్యలకు దారితీస్తోంది. నేలను అపసవ్యమైన రీతుల్లో అతిగా వినియోగించడం మనుగడకే ఎసరు తెస్తోంది. హరిత విప్లవ కాలంలో ముందుకొచ్చిన సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల గత ఆరు దశాబ్దాలుగా నేల గతమెన్నడూ ఎరుగనంతగా పతనమైంది. అవసరానికి మించి దున్నడం, ఏదో ఒకే పంటను సాగు చేయడం, సేంద్రియ ఎరువులు చాలినంతగా వేయకపోవడం, రసాయనిక ఎరువులతోపాటు కలుపు మందులను విచ్చలవిడిగా వాడటం, కాలువ నీటి వాడకంలో అపసవ్య పోకడలు.. ఇవీ భూములు నాశనం కావడానికి ముఖ్య కారణాలని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆహారోత్పత్తి వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

దేశంలో 12 కోట్ల 10 లక్షల హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. ఇందులో 2 కోట్ల 28 లక్షల హెక్టార్ల సాగు భూమి కేవలం రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల నిర్జీవమై సాగుకు పనికిరాకుండా పోయింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చే క్రమంలో మన దేశంలో సాగు భూమి తగ్గిపోతున్నది. 1951లో ప్రతి మనిషికీ 1.19 ఎకరాల చొప్పున సాగు భూమి అందుబాటులో ఉండేది. ఇది 1991 నాటికి 40 సెంట్లకు తగ్గింది. 2035 నాటికి 20 సెంట్లకు తగ్గేలా ఉంది.

ఉత్పాదకతను కోల్పోతున్న లక్షల హెక్టార్లు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 రకాల భూములున్నాయి. మెట్ట, మాగాణి అనే తేడా లేకుండా అన్ని రకాల భూముల్లోనూ సారం అంతకంతకూ తగ్గిపోతూ పంటల దిగుబడి క్షీణిస్తోంది. తెలంగాణ (భూముల్లో 29 శాతం) లో 34 లక్షల హెక్టార్ల భూమి ఏదో ఒక రకంగా ఉత్పాదక శక్తిని కోల్పోయిందని తాజా అంచనా. ఆంధ్రప్రదేశ్ (భూముల్లో 36 శాతం)లోని 58 లక్షల హెక్టార్ల భూములు నిస్సారంగా మారాయి.

సేంద్రియ కర్బనం 0.5 శాతానికి అడుగంటిందని అంచనా. దీన్ని 2 శాతానికి పెంచుకోవడమే లక్ష్యంగా బహుముఖ వ్యూహాలను ప్రభుత్వం అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిని రైతు దగ్గరకు తీసుకెళ్లే యంత్రాంగమే అరకొరగా ఉంది.
రైతుకు సాంద్ర వ్యవసాయాన్ని అలవాటు చేసిన ప్రభుత్వం.. దాని ద్వారా ఏర్పడిన భూసార సమస్యను అధిగమించే సులభమైన, ఆచరణాత్మక పద్ధతులను రైతులకు అందించలేని స్థితిలో ఉండిపోవడం విషాదకర వాస్తవం. దిక్కుతోచని బడుగు రైతు మనుగడకే ఇది పెనుశాపంగా పరిణమించింది. ఫ్రాంక్లిన్ డెలొనొ రూజ్వెల్ట్ ఇలా అన్నారు: ‘భూములను నాశనం చేసుకునే దేశం, తనను తాను నాశనం చేసుకుంటుంది’. ప్రస్తుతం మన భూములు, మన దేశం పరిస్థితి ఇలాగే ఉంది.

ప్రత్యామ్నాయాల అడుగుజాడలు..

ప్రభుత్వం చేష్టలుడిగినంత మాత్రాన అన్నదాతలు అక్కడే ఆగిపోరు. తమ సమస్యలకు తామే పరిష్కారాలు వెతుక్కుంటూనే ఉంటారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడడం పూర్తిగానో, పాక్షికంగానో మానేసి.. స్థానిక వనరులతోనే ఖర్చు తక్కువతో కూడిన ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. భూసారాన్ని పెంపొందించుకుంటూనే పంట దిగుబడులనూ పెంచుకుంటున్నారు. టన్నులకొద్దీ పశువుల ఎరువుల అవసరం లేకుండానే కొత్త పద్ధతుల్లో తక్కువ పశువులతోనే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వాలు అత్యాధునికమైనవన్న భ్రమలో విదేశీ నమూనా ఎండమావుల వెంటపడకుండా.. మన రైతుల అనుభవంలో నిగ్గుతేలిన మేలైన, ప్రకృతికి అనుగుణమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై దృష్టిపెట్టాలి.
మట్టిలోనే పుట్టి మట్టిలోనే బతుకుతూ సమాజానికి మూడు పూటలా తిండి పెడుతున్న అచ్చమైన రైతుల అనుభవాల నుంచి బేషజాల్లేకుండా నేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. మన భూముల, మన రైతుల, వినియోగదారుల భవిష్యుత్తు, ఆరోగ్యం- ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంది.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

భూసారాన్ని రక్షించుకునేలా సాగు మారాలి

ఉత్పాదకత పెరగాలంటే భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచాలి. రసాయనిక, సేంద్రియ, జీవన ఎరువులు కలిపి వాడాలి. 25-50% పోషకాలను సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించాలి. భూసారాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి. కౌలు, యువ రైతులకు అవగాహన కలిగించేందుకు విస్తరణ వ్యవస్థను పటిష్టం చేయాలి. సూక్ష్మజీవుల ద్వారా పోషకాలను అందించడంపై దృష్టిపెట్టాలి. సూక్ష్మజీవుల గురించి మనకు తెలిసింది ఒక శాతమే. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం సందర్భంగా ఈ అంశాలపై శ్రద్ధ చూపాలి. పరిశోధన ఫలితాలను రైతులకు అందించడానికి విస్తృత కృషి జరగాలి. సాయిల్ రిసోర్సెస్ మ్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఉపకరిస్తాయి.
- డా. డి. బాలగురవయ్య, ప్రధాన శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్ర విభాగం,
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ), హైదరాబాద్

ప్రకృతి వ్యవసాయంతోనే భూముల పునరుజ్జీవనం!

మట్టి మొక్కలకు పునాది. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలో జీవరాశి (వానపాములు, సూక్ష్మజీవులు, పురుగులు, శిలీంధ్రాలు, ఇంకా మట్టిలో ఉండే అనేక ప్రాణులు) నిరంతరాయంగా పోషకాలను మొక్కల వేళ్లకు అందిస్తాయి. కానీ గత అరవయ్యేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు, కలుపుమందులు వాడుతుండడం వల్ల మట్టిలో ఉండాల్సిన వానపాములు, ఇతర జీవరాశి నాశనమై భూమి నిస్సారమైపోయింది. ఏదైనా ఎరువును బయటి నుంచి అధికంగా తెచ్చి వేస్తేనే గానీ పంట పండని దుస్థితి నెలకొంది. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండించాలనుకుంటే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వ్యవసాయ విజ్ఞానానికి అడ్డుచెప్పే వారెవరూ ఇప్పుడు లేరు..ప్రాణావసరం కాబట్టి!
- సుభాష్ పాలేకర్, ప్రకృతి వ్యవసాయోద్యమ సారధి, మహారాష్ట్ర (‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం - 1’ పుస్తకం నుంచి)

నడుస్తుంటే మట్టి పెళ్లలు గుచ్చుకునేవి..!

పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతం, జీవామృతం వాడుతూ 6 ఎకరాల్లో నాలుగేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. సేంద్రియ కర్బనం 0.5% నుంచి 0.95%కు పెరిగింది. అంతకుముందు పొలంలో చెప్పుల్లేకుండా నడిస్తే మట్టిపెళ్లలు గుచ్చుకునేవి. ఇప్పుడు నడి ఎండాకాలంలోనూ చెప్పుల్లేకుండా హాయిగా నడవొచ్చు. ఎకరానికి బీపీటీ ధాన్యం 28-30 బస్తాల దిగుబడి వస్తోంది. మా పొలం తుపాన్లు తట్టుకొని పడిపోకుండా నిలబడింది. నేల తేమ ఆరిపోదు. తక్కువ నీరే సరిపోతున్నది.
- కోగంటి రవికుమార్ (80192 59059), సేంద్రియ రైతు, ఇందుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా

సేంద్రియ కర్బనం 3% నుంచి 0.5%కి తగ్గింది..

జీవామృతం, పంచగవ్య, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ద్వారా సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. భూముల్లో సేంద్రియ కర్బనం 50 ఏళ్ల నాడు 3% ఉండే 0.5%కి తగ్గింది. దీన్ని కష్టపడి 1%కి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులను చైతన్యవంతం చేస్తున్నాం. 8 ఏళ్లలో సేంద్రియ సాగు విస్తీర్ణం 5% నుంచి 25%కి పెరిగింది. సేంద్రియ ముడి బియ్యంతోపాటు సేంద్రియ పాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగ దారుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వైద్య ఖర్చులు 50% తగ్గాయి. రైతులంతా సేంద్రియ సాగుకు మళ్లితే ఆసుపత్రుల అవసరమే ఉండదు. ప్రతి రైతుకూ నాటు ఆవు లేదా దూడైనా ఉండాలి.
- కే సాంబశివరావు (97011 08511), సేంద్రియ సాగు సమన్వయకర్త, ప్రభుత్వ రైతు శిక్షణా కేంద్రం, విజయవాడ

జంతువులను పాము కాటు నుండి .....

ప్రథమ చికిత్స ఇలా..

 • పాము కరిచిన చోట పైభాగాన బట్టతో గట్టిగా కట్టాలి
 • కాటేసిన స్థలంలో బ్లేడుతో కోసి రక్తాన్ని పిండేయాలి
 • పతి 20 నిమిషాలకు కట్టును వదులుగా మళ్లీ కట్టు కట్టాలి
 • పాము కరిచిన పశువుకు ఫామ్, ఆట్రోఫిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్లను ఎక్కించాలి
 • ఈ మందు ఖరీదు రూ100 నుంచి రూ.200 వరకు ఉంటుంది.
 • పశువులు కోలుకునే వరకు ఈ మందును ప్రతి గంటకు ఎక్కిస్తుండాలి
 • యాంటీబయాటిక్స్, అనెల్జెసిక్స్, కార్టికోస్టిరియాడ్స్, గ్లూకోస్ వంటి మందులను
 • అవసరాన్ని బట్టి వాడుతూ ఉండాలి
 • శ్యాస క్రియను ఉత్తేజం చేయడానికి కొరమిన్, నికతాబైడ్ వంటి ఇంజక్షన్లు ఇస్తూ ఉండాలి
 • ఇలా చేస్తే పాము కరిచిన పశువులను సులభంగా రక్షించుకోవచ్చు.

ఈ విష సర్పాలు కరిచే అవకాశం..
అటవీ ప్రాంతంలో సాధారణంగా కట్ల పాము, తాచుపాము, రక్త పింజరలు పశువును కాటు వేస్తాయి. ఇవి ఎక్కువ విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పాములు సాధారణంగా పశువుల ముట్టె, కాళ్లు, పొదుగు భాగంలో కాటు వేస్తాయి.

తాచుపాము, కట్ల పాము కాటువేస్తే
తాచుపాము, కట్లపాము కరిస్తే న్యూటాక్సీన్ (విషం)విడుదలై పశువుల నాడీ మండలం దెబ్బతినే ప్రమాదం ఉంది.దీంతో శ్వాసకోశ వ్యవస్థ స్తంభిస్తుంది. పాము కరిచిన చోట మంట ఉండదు. కానీ నోటినుంచి నురగ వస్తుంది. శరీరం అదుపు తప్పుతుంది. పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లి సరైన కాలంలో మందులు వేయకపోతే మృతి చెందుతాయి.

రక్త పింజర కరిస్తే..
రక్త పింజర కరిచినప్పుడు హిమోటాక్సిన్ (విషం) విడుదల రక్తంలో కలిసి రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దాంతో పశువుల ముక్కు, నోరు నుంచి రక్తం కారుతుంది. కాటు దగ్గర మంటగా ఉంటుంది. వాపు వచ్చి పాము కరిచినచోట చర్మం రంగు మారి రక్తం కారుతుంది. మూత్రం ఎరుపురంగులో ఉంటుంది. రక్తపింజర కాటు బారిన పశువు పది గంటల్లోగా మృతి చెందుతుంది.

వాతావరణ పరిస్థితులు -రైతులకు సూచనలు

రామయ్య: - ఈ ఏడాది మన గుంటూరు జిల్లాల్లో వర్షాలు బాగానే కురుస్తున్నాయి, కాలువలు వదలటం లేదు.

లక్ష్మయ్య: - మన దగ్గర వర్షాలు పడటం కాదు, మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పడితే మనకు కాలువలు వదులుతారు.

సుబ్బయ్య: - ఓ ప్రక్క కూలీలా కొరత, పుండు మీద కారంలా నీళ్లు ఇంకా డాల్ లేదు, నాట్లు ఆలస్యమయితే రెండో పంట ఏం వేయగలం ? ఏం తోచడం లేదు ఈ సంవత్సరం వారి పండించగలమా ?

అప్పుడే వ్యవసాయ అధికారి అటుగా వచ్చి వీరి మాటలు విని ...

వ్యవసాయ అధికారి : - మీరందరు చెబుతున్నది నిజమే కానీ, కాలానికి అనుకూలంగా అలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. మన చేతిలో లేని దాని గురించి చింతించి ఏం లాభం.

లక్ష్మయ్య: - అది కదండీ, కాలువలో నీరు లేక వారి ఎలా పండించాలి ? ఇప్పుడు పడే వర్షంతో వారిని ఎలా పండించాలి ? మీరే చెప్పండి

వ్యవసాయ అధికారి:-  ఆలా ఆవేశపడకు లక్ష్మయ్య ! నిదానంగా ఆలోచిస్తే పరిష్కారము దొరుకదంటారా ! మీకు రైతు చైతన్య యాత్రలో చార్టులు పెట్టి మరి వారి, శ్రీ సాగు పద్ధతి, డ్రమ్ నీదారుతో విత్తడం, యాంత్రీకరణ పద్ధతి, వేదపద్ధతి గురించి వివరించాము కదా ! గుర్తుందా !

సుబ్బయ్య: - ఆ ! గుర్తొచ్చిందండి !

వ్యవసాయ అధికారి:- మరి దాంట్లో వేదం పద్దతిలో వారి పండించడం ప్రస్తుతం మనకు అనుకూలం కాదంటారా ?

రంగయ్య :- వేదపద్ధతి గురించి విన్నాను, గతంలో పండించే వారమే ! కానీ దాని వలన కలుపు పెద్ద సమస్య , మొలక సరిగ్గా వస్తుందా ?

వ్యవసాయ అధికారి: -  నీవన్నది నిజమే  రంగయ్య కానీ ప్రస్తుతం మనకున్న పరిస్థితులలో ఈ వేదపద్ధతిలో వారిని పండించాలంటే లాభసాటిగా ఉంటుంది.

లక్ష్మయ్య :-  వివరంగా చెప్పండి ఇది ఏదో నాకు పనికొచ్చేలా వుంది!

వ్యవసాయ అధికారి:-  ప్రస్తుతం పడుతున్న వర్షాలను ఉపయోగించుకొని విధానాన్ని నాటితే, విత్తిన 30 -45  రోజుల తర్వాత కాలువల ద్వారా తగిన నీరు అందుబాటులో కొచ్చినప్పుడు సాధారణ పద్ధతిలోకి మర్చి వారి సేద్యం చేయవచ్చు.

రంగయ్య - మీరు చెబుతుంటే బాగానే వుంది కానీ, ఎలా చేయాలో వివరంగా చెప్పండి !

వ్యవసాయ అధికారి:-  పొలాన్ని దుక్కి చేసి చదును చేసుకొని తగిన పదును వున్నప్పుడు ఎకరాకు 10 -12  కిలోల వారి విధానం వెదపెట్టాలి. విథేముందు దుక్కి మీద ఎకరాకు 50  కిలోల డిఏ పి  చల్లాలి,. ట్రాక్టర్ లేక ఎద్దుల గొర్రుతో సలుకు మధ్య 30  సెం.మీ  ( 12  అంగుళాలు ) దూరం ఉండేలా విధానం నెలలో 5 -6  సెం.మీ .ల లోతులో పడేలా విత్తాలి.

రంగయ్య: - ట్రాక్టరుతో వెదపెట్టడం ఎలా ?

వ్యవసాయ అధికారి: - ట్రాక్టరుతో విధానం వెదపెట్టే 9  పళ్ళ యినుపగొర్రు పరికరం మనకు వ్యవసాయ శాఖా ద్వారా 50 % సబ్సిడీ పొంద వచ్చును. దీని ఖరీదు రూ 45 ,950 /- సబ్సిడీ రూ 20 ,000  /- లు పొంద వచ్చును. దీని ఖరీదు రూ . 25 ,950 /- లు చెల్లించాలి. ఈ పరికరం వలన లాభమేంటంటే ఈ పరికరంలో విధానాలకు, ఎరువులకు విడి విడిగా రెండు అరలుంటాయి. విధానంతో పాటె ఎరువు నేరుగా చేలో పడుతుంది . అనుభవం కలిగిన ట్రాక్టర్ డ్రైవర్ ఈ యంత్ర పరికరంతో ఒక గంటలోనే ఎకరం నాటగలడా .

లక్ష్మయ్య :- విధానం సరిగ్గా మొలకెత్తుతుందంటారా ?

వ్యవసాయ అధికారి :- ప్రస్తుతం కలుపును నివారించుటకు మంచి కలుపు మందులు ఉన్నాయి. , విత్తిన వెంటనే లేక 2 -3  రోజులలోపు విధానం మొలకెత్తక మునుపే పెండిమిథాలిన్ (స్టాంప్ ) ఎకరాకు ఒక లీటరు చొప్పున 200  లీటర్ల నెలల్లో కలిపి పిచికారీ చేయాలి . గమనించాల్సిన విషయం ఏంటంటే నెల పై పొరలలో తగినంత తేమ ఉంటె కలుపు మందు సమర్థవంతంగా కలుపు నివారణ బాగుంటుంది.

సుబ్బయ్య :- ఆ తరువాత కూడా కలుపు వస్తుంది కదా ! దానికి ఎలా చేయాలి?

వ్యవసాయ అధికారి :- విత్తిన 20 -30  రోజులకు సైహలొ ప్రావ్ బ్యుటైల్ (క్లించర్, రావ్ ఆఫ్ ) ఎకరాకు 400 మీ. లి. (ఊడనివారణకు ) మరియు 2 ,4  డి 400 మీ.లి (వెడల్పాటి కూల్ నివారణకు ) లేదా బిస్పైరీబ్యాక్ సోడియం (నామిని గోల్డ్ )80 మీ.లి ఎకరాకు పిచికారీ చేసినట్లయితే చక్కగా కలుపును నిర్ములించవచ్చును.

లక్ష్మయ్య:- జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ, కూలీలా కొరత ... కాలువలలో నీటి విధియుధాల ఆలస్యం కావడం .... ఇజం దాటిపొడవడం వలన ... ఈ సమస్యలన్నిటికీ మీరు చెప్పిన వేదం పద్దతిలో వారి సాగు చక్కటి పరిష్కారం అనిపిస్తుంది. ఏమంటావు సుబ్బయ్య ?

సుబ్బయ్య :- నీవన్న దానికి తిరుగు లేదు కానీ ఇంకా ఎమన్నా జాగ్రత్తలు తీసుకోలంటారా  వ్యవసాయ అధికారి గారు.

వ్యవసాయ అధికారి:- విధానం పూర్తిగా మొలకెతేన తర్వాత ఒక తడి, భూమి స్వభావాన్ని బట్టి 7 -15  రోజులకు రెండవ తడి ఇవ్వాలి. డ్రమ్ సీడరుతో కూడా విధానం నేరుగా విత్తుకోవచ్చు?

లక్ష్మయ్య :- అదెలా?

వ్యవసాయ అధికారి :- డ్రమ్ సీడరు కూడా ఎకరాకు 10  -12  కిలోల విత్తనం సరిపోతుంది విధానాన్ని 24  గంటలు నానబెట్టి 24  గంటలుమొలకేతించిన డ్రమ్ సీడరులో పోసి పొలంలో లాగవలెను, దీనివలన శాలల్లో 20  సెం.మీ . వరుసలో 8  సెం. మీ . దూరంలో పడుతుంది. రోజుకు 2  ఎకరాలు తేలిగ్గా విత్తుకోవచ్చును కోనోవేదరును తిప్పి కలుపు నివారించవచ్చును. ఈ డ్రమ్ సీడరును సబ్సిడీ పై వ్యవసాయశాఖ అందజేస్తుంది. మొత్తం ఖరీదు రూ .5 ,400  /- కాగా రూ. 2 ,500 /- సబ్సిడీ పోను రైతులకు రూ.2 ,900  /- చెల్లిస్తే వ్యవసాయశాఖ ద్వారా పరికరాన్ని ఇపొందవచును.

లక్ష్మయ్య :- చాల మంచి విషయాలు చెప్పారండి ! ఈ సీజనులో నేను వేదపద్ధతిలోనే వారి పండిస్తాను. అది సరేకానండీ.చీడపీడలు  ఆశించడం , కాలపరిమితి ఎలా ఉంటుంది.

వ్యవసాయ అధికారి:- వరుసలలో విత్తుతారు, కాబట్టి చీడపీడలు తక్కువ గానే ఆశిస్తాయి. కళాపరిమితంటారా వారు పెంచే పద్దతికన్నా వరం, పది రోజుల ముందేం కోతకు వస్తుంది.

సుబ్బయ్య :- నేను ప్రత్య్ వేయాలనుకుంటున్నానండి ! దీని విషయం ఎమన్నా చెబుతారా ?

వ్యవసాయ అధికారి:- ప్రస్తుతం వాడుతున్న వర్షాలు ప్రతి వేసుకోవడానికి అనుకూలమైనవై, ప్రాంతానికి అనువైన బిటి ప్రతిని ఎన్నుకొని సలుకు సలుకు మధ్య 90 సెం. మీ. మొక్కల మధ్య 45 -60  సెం.మీ . దూరంలో విత్తుకోవాలి. విథేముందు ఎకరాకు 150  కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ దుక్కి మీద చల్లి ఎత్తుకుంటే పైరుకు అవసరమైన భాస్వరం లభ్యమవుతుంది. విత్తిన వెంటనే ఎకరాకు 1  లీటరు చొప్పున పెండిమిథాలిన్ (స్టాంప్, పెండిస్టార్) వంటివి 200  లీటర్ల నీటిలో కలిపి పీచికారీ చేసుకుంటే కలుపును మొలిచే దశలోనే నివారించవచ్చును.

రంగయ్య :- చాల విషయాలు చెప్పారండి , వారిని మేమందరం వేదపద్ధతిలోనే పండిస్తాము.

వ్యవసాయ అధికారి :- చివరిగా ఓ సలహా, పప్పు ధాన్యాన్ని అధికంగా ఉత్పత్తి చేయవలసిన అవసరం వుంది. అందుకు గాను. ప్రతి చుట్టూ నాలుగు వరసల కంది వితంది. అలాగే గలాటా మీద , ప్రపత్తి, జొన్న, మొక్కజొన్నలో అంతర పంటగా పండిట్స్తె ఇంటి అవసరాల కన్నా కెనడిపప్పు పనికొస్తుంది కదా ! ఏమంటారు?

లక్ష్మయ్య :- మీరు చెప్పిన ఐడియా బాగుంది. అలాగే చేస్తాం .

ఆధారము: అగ్రికల్చర్ గేట్వే.బ్లాగ్ స్పాట్.ఇన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate