బంతి పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితుల్ని బట్టి బంతిని జులై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే మార్కెట్కు పూల సరఫరాని అక్టోబరు నుండి ఏప్రిల్ మాసం వరకు చేయవచ్చు. సెప్టెంబరులో నాటిన పంట నుండి పూల దిగుబడి బాగా వస్తుంది. వర్షాకాలంలో పూలపై వర్షం పడిన ఎడల లేదా వేసవిలో హెచ్చు ఉష్ణోగ్రత వలన పూల నాణ్యత దెబ్బతింటుంది.
నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని రకాల నేలల్లో బంతి పూలను సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 7.0-7.5 మధ్య గల నేలలు అనుకూలం. సారవంతమైన గరప నేలలు బంతికి అత్యంత అనుకూల మైనది. సాగుచేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు. నీడలో బాగా పెరుగుతుంది. కాని పూలు పూయవు.
ఆఫ్రికన్ బంతి: ఇది ఎత్తుగా ధృడమైన మొక్క దీనిలో ఒంటి రెక్క నుండి మద్దగా, పెద్దగా, వుండే రకాలు వున్నాయి. పూలు నిమ్మ రంగు నుండి పసుపు, బంగారు వర్ణం నుండి నారింజ రంగు వరకు అనేక వర్గాల్లో ఉన్నాయి.
ఫ్రెంచ్ మేరీగోల్డ్: ఇవి పొట్టిగా, గుబురుగా పెరిగి అనేక ఒంటి రేఖ లేదా ముద్దగా వుండే పూలుపూస్తాయి. పూలు రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు మరియు వివిధ రంగులు మిళితమై ఉంటాయి. వ్యాపార సరళిలో సాగుకి ఆఫ్రికన్ బంతికి, ప్రెంచి బంతికన్నా ఎక్కువ డిమాండ్ ఉంది. ఇవే కాకుండ మేలైన రకాలు పూసా, నారింగ గైండా, పూసా బసంతిగైండా, యండియు-1 రకాలు కలవు.
విత్తన మోతాదు విత్తే పధ్ధతి: ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800-1000 గ్రా.ల విత్తనం అవసరం. విత్తనాలను ఎత్తైన మడులు తయారుచేసి విత్తాలి. మళ్ళ తయారు చేసే సమయంలో 1 చదరపు మీటరుకి 8-10కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదల నుండి రక్షించవచ్చు. సాధారణంగా 5–7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.
కత్తిరింపులు : కొన్ని రకాల్లో విత్తనం ఏర్పడదు. ఈ రకాలను కాండపు మొక్కలను నాటి ప్రవర్ధనం చేయాలి.దీని కొరకు కొమ్మల చివర గల మృదువైన 10 సెం.మీ. పొడవుగల భాగాన్ని కత్తిరించి, చివర ఒకటి లేక రెండు జతల ఆకులు వుంచి తేమగల ఇసుకలో (కుండి లేక మడుల్లో నాటాలి. వ్రేళ్ళు బాగా రావడానికి గాను నాటడానికి ముందు ఈ కత్తిరింపుల మొదటి భాగాన్ని సెరాడిక్ బి లేదా రూటెక్స్ హార్మోన్ పొడితో మంచిన తరువాత నాటాలి. నాటిన వెంటనే కుండలను నీడ లోనికి మార్చాలి. ఒకవేళ మడిలో నాటినటైతే నీడ కల్పించాలి. ఇసుకలో చెమ్మ ఆరిపోకుండా క్రమం తప్పక నీరు చిలుకరించాలి. నాటిన 8–10 రోజుల్లో వేరుతొడగడం గమనించవచ్చు. వేరు వ్యవస్థ బాగా ఏర్పడిన తరువాత వీటిని నాటుకోవాలి.
నాటే విధానం: నెల వయస్సు, 3-4 ఆకులు గల మొక్కలు నాటడానికి అనుకూలం. నారుని సాయంకాలం వేళలో నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్బంతి మొక్కల్ని 40X30 సెం.మీ దూరంలోను, కత్తిరింపులను 30x20 సెం.మీ. దూరంలోను నాటుకోవాలి. ఫ్రెంచ్ బంతి మొక్కల్ని 20x20 సెం.మీ. దూరంలో, కత్తిరింపులను 20X20 సెం.మీ. దూరంలో నాటితే పూల దిగుబడి బాగా వుంటుంది.
ఎరువులు : చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. దీనితో బాటుగా 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకి 20-40 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి.
నీటి యాజమాన్యం : నాటిన 55-60 రోజుల వరకు అంటే శాఖీయ పెరుగుదల సమయంలోను పూత దశలోను నేలలో తగినంత తేమ వుండేలా చూడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే, పెరుగుదల మరియు పూల దిగుబడి తగుతుంది.
పించింగ్: ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే ప్రక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లివేస్తే, అనేక ప్రక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి. ఈ కొమ్మలపై పూలు ఏర్పడి పూలదిగుబడి పెరుగుతుంది. నాటిన 40వరోజు పించింగ్ చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. మామూలుగా గుబురుగా పెరిగే రకాలకు పించింగ్ అవసరం లేదు.
పూలకోత : బంతి పూలను బాగా విచ్చుకున్న తరువాత కోయాలి. పూలను ఉదయం కాని సాయంత్రం కాని కోయాలి. కోతకు ముందు నీటి తడియిస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా వుండి నిలువ వుంటాయి. సకాలంలో పూల కోతలు చేసూ వుంటే పూల దిగుబడి పెరుగుతుంది.
దిగుబడి: సాధారణంగా ఎకరానికి 4-5 టన్నుల వరకు పూల దిగుబడి ఉంటుంది.
పేను : పెద్ద, పిల్ల పరుగులు మొక్కల పూ మొగ్గల్ని ఆశించి నష్టపరువస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా మలాథియాన్ 2 మి.లీ. లేదా డైమిధోయేట్ 1.5 మి.లీ 15 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
త్రిప్స్ (తామర పురుగులు): పిల్ల, తల్లిపురుగులు ఆకులు, పూల నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు గోధుమ రంగుకు మారి, ఎండిపోతాయి. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా డైమిధోయేట్ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొగ్గతొలిచే పురుగు: గ్రుడ్ల నుండి వెలువడిన చిన్న లార్వాలు పూల మొగ్గల్ని తొలిచి వేస్తాయి. పెరిగే లార్వాలు పూభాగాలని తింటాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు విచ్చుకోవు. వీటి నివారణకు కార్బరిల్ 3 గ్రా. లేదా స్పెనోసాద్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
నారుకుళ్ళ తెగులు: నేలలో తడి ఎక్కువగా ఉండి, వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. మొల కెత్తుతున్న లేత మొక్కలు చనిపోతుంటాయి. దీని నివారణకు వేసవిలో నారుమళ్ళను సోలరైజేషన్ (సూర్యరశ్మితో భూమిని వేడి చేయడం) చేయాలి. మళ్ళను పరిశుభ్రంగా వుంచాలి. నేలను లీటరు నీటికి 2 గ్రా. కాప్లాన్ లేదా 1 గ్రా. కార్బండజిమ్ కలిపిన మందు ద్రావణంతో తడపాలి.
ఆకుమచ్చ: తెగులు తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో వ్యాప్తి చెందుతుంది. ఈ మచ్చలు కొన్నిసార్లు గ్రే రంగు లేదా నల్లని రంగుతో ఆయా శిలీంద్రాన్ని బట్టి వుంటాయి. నివారణకు తోటను శుభ్రంగా వుంచుకోవాలి. అలాగే లీటరు నీటికి 2.5 గ్రా. ల మాంకోజెబ్ కలిపి పిచికారి చేయాలి.
ఈ సంవత్సరం ఉద్యానశాఖ ద్వారా 100 ఎకరాలపైచిలుకులో రైతులకు 50% రాయితీకల్పించుటకు రైతులను గుర్తించి ఈ బంతి సాగుతో పాటు మలై, కనకాంబరం, చామంతి వెుదలగు పూల సాగును ప్రోత్సహిస్తుంది.