অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయంపై అపోహలెందుకు?

రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేసే వ్యవసాయ పద్ధతులనేకం ఉన్నాయి. ఈ పద్ధతులను అవలంబిస్తున్న వ్యక్తులు, సంస్థల మధ్య వ్యవసాయంలో రసాయనాల అవసరం లేదనటం వంటి కొన్ని అంశాలపై ఏకీభావం ఉన్నప్పటికీ.. మరికొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. పరస్పర అపనమ్మకాలను, అపోహలను పక్కన పెట్టి.. అనుభవాలను కలిసి పంచుకుంటే సేంద్రియ వ్యవసాయం దిశగా వేగంగా మార్పు వస్తుందంటున్నారు డాక్టర్ జీ వీ రామాంజనేయులు.

హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తర్వాత, భారత దేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక(రసాయనిక) వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తెరిగి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ఆహార పదార్థాల్లో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది.

అయితే, సేంద్రియ వ్యవసాయం చేయటానికి అవసరమైన వనరులున్నాయా? అని ఒక వైపు, సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం? అని ఇంకొక వైపు ప్రచారాలు సాగటంతో అటు రైతుల్లోను, ఇటు వినియోగదారుల్లోను కొన్ని అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.

సేంద్రియ వనరులున్నాయా?

సేంద్రియ పద్ధతుల్లో పేడని కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ అందించే రసాయన పదార్థంగా చూడకుండా, గాలి నుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపంలో స్థిరీకరించే సూక్ష్మజీవులను అందించే వనరుగా చూస్తాం. ఈ సూక్ష్మజీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటంలో సహాయం చేస్తాయి. వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి. దానికి తోడు భూమిలో వుండి.. వాడుకోదగిన రూపంలో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. అయినా కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్‌ల గురించి ఆలోచించినా, దేశంలో పంట వ్యర్థాలు, పశువుల పేడ రూపంలో చాలానే దొరుకుతాయి. అయితే వీటిని సేకరించటంలో సమస్యలు, ఖర్చులు, శ్రమ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడీ (2014లో అది 70 వేల కోట్లు వున్నది. అప్పటి నుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు)లో కొంత భాగాన్ని రైతులకు నేరుగా సబ్సిడీల రూపంలో అందించవచ్చు.

దేశీ ఆవు లేకపోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?

దేశీ ఆవు పేడ మాత్రమే వాడాలనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంది. మిగతా జీవాలు వున్నా వాటి పేడ ఉపయోగపడదేమో అని చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి భయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా.. గడ్డి, పచ్చిరొట్టల మీద ఎక్కువగా ఆధారపడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే, కష్టమైన వాతావరణంలో కూడా దేశీ ఆవు తట్టుకుంటుంది కాబట్టి, కొత్తగా పశువులు కొనుక్కునే వాళ్లు దేశీ ఆవును కొనుక్కుంటే మంచిది. మార్కెట్‌లో దొరికే బయో ఫెర్టిలైజర్లన్నిటిలో ఉన్న సూక్ష్మజీవులు పశువుల పేడలో ఉన్నవే.

వర్మీ కంపోస్ట్ ప్రమాదకరమా?

వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) భూమిలో భారలోహాలను పెంచుతుంది, అసలు వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అనే అభిప్రాయం ఉంది. ఇది పూర్తిగా అపోహే. వానపాములలో భూమిపైన పాకేవి, భూమి లోపలికి తొలుచుకు వెళ్లేవి అని.. ప్రధానంగా రెండు రకాలుంటాయి. భూమిలోకి తొలుచుకు వెళ్లే వానపాములను వాడితే కంపోస్ట్ గుంతలో నుంచి భూమిలోకి వెళ్లిపోతాయి కాబట్టి.. నేలపైన పాకే వాటిని వాడతారు. మన దేశంలో సుమారు మూడు వందల రకాల వానపాములు ఉన్నాయి. అందులో కొన్ని పైన పాకేవి, ఇంకొన్ని భూమిలోకి తొలుచుకు వెళ్లేవి. ఈ వానపాములు భార లోహాలను పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్థాలలో అప్పటికే ఉన్న భార లోహాలే కంపోస్ట్‌లోకి వస్తాయే గానీ.. వానపాములు కొత్తగా భార లోహాలను తయారు చేయవు. పంట వ్యర్థాలు కంపోస్ట్‌గా మారే క్రమంలో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది. కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. అంటే.. కంపోస్టు చేయకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) చేసినా లేక భూమిలో కలిపి దున్నినా ఇదే జరుగుతుంది.

సేంద్రియ వ్యవసాయంలో అసలు సమస్యలే లేవా?

సేంద్రియ వ్యవసాయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు.. నాణ్యతా ప్రమాణాలు పాటించటంపై సేంద్రియ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిలో కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రత్యామ్నాయంగా పీజీఎస్ లాంటి వాటి ద్వారా సర్టిఫికేషన్ పొందవచ్చు.

కాబట్టి, అపోహలను పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా, స్థానికంగా దొరికే వనరులతో చేపట్టే సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లే దిశగా రైతులు ప్రయత్నం చేయవచ్చు. అలాగే పరస్పర అపనమ్మకాలను పక్కన పెట్టి, వివిధ జీవావరణ వ్యవసాయ (ఎకలాజికల్ ఫార్మింగ్) పద్ధతులను ప్రోత్సహిస్తున్న సంస్థలు/వ్యక్తులు తమ అనుభవాలను కలిసి పంచుకుంటే.. అందరి విజ్ఞానం పెంపొందుతుంది. ఇటువంటి మార్పును వెతుకుతున్న రైతులతో పాటు ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించగలిగితే.. సేంద్రియ వ్యవసాయం దిశగా త్వరితగతిన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

సంచుల్లో సేంద్రియ సేద్యం’!

తక్కువ స్థలంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలను ఏ కాలంలోనైనా సాగు చేయడానికి ఉపకరించేదే ‘సంచుల్లో సేంద్రియ సేద్యం’!. సేంద్రియ ఎరువులు కలిపిన మట్టిని ఖాళీ సంచుల్లో నింపి.. తక్కువ స్థలంలోనే ఏడాది పొడవునా సులభంగా ఇంటిపంటలు పండించడమే ‘సంచుల్లో సేంద్రియ సేద్యం’ (కల్టివేషన్ టవర్స్ అని కూడా అంటున్నారు). ఈ సంచుల పైభాగంలో, సంచికి చుట్టూ గాట్లు పెట్టి ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. పోషకాహార భద్రత కల్పించే లక్ష్యంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని పేద కుటుంబాలకు ఇంటికి 8-10 సంచులను పంచారు. తక్కువ ఖర్చుతో కుటుంబానికి సరిపడా కూరగాయలు పండించుకునేందుకు ఇవి ఉపయోగపడ్డాయి. ఈ ప్రాజెక్టు నెదర్లాండ్స్‌కు చెందిన హివోస్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు-2014ను దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇటీవల ప్రశంసాపత్రంతోపాటు

రూ. 5.23 లక్షల నగదునూ నిర్వాహకులకు ఇచ్చారు. వీటిని మరింత మందికి అందించే మార్గాలను అన్వేషించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.

ఇంటిపంటలు - సమ్మర్ కేర్! జీవామృతం మొక్కలకు ‘సమ్మర్ టానిక్’

మార్చి వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇంటిపంటల సాగుదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఎండబారిన పడకుండా చక్కని దిగుబడులు చేతికొస్తాయంటున్నారు శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ (83329 45368).

ఇంటిపంటలను ఎండ దెబ్బ నుంచి రక్షించుకోవాలంటే మొదట చేయాల్సిన పని షేడ్‌నెట్ వేసుకోవటమే. 70% సూర్యరశ్మిని వడకట్టి 30% ఎండను మాత్రమే మొక్కలకు అందించే షేడ్‌నెట్‌తో రక్షణ కల్పించడం ఉత్తమం. ఎండాకాలంలో మొక్కలకు పచ్చిపేడ లేదా పూర్తిగా ఎండని పశువుల ఎరువు వేయకూడదు. వీటిని వేస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వేడి పుట్టి మొక్కలకు హాని కలుగుతుంది. అమ్మోనియా విడుదలవుతుంది (కూరగాయలు, ఆకుకూరలు అమ్మోనియా వాసనొస్తాయి). ఈ-కొలై బాక్టీరియా కొంతమేరకు విడుదలవుతుంది. కనీసం 6 నెలలు మాగిన పశువుల ఎరువు ఉత్తమం. ఒకసారి పూర్తిగా ఎండి.. తర్వాత తడిస్తే పర్వాలేదు.
కుండీలు / మడుల్లో అంగుళం లోతు మట్టిని పక్కకు తీసి.. పశువుల ఎరువు లేదా ఘనజీవామృతం తగిన మోతాదులో వేసి.. ఆ తర్వాత మట్టిని వేసుకోవాలి. మట్టిపైనే వేస్తే ఉపయోగం ఉండదు. ఎండ వేళల్లో మట్టిని కదిలించకూడదు.

కుండీలు, మడుల్లో పెరిగే మొక్కల చుట్టూతా మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) వేసుకోవాలి. ఇది పంటలను ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఎండుగడ్డి, ఎండాకులు, చిన్నాచితకా పుల్లలు, రెమ్మలు, ఎండిన పూలు.. ప్లాస్టిక్ కాని ఏ సేంద్రియ పదార్థాన్నయినా మల్చింగ్‌కు ఉపయోగించవచ్చు. కూరగాయ మొక్కల చుట్టూ వత్తుగా ఆకుకూరలు వేసుకోవచ్చు.

కుండీల్లో పెరిగే మొక్కలకు నేల మీద, మడుల్లో పెరిగే మొక్కలకన్నా ఎండ బెడద ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ కుండీలకన్నా మట్టి, సిమెంట్ కుండీలు ఉత్తమం. రోజుకు రెండుసార్లు తగుమాత్రంగా నీరు పోయాలి. డ్రిప్ వేసుకుంటే నీరు సద్వినియోగమవుతుంది.
మొక్కల వేసవి తాపాన్ని తగ్గించి, జీవశక్తినివ్వడంలో జీవామృతం పిచికారీ చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. వారం- పది రోజులకోసారి పిచికారీ చేయాలి. పత్రరంధ్రాల నుంచి తేమ ఎక్కువగా ఆవిరైపోకుండా జీవామృతం కాపాడుతుంది. అంతేకాదు.. మొక్కలకు బలవర్థకమైన సమ్మర్ టానిక్‌లా ఉపయోగపడుతుంది. వాతావరణ సంబంధిత వత్తిడిని తగ్గిస్తుంది. ఇంటిపంటలే కాదు పొలాల్లో పంటలపైనా పిచికారీ చేయొచ్చు.

ఆశల సేద్యంలోనూ అవనిలో సగం!

సేంద్రియ పత్తిలో లాభదాయకంగా అంతరపంటల సాగు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళా రైతుల విజయగాథ

మెట్ట సేద్యం అనగానే అప్పులు.. రైతులనగానే ఆత్మహత్యలు.. ఆత్మహత్యలనగానే పురుగుమందులు.. పత్తి పంట.. చటుక్కున మనసులో మెదలటం పరిపాటైపోయిన రోజులివి...! ‘ప్రాణాలు తీసే పంట’గా పేరు పడిన పత్తిని సేంద్రియ సాగు పద్ధతులతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతులు మచ్చిక చేసుకున్నారు! సేంద్రియ పత్తితోపాటు ఆహార పంటలనూ కలిపి పండిస్తూ.. ఆర్థిక భద్రతతోపాటు ఆరోగ్య భద్రతనూ పొందుతున్నారు. సంఘటిత స్ఫూర్తితో బతుకును పండించుకుంటున్నారు.

అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగయ్యే కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటైతే.. తెలంగాణలో అత్యధికంగా పత్తి సాగయ్యే జిల్లా ఆదిలాబాద్. ఈ జిల్లాలోని ఆదివాసీ మహిళా రైతులు పత్తి రైతులకు ఉరి పేనుతున్న సమస్యలను సంఘటిత శక్తితో అధిగమిస్తున్నారు. రైతుకు, భూమికి నష్టదాయకంగా పరిణమించిన రసాయనిక సేద్యాన్ని, పొలమంతటా ఒకే (ఏక) పంటను పండించే పద్ధతిని, అన్నదాతల మధ్య అనైక్యతను.. మొక్కవోని సహకార స్ఫూర్తితో తుత్తునియలు చేస్తున్నారు. కెరమెరి మండలం చౌపన్‌గైడలో పదేళ్ల క్రితం ఈ సాగుకు అంకురార్పణ జరిగింది. సహకార సంఘాల ద్వారా ఏకమైన చిన్న, సన్నకారు ఆదివాసీ రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను క్రమంగా అలవర్చుకున్నారు.

పత్తితోపాటే ఆహార పంటల సాగు

దేశవాళీ (నాన్ బీటీ) పత్తి విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కషాయాలు వాడుతున్నారు. ఆదాయం కోసం పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తూనే.. పత్తి సాళ్ల మధ్యలో కుటుంబ పోషణకు ఉపయోగపడే కూరగాయ పంటలు పండించుకుంటున్నారు. 8 పత్తి సాళ్లకు ఒక సాలు చొప్పున కూరగాయలు, పప్పుదినుసులు సాగు చేస్తున్నారు. సగటున పొలంలో 25% విస్తీర్ణం మేరకు అంతరపంటలు, 75% వరకు పత్తి వేస్తున్నారు. తమ జీవనం కొనసాగించేందుకు భూమిపైనే ఆధారపడుతూ, ఆ భూమి నిస్సారమైపోకుండా, కోల్పోయిన సారాన్ని తిరిగి సమకూర్చుకునేందుకు ఉపయోగపడే సేంద్రియ సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే రసాయనిక వ్యవసాయం చేసే రైతులకన్నా ఎక్కువ దిగుబడితోపాటు, ఎక్కువ నికరాదాయాన్నీ పొందుతున్నారు.

‘చేతన’ గొడుగు కింద..

ఆదిలాబాద్ జిల్లా కెరమెరి పరిసర మండలాల్లో 423 మంది మహిళా ఆదివాసీ రైతులు దేశీ పత్తితోపాటు కూరగాయలు పండిస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. చేతన ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ గొడుగు కింద ఉన్న 154 రైతు బృందాల్లో 2 వేలకు పైచిలుకు రైతులతోపాటు ఈ మహిళా రైతులు కలసి కట్టుగా కదులుతూ ఆదాయ భద్రతను పొందుతున్నారు. కలకత్తాకు చెందిన రాజ్యలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు ప్రతి ఏటా వీళ్ల దగ్గర సేంద్రియ పత్తిని కొనుగోలు చేస్తోంది. తొలుత నెదర్లాండ్ ఈటీపీ సంస్థ మూడేళ్ల పాటు తోడ్పడింది. 2007లో చేతన ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ రిజిస్టరైంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి సేంద్రియ పత్తి రైతు అయిన ఆత్రం కుసుంభరావు (94411 38 567) సారథ్యంలోనే అసోసియేషన్ నడుస్తోంది. ‘రైతులకు నాన్‌బీటీ పత్తి విత్తనాలు, సాగు సలహాలందించడంతోపాటు సేంద్రియ సర్టిఫికేషన్, మార్కెట్ సదుపాయం వరకు అసోసియేషనే చూసుకుంటుంద’ని ఫీల్డ్ సూపర్‌వైజర్ ఎస్. అంబాదాస్ (81797 60042) తెలిపారు.

సగం ఖర్చుతోనే సేంద్రియ సాగు

ఈ అసోసియేషన్ నేతల సమాచారం మేరకు.. కెరమెరి పరిసరాల్లో రసాయనిక వ్యవసాయంలో పత్తి సాగు చేసే రైతు ఎకరానికి ఏడాదికి రూ. 15-20 వేలు ఖర్చవుతుంటే.. సేంద్రియ పత్తి సాగుకు రూ. 5-10 వేలకు మించడం లేదు. ఈ ఏడాది తక్కువ వర్షం వల్ల ఎకరానికి 4, 5 క్వింటాళ్ల సేంద్రియ పత్తి దిగుబడి వచ్చింది. మామూలు పత్తి క్వింటాలుకు రూ.3,800-రూ. 4,000 ధర వచ్చింది. సేంద్రియ పత్తికి రూ. రూ. 4,200 వరకు వచ్చింది. కొన్న ప్రతి క్వింటాలో పత్తికి రూ. 300 చొప్పున అసోసియేషన్‌కు ప్రీమియంగా కంపెనీ చెల్లిస్తుంది. ఈ డబ్బుతో రైతులకు శిక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆదివాసీ మహిళా సేంద్రియ రైతు సిడాం భీంబాయి(కెరమెరి మండలం భీమన్‌గోంది) 2006లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా బిర్లా సైన్స్ ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు. భీంబాయి బాటలో వందలాది మహిళా రైతులు నడుస్తుండటం విశేషం. బడుగు రైతులు ఏకతాటిపైకి వచ్చి సేంద్రియ సేద్యం చేపడితే బతుకు ఎలా బాగుపడుతుందో వీరిని చూస్తే అర్థమవుతుంది.
- కెరమెరి, ఆదిలాబాద్ జిల్లా

పదేళ్ల నుంచి సేంద్రియ పంటలు..!

నాకు ఆరెకరాల సాగు భూమి ఉంది. పదేళ్ల నుంచి సేంద్రియ పంటలు పండిస్తున్నా. దిగుబడి, ఆదాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం వర్షం తగ్గినా ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి పండింది. క్వింటాలోకు రూ. 4,200 ధర పలికింది.
- కుర్సెంగ మారుబాయి, పెద్దసాకడ, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా

ఎన్నడూ నష్టం రాలేదు!

సేంద్రియ పంటను పదేళ్ల నుంచి చేస్తున్న. ఏ సంవత్సరం కూడా నష్టం జరగలేదు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్న.
- సిడాం భీంబాయి, భీమన్‌గోంది,
కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా

సేంద్రియ పంటకు అధిక ధర

నాకు ఆరెకరాల భూమి ఉంది. చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్న. ఏడేళ్లుగా పత్తి పండిస్తున్నా. ఎకరానికి ఐదు క్వింటాళ్ల పత్తి పండుతుంది. బయటి ధరకంటే సేంద్రియ పంటకు ధర అధికంగా ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 40 వేల నికరాదాయం వస్తోంది.
- సోయం మారుబాయి, బాబేఝరి, కెరమెరి మండలం, ఆదిలాబాద్ జిల్లా

పత్తిలో అంతర పంటలు..

నాన్ బీటీ పత్తి పంటలోనే కంది, పెసర, మినుము, బొబ్బర్లు, జొన్న, మొక్కజొన్న, మినుములు వంటి అంతర పంటలు వేస్తున్నాం. సేంద్రియ పంటల వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం.
- ఆత్రం సోంబాయి, ఢబోలి,
జైనూర్ మండలం,
ఆదిలాబాద్ జిల్లా.

వేసవి నువ్వులు!

రబీ వరి కోతల తర్వాత నువ్వు సాగు
ఎకరానికి రూ. 3 వేల పెట్టుబడి.. సుమారు రూ. 50 వేల ఆదాయం

గుంటూరు జిల్లా రుపెంగుంట్ల గ్రామానికి చెందిన తొండపి గురవయ్య నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే అన్నదాత. గతంలో వినూత్నమైన గొర్రును తయారు చేసి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఆయన ఇప్పుడు వినూత్న పద్ధతిలో నువ్వుల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు సాధారణంగా ఖరీఫ్ వరి కోతల తర్వాత పొలాన్ని దున్నకుండానే జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న, పెసర, మినుము, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేస్తుంటారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కలుపు ప్రధాన సమస్య. కాలువల కింద సాగయ్యే పొలాల్లో రబీ వరి తర్వాత నువ్వుల విత్తనాలు చల్లితే కలుపు సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చునని గురవయ్య భావించారు. ఎందుకంటే వేసవిలో కలుపు సమస్య పెద్దగా ఉండదు. పైగా భూమిలో తేమ కూడా ఉండదు. కలుపు, తేమ లేకుంటేనే నువ్వుల పంట తొలి దశలో బాగా ఎదుగుతుంది. రోహిణి కార్తె ప్రవేశించిన తర్వాత కురిసే వానలు ఎదుగుతున్న పంటకు ప్రాణం పోస్తాయి. పైగా ఆయన నివసించే ప్రాంతంలోని భూములకు వేసవిలో కాలువల ద్వారా నీరు అందుతుంది. ఆ నీటితో కీలక దశల్లో ఒకటి రెండు తడులు ఇవ్వవచ్చు. ఇంకేం? పంట ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

రబీ వరి కోతలకు 15 రోజుల ముందు గురవయ్య తన పొలంలో ఎకరానికి 2 కిలోల నువ్వుల విత్తనాలు చల్లారు. మాగాణి భూమిలో ఉన్న తేమతో అవి బాగా మొలకెత్తాయి. రోహిణి కార్తె సమయంలో కురిసిన జల్లులతో ఏపుగా ఎదిగాయి. 90 రోజుల వ్యవధిలో మూడు నాలుగు సార్లు వర్షాలు పడ్డాయి. జూలైలో పూత వచ్చింది. ఆగస్ట్‌లో పంట కోశారు. పంటకాలంలో ఆయన ఎకరానికి కేవలం ఒకే ఒక యూరియా బస్తా వేశారు. అది కూడా వర్షం పడినప్పుడే. చీడపీడల నివారణకు విత్తనాలు వేసిన 50-60 రోజుల తర్వాత రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. కోత ఖర్చు తప్పించి పెద్దగా అయిన పెట్టుబడేమీ లేదు. ఎంత ఎక్కువ ఖర్చు చేసినా ఎకరానికి మూడు వేల రూపాయలకు మించి పెట్టుబడి అవసరం లేదు. వాతావరణం అనుకూలించి, అంతా బాగుంటే ఎకరానికి 7 బస్తాల (బస్తాకు 75 కిలోలు) నువ్వుల దిగుబడి వస్తుంది. ఒక్కో బస్తా రూ.7 వేలు పలుకుతోంది. అంటే రూ. 3 వేల పెట్టుబడికి రూ. 49 వేల ఆదాయమన్నమాట! తక్కువలో తక్కువ 2 బస్తాలకు తగ్గదు.

2009 నుంచే గురవయ్య ఈ ప్రయోగం చేస్తున్నారు. అయితే కాలువలకు నీరు బాగా అంది రబీలో వరి వేసిన సందర్భంలో మాత్రమే ఆయన కోతల తర్వాత నువ్వులు చల్లుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోయినా, పంటకు నీరు అందకపోయినా దిగుబడులు తగ్గుతాయి. ఇది ఏ పంటకైనా తప్పదు కదా? గురవయ్య ప్రయోగాన్ని గుంటూరు లాం శాస్త్రవేత్తలు పరిశీలించి, ఆయనపై ప్రశంసలు కురిపించారు.

Basmati Rice : బాసుమతితో బాగుపడదాం!

అందరూ మక్కువగా ఆరగించే బాసుమతి సాగు చలి తీవ్రంగా ఉండే ఉత్తరాదికే పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు ఖరీఫ్, రబీలలోనూ పండిస్తున్నారు. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా ఎకరాకు 30 బస్తాలకు మించిన దిగుబడి వస్తోంది. బాసుమతి రైస్ మిల్లుల నిర్మాణానికి ప్రభుత్వం తోడ్పడితే మేలంటున్నారు దాసరి ఆళ్వార్‌స్వామి.

వరి వంగడాల్లో రారాజైన బాసుమతి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. బాసుమతి బియ్యం మన దేశంలో 55 లక్షల టన్నులు పండుతుంటే.. 40 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. పదేళ్లక్రితం సంపన్నులు మాత్రమే సువాసనలు వెదజల్లే బాసుమతి బియ్యాన్ని విందుభోజనాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు మధ్యతరగతి వారు సైతం ఏ చిన్న శుభకార్యం జరిగినా కిలోకు రూ.150 చెల్లించడానికీ వెనకాడటం లేదు. బాసుమతి వరి ధాన్యాన్ని మంచు, చలి ఎక్కువగా ఉన్న రోజుల్లోనే, ఉత్తరాదిలోనే సాగు చేయాలని అపోహపడేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్టాల్లో కూడా సాగులోకి రావటమే కాకుండా మంచి దిగుబడినిస్తుండటం విశేషం.

ఏ సీజన్‌లోనైనా 30 బస్తాల దిగుబడి

తెలంగాణ జిల్లాల్లోనూ, కృష్ణా జిల్లాలోనూ గత మూడేళ్లుగా ఖరీఫ్‌లోనే కాదు, రబీలోనూ బాసుమతిని సాగుచేసి 35 బస్తాలకు మించి దిగుబడి సాధించిన అభ్యుదయ రైతులున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటితే ఏప్రిల్ నెల్లో కోతకు వస్తుంది. మండు వేసవిలో కోతకోసి, నూర్పిళ్లు చేసినా ఎకరానికి 35 బస్తాల దిగుబడి వస్తోంది. 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా 30 బస్తాలకు మించిన దిగుబడి వస్తోంది. మంచి ధర కూడా వస్తోంది. ఉత్తరప్రదేశ్ వెళ్లొచ్చాక 2014లో కృష్ణా జిల్లా కుందేరులోని మా పొలంలో బాసుమతి సాగు ప్రారంభించాను. నత్రజని ఎరువు తక్కువగా వాడి, నీరు తక్కువగా పెట్టాను. రసాయనిక పురుగుమందులు వాడలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించా. బాసుమతి సాగుపై నాకున్న అనుమానాలన్నీ తీరిపోయాయి.

ఒక్కో మొక్కే నాటాలి

బాసుమతి సాగు చేపట్టాలనుకునే రైతులు విధిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 20 రోజుల నారు నాటుకోవాలి. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గుతుంది. చదరపు మీటరుకు 20 మొక్కలు నాటడం శ్రేయస్కరం. దగ్గరగా నాటితే పిలకల సంఖ్య తగ్గటంతోపాటు, సూర్యరశ్మి, గాలి, వెలుతురు మొక్కలన్నింటికీ సోకక కొన్ని పిలకలు చనిపోతాయి. ఒక్కో మొక్కని, భూమి పైభాగంలో నాటాలి. ఒక మొక్క నాటితే పొలంలో వెన్నుల సంఖ్య, దిగుబడి తగ్గుతుందనే భయం రైతులకు సహజం. ఒకే మొక్కను నాటినా, 15 పిలకలు పెడుతుంది. 30 నుంచి 40 పిలకలు పెట్టే అవకాశాలూ ఉంటాయి. ప్రతి దుబ్బు నుంచి 15 కంకులొస్తే మంచి దిగుబడులు వస్తాయి. బాసుమతికి నత్రజని ఎరువులు తగ్గించి వాడాలి. డి.ఎ.పి. లేదా 10:26:26 లాంటి కాంప్లెక్స్ ఎరువులను తగు మాత్రంగా వాడాలి. ఊడ్చిన వారం, పది రోజుల్లోపలే కాంప్లెక్స్ ఎరువులు వేయటం శ్రేయస్కరం. నాటు సమయం నుంచి పొట్ట ఏర్పడే వరకు దఫదఫాలుగా పొటాష్ అందించడంతో దిగుబడి పెరిగింది. పొటాష్ వాడకం వల్ల చీడ-పీడల బెడద గణనీయంగా తగ్గుతుంది.

పది రోజులకోసారి ఎండగట్టాలి!

బాసుమతి వరికి సాధ్యమైనంత వరకు తక్కువ నీరందించాలి. పొలంలో 2 అంగుళాల లోతుకు మించి నీరు పెట్ట కూడదు. నాట్లు వేసినప్పటి నుంచి కోతలు పూర్తయ్యే వరకు ఇంతే. ఎక్కువ లోతు నీరు నిల్వ ఉంచినపుడు లేత పిలకలు కొన్ని నీటిలో కుళ్లిపోవటం గమనించాను. బయటకు వచ్చిన పిలక సజావుగా ఎదగాలంటే, నీటిలో మునగ కూడదు. వారం, పది రోజుల వ్యవధిలో పొలాన్ని ఆరబెట్టాలి. వీలైతే పొలం భూమి నైట్టే వరకు ఎండ బెట్టాలి. దీనివల్ల పిలకల సంఖ్య గణనీయంగా పెరిగి.. మంచి దిగుబడి వచ్చింది.

బాసుమతి మిల్లుల్లేక అవస్థలు

ఉత్తర భారతంలో సాధిస్తున్న బాసుమతి దిగుబడులు మనమూ సాధించగలం. అయితే, బాసుమతిని అమ్ముకోవటానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న వసతులు మనకు లేవు. అక్కడకు తీసుకెళ్లి అమ్ముకోవటం వీలు కాదు. మనక్కూడా బాసుమతిని బియ్యంగా మార్చే మిల్లులు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో బాసుమతిని బియ్యంగా మార్చే మిల్లులు అందుబాటులో లేక రైతులు అవస్థ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బాసుమతి మిల్లులు ఏర్పాటయ్యే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతులకు లాభం చేకూరుతుంది.
(వ్యాసకర్త.. రైతు,
ఫ్రీలాన్స్ జర్నలిస్టు,
మొబైల్: 93938 18199)

Subash Palekar - ఆత్మహత్యలను ఆపేది ప్రకృతి సేద్యమే!

పరిహారం పెంపుకంటే అప్పులపాలు కాకుండా చూడటం ముఖ్యం
‘సాక్షి’తో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్

ఆరుగాలం కష్టించి.. చెమట ధారలతో నేలను తడిపి.. సమాజం ఆకలి తీర్చుతున్న అన్నదాతలు అసలైతే సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అయితే, వాస్తవం మరోలా ఉంది. ఎడతెగని అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రభుత్వ పథకాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు.. ఇవేవీ రైతు ప్రాణాలను నిలబెట్టలేకపోతున్నాయి.. సకల వృత్తులకు తల్లి అయిన సంక్షుభిత వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేసి.. రైతులోకానికి తిరిగి జవజీవాలనివ్వటం అసలు సాధ్యమేనా? విష రసాయనిక అవశేషాలతో, పర్యావరణ కాలుష్యంతో జాతి యావత్తునూ రోగగ్రస్తంగా మార్చిన పారిశ్రామిక సేద్య పద్ధతిని ఉన్నట్టుండి మార్చడం సాధ్యమేనా?? సాధ్యమైతే ఎలా??? ఈ ప్రశ్నలన్నిటికీ ఉన్న ఏకైక శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో తప్ప మరెక్కడా లేదంటున్నారు సుభాష్ పాలేకర్. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడైన పాలేకర్ ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

మహారాష్ట్ర కరువు ప్రాంతం విదర్భలో రైతు కుటుంబంలో పుట్టిన పాలేకర్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు. రసాయనిక సేద్యం కొనసాగించే క్రమంలో ఎదురుదెబ్బలు తిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్- జెడ్‌బీఎన్‌ఎఫ్) పద్ధతిని రూపొందించి.. 16 ఏళ్లుగా దేశాటన చేస్తూ రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కర్నూలులో ఈ నెల 25న(ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు) ప్రారంభమయ్యే 5 రోజుల రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వెళ్తూ హైదరాబాద్ వచ్చిన పాలేకర్‌తో ముఖాముఖిలో ముఖ్యాంశాలు...

{పకృతి సేద్యం అవసరమేమిటి?

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రసాయనిక వ్యవసాయ విధానం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, శిలీంద్ర నాశనులు.. అన్నిటినీ అధిక ధరలకు కొనుగోలు చేసి పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. మార్కెట్ మాయాజాలంలో బలిపశువు అవుతున్న రైతు ఎడాపెడా దోపిడీకి గురవుతూ నిరంతరం అప్పుల పాలవుతున్నారు. దారీతెన్నూ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 7 లక్షల మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలే రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. కేన్సర్, మధుమేహం వంటి అనేక దారుణమైన వ్యాధులు విజృంభించడానికీ రసాయనిక వ్యవసాయమే మూలకారణం.

అదెలా?

రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు, నైట్రేట్లు పోగుపడిన ఆహారోత్పత్తులను తిన్న మనుషులు రోగగ్రస్తులవుతున్నారు. ఈ ఆహారంలో సూక్ష్మపోషకాలతోపాటు ఔషధ విలువలు లోపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఆహారంలో పోషకాలతోపాటు ఔషధ విలువలు ఉంటాయి. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంతో ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నాయి. గతంలో ఎరుగని స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి మొండి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. గత మూడేళ్లుగా రుతుపవనాల టైమ్‌టేబుల్ మారటం వల్ల ఖరీఫ్, రబీ పంటల సాగు నెల రోజులు ఆలస్యమవుతోంది. కరువు ప్రాంతాల్లో అధిక వర్షం, వర్షాలు బాగా పడే చోట కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనంతటికీ పరిశ్రమలతోపాటు రసాయనిక సేద్యంతో ఏర్పడే వాయుకాలుష్యమే కారణం. రైతును దోపిడీ నుంచి, వినియోగదారులను విషతుల్యమైన ఆహారం నుంచి రక్షించాలంటే ప్రకృతి సేద్యమే పరిష్కారం.

ప్రకృతి సేద్యంలో మొదటి ఏడాది సరైన దిగుబడి రాదన్న ప్రచారం ఉంది..?

ఇది కొంతమంది చేస్తున్న దుష్ర్పచారం. వెయిటింగ్ పీరియడ్ లేదు. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలన్నిటినీ పూర్తిగా పాటిస్తే మొదటి ఏడాది కూడా దిగుబడి అంతకుముందుకన్నా ఏమాత్రం తగ్గదు.

వేలాది మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు కదా.. రైతుల స్పందన ఎలా ఉంది?

1998 నుంచి దక్షిణాదిలో, మూడేళ్లుగా ఉత్తరాదిలోనూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై రైతులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాం. దేశంలో 40 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ విషపూరితం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తూ సంతోషంగా ఉన్నారు. వీరిలో శిక్షణ పొందిన వారు కొందరే. పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్నవారు కొందరు, పక్కరైతుల పొలాలను చూసి నేర్చుకుని ప్రకృతి సేద్యం చేస్తున్న వారు మరికొందరు. ఆధ్యాత్మిక స్వభావం కలిగిన రైతులు వెంటనే ఈ పద్ధతిలోకి మారుతున్నారు. శిబిరాలకు యువ రైతులు ఎక్కువగా వస్తున్నారు. వీరిలో కనీసం సగం మంది ప్రకృతి సేద్యం చేపడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపిస్తోంది కదా..?

అవును. తెలంగాణ వ్యవసాయ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకుడు తదితర శాస్త్రవేత్తలు ఒకరోజు శిబిరంలో పాల్గొన్నారు. ప్రశ్నలడిగారు. ఈ పద్ధతిలో సాగవుతున్న పంటలు చూశారు. కానీ, తర్వాత మళ్లీ ఎటువంటి స్పందనా లేదు.

{పకృతి సేద్యాన్ని ప్రభుత్వ విధానంగా ప్రకటిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా?

తప్పకుండా. రైతులు విత్తనాలు, ఎరువుల దగ్గర్నుంచీ అన్నీ కొంటున్నారు. తీరా పంట అమ్మబోతే ధర గిట్టుబాటు కావటం లేదు. ప్రకృతి వ్యవసాయంలో దేన్నీ కొనే పని లేదు. ఒక దేశీ ఆవుతో 30 ఎకరాల్లో సేద్యం అన్ని రకాల దోపిడీల నుంచి రైతులను పూర్తిగా రక్షించడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతుల్లో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకపోవటమే ఇందుకు నిదర్శనం. పోషకాలు, ఔషధ విలువలతో కూడిన అమృతాహారాన్ని పండిస్తున్న ఈరైతులకు వినియోగదారులు సంతోషంగా రెట్టింపు ధర ఇస్తున్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు మార్కెటింగ్ సమస్య లేదు. అప్పుల అవసరం లేదు కాబట్టి పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారు. జన్యుమార్పిడి విత్తనాల అవసరం లేదు. స్థానిక విత్తనాలతోనే అధిక దిగుబడి వస్తోంది. అవి కొనాల్సిన ఖర్చుండదు. వరకట్నాలు, ఆర్భాటపు పెళ్లిళ్లకు మేం దూరంగా ఉంటాం. మా ఇద్దరు అబ్బాయిల పెళ్లి సందర్భంగా మేం డబ్బు, బంగారం కూడా తీసుకోలేదు. కాబట్టి అప్పులు చేయాల్సిన పని లేదు. వలస పోవాల్సిన అగత్యం లేదు. ప్రకృతి వ్యవసాయంలో 10 శాతం విద్యుత్, 10 శాతం నీరు సరిపోతాయి. ప్రకృతి వనరుల విధ్వంసం ఆగి భూతాపం తగ్గుతుంది.

సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కదా?

సేంద్రియ సేద్యం రసాయనిక సేద్యం కన్నా ప్రమాదకరం. కంపోస్టు, వర్మీకంపోస్టు, పశువుల ఎరువులో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పొలంలో వేసిన తర్వాత 28 డిగ్రీల సెల్షియస్‌కన్నా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సేంద్రియ కర్బనం విడుదలై.. కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. సేంద్రియ రైతులకు రసాయనిక సేద్యంలో కన్నా ఎక్కువ ఖర్చవుతోంది. ప్రకృతి వ్యవసాయంలో ఈ సమస్యల్లేవు. సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి రుజువు చేసి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. మీ అభిప్రాయం?

ఇది చాలా ప్రమాదకరం. రైతుల అప్పుల బాధను ఈ చర్య శాశ్వతంగా తీర్చలేదు. అప్పుల్లో కూరుకుపోయిన రైతుల మదిలో అలాగైనా పిల్ల పెళ్లి అవుతుందన్న భావన కలిగించే ప్రమాదం ఉంది. అంతిమంగా ఈ చర్య ఆత్మహత్యలకు దోహదం చేసే ప్రమాదం ఉంది. అప్పులు అవసరం లేని ప్రకృతి సేద్యపద్ధతిని అలవాటు చేయడమే వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం.

సంక్షోభాన్ని పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా.

మహిళారైతు భూదేవి- అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి..

ప్రకృతితో, నేలతల్లితో పేగుబంధం తెగిపోకుండా కాపాడుకోవాలన్న తపన పాతూరి క్రాంతిని అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో నిలవనివ్వలేదు. బీటెక్ చదువుకొని డెట్రాయిట్‌లో భర్త ప్రదీప్‌తోపాటు పన్నెండేళ్లు చీకూచింతా లేని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆమె.. 2010లో ఇద్దరు బిడ్డలను తీసుకొని స్వస్థలానికి వచ్చేసి.. వ్యవసాయం చేస్తున్నారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం ఇట్లమామిడిపల్లిలో 35 ఎకరాల భూమి కొని అనేక పంటలు పండిస్తున్నారు.

రైతు కుటుంబంలో పుట్టకపోయినా.. వ్యవసాయ వృత్తిపై యువతలో గౌరవాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఆమె పొలంలో కాలుపెట్టి.. నూతన సాంకేతికతలతో సాంప్రదాయక పద్ధతులను మేళవించి ప్రణాళికాబద్ధంగా విభిన్నమైన పంటలు సాగు చేస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఐదెకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో మామిడి తోట.. అంతరపంటగా జామ సాగు చేస్తున్నారు. కూరగాయలు, అరటి, వరి, మినుము పంటలను సాధ్యమైనంత వరకు రసాయనాలు వాడకుండా పండిస్తున్నారు. చీడపీడలు అదుపు తప్పినప్పుడు తప్ప పురుగుమందులు వాడటం లేదు. స్పెన్సర్స్, మోర్ వంటి సూపర్ మార్కెట్లతోపాటు, తమ ప్రాంతంలోని మెస్‌లకు క్రమం తప్పకుండా వ్యవసాయోత్పత్తులను సరఫరా చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడటం మాని వర్మీకంపోస్టు, జీవామృతం వంటివి సొంతంగా తయారుచేసుకొని వాడితే నష్టాల ప్రసక్తే ఉండదని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఆదాయం వచ్చేలా స్థానిక వాతావరణంతోపాటు మార్కెట్‌కు అనుగుణమైన పంటలు పండించడం క్రాంతి ప్రత్యేకత. ప్రకృతి వనరులను నాశనం చేయకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మేళవించి పంటలు పండించగలిగితే ఆకర్షణీయమైన ఆదాయం కూడా వ్యవసాయంలో పొందవచ్చని ఆమె అంటున్నారు. వ్యవసాయం ద్వారా నిరంతరం ఆదాయం అందాలంటే.. పండ్లతోటలు, వార్షిక పంటలతోపాటు పాడి పశువులు, కోళ్లు, మేకలు గొర్రెలను సైతం శక్తిమేరకు పెంచాలంటారామె.
సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఐదారుగురు కలసి సహకార సంఘంగా ఏర్పడి, మార్కెటింగ్‌పై ఉమ్మడిగా దృష్టిపెడితే ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని వినియోగదారులకు ఏడాది పొడవునా అందించడంతోపాటు.. చక్కటి ఆదాయం కూడా పొందవచ్చని క్రాంతి అంటారు. ఒత్తిడి లేని జీవితమే అసలైన సంతోషాన్నిస్తుందని నమ్మే క్రాంతి.. ఉద్యోగం చేసినప్పటికన్నా మెరుగైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నానని చెబుతున్నారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాల ప్రతి నెలా మూడో శనివారం(ఉదయం 9 నుంచి 4 గంటల వరకు) పుట్టగొడుగుల పెంపకంపై ఒక్కరోజు శిక్షణ ఇస్తోంది. ఫీజు రూ. 500. ఇక్కడ పుట్టగొడుగుల విత్తనం అందుబాటులో ఉంది. కిలో ధర రూ. 100. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవలసిన ఫోన్ నం: 040-24015011, 24015462.

ఒంగోలులో..

ప్రకాశం జిల్లా ఉద్యాన శాఖ పుట్టగొడుగుల పెంపకంపై ప్రతి మంగళవారం (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) శిక్షణ ఇస్తోంది. ఫీజు రూ. 130. వారం రోజులు ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి విత్తనాలు అమ్ముతారు. కిలో రూ. 100. స్థలం: ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఉద్యాన శాఖ కార్యాలయం (రూమ్ నం. 1). వివరాలకు 08592-231518, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు 83744 49166.

Agriculture Tools : అబ్బురపరిచే ఆవిష్కరణలు

పంటల సాగులో విపరీతంగా రసాయనాల వినియోగం వల్ల భూసారం, పర్యావరణం నాశనమవుతోంది. సాగు వ్యయం నానాటికీ పెచ్చుమీరి, దిగుబడులు దిగజారుతున్నాయి. ఈ తరుణంలో.. వ్యవసాయ పద్ధతులను ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో సత్ఫలితాలనిచ్చే, ప్రకృతికి హానిచేయని సాంకేతికతలు, యంత్ర పరికరాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఇటువంటి ఆవిష్కరణలను అందించే శాస్త్రవేత్తలకు, రైతు శాస్త్రవేత్తలకు దేశంలో కొదవ లేదు. అయితే, వీటిల్లో చాలా వరకు రైతులకు చేరకుండానే మరుగున పడిపోతున్నాయి. ఈ సమస్యపై దృష్టిపెట్టిన హైదరాబాద్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్.ఐ.పి. హెచ్.ఎం.) ఈ నెల 4-6 తేదీల్లో జాతీయ స్థాయి ప్రదర్శన, వర్క్‌షాప్‌లను నిర్వహించింది. రైతులను ఆకట్టుకున్న కొన్ని ముఖ్య ఆవిష్కరణల వివరాలను క్లుప్తంగా ‘సాగుబడి’ పాఠకుల కోసం అందిస్తోంది సాక్షి’.

ఏ పంటనైనా విత్తగల డ్రమ్‌సీడర్!


- వరితోపాటు మొక్కజొన్న, అపరాల సాగుకూ ఉపయోగకరం
- విత్తనంతోపాటే గడ్డి మందు, ఎరువులూ వేయగలదు
- ఎన్‌ఐపీహెచ్‌ఎం ప్రదర్శనలో రైతులు, శాస్త్రవేత్తలందరి కళ్లూ దీనిపైనే!

సాధారణ డ్రమ్ సీడర్ వరి విత్తనం వేయడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ బహుళ ప్రయోజనకారి అయిన ఈ డ్రమ్‌సీడర్ వరితోపాటు అనేక ఇతర పంటల విత్తనాలను కూడా విత్తుకోవడానికి ఎంచక్కా పనికొస్తుంది. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త ధమరశింగి బాబూరావు ఈ వినూత్న డ్రమ్ సీడర్‌ను రూపొందించారు. వ్యవసాయదారుడైన బాబూరావు వెల్డింగ్ వర్క్‌షాపును కూడా నిర్వహిస్తున్నారు. 8 అడుగుల వెడల్పున 3 చక్రాలతో కూడి ఉండే ఈ ఇనుప డ్రమ్‌సీడర్ బరువు 48 కిలోలు. ధర రూ. 32 వేలు. దీనితో మొక్కజొన్న(4 సాళ్లు), వరి, వేరుశనగ, అపరాల విత్తనాల(7 సాళ్లు)తోపాటు గడ్డి మందు కూడా వేయొచ్చు. స్వల్ప మార్పులతో ఘన / ద్రవరూప ఎరువులను కూడా విత్తనాలతోపాటే వేసుకోవచ్చు. చక్రాల దగ్గర అటొకరు, ఇటొకరు నిలబడి దీన్ని లాగాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఎద్దును కట్టి లాగించొచ్చు లేదా 3 హెచ్‌పీ కిరోసిన్ ఇంజిన్‌ను బిగించి నడిపించొచ్చు. దీనితో రెండున్నర గంటల్లో ఎకరం పొలంలో విత్తనాలు వేయొచ్చని బాబూరావు తెలిపారు.

వరితోపాటు ఇన్ని రకాల పంటలు విత్తటానికి, ఎరువు, కలుపు మందు చల్లడానికి పనికొచ్చేదీ.. మనుషులు సులువుగా లాక్కెళ్లే వీలుండే ఇంత మెరుగైన డ్రమ్‌సీడర్ దేశంలోనే మరెక్కడా లేదని ఎన్‌ఐపీహెచ్‌ఎం శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. అందువల్లే ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వివిధ రాష్ట్రాల రైతులను ఇది అమితంగా ఆకట్టుకుంది. ‘కూలీల కొరత రైతులను వేధిస్తోంది. రైతు కష్టాలను తగ్గించడం, సాగు ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రయోగాలు చేస్తున్నా. దీని విడిభాగాలుగా విప్పి దాచి పెట్టుకొని.. అవసరమైనప్పుడు తిరిగి సులువుగా బిగించుకోవచ్చు. ఇనుముతో తయారు చేస్తున్నందు వల్ల దీన్ని బరువు 48 కిలోలైంది. స్టీల్‌ను ఉపయోగించి దీని బరువును 20 కిలోలకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు దీన్ని భుజానేసుకొని తీసుకెళ్లొచ్చు. రైతులు, శాస్త్రవేత్తలు మెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది’ అన్నారు బాబూరావు
(94409 40025).

అగ్గిపుల్లే అణ్వస్త్రం!

ఆహార ధాన్యాల నిల్వలో పురుగుల బెడదకు సులువుగా చెక్ బియ్యం/మొక్కజొన్నలు ఇతర ఆహార ధాన్యాల నిల్వలో పురుగులు, ఎలుకల బెడద ఎక్కువ. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఇది తెలిసిందే. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి కొందరు రసాయనిక బిళ్లలను, పొడులను వాడుతుంటారు. బియ్యం వండుకు తినే ముందు కడిగినా ఈ రసాయనాల దుష్ర్పభావం వినియోగదారుల ఆరోగ్యంపై పడక మానదు. ఒంటి పట్టు లేదా ముడి బియ్యానికైతే తెల్లబియ్యం కన్నా తొందరగా పురుగు పడుతుంటుంది. ఈ జటిల సమస్యకు బీహార్ రైతులు చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు. సాధారణ అగ్గిపెట్టెలోని పుల్లలను ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలలో కలిపి.. బస్తాల్లో నిల్వ చేస్తే పురుగులు, ఎలుకల బెడద ఉండటం లేదంటున్నారు. క్వింటాలుకు ఒక అగ్గిపెట్టెలోని పుల్లలు కలిపితే చాలట. ముడి బియ్యంలో రెట్టింపు అగ్గిపుల్లలు కలపాల్సి రావచ్చు. బియ్యం వాడుకునేటప్పుడు అగ్గిపుల్లలను సులువుగా ఏరేయవచ్చు. బీహార్ రైతులు అనేక సంవత్సరాలుగా ఈ పద్ధతిని ఉపయోగిస్తూ కలుషితం కాని ఆహారం తింటున్నారని మహారాష్ట్రకు చెందిన కీటక శాస్త్ర నిపుణుడు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. అవినాశ్ సోలంకి(094222 35816) ‘సాక్షి’తో చెప్పారు. అగ్గిపుల్ల మందులో పొటాషియం క్లోరేట్, రెడ్ ఫాస్ఫరస్ క్రిమిసంహారకాలుంటాయి. ఇవి పురుగులను దరిచేరనీయవని ఆయన అన్నారు.

మందు బిళ్లతో పండీగకు చెక్!

ఉద్యాన పంటల్లో తీవ్ర సమస్యగా మారిన పండీగ(ఫ్రూట్ ఫ్లై)లను అరికట్టడంలో అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే మందు బిళ్ల(ఫ్రూట్ ఫ్లై ల్యూర్ బ్లాక్) అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు దీని రూపకర్త, మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డా. అవినాష్ సోలంకి. దీనిపై కవర్‌ను తొలగించి ఏదైనా డబ్బా లేదా ప్లాస్టిక్ గ్లాస్‌లో ఉంచి తోటలో ఒక చెట్టుకు వేలాడదీయాలి. మరు నిమిషం నుంచే మందు బిళ్లలోని మిథైల్ ఇవోజనల్ అనే రసాయనం వాసనకు పండీగలు మూగి చనిపోతాయని ఆయన చెప్పారు. ఎకరాకు ఒక మందుబిళ్ల సరిపోతుంది. పెట్టిన దగ్గరి నుంచి 90 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని, వర్షానికీ కరగదని అన్నారు డా. సోలంకి. జామ, మామిడిలాంటి అన్ని ఉద్యాన పంటల్లోను దీన్ని వా డిన రైతులు సత్ఫలితాలు పొందారని.. దీన్ని రూ.25కే అందిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు రామస్వామి రాజీవ్(078426 41626 ఇంగ్లిష్ /హిందీ)ని సంప్రదించవచ్చు.

జీవన ఎరువుల తయారీ సులభతరం

జీవన ఎరువుల వినియోగం ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవచ్చు. జీవన శిలీంద్ర నాశకాల ద్వారా చీడపీడలను ప్రకృతికి హాని కలగని రీతిలో నివారించవచ్చు. అజోస్పిరిల్లం, ట్రైకోడెర్మా విరిడి వంటి వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినప్పుడు స్వచ్ఛత, నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా తయారవుతోంది. వీటిని రైతే స్వయంగా, స్వల్ప ఖర్చుతో ఇంటి వద్దే 72 గంటల్లో తయారు చేసుకునే పద్ధతులను, మిత్రపురుగులను పెంపొందించుకోవడాన్ని ఎన్‌ఐపీహెచ్‌ఎం సంస్థ ప్రోత్సహిస్తోంది(రైతుల బృందాలకు ఈ విజ్ఞానాన్ని అందించడానికి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 040 24013346). ఈ పద్ధతులను ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎన్‌ఐపీహెచ్‌ఎం అసిస్టెంట్ డెరైక్టర్ డా. గిరీష్(89787 78704 ఇంగ్లిష్) వివరించారు.

అయితే, జీవన ఎరువులు, జీవన శిలీంద్ర నాశకాలను తయారు చేసుకునే పద్ధతిని విశ్రాంత ఇక్రిశాట్ శాస్త్రవేత్త థామస్ నికోడెమస్(86861 10762 తెలుగు/ఇంగ్లిష్) సులభతరం చేస్తూ ఫెర్మెంటర్ల(విద్యుత్‌తో నడిచే యంత్రాల)ను రూపొందించారు. గ్రామీణ యువత, రైతులు సైతం సులువుగా ఉపయోగించగలిగేలా వీటిని రూపొందించడం విశేషం. 10 లీటర్ల ఫెర్మెంటర్ ధర రూ. 35 వేలు. 20 లీటర్ల ఫెర్మెంటర్ ధర రూ. 80 వేలు. రైతులు, రైతుల బృందాలే కాకుండా జీవన ఎరువులు, క్రిమిసంహారకాల తయారీని స్వయం ఉపాధి కోసం చేపట్టే వారికీ ఫెర్మెంటర్లు ఎంతగానో ఉపకరిస్తాయని థామస్ అంటున్నారు.

రసంపీల్చే పురుగులను మట్టుబెట్టే ‘సోలార్ లైట్ ట్రాప్’

రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు సోలార్ లైట్ ట్రాప్ రైతులకు అందుబాటులోకి వచ్చింది. దీని రూపకర్త తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ శాస్త్రవేత్త డా. అబ్దుల్ ఖాదిర్(094885 91915 తెలుగు, ఇంగ్లిష్). దీన్ని పొలంలో నిలబెట్టి.. దీని కింద అమర్చిన బేసిన్‌లో నీళ్లు పోసి.. అందులో ఏదైనా నూనె , షాంపూ లేదా కిరోసిన్‌లను తగు మోతాదులో వేయాలి. ఇందులో అమర్చిన మైక్రోచిప్ వల్ల సాయంత్రం చీకటి పడే వేళకు ఆటోమేటిక్‌గా లైట్ వెలుగుతుంది. రాత్రి పది గంటలు కాగానే దానంతట అదే ఆగిపోతుంది. ఎల్‌ఈడీ లైట్‌ను అమర్చటం వల్ల ఎక్కువ కాంతి వస్తుంది. దీనికి ఆకర్షితమై వచ్చిన శత్రు పురుగులు బేసిన్‌లో ఉన్న నూనె కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి. తద్వారా తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకోవచ్చు. సౌరశక్తితో చార్జింగ్ అవుతుంది. అన్ని కూరగాయ, వాణిజ్య, ఉద్యాన పంటల్లోను వాడుకోవటానికివీలుగా దీన్ని తయారు చేశారు. నిర్వహణ కూడా సులభం. పర్యావరణ హితమైనది. ఎకరాకు ఒక లైట్ ట్రాప్ సరిపోతుంది. దీని ధర రూ. 2,500.

‘పొదుగువాపు’.. 2 రోజుల్లో పరారీ!

అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సంప్రదాయ పశువైద్యుడు బోయ పెద్దరాజన్న తయారు చేసిన పొదుగువాపు వ్యాధిని పారదోలే మూలికల పొడిని పల్లెసృజన సంస్థ (040-27111959) ప్రదర్శనకు ఉంచింది. ఈ మందును వేడినీటిలో కలిపి రెండు రోజులు పొదుగుకు పట్టిస్తే పొదుగు వాపు పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు. నరాల వ్యాధితో కాళ్లు చచ్చుబడిపోయే (కుందా) వ్యాధి మందు కూడా ఉంది. చిన్న రైతులకు ఉపయోగపడే సోలార్ స్ప్రేయర్ తదితర పరికరాలను సైతం ఈ సంస్థ ప్రదర్శనకు ఉంచింది.

మిత్రపురుగులే రైతు సైన్యం!

రాజు యుద్ధంలో తుది అస్త్రంగా సైన్యాన్ని ప్రయోగిస్తాడు. వ్యవసాయంలో కూడా అంతే.. రైతు పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలేవీ ఫలించని స్థితిలో ఇక మిగిలింది ప్రకృతిసిద్ధమైన మిత్రపురుగుల సైన్యాన్ని ప్రయోగించడమే. కొద్ది నెలల క్రితం ‘సాక్షి’ సాగుబడి పేజీలో మా సంస్థ గురించి రాస్తూ ‘మిత్రపురుగులే రైతు సైన్యం’ శీర్షిక నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అధికారులు, రైతులతో సమావేశమైన ప్రతిసారీ ఈ శీర్షికను ప్రస్తావిస్తున్నా.
- డాక్టర్ కె.సత్యగోపాల్, డెరైక్టర్ జనరల్,
జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపీహెచ్‌ఎం),
రాజేంద్రనగర్, హైదరాబాదు.

వ్యర్థాలతో అందమైన తోట

పనికిరాని వస్తువులను ఉపయోగించి ఇంటిపంటలు సాగు చేస్తున్నారు నివేదిత. ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటిపంటల పెంపకానికి కావేవీ అనర్హం అంటున్నారామె.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన సురవరం నివేదిత(9490952201)కు కాలేజీ రోజుల నుంచి మొక్కల పెంపకం హాబీ ఉంది. ఆ ఆసక్తితోనే పాత వస్తువులను వృథాగా పారేయకుండా సృజనాత్మకంగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. పాత డబ్బాలు, మగ్గులు, టీ జార్‌లు, కూల్ డ్రింకు బాటిళ్లు , టైర్లు, టిన్నులు, షూలు, కుండలు, తినుబండారాల పార్శిల్ పాత్రలు, పైపులు, బూట్లు, సాక్స్‌లు, పాత టీవీల క్యాబినెట్లు, ట్రాన్సిస్టర్ క్యాబినెట్లు, నీళ్ల డ్రమ్ములు, సీడీల పార్శిల్ డబ్బాలు, విద్యుత్ బల్బులు.. ఇలా సుమారు రెండు వందల వరకూ పనికిరాని వస్తువుల్లో ఇంటిపంటలను పండిస్తున్నారామె. పాత డబ్బాలకు రంగులేసి, బొమ్మలు వేసి ఇంటిపంటలకు సిద్ధం చేస్తారు. స్వతహాగా పెయింటర్ అయిన ఆమె సంప్రదాయ, ఆధునిక, మధుబని, ట్రైబల్ పెయింటింగ్స్‌ను మొక్కల కుండీలపై చిత్రిస్తుంటారు. చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండించడాన్ని కుటుంబ సభ్యులతోపాటు అతిథులూ అభినందిస్తున్నారని, పరిసరాలను మరింత అందంగా మార్చుకోవటం ద్వారా మనోల్లాసం కలుగుతున్నదని ఆమె తెలిపారు.
‘పెద్ద బకెట్లు, పాత్రలు వంటి వాటిలో కరివేపాకు, మిరప, వంగ, టమాటా వంటి మొక్కలు పెట్టాలి. సన్నగా, పొడవుగా ఉండే పైపుల్లో కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు పెంచాలి. మొక్కల ఆకులు, ఇంట్లో కూరగాయ వ్యర్థాలతో తయారైన కంపోస్టు, పశువుల ఎరువు, టీ పౌడర్ వంటి వాటిని కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నా’ అన్నారామె.

రోజువారీ పనులకు అడ్డం రాకుండా గదుల్లో, హాలులో, కిటికీల బయట, మెట్ల దగ్గర, ప్రహరీ గోడలకు వేలాడ దీసేలా పాత వస్తువులతో కుండీలను రూపొందించడం నివేదిత ప్రత్యేకత. స్థలం కలిసి రావాలంటే ఒకే పొడవాటి తాడుకు కట్టి ఒకదాని వెంట ఒకటి ఒకే వరుసలో పైనుంచి కింద వరకూ వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పెంచవచ్చు. కుటుంబానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్లో సగం వరకు తాను ఇలాగే పెంచుతున్నారు.

‘శని, ఆదివారాలు పూర్తిగా ఇంటిపంటలకే కేటాయిస్తున్నా. అపార్ట్‌మెంట్లు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లలో ఈ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. స్నేహితుల కోరిక మేరకు శుభకార్యాల సందర్భంలోనూ సృజనాత్మక ఇంటిపంటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నా. ఇవి చూసి కొందరు ఇంటిపంటల సాగు ప్రారంభిస్తున్నారు. ఈ పంటలను చూసినప్పుడల్లా వాళ్లు నన్ను తలుచుకుంటారనే భావన ఎంతో సంతోషం కలిగిస్తోంది’ అంటున్నారు నివేదిత.

చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ శిబిరం కర్నూలు నగరం (ఎస్‌ఎస్‌ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు)లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు జరగనుంది. 3 ఎకరాలకన్నా తక్కువ పొలం ఉన్న 20-45 ఏళ్ల మధ్య వయస్కులైన చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు.

తొలిసారి పాలేకర్ శిక్షణకు వచ్చే రైతులకు, ఐదు రోజులూ కచ్చితంగా శిక్షణ పొందగోరే వారికిప్రాధాన్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుము: రూ. 500. పేర్లు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన నంబరు: బి. వెంకటేశ్వర్లు - 94408 16090. ఇతర వివరాలకు 040- 27654337, 27635867 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు) నంబర్లలో సంప్రదించవచ్చు.

Aquaponic Integrated Farming - మెట్ట పొలాల్లోనూ ఆక్వా సాగు!

ఇది ‘ఆక్వాపోనిక్స్’ చూపిన దారి
సేంద్రియ పద్ధతుల్లో చేపలు, రొయ్యలతోపాటు పంటలూ పండించొచ్చు
తెలంగాణలోనూ ఆక్వా సాగు సాధ్యమేనంటున్న రైతు శాస్త్రవేత్త!

రొయ్యలు, చేపల పెంపకం కొత్తపుంతలు తొక్కుతోంది. విస్తారమైన చెరువుల్లో అధిక మొత్తంలో వనరుల ఖర్చుతో, రసాయనాల వాడకం ద్వారా ఆక్వా సాగు చేయడం ఇప్పుడు పాతపడుతోంది. అతితక్కువ విస్తీర్ణంలో, అతితక్కువ జలవనరులతోనే సేంద్రియ పద్ధతుల్లో రొయ్యలు, చేపలు పండించే సరికొత్త పద్ధతి అందుబాటులోకి వస్తోంది. అదే ‘ఆక్వాపోనిక్స్’ పద్ధతి. మెట్ట ప్రాంతాల్లోనూ ఏడాది పొడవునా చేపలు, రొయ్యలు సాగు చేసుకునే అత్యాధునిక పద్ధతి ఇది. నిత్య ప్రయోగశీలిగా పేరుగాంచిన ‘రైతు శాస్త్రవేత్త’ విశ్వనాథరాజు ఆక్వాపోనిక్స్‌ను తెలంగాణకు ప్రయోగాత్మకంగా పరిచయం చేస్తున్నారు.

ఉద్యాన పంటల సాగులో సరికొత్త పద్ధతులకు గత కొన్నేళ్లుగా పెట్టింది పేరైన భూపతిరాజు రామ విశ్వనాథరాజు(46) ఇప్పుడు రొయ్యలు, చేపల సాగులో కొత్త ప్రయోగం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం గుండేడులో 15 ఎకరాల సొంత పొలంలో 14 ఏళ్లుగా ఆయన ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. కరువు కాలంలోనూ 2 బోర్లతో అతితక్కువ నీటిని వాడుకుంటూ ఏడాది పొడవునా పంటలు పండిస్తున్నారు. ప్రయోగశీలతే ఊపిరిగా ఉద్యాన పంటల సాగులో విలక్షణ పోకడలకు శ్రీకారం చుట్టి, చక్కని దిగుబడులు పొందుతున్న ఆయన ఆ ప్రాంత రైతులకు ప్రీతిపాత్రుడుగా మారారు. ప్రతి పంట కాలంలోనూ కొత్త పోకడలను అనుసరించకపోతే ఆయనకు నిద్రపట్టదు. ఆ పంట కాలంలో వచ్చిన అనుభవంతో సరికొత్త పోకడకు ఊపిరిపోయడం, ఈ క్రమంలో అదనపు ఖర్చులకూ వెనకాడకపోవడం ఆయనకెంతో ఇష్టమైన పనులు. ‘మదిలో వచ్చే ఆలోచనలను ఆచరణలో పెట్టుకుంటూ
పోతుంటాను.

రూ. పది వేలు నష్టమైనా, కష్టమైనా వెనుకాడను.. అందరూ నడిచే దారిలో నడవను..’ అంటుంటారు విశ్వనాథరాజు. ఇంతకాలం ఉద్యాన పంటల్లో చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు చేస్తున్నది ఒకెత్తు. ఆక్వా సాగుకు పెట్టింది పేరైన ప.గో. జిల్లా (భీమవరం వద్ద) వేండ్రలో జన్మించిన విశ్వనాథరాజు అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే పాలమూరు జిల్లాలోనూ అతి తక్కువ నీటితో ఆక్వాపోనిక్స్ పద్ధతిలో ఆక్వా సాగును 3 నెలల క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించడం విశేషం.

‘ఆక్వాపోనిక్స్’ అంటే..!

విశ్వనాథరాజు తన పొలంలోనే 8 సెంట్ల స్థలంలో ‘నెట్‌హౌస్’, ‘రెయిన్ షెల్టర్’లను పక్కపక్కనే నిర్మించి రూ. 14 లక్షల ఖర్చుతో ఆక్వాపోనిక్స్ సాగు చేపట్టారు. పూర్తిగా సౌర విద్యుత్తునే వినియోగిస్తున్నారు. అతి తక్కువ నీటి ఖర్చుతో, అతి తక్కువ చోటులో అత్యధిక సాంద్రతలో చేపలు, రొయ్యలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం.. వీటి విసర్జితాలతో కూడిన నీటితో సేంద్రియ కూరగాయ పంటలు సాగు చేయడం ఆక్వాపోనిక్స్ ప్రత్యేకత. చెరువుల నుంచి వ్యర్థ జలాలను బయటకు వదిలేయకుండా పునర్వినియోగించడం వల్ల అతి తక్కువ నీటితోనే ఆక్వా సాగు సాధ్యమవుతోంది. విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ పద్ధతి మనకు కొత్త.

ఏటా 5 టన్నుల చేపలు, 2 టన్నుల రొయ్యలు

25 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని చెరువులో 4 వేల ‘గిఫ్ట్ తిలాపియా’ చేపలు సాగవుతున్నాయి. 3 నెలల్లో 100-120 గ్రాముల బరువు పెరిగాయి. మరో 3 నెలల్లో 600 గ్రాముల సైజుకు పెరుగుతాయని, సుమారు 25 టన్నుల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఏడాదికి రెండు పంటల్లో 5 టన్నుల దిగుబడి పొందొచ్చు.

30 చదరపు మీటర్ల చెరువులో 10 వేల స్కాంపీ రొయ్యలు సాగవుతున్నాయి. 2 నెలల్లో 2-50 గ్రాముల సైజుకు పెరిగాయి. 3 నెలల్లో టన్ను దిగుబడి రావచ్చని అంచనా. ఏడాదికి రెండు పంటల్లో 2 టన్నుల రొయ్యల దిగుబడి పొందొచ్చని విశ్వనాథరాజు ఆశిస్తున్నారు. రొయ్యలకు పూర్తిగా బలపాల(పెల్లెట్స్) మేత వాడుతుండగా, చేపలకు 60% అజొల్లా, 40% పెల్లెట్స్ మేత వాడుతున్నారు. చలి తగ్గిన తర్వాత పెరుగుదల వేగవంతమవుతుందని ఆయన అన్నారు.

తిలాపియా చేపలు - స్కాంపీ రొయ్యలు + సేంద్రియ పంటలు!

నెట్‌హౌస్‌లోని ఒక చెరువులో గిఫ్ట్ తిలాపియా చేపలు, మరో చెరువులో మంచినీటి (స్కాంపీ)రొయ్యలను పెంచుతున్నారు. నెట్‌హౌస్ పక్కనే నిర్మించిన ‘రెయిన్ షెల్టర్’లో టమాటా, పుదీన, కొత్తిమీర, క్యాబేజి తదితర పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. రెయిన్ షెల్టర్‌లో మట్టి లేకుండా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మడుల్లో పంట మొక్కలు నాటుతారు. వీటికి రొయ్యలు, చేపల చెరువుల్లో నుంచి నీటిని మోటార్లు నిరంతరం అందిస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేక పైపులైన్లను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న రాళ్ల ముక్కలను పేర్చి అందులో మొక్కలు నాటుతారు. కొన్ని బెడ్లపై ధర్మాకోల్ షీట్లపైన బెజ్జాల్లో ప్రొట్రేలను ఉంచి వాటిల్లో కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. చేపలు, రొయ్యల విసర్జితాలతో కూడిన నీటి నుంచి పోషకాలను గ్రహించి పంట మొక్కలు పెరుగుతాయి. బయో ఫిల్టర్ల వల్ల నీటిలోని అమ్మోనియా నైట్రైట్లుగా మారి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. చెరువుల్లో రసాయనాలేమీ వాడటం లేదు కాబట్టి పంటలు పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెరుగుతున్నట్లే. కాబట్టి, రైతులతోపాటు వినియోగదారులకూ ప్రయోజనకరమే. సంతోషంగా వ్యవసాయం చేయాలనుకునే వారెవరైనా తన పొలంలో (వారం నుంచి నెల వరకు)ఉండి.. కలిసి పనిచేస్తూ ఉచితంగా శిక్షణ పొందొచ్చని, శిక్షణ పొందేవారికి ఉచిత వసతి కల్పిస్తానని విశ్వనాథరాజు తెలిపారు.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఫొటోలు: పోల్కంపల్లి గాండ్ల నాగరాజు

అతి తక్కువ నీటితోనే ఆక్వాపోనిక్స్ సాగు!

పాలమూరు వంటి కరువు జిల్లాలో అతితక్కువ నీటితో ఆక్వాపోనిక్స్ సాగుపై చిరు ప్రయత్నం చేస్తున్నా. ఎకరంలో చేపల చెరువును నింపడానికి కోటి లీటర్ల నీరు అవసరం. అందులో 3 వేల చేపలు పెంచొచ్చు. అదనంగా రోజూ 50 వేల లీటర్ల నీరు అవసరం. ఆక్వాపోనిక్స్‌లో 50 వేల లీటర్ల నీటిలో చిన్న చెరువులోనే 6 వేల చేపలు పెంచొచ్చు. అదనంగా రోజూ వెయ్యి లీటర్ల నీరు చాలు. నా ప్రయోగం రైతుకు లాభదాయకమా కాదా అనేది ఏప్రిల్ నాటికి తేలుతుంది.

- భూపతిరాజు రామ విశ్వనాథరాజు (94404 57221),
గుండేడ్, షాద్‌నగర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.

చకచకా మొక్కలు నాటే చక్కని పరికరం!

‘ఈజీ ప్లాంటర్’తో కూరగాయ మొక్కలు నాటే
కూలీల ఖర్చు ఎకరానికి రూ. 3 వేలు తగ్గుతుంది
15 మందికి బదులు.. ముగ్గురు పనిచేస్తే చాలు
మల్చింగ్ షీట్‌కు పెద్ద బెజ్జం వేయకుండానే మొక్కలు నాటుకోవచ్చు

పొలం పనులను సులభతరం చేయడం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు? ఇప్పుడు చేస్తున్న పనిని ఇంకా సులువుగా, వేగంగా, తక్కువ శ్రమతో చేసే మార్గం ఇంకేదైనా ఉందా?.. భూపతిరాజు రామవిశ్వనాథరాజు మదిలో అనుదినం ఇటువంటి ప్రశ్నలే మెదులుతూ ఉంటాయి. చదివింది పదో తరగతే అయినా వ్యవసాయం మీద మక్కువతో ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం.. తన సృజనాత్మక ఆలోచనలను ఖర్చుకు వెనకాడకుండా ఆచరణలో పెడుతూ రైతు శాస్త్రవేత్తగా ఎదిగారాయన. కూరగాయ మొక్కలు పొలంలో నాటే ప్రక్రియను సులభతరం చేయడంపై ఆయన పరిశోధన ఫలించి.. చకచకా మొక్కలు నాటే చక్కని పరికరం ‘ఈజీ ప్లాంటర్’గా ఆవిష్కృతమైంది.

ఈ పరికరాన్ని తొలుత చెక్కతో తయారు చేశారు. తర్వాత పీవీసీ పైపుతో, మైల్డ్ స్టీల్‌తో తయారు చేశారు. అయితే, మొక్కేసేటప్పుడు మాత్రమే ఉపయోగపడే ఈ పరికరం తుప్పు పట్టకుండా ఉంటే మన్నిక బాగుంటుందన్న అభిప్రాయంతో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. 2014 మార్చిలో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఈజీ ప్లాంటర్‌ను రూపొందించారు.

2 కిలోల బరువు..

ఈజీ ప్లాంటర్ పరికరం బరువు రెండు కిలోలు. కూలీలెవరైనా సులభంగా ఉపయోగించొచ్చు. ఈ పరికరాన్ని నేలపైన గుచ్చి(మొక్కను ఎంత లోతులో గుచ్చాలనుకుంటే అంత బలంగా గుచ్చాలి), మొక్కను దీని గొట్టంలో వేసి, చేతితో క్లచ్ నొక్కితే చాలు మొక్క చిటికెలో భూమిలో నాటుకుంటుంది. మల్చింగ్ షీట్ వేసి మొక్కలు నాటే సమయంలో దీని ఉపయోగం మరీ ఎక్కువ. మల్చింగ్ షీట్‌పైన మొక్క నాటేటప్పుడు షీట్‌ను కొంచెం ముక్క కత్తిరించడం చేస్తుంటారు. ప్లాస్టిక్ షీట్‌కు బెజ్జం చేయాల్సిన పని లేదు. చిన్న గాటుతోనే చటుక్కున మొక్కను నాటేస్తుంది. అందుకే దీనికి ‘ఈజీ ప్లాంటర్’ అని పేరు పెట్టారు. ప్రోట్రేలలో పెంచిన నారే కాదు, మడిలో పెరిగిన నారును సైతం.. పొడి నేలలోనే కాదు తడి నేలలోనూ దీనితో మొక్కలు నాటొచ్చు. తడిగా ఉన్న నేలలో అయితే, మొక్క నాటిన తర్వాత ఈ పరికరానికి ఎడమ పాదాన్ని ఆనించి ఈజీ ప్లాంటర్‌ను పైకి తీయాలి. రైతుల కోసం రైతే ఆవిష్కరించిన ఈ వినూత్న పరికరంపై పేటెంట్ కోసం గత ఏప్రిల్‌లో దరఖాస్తు చేశారు. ఈజీ ప్లాంటర్‌ను ప్రస్తుతానికి తానే తయారు చేయించి రూ. 3 వేలకు అమ్ముతున్నారు. దీన్ని ప్రతి రైతుకూ అందించాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వమే తయారు చేయించి రైతులకిస్తే తనకు రాయల్టీ కూడా అక్కర్లేదని విశ్వనాథరాజు స్పష్టం చేశారు.

- సాగుబడి డెస్క్

ఈజీ ప్లాంటర్ పరికరంతో మల్చింగ్ షీట్ పైన, దుక్కి చేసిన పొలంలో మొక్కలు నాటే పద్ధతిని వివరిస్తున్న రైతు శాస్త్రవేత్త విశ్వనాథరాజు.

మొక్కల బ్యాటరీ... వెలుగుల పంట!

మొక్కలతో మనకున్న ఉపయోగాలెన్ని? అబ్బో... ఒకటా రెండా... బోలెడున్నాయి. నిజమే.. బతికించే తిండి మొదలుకొని.. కట్టుకునే బట్టలు.. ఆయువు పెంచే మందులు.. అన్నీ చెట్ల నుంచే వస్తున్నాయి. ఈ జాబితాకు తాజాగా ఇంకో అంశం కూడా చేరింది. వెలుగులిచ్చే కరెంటు! అదెలాగంటారా? నెదర్లాండ్స్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం.

భూతాపోన్నతి అనండి.. ఇంకో కారణం కానివ్వండి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. రకరకాల వ్యర్థాలు, పదార్థాల నుంచి విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని హామ్‌బర్గ్‌లో గల ‘ప్లాంట్-ఈ’ వీటన్నింటి కంటే భిన్నమైన, వినూత్నమైన ప్రయత్నం చేసి విజయం సాధించింది. మొక్కల సాయంతో ఎల్‌ఈడీ బల్బులతో పనిచేసే దాదాపు 300 ఎల్‌ఈడీ బల్బులను వెలిగించింది. అది కూడా మొక్కలకు ఏమాత్రం హాని కలగకుండా...!

కిరణజన్య సంయోగ క్రియ కీలకం...

మొక్కలు సూర్యకిరణాల్లోని శక్తిని ఉపయోగించుకుని తనకు అవసరమైన శక్తి, సేంద్రీయ పదార్థం తయారు చేసుకుంటుందని మనకు తెలుసు. దీన్నే శాస్త్ర పరిభాషలో కిరణజన్య సంయోగ క్రియ అని కూడా అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్క ఉత్పత్తి చేసే సేంద్రీయ పదార్థాలు మొత్తంగా దానికి ఉపయోగపడవు. దాదాపు సగం వేళ్లద్వారా నేలలోకి కలిసిపోతూంటుంది. నేలలో ఉండే బ్యాక్టీరియా ఈ సేంద్రియ పదార్థాలను విడగొడుతూంటుంది. ఈ క్రమంలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు విడుదలవుతాయి. ఈ ప్రక్రియను ఆధారంగా చేసుకుని ప్లాంట్-ఈ తన ప్రాజెక్టును సిద్ధం చేసింది. మొక్కలు పెరిగే నేలలో ప్రత్యేకమైన బ్యాక్టీరియా, కాథోడ్, ఆనోడ్‌లను జొప్పించి విద్యుత్తు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది నవంబరు 5న హామ్‌బర్గ్‌తోపాటు అక్కడికి సమీపంలోని వేగనిగెన్ ప్రాంతంలోనూ మొక్కల విద్యుత్తుతో ఎల్‌ఈడీ బల్బులను వెలిగించింది. బంగాళదుంపలు, నిమ్మకాయలతో చిన్నచిన్న బల్బులను వెలిగించడం పాఠశాల విద్యార్థుల ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నప్పటికీ మొక్కలకు హాని జరక్కుండా విద్యుత్తు ఉత్పత్తి చేయగలగడం ప్లాంట్-ఈ టెక్నాలజీ విశేషమని చెప్పాలి.

ఇళ్లకూ పనికొస్తుందా?

ప్లాంట్-ఈ టెక్నాలజీ ద్వారా ఎల్‌ఈడీ బల్బులు వెలుగుతున్నాయి. వీటికి చాలా తక్కువ విద్యుత్తు అవసరమవుతుందన్నది మనకు తెలిసిందే. మరి ఎక్కువ స్థాయి విద్యుత్తు అవసరమైతే? ఏమో గుర్రం ఎగరావచ్చునంటున్నారు ప్లాంట్-ఈ డెరైక్టర్ మార్జొలైన్ హెల్డర్. ఎల్‌ఈడీ బల్బుల కోసం తాము రెండు చదరపు అడుగుల కుండీల్లో పెంచిన మొక్కలను వరుసగా కనెక్ట్ చేసి వాడామని ఎక్కువ విద్యుత్తు అవసరమైతే అందుకు తగ్గట్టుగా ఎక్కువ కుండీలు వాడాల్సి వస్తుందని ఆమె వివరించారు. అయితే అమెరికా లాంటి దేశాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించాలంటే భారీ ఎత్తున స్థలం అవసరమవుతుంది. 2012 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో ఒక ఇంటికి సగటున (ఏడాదికి) 10382 కిలోవాట్ల విద్యుత్తు ఖర్చు అవుతుంది. ప్లాంట్ ఈ టెక్నాలజీ ద్వారా ఇంత విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే కనీసం 4000 చదరపు అడుగుల స్థలం కావాలి. నెదర్లాండ్స్‌లోనైతే వేయి చదరపు అడుగుల స్థలంలోనే ఒక ఇంటికి కావాల్సిన 3500 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని హెల్డర్ తెలిపారు.

భవిష్యత్తు ఏమిటి?

ప్లాంట్-ఈ టెక్నాలజీ ఆసక్తికరమైందే. అందులో సందేహం లేదు. కాకపోతే కావాల్సినంత విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు స్థలం ఒక అడ్డంకిగా మారే అవకాశముంది. ఒక్కో కుండీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మోతాదు ఎక్కువైతేగానీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఈలోపు ప్లాంట్-ఈ తన టెక్నాలజీని చిత్తడినేలల్లో పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఒక గొట్టంలాంటి నిర్మాణాన్ని చిత్తడి నేలలు లేదా వరిపొలాల అడుగుభాగం గుండా పంపించి విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చా? అన్నది పరిశీలిస్తోంది. ఇది జరిగేందుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని కంపెనీ అంటోంది. ఏది ఏమైనప్పటికీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల జాబితాలోకి మొక్కల బ్యాటరీ కూడా చేరడం విశేషమే.

వ్యవశా స్త్రవేత్తలు

ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. కళ్ల ముందరే పసిమొగ్గలు నేలరాలడం వారిని కలచివేసింది. ప్రకృతిలో ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నది వారి విశ్వాసం. వ్యవసాయ పనులు చేస్తూనే ఖాళీ సమయాల్లో అడవుల్లో చెట్లూపుట్టల వెంట తిరిగారు. దోమల సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుకొన్నారు. ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’ నేతృత్వంలో ఇచ్చే రాష్ట్రపతి అవార్డును 2013లో వారికి దక్కించుకొని ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారు.

ప్రాణాంతక వ్యాధులను తక్కువ ఖర్చుతో నయం చేసే మందులను కొనుక్కోవడం కోసం అన్వేషణ సాగిస్తున్నారు చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామీణ శాస్త్రవేత్తలు. వీరికి ప్రయోగశాల కూడా అందుబాటులో లేదు. ఆ మాటకొస్తే ఈ బృందంలో ఇద్దరు మినహా మిగతావాళ్లవి వానకారు చదువులే. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ ఎం.ఏ(ఫిలాసఫీ) మధ్యలోనే ఆపేశాడు. ్ఞఇంటర్మీడియెట్‌లో బైపీసీ విద్యార్థి అయిన చంద్రశేఖర్‌కు సైన్సులో కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి వైద్యం అందించిన మనదేశం ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం విదేశాల వైపు చూస్తోండటం చంద్రశేఖర్‌ను ఆలోచింపజేసింది.
సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడే ఉంటుందని పెద్దలు చెప్పిన మాటను తుచ తప్పకుండా పాటిస్తే సంచలనం సృష్టించవచ్చన్న భావనతో డిగ్రీ చదివిన చిరంజీవులు, నాలుగైదు తరగతులు చదివిన భాస్కర్, బత్తెయ్యనాయుడు, శివ, వెంకటేశ్వర్లు, మురళీ, శ్రీధర్‌లతో కలిసి ‘జగదీష్ చంద్రబోస్’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి 20 ఏళ్ల క్రితమే పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి చేసిన తొలి ప్రయోగం విఫలమైన సందర్భంలోనే కారాకొల్లును సెరెబ్రల్ మలేరియా చుట్టుముట్టింది.

అడవిబాటలో...

దోమ కాటుకు ప్రాణాంతక సెరెబ్రల్ మలేరియా సోకి పసిమొగ్గలు కళ్ల ముందే నేలరాలుతోండటంతో ఆ బృందం మళ్లీ అడవిమార్గం పట్టింది. దోమలు, క్రిములు వాలని మొక్క, చెట్టు దొరికితే సమస్యకు పరిష్కారం లభించినట్లేనన్నది వారి భావన. అదే లక్ష్యంతో చెట్లెంటా పుట్లెంటా తిరిగారు. చివరకు తెల్లజుమికి మొక్కపై దోమలు, క్రిములు వాలకపోవడాన్ని గుర్తించారు. వాలిన దోమలు, క్రిములు కూడా చనిపోవడాన్ని పసిగట్టారు. తెల్లజుమికి మొక్క ఆకులపై, కాయలపై జిగురులాంటి పదార్థం ఉండటం వల్ల దోములు, క్రిములు వాలడం లేదని భావించారు. తెల్లజుమికి ఆకులు, కాయల రసాన్ని దోమల లార్వాలపై ప్రయోగించారు. దెబ్బకు దోమల లార్వాలు చనిపోయాయి. ఆ రసాన్ని ఊర్లో మురుగుకాలువలు, నీళ్లు నిలిచే ప్రాంతాలపై చల్లారు. దెబ్బకు దోమలన్నీ చనిపోయాయి. ఊళ్లో వాళ్లందరికీ ఆ రసాన్ని ఇచ్చారు. పడుకునే ముందు చేతులకు కాళ్లకు పూసుకుంటే దోమలు కుట్టవని చెప్పారు. ఆ ఊరి ప్రజలు అలానే చేశారు. దోమకాటుకు పరిష్కారం దొరకడంతో సెరెబ్రల్ మలేరియా నుంచి కారాకొల్లుకు విముక్తి కలిగింది.

ఇదే సమయంలో తాము కనుగొన్న మందుకు శాస్త్రీయత ఉందని నిరూపించాలని బృందం భావించింది. ఎస్వీ యూనివర్శిటీలో ఎంటమాలజీ ప్రొఫెసర్ హరినాథబాబును సంప్రదించారు. బృందం అందించిన శాంపుల్స్‌పై పరిశోధనలు చేసిన హరినాథబాబు, తెల్లజుమికి రసంలో క్రిమిసంహారక లక్షణాలున్నట్లు తేల్చారు. న్యుమటోడ్స్ (చెట్ల ఆకులపై రసం పీల్చే పురుగులు) నిర్మూలించడానికి ప్యురాడాన్ ఉపయోగిస్తున్నారు. ప్యూరాడాన్ కన్నా తెల్లజుమికితో తయారుచేసిన మందే న్యుమటోడ్స్‌పై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు ప్రొఫెసర్ హరినాథబాబు తేల్చారు.

అడవే ప్రయోగశాల...

తెలుగుగంగ ఆయకట్టు ప్రాంతమైన కారాకొల్లులో చిత్తడి నేలలు అధికం. చిత్తడి నేలల్లో నడవడం వల్ల ఆ గ్రామ ప్రజలను బురదపుండ్లు పట్టి పీడిస్తుండడంతో గాయాన్ని మాన్పే మందు కోసం అన్వేషణ సాగించారు. వెంట్రుకలను నల్లగా మార్చడానికి చేసిన ప్రయోగంలో గతంలో ఉపయోగించిన బురుగుడు ఆకు రసాన్ని ఓ ఎద్దు గాయంపై ప్రయోగించారు. త్వరగా మానిపోయింది. ఆ తర్వాత కోడికి తగిలిన గాయంపై ప్రయోగించారు. అదీ మానిపోయింది. మనుషుల గాయాలకూ, చర్మవ్యాధులకు ఇదే మందును పూశారు. 15 నిముషాల్లో ప్రభావం చూపాయి. బురుగుడు ఆకు రసం తయారుచేసిన మందుపై పరిశోధనలు చేసిన కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్ రఘునాథరాజు ఆ మందు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుందని తేల్చారు. తక్కువ ధరకు మందును అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ‘ఎంజెల్-హెచ్’ అనే పేరుతో మార్కెట్ చేసేందుకు పూనుకున్నారు.

‘‘మేం తయారు చేసిన మందులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. క్యాన్సర్ వ్యాధికి మందును కనుగొనడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’’ అంటున్నారు బృందంలో సభ్యుడైన చంద్రశేఖర్.

‘జగదీశ్ చంద్రబోస్’ సంఘం సభ్యులు చేస్తున్న కృషిని గమనించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఏఫ్) రాష్ట్ర కో-ఆర్డినేటర్ గణేశం వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. బృందం ఆవిష్కరణలను ఎన్‌ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి ఆవిష్కరణలకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ప్రజలకు మేలు చేసే మరిన్ని మందులను ఈ గ్రామీణ శాస్త్రవేత్తల బృందం కనుగొనాలని ఆశిద్దాం.

ఎన్‌ఐఎఫ్‌ను సంప్రదించండి...

దేశంలో ప్రతిభకు కొదువ లేదు. పల్లెల్లో అద్భుతాలు సృష్టించే యువకులు ఎందరో ఉన్నారు. ఎవరు ఏ ఆవిష్కరణలు చేసినా నన్ను(ఫోన్ నెంబరు 09866001678) సంప్రదించండి. రాష్ట్రంలో ఇప్పటికే 112 ఆవిష్కరణలను ఎన్‌ఐఎఫ్ దృష్టికి తీసుకెళ్లాం. 22 మందులకు పేటెంట్లు తెప్పించాం. 12 మందికి రాష్ట్రపతి అవార్డులు వచ్చేలా చేశాం. కారాకొల్లుకు చెందిన చంద్రశేఖర్ బృందం అద్భుతాలు సాధిస్తోంది.
- గణేశం, రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎన్‌ఐఎఫ్.

సేంద్రియ సేద్యం

ఒకప్పుడు వ్యవసాయం అంటే పాడి పంటలు, అప్పటి పల్లెలు, పచ్చటి పొలాలతో పశుసంపదతో అలలారుచుండేవి. ప్రతి రైతు ఇంట పేడ, గడ్డి మొదలగు వ్యర్థాలతో కూడిన దిబ్బ ఉండేది. దానిని తీ రైతులు దుక్కి దున్నిన తరువాత పొలంలో చల్లేవారు. దీనివలన భూమికి జీవ ఎరువు తోడవుతుండేది. హరిత విప్లవం ఫలితంగా రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రోద్బలంతో కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారకాలు, యంత్రాలను వాడటంతో మంచి దిగుబడులు సాధించడం, రైతులకు శ్రమ తగ్గడం వంటి పరిణామాలతో పాడిపంటలను వేరు చేసి పంటనే ముఖ్య భూమికగా చేసుకొని పశు సంపదను నిర్లక్ష్యం చేశాం. దీని మూలాన భూమికి జీవ ఎరువులు కరువయ్యా యి.

కృత్రిమ ఎరువుల ద్వారా పంటకు కావాల్సిన పోషకాలు సమకూరుస్తున్నాం. తెగుళ్ళు, చీడల కోసం క్రిమి సంహారకాలు వాడడం వలన తెగుళ్ళు, చీడలతో పాటు భూమిలో ఉన్న భూమిత్ర జీవులు కూడా నశిస్తున్నాయి. దీనివలన భూమి_జీవరహితం అయ్యింది. తద్వారా భూమికి తెగుళ్ళు, చీడల నిరోధక శక్తి సన్నగిల్లింది, ఫలితంగా వాటి బెడద ఎక్కువయ్యింది. దీంతో శక్తిమంతమైన మందులు వాడవలసి వచ్చింది. దీనికి తోడు మన రైతులు అతి ఉత్సాహంతో, అశాస్త్రీయంగా కృత్రిమ ఎరువులను, శక్తిమంతమైన మందులను అధిక మోతాదులో వాడడం వలన పొలంలోని జీవత్వం పూర్తిగా నశించి, భూములు నిస్సారంగా మారి, నీటి నిల్వ శక్తిని కూడా కోల్పోయి, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక మందుల ఖర్చులు అధికమై భారం రైతుల మీద పడుతోంది. ప్రజలకు ఆరోగ్యానికి హానికరమైన క్రిమి సంహారకాలతో కూడిన ఆహార పదార్థాలు చేరుతున్నాయి. దీని వలన క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నాయి.

పల్లెలలోని రైతులకు వ్యవసాయ అధికారులు, జ్ శాస్త్రవేత్తలు అందుబాటులో లేరు. ఉన్న అధికారులను రైతులు నమ్మటం లేదు. రైతులు అందుబాటులో ఉన్న తోటి రైతులను, దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనివలన ఒకే పంటను అంతా పండించటంతో ఒక్కసారిగా దిగుబడి పెరిగి అమ్మకాలకు దళారులపై ఆధారపడడం మూలాన రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు.

మన దేశం వ్యవసాయాధార దేశం. దేశ జనాభాలో 70 శాతం గ్రామలలో వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కానీ దేశ ఆర్థిక ప్రణాళికలో వ్యవసాయానికి అంత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు. మన దేశ జనాభా 2050 నాటికి సుమారు 1.7 బిలియన్లకి చేరుతుందని అంచనా. ఇది యావద్భారతావనిని కలవరపరిచే అంశం. ఇంత జనాభాకి ఆహారాన్ని సమకూర్చాలంటే రైతు లాభాలతో వ్యవసాయాన్ని సాగించాలి. కానీ ఈనాడు మన దేశంలో ఆ పరిస్థితి లేదు. ఏ ఒక్క రైతు తన బిడ్డ రైతు కావాలనుకోవడం లేదు. అమ్మాయిలు, వారి తల్లితండ్రులు రైతులను వివాహం చేసుకోవడానికి ముందుకురాని పరిస్థితి. సేద్యంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ఆదాయాలు తగ్గటమే కారణం.

ఆరోగ్యం - పర్యావరణం : ప్రజారోగ్యన్నీ, పర్యావరణాన్ని కాపాడటానికి, రైతుకు పెట్టుబడులు తగ్గించటానికి, మన భూములను కాపాడటానికి సేంద్రియ వ్యవసాయమే శరణ్యం. ఆధునిక శాస్త్రీయ సాంకేతికతను జోడించి, భూ పరీక్షలు చేసుకొని జీవ పదార్థాలతో భూమికి కావాల్సిన పోషకాలు జోడించిన మంచి దిగుబడి, ఆరోగ్యకరమైన నాణ్యత గల ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించగలం.

సేంద్రియ ఎరువులతో, సేంద్రియ పదార్థాలతో, కషాయాలతో చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అనీ, మొక్కలు, జంతువుల, మానవుల వ్యర్థాలతో తయారయ్యే ఎరువులను సేంద్రియ ఎరువులనీ అంటారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగవుతాయి. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి పెట్టుకొనే శక్తి పెరుగుతుంది. చౌడు భూములకు సేంద్రియ పదార్థాలు అత్యంత ప్రయోజనకరం. అవి ఆమ్ల, భార నేలల్లోని హానికరమైన లక్షణాలను తగ్గిస్తాయి. నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, పురుగుల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి చీడ, తెగులు తాకిడి తక్కువవుతుంది. తగినంత సేంద్రియ పదార్థం పొలంలో ఉంటే భూమిత్ర సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది, సహజ సిద్ధంగా నేలలో ఉండే పోషకాలు అందుబాటులోకి వచ్చి మొక్కలు ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతాయి.

2011 నాటి సర్వే ప్రకారం 1971 నుండి 2011 వరకు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు, 18 శాతం నుండి 31.2 శాతం వెళ్ళారు. మన దేశ పట్టణాల నుండి ఉత్పన్నమవుతున్న వ్యర్థాలు సంవత్సరానికి 62 లక్షల టన్నులు. అది 2031కి 165 లక్షల టన్నులకు, 2050కి 436 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా. దీనిలో 90 శాతం వ్యర్థాలు అశాస్త్రీయంగా ఎక్కడపడితే అక్కడ వేయడం వలన ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ హాని జరుగుతోంది. దీనిలో 42 శాతం సేంద్రియ వ్యర్థం. దీనిని మనం శాస్త్రీయంగా రీసైకిల్ చేసి, సేంద్రియ ఎరువుగా మార్చి మన బంజరు భూములకు వాడితే అవి సాగుభూములుగా వృద్ధి చెందుతాయి. దీనివలన ప్రజారోగ్యం, పర్యావరణం ఎంతో మెరుగవుతాయి.

వనరులు వినియోగం : పై పరిస్థితులు మారాలంటే ప్రభుత్వాల చొరవ, సంకల్పం కావాలి. మన దేశంలో మొట్ట మొదటి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రమైన సిక్కిం మనకు ఆదర్శం. దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో సేంద్రియ విభాగాన్ని ప్రారంభించాలి.

ఏ పంటకు ఏయే దశలో సేంద్రియ ఎరువులు వాడాలో ఏ తెగుళ్ళకు, ఏ చీడలకు ఏయే కషాయాలు వాడాలో ప్రభుత్వ చొరవతో విస్తృత ప్రచారం వల్ల జరిపించాలి. సేంద్రియ ఎరువులు, కషాయాలను బహిరంగ మార్కెట్లలో సబ్సిడీలతో విరివిగా శక్తి దొరికేటట్టు ప్రోత్సహించాలి. అన్ని రాష్ట్రాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి, సేంద్రియ దేశంగా మారడానికి అడుగులు వేయాలి. ముందుగా వ్యవసాయానికి 'ఆహార పరిశ్రమ హెూదా' కల్పించాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, మార్కెట్ విశ్లేషకులు, బ్యాంకు అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణీత వ్యవధిలో ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి, వాతావరణ పరిస్థితుల్ని, నీటి లభ్యతను భూ పరీక్షలను, అమ్మకాల్ని దృష్టిలో ఉంచుకొని ఏయే పంటలు, ఏ కాలంలో వేయాలో సలహాలు, చర్చలు జరుపడం వలన రైతులలో అవగాహన పెరుగుతుంది. దీనివలన నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద నశిస్తుంది. ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అధిక దిగుబడులతో సాధించగలం. రైతుల ఆదాయం పెరుగుతుంది.

మన దేశంలో ఎన్నాళ్ళుగానో వృథాగా పడి ఉన్న బీడు భూములు దాదాపు రెండున్నర కోట్ల హెక్టార్లకు పైగా ఉన్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఎక్కడైతే ఈ భూములున్నాయో వాటిని వ్యవసాయ సెజ్'లుగా ప్రకటించి ఆసక్తి గల వారికి 12 హెక్టార్లు ఒక యూనిట్ (10 హెక్టార్లు సాగు, 2 హెక్టార్లు నీటి నిల్వకు) చేసి, 10 సంవత్సరాల లీజుకి ఇవ్వాలి. ఇక్కడ ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులను, ఆహార శుద్ధి కేంద్రాలను నెలకొల్పాలి. పరిశ్రమలకు కల్పించే ప్రాథమిక వన తులన్నీ కల్పించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలోని, వ్యవసాయ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి శాస్త్రవేత్తలు, అధికారులు, ఐ.ఐ.టి.ల, ఐ.ఐ. ఎంల ఆచార్యులు, విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఈ సెజ్లను ప్రణాళికతో నిర్ణీత వ్యవధిలో పర్యవేక్షిస్తూ వాటికి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు కల్పిస్తూ వాటి విజయానికి తోడ్పడాలి. సెజ్లలో సమీకృత, కార్పోరేట్ వ్యవసాయం సాగించాలి. కూరగాయలు , పండ్లు , పూలు , డైరీ, పట్టు పురుగులు, చేపలు , తేనే , నర్సరీలు , గొర్రెల పెంపకాలతో పాటు నీటి లభ్యతను బట్టి అన్ని రకాల సాగుచేసేటట్టు ప్రణాళికలు రచించాలి . వినూత్నా విధానాలతో (ప్రజల చేరువలో సొంత దుకాణాలు , సూపర్ మార్కెట్ లతో, ఆన్ లైన్ సేవలు) నేరుగా లావాదేవీలు జరపాలి . బహుముఖ మారిస్తే దేశ ఆరోగ్యం , సాగు విస్తీర్ణం , రైతుకు ఆదాయం పెరుగుతాయి . పర్యావరణాన్ని కాపాడి సస్యశ్యామలమైన భూమిని భావితరాలకు అందించగలుగుతాం.

ఆధారము: అగ్రికల్చర్ గేటు వే.బ్లాగ్ స్పాట్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate