অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాలీప్లవర్ (గోభి పువ్వ)

కాలీప్లవర్ (గోభి పువ్వ)

ముఖ్యమైన శీతాకాలపు కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. దీనిలో విటమిన్ "సి" అధికంగా వుంటుంది.

వాతావరణం

చల్లని వాతావరణం అవసరం. అందువల్ల శీతాకాలంలో ఎక్కువగా సాగుచేస్తారు. చల్లని పర్వత ప్రాంతాల్లో వేసవిలో కూడా మంచి పంటను ఇస్తుంది.

నేలలు

సారవంతమైన, బాగా నీరు ఇంకే గరప నేలలు అనువైనవి. ఆమ్ల లక్షణాలు కలిగి మురుగు నీటిపారుదల వసతిలేని నేలలు పనికిరావు.

నాటే సమయం

వర్షాకాలం : జూలై-ఆగష్ణు, శీతాకాలం : సెప్టెంబరు-నవంబరు

రకాలు

స్వల్పకాలిక రకాలు

పూసా దీపాలి మరియు పూసకట్కి: శీకాలంలో ముందుగా (సెప్టెంబర్ రెండవవారం నుండి చివరి వరకు) వేయుటకు అనుకూలమైన రకాలు. పంటకాలం 90-100 రోజులు. కాండం పరిమాణం మధ్యస్థం, ఆకులు నీలం రంగుగా ఉండి వంపు లేకుండా ఉంటాయి. పువ్వు ఏర్పడే సమయంలో నేల పైభాగాలలో ఉన్నట్లు కన్పిస్తాయి. పువ్వులు చిన్నగా, మధ్యస్థంగా ఉండి గట్టి మద్దగా మరియు తెల్లగా ఉంటాయి.

ఎర్లీకున్వారి : సెప్టెంబర్ మధ్యలో విత్తేందుకు అనువైనది. పువ్వు అర్ధచంద్రాకారంలో హెచ్చు, తగ్గులు లేకుండా ఉంటుంది.

పూస ఎర్లీసింథటిక్ : పువ్వులు చిన్నవి నుండి మధ్యస్థంగా, చదునుగా, తెల్లవిగా, ముద్దగా ఉంటాయి. అక్టోబర్ మొదటి వారంలో నాటేందుకు అనువైనది. రైసీనెస్ అను అస్వస్థతను తట్టుకొనే రకం. దిగుబడి ఎకరాకు 47 క్వి

మధ్యకాలిక రకాలు

పంత్ శుభ్ర మరియు హిమాని

ఇవి త్వరగా కాపుకు వచ్చే రకాలు. పంటకాలం 90-100 రోజులు. కాండం మధ్యరకంగా ఉండి, ఆకులు బూడిద వర్ణంలో ఉంటాయి. పువ్వులు మధ్యస్థంగా తెల్లని ముద్దగా ఉంటాయి. దిగుబడి ఎకరాకు దాదాపు 60 క్వి

స్నోబాల్-16

శీతాకాలంలో నాటేందుకు అనుకూలమైన రకం. పంటకాలం 100-120 రోజులు. ఆకులు బూడిద వర్ణంతో కూడిన ఆకుపచ్చ రంగులో ఉండి వంపు తిరిగి వుంటాయి. పువ్వులు మధ్యస్థంగా ముద్దగా ఉండి తెల్లగా ఉంటాయి.

ఇంప్రూఫ్ట్ జపానీస్

మధ్యకాలిక రకం 90 నుండి 95 రోజుల్లో కోతకు వస్తుంది. మొక్కలు మరియు కాండం పొడవుగా ఉంటాయి. పువ్వులు మధ్యస్థంగా ఉండి పెద్దవిగా, ముద్దగా, మొదట్లో తెల్లగా, కోత ఆలస్యమైన కొద్దీ వదులుగా, లేత పసుపు వర్ణంలోకి మారుతాయి.

పూసా హిమజ్యోతి

పువ్వు మొత్తం పూర్తిగా ఆకులతో కప్పబడి ఉంటుంది (self blanching type). పూలు తెల్లగా ఉండి, ఎండ తగిలినా రంగు కోల్పోకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవి పంటకు అనుకూలం. ఒక్కో పూపు 500-600 గ్రా. బరువు వుంటుంది. పంటకాలం : 65-75 రోజులు, దిగుబడి ఎకరాకు 60-68 క్వి

పూసా హైబ్రిడ్

ఈ రకం బూజు తెగులును తట్టుకుంటుంది. పూవు తెల్లగా ఉండి సుమారు కిలో బరువు ఉంటుంది. నవంబరు-డిసెంబరు మొదటి పక్షం వరకు కోతకు వస్తుంది. దిగుబడి ఎకరాకు 230 క్వి

ఊటి నెం. 1

పర్వత ప్రాంతాలకు అనువైనది. పంటకాలం 110-120 రోజులు. దిగుబడి ఎకరాకు 184 క్వి

దీరకాలిక రకాలు

పూసా సింథటిక్ : పువ్వులు మధ్యస్థ తెలుపగా, మద్దగా ఉంటాయి. సెప్టెంబర్ మధ్య నుండి సెప్టెంబరు ఆఖరు వరకు నాటేందుకు అనువైనది. జనవరిలో కోతకు వస్తుంది.

పూసాస్నోబాల్-1 మరియు పూసాస్నోబాల్-2

ఆలస్యంగా నాటేందుకు అనువైనవి. సెప్టెంబర్ మధ్యకాలం నుండి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. ఎండసోకిన కూడా పువ్వులు తెల్లవిగా ఉంటాయి. జనవరి-ఫిబ్రవరిలో కోతకు వస్తుంది.

పూసా స్నోబాల్-కె-1

నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. కోత ఆలస్యమైనా పువ్వులు తెల్లగా ఉంటాయి. ఆలస్యంగా నాటుటకు అనువైనది. పంటకాలం 110-120 రోజులు.

పూస శుభ్ర

మొక్కలు నిటారుగా పొడవైన కాండం కలిగి ఉంటాయి. పూలు 700-800 గ్రా. బరువుతో నూగు లేకుండా నున్నగా ఉంటాయి. నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. పంటకాలం 90-95 రోజులు.

వివిధ కంపెనీల హైబ్రిడ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. అందులో హిమతల, పూసా హైబ్రిడ్, పూసాశుభ్ర ఖరీఫ్ పంటకు అనువైనవి.

విత్తనం, వితే పద్ధతి

40 చ.మీ. లలో 280-320 గ్రా, విత్తనాల నారుపోసి ఒక ఎకరాలో నాటుకోవచ్చు. తక్కువ కాలపరిమితి గల రకాలకు 240-320 గ్రా, దీర్ఘకాలిక రకాలకు 160-200 గ్రా, విత్తనం కావాలి. కిలో విత్తనానికి 3 గ్రా, చొuన ధైరమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

నారుమడి

క్యాబేజీలో లాగా ఎత్తైన నారుమళ్ళలో నారును పెంచుకోవాలి.

నాటటం

నేలను పదునుకు వచ్చేట్లుగా 4-5 సార్లు దున్నాలి. ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. 60 సెం.మీ. దూరంలో బోదెలను చేసుకోవాలి. 25-30 రోజుల వయస్సుగల మొక్కలను నాటుకోవాలి.

నాటే దూరం

తక్కువ కాలపు రకాలను 45X45 సెం.మీ. దీర్ఘకాల రకాలను 60x45 సెం.మీ. ఎడంతో బోదెల ప్రక్కన నాటాలి.

ఎరువులు

ఎకరాకు 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్లను ఇచ్చే రసాయనిక ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24-32 కి|| నత్రజనిని మూడు దఫాలుగా (స్వల్పకాలిక రకాలలో నాటిన 25-30, 50-60 రోజులకు, దీర్ఘకాలిక రకాలలో మూడవ దఫాగా 75-80 రోజులకు) వేసుకోవాలి. బోరాన్ లోప సవరణకు 3 గ్రా, బోరాక్స్ ను లీటరు నీటికి కలిపి రెండుసార్లు (మొక్కనాటిన రెండు వారాల తర్వాత మరియు పువ్వు ఏర్పడడనికి రెండు వారాల ముందు) మొక్కలపై పిచికారి చేయాలి.

కలుపు నివారణ, అంతరకృషి

పెండిమిథాలిన్ అనే మందును ఎకరాకు 1.25 లీ. లేదా అలాక్లోర్ 1.0 లీ. (తేలిక నేలలు), 1.25 లీ. (బరువు నేలలు) చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు తగి నేలపై పిచికారీ చేయాలి. నాటిన 20, 25 రోజులప్పడు అంతరకృషి చేసి మట్టిని ఎగదోయాలి. పువ్వులోకి సూర్యరశ్మి చేరకుండా క్రింది ఆకులను త్రుంచి పువ్వు మీదకు కప్పతూ వుండాలి.

నీటి యాజమాన్యం

తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి.

సస్యరక్షణ

అకుమచ్చ తెగులు : ఆకుల పైభాగాన గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పడు పెద్దవై, ఆకుఅంతా వ్యాపిస్తాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు తెగులు కన్పించిన వెంటనే మాంకోజెబ్ లీటరు నీటికి 2.5 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రా, చొప్పన కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారి చేయాలి.

కుళ్ళు తెగులు : ఇది నారుమడిలోను, నాటిన పొలంలోనూ కూడా కన్పిస్తుంది. ఆకులు అంచుల నుండి పసుపు రంగుకు మారతాయి. ఈనెలు నల్లబడి కాండం కుళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఇది పువ్వులకు కూడా వ్యాపించి పూత కుళ్ళిపోతుంది. దీని నివారణకు ఒక్కసారి ఈ తెగులు ఆశిస్తే కాయ జాతి/పప్ప జాతి పంటలతో పంటమార్పిడి చేయాలి. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రా, చొప్పన కలిపి మొక్క మొదలు చుటూ తడపాలి. దీనివల్ల తెగులు వ్యాప్తి కొంత వరకు అరికట్టబడుతుంది.

క్యాబేజీకి అనుసరించిన ఇతర సస్యరక్షణ మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులనే అవలంబించాలి.

కాలీప్లవర్ సాగులో యితర సమస్యలు

బట్టనింగ్ : చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నత్రజని తక్కువ అవటం, స్వల్పకాలి రకాలను ఆలస్యంగా నాటడం వలన ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21-25 రోజుల వయసుగల నారును నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వేయాలి. స్వల్పకాలిక రకాలను సరైన సమయంలోనే నాటుకోవాలి.

రైసీనెస్ : వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పువ్వు వదులుగా, విచ్చుకున్నట్లుగా అయి, పువ్వు గుడ్డపై నూగు వస్తుంది. మార్కెట్ విలువ తగ్గుతుంది. దీని నివారణకు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలు వేసుకోవాలి. పువ్వులను సరైన సమయంలో ఆలస్యం చేయకుండా కోత కోయాలి.

బ్రౌనింగ్ : క్షార నేలలో పెంచే పంటలో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది. బోరాన్ ధాతు లోపం వలన పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీని నివారణకు ఆఖరు దుక్మిలో ఎకరాకు 8-10 కిలోల చొuన బోరాక్స్ వేయాలి. లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.

కొరడా తెగులు : మాలిబ్లినం ధాతు లోపం వలన ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. లోపం తీవ్రంగా ఉంటే ఒక్క మధ్య ఈనె మాత్రమే పొడవుగా పెరుగుతుంది. దీనినే కొరడా తెగులు (విప్టేల్) అంటారు నత్రజని మోతాదు ఎక్కువైతే మాలిబ్లినం మొక్కకు అందుబాటులో ఉండదు. అందువలన దీని నివారణకు సరైన మోతాదులో మాత్రమే నత్రజని వేయాలి. ఎకరాకు 400 గ్రా, సోడియం లేదా అమ్మోనియం మాలిట్టేట్ 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

కాలిప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలోనే చుటూ ఉన్న ఆకుల చివరి వరుసను పువ్వుపై కప్పతూ సూర్యరశ్మి చేరకుండా చేసి దారం లేదా రబ్బరు బ్యాండు కట్టాలి. ఆ తర్వాత 4-5 రోజులకి తీసి, కోత కోయాలి. పంటకాలం, రకాన్ననుసరించి ఎకరాకు 8.0–140 టన్నుల దిగుబడి వస్తుంది.

కాలీఫ్లవర్ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా 251వ పేజీలో ఇవ్వబడింది.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/8/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate