অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ద్రాక్ష

ద్రాక్ష

ద్రాక్ష పంట ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, చితూరు, అనంతపురం జిల్లాల్లో సాగుచేయబడుతుంది.

నేలలు

ఉదజని సూచిక 6.5-8.0 మధ్య ఉండి, లవణ సూచిక 1.0 డి.ఎస్/మీ మరియు సున్నం 8.0 శాతం కన్నా తక్కువగా వుండి, నీరు నిలువని, కనీసం ఒక మీటర్ లోతుగల నేలలు ద్రాక్ష పంటకు అనుకూలమైనవి. పాల చౌడు, కారు చౌడు ఉప్పచెడు మరియు అధిక సున్నం కల సమస్యాత్మకమైన నేలలు ద్రాక్ష కు పనికిరావు.

నాణ్యత పరిమాణాలు లోపించిన నేలలు మరియు నీరు వున్న ప్రదేశాలలో వేరు మూలాలు వేసుకొని ద్రాక్షను అంటుకట్టు కున్నట్లయితే ఉపయోగంగా ఉంటుంది.

ప్రవర్ధనం

బాగా వేళ్ళవచ్చిన మొక్కల ద్వారా లేదా వేళ్ళ రాని ముదురు కొమ్మలను ఒక్కొక్క పాదులో 2-3 నాటటం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు.

మొక్కలను నాటటం

గింజల్లేని రకాలకు 1.8x2,4మీ. దూరంలో 60x60x60 సెం.మీ. గుంతలను, గింజలున్న రకాలకు 4.5X4.5మీ. దూరంలో, 90X90x90 సెం.మీ. గుంతలను తీసి నాటుకోవాలి. మొక్కలను నాటటానికి ముందు చెదల నివారణకు మిథైల్ పెరాథియాన్ 2 శాతం పొడి ఒక్కో గోతిలో 100గ్రా. చల్లాలి.

సాగులో వున్న ముఖ్య రకాలు – లక్షణాలు

రకం

సరాసరి దిగుబడి (./.)

ముఖ్యలక్షణాలు

ధాంప్సన్ సిడ్లెస్

8-10

గింజలేని రకం. తినటానికి, ఎండు ద్రాక్ష మరియు వైన్ తయారు చేయటానికి వుపయోగాపడుతుంది. పక్వానికి వచ్చిన తరువాత ద్రాక్ష గుత్తులు లేత పసుపు నుండి బంగారు వర్ణంలో వుంటాయి. దీనిలో చెక్కర 20-22 శాతం, ఆమ్లం 0.5-0.6 వరకు, రసం శాతం 55-75 వరకు వుంటుంది.

తాస్-ఎ-గణేష్

8-10

గింజలేని రకం. ద్రక్షగుత్తిలోని కాయలు ధాంప్సన్ సీడ్ లెస్ కన్న పొడవుగా వుంటాయి. మిగతా అన్ని లక్షణాలు ధాంప్సన్ సీడ్ లెస్ ను  పోలివుంటాయి.

అనబ్-ఇ-ఫాహి

20-26

గింజ గల ద్రాక్ష. గుత్తులు మధ్యస్ధం నుండి పొడవుగా వుంటాయి. తోలు గుజ్జుకు అంటుకొని ఉంటుంది. గుజ్జు బరస (క్రిస్ప్) గా వుంటుంది. దీనిలో చెక్కర శాతం 14-16 వరకు, ఆమ్ల శాతం 0.5-0.6 వరకు, రసం శాతం 55-75 వరకు వుంటుంది.

దిల్ కుష్

18-22

గింజ గల ద్రాక్ష గుత్తిలోని కాయలు పొడవుగా వుండి చాలా ఆకర్షణియంగా వుంటాయి. మిగతా లక్షణాలన్ని అనబ్-ఇ-షాహెని పోలి వుంటాయి.

కిస్మిస్ చర్ని

8-10

గింజ లేని, నల్ల రంగు గల తినటానికి అనువైన రకం. మంచి నాణ్యత గల రకం. దీనిలో చెక్కర 20-22 శాతం, ఆమ్లము 0.5-0.8 శాతం, రసం శాతం 70-75 వరకు ఉంటుంది.

కిస్ మిష్ రోజోవిజ్

7-8

గింజలేని, గులాబి రంగు గల తినటానికి అనువైన రకం. మంచి నాణ్యత గల రకం. దీనిలో చెక్కర 18-20 శాతం ఆమ్ల శాతం 0.7-0.8 రసం శాతం 60-75 వరకు ఉంటుంది.

ప్లెమ్ సిడ్లెస్

8-9

గుంజ లేని ముదురు గులాబి రంగు గల తినటానికి మంచి నాణ్యత గల రకం. దీని గుజ్జు తియ్యగా, పండు గుండ్రంగా ఉండును. దీనిలో చెక్కర శాతం 20-22, అమ్లశాతం 0.3-0.5, అసం శాతం 55-65 వరకు ఉంటుంది.

బెంగ్లూర్ బ్లూ

10-11

గింజ గల, నీలం రంగుగల, రసానికి ఉపయోగపడే రకం. దీనిలో చెక్కర శాతం 16-18, రసం శాతం 70-75 అమ్లశాతం 0.8-1 వరకు ఉంటుంది.

పూస నవరంగ్

9-10

గింజ గల, నీలం రంగు గల, సంకర జాతి, రసం రకం. దీని రసం రంగుతో నాణ్యంగా ఉంటుంది.

జిన్ పాండేల్

6-7

గింజ గల, ఎరుపు రంగు గల, వైన్ తయారికి అనువైన రకం.

షేరాజ్

6-8

గింజ గల, ఎరుపు రంగు, వైన్ తయారికి అనువైన రకం.

తీగలను పాకించే విధానం

ద్రాక్షలో తీగలను పాకించడం వలన ద్రాక్ష మొక్కలు కత్తిరించడానికి, మందులను పిచికారి చేయటానికి, పండ్లు కోయటానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో "వై' (Y) పద్ధతి, మామూలు పందిరి పద్ధతికన్న అనువుగా వుంది. బాగా దృఢంగా, ఏపుగా పెరిగే తీగెను ఎన్నుకొని, దానికి ఒక వాసపు బొంగును ఊతమిచ్చి పందిరి మీదికి ఎక్కించాలి. ఆకు మొదలులో వచ్చే చిరుకొమ్మలను(చిగురు) త్రుంచాలి. ముఖ్యంగా ప్రాకించే (ఆకుమొగ్గ) తీగను, పందిరికి 15 సెం.మీ. దగ్గరలో యున్నప్పడు కాండపు కొనను గిల్లాలి. రెండు తీగలు వస్తే వాటిని ఎదురెదురుగా వుండేటట్లు పందిరి ఇనుప తీగల మీదకు పాకించాలి. ఈ రెండు పిలకలు ముఖ్యమైన కొమ్మలుగా తయారవుతాయి. వీటి నుండి మరల ప్రక్క కొమ్మలు 40-45 సెం.మీ. దూరంలో యుండేటట్లు పెంచాలి. ముఖ్య కాండాలను తూర్పు-పడమర దిశల్లో ప్రాకించటం వలన సూర్యరశ్మి తాకిడి నుంచి పైరును రక్షించవచ్చు.

కొమ్మలు కత్తిరించటం(ప్రూనింగ్)

హైదరాబాద్ చుట్టు ప్రక్కల సంవత్సరానికి రెండుసార్లు అనగా ఒకసారి వేసవిలోను(మార్చి-ఏప్రిల్ మాసాల్లోను), మరోసారి శీతాకాలంలోను(సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లోను) కొమ్మలను కత్తిరించాలి. కొమ్మలు కత్తిరించిన 40 నుంచి 60 రోజుల లోపల పూత గెలల(ప్రూట్ బడ్) వ్యత్యాసాలు ఏర్పడతాయి. కావున ఈ సమయంలో నత్రజని ఎరువులు వేయరాదు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో కాపు కొరకు కొమ్మలను కత్తిరించాలి. బాగా ముదిరిన కొమ్మలను కత్తిరించి ఆకులను పూర్తిగా తీసివేయాలి. అనాబ్-ఇ-షాహి రకానికి 5 నుండి 7 కణుపులు ఉండేటట్లు, సీడ్లెస్ రకానికి 5-12 కణుపులు ఉండేటట్లు కత్తిరింపు చేయాలి. మబ్బు, వర్షం లేని వాతావరణంలో ఈ కత్తిరింపులు చేయాలి. లేకపోతే తెగుళ్ళ త్వరగా వ్యాప్తి చెందుతాయి.

రెండు ఋతువుల్లోను కత్తిరింపు(ప్రూనింగ్) చేయటానికి ముందుగా ద్రాక్ష మొక్క చుటూ 15-20 సెం.మీ. లోతు మట్టిని తీసి మొదలుకు ఎగదోయాలి. పశువుల ఎరువును చెట్టు చుటూ కుదుళ్ళలో సమపాళ్ళలో వేసి తర్వాత రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పాలి. రసాయనిక ఎరువులను చెట్టు బోదెకు 60 సెం.మీ. దూరంలో 15 సెం.మీ. లోతులో వేయటం వలన చెట్టు వేరు త్వరగా తీసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎరువులు వేసిన వెంటనే నీరు పెట్టాలి.

ఎరువులు(కాపుకొచ్చిన తోటలకు ఎకరాకు కిలోల్లో సంవత్సరానికి)

ఎరువులు

నత్రజని

భాస్వరం

పోటాష్

సేంద్రియ ఎరువులు

80

80

160

రసాయనిక

120

120

240

మొత్తం పోషక పరిమాణం

200

200

400

పంట వివిధ దశలలో వేయాల్సిన ఎరువుల శాతం

పోషకాలు

వేసవి కత్తిరింపులు

శీతాకాలం కత్తిరింపులు

కత్తిరించే ముందు

కత్తిరించిన 1-30 రోజులకు

కత్తిరించిన 60-120 రోజులకు

కత్తిరించే ముందు

కత్తిరించిన 1-60 రిజులకు

కత్తిరించిన 60-120 రోజులకు

నత్రజని

-

40

-

-

30

30

భాస్వరం

60

-

-

40

-

-

పోటాష్

-

-

40

-

40

20

వేసవిలో తీగల కత్తిరింప చేసిన తర్వాత 45 రోజులకు(పూత గెలల వ్యత్యాసం ఏర్పడే సమయం) ఆకు తొడిమలను (పీటియోల్స్) విశ్లేషణ చేస్తే, ద్రాక్ష మొక్కల్లో ఏయే పోషక పదార్ధాలు లోపంగా ఉన్నాయో లేక ఎక్కువగా వున్నాయో తెలుసుకోవచ్చు. ఈ విశ్లేషణ కొరకు దాదాపు 200 ఆకు తొడిమలను (కొమ్మ క్రింద నుంచి 5వ ఆకు తొడిమ) తోటలో అక్కడక్కడా సేకరించాలి.

సూక్ష్మపోషక పదార్థ లోపాలు

1. జింకు: దీని లోపం ముఖ్యంగా లేత ఆకుల మీద కనిపిస్తుంది. ఆకులు చిన్నవిగా, సన్నగా వుండి ఈనెలు పత్రహరితాన్ని కోల్పోతాయి. లోపం తీవ్రంగావున్నప్పడు ఆకుల తొడిమలు వెడల్పుగా తయారవుతాయి. ద్రాక్ష గుత్తులలో పరిపక్వతకు రాని చిన్న చిన్న పండ్లు ఏర్పడతాయి.

నివారణ : 2గ్రా. జింకు సల్ఫేటు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

2. మెగ్నీషియం: దీని లోప క్షణాలు ముందుగా ముదిరిన ఆకులపైన గమనించవచ్చు. క్రమేపి ఈ లక్షణాలు లేత ఆకులపై కూడ చూడవచ్చు. ఈనెలు మాత్రం పచ్చగా వుండి, ఆకులలోని మిగతా భాగం పత్రహరితాన్ని కోల్పోతుంది. ఈ లోపం తీవ్రంగా వున్నప్పడు ఆకులు ఊదారంగులోకి మారటం జరుగుతుంది.

నివారణ : 2గ్రా. మెగ్నీషియం సల్ఫేటు లేదా 1గ్రా. మెగ్నీషియం ఆక్సైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

3. బోరాన్: దీని లోపం ముఖ్యంగా లేత ఆకులపైన కనిపిస్తుంది. దీని వలన ఆకులు వంకరగాను, పెలుసుగాను తయారవుతాయి. పూల గుత్తులు ఎండిపోతాయి. ద్రాక్ష గుత్తులు గిడసబారిన పండ్లు కలిగి వుంటాయి.

నివారణ : బోరాక్స్ 1-2 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నీటియాజమాన్యం

బిందు సేద్యం ద్వార ద్రాక్షకు అవసరమైన నీటి పరిమాణం

ఎండాకాలం కత్తిరింపుల తరువాత

నీటి అవశ్యకత (కి.లీ./ఎకరాకు)

0 నుండి 40 రోజుల వరకు

38.4-48.0

41 నుండి 100 రోజుల వరకు

19.2-28.8

101 రోజుల నుండి శీతాకాలం కత్తిరింపూల  వరకు

12.0-16.0

శీతాకాలం కత్తిరింపుల తరువాత

 

0 నుండి 45 రోజుల వరాకు

16.0-19.2

46  నుండి 75 రోజుల వరకు

7.2-12.0

76 నుండి 110 రోజుల వరకు

20.0-36.0

111 నుండి ద్రాక్ష కోత వరకు

28.8-35.2

ద్రాక్ష గుత్తుల యొక్క పరిమాణం, నాణ్యత పెంచటం

థాంప్సన్ సీడ్లెస్లో పండు పరిమాణం, నాణ్యత పెంచవలసినచో 'జిబ్బరిలిక్ యాసిడ్" అనే హార్మోను(గ్రోత్ రెగ్యులేటర్)ను పైరుపై సిఫార్సు చేసిన విధంగా వుపయోగించాలి.

కాండంపై 0.5 నుండి 1 సెం.మీ. వెడల్పు బెరడు తీయటం వలన పండ్ల పరిమాణం మరియు గుత్తి యొక్క నాణ్యత కూడా వృద్ది అవుతుంది. ఈ పద్ధతినే “గర్జిలింగ్" అంటారు.

కోత మరియు ప్యాకింగ్

ద్రాక్ష పండ్లు తీగపైనే పక్వానికి వచ్చినపుడు కోస్తారు. ఎందుకంటే పండ్ల కోసిన తర్వాత దాని పక్వదశలో ఏమి మార్పురాదు. పిందె పడినప్పటినుండి పక్వానికి వచ్చే కాల వ్యవధి సాగుచేయబడిన రకం, పంట దిగుబడి మరియు వాతావరణంపై ఆధారపడి యుంటుంది.

సామాన్యంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మొత్తగా, తీయగా వుంటే గుత్తి కోతకు వచ్చినట్లు సూచన. తెల్ల ద్రాక్ష బాగా తయారయినపుడు అంబర్ రంగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్ష బాగా రంగు వచ్చి పైన బూడిద వంటి పొడితో సమానంగా కప్పబడినట్లు కనబడుతుంది. పండ్లలో మొత్తం కరిగే ఘన పదార్ధాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిస్తాయి. అనాబ్-ఇ-షాహి 18–20 డిగ్రీలు మరియు థాంప్సన్ సీడ్లెస్ 21–22 డిగ్రీల బ్రిక్స్ రాగానే కోయవచ్చు.

స్సస్యరక్షణ

పురుగులు

ప్లే బీటిల్స్ : వీటి ఉధృతి సెప్టెంబర్-నవంబర్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలపు కత్తిరింపుల తరువాత వచ్చే చిగుర్లను తినటం వలన పంటకు నష్టం కలుగుతుంది. వీటి నివారణకు వర్షాకాలంలో వదులుగా ఉన్న బెరడును తీసివేయాలి. వేసవిలో మొక్కల మధ్య దున్నుకోవాలి. కార్బరిల్ 3గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పిండి పురుగులు(మీలీ బగ్) : జనవరి-మార్చి మాసాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు రసం పీల్చటం వలన కొమ్మలు పెరగవు. ఆకులు ముడతలు పడి వుంటాయి. కొమ్మల మీద, ద్రాక్ష గుత్తుల మీద తేనె వంటి పదార్థం ఏర్పడి ఆ తరువాత నల్లని బూజు తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు కాండం మీద వున్న పిండి పురుగుల సముదాయాన్ని గోనె సంచి ముక్కతో నలిపి వేయాలి. బెరడు తీసి కార్బరిల్ 6గ్రా. + కాపర్ ఆక్సీక్లోరైడ్ 10గ్రా. +వేపనూనె 1 మి.లీ. + జిగురు 1 మి.లీ. లీటరు నీటికి కలిపి కాండం మీద పూయాలి. ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి ఆస్ట్రేలియన్ లేడిబర్ట్ బిటిల్స్. అనే పరాన్నజీవులను ఒక్కొక్క మొక్కకు 8-10 వంతున వదలటం వలన దీని ఉధృతిని తగ్గించవచ్చు. పరుగు ఆశించిన కొమ్మలను, ఆకులను ద్రాక్ష గుత్తులను కత్తిరించి నాశనం చేయాలి. డైక్లోరోవాస్ 2 మి.లీ. లేదా మిథోమిల్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

త్రిప్స్ : దీని ఉధృతి డిసెంబరు-ఫిబ్రవరి మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. వీటి వలన కాయల మీద మచ్చలు ఏర్పడటం వలన మార్కెట్కు పనికిరావు. వీటి నివారణకు ద్రాక్షతోట వెలుపల, లోపల కలుపు మొక్కలు లేకుండ చూడాలి. డైమిధోయేట్ లేదా ఆక్సిడెమిటాన్ మిధైల్ 2మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 0.25గ్రా. లేదా పిప్రోనిల్ 1 మి.లీ. లేదా ప్రైనోసైడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

లదైపురుగులు (శనగపచ్చ పురుగు మరియు పొగాకులద్దె పురుగు): వీటి ఉధృతి నవంబర్-మార్చి మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవి గెలలను, కాయలను కత్తిరిస్తాయి. కాయలకు రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు పొగాకులదై పరుగు గ్రుడ్ల సముదాయాన్ని గుర్తించి ఏరివేయాలి. కొమ్మ చివరి భాగాలను త్రుంచాలి. లద్దె పురుగులను చేతితో ఏరివేయాలి. లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 4 వంతున పందిరిపైన 1 1/2 అడుగుల ఎత్తున కట్టుకోవాలి. ఆయా లద్దె పరుగులకు సంబంధించిన ఎన్.పి.వి. ద్రావణాన్ని ఎకరానికి 250 యల్.ఇ. చొప్పన పిచికారి చేసుకోవాలి. క్లోరోపైరిఫాస్ 2.5మి.లీ. లేదా మిథోమిల్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాండం తొలుచు పరుగు : దీని ఉధృతి జులై-ఏప్రిల్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. దీని వలన మొక్కలు బలహీనపడి కాపు తగ్గుతుంది. దీని నివారణకు జులై, ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో మొక్కమీద వున్న గుడ్లను గుర్తించి తీసివేయాలి. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ పురుగు చేసిన రంధ్రాలలో పెట్రోలును గాని, డైక్లోరోవాస్ను గాని పోసి మూసివేయాలి. ఒక్కొక్కరంధ్రంలో అల్యూమినియమ్ ఫాస్ఫైడ్ సగం బిళ్ళను పెట్టి తడి మట్టితో మూసివేయాలి. అవసరమైతే కాండాన్ని చీల్చి లద్దె పురుగును తీసివేయాలి.

తెగుళ్ళ

పక్షి కన్ను తెగులు (ఆంత్రాక్నోస్): ఈ తెగులు సోకిన ఆకులమీద గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి వీటి మధ్య భాగం నల్లగాను మరియు మచ్చల అంచుల భాగం పసుపు రంగులో ఉంటుంది. తీగల మీద మరియు లేత కొమ్మల మీద గుండ్రని లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ తెగులు సోకిన కాయల మీద నల్లని మచ్చలు పక్షి కన్ను ఆకారాన్ని పోలి యుంటాయి. దీని నివారణకు ప్రారంభ దశలో తెగులు సోకిన మొక్కల భాగాలను కత్తిరించి నాశనం చెయ్యాలి. లీటరు నీటికి కార్బండైజిమ్ 1గ్రా. లేదా థయోఫానేట్ మిథైల్ 1గ్రా. లేదా మాంకోజెబ్ 2.5గ్రా, లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2.0గ్రా, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5గ్రా. లేదా ప్రోపినెబ్ 3గ్రా. లేదా ఇప్రాడిన్ 0.6 మి.లీ. లేదా డైఫెన్ కొనజోల్ 0.6 మి.లీ. కలిపి ఏదో ఒకదానిని పిచికారి చేయాలి. ఈ తెగులు ముఖ్యంగా లేతాకులపై కనిపించి వర్షం కురిసిన ఎడల వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకక ముందే తెగులు వ్యాప్తికి అనుకూల పరిస్థితులు వున్న ఎడల అంతర్వాహిక శిలీంద్ర నాశనిలను పిచికారి చేయాలి.

మజ్ఞగ తెగులు(డౌనీ మిల్యూ): ఈ తెగులు ఆకుపచ్చని భాగాల మీద ఆశిస్తుంది. కత్తిరించిన 20 నుండి 75 రోజుల వరకు అధికంగా ఆశిస్తుంది. మొదట ఆకుల పైభాగాన లేత పసుపు రంగులో చిన్న మచ్చలు కనపడతాయి. ఆకుల క్రింద భాగాన తెల్లని బూజు ఏర్పడుతుంది. మచ్చలు ఆకు అంతటా వ్యాపించి, ఆకులు గోధుమ రంగుగా మారి రాలిపోతాయి. పుష్భ గుచ్చాలు కూడా గోధుమ రంగుగా మారి రాలిపోతాయి. పండ్లు గోధుమ రంగుగా మారి మొత్తబడతాయి. దీని నివారణకు ఈ తెగులు సోకిన ఆకులు, కొమ్మలు, పండ్లను పోగుచేసి కాల్చివేయాలి.

1. శాతం బోర్లోమిశ్రమం (ఒక కిలో కాపర్ సల్ఫేట్ను 50 లీ.ల నీటిలో మరియు 1కిలో సున్నం 50లీ.ల నీటిలో విడివిడిగా కలుపుకొని తర్వాత ఈ రెండు ద్రావణాలను కలిపిన ఎడల 1శాతం బోర్లోమిశ్రమం తయారవుతుంది) లేదా లీటరు నీటికి 2గ్రా, మెటలాక్సిల్ ఎమ్.జడ్ లేదా సైమాక్సానిల్ ఎమ్-జడ్+మాంకోజెబ్ 3గ్రా. లేదా ప్రొపినెబ్ 3గ్రా. లేదా ఫాసటైల్ అల్యూమినియం 2గ్రా. లేదా ఫెనామిడోన్+మాంకోజెబ్ 1.5గ్రా. లేదా ఇప్రో హెలికార్చ్ + ప్రొపినెబ్ 2.5గ్రా. కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసే ముందు ప్రారంభ దశలో ఉన్న తెగులు సోకిన మొక్కల భాగాలన్నింటిని కాల్చి వేయాలి. తెగులు సోకి ఉన్నపుడు నత్రజని ఎరువులు వాడరాదు. అలాగే జిబ్బరిలిక్ ఆమాన్ని కూడ వాడరాదు.

బూడిద తెగులు(పౌడరీమిల్యూ)

లేత ఆకుల పైభాగాన తెల్లని బూడిద రంగు మచ్చలు కన్పిస్తాయి. తెగులు తీవ్రంగా వచ్చినప్పుడు ఆకు మొత్తం తెల్లని బూడిదతో కప్పబడి ఆకుల రంగు కూడ మారుతుంది. పండ్ల మీద తెల్లటి మచ్చలు కన్పించి, పండ్ల రంగు మారి పగులుతాయి. దీని నివారణకు తెగులు సోకిన మొక్కల భాగాలను తీసివేసి, నాశనం చేయాలి. నీటిలో కరిగే గంధకపు పొడి 2గ్రా. లేదా మైక్రోసెల్(ఫ్లోయబుల్ గంధకం)2గ్రా. లేదా హెక్సాకొనజోల్ 1 మి.లీ. లేదా పెన్కొనజోల్ 0.5మి.లీ. లేదా బ్రెడెమిఫాస్ 1గ్రా, లేదా పైరోక్లోస్లోబిన్ 0.5గ్రా, లేదా అజాక్ష్పిప్లోబిన్ 0.5 మి.లీ. లేదా టెబుకొనజోల్ 0.75మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ద్రాక్ష ఎగుమతికి నిర్దేశించిన ప్రమాణాలు

  • థాంప్సన్ సీడ్లెస్ రకం ఎగుమతికి మిక్కిలి అనువైనది.
  • నేల ఉదజని సూచిక(పి.హెచ్) 6 నుండి 8 మధ్య వుండాలి.
  • సాగునీటిలో "క్లోరైడ్స్ 3 మిల్లీ ఈక్విలెంట్స్కన్న మించి వుండరాదు.
  • ద్రాక్ష గుత్తులు దుమ్ము చీడపీడలు లేకుండ శుభ్రంగా వుండాలి.
  • గుత్తుల పరిమాణం సమానంగా వుండి లేత ఆకుపచ్చ రంగులో వుండాలి.
  • ద్రాక్ష గుత్తి బరువు 300 నుండి 500 గ్రాముల వరకు వుండాలి.
  • ద్రాక్ష గుత్తిలోని కాయ 18మి.మీ. వ్యాసం కలిగి వుండాలి.
  • ద్రాక్ష గుత్తిలో కనీస చక్కెర శాతం 18 వరకు వుండాలి.
  • ద్రాక్ష గుత్తుల మీద పిచికారి చేసిన సస్యరక్షణ మందుల అవశేషాలు వుండకూడదు.

ద్రాక్ష సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: "ప్రిన్సిపల్ సైంటిస్ట్(ఎంటమాలజి)&హెడ్, ద్రాక్ష పరిశోధనా స్థానం, ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్-500 030", ఫోన్ నెం. 040-20025322

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate