অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విజయ గాధలు

విజయ గాధలు

 1. వెంకటేశ్వర్‌రెడ్డి విజయ గాధ
 2. ఎస్.ఆర్ శంకరన్ విజయగాధ
 3. మహాత్మా గాంధీ విజయగాధ
 4. వర్ఘీస్ కురియన్ విజయగాధ
 5. ఎస్.ఎస్. మనోహరన్ విజయగాధ
 6. యెదురువాడ నాగేశ్వరరావు విజయ గాధ
 7. సుభాష్ పాలేకర్ : ఓ రైతు గాథ
 8. ముక్తిలక్మి విజయ గాధ
 9. మామిడి రా'రాజులు'
 10. 'గ్రీన్‌బేసిక్స్' సంస్థ
 11. విలక్షణ సేద్యం
 12. దువ్వూరు వరదారెడ్డి విజయగాధ
 13. చోగలాల్ సోని విజయ గాధ
 14. పిన్నమనేని సుబ్బరాజు విజయ గాధ
 15. అద్భుత వరి వంగడాల రూపశిల్పి దాదాజీ రాంజీ ఖోబ్రగడే
 16. చెన్నారెడ్డి - పామ్‌రోజ్(నిమ్మ గడ్డి)
 17. ‘సాఫ్ట్‌వేర్’ రైతు - జాన్ ఇజ్రాయిల్ రావూరి
 18. అన్నపరెడ్డి శివరామరెడ్డి విజయగాధ
 19. మార్గదర్శి ‘సారధి’
 20. గుంటూరు మిర్చి రైతుల విజయగాధలు
 21. ఆదర్శ మామిడి రైతు శ్రీనివాసరెడ్డి
 22. విత్తన బ్రహ్మ ‘కొంగర రమేష్‌’
 23. పవిత్ర ప్రియదర్శిని - పుట్టగొడుగుల సాగు
 24. కరవు ప్రాంతంలో సిరుల పంట
 25. అద్భుతాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్!
 26. ప్రకృతి సేద్యంలో ప్రకాశిస్తున్న యువ కిరణం
 27. పండ్ల తోటల్లో నాటు కోళ్లు
 28. మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు
 29. గ్రీన్ రైస్ దిగుబడి అదుర్స్
 30. స్వల్ప ఖర్చుతో పాలీహౌస్‌లో ప్రకృతి సేద్యం
 31. మీనామృతంతో మునగకు రక్ష
 32. వైరస్‌ను తట్టుకునే బొప్పాయి
 33. వీళ్లు కరువును జయించారు
 34. ఇంటి మట్టికి వందనాలు
 35. నడి వేసవి.. తరగని జలసిరి..
 36. పట్టు పురుగుల పెంపకం

వెంకటేశ్వర్‌రెడ్డి విజయ గాధ

ఎకరానికి 85 బస్తాల వేరుశనగ! రూ.50 వేల నికరాదాయం పొందిన యువ రైతు

ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) రూపొందించి విడుదల చేసిన వేరుశనగ వంగడం వేసవి పంటగా అధిక దిగుబడినివ్వడం విశేషం. ఈ వంగడం పేరు టీఎల్‌జి-45. కడప జిల్లా చెన్నూరు మండలం బాలసింగాయపల్లికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి(92474 36849) ‘బార్క్’ శాస్త్రవేత్తల నుంచి ఈ వంగడాన్ని తీసుకొచ్చి కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ఆయన వద్ద నుంచి కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లెకు చెందిన యువరైతు శిరిగిరెడ్డి పురుషోత్తమరెడ్డి గత ఏడాది ఈ విత్తన కాయలు కొన్నారు. ఆ విత్తన కాయల్లో నుంచి మేలైన కాయలను ఏరి.. గత ఏడాది విత్తనోత్పత్తి చేశారు.

ఆ విత్తనంతో ఈ ఏడాది మార్చిలో తన ఎకరం 30 సెంట్లలో సాగు చేశారు. ఎకరంలో ఇటీవల నూర్పిడి చేయగా.. 85 బస్తాల పచ్చి కాయల(బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. మిగతా 30 సెంట్లలో పంటను విత్తనాల కోసం ఉంచానన్నారు. తమ ప్రాంతంలో 65-70 బస్తాల వరకు పచ్చి కాయల దిగుబడి వస్తుంటుందని, అయితే, మేలైన విత్తన కాయలు వాడటం, శ్రద్ధగా సాగు చేయడం వల్ల తనకు అధిక దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. వేరు పురుగు, అడవి పందుల బెడద లేకపోతే మరో 5-10 బస్తాల పచ్చి కాయలు అదనంగా దిగుబడి వచ్చేదన్నారు.

మార్చి 28న విత్తనం వేశానని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తగా నీటి తడులు ఇస్తూ కంటికి రెప్పలా పంటను కాపాడి అధిక దిగుబడి సాధించానని పురుషోత్తమరెడ్డి (77948 85686) సంతోషంగా చెప్పారు. పుష్కలంగా పశువుల ఎరువు, ఆముదం పిండి, జీవన ఎరువులతోపాటు తగుమాత్రంగా రసాయనిక ఎరువులు వాడి, శ్రద్ధగా సస్యరక్షణ చర్యలు చేపట్టానని తెలిపారు. ఒకసాలు అదనంగా లోతు దుక్కి చేయడం కూడా కలసివచ్చిందన్నారు. ఈ రకం కాయలు, విత్తనాలు పెద్దగా ఉంటాయి. నూనె దిగుబడి శాతం ఇతర వంగడాల మాదిరిగానే ఉంటుంది.

మూడు, నాలుగు విత్తనాల కాయలు కూడా అధికంగా ఉంటాయి. ఉడకబెట్టి తినడానికి, చెట్నీలకు ఈ వంగడం అనుకూలంగా ఉంటుంది. దీంతో పురుషోత్తమరెడ్డి వద్ద నుంచి వ్యాపారులు పచ్చి కాయల బస్తాను రూ.1,160 వరకు ధర చెల్లించి కొన్నారు. ఎకరానికి రూ. 47 వేల వరకు ఖర్చయ్యింది. ఖర్చులు పోను రూ. 50 వేలకు పైగా నికరాదాయం వచ్చింది. టీఎల్‌జి-45 వంగడం ఈ స్థాయిలో దిగుబడినివ్వడం స్థానిక వ్యవసాయాధికారులతో పాటు ‘బార్క్’ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. వేసవి పంటగా సాగు చేసి ఇంత దిగుబడి తీయడం మరో విశేషం.

ఆధారము: - ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్

ఎస్.ఆర్ శంకరన్ విజయగాధ

జీవనోపాధులు గురించి ఎస్.ఆర్. శంకరన్ గారు వారి విజయ గాధను ఈ క్రింద జోడించిన పి.డి.ఎఫ్ లో పొండుపరచబడినది. ఈ విజయ గాధ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహాత్మా గాంధీ విజయగాధ

మహాత్మా గాంధీ గా పిలువబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ లోని పోరుబందర్ లో 1869, అక్టోబర్ 2న జన్మించారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన గాంధీ, బ్రిటీషు పాలన నుంచి దేశం స్వాతంత్ర్యం పొందేలా జాతిని మేల్కొలిపారు.

ఈ విజయ గాధ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వర్ఘీస్ కురియన్ విజయగాధ

కోట్ల మంది రైతులకు పాడిపరిశ్రమ అదనపు ఆదాయవనరు. ఇప్పటికీ 80 శాతం పాల ఉత్పత్తి అవ్యవస్థీకృత రంగంలోనే జరుగుతోంది. దేశీయంగా పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాలు పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందున్నాయి. వర్ఘీస్‌ కురియన్‌ నేతృత్వంలో 1970లో ప్రారంభమైన 'శ్వేత విప్లవం'తోనే ఈ అభివృద్ధి అంతా!

ఈ విజయ గాధ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్.ఎస్. మనోహరన్ విజయగాధ

జీవనోపాధులు గురించి ఎస్.ఎస్. మనోహరన్ గారు వారి విజయ గాధను ఈ క్రింద జోడించిన పి.డి.ఎఫ్ లో పొండుపరచబడినది. ఈ విజయ గాధ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారము: అక్షర

యెదురువాడ నాగేశ్వరరావు విజయ గాధ

కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్నారు పెద్దలు. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆలోచనతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తే ఎటువంటి సమస్యనైనా సునాయూసంగా ఎదుర్కోవచ్చనేది దీని సారాంశం. ఇటీవల సంభవించిన వరుస తుపాన్లకు జిల్లాలోని కొందరు రైతన్నలు కోలుకోలేని దెబ్బతింటే.. మరికొందరు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని ఎదుర్కొనే దిశగా అడుగులు వేశారు. సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి లాభాల సిరులు పండించారు.

మూసధోరణి, కాలం చెల్లిన పద్ధతులతో పంటలు సాగుచేస్తూ ఒడుదుడుకులు ఎదుర్కొనే రైతులు కొందరైతే.. వీటికి భిన్నంగా ఆలోచిస్తూ వినూత్న ప్రయోగాలతో అధిక దిగుబడులు సాధించి నలుగురికి ఆదర్శంగా నిలిచే వారు మరికొందరు. సరిగ్గా ఈ రెండో కోవకే చెందుతారు బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లికి చెందిన యెదురువాడ నాగేశ్వరరావు. కొత్తరకం పద్ధతుల్లో వరి పంటను సాగుచేసి అధిక దిగుబడులు సాధించటమే కాక ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు. ఒకే పంటలో, ఒకే సీజన్‌లో మూడు కొత్త పద్ధతులను అమలుచేశారు.

పామాయిల్ తోటలో అంతర పంటగా వరి

మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలను పామాయిల్ తోటలో అంతర పంటలుగా సాగుచేయటం సాధారణమే. కానీ, తొలిసారిగా పామాయిల్ తోటలో ప్రయోగాత్మకంగా వరిసాగును అంతర పంటగా చేపట్టి విజయం సాధించారు నాగేశ్వరరావు. బిళ్లనపల్లిలో నాలుగు ఎకరాల పొలంలో ఏడాది కిందట పామాయిల్ మొక్కలు వేశారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఆయనకో ఆలోచన వచ్చింది. పామాయిల్ తోటలో వరి సాగుచేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. అనుకుని వెంటనే ఆచరణలో పెట్టారు.

బిందు సేద్యంతో వరిసాగు

సాగునీటి కొరతతో సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయరంగానికి నాగేశ్వరరావు కొత్తమార్గం చూపించారు. వరి పంటలో తొలిసారి బిందు సేద్యం విధానాన్ని అవలంబించి మంచి రాబడి సాధించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. నీటి వృథా తగ్గుతుంది. మొక్కకు నేరుగా సాగునీరు, ఎరువులు అందుతాయి.

నేరుగా విత్తనాలు..

సాధారణంగా వరిసాగు చేసేందుకు ముందుగా నారుమడి పోసి ఆ తర్వాత పొలం మొత్తం నాట్లు వేస్తారు. రెండుసార్లు పొలం దుక్కడం, నాలుగుసార్లు దమ్ము చేయించటం, వరినాట్లు చేసేందుకు కూలీలు దొరక్కపోవటంతో విసుగు చెందుతున్న రైతాంగానికి సరికొత్త పద్ధతిని పరిచయం చేశారు. నేరుగా పొలం మొత్తం విత్తనాలు చల్లి పంట సాగు చేశారు. ట్రాక్టర్‌తో ఒక్కసారి దుక్కి చేయించి, తరువాత యంత్రాల సాయంతో పొలంలో విత్తనాలు చల్లించారు. దీనివల్ల ఎకరాకు దాదాపు రూ.5వేల వరకు పెట్టుబడి మిగులుతుందని నాగేశ్వరరావు తెలిపారు.

ఇబ్బందులు ఎదుర్కొనేందుకే..
మెట్ట ప్రాంతంలో వర్షాలు సరిగ్గా ఉండవు, విద్యుత్ మోటార్ల మీద ఆధారపడి సాగు చేయాలి. విద్యుత్ కొరత, మరోపక్క సాగునీటి కొరతను తట్టుకునేందుకు బిందు సేద్యం ద్వారా వరిసాగు చేపట్టాను. గతంలో కూలీలు పొలంలో ఎంత లోతు బురద ఉన్నా లెక్క చేయకుండా వరినాట్లు వేసేవారు. ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువైంది. దీంతో నేరుగా విత్తనాలు చల్లి పంటసాగు చేశాను. దీనివల్ల పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.
- యెదురువాడ నాగేశ్వరరావు

రాబోయే కాలంలో బిందు సేద్యానికే పెద్దపీట
రాబోయే రోజుల్లో బిందు సేద్యానికే రైతులు పెద్దపీట వేయనున్నారు. డెల్టాలో నాలుగు ఎకరాలకు వినియోగించే నీటిని డ్రిప్ ఇరిగేషన్‌లో వరిసాగుకు నాగేశ్వరరావు వాడారు. పొలం ఆరుతడిగా ఉండటంతో ఆక్సిజన్ మొక్కలకు చేరి ఆశించిన మేరకు దిగుబడులు వచ్చాయి. పొలానికి కావలసిన స్థాయిలో నీరు ఉండటంతో తుపాన్ల బారిన పడకుండా చేను నిలబడింది. నీటి యాజమాన్య సంస్థ వారు ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా బిందు సేద్యానికి భారీగానే సబ్సిడీలు ఇస్తున్నారు.
- ఎన్‌సీహెచ్ బాలూనాయక్,
జిల్లా వ్యవసాయ జాయింట్ డెరైక్టర్

రైతుబంధు చరణ్‌సింగ్
ఉత్తరప్రదేశ్‌లో జమిందారీ వ్యవస్థ, భూస్వాములపై తిరుగుబాటు చేసి రైతుల పక్షాన పొరాడి రైతుబంధుగా పేరొందిన భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతినే జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకొంటారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా నూర్‌పూర్ గ్రామంలో 1902 డిసెంబరు 23న జన్మించారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన అనేక భూపోరాటాలు చేశారు. జైకిసాన్ నినాదంతో రైతులను ఏకంచేసి ఉద్యమాలు నడిపారు. రైతుల దుస్థితి, సమస్యలు, పరిష్కార మార్గాలు, సంస్కరణలపై పలు రచనలు చేవారు. 1960లో ఉత్తరప్రదేశ్ సీఎంగా చరణ్‌సింగ్ దేశంలోనే తొలిసారిగా భూసంస్కరణలు, లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1979లో మొరార్జీ దేశాయ్ తర్వాత దేశ ప్రధానమంత్రిగా ఆరు నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. రైతు శ్రేయస్సు కోసం ఆయన చేసిన ఉద్యమాలు, చట్టాలు, రచనలను స్మరించుకుంటూ ఆయన మరణించిన తర్వాత ఏటా రైతుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

115 రోజుల్లోనే పంట
వరుస తుపాన్ల వల్ల తన పంటకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుకున్నారు కౌతవరానికి చెందిన రైతు చాపరాల జగన్మోహనరావు. వెదజల్లే పద్ధతిని అనుసరించి కేవలం 115 రోజులకే పంట సాధించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. జగిత్యాల (20171, 18047) రకాల వరి వంగడాలు నా పొలంలో వేశాను. జులై ఐదో తేదీన వెదజల్లే పద్ధతి ద్వారా విత్తనాలు వేశాను. దీంతో 130 రోజులకు చేతికి రావలసిన పంట 115 రోజులకే వచ్చింది. అక్టోబరు 25వ తేదీన వరి కోతలు పూర్తయ్యాయి. ప్రయోగ పద్ధతిలో 20171, 18047 రకాల్ని కొద్ది పొలంలోనే సాగుచేశా. ఈసారి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తా. బీపీటీని పోలిన ఈ రకం వంగడాల ద్వారా వర్షాల్లో కంకులపై చినుకుపడితే మొలక వచ్చే ప్రమాదం ఉంది. వరుసగా వచ్చిన తుపాన్లకు ముందుగానే పంటను కోసేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడినట్లే... అని చెప్పారు.

వైపరీత్యాలకు ఒరిగిపోలేదు..
తన పొలంలో వేసిన ఎంటీయూ 1112 రకం వరి వంగడం తుపాన్లకు తట్టుకుని దృఢంగా నిలబడిందని గుడ్లవల్లేరుకు చెందిన వల్లభనేని నరసింహారావు చెప్పారు. ఆయన తన పంట గురించి చెబుతూ... 1112 వరి వంగడాన్ని నా ఐదెకరాల్లో సాగు చేశాను. దోమపోటు, ఎండు తెగులును తట్టుకోవడమే కాకుండా వరుస తుపాన్లకు చేను పడకుండా నిలబడింది. ఈ విత్తనం 35 బస్తాల దిగుబడి ఇచ్చింది. ఇది 150 రోజుల పంట. ఈ ధాన్యం సన్నాలుగా తెలుపు రంగులో ఉంటుంది. ధాన్యానికి మూడు వారాల నిద్రావస్థ ఉండటంతో వర్షాల్లో మొలక రాలేదు. పల్లపు ప్రాంతంలో ముంపు బారిన పడినా 7-10 రోజుల వరకు నష్టం వాటిల్లలేదు. ఈ రకాన్ని కనుగొన్న మారుటేరు ఏపీ వరి పరిశోధనా కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యనారాయణరావు నా పొలాన్ని సందర్శించి దిగుబడులు చూసి మెచ్చుకున్నారు.. అని పేర్కొన్నారు.

తక్కువ కాలపరిమితికే పంట
వరుస తుపాన్ల బారిన పడకుండా తక్కువ కాలపరిమితితో కూడిన పంటను వేసి విజయం సాధించారు అంగలూరుకు చెందిన రైతు, మాజీ ఏడీఏ త్రిపురనేని రత్నకుమార్ చౌదరి. తన అనుభవంతో తుపాన్లకు సవాల్ విసిరారు. ఈ విశేషాలు చెబుతూ.. పీఎన్‌ఆర్ 2458 వరి రకాన్ని నా పొలంలో వాడాను. తుపాన్ల ముందే.. అంటే నవంబరు మొదటి వారంలో వరికోతలు పూర్తయ్యాయి. ఇది 135 రోజుల పంట. ఈ రకాన్ని హైదరాబాద్ రాజేంద్రనగర్ నుంచి తెచ్చా. రెండున్నర ఎకరాల్లో ఈరకం సాగుచేశా. ఇది ముతకలు కాదు, సన్నాలు కాదు. ఎకరానికి 34 బస్తాల పంటనిచ్చింది. తక్కువ కాలపరిమితితో దిగుబడులు సాధించడంతో అందరూ మెచ్చుకున్నారు.. అని వివరించారు.

ఆధారము: సాక్షి

సుభాష్ పాలేకర్ : ఓ రైతు గాథ

భారతదేశం సుసంపన్న వ్యవసాయ దేశం. ఇది మనమందరం గర్వపడే విషయం! రసాయనిక ఎరువుల వాడకంలోనూ అగ్రగామి మనదేశం. ఇది మనమందరం బాధపడాల్సిన విషయం! ఇంతకు ముందుతరాలలో వేల సంవత్సరాలపాటు అవసరం లేని మందుల వాడకం ఇప్పుడు ఎందుకు ఇంతగా పెరిగింది? పురుగుమందులు వాడకుండా వ్యవసాయం చేయలేమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటిని రుజువు చేసిన ఓ రైతు గాథ ఇది.

సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలోని కరవు ప్రాంతం విదర్భకు చెందినవాడు. దాంతో సహజంగానే వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గరగా చూశాడు. అందుకే తన విద్యను, అధ్యయనాన్ని వ్యవసాయం మీదనే కొనసాగించాడు. ఫలితంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యాడు. కొంతకాలానికి సొంతపొలంలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు. అలా సుమారు పదేళ్లపాటు అంటే 1972 నుంచి 82 వరకు మంచి దిగుబడితో పంటలు పండించాడు. ఎందుకో ఆ తర్వాత అంతకుముందు వచ్చినన్ని దిగుబడులు రాలేదు. దీంతో స్వయంగా పరిశోధనలలోకి దిగాడు. నిపుణులను అడిగాడు. సర్వేనివేదికలు తెప్పించుకుని చూశాడు.దిగుబడి పెంచుకోవడానికి అప్పటికి ఆయనకు కనిపించిన ఒకటే మార్గం మరిన్ని రసాయనిక మందులు వాడటం. ‘సరే, ఇప్పుడంటే మందులు ఎక్కువ వాడతాను, మరలా కొన్నేళ్లకు దిగుబడులు పడిపోతే ఏంటి పరిస్థితి? అపుడింకా ఎక్కువ వాడాలా? మందులవాడకాన్ని ఎంతకాలమని ఇలా పెంచుకుంటూ పోతాం…’ అన్న అంతర్మథనం ఆయనలో మొదలైంది. దీనికేదో ఒక మార్గం కనిపెట్టాల్సిందే అనుకున్నాడు. రసాయనిక ఎరువుల లాభ-నష్టాలపై మూడేళ్లపాటు పరిశోధిస్తే, దానికన్నా ఆర్గానిక్ వ్యవసాయమే మెరుగ్గా అనిపించింది. ముందుగా భూసారంపై పరిశోధనలు చేశారు.

సేంద్రియ ఎరువుల వల్ల నేల కలుషితం కాదు, పంటల్లో రసాయనాలు ఉండవు, అంతవరకు బాగానే ఉంది కానీ అది చాలా క్లిష్టమైన పద్ధతి. ఒక రకంగా ఖరీదైనదే. ఎక్కువ శ్రమతో కూడినదీ. అందుకే ఆదివాసీ వ్యవసాయ ప్రాంతాలకు వెళ్లాడు. వారి పద్ధతులు గమనించాడు. ప్రకృతి సృష్టించిన జీవ వైవిధ్యమే పాత్ర పంట దిగుబడుల్లో ప్రధాన పోషిస్తోంది గాని మందులు కాదు అని తెలుసుకున్నాడు.

మొక్క కేవలం రెండు శాతం మాత్రమే భూమిలో పోషకాలను ఉపయోగిస్తుంది. మిగతా అంతా గాలి, నీరు, సూర్యరశ్మి నుంచే గ్రహిస్తుందని గ్రహించాడు. ఆ రెండింటినీ సరైన మోతాదులో సరిగ్గా అందించగలిగితే చాలనుకున్నాడు. తన పరిశోధనల్లో భాగంగా మన ప్రాచీన గ్రంథాలను కూడా పరిశీలించాడు.

ఆవుపేడ, గోమూత్రం … ఈ రెండింటికీ మించిన ఎరువు లేదని ఆయనకు అర్థమైంది. దానిపై పరిశోధనలు చేశారు. చివరకు విజయం సాధించారు. కేవలం ఒక ఆవు ఎరువు 30 ఎకరాలు పండించడానికి సరిపోతుందట. పదికిలోల ఆవుపేడ, పదిలీటర్ల గోమూత్రం, రెండుకేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాడు. ఈ మందుకు ఆయన పెట్టిన పేరు ‘జీవ మూత్ర’. దాన్నే పొలంలో వాడారు. దాంతో అత్యధిక దిగుబడులు సాధించారు.

ఒక్క బెల్లం తప్ప బయటనుంచి కొనేదేమీ లేది ఇందులో. పురుగు మందులు అతిగా వాడి పాడైన పొలాలను జీవ మూత్ర మందు మళ్లీ యథాతథ స్థితికి తేగలదు. ఎందుకంటే ప్రతి గ్రాము ఆవు పేడలో 500 కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులుంటాయిట. ఇవి మట్టిని సారవంతం చేస్తాయి. అయితే, విదేశాల నుంది దిగుమతి చేసుకున్న జెర్సీ, ముర్రా జాతి ఆవుల పేడ ఇందుకు పనికిరాదట!

తన పరిశోధన ఫలాలు అందరికీ అందించడం కోసం రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా తిరుగుతూ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నాడు పాలేకర్. సుమారు ఇప్పటివరకు 2000 శిబిరాల కంటే ఎక్కువే నిర్వహించాడు. అరవైలలోనూ అలసి పోకుండా తన పయనం కొనసాగిస్తున్నారు. పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం (జీరో బడ్జెట్ ఫర్ నేచురల్ ఫామింగ్) ప్రధానాంశంగా పలు పుస్తకాలు రాశారు.

తన పరిశోధన ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో వాటిపై రూపాయి కూడా లాభం వేసుకోకుండా ఉత్పాదక వ్యయానికే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు, వ్యవసాయంలో ఎదురయ్యే సందేహాలకు సమాధానాలిచ్చేందుకు ఇంటర్‌నెట్ ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు.

కుటుంబమంతా భూమిపుత్రులే!

సుభాష్ పాలేకర్ మాత్రమే ఆ కుటుంబంలో అందరూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకున్నారు. సుభాష్ వారసుడు అమోల్ కూడా తండ్రి మార్గంలో నడిచారు. ఇందుకోసం ఆయన తన ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. తండ్రి, అన్నల బాటలో అమిత్ తన అడుగులు వేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ కటుంబం మొత్తంతో భూమిపుత్రులుగా మారి, రసాయనిక వ్యవసాయంపై యుద్ధం ప్రకటిస్తున్నారు. సుభాష్ కోడళ్లు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు చేసే ఫోన్ కాల్స్‌కు సమాధానాలిస్తూ వీరితో పాటు ప్రకృతి వ్యవసాయంలో తమ పాత్ర పోషిస్తున్నారు.

మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే సుభాష్ పాలేకర్ అనుసరించే వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే www.palekarzerobudgetnaturalfarming.orgను సంప్రదించవచ్చు. అందులో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. పంటల పండగ సంక్రాంతి రోజున సుభాష్‌కు సలాం!

‘‘కేవలం ఒక ఆవు పేడ 30 ఎకరాలు పండించడానికి సరిపోతుంది. పది కిలోల ఆవు పేడ, పది లీటర్ల గోమూత్రం, రెండు కేజీల బెల్లం, పెసర పిండి (లేదా ఏదైనా ధాన్యపు పిండి) కలిపి సొంతంగా మందు తయారుచేశాను. దాన్నే పొలంలో వాడాను. దాంతో అత్యధిక దిగుబడులు సాధించాను. మందులు అతిగా వాడి పాడైన పొలాలను ఈ జీవ మూత్ర మందు మళ్లీ యథాస్థితికి తేగలదు.’’

పాలేకర్ జీ ప్రకృతి వ్యవసాయం, పాలేకర్ తో ఇంటర్వ్యూ, పాలేకర్ వ్యవసాయ విధానం, ప్రకృతి వ్యవసాయ శిక్షణ మొదలగు వాటికోసం ఇక్కడ క్లిక్ చేయండి

-ప్రకాష్ చిమ్మల

ఆధారము: స్పందన బ్లాగ్

ముక్తిలక్మి విజయ గాధ

అక్షరజ్ఞానం అంతగా తెలియదు.. శాస్ర్తీయ పద్ధతులపెై అవగాహన అసలే లేదు.. చుట్టూ ఉన్న ఆకులు అమలు మాత్రమే తెలుసు వాటిద్వారానే ఆగ్రామ ప్రజలకు వెైద్య సేవలు అందుతాయి. ఎంతటి వ్యాధులెైనా.. రాచపుండులెైనా ఆ వెైద్యంతో మటుమాయం అవుతాయి ఇంతటి శక్తిగల ఆకులు, అలమలు వ్యవసాయ రంగానికి ఎందుకు పనికి రావనేది ఆమె ఆలోచన ఆ ఆలోచనతోనే ప్రతి ఆకును పరిశీలించడం వాటిని పంటపొలాలు, క్రిమికీటకాలపెై ప్రయోగించడం మొదలు పెట్టింది. శాస్తవ్రేత్తలకు దీటుగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులను సాధించేందుకు కావలసిన ఎరువులను తయారు చేసింది. ఆమె ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం శ్రీదుర్గా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు ముక్తిలక్మి. ఆమె ఉపయోగించే వ్యర్థ పదార్థాలు.. ఆకులు అమలు సాధించిన విజయం గురించిన లక్ష్మి చెబుతున్న కథనమే ఇది

పంటకు వచ్చే చీడ పురుగులు, రకరకాల రోగాల పేరుతో భూసారం పెంచేందుకు అడుగు మందులు, నత్రజని వంటి ఖరీదెైన ఎరువులు, పురుగుల మందుల కోసం షాపుల వద్ద క్యూ కట్టి తీసుకోవడం పలు దఫాలుగా రెైతులు నకిలీల బారినపడి పంటలను కోల్పోవడం వంటి సంఘటనలు నిత్యం వింటూనే ఉన్నాం. ఆధునిక ఎరువులతో పండించిన పంటలలో పోష క విలువలు నశించడమే కాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడంతో రకరకాల రోగాల చుట్టు ముడుతున్నాయి. అందుకే కంపోస్టు ఎరువులు సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబిం చాల్సిన అవసరం వుంది. మాకున్న మూడు ఎకరాల పొలంలోనే నా పరిశోధనలు మొదలు పెట్టాను. తొలుత ఈ పద్ధతుల ద్వారా పంటలను సాగుచేయడంతో ఎంతో లాభదాయకమ నిపించింది. దీంతో ఇరుగు పొరుగు వారికి కూడా వీటి గురించి వివరించాను. ఇప్పుడు మా పరిసర ప్రాంతాల్లోని దాదాపు రెండువేల ఎకరాల్లో ఈ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. ఆహార పంటలు, కూరగాయలు పండించడంలో వీటిని పాటిస్తూ రెైతులు అధిక లాభాలను పొందుతున్నారు. రసా యనిక ఎరువులతో పండించిన కూరగాయలకంటే ఈ విధానాల్లో పండించిన కూరగాయలకు మార్కెట్‌లో ఎక్కువ గిరాకీ ఉంటోంది కూడా.

వ్యర్థపదార్థాలే ఎరువులు
మా పరిసర ప్రాంతాల్లో దొరికే వేపాకు, ముష్టి ఆకు, సీతాఫలం ఆకులు, పచ్చి మిరపకాయలు, లొట్టపీచు ఆకు, తూటికాడ, నిమ్మరసం, కోడిగుడ్లు, పులిసిపోయిన మజ్జిగ, ఆవు మూత్రం, ఆవుపేడ, వాయిలాకు, సర్ఫు, పంగల కరల్రు, పసుపు, ఆజోళ్ళ, పచ్చిరొట్ట ఎరువు, ఇంగువకొడిశాకు, ఎరల్రు (వాన పాములు), పప్పుదినుసులు, పొగాకు, వెల్లుల్లి, కిరోసిన్‌, సర్ఫు పౌడర్‌, నీలిరంగు పౌడర్‌, వేపనూనె, శనగపిండి, అడవిపుట్టమన్ను, సహజ సిద్ధంగా లభించే ఇతర చెట్ల ఆకులను వర్మి కంపోస్టు ఎరువులను, కషాయాలతో వరిటానిక్‌ను తయారు చేయడం వంటివి సొంతంగా చేశాను. ఈ పదార్థాలతో పంటల చీడపీడలను నివారించడం చాలా సులభం కూడా. ఇది నేను చేసి చూపించాను కూడా. అందుకే ఇక్కడి రెైతులు నా మాటలను వింటున్నారు.

ఇంతింతెై

లక్ష్మి తయారు చేసిన సేంద్రియ ఎరువులు క్రమంగా గ్రామం నుండి జిల్లా వరకు వ్యాపించాయి. ఆమె అవలంబించిన విధానాలను పదిమందికి వివరించేందుకు ఎంతో శ్రమించారు. ఆమె మొదలు పెట్టిన ఈ విధానాల ద్వారా 2005లో 34 మంది రెైతులు 3 ఎకరాల్లో వర్మీ కంపోస్టు సేంద్రీయ ఎరువు, కషాయాలను ఉపయోగించి అధిక దిగు బడులను పొందారు. 2006లో 77 మంది రెైతులు 118 ఎకరాల్లో, 2007లో 82 మంది రెైతులు 466 ఎకరాల్లో, 2008లో 102 మంది 618 ఎకరాల్లో, 2009లో 136 మంది రెైతులు 986 ఎకరాల్లో, 2010లో 136 మంది 1460 ఎకరాల్లో పత్తి,వరి పంటలకు ఈ కషాయాలను ఉపయోగిస్తున్నారు. ఎన్‌పిఎమ్‌ చేస్తున్న మహిళలకు సిఐఎఫ్‌ (లింకేజ్‌) కింద 10 గ్రూపులకు 2006లో 38 లక్షల రూపాయలు ఐకేపి ద్వారా రుణాలు పొందారు. ప్రతి గ్రూపులోని మహిళలు వర్మీకంపోస్టు ఎరు వులు తయారుచేస్తారు. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయ విధా నాన్ని జిల్లాలోని రామచంద్రాపురం, నల్లబండబోడు, గాంధీ నగర్‌, బచ్చలకోయగూడెం తదితర గ్రామాలలో రెైతులు ఉపయోగిస్తున్నారు.

ఎరువుల తయారీ విధానం.

 • నాడే కాంపోస్ట్‌ ఎరువు : రంధ్రాలున్న తడికలను నాలుగు వెైపులా కట్టి వివిధ రకాల పచ్చిరొట్ట(పచ్చిఆకులు) పేడను చిక్కగా కలిపి రొట్టమీద చల్లుతారు. కుళ్లిన తర్వాత అది ఎరువుగా మారుతుంది.
 • వానపాముల ఎరువు : తొట్లలో బెడ్లు కట్టి ఫ్లోరింగ్‌ మామూలుగా చేసి కొబ్బరిపీచు, ఎరువును పోసి బయటి నుంచి తెచ్చిన వానపాములు వేసి 45 రోజు ల తర్వాత వానపాముల విసర్జక పదార్థం వర్మీకం పోస్టు ఎరువు తయారవుతుంది. దీనిలో 16 రకా ల పోషకాలు ఉంటాయి. భూమిలో తేమశాతం ఉండి, భూమి సారవంతంగా ఉండడంతో మొ క్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. తెగుళ్లు, చీడ, పీడలు పంటలకు సోకవు.
 • తూటికాడ (లొట్టపీచు) లేదా శీలేంద్రం ఎరువు : తూటిఆకు, ఆవుమూత్రాన్ని కలిపి ఉడక పెట్టాలి. అటు తర్వాత కిరోసిన్‌, సర్ఫు, నీరు కలిపి పంటపొలాలలోని మొ క్క మొదళ్లపెైన పిచికారీ చేస్తే దోమకాటు తోపాటు, తెగుళ్లు, చీడపీడలను నివా రించవచ్చు.
 • కషాయాల తయారీ : వేప ఆకు, ఆవుపేడ, ఆవుమూత్రం, సర్ఫు, వాయిలాకు, ఉడకబెట్టి కషాయం తయారుచేస్తారు. అదేవిధంగా వేపపిండి, సర్ఫు కలిపి కూడా కషాయం తయారుచేస్తారు.
 • రవ్వ ద్రవజీవం : ఆవుపేడ, శనగపిండి, ఆవుమూత్రం, అడవిపుట్టమన్నుతో తయారుచేసిన జీవరసాయనం పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
 • కొడిశ కషాయం : కొడిశ ఆకు, ముష్టి ఆకు, శీతాఫలం ఆకు, వాయిలాకు, వేపాకులతో తయారుచేసిన కషాయం పంటపొలాలకు ఉపయోగిస్తే రెక్కల పురుగు చనిపోతుంది.
 • వరి టానిక్‌ : ఈ ద్రవం వరి ధాన్యం బరువు పెరగడానికి, వరి కంకి పెరుగుదలకు ఉపయో గపడుతుంది. ఈ టానిక్‌ తయారీకి ఏడు రకాల పప్పు దినుసులెైన గోధుమలు, నువ్వులు, పెసలు, కందులు, శనగలు, మినుములు, బొబ్బర్లను ఒక్కరోజు నానపెట్టిన తర్వాత రుబ్బి కషాయాన్ని తయారుచేసి వరిపొలాలకు పిచికారీ చేయాలి.
 • బ్రహ్మాస్త్రం కషాయం : పొగాకు, వేపాకు, ఆవుపేడ, ఆవుమూత్రం, సర్ఫు, నీరు కలిపి ఈ కషాయాన్ని తయారుచేస్తారు.

ప్రముఖుల అభినందనలు

 • ముక్తి లక్ష్మికి పురుగు మందులు లేని వ్యవసాయ విధానానికి విశేష కృషి చేసినందుకు ఆగస్టు 15, 2008లో అప్పటి కలెక్టర్‌ శశిభూషణ్‌కుమార్‌ ఉత్తమ మహిళా రెైతు అవార్డును అంద జేశారు.
 • కేంద్రమంత్రి జెైరామ్‌ రమేష్‌ ముక్తి లక్ష్మిని ప్రసంశాపత్రంతో అభినందించారు.
 • ఏలూరులో జరిగిన రెైతు సదస్సులో మాజీ ముఖ్యమంత్రి వెైఎస్‌.రాజశేఖరరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌లు అభినందించారు.
 • జాతీయ ఆంగ్ల మాసపత్రిక ‘‘డౌన్‌ టు ఎర్త్‌’’ ముక్తి లక్ష్మిని ఒక శక్తి వనరుగా 2006, మే 31న పేర్కొనడం విశేషం.
 • బీహార్‌ రాష్ట్ర కలెక్టర్ల బృందం జూన్‌8, 2006లో ముక్తి లక్ష్మి చేస్తున్న సుస్థిర వ్యవసాయ విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు. ప్రతి సోమవారం సమీప గ్రామీణ ప్రాంతాల్లోని పంటపొలాలను, అంతరపంటలను పరిశీలించి వారికి తగిన సూచనలు ఇస్తున్నట్లు ముక్తి లక్ష్మి తెలిపారు.
 • మహిళా ప్రగతిని పరిశీలించిన ఇతర ప్రాంతాలవారు ఖమ్మం జిల్లాతోపాటు, మహబూబ్‌ నగర్‌ జిల్లా ఐకెపి సమాఖ్య బృందాలు, బీహార్‌ కలెక్టర్ల బృందం, కర్నాటక శాస్తవ్రేత్తలు, మహారాష్ట్ర రెైతులు, చెనె్నై వ్యవసాయ విద్యార్థులు, బంగ్లాదేశ్‌ వ్యవసాయాధికారులు, ప్రపంచబ్యాంకు బృందం అనేకసార్లు ఈ గ్రామంలో పర్యటించి మహిళల కృషిని ప్రశంసించారు.

స్వల్ప ఖర్చులు అధిక దిగుబడులు
సిఆర్‌డిఎస్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఇందిరా క్రాంతి పథకం ఆర్థిక సహకారంతో సుస్థిర వ్యవసాయ పద్ధతిలో రామచంద్రాపురం, గాంధీనగర్‌, బచ్చలికోయగూడెం గ్రామాల్లో రెైతులు పత్తి, వరి పంటలను సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు అమలుచేస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
- ఈలగాలి బిక్షం, స్టాప్‌ రిపోర్టర్‌, ఖమ్మం

ఆధారము: ప్రమోట్ తెలుగు

మామిడి రా'రాజులు'

ఇన్నాళ్లూ మండుటెండల్లో వేపుకుతిన్న వేసవి.. మరికొన్ని రోజుల్లో వెళ్లిపోతోంది. వేసవి ఎండల్ని భరించిన అందరికీ మధురమైన జ్ఞాపకం ఏదైనా ఉందా అంటే .. అది మామిడి మాధుర్యం అనే చెప్పవచ్చు. పండ్ల రుచుల్ని ఆస్వాదించిన వాళ్లకే కాదు. మామిడిని సాగు చేస్తున్న రాజుల కుటుంబాలకూ ఇదే అనుభవాన్ని మిగిల్చి వెళుతోంది ఈ వేసవి. మామిడి సాగులో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా.. పరువు కోసం పంట పండించే ఈ సామాజిక వర్గం విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో వేలాది ఎకరాల మామిడి తోటల్ని సాగు చేస్తోంది. తరతరాల వారసత్వ సంపదగా భావిస్తోంది. దేశంలోనే అరుదైన మామిడి రకాల్ని పండించి.. ప్రధాన నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతుల్ని చేస్తోంది.

పండ్లలో రారాజు?
మధురఫలం, అదేనండీ మామిడి.
మరి, మామిడిని పండించడంలో మారాజులు ఎవరు?
ఇంకెవరు? విజయనగరం రాజులు.
రాజులు రాజ్యాలను కోల్పోయినా.. మామిడితోటల మీద మమకారాన్ని ఇప్పటికీ వదులుకోవడం లేదు.

విజయనగరం, బొబ్బిలి ఒకప్పటి రాజుల సంస్థానాలు. ఇప్పుడవి లేవు కాని, వాళ్ల అడుగుజాడల్లో మొలకెత్తిన విలాసమైన మామిడితోటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. తోటల సాగులో నష్టమొచ్చినా, కష్టమొచ్చినా.. రాజదర్పం ఊరికే ఉండనిస్తుందా? అప్పులు చేసైనా సరే, ఆస్తులు కరిగిపోయినా సరే.. పచ్చటి తోటలు కళకళలాడాల్సిందేనంటున్నారు రాజులు. తోటల్లోనే రాజప్రాసాదాలు నిర్మించి (గెస్ట్‌హౌస్‌లు) మామిడిని పండించడం వీరి సంప్రదాయం. ఈ సంస్కృతి పాతకాలం రాజుల నుంచే వచ్చినా ఇప్పటికీ కొనసాగుతోంది. తాతతండ్రుల నుంచి వచ్చిన మామిడి తోటలంటే ప్రతి రాజు కుటుంబానికీ మహా ప్రీతి.

విజయనగరంలో అప్పటి రాజవంశీయులైన పీవీజీ రాజు మొదలుకొని ఆయన కుమారులు ఆనంద గజపతిరాజు, అశోక్‌గజపతి రాజుల వరకు మామిడితోటల సాగును వారసత్వ సంపదగా భావిస్తున్నారు. బొబ్బిలి సంస్థాన పాలకులైనవెలమదొర రాజారావు బహుదూర్ రంగారావు కుటుంబం మామిడి తోటలకు పెట్టింది పేరు. ఈ రెండు కుటుంబాల రాజవంశీయులతోనే మామిడితోపుల సాగుకు బాటలు పడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఇందులో 15 వేల హెక్టార్లను రాజుల సామాజికవర్గమే సాగు చేస్తున్నది.

మామిడిపంటల మీద రాజులకు ఎప్పటి నుంచో మోజుంది. బొబ్బిలి సంస్థానంలో ఒకటైన రాజాం (శ్రీకాకుళం) కోట పరిసరాల్లో 'గుర్రాం' అనే ఒక రకం మామిడి చెట్టు ఉండేదట. ఆ చెట్టు పండ్లు రాలిన వెంటనే బొబ్బిలి రాజావారికి అందజేయడానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసేవారట. అలనాడు రాజుల మనసుదోచిన ఆ మామిడి పండ్లకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. ఒకప్పటి తీపిగుర్తుగా గుర్రాం రకం మామిడితోటల్ని వెలమదొరలు ఈనాటికీ వందలాది ఎకరాల్లో సాగు చేస్తుండటం విశేషం. బొబ్బిలి వెలమదొర సాలా వెంకట మురళి కృష్ణ వంద ఎకరాల్లో 30 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు. అత్యంత నాణ్యమైన 'కేసరి' రకానికి 2009లో రాష్ట్రస్థాయి ప్ర«థమ బహుమతి దక్కింది. అమ్రపాలి, నీలిమ రకాలకు కూడా ఆ తరువాతి సంవత్సరం మరో అవార్డు లభించింది. విజయనగరం, బొబ్బిలిలోని మామిడితోటల మాధుర్యం.. ఢిల్లీని కూడా తాకింది. సీజన్ వచ్చిందంటే చాలు.. రాజధాని నుంచి మామిడి వ్యాపారులు ఉత్తరాంధ్రకు పరిగెత్తుకొస్తారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తున్నారు.

తోటలే బంగారం...
రాజుల మామిడికి దేశవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ రావడం వెనుక తరాల శ్రమ దాగుంది. లాభాల కోసం రాజులు వ్యవసాయం చేయరు. నిష్టతో ప్రతిష్ట కోసం పంట పండిస్తారు. చదువు సంధ్యలకంటే మామిడితోటల పెంపకంపైనే ఎక్కువ శ్రధ్ధ కనబరుస్తారు. మొక్కలు నాటిన రోజు నుంచి పెరిగి పెద్దయి, కాపుకొచ్చే వరకు వారి కంటి మీద కును కుండదు. నిజానికి ఈ ప్రాంతంలో మామి డికంటే.. సరు గుడు తోటల సాగే బాగా గిట్టుబాటు అవుతుంది. కాని రాజులు మామిడిని కాదని మరో పంటను సాగు చేసేందుకు ఇష్ట పడరు. "ఎకరా సరుగుడు తోటకు ఎంత లేదన్నా రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం వస్తుంది.

కాని ఇవి భూగర్భజలాలను హరిస్తాయి. అందుకే మా కుటుంబాలకు మామిడి తోటలంటేనే ప్రాణం. మామిడి పర్యా వరణానికి మేలు చేస్తుంది. పది మందికి తియ్యటి ఫలాల్ని అందించామన్న సంతృప్తిని మిగిలిస్తుంది. అందుకే దిగుబడి ఎంత వచ్చినా వెనుకంజ వసే ప్రసక్తే లేదు'' అంటు న్నారు రాజులు. మధ్య తరగతి కుటుం బాలు ఎంత బంగారం ఉంటే అంత భద్రత ఉన్నట్లు భావిస్తారు. రాజులు కుటుంబాల్లో అలా కాదు. పెళ్లిళ్లతో బంధు త్వాల్ని కలుపు కోవాలన్నా, ఎన్ని ఎకరాల మామిడి తోటలు ఉన్నాయో? చూశాకే ఇంట్లో మేళ తాళాలు మోగుతాయి. ఆడ పిల్లలకు బంగారానికి బదులు మామిడితోటల్ని కట్నంగా రాసిస్తా రంటే.. వాటికున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడ ఎక్కువ సాగు..?
ఆలమండ, భీమాలి, జొన్నవలస, గంట్యాడ, డెంకాడ, కొత్త వలసలలో వేలాది ఎకరాల మామిడి తోటల్ని రాజులే సాగు చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి పరిధిలో వెలమదొరల తోటలు ఉన్నాయి. మామిడి మొక్కల నర్సరీలను కూడా రాజులే పెంచుతున్నారు. ఎల్.కోటలోని భీమాలి రాజుల నర్సరీలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా పేరొందిన మేలైన మామిడి రకాల మొక్కలు ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. విజయనగరం, బొబ్బిలి రాజులు సాగు చేస్తున్నన్ని మామిడి రకాలు మరెక్కడా సాగు కావడం లేదు. వ్యాపార అవసరాల కోసం వేసిన దేశవాళీ, హైబ్రీడ్, నార్త్ ఇండియా, సౌత్ఇండియాలతో కలిపి 50 మామిడి రకాలను సాగు చేస్తున్నారు. బంగినపల్లి, సువర్ణరేక, పనుకులు, చిన్నరసం, పెద్దరసం, చెరుకురసం, బారామతి (పునాస మామిడి), కోలంగోవ, హిమామ్ పసంద్, దసేరీ, లంగడా, నీలం, మల్లిక, ఆమ్రపాలి, కేసర్, సఫేదా, సుయా, నీలుద్దీన్, నీలిషాన్, జహంగీర్, స్వర్ణ జహంగీర్, పెద్ద సువర్ణరేక, పోలిపిల్లి సువర్ణరేక, పానకాలు, ఆల్ఫాన్సో వంటి రకాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.

'మార్చి'కొస్తే మంచిది...
ఇక్కడి వాతావరణానికి సరిపోయే పనుకు మామిడి, రాజు మామిడి రకాలను మొట్టమొదట విజయనగరంలో సాగుచేసింది రాజులే. అయితే సువర్ణరేక, బంగినపల్లి రకాల మాదిరిగానే ఇవి కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు దిగుబడి రాకపోవడంతో రైతులకు ఇబ్బందులొస్తున్నాయి. అందుకే, మార్చిలోపు పంట చేతికొచ్చే కొత్త రకాల కోసం అన్వేషిస్తున్నారు. మార్చి తరువాత ఏప్రిల్‌లో విపరీతమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటకు నష్టం వాటిల్లుతోందని రాజుల అభిప్రాయం. మార్చిలోపు పంట చేతికొస్తే, వాతావరణ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. అందుకే ఇలాంటి రకాల కోసం పరిశోధించాలని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు (ఐఏఆర్ఐ) జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోషియేషన్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మధ్య ఐఏఆర్ఐ పరిశోధనల్లో వెలువడిన కొత్త రకాలు.. పూసాప్రతిపా, పూసా ఫాస్ట్, పూసా లాలీమాలు కూడా మార్చి తర్వాతే దిగుబడిని ఇస్తున్నాయి.

మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు విజయనగరం జిల్లా నుంచి కేవలం మామిడి వ్యాపార ఎగుమతుల వల్లే.. ఈస్ట్‌కోస్టు రైల్వేకు రూ.5 కోట్లు రాబడి వస్తుంది. రైల్వే వ్యాగన్‌ల ద్వారా విజయనగరం నుంచి న్యూఢిల్లీకి మామిడి పండ్లు ఎగుమతి అవుతాయి. ఏడాది ముందుగానే ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి రైతులకు పెట్టుబడులు ఇచ్చి మరీ మామిడి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్క ఢిల్లీయే కాకుండా, కోల్‌కతా, ఒడిశ్సాలకూ విజయనగరం నుంచే మామిడి పండ్లు వెళుతున్నాయి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీకి మాత్రమే 40 వ్యాగన్‌ల సరుకు ఎగుమతయ్యింది. ఢిల్లీకి సరుకు చేరాక.. అట్నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు మామిడి వెళుతోంది.

మింగేస్తోన్న రియల్ఎస్టేట్..?
రింగురోడ్లు, సెజ్‌లు, అణువిద్యుత్ ఫ్యాక్టరీలు.. ఇవన్నీ సేద్యపు భూముల్ని మింగేస్తున్నట్లే.. రియల్ఎస్టేట్ దెబ్బకు మామిడితోపులు కూడా మాయమైపోతున్నాయి. తరాల నుంచి కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడితోటలు రకరకాల సమస్యల వల్ల కనుమరుగైపోవడం ఈ ప్రాంతవాసుల్ని కలచి వేస్తోంది.
కొత్తవలసలోని గులిపల్లి దగ్గరున్న మిస్సమ్మ మామిడి తోటలంటే చుట్టుపట్టు పల్లెల్లో పెద్ద పేరుండేది. సుమారు 200 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలు ఇప్పుడు కనిపించడం లేదు. వన్నెపాలెంలో వందేళ్ల వయసున్న 300 ఎకరాల మామిడి తోటలు ఉండేవి. దిగుబడి తగ్గిపోవడంతో.. మామిడి చెట్లను తొలగించి లే అవుట్లను వేశారు. ఈ తోటలన్నీ ఒకప్పుడు రాజులవే! ఎన్ని సంక్షోభాలు ఎదురయినా.. మామిడితోటల పెంపకంపై వారి ఆసక్తి మాత్రం చావడం లేదు. అందుకే, భూముల్ని అమ్మేసినా.. మరో ప్రాంతంలో భూముల్ని కొనుగోలు చేసి, కొత్త తోటల్ని సాగు చేస్తున్నారు.

ఒక్కొక్క రైతుదీ ఒక్కో కథ..
విజయనగరవాసి మునగపాటి సీతారామరాజు కుటుంబానికి వందేళ్లుగా మామిడితోటలే జీవనాధారం. తాత నారాయణరాజు నుంచి తండ్రి రామ్మూర్తిరాజుకు మామిడితోట వారసత్వంగా వచ్చింది. "నాకు నా చిన్నతనం నుంచే మామిడితోటలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అందుకే, ఆ తోటల్ని విడిచి నేను పెద్ద చదువులు కూడా చదువుకోలేక పోయాను. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లకు మంచి చదువులు అబ్బలేదు. మామిడితోటల మీదే ఆసక్తి ఏర్పడింది..'' అన్నారు సీతారామ రాజు. ప్రస్తుతం జిల్లా మ్యాంగో గ్రోవర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన విజయనగరం లాంటి జిల్లాలో వరి పంట తరువాత రైతుకు ఆదాయాన్నిచ్చే మేలైన పంటలు ఏవీ లేవంటారు. జిల్లాలో జనుము, వేరుశనగ సాగు పూర్తిగా అంతరిం చింది.

అందుకే, పల్లపు భూముల్లోనూ మామిడిని పండిస్తు న్నారు. ఇక్కడ మామిడిసాగు కుటుంబ ప్రతిష్టకు సంబంధించినది కూడా. దాని కోసం ఏమైనా చేస్తాం అంటారు కొత్తవలస రైతు దండు నరశింహరాజు లాంటి వాళ్లు. మొక్కలు పెంచే సమయంలో నీళ్లు లేకపోతే.. రెండ్రోజులకు ఓసారి స్వయంగా నీళ్లు పోసి పోషించుకున్నారాయన. మామిడి ఎగుమతి గురించి మాట్లాడుతూ "పెద్ద మార్కెట్‌లకు ఒకేసారి అన్ని ప్రాంతాల నుంచి మామిడి ఎగుమతి అవుతోంది. దీంతో మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తే రైతులకు మేలు జరుగుతుంది..'' అన్నారు రాజు. నలభై ఎకరాల్లో మామిడి తోటను సాగుచేస్తున్న నరశింహ రాజు ఏడాదికి పెట్టుబడి కిందే రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది భారమైనా మారే ఆలోచన చేయడం లేదు. "ఇంత పెట్టు బడిపెట్టి నష్టపోయే బదులు మరో పంట వేసుకోవచ్చు కదా'' అని తోటి రైతులు చెప్పినా రాజుకు మామిడిని వదిలే ఉద్దేశ్యం లేదిప్పుడు. ఎందుకంటే, ఆయనకు మామిడి తోటలతో 60 ఏళ్ల అనుబంధం ఉంది. తోటల సమీపంలోనే రూ.30లక్షలతో అతిథి గృహాన్ని నిర్మించుకుని సంతోషంగా జీవిస్తున్నారు శివరామరాజు కుటుంబీకులు.

మామిడి రైతులు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య దళారీ వ్యవస్థ. దీన్ని తగ్గిస్తే రాజుల మామిడితోటలు ఇంత వేగంగా కరిగిపోవంటున్నారు లక్కవరపుకోట మండలం భీమాలికి చెందిన రైతు ముదునూరు జోగి జగన్నాథరాజు. మామిడిని సాగు చేయడంలో ఈ కుటుంబానికి ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఎకరాల్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నది. "దళారీల వల్ల మాలాంటి కౌలు రైతులకు నష్టాలే మిగులుతున్నాయి..'' అని ఆవేదన వ్యక్తం చేశారాయన. రాజుకు చెందిన ఇద్దరు కొడుకులు కూడా మామిడి సాగు మీదే జీవనం సాగిస్తున్నారు.

నర్సరీలను పెంచుతూ..
ఏ పరిశోధనశాలలో కొత్తరకం మామిడి మొక్కను ఉత్పత్తి చేసినా.. విజయనగరం, బొబ్బిలికి రావాల్సిందే. అందుకే, నర్సరీలను సైతం ఇక్కడి రైతులే నిర్వహిస్తున్నారు. బంగినపల్లి, కోలంగోవ, పణు మామిడి రకాల మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి. "మేము నర్సరీలను పెంచుతున్నాం. అయితే, ఇక్కడ వస్తున్న ఇబ్బందల్లా ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాలు లేకపోవడం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మామిడి యార్డులను ఏర్పాటు చేస్తే మంచిది. రైతులే నేరుగా పంటల్ని తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పటికే విజయవాడ, రాజమండ్రిలలో ఈ పద్ధతి అమలవుతోంది'' అంటున్నారు భీమాలికి చెందిన కమ్మెళ్ల కృష్ణంరాజు.

మామిడి సాగులో తరిస్తున్న రాజుల కుటుంబాలు.. వ్యాపార అవసరాలకే పంట పండించరు. తోటల్లోకి కొన్ని మధురమైన మామిడి చెట్లను సొంతానికి కూడా పెంచుకుంటారు. బంధువులు, స్నేహితులకు ప్రతి సీజన్‌లోనూ మామిడి పండ్లను అభిమానంతో బహుమానంగా పంపించడం అలవాటు. "సేద్యంలో దిగుబడి అనేది శ్రమకు దక్కే ప్రతిఫలం. ఆ ఫలితాన్ని పదిమందితో పంచుకుంటే గొప్ప సంతృప్తి కలుగుతుంది. అందుకే, మాకు మామిడి వాణిజ్య పంటే కాదు. అనుబంధాల్ని మరింత మధురం చేసే పంట'' అంటూ తరిస్తున్నారు రాజు కుటుంబాల్లోని మామిడి రైతులు.

మాది వందేళ్ల తీపి బంధం
మామిడి తోటలతో మా కుటుంబానికి వందేళ్ల అనుబంధం అల్లుకుంది. ముత్తాతల నుంచి తోటల పెంపకం, వ్యాపారం చేస్తున్నాము. మా నాన్నగారి తరం వరకు మామిడి సాగుతోపాటు వ్యాపారమూ లాభసాటిగానే ఉండేది. ఇప్పుడు భారంగా మారింది. రైతులు, వ్యాపారులు ఇద్దరూ సంతోషంగా లేరు.
ప్రస్తుతం భీమాలిలో నర్సరీని పెంచుతున్నాం. రైతులకు మొక్కల్ని సరఫరా చేసి.. బతుకుతున్నాం. ఇన్నాళ్లూ మామిడి తోటలే మమ్మల్ని బతికించాయి. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కదాని.. మరో పని చేయడానికి సిద్ధంగా లేము. రాజుల కుటుంబాల్లో ఎంత నిరుపేదలైనా కూలి పని చేయడానికి ఇష్టపడరు. అందుకే, ఈ బాధలు పడుతున్నాం.

- ముదునూరు గోపాలకృష్ణ, బలిగట్టం

30 రకాలను సాగు చేస్తున్నాం
దేశంలో దొరికే మామిడి రకాలన్నీ మా తోటలో పండించాలన్నదే మా ఆశయం. ప్రస్తుతం వందెకరాల భూమిలో 30 రకాల మామిడి చెట్లను పెంచుతున్నాం. మామిడి సాగులో మా కుటుంబానికి వందేళ్ల అనుభవం ఉంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హైబ్రిడ్, స్థానిక రకాలు మంచి దిగుబడినే ఇస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం సువర్ణరేక, బంగినపల్లి, కోలంగోవ, కలెక్టరు రకాలను పండిస్తాం. ఇంటికి, బంధుమిత్రులకు నార్త్ ఇండియా రకాలైన దశరి, అయినా, లాంగరా, సఫేదా, కేసరి, మాల్టా, మాల్‌గోవా, రత్నా, అల్పాన్జో రకాలను వేశాము. కేసరి రకానికి 2009లో రాష్ట్రస్థాయి మామిడి పోటీలో ప్రథమ బహుమతి దక్కింది. సౌత్ ఇండియా మామిడి రకాలైన నీలిమా, ఆమ్రపాలి, రకాలకు 2010లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. స్థానిక రకాలైన బొబ్బిలి పీచు, మెట్టవలస, ఫిరంగి లడ్డూ, గుర్రాం, కృష్ణపసందు, స్వర్ణ సింధూ, జలాలు కూడా మధురంగా ఉంటాయి. మెట్టవలసపీచు, బొబ్బిలి పీచులనే మామిడి రకాల్లో.. 70 పండ్ల ధర రూ.7000 పలికింది.

కౌలు భూమి తగ్గింది...
ఒకప్పుడు వందల ఎకరాల్ని తీసుకుని కౌలుకు సాగు చేశాం. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తే ఏమీ మిగలడం లేదు. మామిడితోటలున్న భూములు కూడా తగ్గిపోయాయి. ఉన్నంతలో తక్కువ విస్తీర్ణంలో అయినా.. సొంతంగా సేద్యం చేస్తున్నాం. ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. అది కూలీల సమస్య. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంతో అన్ని గ్రామాల్లోనూ కూలీల కొరత ఏర్పడింది. అక్కడక్కడ దొరికే కూలీలు కూలీ రేట్లు పేంచేశారు. వస్తున్న దిగుబడికి, పెడుతున్న పెట్టుబడికి సరిపోవడం లేదు. అన్ని పంటల్లాగే మామిడికీ ఇవే కష్టాలొచ్చాయి. వీటన్నిటికి తోడు దళారులు మమ్మల్ని తినేస్తున్నారు.

- ఎం.వెంకట సత్యనారాయణరాజు, కొత్తవలస

రైతులు మారాలి..
మారుతున్న కాలానికి అను గుణంగా మామిడి రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం లేదు. అలా చేస్తే మరింత దిగుబడి పెరుగుతుంది. వందలాది ఎకరాల్లో తోటలు సాగుచేసినప్పుడు ఎకరానికి మరో ఎకరానికి కొంత దూరం ఉండాలి. చెట్లు సంఖ్య పెరగాలనే ఆశతో రైతులు ఇలాంటి పద్ధతుల్ని అమలు చేయడం లేదు. దీనివల్ల మామిడి కోతలప్పుడు.. కాయలు రాలిపోయే అవకాశం ఉంది. దిగుబడి అమ్మకాల్లో కూడా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు పంటను అమ్మేస్తున్నారు. సీజన్‌లో పెరిగే ధరలు మాత్రం రైతులకు దక్కడం లేదు. అందుకే, రైతులే పంట ఉత్పత్తుల్ని నేరుగా అమ్ముకునే పరిస్థితి రావాలి.

- రహీమ్, ఉద్యానవన శాఖాధికారి, విజయనగరం

ఆధారము: రైతు బ్లాగ్

'గ్రీన్‌బేసిక్స్' సంస్థ

గడచిన పదేళ్లలో బియ్యం ధర మూడింతలైంది. పప్పులూ కొండెక్కి కూచున్నాయి. అంతగా ధరలు పెరిగినప్పుడు వాటిని పండించే రైతులు ఈ పదేళ్లలో లక్షాధికారులై ఉండాలి కదా. అలా జరగకపోగా వాళ్ల స్థితిగతులు నానాటికీ తీసికట్టుగా ఎందుకు తయారవుతున్నట్టు? ప్రతిరోజూ వార్తల్లో రైతు ఆత్మహత్యల సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్టు? ఇలా ఆలోచించి వ్యవసాయాన్ని లాభసాటి ఉపాధిగా తయారుచెయ్యడానికి కంకణం కట్టుకున్నారు ముగ్గురు యువకులు. మూడేళ్ల క్రితం వాళ్లు స్థాపించిన 'గ్రీన్‌బేసిక్స్' సంస్థ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వందల ఎకరాల్లో సిరుల పంటలు పండిస్తోంది. రైతులకు ఆలంబనగా ఉంటోంది.

ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి రమణబాబు, ప్రేమ్‌సాగర్‌రాజు, ఒడిశాకు చెందిన మదన్‌మోహన్ - ముగ్గురూ వ్యవసాయంలో పట్టభద్రులే.ముగ్గురివీ గ్రామీణ నేపథ్యాలే కావడంతో, వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండగలా చెయ్యాలనే ఆలోచన వారికి ముందునుంచీ ఉండేది. అనుకోకుండా ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో విద్యార్థులుగా కలిసిన వీరు 'విత్తనాల చల్లడం మొదలు కోతల వరకు' రైతుకు సాంకేతిక సాయం అందేలా ఒక వినూత్నమైన వ్యాపార ఆలోచనను కాగితాలమీదికెక్కించారు. దీని ద్వారా ఆదాయం పొందుతూనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా చేస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన 'ఐడియా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్' పోటీల్లో జాతీయ స్థాయి విజేతగా నిలవడంతో అది బాగా ప్రాచుర్యం పొందింది. ఐదేళ్ల క్రితం సంగతిది. రెండేళ్ల హోమ్‌వర్క్ తర్వాత అదే 'గ్రీన్‌బేసిక్స్' సంస్థగా ప్రాణం పోసుకుంది.

సేవ చేస్తాం, విస్తరిస్తాం
పాతిక లక్షల పెట్టుబడితో నోటి మాటే ప్రచారంగా పొలం పనుల్లోకి దిగింది 'గ్రీన్ బేసిక్స్'. రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల సాయంతో వాటిని పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా రైతులకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను లాభసాటిగా అమ్ముకొనే పద్ధతులనూ సూచిస్తుంది. "వ్యవసాయాన్ని వ్యవస్థీకృత పరిశ్రమగా రూపొందించాలి.

ప్రతి రైతూ అందులో భాగస్వామి కావాలి, అందుబాటులో ఉన్న వనరులనే మరింత సమర్థంగా ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులను, లాభాలను పొందాలి. ఇదే మా గ్రీన్ బేసిక్స్ దృక్పథం. రైతు సమస్యలకు సమగ్రమైన పరిష్కారాలను రూపొందించడమే మా లక్ష్యం'' అంటున్నారు వ్యవస్థాపకుల్లో ఒకరైన రమణబాబు. ప్రస్తుతానికి గ్రీన్‌బేసిక్స్ సేవలు మన రాష్ట్రంలో వరి పండించే రైతులకే పరిమితం. వీరి సేవల వల్ల రైతులకు విత్తనాల కోసం పడిగాపులు పడటం, కూలీల కోసం ఎదురుచూడటమనే బాధలు తప్పుతున్నాయి.

దిగుబడిలో ఇరవై శాతం దాకా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటి వరకూ గ్రీన్‌బేసిక్స్ దాదాపు ఐదొందల ఎకరాల్లో 300 మంది రైతులతో కలిసి పనిచేసింది. 2500 మంది రైతులకు మేలురకం విత్తనాల ఉత్పత్తిలో శిక్షణనిచ్చింది. నలభై గ్రామాల్లో నాబార్డ్ నెలకొల్పిన రైతు క్లబ్బులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకునేలా తర్ఫీదిచ్చింది. వచ్చే సీజన్‌లో మరింతమంది రైతులకు అందుబాటులో ఉండటానికి ఈ బృందం కృషి చేస్తోంది.

పేదల ఉపాధా - పెద్దల హాబీనా?
విమర్శలను పక్కకు పెట్టి వాస్తవాలను పరిశీలిస్తే, ఇప్పటి తరాలకు సైతం మట్టి పట్ల అనుబంధం ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలోనో, మరోచోటో చేరి, మంచి సంపాదన మొదలవగానే వ్యవసాయ భూమి కొద్దిగానైనా కొనుక్కోవాలని ఆశపడుతున్న యువత బోలెడుమంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు సైతం పుట్టినూరికి దగ్గరగా పంటపొలాలు కొనుగోలు చేస్తున్నారు. దీనికి భిన్నంగా గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల్లో పుట్టిపెరుగుతున్నవారు మాత్రం పొలం పనికి సిద్ధంగా లేరు. వ్యవసాయం పట్ల వారిలో ఆసక్తి లేదు.

ఆరుగాలం కష్టిస్తే శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుందనే భరోసా లేదు. "ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇదిలాగే కొనసాగుతూ పోతే మన దేశంలో వ్యవసాయం అధిక శాతం ప్రజల జీవనోపాధిగా కాకుండా సంపన్న వర్గాల హాబీగా అయిపోతుంది. యువత నడుంకట్టి పొలం పనుల్లో దిగకపోతే తిండి దొరకని రోజులు దగ్గర్లోనే ఉన్నాయి...'' అని ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గ్రీన్ బేసిక్స్ బృందం "సంప్రదాయ విధానాలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తేనే వ్యవసాయం గిట్టుబాటవుతుంది, లాభాల పంటను పండిస్తుంది'' అని ధైర్యం చెబుతున్నారు. వాళ్ల కృషి ఫలితాలు శ్రీకాకుళం జిల్లాలో వందల ఎకరాల్లో కనిపిస్తున్నాయి.

కొండంత కష్టం - అదే ఇష్టం
"ఆహారోత్పత్తిలో ఎదురవబోతున్న విపత్కర పరిస్థితుల గురించి ఎవరికీ అవగాహన ఉండటం లేదు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు. ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేవు. ఇవన్నీ కలిసి వ్యవసాయ రంగాన్ని ప్రమాదకర మైన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మేలుకోకపోతే వినాశనం తప్పదు...''అని కాసింత సీరియస్‌గానే చెబుతున్న రమణబాబు ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అగ్రిబిజినెస్ వంటి అంశాలమీద క్లాసులు కూడా బోధిస్తుంటారు.

"పాఠాలైతే సులువుగా చెప్పొచ్చుగానీ, ఆచరణలో అవన్నీ ఎంత కష్టమో నాకు స్వయంగా తెలుసు. చిన్న కమతాల మీద ఆధార పడి వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం లోని కష్టం మాటల్లో చెప్పలేనిది''అంటున్నాడీ యువకుడు. ఆ కష్టాన్ని సులువు చెయ్యడాన్ని ఇష్టంగా స్వీకరించిన'గ్రీన్‌బేసిక్స్'వంటి బృందాలు మరిన్ని తయారయితే రైతులకు అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకేముంటుంది?

"రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల సాయంతో వాటిని పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా రైతులకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను లాభసాటిగా అమ్ముకొనే పద్ధతులనూ సూచిస్తుంది.''

ఆధారము: రైతు బ్లాగ్

విలక్షణ సేద్యం

మీరు తరచూ సూపర్‌మార్కెట్‌లకు వెళుతుంటారా..? ఈసారి వెళితే.. ఆర్గానిక్ ఫుడ్‌రాక్‌లను చూడండి. అందులో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు ఆకర్షణీయమైన ప్యాక్‌లలో ఆకట్టుకునేలా ఉంటాయి. వాటిని కొనాలని చేతుల్లోకి తీసుకోగానే బహుశా మీకు వచ్చే సందేహం 'ఇది ఆర్గానిక్ ఫుడ్' అని ఎలా నమ్మొచ్చు? అన్న అనుమానం కలుగుతుంది. ఫుడ్‌ప్యాక్‌లను తేరిపార చూస్తే 'ఇండియా ఆర్గానిక్' అన్న లోగో కనిపిస్తుంది. అప్పుడే అది నిజమైన ఆర్గానిక్. ఈ లోగోతో దొరికే ఉత్పత్తుల వెనుక పెద్ద కథే ఉంది. రసాయనాలు లేకుండా పండించే రైతు దగ్గర నుంచి.. ఢిల్లీలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సంస్థ అందించే సర్టిఫికెట్ల వరకు.. మధ్యలో బోలెడు ప్రక్రియలు నడుస్తాయి..

ఇవ్వాళ దేశవ్యాప్తంగా యాభై లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతోంది. ఏటా రూ.2,500 కోట్ల విలువైన సేంద్రీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం మనం. సేంద్రీయ సాగును మరింత పెంచేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతుల సంఖ్య పెంచేందుకు కృషి జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగా- సేంద్రీయ సాగుకు ఒప్పుకున్న రైతులు మొదట సంఘాలుగా ఏర్పడతారు. ఒక్కో సంఘం కింద 50 హెక్టార్ల సాగు భూమి ఉంటుంది. వీరికి ప్రభుత్వమే సేంద్రీయ ఎరువుల్ని సరఫరా చేస్తుంది. వరుసగా మూడేళ్లు మట్టి నమూనాలు, సాగు నీరు, పంట దిగుబడిని పరీక్షిస్తారు. ఈ పరీక్షలన్నీ సాధారణ లాబొరేటరీలలో చేయించకూడదు.
కేంద్ర శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీ (ఎన్ఎమిఎల్) అనుమతించిన కేంద్రాలలోనే చేయించాలి. ఈ పనులన్నీ రైతులు చేసుకోలేరు కనుక.. ప్రభుత్వానికి-రైతుకు మధ్య పనిచేసేందుకు రెండు సంస్థల్ని నియమించారు. మొదటి ఏడాది పరీక్షల తర్వాత కన్వర్షన్ పీరియడ్ అంటారు. మూడో ఏడాది వరకు రైతులు ఎలాంటి రసాయనాలు వాడలేదని నిర్ధారణ కావాలి. ఇలా సేకరించిన వివరాలను 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్' (ఎన్‌పిఒపి)కు పంపించాలి. అప్పుడు సేంద్రీయ రైతుకు 'ఆర్గానిక్ ఫార్మర్'గా సర్టిఫికెట్ వస్తుంది. ఇలా సర్టిఫికెట్లు పొందిన రైతుల వద్దే ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్పత్తులను కొంటాయి. ఏది ఆర్గానిక్ ఉత్పత్తో, ఏది సాధారణ ఉత్పత్తో కొనుగోలుదారులు సులువుగా గుర్తుపట్టేందుకు ఎన్‌పిఒపి ఒక లోగోను తయారుచేసింది. ఆర్గానిక్ మార్కెటింగ్ సంస్థలు ఆ లోగోతోనే ఆహార ఉత్పత్తులను విక్రయించాలి.

మందుల సేద్యం..

కృత్రిమ ఎరువులతో, క్రిమిసంహారక మందులతో ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయం గురించి మనందరికీ తెలుసు. ఒక రైతు పొలానికి మూడుసార్లు మందు కొడితే ఎకరాకు ముప్పై బస్తాల ధాన్యం పండిందని.. పక్క పొలం రైతు అదే మందు డోసు పెంచి, నాలుగుసార్లు కొడతాడు. ఈయనకు నలభై బస్తాలు పండొచ్చు. కాని నేలతల్లి ఏం కావాలి? తిండి పెట్టే తల్లికి మనం తిరిగి ఏమిస్తున్నాం..? జీర్ణం కాని ఎరువుల్ని తినిపిస్తున్నాం. శరీరాన్ని గుల్ల చేసే పురుగుమందులను తాగిస్తున్నాం. ప్రకృతి నేర్పిన సహజ సేద్యాన్ని వదులుకుని, పాడి పశువులతో కళకళలాడే పల్లెల్ని మరిచిపోయాం.
కారణాలు ఏమైనప్పటికీ, రైతులు ఇప్పుడు భూములను నమ్ముకోవడం లేదు. పురుగుమందుల్ని నమ్ముకుంటున్నారు. దానితో భూమి స్వభావం మారిపోయింది. విషాన్ని దిగమింగుతున్న పొలాలు విషతుల్యమైన ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేసుకున్నాయి. ఫలితంగా నయంకాని జబ్బులొస్తున్నాయి. రోగనిరోధక శక్తి పడిపోతోంది. పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. జన్యుపరమైన సమస్యలొస్తున్నాయి. వాతావరణం కలుషితమైపోతోంది. విశ్వం ఉనికికే చేటు తెస్తున్న గ్లోబల్ వార్మింగ్ పెద్ద భూతమై కూర్చుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ పట్టిపీడిస్తున్న సమస్య- యుగాంతం కాదు, యుద్ధభయం కాదు. భూకంపాలో, తుపాన్లో కాదు.. స్లో పాయిజన్‌లా మనిషిని సర్వనాశనం చేస్తున్న రసాయనిక వ్యవసాయం..!

పూర్వం తొలకరి పడగానే రైతులు పొలాలకు పరిగెత్తేవారు. పేడ ఎరువును పొలాల్లో వేసేవారు. నాగలితో దుక్కి చేసినప్పుడు ఆ ఎరువు అటూ ఇటూ పొర్లుతుంది. భూమి లోపలి కొత్త మట్టి పైకొచ్చి పంటకు బలాన్నిచ్చేది. ఇప్పుడు తొలకరి పడగానే రైతులు పొలాలకు వెళ్లడం లేదు. రసాయన ఎరువుల కోసం పరిగెత్తుతున్నారు. దొరుకుతాయో దొరకవో అన్న ఆత్రంతో పురుగుమందుల్ని ముందే కొని బంగారంలా దాచుకుంటున్నారు. ట్రాక్టర్లతో అటొక్కసారి ఇటొక్కసారి గీతలుపెట్టి విత్తనాలు చల్లేస్తున్నారు. ఒకసారి కలుపుతీస్తే రెండుసార్లు మందు కొడుతున్నారు. పంట ఇంటికొచ్చేలోపు ఎన్నిసార్లు మందులు కొడుతున్నారో లెక్కేలేదు. రసాయనాలతో సేద్యం చేస్తే భూమి పాడైపోతుందని, ఆ తిండి తినే మనుషులకు జబ్బులు చేస్తాయని రైతులకు తెలియని విషయాలు కావు. ప్రభుత్వానికి తెలియని విషయాలూ కావు. అయినా మందులు వేస్తే తప్ప పంటలు పండించడం సాధ్యం కాదన్న ప్రమాదకర స్థాయికి చేరింది మన వ్యవసాయం.

సేంద్రీయ మార్గదర్శకులు..
దీన్ని మార్చడానికి కొద్దిమందే అయినా గట్టి ప్రయత్నం చేసినవాళ్లు కొందరు ఉన్నారు
. వారిలో ప్రముఖుడు జపాన్‌కు చెందిన మసనోబు పుకువోకా. ప్రపంచమంతా రసాయన వ్యవసాయంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని మరిచిపోయినప్పుడు, ఎరువులు, పురుగుమందుల ఫ్యాక్టరీల సంఖ్యను రెట్టింపు చేసే పనిలో పడినప్పుడు, వాటిమీద ఆధారపడితేనే సిరులు పండుతాయని రైతులను మభ్యపెడుతున్నప్పుడు.. ఇదెంత ప్రమాదకరమో ఆలోచించినవాడు మసనోబు పుకువోకా. ఆయన ఉద్యోగాన్ని వదిలేసి, పల్లెకు తిరిగొచ్చినప్పుడు "పెద్ద చదువులు చదివినోడివి, రాళ్లురప్పలున్న ఈ పల్లెల్లో ఏం చేస్తావ్?''అన్నారు గ్రామస్థులు. అవేమీ పట్టించుకోకుండా మౌనంగా పొలానికెళ్లిపోయారు. 65 ఏళ్లు కిందా మీదా పడ్డాడు. బోలెడన్ని ప్రయోగాలు చేశాడు. సేంద్రీయ వ్యవసాయంతో అద్భుతాలు పండించాడు.

ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోయారంతా..! అదెలా సాధ్యమో చెప్పేందుకుకే ఆఫ్రికా, ఇండియా, యూరప్, అమెరికా దేశాలన్నీ తిరిగాడు. మందులతో పంటలు పండిస్తే.. రేపటితరాలు అనుభవించాల్సిన బాధలు అన్నీఇన్నీ కావన్నాడాయన. పుకువోకా లేవనెత్తిన సందేహాలు ఆధునిక వ్యవసాయ పద్ధ్దతుల్ని పునరాలోచనలో పడేశాయి. ఆయన రాసిన 'వన్ స్ట్రా రెవల్యూషన్' సంచలనం రేపింది. 'గడ్డిపరకతో విప్లవం' పేరుతో తెలుగులోనూ వచ్చిందది. రసాయన సేద్యం పరుగు పందేన్ని నిలదీసిన తొలి పుస్తకం అది.
గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులో 'దెహ్రి' గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌సావే. ఇప్పుడాయనకు తొంభై ఏళ్లు. తనకున్న 14 ఎకరాలకు 'కల్పవృక్ష' అనే పేరు పెట్టాడు. "నా పొలమే నా విశ్వవిద్యాలయం''అంటాడు ఈ పెద్దమనిషి. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను లాక్కురావాలని పూనుకున్నాడీయన.

హరితవిప్లవ సృష్టికర్త ఎం.ఎస్.స్వామినాథన్‌తో కూడా ఆ విషయాలను చర్చించేవాడు. ఆ ఉత్తరాలన్నీ కలిపి 'ద గ్రేట్ అగ్రికల్చర్ ఛాలెంజ్' అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చాడు. విదేశీయుడైన భరత్‌మిత్రా ఓసారి ఢిల్లీకి వచ్చాడు. అక్కడున్న స్టార్‌హోటళ్లు, ఫ్లైఓవర్‌లు, హై రైజ్ బిల్డింగులు ఆయన్ని ఆకర్షించలేదు. క్యాన్సర్ ఆస్పత్రులు ఆకర్షించాయి. "అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధించిన పురుగుమందులన్నీ ఇండియాకు వస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆస్పత్రుల సంఖ్య పెరుగుతోంది'' అని బాధపడ్డాడు భరత్. భారత్‌లో ఉండిపోయి లక్నోలో 'తులసి'తోటను పెంచాడు. ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగే.

తులసి ఆకులను ప్రాసెస్ చేసి.. తేనీరు, ఆయుర్వేద ఔషధాలను తయారుచేశాడాయన. దేశవ్యాప్తంగా ఆర్గానిక్ తులసికి ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఇలా మొదలైన ఆర్గానిక్ ఉద్యమం ఒక వైపు వ్యాపారం, మరో వైపు చైతన్యం దిశగా విస్తరించింది. ఇంతలో కార్పొరేట్ చూపూ దాని మీద పడింది.

పదివేల మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్స్‌తో మార్కెట్‌లోకి వచ్చింది '24 లెటర్ మంత్ర'. ఇప్పుడది పదకొండు రాష్ట్రాల్లో సేంద్రీయ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది.

మన రాష్ట్రంలో 'శ్రేష్ట' కూడా ఆర్గానిక్ వ్యాపారం చేస్తున్నది.

సేద్యానికి 'గుర్తింపు'..
ప్రస్తుతం మన రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఆర్గానిక్ సర్టిఫైడ్ రైతులున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్గొండ, చిత్తూరు, కడప, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు సేద్యంలో కొత్త అనుభవం పొందుతున్నారు. "ఒక ఆవు రెండు లీటర్లే పాలిస్తుందనుకోండి. అత్యాశకు పోయి నాలుగు లీటర్లు కావాలనుకుంటే పాలకు బదులు రక్తమొస్తుంది. భూమి కూడా అంతే. ఎంత పంటనివ్వాలో అంతే ఇస్తుంది. బలవంతంగా పిండుకోవాలని చూస్తే ఏదో ఒక రోజు అసలు పండే స్వభావాన్నే కోల్పోతుంది..'' అంటాడు ప.గోదావరి జిల్లా నాచుగుంటకు చెందిన 'సర్టిఫైడ్' రైతు భూపతిరాజు రామకృష్ణరాజు.

అయిదేళ్ల నుంచి సేంద్రీయ సాగు చేస్తున్న రాజు.. 'స్వర్ణ', 'పిఎల్1100', 'సాంబమసూరి' రకం ధాన్యాలను పండిస్తున్నాడు. మామూలు సాగులో ఎకరానికి 30 నుంచి 35 బస్తాలొస్తాయి.సేంద్రీయసాగులో 29 బస్తాలొస్తున్నాయి. ఆ లోటు పూడ్చుకునేందుకు.. మార్కెట్‌రేటు కంటే కాస్త ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు చెప్పారు. "ఒక్కసారి నా బియ్యాన్ని వండుకు తిన్నవారు జీవితంలో మానెయ్యలేరు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నాకిప్పుడు 40 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. నూర్పిళ్లు అవుతూనే ఫోన్లు చేస్తారు...'' అంటూ గర్వంగా చెబుతారు రాజు.

ఆర్గానిక్ బియ్యానికే కాదు. సేంద్రీయ అల్లానికి కూడా చాలా గిరాకీ ఉంది. మెదక్ జిల్లా పీచార్యగుడికి చెందిన శ్యామ్‌సన్‌కు నాలుగెకరాల ఎర్రమాగాణి ఉంది. చేనులోనే ముప్పై గజాల లోతు బావి తవ్వాడు. అరకొర నీళ్లతోనే సేంద్రీయ సేద్యం మొదలుపెట్టాడు. "నేనిప్పుడు కేరళ మారన్ వెరైటీ అల్లం వేశాను. ఎకరాకు 40 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వసాయంతో పొలంలోనే వర్మీ కంపోస్టు షెడ్డు కట్టాను. సేంద్రీయ ఎరువుల్ని మేమే తయారు చేసుకుంటాం. మందులు పోసి పంట పండిస్తే మంచిగ పైసలొస్తయి కాని, తినే వాళ్ల ఆరోగ్యం చెడిపోతుంది కదా''అంటాడు శ్యామ్‌సన్. ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఈయనొక్కడే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్. అనంతపురం జిల్లాలో రైతు ల ఆత్మహత్యలకు కరువొక్కటే కారణం కాదు.

అందరి ఇళ్లలో పురుగుమందుల డబ్బాలుండం కూడా ఒక కారణమే..! నీళ్లు లేకపోయినా ఒట్టి మందులు చల్లి వేరుసెనగను పండిస్తారు ఈ జిల్లా రైతులు. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేసిన ప్రహ్లాదరెడ్డికి ఈ బాధలన్నీ తెలుసు. అయినా సరే, మందు కొట్టకుండా వేరుసెనగ పండించి తీరాలనుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి దగ్గర్లోని బొందలదిన్నె అతని సొంతూరు. ఉద్యోగం వద్దనుకుని సేద్యంలోకి దిగాడు. తన అయిదు ఎకరాల పొలం పక్కనే ఉన్న పెన్నానదిలో బోరు వేశాడు. నాలుగించులు నీళ్లు పడ్డాయి. "మాది ఉమ్మడి కుటుంబం. అందరం కలిసి పనిచేస్తాం. సేంద్రీయ ఎరువుల కోసం పది గేదెలు, ఎద్దుల్ని మేపుతున్నాం. ఆర్గానిక్ అగ్రికల్చర్ కోసం 'సహజకృష్ణ రైతు సంఘం' ఏర్పాటు చేశాం. రసాయనాల జోలికే వెళ్లం. వరి, వేరుసెనగ, కంది పంటలు వేస్తాం. ఈ మధ్యనే మా పంటల్ని కొనేందుకు ఓ ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ సంప్రదించింది. ఇది సేంద్రీయ సేద్యం వల్లనే సాధ్యమైంది..''అంటున్నాడు ప్రహ్లాదరెడ్డి.

వేపాకు ఉడకబెట్టి రసం తీసి.. పంటకు చల్లే తిమ్మయ్యను చూస్తే తోటి రైతులకు నవ్వొస్తుంది. "ఇంత పవరున్న మందులు చల్లుతుంటేనే పురుగు చావటం లేదు. నీ వేపాకు రసానికి చచ్చిపోతుందా?'' అని వెక్కిరిస్తారు. చిత్తూరు జిల్లా పచ్చారోళ్లపల్లికి చెందిన తిమ్మయ్య ఇప్పుడు సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతు. మూడేళ్లు కష్టపడితే కాని ఈ సర్టిఫికెట్టు రాలేదు. మూడెకరాల్లో వేరుసెనగ, ఎకరంలో చెరకు వేశాడు. సేంద్రీయంతోనే రుచికరమైన కందిపప్పు పండించి.. కిలో రూ.75కు అమ్ముతున్నాడు. ఇదే కందిపప్పు బయట మార్కెట్‌లో రూ.200 పెడితే కాని దొరకదు. కొండప్రాంతాల్లో వ్యవసాయం చేయడమంటే చాలా కష్టం. వచ్చే దిగుబడీ తక్కువ. అయినా సరే అత్యాశకు పోలేదు సుక్రు గైరమ్మ. విజయనగరం జిల్లా అడ్డతీగ గిరిజన గూడేనికి చెందిన ఈ మహిళా రైతు సేంద్రీయ సేద్యాన్ని ఇష్టపడింది. వరి, రాగులు, జొన్న, సామలు, కొర్రలు పండిస్తోంది.

పంట ఉత్పత్తులను విజయనగరం తీసుకురావాలంటే పడవలో గోస్తనీ నదిని దాటాలి. "సేంద్రీయ సేద్యంలో రైతు కు ఖర్చు తక్కువ. సమాజానికి లాభం ఎక్కువ. నేను చేస్తున్నది మంచి పనేగా'' అంటుందామె. చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రంలోనూ సేంద్రీయ పంటల్ని పండిస్తున్నారు. పాతిక ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయాల్ని పండిస్తున్నారు. సేంద్రీయ రైతుల్ని ప్రభుత్వమే కాదు, స్వచ్ఛందసంస్థలూ ప్రోత్సాహిస్తున్నాయి. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, టింబక్టూ ఆర్గానిక్, ఆర్‌డీటీ, వికాస, చేతన, ఉర్వి.. ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్న సంస్థలు. సాధారణ సేద్యంతో పోల్చితే, సేంద్రీయ సేద్యం పరిధి చాలా తక్కువే కాని భవిష్యత్తు మీద ఆశ కలిగించే సేద్యం ఇదే.

మధ్యవర్తిగా ప్రభుత్వం
రాష్ట్రంలో ఆర్గానిక్ సేద్యం కింద వరి, రాజ్మా, కంది, తృణధాన్యాలు, కూరగాయలు సాగవుతున్నాయి. వీటిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే బయ్యర్స్-సెల్లర్స్ మీట్ పెట్టాం. ఇక్కడికి 20 కంపెనీలొచ్చాయి. సేంద్రీయ రైతుల వివరాలను తీసుకున్నాయవి. మొన్న హైదరాబాద్‌లో జరిగిన హార్టీకల్చర్ ఎక్స్‌పోలో కూడా స్టాల్స్ పెట్టుకునేందుకు రైతులకు అవకాశం ఇచ్చాం. వాళ్లు ఇక్కడికి రావడానికి రవాణా, ఫుడ్‌ప్యాకింగ్ సదుపాయాలను కల్పించాం. సాధారణంగా ఆర్గానిక్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలంటే ఒక్కో రైతుకు రూ.15 వేలు ఖర్చు అవుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికి అయిదు లక్షలు చెల్లించాం.

- మద్దిలేటి, అసిస్టెంట్ డైరెక్టర్,
సేంద్రీయ విభాగం, వ్యవసాయశాఖ

ఆధారము: రైతు బ్లాగ్

దువ్వూరు వరదారెడ్డి విజయగాధ

ఎడారిని తలపించే ఇసుక దిబ్బల్లో 76 ఏళ్ల వరదారెడ్డి తీర్చిదిద్దిన పచ్చని అద్భుతాన్ని మీకు చూపించా లంటే కెమెరాలు పనికిరావు. గూగుల్ ఎర్త్‌లోనే చూడాలి. నెల్లూరు జిల్లాలో బకింగ్‌హామ్ కాలువకీ సముద్రానికీ మధ్యలో ఉండే సిద్ధవరం కుగ్రామంలో 1934లో పుట్టిన దువ్వూరి వరదారెడ్డి ఒక వనసృష్టికర్త. ఐదు కిలోమీటర్ల దారి పొడవునా పరచుకున్నఆ గ్రీన్‌హెవెన్‌కు ఇప్పుడు కోస్టర్ కారిడార్ సెజ్ సునామీ పొంచి ఉంది.

వరదారెడ్డి పుట్టిన సిద్ధవరం గ్రామమంతా ఇసుక తిన్నెలమయం. మహా అంటే మూడొందల గడపలుంటాయి ఆ ఊళ్లో. ఊరికి మూడు పక్కలా 15 కిలోమీటర్ల వరకు ఇసుక మేటలుండి ఎడారిలా కనిపిస్తుంది. పదకొండోతరగతి వరకూ చదివిన వరదారెడ్డి నలభయ్యో యేట తన తల్లికి జబ్బు చేసినపుడు మద్రాస్‌లోని రాయపేట ఆస్పత్రిలో ఆమెను చేర్పించాడు.ఆ సమయంలో రోజూ సమీపంలోని ఎగ్మూర్ లైబ్రరీకి వెళుతూ యాదృచ్ఛికంగా వృక్షశాస్త్ర పుస్తకాలు చదివాడు.

వాటిని చదువుతున్నంత సేపూ తన ఊరే వరదారెడ్డి కళ్లలో మెదిలేది. మద్రాసు నుంచి ఊరికి తిరిగొచ్చిన తర్వాత చుట్ట పక్కల ఊళ్లలో తెలిసిన వాళ్లను అడిగి జీడిమామిడి, వేప, కానుగ, సుబాబుల్, మర్రి వంటి మొక్కల్ని తెప్పించి వర్షాకాలం మొదలయ్యే ముందు ఇసుక నేలలో గుంటలు తవ్వి ప్రత్యేకంగా తాను తయారు చేసిన పేడ ఎరువుపోసి వాటిని నాటేవాడు. అలా నిర్విరామంగా వేలాది మొక్కలు నాటాడు. ఇప్పటికీ నాటుతూనే ఉంటాడు. మరణించే దాకా నాటుతూనే ఉంటానంటాడు. ప్రతీదాన్ని లెక్కించి చేసే వలసవాద బుర్రతో ఇప్పటిదాకా ఎన్ని మొక్కలు నాటి ఉంటారనే ప్రశ్న వేస్తే నవ్వి ఊరుకుంటాడు.

అలా... బ్రహ్మజెముళ్ల ఎడారిని పచ్చని చెట్ల బృందావనంలా మార్చిన 76 ఏళ్ల వరదారెడ్డిని కదిలిస్తే చిన్నపిల్లాడిలా చెట్ల గురించి కథలు కథలుగా చెబుతాడు. ఇసుక నేలల్లో తక్కువ నీటితో అతి తక్కువ ఎరువుతో చెట్లనెలా సాకాలో విపులంగా చెబుతాడు. ఏ రకం మొక్క పక్కన ఏ రకం మొక్కనాటాలో, నారు పోయడమెలానో రకరకాల మెలకువల్ని నిర్విరామంగా చెబుతూ 'చెట్టూ పసిబిడ్డా వొకటే గదబ్బయ్యా!!' అంటూ వున్నట్టుండి మౌనం వహిస్తాడు.

సిద్ధవరం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో 'కనుపూరు' అనే ఊరుంది. ఇసుక దిబ్బల మధ్య ఈ రెండు ఊర్లకు దారి ఉంది. యానాదులు, రైతులు, అందరూ ఈ దారిలో రోజూ నడుస్తుంటారు. ఎండాకాలం అయితే కాళ్లు బొబ్బలెక్కాల్సిందే. ఏటా జరిగే కనుపూరు ముత్యాలమ్మ జాతరకు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలమంది వస్తారు. నాలుగు కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దారికి రెండు వైపులా చెట్లు నాటాడు వరదారెడ్డి.

ఆరేళ్ల క్రితం వేకువజామున మూడు గంటలకే నిద్రలేచి ఎనిమిది గంటల వరకూ గుంటలు తవ్వి ఎరువుపోసి రెండు సంవత్సరాల పాటు రెక్కల కష్టం చేసి ఇసుక పర్రల్లో ఆకుపచ్చని వనాన్ని సాధ్యం చేసి చూపాడు. మొదట్లో వరదారెడ్డి చేసే ఈ పని చూసి కొందరు 'రెడ్డి భూమంతా ఆక్రమించేదానికి ప్లానేశాడ్రా' అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్లు మిగతా వాళ్లు కూడా ఆ చెట్ల చల్లటి నీడ అంచున అలవోగ్గా నాలుగు కిలో మీటర్లు నడిచివెళ్తున్నారు. వరదారెడ్డి బహు పుణ్యాత్ముడయ్యా అని మెచ్చుకుంటూ...

సిద్ధవరం సమీపంలో ఏడువందల నేరేడు చెట్లను కూడా వరదారెడ్డి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు. ఈ నేరేడు వనంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఒక దశలో అంతరించిపోతున్నందుకు ఈ పురాతన పూర్వకాల వనాన్ని తన శ్రమతో ఇప్పటికీ అస్తిత్వంలో ఉంచాడు వరదారెడ్డి.

వరదారెడ్డిని చూసి జనాలు కూడా చెట్లు నాటడం ప్రారంభించారు. వీరి కోసం జీడిమామిడి, నేరేడు, వేప మొక్కలను నారుపోసి ఆ మొక్కల్ని ఉచితంగా పంచుతున్నాడు. ఇంకా చుట్టుపక్కల నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి తను నాటడమే కాకుండా, అడిగిన వారికీ, అడగని వారికీ, ఇంటింటికీ ఉచితంగా పంచుతాడు. తను నాటిన చెట్లను ఎవరైనా పేదలు వంట చెరకు కోసం నరికినా నొచ్చుకోకుండా అక్కడ మరో చెట్టును నాటుతాడు. వ్యక్తి శ్రమ సమిష్టి శ్రమగా సందపదగా మార్చడమెలాగో వరదారెడ్డి చేసి చూపించాడు . గత 36 సంవత్సరాలుగా ఇసుకలో నాటిన చెట్లను సరంక్షించడానికి వరదారెడ్డి కనీసం 70 టన్నుల పేడను వినియోగించి ఉంటాడు. ఎడారిలాలాంటి ఇసుక తిన్నెల మధ్య సహజంగా పెరిగే బ్రహ్మజెముడు, బొలిజ, తంగేడు వంటి చెట్లకు ఇబ్బంది లేకుండా ఈ మొక్కలు నాటుతాడు.

ఇప్పటివరకు ఇంగ్లీషు మందులు వాడలేదనే వరదారెడ్డి తన చిన్న ఫిలిప్స్ రేడియో ద్వారా బయటి ప్రపంచ విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు పిల్లనగ్రోవి ఊదుతాడు. అది తనకెంతో తృప్తినిస్తుందంటాడు. మొలకో తువ్వాలు చుట్టుకొని ఆరుబయట నిలబడితే వొంటికి తగిలే దక్షిణపు గాలి మార్మిక స్పర్శే తన జీవన చోదక శక్తి అంటాడు.

గ్రామదేవత అంకమ్మతల్లి వీరభక్తుడైన ఇంతటి నిర్భయుడు కూడా ఈ మధ్య కొంచెం జంకాడు -తను నాలుగు కిలోమీటర్ల మేర నాటిన చెట్లబాటను కోస్టల్ కారిడార్‌లో భాగంగా ప్రభుత్వం సెజ్‌లకిచ్చేస్తుందని తెలిసి. దాన్ని సెజ్ నుంచి మినహాయించమని జిల్లాకలెక్టర్‌కు ఒక అర్జీకూడా రాశాడు.

యింత పని నేనొక్కడినే ఎలా చేస్తాను? ఇదంతా నా భార్య అనసూయమ్మ,అన్నదమ్ముల బిడ్డలూ, రైతులూ, స్నేహితులూ, సేవాజనులు అందరి ద్వారా ఆ సర్వేశ్వరుడే జరిపిస్తున్నాడని సర్వకర్మలనూ ఆయనకర్పిస్తాడు వరదారెడ్డి.

తన యవ్వన ప్రాయంలో అందరిలాగే వరదారెడ్డి కూడా ఉద్యోగానికో, వ్యాపారానికో, విదేశాలకో వెళ్లిపోయి ఉంటే సిద్ధవరం గతి ఏమయ్యి ఉండేదో

-శ్రమయేవ జయతే

దువ్వూరు వరదారెడ్డి.
సిద్ధవరం గ్రామం,
కోటమండల,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

ఆధారము: రైతు బ్లాగ్

చోగలాల్ సోని విజయ గాధ

'కృషితో నాస్తి దుర్భిక్షం' అని ఊరికే అనలేదు పెద్దలు. కృషి ఉంటే ఎడారి కూడా సస్యశ్యామలం అవుతుంది. ఎందుకూ పనికి రాని భూముల్లో కూడా బంగారం పండించవచ్చు. 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మండిపోయే ఎడారిలో సైతం పండ్లతోటను పెంచారు చోగలాల్ సోని. తను పడిన కష్టాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

"నా పేరు 'చోగలాల్ సోని'. రాజస్థాన్‌లోని థార్ ఎడారి పక్కనే ఉంటుంది మా ఊరు. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే ప్రాణం. బార్మర్ అనే పట్టణంలో 1971 నుంచి 81 వరకు చిన్న క్లర్కుగా పనిచేశాను. పెద్ద జీతం వచ్చేది కాదు. అందులోనూ ముందు నుంచీ ఆర్థికంగా ఏమంత ఉన్నోళ్లం కాదు. ఉద్యోగం వదిలాక కంసాలి అవతారం ఎత్తాను. ఆడవాళ్ల ఆభరణాల్ని కళాత్మకంగా చేయడం నేర్చుకున్నాను. కొన్నేళ్లకు చుట్టుపక్కల ఊర్లలో నాకు మంచి పేరే వచ్చింది. చేతినిండా పని ఉండటంతో కొద్దోగొప్పో దాచుకోవడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే నాకు సేద్యం మీద ఆసక్తి ఏర్పడింది. అయితే, మేమున్న ప్రాంతంలో అన్నీ ఎడారి భూములే ఉంటాయి. ఇక్కడ ఇంచుమించు 54 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి ఎక్కువైనప్పుడు చెట్లు కూడా మాడిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మా పల్లెల్లో వ్యవసాయం లాభసాటి కాదు. అయినాసరే, ఏదో ఒక రోజు ఇవే భూముల్లో పంటలు పండించాలనుకున్నాను.

దారి పొడవునా ఇసుకే..
జైసల్మీర్‌కు దగ్గర్లోనే రోడ్డుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో భూమి కొన్నాను. ఆ భూమి నిజానికి సారవంతమైనది కాదు. ఎటు చూసినా ఇసుకమేటలు. పొలం దగ్గరికి వెళ్లాలంటేనే ఆపసోపాలు పడాలి. దారిపొడవునా మోకాలులోతు ఇసుక ఉంటుంది. మోటర్‌బైక్‌ను తోసుకుంటూ వెళ్లాల్సిందే. 'అలాంటి భూమిని ఏం చేస్తావ్?' అన్నారంతా. అయినా నేను వాళ్ల మాటలు వినలేదు. నేను దాచుకున్న సొమ్ముకుతోడు మరికొంత అప్పులు చేసి 112 బిగాల (సుమారు 70 ఎకరాలు) భూమిని కొనుగోలు చేశాను. మాది ఎడారి ప్రాంతం కాబట్టి ఒయాసిస్సులు దగ్గరగా ఉంటేనే పంటలు పండుతాయి. మా భూమికి కొంత దూరంలో ఒయాసిస్సు ఉంది కాని మా పొలాల దాకా రావు ఆ నీళ్లు.

ఎప్పటికైనా వర్షాలు వస్తే బోర్లు వెయ్యొచ్చన్న ధైర్యంతో పండ్ల తోట పెంచాలనుకున్నాను. నాకు ఇదివరకు వ్యవసాయం మీద అవగాహన లేదు. తోటి రైతులను చూసే నేర్చుకున్నాను. నిమ్మ, ఇండియన్ బెర్రీ, బాదం, ఉసిరి, మామిడి, సీతాఫలం, రుద్రాక్ష మొక్కలను తీసుకొచ్చి పొలంలో నాటాను. ట్యాంకుల్లో నీళ్లు తీసుకెళ్లి ఒక్కో మొక్క కు పోసి వాటిని పెంచి పెద్ద చేశాను. రోజూ మెయిన్ రోడ్డు వరకు మోటారు బైక్‌లో వెళ్లి.. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు బండిని తోసుకుంటూ తోటలోకి వెళ్లేవాణ్ణి. వ్యవసాయం మీద ఇష్టంతోనే ఆ కష్టాన్ని భరించాను.

రాలిన ఆకులతో..
ట్యాంకులతో నీటిని తోలడం అంత సులువు కాదని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. అప్పుడే మా ప్రాంతానికి భయంకరమైన కరువు కూడా వచ్చింది. ఇక, చేసేది లేక బోర్లు వేయించి, బావులు తవ్వించాను. అరకొర నీళ్లతోనే తోటను సాగుచేశాను. రసాయన ఎరువులు ఎక్కువగా వాడలేదు. మేకల ఎరువునే వేశాను. రాలిన చెట్ల ఆకులతో పాదుల్ని కప్పేశాను. చెట్టు మొదళ్లు ఎండకు మాడిపోకుండా అవే కాపాడాయి. నాకు తెలిసిన చిన్న చిన్న టెక్నిక్‌లతోనే చెట్లను కాపాడుకుంటూ వచ్చాను. పండ్ల తోటలు బాగానే కాశాయి. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది కాని పక్షులతోనే పెద్ద సమస్య. అందుకే చెట్టు కు కాసిన ఒక్కోకాయనీ కాపాడుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయినా తినేటపుడు వాటి తియ్యదనానికి పడిన కష్టాలన్నీ మర్చిపోయాను.

ఆత్మీయతా మధురం..
ఎడారి పండ్ల మాధుర్యాన్ని నేనొక్కణ్ణే కాదు, తోటి దోస్తులు కూడా రుచి చూడాలి కదా..! అందుకే, సీజన్‌లో కాసే పండ్లను దగ్గర్లోని స్నేహితులకు, జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీలకు బహుమతిగా పంపిస్తుంటాను. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదన్న ఎడారి భూమిని ఇప్పుడు చాలామంది కొనేందుకు ముందుకొస్తున్నారు. ఎంతలేదన్నా 20 కోట్ల వరకు విలువ పలుకుతోంది నా పొలం. కాని నేను డబ్బుకు ఆశపడి భూమిని అమ్ముకోలేను. ఈ వయసులో నాకు డబ్బు ఎందుకు..? పొద్దున, సాయంత్రం తోటకు వెళ్లి హాయిగా గడుపుతుంటే.. ఈ జీవితానికి ఇక చాలనిపిస్తుంది.

ఆధారము: రైతు బ్లాగ్

పిన్నమనేని సుబ్బరాజు విజయ గాధ

మా నాన్నగారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగి. నా బాల్యమంతా షిప్‌యార్డ్ కాలనీలోనే గడిచింది. మా చుట్టాలుపక్కాలంతా ఉద్యోగస్తులే. ఎవరూ వ్యాపారంలో లేరు. దాని వల్ల ఒకటి - నాకు పల్లెటూళ్ల గురించి ఏమీ తెలియదు. పల్లెటూరే తెలియకపోతే పశువుల గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? రెండు - వ్యాపారానికి సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. ఇలాంటి నేపథ్యంలో నేను పత్రికలో ఒక ప్రకటన చూశాను.

పాయకరావుపేటలో శ్రీప్రకాశ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడైన నరసింహారావుగారు డెయిరీ పెట్టాలనుకునే ఔత్సాహికులకు ఒక సెమినార్ నిర్వహిస్తున్నారని. దానికి హాజరయ్యాక ఆయన ఆర్నెల్ల పాటు ఇచ్చే శిక్షణను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్‌కామ్ చదువుతున్నప్పుడే నలుగురూ నడిచిన బాటలో నడవకూడదని, సొంతంగా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

ఏం చెయ్యాలి అన్నది మాత్రం స్పష్టంగా తెలిసేది కాదు. 2007 ఆగస్టులో ఈ సెమినార్‌కు హాజరయిన తర్వాత 'నేను డెయిరీ పెట్టాలి, అందులోనే రాణించాలి' అన్నది ధ్యేయంగా పెట్టుకున్నాను. ఆర్నెల్లపాటు నరసింహారావుగారి దగ్గర శిక్షణకు చేరాను. నాతోపాటూ మొత్తం ముప్ఫైమంది చేరారు. కాని చివరకు మిగిలింది న లుగురమే. అందులో ఇద్దరు 'గోపాలమిత్ర' ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు మాత్రం డెయిరీలు ప్రారంచాలని నిర్ణయించుకున్నాం.

నేర్చుకుంటూ...
అప్పటికి నాకున్నదల్లా విశాఖకు వంద కిలోమీటర్ల దూరంలోని ఏటికొప్పాక గ్రామం దగ్గర 9 ఎకరాల భూమి, రెండు ఆవులు, రెండు గేదెలు. అంతే. నగరాన్ని వదిలేశాను. అక్కడే నివసించడం మొదలుపెట్టాను. లక్షల పెట్టుబడి ఏమీ పెట్టలేదు నేను. నా దగ్గర అంత డబ్బు ఉండేదే కాదు. నెలకో రెండు చొప్పున జెర్సీ ఆవులను కొనడం ప్రారంభించాను. పాల డబ్బులు కూడినప్పుడల్లా ఆవులను కొనేవాణ్ని. దానివల్ల ఒకేసారి బరువు పడినట్టు అనిపించలేదు.

ఇంకొక జాగ్రత్త ఏం తీసుకున్నానంటే శిక్షణలో కొంత, వైద్యుల నుంచి కొంత, పుస్తకాలు చదివి కొంతా - వెరసి పశువైద్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాను. అనారోగ్య లక్షణాలను గుర్తించడం, సరైన మందులివ్వడం, ఇంజెక్షన్లు చేయడం వంటివన్నీ నాకు వచ్చు. వైద్యులు వచ్చే వరకూ ఆగి, అప్పుడు చికిత్స ప్రారంభిస్తే ఒకోసారి చేయిదాటిపోతుంది.

అలాకాకుండా అన్ని రకాల మందులూ నా దగ్గర నిల్వ ఉంచుకుంటాను. ఇక్కడ ఒక నిజం మాత్రం చెప్పి తీరాలి. ఒకటి మాత్రం నిజం - మీరు మనసు పెట్టి డెయిరీ నిర్వహణకు ముందుకొస్తే మాత్రం ప్రభుత్వం వందశాతం సహకారాన్ని అందిస్తుంది. నాకు పశుసంవర్థక శాఖ అధికారులు, వైద్యులు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను డెయిరీ పెట్ట్టిన రెండు మూడేళ్లలోనే పాలు లీటరు తొమ్మిది రూపాయల నుంచి ఇరవైకి చేరుకున్నాయి. డిమాండు చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. ప్రభుత్వ డెయిరీలే కాకుండా ప్రైవేటు డెయిరీలు సైతంగా బాగా విజయవంతంగా నడుస్తున్నాయి. వాటన్నిటికీ పాల అవసరం ఉంది. అందువల్ల ఉత్సాహమున్న యువ త ఎవరైనా డెయిరీ వ్యాపారంలోకి రావొచ్చు. అయితే డెయిరీ నిర్వహణకు పెట్టుబడి డబ్బు ఒక్కటే కాదు. బోలెడంత ఓపిక, సహనం ఉంటేనే ఇందులోకి రావాలి.

ఎక్కడ ఫెయిలవుతున్నారంటే...
నిజానికి చాలామందే ఉత్సాహంగా వచ్చి డెయిరీలు పెడుతుంటారు. కానీ విజయం సాధించలేక చతికిలబడుతున్నారు. నేను విశ్లేషించినదాన్ని బట్టి దీనికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి. 'నేను డబ్బు పెట్టి అజమాయిషీ చేస్తాను, నువ్వు పనిచెయ్యి' అనే ధోరణి ఈ వ్యాపారంలో అస్సలు పనికిరాదు. రోజూ ఉదయం మూడు నాలుగు గంటలు, సాయంత్రం నాలుగ్గంటలు - మొత్తం ఎనిమిది పది గంటలు కొట్టంలో గడపాల్సిందే.

రెండోది పశువుల మేత. ఏది చవగ్గా వస్తే అది పెడుతుంటారు యజమానులు. పసిపిల్లలకూ, మనుషులకూ లాగానే పశువులకూ సమీకృత ఆహారాన్ని అందించాలి. పాలు ఎక్కువ కావాలి, దాణా ఏదోటి పెడతామనే ఆలోచన వదులుకోవాలి. నేను ఎనిమిది రకాల ఆహారాన్ని అందిస్తాను. గోధుమ పొట్టు, పత్తిగింజల చెక్క, కొమ్ముశెనగలు, మినప్పొట్టు, వరినూకలను పచ్చిగడ్డిలో కలిపి పెడతాం.

ఉదయం మధ్యాహ్నం సాయంత్రాల్లో వేర్వేరు రకాలు - అదికూడా పశువుకో బేసిన్లో చొప్పున వేసి పెడతాం. దీనివల్ల ఏ ఆవు ఏం తిన్నది, ఎంత తిన్నది, ఆహారం తీసుకోవడంలో ఎక్కడైనా సమస్యలున్నాయా అన్నది తెలుస్తుంది. నాకున్న తొమ్మిది ఎకరాలుగాక మరికొంత భూమిని రైతుల నుంచి కౌలుకు తీసుకొని ఐదు రకాల గడ్డిని పెంచుతున్నాను. పూణె, కోయంబత్తూరుల నుంచి విత్తనాలు తీసుకొచ్చి పంట వేశాం. వీటికి తోడు వరిగడ్డిని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతాం. మూడోది - పశువుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ప్రతిరోజూ పర్యవేక్షించి తెలుసుకోవాలి.

మా దగ్గరున్న ప్రతీ ఆవూ ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఈనిందో, ఎప్పుడే అనారోగ్యానికి గురయిందో, ఏ మందులు వాడామో, ఏ రోజు ఎన్ని పాలు ఇచ్చిందో... ఇలా అన్ని వివరాలనూ ల్యాప్‌టాప్‌లో భద్రపరిచాను. దీంతో ప్రతి ఆవు గురించిన మొత్తం సమాచారం నాకు క్షుణ్ణంగా తెలుసు. నాలుగో అంశం పరిశుభ్రత.

అధిక దిగుబడినిస్తాయని అందరూ జెర్సీ ఆవులనే కొంటారు. కానీ అవి వేడి వాతావరణంలో మనలేవు. అందుకే రేకుల షెడ్లలో ఉండలేక రోగాల పాలయి నీరసించి మరణిస్తాయి. దీనికి విరుగుడుగా నేనేం చేశానంటే - డబ్బు సమకూరేదాకా తాటాకులతోనే పైకప్పు వేయించా. కాస్త నిలదొక్కుకున్నాక బంగాళా పెంకులు రెండు వరుసలుగా వేయించటంతో మా షెడ్లు చల్లగా ఉంటాయి. గాలీవెలుతురూ ధారాళంగా వస్తాయి.

రోజుకు మూడు నాలుగుసార్లు పేడ ఎత్తేస్తాం, మూత్రమంతా పంట పొలాల్లోకి వెళ్లేలా కాలువలు తీశాం. దీనివల్ల ఎప్పుడు చూసినా ఇదంతా శుభ్రంగా ఉంటుంది. అలాగే అన్ని పశువులనూ ఒకేచోట ఉంచను. చిన్న పెయ్యలన్నీ ఒక షెడ్లో, చూడి ఆవులన్నీ ఒకచోట... ఇలా విభజించుకుంటాను. దీనివల్ల వాటికి మేత వెయ్యడం, బాగోగులు చూడటం సులువు. ఇన్సూరెన్స్ కూడా సరిగా చేసుకోవాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే లాభాల బాట పట్టడం ఎవ్వరికైనా సాధ్యమే.

సాంకేతికానుభవం...
ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత శ్రమించినా మానవ వనరులను జాగ్రత్తగా చూసుకోవడం వీటన్నిటి కన్నా ముఖ్యం. ప్రస్తుతానికి నాతో సహా పద్నాలుగు మందిమి పనిచేస్తున్నాం. వాళ్లందరికీ మంచి వేతనాలు, భోజనం అందేలా చూసుకుంటాను. అలాగే ఊళ్లో ఎవరి పశువులకు ఏ అవసరం వచ్చినా వెళ్లి చూస్తాను. కొత్త తరం తమ సాంకేతికతను పెద్దల అనుభవంతో మేళవించి ముందడుగు వెయ్యాలన్నదే నేను నేర్చుకున్న సూత్రం.

ఇప్పుడు నా దగ్గర మొత్తం నా దగ్గర 135 (హెచ్.ఎఫ్ - హోలిస్టీన్ ఫ్రెష్యన్ అనే జాతి) ఆవులున్నాయి. అందులో ఎనభై ఇక్కడ పుట్టినవే. అలాగే రోజుకు 500 లీటర్ల పాల దిగుబడి ఉంది. రెండేళ్లలో నా దగ్గర పుట్టినవే వంద ఆవులుండాలని, రోజుకు వెయ్యి లీటర్ల పాల దిగుబడి ఉండాలన్నది నా లక్ష్యం. "మనం వేసే ప్రతి అడుగుకూ అంగుళం దూరంలో ధ్యేయాన్ని పెడతాడు దేవుడు. అందుకే స్వర్గాన్ని అంత ఎత్తులో కట్టాడు.

కొందరే అక్కడికి చేరుకోగలరు అంగలేసి అలసిపోనివాళ్లు....'' ఈ కొటేషన్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది. అందుకే నేను ధ్యేయాన్ని అందుకోవడం కోసం ఎన్ని అంగలైనా వెయ్యదలచుకున్నాను...
తక్కువ మొత్తాల్లో డబ్బుకు ఆశపడి పెయ్యలను అమ్మేస్తుంటారు యజమానులు. అవే ఎదిగి ఆవులైనప్పుడు కొనాలంటే చాలా సొమ్ము వెచ్చించాలి. నేను పెయ్యలనూ, ఆవులనూ ఎంత దగ్గరివారికైనా ఇవ్వను. ఒకసారి మాత్రం ఒకాయన చాలా బలవంతపెట్టి ఒకావును తీసుకెళ్లాడు. దాన్ని చెట్టు నీడన కట్టేసి ఇంత గడ్డి పడేసేవాడు. అది అనారోగ్యంతో చనిపోయింది. ఆరోజు మాత్రం చాలా బాధ పడ్డాను. సరైన శ్రద్ధ పెడితే అది బతికి ఉండేది కదా అనిపిస్తుంది.

-పిన్నమనేని సుబ్బరాజు సెల్ నంబర్ : 9295404698

ఆధారము: రైతు బ్లాగ్

అద్భుత వరి వంగడాల రూపశిల్పి దాదాజీ రాంజీ ఖోబ్రగడే

జ్ఞానభాండాగారాలను తల దిండుగా పెట్టుకొని పెరిగిన వారు విసిరేసిన వెలివాడలో పుట్టిన మట్టి మనిషి దాదాజీ రాంజీ ఖోబ్రగడే. బతుకు మట్టికొట్టుకుపోయినా మట్టిని నమ్ముకొనే బతికిన వెలివాడ దళిత రైతు. మట్టి మీద ఆయనకున్న మమకారం అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఆ కృషి ఫలితమే ఇప్పుడు యావత్తు ఉత్తరాది కంచాల్లో వెదజల్లిన విరజాజి మొగ్గల్లా పరుచుకున్న అన్నం మెతుకులు. అవి ఖోబ్రగడే సృష్టించిన హెచ్‌ఎంటీ రకం బియ్యపు మెతుకులే.

విదర్భలోని నాందేడ్ జిల్లా చండీపూర్ తాలుకాలోని నాగ్‌బీడ్ ఓ మారుమూల కుగ్రామం. దాదాజీ ఆవిష్కరించిన హెచ్‌ఎంటి ధాన్యంతో ఇది వెలుగులోకి వచ్చింది. మూడో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన దాదాజీ ఖోబ్రగడేకు శాస్త్ర పరిజ్ఞానం లేనప్పటికీ.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. ప్రతి విషయాన్ని పరిశీలించి చూడడం అలవాటు. నారుపోశామా, నాటేశామా, కోసి నూర్చి, మండీకి తోలామా.. అనే విధానం కాదు ఆయనది. మనస్ఫూర్తిగా నిమగ్నమై పని చేయడం ఆయనకు అలవాటు. దాదాపు 30 ఏళ్ల కిందటి మాట. ఉన్న ఎకరంన్నర పొలంలో ఆ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పటేల్-3 రకం వరి సాగు చేశాడు. జబల్‌పూర్‌లోని జేఎన్‌కేవి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జేపి పటేల్ ఈ రకాన్ని అభివృద్ధి చేశాడు. పొలంలో వేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకునే దాదాజీ పంటపొలంలో ప్రతి అడుగును పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఓ మడి మూలన మూడు వరి వెన్నులు మిగతా చేనుకు భిన్నంగా కనిపించాయి. వెంటనే వెన్నులకు గుర్తులు పెట్టి ప్రత్యేకంగా కోసి నూర్చాడు. ఆ గింజలను భద్రంగా దాచి మరుసటి సంవత్సరం పంట సమయంలో ప్రత్యేకంగా నాటేసి అడవి జంతువుల పాలు కాకుండా చుట్టూ కంచెవేశాడు. ఈసారి వచ్చిన దిగుబడిని మరోమారు జాగ్రత్తగా తిరిగి సాగు చేశాడు. కొత్తవిత్తనం సంరక్షణ ప్రస్థానం సాగుతూ 1988 నాటికి నాలుగున్నర క్వింటాళ్ల విత్తనం చేతికి వచ్చింది. బియ్యం మరపట్టించి చూడగా 80 శాతం బియ్యం దిగుబడి వచ్చింది. పటేల్ రకంతో పోలిస్తే అన్నం నాణ్యంగా, రుచికరంగా ఉంది. తన పంట గొప్పతనం గుర్తించిన దాదాజీ ఖోబ్రగడే ఈసారి 150 కిలోల ధాన్యాన్ని విత్తాడు. దాదాజీ ఆశలు ఫలించి 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. 1990లో దాదాజీ వద్ద విత్తనం తీసుకున్న బీమ్‌రావ్ షిండే అనే భూస్వామి నాలుగెకరాల్లో సాగు చేశాడు. ఆచేత, ఈచేత చుట్టుపక్కల రైతులకు చేరిన ఈ విత్తనం ఆ ప్రాంతంలో చాలా విస్తీర్ణంలో సాగైంది. మార్కెట్‌లో కొత్త రకం మేలిమి ధాన్యం రాశులుగా పోగుపడగా వ్యాపారులు ఆనందం వ్యకం చేశారు. తలోడి మార్కెట్ వ్యాపారి ఒకడు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి దానికి ఆనాటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న హెచ్‌ఎంటి గడియారం స్ఫూర్తితో హెచ్‌ఎంటీ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఇది సాగవుతోంది.

అసలు కథ అప్పుడు మొదలయింది. కోబ్రాగడే ఘనతను చూసి కొందరు పెద్దమనుషులకు కన్నుకుట్టింది. ఓ దళిత రైతు విత్తనాన్ని రూపొందించడం వారికి నచ్చలేదు. అతనికి అందుతున్న ఖ్యాతిని కాజేయాలని ‘ఈనగాచిన చేను నక్కలు నమిలేసినట్లు’ నిరుపేద దళిత రైతు కష్టఫలితాన్ని కొల్లగొట్టడానికి కుట్రచేశారు. హెచ్‌ఎంటీ ధాన్యానికి ముందు ఒక తోక తగిలించి పీకేవి హెచ్‌ఎంటీగా పేరు పెట్టి చెలామణి చేయడం ప్రారంభించారు. ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రిక ప్రతినిధి ఈ కుట్రను బట్టబయలు చేయడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ఖోబ్రగడేకు మద్దతుగా ముందుకొచ్చాయి. న్యాయపోరాటంతో పాటు, శాస్త్రీయ పరీక్షలు జరిపించి నిజాన్ని నిగ్గుతేల్చగా హెచ్‌ఎంటీ, పెద్ద మనుషులు చెలామణిలోకి తెచ్చిన హెచ్‌ఎంటీకి ఎలాంటి తేడాలేదని తేలిపోయింది. హైద్రాబాద్ నగరంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు రెండు వంగడాల జన్యుపటాలను చిత్రించగా ఎలాంటి తేడాలు లేవని వెల్లడయింది. ఈ విషయం నాగ్‌పూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌కు తెలియపర్చింది. ఎన్‌ఐఎఫ్ దాదాజీ రాంజీ ఖోబ్రగడే కృషిని గుర్తించి 2005లో జాతీయ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

దాదాజీ విత్తనాభివృద్ధి ప్రస్థానం హెచ్‌ఎంటీతో ఆగిపోలేదు. 1987లో మరో రకం ధాన్యానికి ఊపిరి పోసి.. దానికి తన మనవడు నాందేడ్ చిన్నూర్ పేరు పెట్టారు. 1994లో నాందేడ్ హీరా, 1996లో విజయ్ నాందేడ్, 1997లో దీపక్ రత్న రకాలను సృష్టించి మనుమల పేర్లు పెట్టాడు. 1998లో తన పేరుతోనే డీఆర్‌కె (దాదాజీ రాంజీ ఖోబ్రగడే) రకాన్ని సృష్టించాడు. 2002లో కాటే హెచ్‌ఎంటీ, 2003లో డీఆర్‌కె సుగంధి రకానికి ఊపిరి పోశాడు. దాదాజీ మొత్తం 9 రకాల వరి వంగడాలను సృష్టించాడు. ఇందులో హెచ్‌ఎంటీ రకం ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల హెక్టార్లలో సాగవుతున్నదంటే.. దాని గొప్పదనం అర్థమౌతుంది. మన్నులోంచి అన్నం తీసే రైతన్నల ఆశలకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని అందించిన ఖోబ్రగడేని కుల వివక్ష అణగదొక్కిందని మహారాష్ట్రలో అనేక మంది మేథావులు విమర్శించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కుట్రను తూర్పారబట్టాయి. రైతు క్షేత్ర స్థాయి పరిజ్ఞానానికి శాస్త్ర,సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే కొత్త ఆలోచనలకు ఊపిరిపోసి వెనవేల సృజనలు చేయగలరని దాదాజీ రాంజీ ఖోబ్రగడే నిరూపించాడు.

విత్తనాలకు: ఖోబ్రగడే వరి వంగడాలను సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనేక విత్తనోత్పత్తి సహకార సంఘాల ద్వారా రబీ నాటికి రైతులకు అందుబాటులోకి తెస్తోంది. రైతులు డా. రాజశేఖర్(7386145368)కు ఫోన్ చేసి రిజర్వు చేసుకోవచ్చు. ఖోబ్రగడేను 09767290201 నంబరులో సంప్రదించవచ్చు.

ఆధారము: సాక్షి

చెన్నారెడ్డి - పామ్‌రోజ్(నిమ్మ గడ్డి)

పామ్‌రోజ్ (నిమ్మ గడ్డి) ని సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం బాలాయిపల్లె కు చెందిన రైతు చెన్నా రెడ్డి. ఆ సాగు వివరాలు అతని మాటల్లోనే...

‘మాది వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం బాలాయిపల్లె.

గిద్దలూరులో టెక్స్‌మో పోలిరెడ్డి అనే వ్యక్తి 100 ఎకరాల్లో పంట వేయడం చూసి మా ఊర్లో 15 ఎకరాల్లో పామ్‌రోజ్, నిమ్మగడ్డిని సాగుచేశా. ఆయిల్ తీసే పద్ధతిలో లోపాలు ఉండటంతో నష్టాలు వచ్చాయి. కందుకూరులో నా స్నేహితుని వద్దకు వెళ్లి ఇవే పంటలపై రూ.3 లక్షల పెట్టుబడి పెట్టా. అక్కడ కూడా నష్టపోయా. మేం పెట్టిన రెండు డిస్టిలేషన్ యూనిట్లలో (మొక్కల నుంచి ఆయిల్ తీసే యంత్రం) ఉన్న లోపాలను అప్పుడు గమనించా.

తొలిసారి 6:6 సైజ్ పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరిచే గొట్టం 2 అంగుళాలు ఉండే పరికరాన్ని ఉపమోగించా. టన్ను గడ్డికి 4 లీటర్ల ఆయిల్ రావాల్సి ఉండగా 2.5 లీటర్లు మాత్రమే వచ్చేది. కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో యంత్రాలను గమనించా. 6ఁ5 సైజ్‌లో రెండు పెద్ద డ్రమ్‌లను, ఆవిరిని చల్లబరచే గొట్టంను 10 అంగుళాలకు పెంచి సొంతగా తయారు చేయించా. ఒక్కో డ్రమ్‌లో 750 కేజీల గడ్డి పడుతుంది.

దీని నుంచి నాలుగు కేజీల ఆయిల్ వస్తోంది. కంపెనీలు తయారు చేసే డిస్టిలేషన్ యూనిట్ కొనాలంటే రూ.3 లక్షలు ఖర్చువుతుంది. వాటి ద్వారా ఆశించిన ఆయిల్ రావడం లేదు. అందుకని రూ.2.50 లక్షలు ఖర్చుపెట్టి ఆయిల్ తీసే యంత్రాన్ని సొంతగా తయారు చేయించుకున్నా. ఇప్పుడు న ష్టం రావడం లేదు. లక్షల్లో ఉన్న అప్పు మొత్తం తీరిపోయింది. ప్రస్తుతం ఎడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందుతున్నా.

2011లో బేస్తవారిపేట మండలం మల్లాపురం సమీపంలో 60 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పామ్‌రోజ్, నిమ్మగడ్డి సాగుచేస్తున్నా. హైదరాబాద్‌లోని బోడుప్పల్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ కార్యాలయంలో విత్తనాలు తెచ్చుకుంటున్నా. ప్రారంభంలో పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.15-20 వేలు ఖర్చవుతుంది. నాటిన నాలుగో నెల నుంచి పంట చేతికొస్తుంది. పామ్‌రోజ్ విత్తనాలు ఒకసారి నాటితే 8-10 ఏళ్ల పాటు పంట పండుతుంది. ఏడాదికి ఐదు కోతలు కోయవచ్చు.

విత్తనాలు నాటిన తర్వాత ఖర్చు ఉండదు. ఏడాదికి ఒకసారి అంతర సేద్యం(దుక్కి దున్నడం), 25 కేజీల యూరియా, 25 కేజీల డీఏపీ చల్లితే సరిపోతుంది. రెండు నెలల్లో ఎకరాకు మూడు టన్నుల గడ్డి పెరుగుతోంది. టన్నుకు నాలుగు కేజీల ఆయిల్ దిగుబడి ఉంటుంది. రోజూ రూ.1,500 ఖర్చుతో(కూలీలకు) 8 లీటర్ల ఆయిల్ తీస్తున్నా. నెలలో 20 రోజుల పాటు 150 ఆయిల్ దిగుబడి వస్తోంది. డిస్టిలేషన్ యంత్రంతో గడ్డిని ఉడికించడానికి ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నా. దీనివల్ల వంట చెరకు ఖర్చు మిగులుతోంది.

నిమ్మగడ్డి రెండు నెలలకు ఎకరాకు 2 టన్నుల గడ్డి వస్తుంది. టన్నుకు 10 కేజీల ఆయిల్ తీస్తున్నా. మార్కెట్‌లో కేజీ రూ.800 ధర ఉంది. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకోలేదు. 8-10 ఏళ్లు ఉండే పామ్‌రోజ్‌లా ఎక్కువ కాలం పంట ఉండకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. నేను కూడా ఐదెకరాల్లో సాగు చేస్తున్నా.

సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడి...!

మొదట్లో సేంద్రియ పద్ధతిలోనే గడ్డి పెంచా. మంచి దిగుబడి వచ్చింది. 200 లీటర్ల నీటికి ఐదు కేజీల ఆవు పేడ, మూత్రం, 2 కిలోల శనగ పిండి, 2 కిలోల బెల్లం, మర్రి చెట్ల కింద మట్టి గుప్పెడు వేస్తే బ్యాక్టీరియా వెయ్యి రెట్లు ఉత్పన్నమవుతుంది. ఆరు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని పొలమంతా చల్లితే గడ్డి దిగుబడి చాలా పెరిగింది. అయితే అదే సమయంలో డిస్టిలేషన్ యంత్రాల్లో లోపాలను అధిగమించే క్రమంలో సేంద్రియ పద్ధతిలో సాగు గాడితప్పింది. ఇప్పుడు సమస్యలేమీ లేవు. త్వరలోనే పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తా.

ఆయిల్‌ను దళారులకే విక్రయిస్తున్నా....!

పదేళ్ల క్రితం పామ్‌రోజ్ ఆయిల్ కేజీ రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,800 మధ్య ధర ఉంటోంది. తిరుపతిలో ప్రైవేట్ దళారులకు ఆయిల్‌ను అమ్ముతున్నా. నేరుగా కంపెనీలకు అమ్మితే మంచి ధర వస్తుంది. కంపెనీల వాళ్లు నగదు చెల్లింపులో జాప్యం చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది’.

- రైతు చెన్నారెడ్డిని 9440855448లో సంప్రదించవచ్చు.

‘సాఫ్ట్‌వేర్’ రైతు - జాన్ ఇజ్రాయిల్ రావూరి

ఆయనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. చిన్నప్పటినుంచీ వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ప్రజలకు సేంద్రియ ఎరువుల తో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనే లక్ష్యం ఉండేది. ఇంకేముంది.. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు.

సేంద్రియ పద్ధతిలో కూరగాయల పంటలు పండిస్తున్నాడు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు జాన్ ఇజ్రాయిల్ రావూరి. మేడ్చల్‌కు చెందిన జాన్ ఏడాదిన్నర క్రితం మండలంలోని గిర్మాపూర్, మండమాదారం గ్రామాల్లో ఏడెకరాల భూమిని లీజ్‌కు తీసుకుని లాభసాటిగా సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఆవు పేడ, మూత్రం, ఆకు కషాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి వ్యవసాయం మెలకువలు నేర్చుకుని, నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అంతే కాకుండా పండిన పంటలను తానే మార్కెట్‌లో నేరుగా వినియోగదారులకు విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నాడు.

వ్యవసాయం వైపు దృష్టి సారించడానికి కారణాలేమిటి తదితర అంశాలు  జాన్  ఇజ్రాయిల్ మాట ల్లోనే...
సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం..
వ్యవసాయంలో సేంద్రియ పంటలు రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని తెలుసుకున్నా. మనమెందుకు ఇలాంటి వ్యవసాయం చేయకూడదనుకుని ఈ పద్ధతిలో సాగు చేపట్టాను. దీనికి తోడు ఒకే రకం పంటలు కాకుండా తక్కువ భూమిలో ఎక్కువ రకాల పంటలు వేస్తున్నాను. మన పూర్వీకులు సారవంతమైన భూమిలో పంటలు ఎలా పండించారో ఆ విధంగా మనం కూడా పంటలు పండించాలని జీవామృత ఎరువుతో పంటల సాగు చేపడుతున్నాను. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగ పిండితో జీవామృతాన్ని తయారుచేసి ఎరువుగా ఉపయోగిస్తున్నాను. చెట్ల ఆకులను, జనుము, జీలుగను ఎరువుగా వాడుతున్నాను.

నేరుగా వినియోగదారులకే విక్రయం..
పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారుల ఇళ్లకు వె ళ్లి అందిస్తున్నాను. కొందరు రైతులు మార్కెట్ చేయడం తెలియక నష్టపోతున్నారు. నూతన పద్ధతితో కూరగాయల విక్రయాలు చేపట్టాలని ఒక కవరులో ఎనిమిది రకాల కూరగాయలు ఒక్కోటి అరకిలో చొప్పున, అయిదు రకాల ఆకు కూరలు 5 కట్టల చొప్పున ప్యాక్‌చేసి రూ.350కు వినియోగదారులకు చేరవేస్తున్నాను. ఈ పద్ధతి కోసం ఇతర రైతులకు ప్రోత్సాహం అందించి వారితో కొన్ని రకాల పంటలు వేయిస్తున్నాను. ఇలా ప్రతి రోజు వినియోగదారులకు ప్యాక్ చేసి ఇస్తున్నాను. వారంలో వంద మందికి అందించాలనే లక్ష్యం నెరవేర్చుకున్నాను. దీంతో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. వ్యవసాయం చేసి పదిమందికి మంచి భోజనం అందించడంలో ఉన్న తృప్తి దేనిలోనూ ఉండదు.

ఆధారము: సాక్షి

అన్నపరెడ్డి శివరామరెడ్డి విజయగాధ

ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కానీ, వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన ఆకుకూరలు, కూరగాయలే మార్కెట్‌కు వస్తుంటే ఏమిటి పరిష్కారం? వీలైనంతలో కుండీలో, మడులో ఏర్పాటు చేసుకొని ఇంటిపట్టునే పండించుకోవడం కన్నా తెలివైన పని మరొకటేమి ఉంటుంది? అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూడా అన్నపరెడ్డి శివరామరెడ్డి (94932 74948) కుటుంబం మక్కువతో ఇంటిపంటలు పండించుకుంటున్నది.

గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో జన్మించిన ఆయన తెనాలిలో హోటల్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. సమీపంలోని కటివరంలో అద్దె ఇంట్లో వారి కుటుంబం నివసిస్తున్నది. రెండేళ్ల క్రితం ఇంటి ముందు రెండు సెంట్ల పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. అయితే, అప్పటికి సేంద్రియ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై అవగాహన లేదు. ఏడాది క్రితం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పరిచయం కావడంతో శివరామరెడ్డి ఇంటిపంటల సాగు పద్ధతి పూర్తిగా మారిపోయింది.

రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా ఘన జీవామృతం, జీవామృతంతో పంటలు సాగు చేయడం చూసినప్పుడు విచిత్రంగా అనిపించిందని ఆయన చెప్పారు. సావధానంగా వివరాలు అడిగి తెలుసుకొని అనుసరిస్తున్న తర్వాత గొప్ప సంతోషం కలిగిందన్నారు. ఈ ఆహారం తింటున్నందున ఫుడ్ ఎలర్జీ మాయమైందన్నారు. అంతకుముందు వంగ, గోంగూర తింటే దురదలు వచ్చేవని, ఇప్పుడు ఆ ఊసే లేకుండాపోయిందని ఇంట్లో అందరం హ్యాపీగా వీటిని వారానికి మూడు రోజులు తింటున్నామన్నారు.

వంగ, మిరప, టమాటా, గోంగూర(4 రకాలు), గోరుచిక్కుడు, చిక్కుడు, బీర, బెండ, కొత్తిమీర, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. 2 సెంట్ల పెరట్లో, మేడమీద 30 కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. అన్నీ దేశవాళీ విత్తనాలే సాగు చేస్తున్నారు. మేడ మీద కుండీల్లో బీర, దొండ, కాకర పాదులు చక్కగా కాస్తున్నాయి. 40 కుండీల్లో చామంతులు, మరో 40 కుండీల్లో గులాబీలనూ వేశారు.

21 రోజులకోసారి జీవామృతం!

నల్ల రేగడి మట్టి, ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని కుండీల్లో వేశారు. 21 రోజులకోసారి జీవామృతం(1:10 పాళ్లలో నీటిలో కలిపి) మొక్కల మొదళ్లలో పోయడంతోపాటు, మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేస్తున్నారు. కుండీల్లో 3 రోజులకోసారి నీరు పోస్తున్నామన్నారు. నల్లరేగడి నేలలో పెరట్లో పెరుగుతున్న మొక్కలకు 21 రోజులకోసారి పోసే జీవామృతం సరిపోతున్నదన్నారు. ఎండాకాలంలో 10-15 రోజులకోసారి నీరు పోయాల్సి వస్తుందన్నారు. రసాయనిక ఎరువులు వాడినప్పుడు నేల రాయిలా గట్టిపడేదని, జీవామృతం వాడుతున్న దగ్గర్నుంచి నేల సారవంతమై, గుల్లబారి మెత్తగా చేతితో గుంత తీయడానికి అనువుగా మారిందన్నారు.

ఈ రుచే వేరు!

జీవామృతంతో పండిన కూరగాయల రుచే వేరని, స్వల్పంగా తీపి రుచి ఉంటుందన్నారు. ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మామూలు కూరగాయలు తినలేరని, తామూ ఇంటిపంటలు పండించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కాపునకు మరో కాపునకు మధ్యకాలంలో టమాటాలతోపాటు బంగాళదుంపలు తప్ప బయట కొనాల్సిన అవసరం లేకుండా 90% వరకు ఇంటిపంటలపైనే ఆధారపడుతున్నామని శివరామరెడ్డి సంతృప్తిగా చెప్పారు. తమ ఇంటి యజమాని కూడా ఇంటిపంటలపై మక్కువతో సహకరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఫేస్‌బుక్‌లో ఇంటిపంట గ్రూప్‌లో యాక్టివ్ మెంబర్ అయిన శివరామరెడ్డి సంతోషకరమైన తన ఇంటిపంటల అనుభవాలతోపాటు తపాలా ద్వారా విత్తనాలనూ పంచిపెడుతూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. శివరామరెడ్డి కొందరు మిత్రులతో కలసి పది సెంట్ల స్తలంలో ఉమ్మడి ఇంటిపంటల క్షేత్రాన్ని ప్రారంభించనుండడం అభినందనీయం.

ఆధారము: సాక్షి

మార్గదర్శి ‘సారధి’

‘ఢల్లీికి రాజైనా తల్లికి కొడుకే’ అన్నారు మాజీ ప్రధాని పి.వి నరసింహారావు. కన్న తల్లిని, మాతృభూమిని మరచిపోయి సుదూరతీరాలకు తరలి వెళ్ళిపోయేవారు ఎందరో! ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే పట్టణాలలో, నగరాలలో మకాంపెట్టి స్వగ్రామాలను విస్మరిస్తున్న సంస్కృతి ప్రబలుతున్న నేపధ్యంలో ఒక యువకుడు గ్రామసీమలలోనే ఉంటూ, నమ్ముకున్న చేనును సాగుచేసుకుంటూ, తాను సంపాదించుకొన్న విజ్ఞానాన్ని 10 మంది రైతులకు పంచిపెడుతూ నవజీవన సోపానానికి ‘సారధి’గా ముందుకు వెళుతున్నారు ఆయనే సారధి నాయుడు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో సంక్షుభిత వ్యవసాయానికి, దిగాలుపడి, దగాకు గురవుతున్న రైతు మానసిక స్థితికి శస్త్ర చికిత్సచేసే డాక్టరుగా అగ్రి క్లినిక్‌ను ప్రారంభించారు. వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడుగా విజ్ఞానాన్ని గ్రామసీమలకు చేర్చే పనిలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఇతర వ్యవసాయిక ఉత్పత్తి ప్రేరేపిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న సారధి నాయుడు నూటికి నూరుపాళ్ళు స్వచ్ఛమైన, గర్వకారణమైన రైతుబిడ్డే. తన స్వానుభవాన్ని ‘అగ్రి క్లినిక్‌’ మాసపత్రిక ప్రతినిధితో పంచుకున్న సారధినాయుడు తన కార్యకలాపాలపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

తండ్రి మార్కొండనాయుడి బాటలో సస్యరక్షకుడిగా, ఆకుపచ్చ విప్లవ వీరుడిగా ఎన్నో మహత్తర కార్యక్రమాలను వంటిచేత్తో చేపట్టారు. 40 ఎకరాల భూమిలో బొప్పాయి, అరటి , పుచ్చ తోటలను సాగుచేస్తున్నారు. అదేవిధంగా టమోటా, వంకాయ వంటి కూరగాయలను తన నైపుణ్యతతో ప్రామాణిక ఉత్పత్తి తీస్తూ సంచార వాహనం ద్వారా మార్కెట్‌కు తరలిస్తారు. స్వయంగా బిందు, తుంపరల సేద్యం ద్వారా 40 ఎకరాలలో అత్యంత ఫలసాయాన్ని ఎలా పొందవచ్చో స్వానుభవాన్ని మాటలలో చెప్పకుండా, తన వ్యవసాయ క్షేత్రంద్వారా అందరికీ చూపిస్తారు. అంతేకాకుండా గత 10సంవత్సరాలుగా 30 మందికి శాశ్వత ఉపాధికల్పిస్తూ పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో తెలియజెప్పారు. సారధి నాయుడు ప్రారంభించిన అగ్రిక్లినిక్‌లో సలహాలు పొందేవారు సగటున నెలకు 700 మంది ఉంటారంటే ఆశ్చర్యపడక తప్పదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వాలు చేసే పనిని ‘‘అతడే ఒక సైనికుడిలా’’ నిలచి స్పూర్తి ప్రదాతగా చిన్న వయసులోనే పేరుపొందారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు తోడ్పడే ఎరువులు, విత్తనాలు, నర్సరీ ఉపకరణాలు, షేడ్‌నెట్‌లు, భూమి అవసరం లేకుండా సాగుకు మాధ్యమంగా ఉండే కోకోఫిట్‌ వంటి వాటిని సరఫరా చేస్తూనే వాటి వినియోగం పై రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.

వ్యవసాయానికి సాగునీరు సరఫరా క్లిష్టమవుతున్న తరుణంలో అందుబాటులోకి వచ్చిన బిందుసేద్యానికి ఈ ప్రాంతంలో ఆద్యుడిగా ప్రాచుర్యం పొందిన సారధినాయుడు 11 మండలాల్లో నెటాఫిన్‌ ఇరిగేషన్‌ సంస్థకు డీలరుగా ఉన్నారు. బిందుసేద్య పరికరాలను సరఫరా చేయడంతో పాటు ఆ పధకం అమలుకు కావలసిన అన్ని సలహాలను అందిస్తూ, నీటియాజమాన్యంపై రైతులకు మార్గదర్శకంగా ఉన్నారు. తోటల పెంపకానికి ప్రాధమికంగా తోడ్పడే నర్సరీని కూడా ప్రారంభించారు. దీనిలో షేడ్‌నెట్‌ విధానంలో తోటల పెంపకం, కూరగాయల విత్తనాలు నాణ్యమైన బొప్పాయి విత్తనాలను పండిస్తారు. జర్మినేషన్‌ ట్రేలలో కూరగాయలనారు పెంచడంలో మంచి నైపుణ్యం సాధించారు. పండిరచిన పంటకు గిట్టుబాటులేని పరిస్థితులలో పలుచోట్ల రైతులు ఆత్మక్షోభకు గురౌతుంటే దానికి పరిష్కార మార్గం కూడా సారధినాయుడే కనుగొన్నారు. మార్కెటింగ్‌కు కావలసిన వాహన సౌకర్యాలను సమకూర్చుకుని, స్ధానిక మార్కెట్లకు తనతోపాటు తోటిరైతుల ఉత్పత్తులను కూడా తరలించడం విశేషం. అంతేకాకుండా తిరుపతిలో, మదనపల్లి ఇతరపట్టణాలలో పండ్లు, కూరగాయల అమ్మకపు కేంద్రాలను స్వయంగా ప్రారంభించి రైతులకు మార్కెటింగ్‌ అవకాశాలను మెరుగుపరచారు. సారధినాయుడు స్వచ్ఛంద సేవా నిరతి, నిరంతర రైతులకు విజ్ఞాన ప్రధానం, వారి కష్ట నష్టాలలో తానూ ఒకడిగా ఉంటూ మమేకం కావడం చాలా అరుదైన విషయం. రెండో హరిత విప్లవానికి దేశం సన్నద్ధమవుతున్న సమయంలో సారధిలాంటి విద్యావంతులు, నవయువకులు ఊరూరా సస్యరధానికి సారధులుగా అవతరిస్తే ఇక దేశం నందనవనమే.

గుంటూరు మిర్చి రైతుల విజయగాధలు

ఆంధప్రద్రేశ్‌ ధాన్యాగారంగా గుంటూరు జిల్లాకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ పండే మిర్చికి భారతీయ మార్కెట్లో ఎంతో వాణిజ్య విలువ ఉంది. పత్తి పండిరచడంలో గుంటూరు జిల్లాకు ఉన్న విశిష్టత దేశంలోని మరే జిల్లాలోనూ కానరాదు. దిగువనున్న డెల్టా ప్రాంతంలో వేల టన్నుల కొద్దీ వరి ఉత్పత్తి అవుతుండగా ఎగువున మెట్ట ప్రాంతాలలో పత్తి, మిర్చి, పొగాకు విస్తారంగా పండిస్తారు. కృష్ణానది తీర ప్రాంత లంకలలో ముఖ్యంగా దుగ్గిరాల ప్రాంతంలో పండే పసుపుకు అంతర్జాతీయ డిమాండ్‌ ఉంది. ఇక కృష్ణ లంకలలో అరటి, జామ, కొబ్బరిసాగు వలన రైతులు విశేషంగా లబ్ధిపొందుతారు. ప్రతిగ్రామంలో సేద్యంలో ఆదర్శ రైతులు ఒకరో, ఇద్దరో చరిత్రకెక్కుతారు. కానీ అట్టడుగున ఉన్న రైతు విజయాలను ప్రజలలోకి తెచ్చి, వ్యవసాయ వృత్తికి సంఘంలో సముచిత హోదా కల్పించే మహత్తర కార్యక్రమంలో భాగంగా తనవంతు బాధ్యతగా రైతు విజయగాధలను అగ్రిక్లినిక్‌ మీ ముందుకు తెస్తుంది.

ఆరుగాలం కష్టపడి పండిరచినా చివరకు గిట్టుబాటు ధరలేక, మార్కెట్లో పోటీ పడలేక, మార్కెటింగ్‌ సౌకర్యాలు అరకొరగా ఉండడంతో వ్యవసాయం దండగమారి పని అని పెక్కుమంది భూములను వదిలి పట్టణాలకు వలసపోతున్న సందర్భంలో కొంతమంది రైతులు, ముఖ్యంగా విద్యాధికులు కూడా తిరిగి గ్రామాలకు తరలివచ్చి సేద్యాన్ని ప్రధాన వృత్తిగా మార్చుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పోకడలతో అధికదిగుబడులు సాధిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న నేపధ్యంలో ఆయా రైతుల అనుభవాలను ఇతర రైతులకు అందజేయడానికి అగ్రిక్లినిక్‌ వారి సేద్యరీతులను, భావాలను మీ ముందుంచుతుంది.

వ్యవసాయం ప్రకృతి ప్రసాదించిన వరం…… వడ్లమూడి పవిత్ర భావంతో వ్యవసాయ వృత్తికి అంకితం కావడం ద్వారా ఆత్మసంతృప్తి రైతుకు, ఆహార భద్రత దేశానికి లభిస్తుందనే ఉదాత్త భావాలుగల వడ్లమూడి రవీంద్రనాథ్‌ సేద్య రంగంలో తనదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నారు. పత్తి, మిర్చి దిగుబడులను ప్రతికూల పరిస్థితులను ఏ ఏటికాయేడు అధిగమిస్తూనే దిగుబడుల రంగంలో రికార్డులు స్థాపిస్తున్నారు. గుంటూరుజిల్లా, తాడికొండ మండలం, నిడుముక్కల గ్రామంలో జన్మించిన రవీంద్రనాథ్‌ తాడికొండ డిగ్రీ కళాశాలలో పట్టభద్రుడైనారు. ఉన్నత విద్యావంతుడైనప్పటికీ వ్యవసాయంపై మక్కువతో జన్మించిన గ్రామాన్ని, నమ్ముకుని పూజించే వ్యవసాయభూమిని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చదువుకునే రోజలనుండే సేద్యం ఎదుర్కొంటున్న కష్టాలను చవిచూస్తూ హరిత విప్లవాన్ని కోరుకునే వారిలో ప్రధముడిగా శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. తండ్రి వారసుడిగా సేద్య జీవనంలోకి అడుగుపెట్టిన వడ్లమూడి 64 ఎకరాలలో పత్తి, మిర్చి సాగుచేస్తున్నారు. 19 ఎకరాలలో నీటి సౌకర్యం ఉన్న భూమిలో ఎకరాకు క్రమం తప్పకుండా 30 నుండి 35 క్వింటాళ్ళ మిర్చి దిగుబడిని సాధించగలుగుతున్నారు. 45 ఎకరాలలో కేవలం వర్షంపై ఆధారపడి పత్తి పండిస్తూ ఎకరాకు 15 క్వింటాళ్ళ పత్తి దిగుబడిని సాధిస్తున్నారు. సరైన సస్యరక్షణ, నీటి యాజమాన్యంతో ఈ దిగుబడులను విజయవంతంగా సాధిస్తున్న రవీంద్ర వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, అవరోధాల గురించి అగ్రిక్లినిక్‌ ప్రతినిధితో మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న వాళ్ళు, పవిత్రమైన వ్యవసాయ వృత్తిని చేపట్టిన రైతు, సమస్యలకు జడిసి మడమతిప్పి వెనుకడుగు వేయరాదని, ‘సమస్య ఎక్కడుందో, పరిష్కారం అక్కడే వెతుక్కో’వాలని అన్నారు.

కూలీల సమస్యను పెద్ద బెడదగా అభివర్ణించి భయపడరాదని. వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న కూలీలకు తగిన వేతనం చెల్లించడం ద్వారా రైతు వారి సహకారాన్ని పొందడం కర్తవ్యంగా భావించాలని సూచించారు. సమస్యకు ప్రత్యామ్నాయం ఆలోచించవలసిన అవసరం ఉందని, ఒక దశలో కూలీల కొరత బాగా పీడిరచిన సమయంలో తాను బీహార్‌నుండి వ్యవసాయ కూలీలను రప్పించి పని చేయించుకున్నానని తెలిపారు. 1996లో తన తండ్రి అజమాయిషీలో వ్యవసాయాన్ని ప్రారంభించిన తాను కొంతకాలం పాటు పత్తి సేకరణ కొరకు 1,92,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం పై పయనించానని, పత్తి కాటాలలో మోసం దాగి ఉండడం, ఇతర అనేక లోపాయకారి విధానాలు తనను బాధించాయని, అందుకే వ్యవసాయాన్ని ఒక వృత్తిగా స్వీకరించి పవిత్ర భావంతో ముందుకు వెళుతున్నానని వివరించారు. ‘‘శ్రమయేవజయతే’’ అనే పెద్దల నానుడిని తూచా తప్పక పాటిస్తూ రైతుగా స్వావలంబనకు చేరుకున్నానని సంతృప్తి వ్యక్తం చేశారు. రవీంద్ర రైతుగా తానొక్కడే విజయం సాధించడం కాకుండా, రోజుకు 20 నుండి30 మంది రైతులకు సలహాలను ఇచ్చి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తుంటారు. ఒక గ్రామంలో నాలుగు వైపులా భూమి ఉండాలని వెనుకటికి మన పెద్దలు భావించేవారని, గ్రామపరిధిలోనే వర్షపాతం ఒకేరకంగా ఉండకపోవడం గమనించామని, పంటల భీమాపథకంలో లోపభూయిష్ట విధానం వలన రైతుకు న్యాయం జరగడంలేదని అన్నారు.

గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని బీమాను వర్తింపచేయడం సమంజసం కాదని, రైతును యూనిట్‌గా తీసుకుని పథకాన్ని వర్తింపచేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. నిడుముక్కలలో ఇప్పటికే తన విశేష అనుభవంతో సేద్యం ద్వారా సిరులు పండిస్తున్న రవీంద్ర అనుభవాలు ఇక్కడికి వచ్చే రైతులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశగా మళ్ళించాలని కోరుకునే రవీంద్ర రాష్ట్రప్రభుత్వం స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సులను అమలు చేస్తున్నామంటూ, రాజకీయ కార్యకర్తలను ఆదర్శరైతులుగా నియమించడం వలన ఉపయోగముండదని వ్యాఖ్యానించారు. 1996లో మొదలుపెట్టి ఇప్పటి వరకు కేవలం వ్యవసాయంపై కోటిన్నర రూపాయలు ఆర్జించి, బడాకాంట్రాక్టర్లు, ఉన్నతోద్యోగులతో సమానంగా 40 లక్షల రూపాయలతో అత్యంత ఆధునిక భవనాన్ని నిడుముక్కల గ్రామంలో నిర్మించుకుని రైతుగా గర్విస్తున్నానని వడ్లమూడి అన్నారు. నిరాశతో రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టకుండా, పోరాటపటిమతో సమస్యలకు ఎదురొడ్డి నిలచి మనుగడ సాగించాలని ఆయన తోటి రైతులకు ఆత్మ విశ్వాసాన్ని నిరంతరం కల్గించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదర్శ సేద్యానికి చిరునామాగా నిలచి, అఖండ సంపదను ఆర్జించి పెడుతున్న ఇటువంటి మట్టిలో మాణిక్యాలు జాతికి ఎంతో అవసరం. వడ్లమూడి రవీంద్రనాథ్‌ తండ్రి : సాంబశివరావు, నిడుముక్కల (గ్రామం), తాడికొండ (మండలం), గుంటూరు (జిల్లా), ఫోన్‌: 9848714849.

సేద్య ‘మోహనం’ ఆదర్శ రైతుల గురించి, పంట దిగుబడులలో విజయం సాధించిన రైతుల గురించి, లక్ష్యసాధనలో వారుపడిన కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మధ్యతరగతి రైతాంగం అనాదిగా సాంప్రదాయ వ్యవసాయంలో పెద్దగా సంపాదించింది లేకపోగా, ఉన్న దానిలోనే పొదుపు చేసుకుని పిల్లల్ని చదివించుకోవడం ద్వారా సంతృప్తి పడతారు. ఎమ్‌ఏ చదివిన తన కుమారుడు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడాన్ని ఆ తండ్రి హర్షించాడో లేదో తెలియదు కాని, తనకు పచ్చని రంగులద్దిన భూమిపుత్రుడ్ని చూసి భూమాత పులకరించిపోయింది. అతని శ్రమైక జీవన సౌందర్యానికి మెచ్చి గుత్తులు, గుత్తులుగా మిరప, పత్తిని విరగపండిరచి దీవించింది. ఇది కూడా గుంటూరు జిల్లా కథే. ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన అయినంపూడి మోహనకృష్ణ ఈ సంవత్సరం 20 ఎకరాలలో చెరిసగం ఎకరాలు మిరప, పత్తి పండిరచారు. మిరప ఎకరాకు 25 ` 30 క్వింటాళ్ళ దిగుబడి రాగా పత్తి 10 ఎకరాలలో 100 క్వింటాళ్ళకు పైగా పండిరది. మిర్చి సాగులో తను సొంతంగా తయారు చేసుకున్న మిరప విత్తనాలను వినియోగించిన మోహనకృష్ణ, ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి దిగుబడి కొంచెం దెబ్బతినడం, మొజాయిక్‌ వైరస్‌ ప్రబలడంతో మిర్చి దిగుబడులు తగ్గాయని వివరించారు. గిట్టుబాటు ధర తగినంతగా ఉన్నా, మిర్చి కోత కూలి విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించిందని, మిరప తొక్కుడు, గోతాలు, కమీషన్‌, లోడిరగ్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా సరైన సస్యరక్షణ, నీటి, ఎరువుల యాజమాన్యంతో సంతృప్తి కరమైన దిగుబడులను సాధించానని తెలిపారు. పంటల భీమా పధకం రైతులను యూనిట్‌గా చేసుకుని అమలు చేయాలని సూచించారు మోహనకృష్ణ. అయినంపూడి మోహనకృష్ణ, కోయవారిపాలెం (గ్రామం), ప్రత్తిపాడు (మండలం), గుంటూరు (జిల్లా), ఫోన్‌: 9948501002.

ప్రముఖుల మన్ననలు పొందుతున్న మన్నవ జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం, చింతపల్లిపాడు గ్రామరైతు మన్నవ వెంకటేశ్వరరావు గత మూడు దశాబ్దాలుగా 30 ఎకరాల భూమిలో మిర్చి, పత్తి సాగుద్వారా అధిక దిగుబడులను సాధిస్తున్నారు. 23 ఎకరాలలో వర్షాధార భూమిలో ఎకరానికి 16 క్వింటాళ్ళ పత్తి దిగుబడిని సాధిస్తున్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సహాయంతో మరో 7 ఎకరాలలో ఎకరాకు 30 క్వింటాళ్ళు మిర్చి దిగుబడిని పొందుతున్నారు. తనకు కావలసిన విత్తనాలను తానే ఉత్పత్తి చేసుకుంటూ సేద్య రంగంలో వినూత్నంగా ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం మొదటి విడత మిర్చి దిగుబడి 125 క్వింటాళ్ళను, రెండో విడత దిగుబడి 80 క్వింటాళ్ళను, మూడవ విడత 30 క్వింటాళ్ళను కోల్డు స్టోరేజిలలో భధ్రంగా పదిలపరచుకున్న ఆయన మరింత గిట్టుబాటు ధర కోసం వేచిచూస్తున్నారు. మిరప సస్యరక్షణలో భాగంగా ‘మిత్ర్‌’ అనే మందు ఎకరానికి 100 మి.లీ.తోపాటు అమిస్టార్‌, ఫెగాసిస్‌ అనే మందులు విశేషంగా పంట పండటానికి ఉపయోగపడ్డాయని తెలిపారు. ఐతే మిర్చి కోతకు, పత్తి సేకరణకు విశేషంగా కూలీల ఖర్చులు పెరిగిపోవడం, భూమి కౌలు ఎకరాకు 10వేల నుండి 15వేల వరకు ఉండడం వలన తమకు ప్రతిబంధకాలుగా మారాయని మన్నవ ఆవేదన వ్యక్తం చేశారు. మన్నవ వెంకటేశ్వరరావు, తండ్రి. కోటయ్య, చింతపల్లి పాడు (గ్రామం), వట్టి చెరుకూరు (మండలం), గుంటూరు (జిల్లా), ఫోన్‌: 9959739175.

ఆదర్శ మామిడి రైతు శ్రీనివాసరెడ్డి

బిందు సేద్యం – సమగ్ర సస్యరక్షణ – అదే విజయరహస్యం

నిజమైన సామాజిక బాధ్యత ఉన్నవాడు రైతన్నే. ఎండనక, వాననక, శ్రమకోర్చి అతను బాధ్యతతో తీస్తున్న ఉత్పత్తి దేశంలో కోట్లాది మంది కడుపు నింపుతున్నది. అందుకే ఆయనను ‘‘అన్నదాత’’ అంటారు. కానీ ఆయనను ‘‘సుఖీభవ’’ అని ఆశీర్వదించే స్వరాలు మాత్రం పేలవంగా ఉంటాయి. ఆది మానవుని కాలం నుండీ, ఆ మాటకొస్తే భూమి పుట్టిన నాటినుండి తిండి గింజలను సంపాదించి పెట్టే రైతన్న విజయగాధలే చరిత్రను శాసించాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా స్వానుభవంతో సమగ్ర సస్యరక్షణతో రెట్టింపు దిగుబడులు సాధించిన భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాధ కూడా అందులో ఒకటి.

దేశ, విదేశాల లోని పౌరులకు నోరూరించే మధురమైన మామిడి ఫలాలను పండిరచడంలో ఈ రైతు దిట్ట. ఖమ్మంజిల్లాలోని ఇతర రైతులకు మార్గదర్శకంగా గత 20 ఏళ్ళుగా మామాడిపంట దిగుబడిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న శ్రీనివాసరెడ్డిది ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం, రాజాపురం గ్రామం.

ఈ సంవత్సరం వాతావరణం సరిగా లేక మామిడి దిగుబడులు తగ్గిపోయాయని సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతున్నది. ప్రతికూల పరిస్ధితులలో గతంలో కంటే అధికదిగుబడులు సాధించి, శ్రీనివాసరెడ్డి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. ప్రతి సంవత్సరం అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి ఎకరానికి 8 నుండి 10 టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేసేవారు. ఈ సంవత్సరం 12 నుండి 13 టన్నుల దిగుబడి రావచ్చని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.

శ్రీనివాసరెడ్డి వయసు 33 ఏళ్ళు. 20 ఏళ్ళ క్రితం మామిడి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిన 15 ఎకరాల్లో మామిడి చెట్లను నాటిన నాటి నుండి వాటిని కంటికి రెప్పలా కాపాడటం ప్రారంభించారు. అప్పటి నుండి ఎడతెగని శ్రమ శక్తితో ప్రతి సంవత్సరం దిగుబడులు పెంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తన విజయరహస్యాన్ని ‘అగ్రి క్లినిక్‌’ ప్రతినిధితో పంచుకున్న శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయాలు ఇతర రైతులకు ఆదర్శంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

రైతు శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం తన మొట్టమొదటి విజయ రహస్యం బిందు సేద్య విధానాన్ని అమలుపరచడమే అన్నారు. బిందుసేద్యం వలన 80 శాతం నీరు, ఎరువులు, క్రిమిసంహారకాలను చెట్టు తనలో ఇముడ్చుకుంటుందని, దాని వలన కొమ్మలు, రెమ్మలు బలంగా ఉండి , పూత. పిందె పడుతుందని తెలిపారు.

ప్రతి సీజన్‌ అయిపోయిన వెంటనే మొట్ట మొదట మోడైపోయిన కొమ్మలను నరికి వేయగా ఎండు పుల్లలను ఏరివేయడం జరుగుతుందన్నారు. తరువాత నేలబారున అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను నరికి వేస్తామని దీన్ని ‘‘ప్రూనింగ్‌’’ విధానమని అంటారని తెలిపారు.

మూడు దశలలో తగినంత మోతాదులో ఎరువులు, రసాయనాలు, క్రిమిసంహారక మందులు పద్దతి ప్రకారం వినియోగిస్తామని తెలిపారు. తొలకరి వర్షం పడటంతోనే చెట్టుమొదళ్ళలో ట్రాక్టరుతో దున్ని పాదులు చేస్తామని, చెట్టుకు ఒక మీటరు దూరంలో నాలుగు నుండి ఐదు సెంటీమీటర్ల గొయ్యి త్రవ్వి, దానిలో ఒక్కో చెట్టుకు 5 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 2 కిలోల యూరియా, ఒకటిన్నర కిలోల పొటాష్‌ వేసి, గొయ్యిని పూడ్చివేస్తామని వివరించారు.

ఆగస్టు, సెప్టెంబరు నెలలో కలుపు ఉధృతిని బట్టి మరొక్కసారి దుక్కిదున్నుతారు. డిసెంబరు నుండి వరుసగా చెట్లకు నీటి సరఫరా జరుగుతూనే ఉంటుంది. బిందు సేద్యం వలన నీటి వృధాను అరికట్టడమేగాక, ఎరువులు, క్రిమిసంహారకాలను కూడా వెదజల్లడంతో కూలి ఖర్చు తగ్గుతుంది. దీని వలన కలుపు ప్రమాదం కూడా లేకపోవడంతో కూలీలకు వెచ్చించాల్సిన భత్యం మరింత ఆదా అవుతుంది. సమగ్ర నీటి యాజమాన్యం ద్వారా 50 శాతం ఫలితాలు రాగా ఎరువులు, పురుగు మందులు సస్య రక్షణ ద్వారా దిగుబడులు అధికమవుతాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాయ జొన్న గింజ పరిమాణంలో ఉన్నప్పుడు నుండి క్రమం తప్పకుండా నీటిలో కరిగే నత్రజని, పొటాష్‌ ఎరువులను సిఫార్సు మేరకు ఇస్తూ నెలకు ఒకసారి ఎన్‌ ` డ్రిప్‌బూస్‌ మందును ఎకరానికి ఒక లీటరు చొప్పున అందించామని తెలిపారు. దీనితో కాయ త్వరగా పక్వానికి వచ్చి మంచి నాణ్యత, రంగు, రుచి కూడా పెంపొందిందని వివరించారు.

రైతు అనుభవాల కొరకు చిరునామా:

భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి

రాజాపురం (గ్రా) చండ్రుగొండ (మం), ఖమ్మం జిల్లా, ఫోన్‌ : 9000322163

విత్తన బ్రహ్మ ‘కొంగర రమేష్‌’

ఆయన విద్యావంతుడు కాదు, ధనవంతుడూ కాదు, సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబీకుడు. గుంటూరు జిల్లా, పెదకాకుమాను గ్రామానికి చెందిన కొంగర రమేష్‌, తన సృజనాత్మకశక్తి, సామాజిక బాధ్యతను రంగరించి విత్తన ఉత్పత్తి రంగంలో తలపండిన శాస్త్రవేత్తలకే ‘‘దిక్సూచి’’గా మారారు. చిన్నతనంలో తండ్రి కాకుమాను గ్రామ పంచాయితీ సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. దీనితో బాల్యంలోనే విద్యాభ్యాసానికి స్వస్తిచెప్పి, వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించిన రమేష్‌ బాపట్ల వ్యవసాయ కళాశాల శాస్త్రజ్ఞుల సహచర్యంతో విత్తనరంగంలో ‘‘ఏకలవ్యుడి’’లా ముందుకు వెళ్ళారు. వ్యవసాయరంగంలో ఒడిదుడుకులు కష్టనష్టాలను చూస్తూ, తన అనుభవాలను రంగరించి విత్తనాల తయారీకి నడుంకట్టారు.

గుంటూరుజిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తిసాగులో ముందుకు వెళ్ళే రైతులకు అవరోధంగా ఉన్న పత్తివిత్తనాలపై దృష్టి సారించారు. ప్రారంభంలో మొక్కజొన్న, సజ్జవిత్తనాలను ఉత్పత్తి చేసిన రమేష్‌ తన ప్రతిభతో పత్తిలో సెలక్షన్‌ 1, సెలక్షన్‌ 2, సెలక్షన్‌ 3 అనే మూడు రకాల విత్తనాలను ఉత్పత్తి చేశారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 24 క్వింటాళ్ళ దిగుబడిని సాధిస్తుండడంతో సుదూర ప్రాంతాలైన వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాల రైతులు ఆకర్షితులయ్యారు.

1990 సంవత్సరంలో ‘‘రెడ్‌ టాప్‌ - 365’’ అనే మిర్చి విత్తనాన్ని తయారు చేసి, వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా, దిగుబడి అధికమయ్యేందుకు కృషి చేశానని, ఈ రకం మిర్చికోత సమయంలో వస్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల గుత్తులు గుత్తులుగా పండే పాండవ అనే మిరపరకాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ పాండవ రకం తక్కువ కారం ఉండి, ఎక్కువ రంగుతో మంచి నాణ్యమైన కాయలను ఇస్తుంది. ఈ రకం విత్తనాలను ఎకరానికి 60 వేలనుండి లక్ష మొక్కలు వచ్చేటట్లు ఎదబెట్టుకోవాలి. ఒక్కొక్క మొక్కకు 40 నుండి 50 కాయలు కాపు వచ్చి ఒకేసారి కోత కోయడానికి వీలవుతుంది. ఈ రకాన్ని చీదీూGR సంస్థలో రిజిస్టర్‌ చేశానని తెలిపారు. రోజు రోజుకి పెరుగుతున్న కోత కూలీల ఖర్చుని దృష్టిలో ఉంచుకొని పెసర, మినుములాగ పండిరచగలిగే ఈ పాండవ రకాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చానని తెలిపారు.

ప్రముఖ నిర్మాణసంస్థ నవయుగ విశ్వేశ్వరరావు ఉదారస్వభావంతో విశాఖ సమీపంలోని తర్లుపాడులో ఇచ్చిన 40 ఎకరాల ప్రాంగణంలో సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్న కొంగర రమేష్‌ 15 రకాల మధురమైన మామిడి ఫలాలను పరపరాగ సంపర్కం ద్వారా మామిడి హైబ్రీడ్స్‌ను అభివృద్ధి చేశారు.

రమేష్‌ అభివృద్ధి చేసిన మామిడి రకాలలో ముఖ్యమైనవి మూడిరటిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం

మొదటి రకం : ఇంకా నామకరణం చేయని ‘‘ఆరు’’ రకం మామిడి ఫలం

దీని ప్రత్యేకతలు :

 • ఇమాంపసంద్‌ I చిన్న రసాలతో క్రాస్‌ చేయించి సృష్టించిన మేలురకం మామిడి
 • కాయ తోలు పలుచగా ఉండి, అరటి పండు లాగ వలుచుకోవచ్చు.
 • రసం కాయగానూ, టేబుల్‌ రకంగానూ వినియోగించుకోవచ్చు.
 • 20 టి.ఎస్‌.ఎస్‌. (సాలిబుల్‌ షుగర్‌) ఉండడంతో అద్భుతమైన రుచి
 • మంచి సువాసనతో పాటు మధురమైన రుచి
 • అన్ని రకాల కంటే ముందు ఏఫ్రిల్‌లోనే పక్వానికి వస్తుంది.
 • సాధారణ మామిడి చెట్ల కంటే భిన్నంగా ఎకరానికి 200 మొక్కలు వేయవచ్చు.

రెండోరకం : ఆమ్రపాలి I చిన్నరసాలను క్రాస్‌చేసి అభివృద్ధిపరచినవి.

దీని ప్రత్యేకతలు :

 • మంచిరంగు, రుచి వీటి స్వంతం
 • చెట్టుకాపు విపరీతంగా ఉంటుంది.
 • చెట్టు సన్నగా, పొడుగ్గా ఉంటుంది
 • మే మధ్యలో కాయ కోతకు వస్తుంది.
 • ఈ రకాన్ని రసం కొరకు విశిష్టంగా ఉపయోగించుకోవచ్చు.

మూడోరకం : తోతాపురి I ఇమాంపసంద్‌ క్రాస్‌ చేస్తే వచ్చిన రకం

దీని ప్రత్యేకతలు :

 • మిగిలిన ఫలాల్లాగానే రంగు, రుచి
 • జూన్‌ 15 నాటికి అంటే కాపు ఆఖరుకి పంట వస్తుంది
 • కాయ ఎక్కువకాలం నిల్వ ఉండి టేబుల్‌ వెరైటీగా పేరొందింది.

అనుభవం నేర్పిన పాఠాలతో రైతు విత్తనసాధికారత ప్రతీకగా సేద్యం రంగంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న ఆదర్శ రైతు కొంగర రమేష్‌ మరెంత మందికో మార్గదర్శకుడై మరింత విస్తృతంగా సేవలందించాలని ‘‘అగ్రి క్లినిక్‌’’ అభిలషిస్తోంది.

రైతు వివరాలకు :

కొంగర రమేష్‌

తర్లువాడ (గ్రామం), ఆనందపురం (మం), విశాఖపట్నం.

ఫోన్‌ : 9849278889, 08933 200140

ఆధారము: అగ్రిక్లినిక్

పవిత్ర ప్రియదర్శిని - పుట్టగొడుగుల సాగు

సేంద్రియ కూరగాయల కన్నా సులభం గ్రీన్‌హౌస్‌లో ఏడాది పొడవునా పెంచుకోవచ్చు శుభారంభానికి ఇదే తరుణం

టై మీద ఆకుకూరలు, కూరగాయలే కాదు పౌష్టికాహారమైన పుట్టగొడుగులను కూడా సేంద్రియ పద్ధతుల్లో నిక్షేపంగా పెంచుకోవచ్చు. పుట్టగొడుగుల సాగు కష్టమేమో అనుకోకండి. నిజానికి కూరగాయలకన్నా వీటిని పెంచడమే సులభం అంటున్నారు పవిత్ర ప్రియదర్శిని.

‘ఇంటిపంట’ ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యురాలైన పవిత్ర కోయంబత్తూరు నివాసి. రసాయనాలు వాడి పెంచిన పుట్టగొడుగులు కొని తినడం ఇష్టం లేక.. తన ఇంటిపైనే చిన్న గ్రీన్‌హౌస్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో పుట్టగొడుగులు పెంచుతున్నారామె.. ‘కాస్త మనసు పెట్టి ప్రణాళికతో పనిచేస్తే చాలు.. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇంటిపట్టునే పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. ఇంటర్‌నెట్ ద్వారా అధ్యయనం చేసిన జ్ఞానంతో.. ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించా. బటన్ పుట్టగొడుగుల కంటే ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచడం తేలిక...’ అంటున్నారామె. తెల్ల, లేత ఎరుపు పుట్టగొడుగులను ఆమె పెంచుతుండడం విశేషం.

టైపై సేంద్రియ పుట్టగొడుగుల పెంపకానికి కావాల్సినవి :

 1. వరి గడ్డి
 2. ఆయిస్టర్ మష్రూమ్ స్పాన్(విత్తనం)
 3. ప్లాస్టిక్ బ్యాగ్‌లు

గడ్డి బ్యాగ్‌ల తయారీ ఇలా...

వరి గడ్డిని చిన్న ముక్కలు చేయాలి. వాటిని పెద్ద పాత్రలో వేసి నీరుపోసి మూతపెట్టి.. చిన్న మంట మీద గంట సేపు ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత న్యూస్‌పేపర్ నేలపై పరచి.. దానిపై గడ్డిని వేసి.. నీరు పూర్తిగా కారిపోయే వరకు ఆరబెట్టాలి. ప్లాస్టిక్ బ్యాగ్‌లు తీసుకొని 3 అంగుళాల ఎత్తు వరకు గడ్డిని నొక్కి పెట్టాలి. గుప్పెడు స్పాన్‌ను తీసుకొని.. గడ్డి బ్యాగ్ అంచుల్లో వేయండి. ఆపైన 2 అంగుళాల మందాన మళ్లీ గడ్డిని నింపండి. గడ్డిపైన అంచుల్లో మళ్లీ స్పాన్ వేయండి... ఈ విధంగా 3 పొరలుగా వేయండి. చివ రన గడ్డి పొర వేసి ప్లాస్టిక్ బ్యాగ్ మూతిని బిగుతుగా కట్టేయాలి.ప్లాస్టిక్ బ్యాగ్‌పైన, చుట్టూతా, అడుగున కొన్ని బెజ్జాలు పెడితే గడ్డికి గాలి తగులుతుంది.

పుట్టగొడుగుల పెంపకం ఇలా...

మీ ఇంట్లో ఒక మూలన చీకటిగా, చల్లగా ఉండే చోటులో.. అది కాంక్రీటు షెల్ఫ్ కావచ్చు, కప్‌బోర్డు కావచ్చు లేదా మంచం కింద పెట్టె కావచ్చు.దాని శుభ్రం చేసి, దాని లోపల అంతటా డెటాల్ నీటితో శుభ్రం చేసి.. తడి ఆరనివ్వండి. గడ్డి బ్యాగ్‌లను అందులో పెట్టి... నల్లని వస్త్రం లేదా గోనెసంచితో కప్పండి.వాతావరణం వేడిగా ఉన్నట్లయితే.. ఆ వస్త్రం లేదా గోనెసంచిపై రోజుకు రెండుసార్లు నీటిని చిలకరించి తడిగా ఉండేలా చూడండి. 3,4 రోజుల్లో స్పాన్ ఉన్న చోట తెల్లని బూజులాంటిది(మైసీలియం) కనిపిస్తుంది. బ్యాగ్‌లో ఏమైనా ఆకుపచ్చని బుడిపెల్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో చూడండి. అలాంటివి ఉంటే చెడిపోయినట్లు లెక్క. అటువంటి బ్యాగ్‌ను తీసి పక్కకు పెట్టేసి.. ఆకుపచ్చగా ఉన్న చోట బ్యాగును కత్తిరించి చిటికెడు ఉప్పును చల్లండి. అంతా సవ్యంగా ఉంటే.. 2 వారాల్లో బ్యాగ్ మొత్తం తెల్లగా పొరతో నిండిపోతుంది.

అప్పుడు బ్యాగులను బయటకు తీసి, శుభ్రమైన కత్తి మొనతో బ్యాగ్‌పై ఎక్స్ ఆకారంలో గాట్లు పెట్టి.. ఇంట్లోనే నీడపట్టున కొంచెం వెలుతురుగా ఉండే చోట పెట్టాలి. రోజుకు 3-5 సార్లు నీటిని చిలకరించాలి.నేనైతే మేడ మీద గ్రీన్ షేడ్‌నెట్‌తో షెడ్డు వేశాను. షెడ్డులో ముందువైపు చాలా ఖాళీ వదిలేసి, ఒక మూలకు గ్రీన్‌షేడ్‌నెట్‌తో చిన్న గదిలాగా ఏర్పాటు చేశాను. దాని పైన, బయటి వైపు కొబ్బరి ఆకులు కప్పాను. లోపల గోనె సంచులను వేలాడదీశాను. గోనె సంచులను చల్లదనం కోసం మధ్యాహ్న వేళల్లో నీటితో తడుపుతూ ఉంటాను.

బ్యాగ్‌లకు గాట్లు పెట్టిన చోట్ల బుడిపెలు పెరుగుతూ ఉంటాయి. అవి తేమ ఆరిపోకుండా రోజుకు 5 సార్లు నీటిని చల్లుతుండాలి. 3 నుంచి 5 రోజుల్లో ఈ బుడిపెలు పుట్టగొడుగులుగా విస్తరిస్తాయి. గ్రీన్‌హౌస్‌లో 28-30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. వేడి వాతావరణంలోనూ పుట్టగొడుగులు పెంచవచ్చు. గ్రీన్‌హౌస్‌లో నేల మీద ఇసుకపోసి తడుపుతూ ఉంటే చల్లగా ఉంటుంది.

పుట్టగొడుగుల అంచులు కిందికి వంగి ఉండగానే.. కోసి కూరవండుకుంటే రుచిగా ఉంటాయి. ముదిరితే అంచులు పైకి ముడుచుకుంటాయి. అప్పుడు రుచి తగ్గుతుంది. పుట్టగొడుగుల పెంపకంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. పుట్టగొడుగుల పెంపకం ప్రారంభానికి అనువైనది శీతాకాలమే. ఇంకెందుకు ఆలస్యం..!(పుట్టగొడుగుల పెంపకంపై సందేహాలుంటే పవిత్ర ప్రియదర్శిను 099941 20017 నంబరులో ఏ రోజైనా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆంగ్లంలో మాత్రమే సంప్రదించగలరు.)

ఆధారము: సాక్షి

కరవు ప్రాంతంలో సిరుల పంట

ఈ రెండు గ్రామాలను చూడండి.. ఒకటి పచ్చని పొలాలతో అలరారుతోంది... మరొకటి ఒక్క మొక్కా కనిపించక ఎడారిలా బీళ్లు పడింది. పక్కపక్కనే ఉన్న ఈ రెండు గ్రామాల్లో ఇంత తేడా ఎందుకు? ఒకే రకమైన నేల.. ఒకే రకమైన వర్షపాతం.. ఒకే రకమైన వాతావరణం.. ఇలా అన్నింటా... తేడా ఏమీ లేకపోయినా.. ఒక గ్రామం ఆకర్షణీయంగా ఎలా మారింది? ఆ గ్రామంలో ఉన్నదేమిటి? ఈ గ్రామంలో లేనిదేమిటి?

ఉంది.. ఎంతో ఉంది... గ్రామస్థుల 30 ఏళ్ల కృషి ఉంది.
చేయి చేయి కలిపి నిర్మించుకున్న గ్రామ స్వరాజ్యముంది..
ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టుకున్న శ్రమైక సౌందర్యముంది..
నీటి కయ్యలతో ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొన్న ధైర్యముంది.

ఇవన్నీ మహారాష్ట్రలోని 'కాసారే' గ్రామాన్ని ఆకర్షణీయంగా మార్చేశాయి.. తరతరాలకు తరగని నీటి సంపదను సృష్టించాయి.. ఆ నీరే ఇప్పుడు బంగారం పండిస్తోంది.. సామాజికంగా, ఆర్థికంగా.. విద్యాపరంగా గ్రామస్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది.. ఇప్పుడా గ్రామంలో ఉపాధి వలసల్లేవ్... పంటలు పండక అన్నదాతల ఆత్మహత్యల్లేవ్.. ఫీజులు కట్టలేని విద్యార్థుల్లేరు.. ఉద్యోగం కోసం అంగలార్చే యువత లేరు.. అంతా నీటి బొట్టునీ ఒడిసి పట్టి వరహాలను(సిరి సంపదలను) మూటగట్టుకుంటున్నవారే...

కాసారే... తరతరాల తలరాతను స్వయం కృషితో మార్చుకున్న గ్రామం ఇది. అత్యల్ప వర్షపాతం నమోదైనా అద్భుత ఫలితాలను రాబడుతోంది. మూడు దశాబ్దాల అవిరళ కృషితో.. వర్షపు నీటి సంరక్షణతో ఆదర్శంగా నిలిచింది. ఎటు చూసినా పచ్చదనం... పంట పొలాలతో కళకళలాడే నేల... బావుల్లో 3, 4 అడుగుల్లోనే నీళ్లు... చెక్‌డ్యాంలు, వాగుల్లో నీటి నిల్వలు... ఫలితంగా ఎందుకూ కొరగాని భూములుగా వదిలేసిన వాటిలో ప్రస్తుతం సిరులు పండుతున్నాయి.

ఒకప్పుడు క్షామ పీడితం.. : అహ్మద్‌నగర్ జిల్లాల్లోని పార్నేర్ తాలూకాలో ఉంది కాసారే.. ఒకప్పుడు వ్యవసాయానికి అంతగా అనుకూలించని భూములు. నాలుగైదు ఎకరాలు సాగు చేస్తే రెండు క్వింటాళ్ల దిగుబడీ కష్టమే. అదీ జొన్నలు... సజ్జలు పండే ప్రాంతం. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. జీవనోపాధి లేదు. పంటలు లేవు. తరచూ కరవు. 15 కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకరు వస్తేనే తాగునీరు. వర్షాల కోసం ఎదురుచూసి వానాకాలం సేద్యం. 60శాతం మందికి గొర్రెల పెంపకమే జీవనాధారం. పర్యావరణ సమతౌల్యం మాటేలేదు. కూలీ పనుల దొరకాలన్నా గగనమే.

మరి ఇప్పుడో...: ఈసారి కాసారే ప్రాంతంలో 330 నుంచి 350 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. కానీ కాసారేలో కరవు ఛాయలు, వర్షాభావ పరిస్థితులు మచ్చుకైనా కనిపించవు. వ్యవసాయ పనుల్లో అంతా బిజీబిజీగా ఉన్నారు. పంటలు చక్కగా పండుతున్నాయి. తాగునీటికి సమస్య అసలే లేదు. గ్రామంలో వైభవంగా జాతరలు చేసుకుంటున్నారు. వలసలు లేవు... రైతుల ఆత్మహత్యలు అంతకన్నా లేవు. కొత్త పంటల సాగుతో చేతికి అంది వచ్చిన పంటలతో ఉత్సాహంగా ఉన్నారు.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అన్వయం :

అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాసారే గ్రామస్థులు మరింత శాస్త్రీయంగా ముందుకెళ్తున్నారు. జీఐఎస్‌తో అత్యంత పకడ్బందీగా వాటర్‌షెడ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్ఐఆర్‌డీ సాంకేతిక సహకారంతో గ్రామ స్వరూపమంతా జీఐఎస్‌తో అందుబాటులో ఉంది. ఆ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే సమాచారం ఉంది. కుటుంబ సభ్యుల ఫొటో, ఆధార్ సంఖ్య, ఓటరు ఐడీ నెంబరు, భూముల వివరాలు, పంటలు, ఆదాయ స్థితి, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలన్నీ ఒక క్లిక్‌తో అందుబాటులోకి వస్తాయి.

ఏం చేశారు

30 ఏళ్ల క్రితం పడిన చిన్న అడుగే నేటి విజయాలపరంపరకు మూలం. అహ్మద్‌నగర్ ప్రాంతంలో వందల గ్రామాల్లో వాటర్‌షెడ్ కార్యక్రమాలకు మూడు, నాలుగు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరంతరం కొనసాగించి ప్రత్యేకతను చాటుకున్నారు కాసారే గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు. నాడు మహా లక్ష్యానికి శ్రీకారం చుట్టిన యువకులు నేడు వృద్ధులుగా విజయాలను ఆస్వాదిస్తున్నారు. 1987లో సోషియల్ సెంటరు ద్వారా ఫాదర్ బాచర్ వాటర్‌షెడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాసారే గ్రామ ప్రజలకు వర్షాభావ పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు వాటర్‌షెడ్ కార్యక్రమంపై అవగాహన కలిగించారు. యువకులతో కలసి యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగంతో 25వేల మొక్కలతో కిసాన్ నర్సరీని ఏర్పాటు చేశారు. రైతులు, యువజన సంఘం గ్రామం, పొలాల గట్లలో, రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. వాటర్‌షెడ్ కార్యక్రమానికి ఇది తొలి అడుగు. ఏడాదిలో మొక్కల పెంపకం ఫలితంతో 35ఎకరాల్లో మైక్రో వాటర్‌షెడ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షపు నీరు భూమిలో ఇంకేందుకు, భూసార పరిరక్షణ వంటి వాటికి ప్రాధాన్యమిచ్చారు. బంజరు భూముల్లో నీటి సంరక్షణకు శ్రీకారం చుట్టారు. నిధుల కొరత అడ్డొచ్చింది. తలా కొంత వేసుకుని కార్యక్రమాలు చేపట్టారు. 1996 తర్వాత గ్రామ పంచాయతీనే బాధ్యతలు తీసుకుంది. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లారు. మూడు దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది.

వాటర్‌షెడ్ అంటే?

వర్షాభావ ప్రాంతాల్లో నిర్దిష్ట విధానాలతో వాన నీటి సంరక్షణ చేసి భూగర్భ జలాలను పెంచడం వాటర్‌షెడ్ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలయ్యే ప్రాంతంలో పడే ప్రతి చినుకునూ ఆ ప్రాంతంలోనే భూమిలోకి ఇంకేలా చేస్తారు. ఇందుకోసం కురిసిన కాస్తంత వర్షం వృథాగా పోకుండా అక్కడికక్కడే అడ్డుకట్ట వేసి నీటిని భూమిలో ఇంకేలా చేస్తారు. అందులో భాగంగానే కొండలు, వాలు ప్రాంతాల్లో పై నుంచి వచ్చే నీటినీ భూగర్భ జలంగా మార్చే ప్రక్రియ ఉంది. చెక్‌డ్యామ్‌లు, వూట చెరువులు లాంటి నిర్మాణాలతో నీటిని నిల్వ చేస్తారు. వాగులు, వంకల వెంట మొక్కలు, అనేక రకాల చెట్లను పెంచడంద్వారా పర్యావరణ పరిరక్షణ చేపడతారు. తద్వారా వర్షపాతాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు.

నీటి సంరక్షణ ఎలా చేశారంటే?

కాసారే గ్రామ పంచాయతీ పరిధిలోని నాలుగైదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వాలు ప్రాంతాలను గుర్తించారు. వర్షపు నీరు ఎక్కడిక్కడ ఇంకేలా చర్యలు తీసుకున్నారు. కొండలపై పడిన కొద్దిపాటి వర్షం భూమిలో ఇంకేలా కాంటూరు ట్రెంచ్‌లను తవ్వారు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు, వూట చెరువులు నిర్మించారు. భూమి కోతకు గురి కాకుండా నిర్మాణాలు చేశారు. ప్రభుత్వ స్థలాలు, పాఠశాల, పంచాయతీ భవనాల దగ్గరే కాకుండా ప్రైవేటు భూముల్లోనూ మొక్కలు పెద్ద ఎత్తున పెంచారు. వాటర్‌షెడ్ పథకం అమలు తరవాత భూగర్భ జలాలు పెరిగాయి. ఈ గ్రామంలు సుమారు 80కిపైగా బావులున్నాయి. ఇప్పుడు మూడు నాలుగు అడుగుల్లోనే నీళ్లున్నాయి.

ఆధారము: ఈనాడు

అద్భుతాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్!

తరుముకొచ్చే అవసరంలో నుంచే.. సృజనాత్మక ఆలోచన పొటమరిస్తుంది! అప్పటివరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరుస్తుంది!! జనజీవనాన్ని బండ చాకిరీ నుంచి గట్టెక్కించే.. విశిష్ట ఆవిష్కరణై వెలుగుతుంది!!! అటువంటి అమూల్య ఆవిష్కరణలకు జన్మనిచ్చిన సృజనశీలురు ఆశీనులైన సుందర సమావేశ మందిరం అది. పువ్వుల మకరందాన్ని తెచ్చే తేనెటీగలకు పుస్తకాల చదువులు.. భాష.. ప్రాంతీయ భేదాలతో నిమిత్తమేముంది? మార్చి 7వ తేదీ.. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలోని కల్చరల్ సెంటర్ అది. పూల మకరందాన్ని వెంట తెచ్చిన తేనెటీగల మాదిరిగా.. గ్రామీణ ఆవిష్కర్తలు, రైతు శాస్త్రవేత్తలు, సంప్రదాయ విజ్ఞాన పరిరక్షకులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. సభికుల కరతాళ ధ్వనుల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) జాతీయ పురస్కారాలను అందజేశారు. ఇన్నోవేషన్ ఫెస్టివల్‌లో పురస్కార గ్రహీతల విశిష్ట ఆవిష్కరణల వివరాలు కొన్ని ..

అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్! వ్యవసాయదారుడిగా తనకు ఎదురైన సమస్యల పరిష్కారానికి తనకు తానే సృజనాత్మక పరిష్కారాలు వెదుకుతూ విశిష్ట యంత్రాల ఆవిష్కర్తగా ఎదిగారు. పేరు ప్రతిష్టలు, అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌ఐఎఫ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

అబ్దుల్ ఖాదర్‌కు 62 ఏళ్లు. ధార్వాడ్ (కర్ణాటక) జిల్లాలోని అన్నిగెరి గ్రామం. పుస్తకాల చదువు బడి ఆవరణలోనే ఆగిపోయి.. సేద్యమే జీవనమైంది. అలారం మోతకు కూడా వదలని మొద్దు నిద్ర ఆయనకు అలవాటు. ఈ సమస్య నుంచి బయటపడడానికి.. శబ్దం చేయడంతో పాటు మొహం మీద నీళ్లొలికించే అలారాన్ని చదువుకునే రోజుల్లోనే తయారు చేశారు. అది మొదలు.. వ్యవసాయంలో తనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఒకటి తర్వాత మరొకటిగా అనేక యంత్రాలను తయారు చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి హాని జరగకుండా ఉండే సాగు పద్ధతులను అనుసరిస్తుంటారు.

చింతలు తీర్చిన చింతపండు

తండ్రి ఆయనకు 60 ఎకరాల సాగుభూమి ఇచ్చారు. 1985లో కరువు ముంచుకొచ్చిన తర్వాత మామిడి తదితర పండ్ల తోటలూ చనిపోవటంతో దిక్కు తోచలేదు. భగర్భ జలాల్లో క్షార గుణం అధికంగా ఉంది. అయినా, కొన్ని ఎకరాల్లో చింత మొక్కలు (వరుసల మధ్య 20 అడుగుల ఎడం) నాటారు. ప్రయోగం ఫలించడంతో మొత్తం 16 ఎకరాల్లో 1800 చింత తోపును సాగు చేస్తున్నారు. తొలుత చింత పండును అమ్మేవారు. చింతపండు నాణ్యత చెడిపోకుండా నిల్వచేసేందుకు భూగర్భ గదుల వ్యవస్థను కనుగొన్నారు. ఆ తర్వాత పచ్చళ్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. చింతపండు కోయటం, గింజలు తీయడం కష్టతరమై ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి 1994లోనే రూ.3 లక్షల ఖర్చుతో 6 నెలలు శ్రమపడి చింత పిక్కలు తీసే యంత్రం తయారు చేశారు. గింజలు తీసిన చింతపండును పచ్చళ్ల కోసం ముక్కలు చేయడంలో కష్టాన్ని, ఖర్చును తగ్గించడం ఎలా? అని ఆలోచించి పాత యంత్రాన్ని విజయవంతంగా మెరుగుపరిచారు. ఇలా.. తనకు అవసరమైన ప్రతి పనికీ ఉపయోగపడే యంత్రం తయారు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది.

5 పనులు చేసే టిల్లర్..

వార్షిక పంటల్లో ఒకేసారి 5 పనులు చేసే టిల్లర్‌ను ఇటీవలే అబ్దుల్ ఖాదర్ తయారు చేశారు. పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు వేయటంతోపాటు కలుపుతీత, లోతు దుక్కి చేయడం వంటి పనులను ఇది ఏకకాలంలో చేస్తుంది. ట్రాక్టర్‌తో రోజుకు 20-25 ఎకరాల్లో పనిని పూర్తి చేయడానికి ఈ టిల్లర్ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు.

మరెన్నో ఆవిష్కరణలు..

సాధారణ రోటోవేటర్ కన్నా పది రెట్లు వేగంగా 5వేల ఆర్పీఎం వేగంతో తిరిగే రోటోవేటర్ ను రూపొందించారు. దీన్ని ఉపయోగించడం వల్ల తన పొలంలో మిర్చి దిగుబడి రెండేళ్లలో ఎకరానికి 3 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్లకు పెరిగిందని ఆయన తెలిపారు.

మహారాష్ట్ర రైతుల కోరిక మేరకు 6 నెలల్లో చెరకు విత్తే ఆటోమేటిక్ డ్రిల్లర్ పరికరాన్ని రూపొందించారు. చిన్న రైతుల కోసం చెరకు నరికే

యంత్రాన్ని రూపొందించబోతున్నానన్నారు.

దుక్కి దున్నే ట్రాక్టర్ల కోసం 20 ఏళ్లు మన్నే ఇనుప చక్రాలను రూపొందించారు. దుక్కి చేసే ట్రాక్టర్ డీజిల్‌ను ఆదా చేయడానికి ఉపయోగపడే వీల్ టిల్లర్‌ను రూపొందించారు. స్నానానికి నీటిని వేడి చేసి, 24 గంటలపాటు నీటిని వేడిగా ఉంచే మల్టీ స్టేజ్ హీటింగ్ యంత్రాంగంతో కూడిన బాయిలర్‌ను రూపొందించారు... ఇలా ఆయన సృజనాత్మక ఆవిష్కరణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రయోగాల కోసం కొంత మేరకు పొలాన్ని కూడా అమ్ముకున్నా తనకేమీ బాధగా లేదంటారు అబ్దుల్ ఖాదర్. సునిశిత పరిశీలన, సృజనాత్మకత, సమస్యలను అధిగమించాలన్న తపన.. ఆయనను దేశంలోనే అద్భుతమైన రైతు శాస్త్రవేత్తగా నిలబెట్టాయి.

చిరునామా: అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్, విశ్వశాంతి అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్, హోర్కెరి స్ట్రీట్, అన్నిగెరి, నవల్‌గుండ్ తాలూకా, ధార్వాడ్ జిల్లా, కర్ణాటక. పిన్ 582201. మొబైల్ : 094487 86350 (ఉ. 10 గం. - సా. 5 గం. మధ్యలోనే. ఆదివారం సెలవు).

ఈ మెయిల్ : sharifnadakattin@yahoo.in

ఆధారము: సాక్షి

ప్రకృతి సేద్యంలో ప్రకాశిస్తున్న యువ కిరణం

తొలిపంటలోనే అధిక దిగుబడి!

రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల పెట్టుబడి పెరుగుతున్నా నికరాదాయం తగ్గిపోతుండడంతో సాగు నానాటికీ కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పలువురు రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి రాణిస్తున్నారు. పాలేకర్ వద్ద శిక్షణ పొందిన పలువురు యువ రైతులు దేశవాళీ ఆవులను సమకూర్చుకొని ప్రకృతి వ్యవసాయంలో చక్కని ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. సేద్యాన్ని ఆశావహమైన వృత్తిగా మలచుకుంటూ తోటి రైతాంగంలో స్ఫూర్తిని నింపుతున్న యువ రైతుల్లో పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ఒకరు. వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం- సేద్య పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడంలోనే ఇమిడి ఉందని సూర్యప్రకాశ్‌రెడ్డి అనుభవం చాటిచెబుతోంది.

‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు’ ఇదీ ప్రకృతి సూత్రం. ఈ సూత్రాన్ని మనసా వాచా కర్మణా నమ్మి ధైర్యంగా ముందడుగేసిన రైతు బతుకూ పచ్చగా ఉంటుంది. విద్యాధిక యువ రైతు పంచలింగాల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రకృతి సేద్య అనుభవాలే అందుకు నిదర్శనం. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం తాపలకొత్తూరు గ్రామం ఆయన స్వగ్రామం. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ(వృక్షశాస్త్రం) చదివిన సూర్యప్రకాశ్ తర్వాత ఒక రసాయనిక ఎరువుల కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాడు. తమకున్న పదెకరాల తేలికపాటి భూమికి డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేసుకొని సూర్యప్రకాశ్ తండ్రి రాఘవరెడ్డి, సోదరుడు రాజశేఖరరెడ్డి రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చీనీ(బత్తాయి), వేరుశనగ తదితర పంటలు పండించేవారు. ఎప్పటికప్పుడు నిపుణుల సూచనల మేరకు అందుబాటులోకి వచ్చిన కొత్త ఉత్పాదకాలను వాడినప్పటికీ.. ఖర్చుకు తగిన ఆదాయం రాకపోగా నానాటికీ పరిస్థితి దిగజారుతుండడం సూర్యప్రకాశ్‌ను కలవరపరచింది. ఈ పూర్వరంగంలో సాగును గిట్టుబాటుగా మార్చుకునే లక్ష్యంతో ప్రత్యామ్నాయ సేద్య పద్ధతులపై దృష్టి సారించాడు.

యువ రైతు జీవితాన్ని మార్చేసిన శిక్షణ

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమకారుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ గ్రంథాలను అధ్యయనం చేశాడు. 2013లో మహబూబ్‌నగర్‌లో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై లోతుపాతులను ఆకళింపుచేసుకున్నాడు. రోజుకు 10 గంటల చొప్పున ఐదు రోజులు కొనసాగిన ఈ శిక్షణ అతని జీవితాన్నే మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. నవంబర్ నుంచి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాడు. నాలుగు దేశవాళీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం తయారుచేసుకొని వాడుతున్నారు. చీడపీడల అదుపునకు నిమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను పాలేకర్ సూచించిన ప్రకారం స్వంతంగా తయారుచేసుకొని వాడుతున్నాడు. తొలి ఏడాదే గణనీయమైన ఫలితాలు సాధించి గ్రామంలో రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అధిక దిగుబడి.. అధిక నికరాదాయం..

తండ్రి 11 ఏళ్లనాడు మూడెకరాల్లో నాటిన చీనీ తోటను 2013 నవంబర్ నుంచి సూర్యప్రకాశ్ ప్రకృతి సేద్యంలోకి మార్చారు. బత్తాయిలో కాకర, అలసంద పంటలను అంతర పంటలుగా వేశారు. 3,500 లీటర్ల ట్యాంకులో జీవామృతాన్ని తయారు చేసి, డ్రిప్ ద్వారా పంటలకు సరఫరా చేస్తున్నారు. 2014లో 18 టన్నుల బత్తాయి పండ్ల దిగుబడి ద్వారా రూ. 2.25 లక్షల ఆదాయం వచ్చింది. జీవామృతం తదితరాల తయారీ, కూలీలు, రవాణా చార్జీలు, పిచికారీలకు కలిపి రూ. 25 వేల ఖర్చు పోగా.. రూ. 2 లక్షల నికరాదాయం వచ్చిందని సూర్యప్రకాశ్‌రెడ్డి ఆనందంగా చెప్పారు. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడినప్పుడు రూ. 90 వేలు ఖర్చయినా.. దిగుబడి 15 టన్నులకు మించలేదు. తొలి పంటలోనే సత్ఫలితాలు కనిపించడంతో సూర్యప్రకాశ్‌కు ప్రకృతి సేద్యం దిగుబడి, ఆదాయాల పరంగా అనుసరణీయమేనన్న భరోసా కలిగింది. ప్రస్తుతం బత్తాయిలో అంతరపంటగా కాకర, అలసంద వేశారు. వేసవిలో మునగ, బొప్పాయి అంతరపంటలుగా వేయాలనుకుంటున్నారు.

అరటిలో అంతర పంటగా వేరుశెనగ

గత జూన్‌లో మూడెకరాల్లో అరటి నాటారు. అంతరపంటగా వేరుశెనగ ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 24 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. వేరుశనగ పప్పు క్వింటా రూ. 5,350ల ధర పలికింది. ఆ తర్వాత రెండో అంతరపంటగా పప్పు దోసను కేవలం రూ. వెయ్యి ఖర్చుతో సాగు చేసి రూ. 18 వేల ఆదాయం పొందారు. అరటి మరో 3 నెలల్లో గెలలు వేయనుంది. ముప్పావు ఎకరంలో పత్తిని పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేసి 5 క్వింటాళ్ల దిగుబడి పొందారు. తమ ప్రాంతంలో తేలికపాటి నేలలో కరువు పరిస్థితుల్లో ఈ దిగుబడి తక్కువేమీ కాదని ఆయన అన్నారు. ఇంటి అవసరాల కోసం కొద్ది విస్తీర్ణంలో గోధుమ సాగు చేస్తున్నారు.

రసాయన ఎరువులు పూర్తిగా మానేసి క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నందు వలన భూమిలో వానపాములు, మేలుచేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంటలకు సహజ పోషకాలను అందిస్తున్నాయని సూర్యప్రకాశ్ తెలిపాడు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే రైతు తనకు ఎన్నో ఏళ్లుగా అలవాటైన సాగు పద్ధతి నుంచి, అది ఎంత నష్టదాయకంగా ఉన్నా, కొత్త పద్ధతిలోకి మారటం అంత తేలిక కాదు. కానీ, సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవడం తప్ప సంక్షోభం నుంచి బయటపడే మారో మార్గం లేదని ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ(ఎఫ్‌ఏఓ) మొత్తుకుంటున్నది. ఉన్నత విద్యావంతుడైన సూర్యప్రకాశ్ వంటి యువ రైతుల చొరవ వల్ల ఈ మార్పు దిశగా వడివడిగా అడుగులు పడే అవకాశం ఉంది.

- గవిని శ్రీనివాసులు, కర్నూలు వ్యవసాయం

ప్రకృతి సేద్యాన్ని ప్రభుత్వం గుర్తించి, ప్రోత్సహించాలి

రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సేద్యం కొనసాగించలేని సంక్షోభ పరిస్థితి వచ్చింది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలనిస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు సబ్సిడీపై దేశవాళీ ఆవులను పంపిణీ చేయాలి. ఏ పంటలనైనా సాగు చేయొచ్చు. విద్యాధిక యువతకూ ఉద్యోగం కంటే ప్రకృతి సేద్యమే మిన్న. ప్రకృతి సేద్యన్ని విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాం. ఈ ఉద్దేశంతోనే కర్నూలులో మార్చిలో పాలేకర్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ శిబిరం నిర్వహించాం.

- పంచలింగాల సూర్యప్రకాష్‌రెడ్డి (96038 34633),

తాపలకొత్తూరు,

క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా

ఆధారము: సాక్షి

పండ్ల తోటల్లో నాటు కోళ్లు

 • కొత్తపుంతలు తొక్కుతున్న ప్రకృతి సేద్యం
 • పండ్ల తోటల్లో నాటు కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం
 • కోళ్ల పెంపకంతో భూసారం పెరిగి రెట్టింపైన పంట దిగుబడి

కొత్త ఆలోచన సరికొత్త ఆచరణ దిశగా తొలి అడుగులేయిస్తుంది. ఆ అడుగులు.. వెలుగుబాటలు వేసి పదుగురికీ మార్గదర్శకమవుతాయి. కడప జిల్లాకు చెందిన రైతు గంగరాజు వెంకట్రామరాజు సేంద్రియ పండ్ల తోటల్లోనే నాటు కోళ్లను పెంచుతూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. పదేళ్లుగా సాగు చేస్తున్న తోటల్లోనే నాలుగేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతుల్లోనే నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నారు. నాటు కోళ్లు, గుడ్ల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. దీంతో పాటు భూమి సారవంతమై పంట దిగుబడులు కూడా రెట్టింపవ్వటం విశేషం.

రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయా నుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుం దని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు సేంద్రియ రైతు గంగరాజు వెంకట్రా మరాజు. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలతోపాటు నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు గడిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ని సిద్దిరాజు కండ్రిగ ఆయన స్వగ్రామం. తనకున్న ఆరెకరాల్లో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అరటి, బొప్పాయి, మామిడి తోటలను సాగు చేస్తున్నారు. నాటుకోళ్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గుర్తించి తోటలోనే నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. అదనపు ఆదాయంతో పాటు భూసారంతోపాటు పంట దిగుబడు లు పెరుగుతున్నాయంటున్నారు.

వెంకట్రామరాజు 2010లో 2 పెట్టలు, 2 పుంజులుతో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. మరుసటి ఏడాదికి కోళ్ల సంఖ్య 500కు చేరింది. తాను పెంచిన కోళ్లను, గుడ్లను వినియోగదారులకు తోట వద్దనే విక్రయిస్తున్నారు. పాములు, పిల్లుల బారి నుంచి కోళ్లను రక్షించుకోవటం కష్టంగా ఉండటంతో.. తోట చుట్టూ ఐదడుగుల ఎత్తున వైర్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు.

చేలో పండిన చిరుధాన్యాలే మేత

సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మేత గురించే. నాటుకోళ్లకు మేతకోసం 5 నెలల పాటు ఒక్కో కోడిపై రూ. 100 ఖర్చవుతుంది, ఆదాయం మాత్రం దీనికి మూడున్నర రెట్ల వరకూ వస్తుంది. ఇది ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించినదై ఉండాలి. అందుకే తన చేలోనే పండించిన జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు లాంటి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే వెంకట్రామరాజు నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు వ్యాధి నివారణ టీకాలు కూడా వేయడంలేదు. అయినా ఇంతవరకూ వీటికి ఎటువంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు రాలేదు. దీనికి కారణం కోళ్లు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలోనే తిరుగుతూ.., సేంద్రియ ఆహారాన్ని మేతగా తినటమేనంటారాయన.

రైతుకు రెండు విధాలా లాభం..

సేంద్రియ పద్ధతుల్లో నాటుకోళ్ల పెంపకం వల్ల రైతుకు అదనపు ఆదాయం లభించటంతో బాటు పొలం సారవంతమవు తుంది. పంటలకు హాని చేసే క్రిమికీటకాల ను ఇవి తింటాయి. దీంతో చీడపీడల బాధ తప్పుతుంది. 500 కోళ్లను పెంచినట్టయితే వాటి విసర్జితాల వల్ల ఏడాదికి7 నుంచి 8 టన్నుల సేంద్రియ ఎరువును పొలానికి వేసినట్టేనంటారు వెంకట్రామరాజు. ఇంతకు ముందు హైబ్రిడ్ దోస సాగుచేస్తే ఎకరాకు 10 టన్నులు దిగుబడి వచ్చింది.నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాక 20 టన్నుల వరకూ దిగుబడి వచ్చిందని ఆయన చెబుతున్నారు. పంటలను నాశనం చేసే ప్రమాదం ఉండటంతో ఆహారపంటలు సాగు చేసే పొలాల్లో వీటి పెంపకం సాధ్యం కాదు. పండ్ల తోటల్లో నాటు కోళ్ల పెంపకాన్ని చేపడితే వాటికి స్వేచ్ఛగా తిరిగేందుకు అవసరమైన స్థలం లభించటంతో పాటు పంటలకు నష్టం ఉండదు. కోళ్లు రాత్రిళ్లు చెట్లపైనే ఉంటాయి. పిల్లలకు మాత్రం గంపలను ఏర్పాటు చేశారు. ఫారం కోళ్ల ధర కన్నా నాటుకోళ్ల మాంసాన్ని, గుడ్లను రెట్టింపు ధర చెల్లించి వినియోగదారులు కొంటున్నారు. ప్రస్తుతం నాటుకోళ్లను కిలో రూ. 230 - 250 ధరకు అమ్ముతున్నారు. మాంసం కిలో రూ. 350 - 400 ధరకు షాపుల వాళ్లు అమ్ముతున్నారు. అలాగే సేంద్రియ నాటుకోడి గుడ్లకు రూ. 8 వరకూ ధర పలుకుతోంది.

మినీ ఇంక్యుబేటర్‌తో మరింత ఆదాయం

ముందుచూపుతో వ్యవహరించి రూ. 35 వేల ఖర్చుతో మినీ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసుకోవటంతో గుడ్ల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఇంక్యుబేటర్ ఏర్పాటుతో కోడి, గుడ్లను పొదిగే సమయం ఆదా అవుతుంది. మళ్లీ గుడ్లు పెట్టేందుకు కోడి త్వరగా సిద్ధమవుతుంది. ఇలా చేయటం వల్ల ఏడాదిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు కోడి గుడ్లు పెడుతుంది. 600 గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్ ధర రూ. 35 వేలు. గుడ్లు పొదిగే సమయం ఆదా అవుతుంది.

చిన్న రైతులకు జీవనోపాధి

8 పెట్టలు, 1 పుంజుతో ఒక కుటుంబం ఆర్థికావసరాలు తీరుతాయి. ఒక నాటుకోడి పెట్ట ఏడాదిలో నాలుగైదుసార్లు గుడ్లు పెడుతుంది. 8 పెట్టలు ఏడాదికి కనీసం 80 గుడ్లు పెడతాయి. ఇందులో 20 పిల్లలు చనిపోయినా 60 పిల్లలు పెరుగుతాయి. ఐదు నెలలకు ఒక్కో కోడి 2 కిలోల బరువు ఉంటుంది. అంటే ఒక్కో కోడి రూ. 450 వరకూ ధర పలుకుతుంది. మార్కెట్ ధర (60్ఠ450) ప్రకారం విక్రయిస్తే సుమారు రూ. 27, 000 వరకూ ఆదాయం వస్తుంది. ఒక్కో కోడిపై మేత కోసం పెట్టే ఖర్చు (60్ఠ100 ) రూ. 6 వేలు అవుతుంది. అంటే రూ. 20 వేలకు పైగా నికరాదాయం. ఇది కేవలం ఐదునెలల్లో 8 పెట్టలు, ఒక పుంజుతో వచ్చిన ఆదాయం మాత్రమే. ఇలా ప్రతినెలా విడతలుగా గుడ్లు పొదిగిస్తే ఆదాయం వస్తూనే ఉంటుంది.

- మాచుపల్లె ప్రభాకరరెడ్డి ,

కడప అగ్రికల్చర్

ఎకరం తోటలో 500 కోళ్ల వరకు పెంచొచ్చు!

నాటుకోళ్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా ఉంది. చిన్నగా మొదలుపెట్టి క్రమేణా కోళ్ల సంఖ్యను పెంచుకోవాలి. పొలంలో పండిన చిరుధాన్యాలనే మేతగా వేస్తున్నాము. ఒక ఎకరం తోటలో 500 వరకూ నాటుకోళ్లను పెంచవచ్చు. పొలానికి సేంద్రియ ఎరువు అందడంతో బాటు రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఖర్చు (మేత)రూ. 100 అయితే, ఆదాయం రూ. 450 వరకూ వస్తుంది. అంటే నికరంగా మూడింతల ఆదాయం వస్తుంది. నాటు కోడి గుడ్లు, మాంసం ఆరోగ్యకరమైన ఆహారమని వినియోగదారులు గుర్తించడంతో గిరాకీ పెరుగుతోంది. .

- గంగరాజు వెంకట్రామ రాజు (96529 02972),

సిద్దిరాజు కండ్రిగ, రైల్వేకోడూరు మండలం, వైఎస్సార్ జిల్లా.

మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు

ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్‌రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కల్యాణ్‌పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు.

మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ.

గ్రీన్ రైస్ దిగుబడి అదుర్స్

 • తక్కువ ఎరువులతో 67 బస్తాలు పండిన జెడ్‌జీవై-1..
 • తెలంగాణ ఎర్రనేలల్లో బోర్ల కింద సాగుకూ అనుకూలం
 • చౌడు పొలాల్లో, ఉప్పు నీటిని తట్టుకొని
 • 55 బస్తాలు పండిన హెచ్‌హెచ్‌జెడ్5 ఎస్‌ఏఎల్-10 వంగడం
 • అసలు ఎరువులు, పురుగుమందుల్లేకుండా
 • 30 బస్తాలు పండిన ఎస్‌ఏజీఎస్4 వంగడం

ఆకలిపై పోరులో వజ్రాయుధం విత్తనం! మన సుదీర్ఘ వ్యవసాయ సంస్కృతికి బలమైన పునాదీ విత్తనమే. వేలాది ఏళ్ల సేద్య పరంపరలో అన్నదాతలు ఎంపిక చేసి సాగుచేస్తూ పరిరక్షించుకుంటున్న అపురూప సంపద దేశవాళీ విత్తనాలు. ఆధునిక వంగడాలు విఫలమవుతున్న నేపథ్యంలో.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిశ్చింతగా తిరిగి వాడుకోదగిన దేశవాళీ వంగడాలే మళ్లీ అవసరమవుతున్నాయి. 250 దేశవాళీ వంగడాల్లో సద్గుణాలను తమలో ఇముడ్చుకున్న గ్రీన్ సూపర్ రైస్ వంగడాల రాకకు పూర్వరంగం ఇదే. తక్కువ వనరులతో 67 బస్తాల వరకు ధాన్యం దిగుబడినిచ్చే ఈ వంగడాలు ఇప్పుడిప్పుడే తెలుగు రైతు తలుపు తడుతున్నాయి..

వాతావరణ మార్పులను తట్టుకుంటూ.. తక్కువ వనరులతోనైనా అధిక దిగుబడినివ్వగల గ్రీన్ సూపర్ రైస్ వరి విత్తనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని రైతుల చేతికి అందివచ్చాయి. చైనా శాస్త్రవేత్తలు, మనీల (ఫిలిప్పీన్స్)లోని అంత ర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఇరి) ఉమ్మడి గా సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు రూపొందించారు. సుమారు 250 దేశవాళీ వరి వంగడాల్లోని సద్గుణాలను పుణికిపుచ్చుకున్న ఏడు విశిష్ట వంగడాలను ప.గో. జిల్లా ఆచంటకు చెందిన ధాన్య పండిట్ బిరుదాంకితులు, అభ్యుదయ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు ఈ రబీలో తొలిసారిగా సాగు చేయడం సాగుబడి పాఠకులకు తెలిసిందే. ఈ 7 వంగడాలకు చెందిన 1,400 గ్రాముల విత్తనాలతో ట్రేలలో నారు పెంచి.. శ్రీ వరి పద్ధతిలో ఆరుతడులతో సాగు చేసి ఆయన 20 క్వింటాళ్ల వరకు విత్తనాలను ఉత్పత్తి చేశారు. ఈ వంగడాల్లో 4 చక్కని ఫలితాల నిచ్చాయని సుబ్బారావు తెలిపారు. సాధారణ వరి వంగడాలతో పోల్చితే 25% తక్కువ రసాయనిక ఎరువులతో, తక్కువ నీటితోనే మంచి దిగుబడి నిచ్చాయన్నారు. జడ్‌జీవై-1 విత్తనాలను తెలంగాణ, సీమలోని 10 జిల్లాల రైతులకు ఇస్తున్నానని చెప్పారు. అన్నదాతలూ ఆల్ ది బెస్ట్!

- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

అంతిమ తీర్పరి రైతే!

జీరో ఫెర్టిలైజర్ వంగడం చక్కగా 30 బస్తాలు పండింది. జెడ్‌జీవై-1 అత్యధి కంగా 67 బస్తాల దిగుబడి నిచ్చింది. నా నుంచి విత్తనాలు తీసుకున్న 200 మంది రైతుల జాబితాను మనీలా పంపిస్తా. ఈ ఖరీఫ్‌లో 2 కిలోల విత్తనాలతో రబీలో 18 ఎకరాలకు విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఏ విత్తనానికైనా అంతిమ తీర్పరి రైతే.

- నెక్కంటి సుబ్బారావు (94912 54567), రైతు శాస్త్రవేత్త, ఆచంట

స్వల్ప ఖర్చుతో పాలీహౌస్‌లో ప్రకృతి సేద్యం

పాలీహౌస్‌లను కేవలం 20% ఖర్చుతోనే నిర్మించుకోవటం.. ఇందులో అరుదైన దేశవాళీ సేంద్రియ వంగడాలను ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడంపై తెలుగు రైతులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రస్టు సన్నద్ధమైంది. తొలిదశలో రంగారెడ్డి జిల్లాలో వెయ్యి మంది కూరగాయ రైతులకు, ‘ఇంటిపంట’లు పండిస్తున్న హైదరాబాద్ నగరవాసులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి, సేంద్రియ విత్తనాలు ఇవ్వడానికి వీలుగా ట్రస్టు తెలంగాణ ఉద్యాన శాఖతో ఇటీవల అవగాహన కుదుర్చుకుంది. ట్రస్టుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకరరావు ఇటీవల హైద్రాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి అందించిన సమాచారం ఆయన మాటల్లోనే.. మీ కోసం..

పంచాంగం ప్రకారం ఇప్పుడు వర్షాలు రావటం లేదు. వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. వర్షాకాలంలో వర్షం సరిగ్గా కురవటం లేదు. అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. రైతులు చాలా కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా వాతావరణంపై నియంత్రణ సాధించి, పంటలు పండించుకోవచ్చు. గ్రీన్‌హౌస్‌లను స్వల్ప ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే బాదులతోనే దీన్ని నిర్మించుకొని, ప్లాస్టిక్ షీట్ వేసుకోవచ్చు. పొలాల్లో రైతులు.. నగరాలు, పట్టణాల్లో ‘ఇంటిపంట’ల సాగుదారులు స్వయంగానే నిర్మించుకోవచ్చు. కంపెనీల కొటేషన్ల ధరలో 20% ఖర్చుతోనే నిర్మించుకోవచ్చు.

ఇంటిపంటల సాగు కోసం వెయ్యి నుంచి 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. వెయ్యి చదరపు అడుగుల పాలీహౌస్‌కు కొటేషన్ అడిగితే రూ.2.25 లక్షలని కంపెనీల వాళ్లు చెప్పారు. నేను నా ఫామ్‌లో రూ. 25,000 ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాను. ప్లాస్టిక్ షీట్, నెట్ల ఖర్చే రూ. 18,000 వరకు ఉంటుంది. మిగతాది వెదురు, యూకలిప్టస్, సర్వి వంటి బాదులు, కూలీల ఖర్చు. మేం నిర్మించిన పాలీహౌస్‌లు 120 కి. మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటాయి.

పాలీహౌస్‌లో దేశీ ఆవు పేడ, మూత్రంతో నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. 1/3 మట్టి, 1/3 శుద్ధిచేసిన కొబ్బరిపొట్టు, 1/3 సేంద్రియ పదార్థం (పశువుల ఎరువు లేదా ఎండుగడ్డి లేదా రంపపు పొట్టు) కలిపి.. బెడ్స్ తయారు చేసుకోవాలి. 15 రోజులకోసారి జీవామృతం ఇవ్వాలి. చీడపీడల నివారణకు నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వాడొచ్చు.

తిరిగి వాడుకోవడానికి వీలయ్యే 560 రకాల దేశీ వంగడాలను ట్రస్టు సేకరించి పండించింది. ఇందులో 140 రకాల కూరగాయలు, ఆకుకూరల వంగడాలున్నాయి. ప్రతి ఒక్కరూ భోజనంలో 5% పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినాలన్నది రవిశంకర్ గురూజీ అభిప్రాయం. రంగు, ఆకృతి, వాసన, రుచి విభిన్నంగా ఉండే వంగడాలు ఇందుకు అనువుగా ఉంటాయి. వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడం సులభం. ఈ వంగడాలు రసాయనాల్లేకుండా వాటికవే పెరుగుతాయి. చీడపీడలు అంతగా సోకవు. రైతులకు, నగరవాసులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

ఈ పద్ధతులపై రైతులకు, నగరవాసులకు సాంకేతిక శిక్షణనివ్వడానికి ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టు సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ తొలుత కొందరు మాస్టర్ ట్రయినర్లకు శిక్షణనిచ్చి, వారి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇస్తాం.

హైదరాబాద్‌లో రైతులు వినియోగదారులకునేరుగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్లను వారానికి రెండు రోజులు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే పంటలను ఎండబెట్టి అమ్మే సాంకేతికతలను కూడా అందిస్తాం. వివరాలకు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి 98490 57599, email: rakripulireddy@gmail.com, ఉమామహేశ్వరి 90004 08907 uma6408@gmail.com.

డా. బండి ప్రభాకరరావు

మీనామృతంతో మునగకు రక్ష

 • ప్రకృతి సేద్యంలో చేపలతో అద్భుతాలు
 • ఆకుచుట్టి తినే పురుగును పూర్తిగా అరికట్టిన మీనామృతం, మత్స్యసంజీవని
 • పందిరి కూరగాయలు, పుచ్చ, దోస, దానిమ్మ పంటలకూ ప్రయోజనం

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా. గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి తాజా పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యం లోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి. రైతులకెంతో ప్రయోజనకరమైన డా. శ్యామసుందర్‌రెడ్డి (99082 24649) ప్రయోగాల ఫలితాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. ఆయన మాటల్లోనే..

మునగ పంటకు ఆకుచుట్టి తినే పురుగు (ూైైఖఈఅ ఆఔఐఖీఉఅఔఐ) ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు(సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మల పైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్కపైకి కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకుచుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు:

తాజా చేప ముక్కలు - 1 కిలో, దేశీ ఆవు మూత్రం - 5 లీటర్లు,

నల్ల బెల్లం - 1 కిలో, తాటికల్లు - 1 లీటరు, దేశీ ఆవు నెయ్యి - 50 గ్రాములు, తేనె - 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.

కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అర గంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టి కుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డలో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాములు దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పది రోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3 సార్లు పిచికారీ చేయాలి

మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకుచుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం ‘లొట్టపీచు’(తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే..

మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పుచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

‘మత్స్య సంజీవని’తో ఎంతో మేలు

మీనామృతం తయారు చేసి వడపోసేటప్పటికి అందులోని చేప ముక్కలు పూర్తిగా కరగకుండా కొంత మేరకు మిగిలే ఉంటాయి. అటువంటి చేప ముక్కలను పారేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. వీటితో ఉపయుక్త సూక్ష్మజీవుల(ఇండిజినెస్ మైక్రోఆర్గానిజమ్స్-ఐ.ఎం.ఓ.ల)ను లేదా మత్స్య సంజీవనిని తయారు చేసి పంటలకు వాడుకోవచ్చు. మత్స్య సంజీవని నేలను సారవంతం చేస్తుంది. వేరు వ్యవస్థకు రక్షణగా ఉండి వేరుకుళ్లు, ఎండు తెగుళ్లు వంటి వాటి నుంచి వేళ్లను కాపాడుతుంది. వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

మత్స్య సంజీవని తయారీకి కావాల్సిన వస్తువులు :

చేప ముక్కలు (మీనామృతం తయారీలో మిగిలిన వాటితోపాటు తాజా చేప ముక్కలను కూడా వాడవచ్చు) - కిలో

నల్లబెల్లం - 500 గ్రాములు, దేశీ ఆవు నెయ్యి/వెన్న - 50 గ్రాములు, తాటి కల్లు - 1 లీటరు, తేనె - 50 గ్రాములు

కాచి చల్లార్చిన నీరు - 5 లీటర్లు

మత్స్య సంజీవనిని తయారు చేసే పద్ధతి : ఒక మట్టి పాత్రలో 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి లేదా వెన్న వేసి పొయ్యి మీద పెట్టాలి. అందులో కిలో చేప ముక్కలను, అర కిలో బెల్లం ముక్కలను వేసి.. బాగా ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అడుగంటి మాడిపోకుండా తగినంత తాటికల్లు కలుపుతూ ఉండాలి. మరొక పాత్రలో 5 లీటర్ల మంచినీటిని మరిగించి చల్లారనివ్వాలి. ఒక మట్టికుండను తీసుకొని.. అందులో కాచి చల్లార్చిన నీటిని, ఉడకబెట్టి చల్లారిన చేపముక్కలను వేయాలి. అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల తేనె కూడా పోసి ఒక శుభ్రమైన తడిలేని కర్రతో బాగా కలియబెట్టాలి. కుండపై మూత ఉంచి దళసరి గుడ్డను రెండు పొరలుగా తీసుకొని బిగించి కట్టాలి. ఈ కుండను ఎండ తగలని చల్లని ప్రదేశంలో నేలలో గుంత తీసి పూడ్చిపెట్టాలి. 5-7 రోజుల తర్వాత కుండను వెలికితీయాలి. కుండలో ఉపయుక్త సూక్ష్మజీవులు పూత పూసినట్లుగా, తెట్టులా తేలుతూ సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఊదా రంగులు కలగలసి ఉంటాయి.

మత్స్య సంజీవని వాడే పద్ధతి: వంద కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుకు ఒక లీటరు చొప్పున మత్స్య సంజీవనిని కలిపి మొక్క పాదుల్లో చల్లాలి. వేపపిండి, ఆముదం చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రియ ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు. 120 మైక్రాన్ల మెష్‌తో వడపోసి ఎకరానికి విడతకు 10 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా అందించవచ్చు. వంద లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవనిని కలిపి మొక్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.

వైరస్‌ను తట్టుకునే బొప్పాయి

బొప్పాయి సాగు చేస్తూ పపయా రింగ్‌స్పాట్ వైరస్(పీఆర్‌ఎస్‌వీ)తో సతమతమవుతున్న రైతులకు శుభవార్త. ఈ వైరస్‌ను చాలా వరకు తట్టుకునే రెండు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. పుణే (మహారాష్ట్ర)లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ) శాస్త్రవేత్తలు పుణే సెలక్షన్-1, పుణే సెలక్షన్-3 అనే రెండు రకాల బొప్పాయి వంగడాలను రూపొందించారు. ఈ వంగడాలకు వైరస్ త్వరగా సోకదని, ఒకవేళ సోకినా నష్టం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల రైతులకు ఈ విత్తనాలను పరీక్షల నిమిత్తం పుణేలోని ఐఏఆర్‌ఐ ఉచితంగా అందిస్తోంది. ప్రయోగాత్మకంగా సాగు చేయదలచిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. ఎస్.కె.శర్మ, అధిపతి, ఐఏఆర్‌ఐ, ఫోన్: 020-25889968, ఫాక్స్: 020-25889969. జ్ఛ్చిఛీచిఞఠ్ఛఃజ్చీటజీ.ట్ఛట.జీ పుణే ఐఏఆర్‌ఐ నుంచి సికింద్రాబాద్‌లోని ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఈ విత్తనాలు కొన్నిటిని తెప్పించి ఇస్తోంది. ఆసక్తి గల వారు 040-27017735 నంబరులో సంప్రదించవచ్చు.

వీళ్లు కరువును జయించారు

అసలే మెట్ట పొలాలు.. అందులోనూ కరువు కాలం! ఎండాకాలంలో పంటలను, పండ్ల తోటలను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్న రోజులివి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి కొరత తీవ్రరూపం దాల్చింది.

ఇటువంటి గడ్డుకాలంలో, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు మాత్రం స్వల్ప ఖర్చుతోనే శాశ్వతంగా సాగు నీటి భద్రతను సాధించారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక(తె.వి.ఇం.వే.) నేతలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ రైతులు సాగు నీటి సమస్యను అధిగమించారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణపై ‘మన చేను-మన చెరువు’ పేరిట ఈ వేదిక ప్రచారోద్యమం నిర్వహిస్తూ.. మెట్ట రైతులకు వెలుగుబాట చూపుతుండడం ప్రశంసనీయం.

రూ.25 వేలతో పండ్ల తోటకు జలసిరి!

పరకాల జోగేశ్వరరావు సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పదేళ్ల క్రితం ఉద్యాన పంటల సాగు చేపట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లిలో 36 ఎకరాల భూమి కొని.. బత్తాయి(18 ఎకరాలు), మామిడి(9 ఎకరాలు), సీతాఫలం, ఉసిరి తదితర తోటలు సాగు చేస్తున్నారు. 15 బోర్లు వేయగా.. 5 బోర్లలో నీరు పడింది. తోట మొత్తానికీ డ్రిప్ ద్వారా నీరందిస్తున్నారు.

బోరు ఎండిపోయి..

చెట్ల వయసు పెరిగే కొద్దీ నీటి అవసరం పెరిగింది. ఒక బోరు పూర్తిగా ఎండిపోయింది. గత మూడేళ్లుగా వేసవిలో పక్కన రైతులను పంటలు వేయొద్దని బతిమాలి.. వారి బోర్ల నుంచి, ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేశానని జోగేశ్వరరావు తెలిపారు. తోటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న అటువంటి సంక్లిష్ట దశలో తె.వి.ఇం.వే. నేతలు కందకాలు తవ్వుకోమని ఆయనకు సూచించారు. 2014 జనవరిలో తోటలో వాలుకు అడ్డంగా.. 50 మీటర్లకు ఒక కందకం చొప్పున.. 25 వరకు కందకాలు తవ్వించారు. మొత్తం రూ. 25 వేల వరకు ఖర్చయింది. తవ్విన నెల రోజుల్లోనే మంచి వానలు కురవడంతో.. రెండు దఫాలుగా కందకాలు నిండాయి. పొలంలో పడిన ప్రతి చుక్కా బయటకుపోకుండా తొలిసారి భూమిలోకి ఇంకింది.

కందకాలతో మళ్లీ జలకళ

దీంతో, భూగర్భ జలమట్టం పెరిగి.. ఎండిపోయిన బోరుకు మళ్లీ నీటి కళ వచ్చింది. ఇతర బోర్లలో నీటి పరిమాణం పెరిగింది. దీంతో 2014 ఎండాకాలంలోనూ నీరు కొనాల్సిన అవసరం రాలేదని జోగేశ్వరరావు వివరించారు. ఆ తర్వాత వర్షాకాలం ముగిసే వరకూ ఒక్క పెద్ద వానా కురవలేదు. ఒక్కసారీ కందకాలు నిండలేదు. ఈ(2015) ఎండాకాలం ఎలా గడుస్తుందోనన్న ఆందోళన తలెత్తిన నేపథ్యంలో.. అదృష్టవశాత్తూ ఏప్రిల్ రెండో వారంలో కందకాలు నిండేంత పెద్ద (2 సాలేటి)వాన కురిసింది. కందకాలు తవ్వి ఉన్నందున ప్రతి చుక్కా పొలంలోనే ఇంకి.. నీటి కొరత తీరింది.

ఎండిపోయిన బావికి పునర్జలం!

నార్కెట్‌పల్లి మండలం తొండ్లవాయికి చెందిన కంచర్ల మధుసూదన్‌రెడ్డి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా రిటైరైన తర్వాత తన 33 ఎకరాల పొలంలో సేద్యం చేస్తున్నారు. బత్తాయి, వరి, మామిడి తదితర పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో 60 అడుగుల (10 కోలలు) వ్యవసాయ బావి పూర్తిగా ఎండిపోయింది. దశల వారీగా 30 బోర్లు వేయగా.. 3 బోర్లు మాత్రమే నీటిని అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఖరీఫ్, రబీల్లో 8 ఎకరాల వరకు వరి సాగు చేసేవారు. నీరు అందుబాటులో లేక.. వరి సాగు కొన్నేళ్ల క్రితం మానుకున్నారు. విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ చంద్రమౌళి స్వస్థలం కూడా తొండ్లవాయి కావడం వల్ల మధుసూదన్‌రెడ్డి పొలంలో మూడేళ్ల క్రితం బావి, బోర్ల వద్ద కేవలం నాలుగు కందకాలు తవ్వించడంతో... నీటి కరువు తీరిపోయింది.

కందకాల పుణ్యమా అని మళ్లీ వరి సాగు..

కందకాలు తవ్వించిన తర్వాత నుంచి వర్షాకాలంలో బావిలో 45 అడుగుల లోతున నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడూ పది అడుగుల లోతున నీళ్లున్నాయి. 7.5 హెచ్‌పీ మోటారు బావి నీటిని తోడి పంటలకందిస్తోంది. ఈ కరవు కాలపు వేసవిలోనూ 3 బోర్లు అంతరాయం లేకుండా ఇంచున్నర నీరు పోస్తున్నాయి. కందకాల పుణ్యమా మళ్లీ వరి సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు రబీ వరి కోతకు సిద్ధంగా ఉంది. పొలంలో కందకాలుంటే చేను కింద నీటి చెరువు ఉన్నట్లే. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవాలి.

- కంచర్ల మధుసూదన్‌రెడ్డి (99495 22288),తొండ్లవాయి, నార్కెట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా

కందకాలు తవ్వేది ఇలా..

పొలంలో వాలుకు అడ్డంగా మీటరు లోతు, ముప్పావు మీటరు వెడల్పున కందకాలు తవ్వుకోవాలి. ప్రతి 50 మీటర్లకో చోట కందకం తవ్వితే చాలు. కందకం పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఎకరానికి కేవలం రూ. వెయ్యి- రూ. వెయ్యిన్నర ఖర్చుతోనే కందకాల ద్వారా.. చేను కింద భూగర్భంలోనే చెరువును నిర్మించుకోవచ్చు. శాశ్వతంగా సాగు నీటి భద్రత కందకాలతోనే సాధ్యపడుతుంది. భూమి కోతను పూర్తిగా అరికట్టడం కూడా కందకాలతోనే సాధ్యం. మెట్ట భూముల్లో రెండు ఆరుతడి పంటలు దిగుల్లేకుండా సాగు చేసుకోవచ్చు.

ఎకరంలో 22 లక్షల లీటర్ల నీటిని ఒడిసిపట్టొచ్చు

మా పొలంలో 8 ఏళ్ల క్రితమే కందకాలు తవ్వించాను. 5 బోర్లను వాడటం ఆపేసి.. పాత బావి నీటి ద్వారానే 12 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నా. నల్లగొండ జిల్లాలో ఏడాదికి సగటు వర్షపాతం 750 ఎం.ఎం. ఈ సంవత్సరం కరువు వల్ల 400 ఎం.ఎం. మాత్రమే వర్షం పడింది. అయినా, కందకాలు తవ్వుకున్న రైతులకు ఇప్పుడు నీటికి కొరత లేదు. నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల్లో సాధారణంగా 1.5 టీఎంసీల వాన నీరు భూమిలోకి ఇంకుతుండగా.. ఈ లక్ష ఎకరాల్లో కందకాలు తవ్వితే 8 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకుతుంది.

ఎకరం పొలంలో సాధారణంగా 5 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకుతున్నది. కందకాలు తవ్వితే 22 లక్షల లీటర్ల వాన నీరు భూమిలోకి ఇంకుతుంది. మనచేను అడుగునే పెద్ద చెరువున్నట్లు లెక్క. ఇందులో కనీసం 80 శాతం నీటిని మనకు అవసరమైనప్పుడు తిరిగి బోర్లు, బావుల ద్వారా వాడుకోవచ్చు. అందుకే ‘మనచేను మన చెరువు’ ఉద్యమం చేపట్టాం.

- సంగెం చంద్రమౌళి (98495 66009), నీటిపారుదల విశ్రాంత చీఫ్ ఇంజినీర్, అధ్యక్షులు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం

ఇక మాకు నీటి దిగుల్లేదు!

ఇక ఈ ఎండాకాలంలో మాకు దిగుల్లేదు. ఇటీవలి వర్షంతో భరోసా వచ్చింది. పక్క పొలాల్లో బోర్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కందకాలు తవ్విన తర్వాత వరుసగా రెండో వేసవి కూడా నీటి సమస్య లేకుండా గడుస్తున్నది. ఇదంతా తె. వి. ఇం. వే. నేతలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి దగ్గరుండి మా పొలంలో తవ్వించిన కందకాల పుణ్యమే. గత ఏడాది బత్తాయి తోటపై రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు వేసవి పంటగా 20 టన్నుల బత్తాయిలు, మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. కాలువ నీటి సదుపాయం లేని ప్రతి రైతూ పొలంలో కందకాలు తవ్వుకుంటే.. సాగు నీటికి కొరతన్న మాటే ఉండదు.

- పరకాల జోగేశ్వరరావు(98663 49019),పండ్ల తోటల సాగుదారు, సుంకెనపల్లి, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా

ఫ్లోరోసిస్‌కు పరిష్కారం కందకాలే..!

ప్రతి రైతు పొలంలోనూ కందకాలు తవ్వడం ద్వారా సాగునీరు, తాగునీటి కరువుతోపాటు ఫ్లోరోసిస్‌ను 100% రూపుమాపడానికి అవకాశం ఉంది. ఫ్లోరోసిస్‌కు తాగునీరు 10%, సాగు నీరు 90% మేరకు కారణభూతమవుతున్నాయి. కందకాల వల్ల నీటి కొరతతోపాటు నీటి నాణ్యత బాగా పెరుగుతుంది. కరెంటు వాడకం తగ్గుతుంది. అతి తక్కువ వర్షం కురిసే దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ప్రతి రైతూ కందకాలు తవ్వుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

మన చేను కిందే భూగర్భంలో నీటిని దాచుకొని, కావాలనుకున్పప్పుడు వాడుకోవచ్చు. అందువల్లే మన చేను- మన చెరువు అని నినాదంతో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నాం. నీటి ప్రాజెక్టుల ద్వారా ఎకరానికి నీరు పారించడానికి రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. కందకాలు తవ్వడానికి ఎకరానికి రూ. వెయ్యి చాలు. వాటర్‌షెడ్ పథకంలో కందకాలను చేర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లా రైతులు కోరినా సాంకేతిక సహకారం అందించడానికి మేం సిద్ధమే.

- మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), విశ్రాంత ఈఈ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక

ఇంటి మట్టికి వందనాలు

ఈయన పేరు చతుర్వేదుల తారకం. విశ్రాంత అధ్యాపకుడు. అంతేకాదు.. ఇప్పుడాయన ‘సిటీ ఫార్మర్’ కూడా! కిక్కిరిసిన కాంక్రీటు అరణ్యంలో నివసిస్తూ కూడా నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కల్యాణ్‌నగర్-1లో సొంత అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ.. మేడ మీదే సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. తన కిచెన్ గార్డెన్‌కు అవసరమైన నల్లబంగారాన్ని (కంపోస్టును) తానే తయారు చేసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలు, పూజకు వాడిన పూలు, రాలిన ఆకులు.. ఎండిన కొమ్మలు, రెమ్మలు.. వీటన్నిటినీ కలిపి కంపోస్టుగా మార్చుతున్నారు.

చెత్తను బయట పారేసి మున్సిపాలిటీపై భారం వేయకపోవటం విశేషం. మేడపైన పాలిథిన్ బ్యాగ్‌లలో ఏరోబిక్ పద్ధతిలో, వంటింట్లో ఏరోబిక్ పద్ధతిలో కంపోస్టు తయారు చేసుకుంటున్నారు. పాలిథిన్ బ్యాగ్‌లలో చెత్తను 4 అంగుళాల మందాన పొరలు పొరలుగా వేస్తూ మధ్యలో బొకాషి ఎంజైమ్ పొడిని చల్లుతున్నారు. నెలలో కంపోస్టు తయారవుతుందని, 3 నెలల్లో స్వచ్ఛమైన ‘మట్టి’ తయారవుతుందంటున్నారాయన. కేవలం ఈ మట్టినే మడులు, కుండీల్లో వాడుతున్నానన్నారు.

ఈ విధంగా సకల పోషకాలున్న మట్టిని నగరంలో మేడపైనే స్వయంగా తయారు చేసుకోవడం.. ఆ మట్టితోనే ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు పండించడం తనకెంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తోందంటారాయన. బోలెడు మాటలు చెప్పేకన్నా.. ఇటువంటి ‘ఆకుపచ్చని’ పనొకటి ఇంటిపట్టునే ఉన్న వనరులతో చేయడం ఎంతో మేలు కదూ..! తారకం(99890 16150) మాస్టారూ.. ‘వరల్డ్ సాయిల్ వీక్’ సందర్భంగా అందుకోండి ‘ఇంటిపంట’ల వందనాలు!!

ఆధారము: సాక్షి

నడి వేసవి.. తరగని జలసిరి..

 • కరవును జయించిన గొట్టిగార్‌పల్లి
 • వాటర్‌షెడ్‌తో అద్భుత ఫలితాలు
 • బీడు భూముల్లోనూ ఏడాది పొడవునా సాగవుతున్న పంటలు
 • బావులూ బోర్లూ నీటితో కళకళ
 • గ్రామస్థుల సమష్టి విజయం
 • పొరుగున ఉన్న బడంపేట గ్రామంలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం

'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్న నానుడిని అక్షరాల నిజం చేసి నిరూపించింది గొట్టిగార్‌పల్లి గ్రామం. నడివేసవిలో బావులు, చెరువులే కాకుండా పెద్దపెద్ద జలాశయాలు సైతం ఎండిపోయిన పరిస్థితుల్లో కూడా మెదక్ జిల్లాలోని ఆ మారుమూల గ్రామం జలసంరక్షణలో అద్భుతం సృష్టించింది. మండుటెండలలోనూ అక్కడి బావులు, బోర్లు నీటితో నిండుగా ఉన్నాయి. పైర్లు పచ్చగా కళకళలాడుతున్నాయి. తాగునీటికే కాదు సాగునీటికీ కొరతలేని గ్రామం అది. ఐక్యంగా కదిలితే సాధించలేనిది లేదని నిరూపిస్తున్న ఆ గ్రామస్థుల విజయ రహస్యం ఏమిటో తెలుసా.. వాటర్‌షెడ్ . అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆదర్శంగా నిలిచిన కృషీవలుల విజయగాథ ఇది. గొట్టిగార్‌పల్లి నుంచి 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి పరిశీలనాత్మక కథనం...

బి.ఎన్.జ్యోతిప్రసాద్, ఈనాడు, హైదరాబాద్

మెదక్‌జిల్లా కోహిర్ మండలంలోని గొట్టిగార్‌పల్లి గ్రామస్థులు ప్రకృతికి ఎదురొడ్డలేదు. మన బతుకులు ఇంతేలే అని సర్దుకు పోలేదు. మనవల్ల ఏం సాధ్యమవుతుందిలే అని రాజీపడలేదు. చేసిందల్లా వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడమే. వాటర్‌షెడ్ పథకాన్ని చిత్తశుద్ధితో సద్వినియోగం చేసుకోవటమే.

పదునాలుగేళ్ల క్రితం చేపట్టిన వాటర్‌షెడ్ కార్యక్రమం ఆ గ్రామం రూపు రేఖల్ని మార్చేసింది. గ్రామస్థుల ఆర్థిక స్థితిని మార్చింది. కూలీలు రైతులయ్యారు. ఏడాది పొడవునా ఒకటికాదు రెండు కాదు ఏకంగా మూడు పంటలు పండిస్తున్నారు.

సాకారం ఇలా

2001లో ప్రభుత్వం డీపీఏపీ ఆరోదశలో రూ.30 లక్షలతో వాటర్‌షెడ్ మంజూరు చేసింది. గొట్టిగార్‌పల్లి గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు వాటర్‌షెడ్, వ్యవసాయ సొసైటీ ప్రతినిధులు మహమ్మద్ అప్సర్, అబ్దుల్‌హమీద్ గ్రామానికి వచ్చారు. ఈ పథకం ప్రయోజనాల గురించి వివరించారు. గ్రామస్థులు తొలుత ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత ఆసక్తి కనబరచినా సత్ఫలితాలు ఇస్తాయన్న విశ్వాసాన్ని కనబరచలేదు. ఒక పట్టాన వాటర్‌షెడ్ అమలుకు ముందుకు రాలేదు. మూడు నాలుగు సమావేశాల అనంతరం అంగీకరించారు. విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్, జలవనరుల నిపుణులు టి.హనుమంతరావు స్వయంగా గ్రామానికి వెళ్లి మట్టికట్టలతో చతుర్విద జల ప్రక్రియ కార్యక్రమంపై అవగాహన కలిగించారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువకు గ్రామస్థులు తమతమ పొలాల్లో వాటర్‌షెడ్ పనులు చేసుకొంటూ వచ్చారు. ఆయా పనులకు గాను అయిన వ్యయం రూ.24 లక్షలు కూలీ రూపంలో అంతా గ్రామస్థులకే చేరింది. ఈ కార్యక్రమం పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టింది. తొలి రెండేళ్లలోనే ఫలితాలు రావడం మొదలయ్యాయి. ఐదారాళ్లేకు ఆ గ్రామ పరిసరాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. ప్రస్తుతం గొట్టిగార్‌పల్లి, గోపీనాయక్‌తాండా, సిద్దాపూర్‌తాండాలలో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. 300 బోర్లు... పదికిపైగా బావుల్లో నీరు పుష్కలంగా లభిస్తోంది. తాగునీరు, సాగునీటికి సమస్యే లేదు.

బ్యాంకుల విముఖత నుంచి..

వాటర్‌షెడ్ కమిటీని నాడు ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యుల పేర్లతో బ్యాంకు ఖాతాను తెరవడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారు. గ్రామంలో రుణాలు తీసుకున్నవాళ్లంతా తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకు అధికారులకు ఇక్కడి రైతులంటే గడువు ముగిసినా రుణాలు చెల్లించరనే అభిప్రాయం ఉండేది. నేడు అదే బ్యాంకు అధికారులు గొట్టిగార్‌పల్లి రైతులకు కావాల్సిన రుణాలు ఇస్తున్నారు. వ్యవసాయం కలసిరావటంతో గ్రామస్థులు లక్షల రూపాయల లావాదేవీలునిర్వహిస్తున్నారు.

ఎకరాకు రూ.60వేలు ఖాయం

వాటర్‌షెడ్‌కు ముందు గొట్టిగార్‌పల్లి గ్రామస్థులు మెట్ట పంటలే పండించేవారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండితే ఏడాదికి రూ.మూడు నాలుగువేలు ఎకరాకు మిగిలితే ఎక్కువగా ఉండేది. అదే పొలాలకు నీటి వసతి కలగడంతో నేడు మూడు పంటలు పండించుకుంటున్నారు. రూ.ఏబై వేల నుంచి అరవై వేల వరకు మిగుల్తోంది. గొట్టిగార్‌పల్లిలో వరి పొలాలు చాలా తక్కువగా కన్పిస్తాయి. నీరు ఎక్కువ అవసరం కావటమే కాక పంట కాలం కూడా ఎక్కువ కావడంతో వరికి ఆ గ్రామంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. వాణిజ్య పంటలకే ప్రాధాన్యం ఇస్తారు.

గ్రామం మారింది

ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలగా మారింది. గొట్టిగార్‌పల్లిలో అందుబాటులోకి వచ్చిన నీటితో గ్రామ స్వరూపం మారిపోయింది. పిల్లల్ని అందరూ చదివించుకుంటున్నారు. గ్రామంలో గతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చుకున్నారు. మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువులకు బయటకు వెళ్లి చదువుకుంటున్నారు.

ఇంటింటికీ కుళాయి

గ్రామంలో ఇటీవల ప్రతి ఇంటికి నీటి కుళాయి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది. అన్ని ఇళ్లకు విద్యుత్ ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యంఉంది. గ్రామ పంచాయతీకి రాబడి తక్కువగా ఉన్నా గ్రామస్థులు కలసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తులు రవాణాకు, ఇతర అవసరాలకు డీసీఎంలను జహీరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చేవారు. గ్రామంలో పరిస్థితులు మారడంతో గొట్టిగార్‌పల్లి గ్రామస్థులే ఆరు డీసీఎంలను కొన్నారు. గ్రామస్థుల అవసరాలను ఇవి తీరుస్తున్నాయి. గతంలో గ్రామంతటికీ ఒక ట్రాక్టర్ ఉంటే ప్రస్తుతం 12 ట్రాక్టర్లు ఉన్నాయి. ద్విచక్రవాహనాలు గ్రామంలో వందకు పైగా ఉన్నాయి.

నాడు నిత్యం కరవే...

వానాకాలం సేద్యం... చినుకుపడితేనే పంట... లేదంటే చేలు బీళ్లే.... బావుల్లో చుక్క నీరు కనపడేది కాదు... ఎంత లోతు తవ్వినా బోరుబావుల్లో నీటి జాడ కన్పించేది కాదు..తాగునీటికీ కటకట... వాతావరణం అనుకూలిస్తే సాగయ్యేది ఒకటి రెండు రకాల మెట్ట పంటలే... 2006 వరకూ ఇదీ గొట్టిగార్‌పల్లి గ్రామం దుస్థితి.

నేడు సస్యశ్యామలం

ఇప్పుడు అదే గ్రామంలో వర్షాభావ పరిస్థితుల్లోనూ కరవు జాడలు కనిపించవు. నీటి కొరత అన్న మాటే లేదు. ఎటు చూసినా పొంగే జలధారలు. నడి వేసవిలోనూ బావుల్లో పది-పదిహేను అడుగుల లోతులో నీరు. వేసిన ప్రతి బోరులోనూ నీరు పుష్కలం. ఏడాదికి మూడు పంటలు.

చతుర్విద జల ప్రక్రియతో చక్కటి ఫలితాలు

కొన్నేళ్లుగా సిరులు పండిస్తూ, రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కారణమైన వాటర్‌షెడ్‌కు ఖర్చయిన మొత్తం అక్షరాల రూ.24 లక్షలు. ఈ డబ్బు కూడా వాటర్‌షెడ్ పనులు చేసుకున్నందుకు కూలీ రూపంలో ఆ గ్రామస్థులకే చేరింది. ఈ వాటర్‌షెడ్‌లో 95 శాతం పైగా మట్టి పనులే. చతుర్విద జల ప్రకియ అనే వాటర్‌షెడ్ విధానం అక్కడ అమలు చేశారు. తక్కువ వ్యయంతో సిమెంటు నిర్మాణాల జోలికి పోకుండా ఎగువ ప్రాంతం నుంచి దిగువ వరకూ వివిధ రకాల నీటి సంరక్షణ పనులతో భూగర్భ జలాలను పెంపొందించాం. ఈ విధానం చైనాలోని హైబై అనే రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. చిన్న కుంటల నిర్మాణం, మట్టికట్టల ఏర్పాటు, గల్లీ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, వరుస సమతుల కందకాల తవ్వకం, నేలబారు పంటలతో తేమను కాపాడుకోవడంతో చక్కటి ఫలితాలు వస్తాయి. దీన్నే గొట్టిగార్‌పల్లి వాటర్‌షెడ్‌లో అమలు చేశారు. పూర్తి స్థాయిలో ఫలితాలు అందుకుంటున్నారు.

-టి.హనుమంతరావు,

విశ్రాంత ఈఎన్‌సీ, జలవనరులు నిపుణులు

వాటర్‌షెడ్ స్వరూపం


గొట్టిగార్‌పల్లి పరిసరాల భూభాగం 3300 ఎకరాలు. ఇందులో 1600 ఎకరాలు అటవీ భూమి. 1500 ఎకరాలకు గాను వాటర్‌షెడ్ పనులు చేశారు. గ్రామజనాభా 3250 మంది. వాటర్‌షెడ్ ద్వారా 750 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.

ప్రత్యేకతలు

 • కొన్ని ప్రాంతాల్లో 55 అడుగుల్లోనే నీళ్లు పుష్కలంగా ఉండగా 80 అడుగుల్లో నీరు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉంటుంది.
 • ఏడెనిమిది మీటర్ల లోతులో నీళ్లు అందుబాటులోమ ఉండే బావి నాలుగు మోటార్లతో 15 ఎకరాలకు అవసరమైనంత నీటిని ఇస్తుంది.
 • గతంలో ఎకరం భూమి ధర రూ.50వేలలోపే ఉండేది. ఇప్పుడు రూ.నాలుగైదు లక్షలకు కూడా ఎకరం దొరకడంలేదు.
 • 300 బోర్లు ఉంటాయి. పదికి పైగా బావులు ఉన్నాయి. అన్నింటా నీరు పుష్కలంగా ఉన్నాయి.
 • వానాకాలంలో ఒక భారీ వర్షం పడినా బావుల్లో నీరు పైనుంచి ప్రవహిస్తుంది.
 • మూడేళ్ల క్రితం సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ నమోదైనా గ్రామంలో నీటికి ఎలాంటి సమస్య రాలేదు.
 • ఈ ఏడాది మండు వేసవిలో మే 25న గ్రామ సమీపంలో బోరు వేయగా మంచి జలధారతో 130 అడుగుల్లోనే పడ్డాయి.

పొరుగూరిలో నీటికి కటకట..

గొట్టిగార్‌పల్లికి సమీపంలోని బడంపేట దుస్థితి ఇది

ఈ గ్రామం పేరు బడంపేట... గొట్టిగార్‌పల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం బడంపేట. ఇది ఎంత దగ్గర అంటే బడంపేట పిల్లలు హైస్కూలు కోసం గొట్టిగార్‌పల్లి వెళ్తారు. ఈ రెండు గ్రామాల మధ్య భూగర్భజలాలు, పంటలసాగు, గ్రామాల్లో పరిస్థితులకు పూర్తి వైరుధ్యం.బడంపేటలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు. కుళాయిల్లో ఎప్పుడో వచ్చే నీటి కోసం ఎదురు చూపు. ఆగి ఆగి వచ్చే తాగునీటి బోర్లు... అది కూడా కరెంటు ఉన్నపుడే... ఎవర్ని కదిలించినా చెప్పేది ఒకే మాట నీళ్లకు చాలా తిప్పలు ఉన్నాయని. మనుషులకే కాదు పశువులకు తాగేందుకు ఈ గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామంలో వ్యయసాయానికి తీవ్రమైన తాగునీటి సమస్య. వ్యవసాయ బోర్లు పూర్తిగా అడుగంటాయి. నాలుగువందల అడుగులు వేసినా చుక్కనీరు కనబడని పరిస్థితి. ఒకప్పుడు చెరుకు సాగైన భూములు వానాకాలం సేధ్యంగా మెట్టపంటలకు పరిమితమవుతున్నాయి. బోర్లను నమ్ముకుని వేసిన పంటలకు సాగునీరు లేక ఎండిపోతున్నాయి. పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఈ గ్రామంలో భూగర్భజలాల దుస్థితికి ఇదే నిదర్శనం. బోరులో చుక్కనీరు లేకపోవడంతో వాటిని వదిలేశారు.

ఏటేటా పరిస్థితి దిగజారుతోంది

నేను ఎమ్మెస్సీ చదువుకున్నాను. గత ఏడాదే పూర్తయింది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఎనిమిదెకరాల పొలం ఉంది. ఉన్న బోర్లు ఎండిపోతుంటే ఆశతో ఆరు బోర్లు వేశాం. 350 అడుగుల నుంచి గరిష్ఠంగా 410 అడుగులు లోతు వేసినా నాలుగు బోర్లలో చుక్కనీరు రాలేదు. రెండు బోర్లలో ఒక అంగుళం నీళ్లు వచ్చాయి. అవి తగ్గిపోతున్నాయి. ఏడాదికి ఒక పంటకు నీరు ఇచ్చుకోగలిగితే కష్టంగా ఉంది. పెట్టుబడి పెడితే పదో వంతుకూడా చేతికి రావడంలేదు.

-లక్ష్మయ్య, బడంపేట

ఆధారము: ఈనాడు

పట్టు పురుగుల పెంపకం

 • ఉద్యోగం మానేసి పట్టు పురుగుల పెంపకం చేపట్టిన యువకుడు
 • పూర్తిస్థాయిలో శిక్షణ పొంది.. ప్రణాళికాబద్ధంగా ముందడుగు..
 • నెలకు రూ. 30 వేల నికరాదాయం పొందుతున్న వైనం

వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకుండా పోతున్న ఈ రోజుల్లో కన్నీటి సేద్యం చేయడం కన్నా.. పట్నంలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటే మేలన్నది గ్రామీణ యువతను ఇప్పటికీ బలంగా ఆకర్షిస్తున్న భావన. అయితే, పొరుగూళ్లో చిన్నాచితకా ఉద్యోగాల కన్నా సొంతూళ్లో ప్రణాళికాబద్ధమైన సేద్యం ఎంతో మేలని మూతి మీద మీసం కూడా ఇంకా సరిగ్గా మొలవని ఈ లేత కుర్రాడు తన చేతల ద్వారా చాటిచెబుతున్నాడు. శిక్షణ పొంది పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నాడు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...

సొంతూళ్లో పట్టు పురుగుల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జించాలి అనే కోరికతో ఉద్యోగం మానేసి సొంతూరు చేరుకున్నాడు. చదువుకొని ఉద్యోగం చేసుకోక ఇవన్నీ ఎందుకని ఇంట్లో వాళ్ల నుంచి, స్నేహితులు, ఇరుగుపొరుగు నుంచి విమర్శలు వచ్చినా సహించాడు. తల్లిదండ్రులను ఒప్పించి పెట్టు బడి సమకూర్చుకున్నాడు. కష్టం ఫలించి తొమ్మిది నెలల తరువాత తను ఊహించిన లాభాలు ఒళ్లో వాలాయి. వెక్కిరించిన నొసళ్లే ప్రశంసాపూర్వకంగా చూశాయి. మేమూ నీదా రిలోనేనంటూ మరికొంత మంది యువకులు ముందుకు వచ్చారు. ఇంతా సాధించిన ఆ యువకుడి పేరు పొట్టవర్తిని భార్గవ్. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని కన్నాపూర్ ఆయన స్వగ్రామం.

భార్గవ్ జగిత్యాలలో ఇంటర్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివాడు. డిప్లామా పూర్తి చేసి ఒక సెవెన్ స్టార్ హోటల్‌లో నెలకు రూ. 8 వేల జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం భార్గవ్‌కు తృప్తినివ్వలేదు. ఇప్పుడు బాగానే ఉన్నా తరువాత పరిస్థితి ఏమిటి? అనిపించేది. తను అద్దెకున్న ఇంటి యజమాని నాయక్ సెరి కల్చర్ డిపార్ట్‌మెంట్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తుండేవారు. ఆయనతో పరిచయం పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తిని పెంచింది. బాగా ఆలోచించి స్వంత ఊళ్లో పట్టు పురుగుల పెంపకంతో ఉపాధి పొందడమే సరైన మార్గమని నిశ్చయిం చుకున్నాడు.

అనుకున్నదే తడవుగా నాయక్ సలహాతో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో కేంద్ర పట్టు పురుగుల పెంపకం పరిశోధన, శిక్షణ కేంద్రంలో 2 నెలలు, హిందూపూర్‌లో 15 రోజులు శిక్షణ తీసుకున్నాడు. రూ. 5 లక్షలతో పట్టు పురుగుల పెంపకానికి ఓ షెడ్డు వేశారు. పట్టు పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించగా వారు షెడ్డు నిర్మాణానికి లక్ష రూపాయలు, స్టాండ్లు, ట్రేలు, చంద్రికలు నెట్‌లు కట్టుకోవటానికి రూ. 38 వేలు అందజేశారు. మేత కోసం రాజమండ్రి నుంచి మల్బరీ మొక్కలను తెప్పించి ఎకరంలో మల్బరీ తోటను పెంచారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా మల్బరీ తోటకు కూలీల ఖర్చు కోసం ఏడాదికి రూ. 53 వేలు కేటాయించగా రూ. 13 వేలతో మొక్కలు నాటించి, కలుపు తీయించటం వంటి పనులు పూర్తి చేశారు. ఏడాదికి మూడుసార్లు పేడ ఎరువును వేయటం, నీరు కట్టటం తప్ప మల్బరీ తోట పెంచేందుకు ఖర్చులేవీ లేవు. మల్బరీ తోట 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తుంది. తోట ఆరు నెలలు వయసుకొచ్చాక ఆకు సమృద్ధిగా లభిస్తుండటంతో వంద గుడ్లతో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించారు. 2013 అక్టోబర్‌లో మొదటి బ్యాచ్ వచ్చింది.

ఖర్చుకు 8 రెట్లు ఆదాయం ..

సుమారు రూ. 30 వేల వరకు నికరాదాయం పొందాడు. మొదటి బ్యాచ్‌తోనే తాను అనుకున్న ఫలితాన్ని సాధించాడు భార్గవ్. వంద గుడ్లు కొనుగోలు ఖర్చు రూ. 650, షెడ్‌ను రసాయనాలతో కడిగేందుకు రూ. 500, నాలుగో దశలో ఆకు కోసేందుకు రూ. వెయ్యి, చంద్రికలు నుంచి గూళ్లను తొలగించేందుకు ముగ్గురు కూలీలకు రూ. 450 ఖర్చు కాగా, మార్కెట్‌కు తరలించేందుకు మరో రూ. వెయ్యి ఖర్చయ్యాయి.

మొత్తం రూ. 3,600 ఖర్చు కాగా.. 89 కేజీల పట్టుగూళ్ల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 360 ధర లభించటంతో రూ. 32,040 ఆదాయం లభించింది. జల్లి (మెత్తపడ్డ ) గూళ్లు ఎనిమిది కిలోలు రాగా కిలోకు రూ. 50 ధర లభించింది. మొత్తం రూ. 32,440 ఆదాయానికి గానూ.. ఖర్చులు పోను రూ. 28,800 నికరాదాయం వచ్చింది. ఇది ఒక్క బాచ్ ( 29 -32 రోజులు ) ఆదాయం మాత్రమే. ఇప్పటివరకూ 9 బ్యాచ్‌లు వచ్చాయి. ప్రతి బ్యాచ్‌లోనూ రూ. 29 - 32 వేల వరకు ఆదాయంతో మొత్తం రూ. 2.50 లక్షల వరకూ నికరాదాయం వచ్చింది.

ముందు జాగ్రత్తలతో మేలు

పట్టు పురుగుల పెంపకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందంటున్నారు భార్గవ్. పురుగులు కుబుసం విడిచినప్పుడు, రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు ఫార్మనిక్ పౌడర్ చల్లాలి. విసర్జకాల నుంచి వైరస్ రాకుండా పొడి వాతావరణం కోసం కాల్చిన సున్నం చల్లాలి. పట్టు పురుగులను ప్రతి పూటా నిశితంగా పరిశీలించటం, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా షెడ్‌ను రసాయనాలతో కడగటం ద్వారా 90 శాతం నష్టాలను నివారించవచ్చునని చెపుతున్నారు. రోజూ స్వయంగా మేత కోసి వేస్తూ, పట్టు పురుగులను పరిరక్షిస్తూ, సకాలంలో చర్యలు తీసుకోవటంతో పెద్ద ఇబ్బందులేమీ రాలేదంటున్నారు భార్గవ్.

తామంతా అసాధ్యం అన్నదాన్ని భాస్కర్ తమ కళ్లముందే సాధించటంతో మరికొందరు రైతులు పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. భార్గవ్ స్వంత గ్రామంలో ఆరుగురు, చుట్టు పక్కల గ్రామాల్లో 15 మంది రైతులు వచ్చే తొలకరి నుంచి మల్బరీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరికీ మల్బరీ మొక్కలు అందించేందుకు భార్గవ్ రెండెకరాల్లో నర్సరీని పెంచుతున్నారు.

- పన్నాల కమలాకర్ రెడ్డి,

జగిత్యాల, కరీంనగర్ జిల్లా

పంటల సాగు కన్నా పట్టుపురుగుల పెంపకం మేలు

ప్రారంభంలోనే షెడ్‌ల నిర్మాణం కోసం పెద్ద మొత్తం ఖర్చు చేయాలి. తర్వాత తక్కువ ఖర్చుతోనే మంచి ఆదాయం పొందవచ్చు. మరో రెండెకరాల్లో మల్బరీ తోటను పెంచి, పట్టు గుడ్ల సంఖ్యను 300కు పెంచటం ద్వారా నెలకు రూ. లక్ష సంపాదించాలనేది ప్రస్తుతం నా లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పంటల సాగు కన్నా పట్టు పురుగుల పెంపకం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. ఉద్యోగం కన్నా పట్టుపురుగుల పెంపకం నాకు ఎక్కువ సంతృప్తినిస్తున్నది. శిక్షణ తీసుకుంటే సత్ఫలితాలు సాధించడం సులభం.

- పొట్టవర్తిని భార్గవ్ ( 89789 92613), యువ రైతు,

కన్నాపూర్, జగిత్యాల మండలం, కరీంనగర్ జిల్లా

ఆధారము: సాక్షి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/30/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate