অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మిరప

మిరప

ఆంధ్రప్రదేశ్ లో మిరపను 4.41లక్షల హెక్టార్లలో సాగుచేయుచూ 5.14 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో భారతదేశంలోనే అత్యధిక ఉత్పాదకత 3468 కి./హె.తో ప్రధమ స్థానంలో ఉన్నది.

నేలలు

వర్షాధారపు పంటకు నల్లనేలలు, నీటి ఆధారపు పైరుకు నల్లనేలలు, చల్మానేలలు, లంకభూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం.

నేల తయారి

మిరపకు మెత్తటి దుక్కికావాలి. 3-4 సార్లు దుక్కిదున్ని 2 సార్లు గుంటకతోలాలి.

విత్తన మోతాదు

నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు (ఒక ఎకరానికి సరిపడునారు). విత్తనం ఎదబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాలి.

విత్తన శుద్ధి

కిలో మిరప విత్తనానికి మొదటగా వైరస్ తెగుళ్ళ నివారణకుగాను 150 గ్రా. ట్రెసోడియం ఆర్లోఫాస్ఫేట్ను, తర్వాత రసం పీల్చే పురుగుల నివారణకుగాను 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను, చివరగా ఇతర తెగుళ్ళ నివారణకుగాను 3 గ్రాముల కాప్లాన్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

నారుమడి యాజమాన్యం

ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. ఒక మీటరు వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు ఉండేటట్ల ఎత్తైన నారుమడులు చేసి మధ్యలో 30 సెం.మీ. కాలవలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రా, విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80గ్రా, ఫిప్రానిల్ గుళికలను వాడినచో రసం పీల్చు పరుగులును(నల్లి తప్ప) నివారించవచ్చు.

సెంటుకు 1 కిలో వేపపిండి వేయాలి. ఒక శాతం బోర్లోమిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ను లీటరు నీటిలో కలిపిన నీళ్ళతో నారుమడిని 9వ రోజు, 13వ రోజు తడపాలి. ఆరు వారాల వయస్సుగల మొక్కలు నాటుకోవాలి.

రకాలు

  • జి-3 : పొడవు కాయలు. వరాధారపు పైరుకు అనుకూలం. దిగుబడి వరాధారంగా 6-7 క్వి/ఎకరాకు, నీటి వసతి కింద 15-18 క్వి/ఎకరా,
  • జి-4 (భాగ్యలక్ష్మి) : కాయలు సన్నగా, పొడవుగా ఉంటాయి. పచ్చికాయకు, ఎండుకాయకు అనుకూలం. వైరస్ను తట్టుకొంటుంది. దిగుబడి 40-45 క్వి/ఎకరాకు.
  • జి-5 (ఆంధ్రజ్యోతి) : కాయలు పొట్టిగా, లావుగా ఉంటాయి. నెలూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో నీటి వసతి కింద సాగుకి అనుకూలం. దిగుబడి 40-50 క్వి/ఎకరాకు.
  • సి.ఎ. 960 (సింధూరు) : కాయలు పొడవుగా, లావుగా ఉంటాయి. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి అనుకూలం. నీటి వసతి కింద వేయదగిన రకం. త్వరగా కాపు కొస్తుంది. కారం తక్కువ. వేసవి పైరుకు అనుకూలమైన రకం. దిగుబడి 50-55 క్వి/ఎకరాకు.
  • ఎల్.సి.ఎ. -200 (కిరణ్) : పొడవైన కాయలు. తెలంగాణా ప్రాంతంలో నీటి ఆధారపు పైరుకు అనుకూలం. దిగుబడి 40-45 క్వి/ఎకరాకు.
  • సి.ఎ. 1068 (అపర్ణ) : లావైన, పొడవైన కాయలు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నీటి వసతి కింద పచ్చిమిర్చి, ఎండుమిర్చిలకు అనుకూలం. దిగుబడి 35-40 క్వి/హె.
  • యల్.సి.ఎ. 235 (భాస్కర్) : కాయల పొడవు తక్కువ. కారం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో వరాధారంగానూ మరియు నీటి వసతి కింద సాగుకు అనుకూలం. వైరస్ను బాగా తట్టుకొంటుంది. అన్ని జిల్లాలకు అనుకూలం. దిగుబడి 50-60 క్వి/హె.
  • యల్.సి.ఎ. 206 (ప్రకాష్) : పొడవైన కాయలు గల రకం. పచ్చిమిర్చికి, ఎండుమిర్చికి అనుకూలం. వరాధారం కిందా, నీటి వసతి కిందా సాగుకు అనుకూలమైన జాతీయరకం. దిగుబడి 45-50 క్వి/హె.
  • యల్.సి.ఎ. 305 (లాం, 805) : పొడవైన, లావైన కాయలు కలిగిన రకం. పచ్చి మిర్చికి, ఎండుమిర్చికి, నీటిఆధారపు పైరుకు అనుకూలం. దిగుబడి 50-60 క్వి/హె.
  • యల్.సి.ఎ. 334(లాం 334) : ఈ రకము 2006 సంవత్సరములో లాం 334 పేరిట విడుదల చేయబడినది. మొక్కలు గుబురుగా, ఎత్తుగా పెరుగుతాయి. వైరస్ను తట్టుకుంటుంది. కాయలు 7-8 సెం.మీ. పొడవుతో మంచి ఎరుపు రంగు కలిగి వుంటాయి. వరాధారము మరియు నీటి వసతిన అన్ని జిల్లాలలో సాగుకు అనుకూలము. ఎగుమతికి అనుకూలమైన రకము. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని సుస్థిర దిగుబడినివ్వగల రకము జాతీయ స్థాయిలో ప్రశాంత్ అనే పేరుతో విడుదల చేయబడినది.
  • యల్ సి.ఎ 353 : మొక్కలు గుబురుగా మధ్యస్థంగా వుంటాయి. కాయలు లేత ఆకుపచ్చ రంగులో 7 నుండి 9 సెం.మీ. పొడవుతో సన్నంగా ఉంటాయి. పచ్చిమిర్చికి మరియు ఎండుమిర్చికి అనువైన రకము. యల్.సి.ఎ. 384 రకము కన్నా 20-25 రోజులు ముందుగా కాపుకు వస్తుంది. కాయలు పండిన తరువాత మంచి నిగారింపుతో ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి. జాతీయ స్థాయిలో లాం-353 అనే పేరుతో విడదల చేయబడినది. దిగుబడి 60-65 కి./హె.
  • పాప్రికా రకాలు : పాప్రికా రకాల కాయలు లావుగా, పొడవుగా వుండి కారం తక్కువ, రంగు ఎక్కువగా ఉంటాయి. ఈ రకాలను ఊరగాయ పచ్చళ్ళకు, సలాడ్స్ తయారికి, ఓలియోరెసిన్కు ఎక్కువ వాడతారు. ఈ రకమునకు యూరోపియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకాల ప్రాముఖ్యం దృష్టిలో పెట్టుకొని లాంఫారంలో 1985 వ సంవత్సరం నుండి ఎగుమతికి అనువైన రకాల రూపకల్పనకు చర్యలు చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పండించే లంక మిరప రకాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పండించే లావు కాయ రకాలను అమెరికా, జపాన్, పాప్రికా రకాలతో సంకరం చేసి మన రాష్ట పరిస్థితులకు అనువైన రకాలను రూపొందించటం జరుగుతుంది. దీని ఫలితంగా ఎల్.సి.ఎ.424, ఎల్.సి.ఎ. 436, ఎల్.సి.ఎ. 444, 435 గుర్తించటం జరిగింది.

విడుదలకు సిద్ధంగా వున్న రకము:

  • యల్.సి.ఎ.424 : ఇది పాప్రికా రకము. మొక్కలు గుబురుగా పెరుగును. కాయలు 10 - 12 సెం.మీ. పొడవుతో లావుగాను, నిగారింపైన ఎరుపురంగు కలిగి ఉండును. వరంగల్లు లోకల్ కన్నా ముందుగా కోతకు వచ్చును. ఎగుమతికి అనుకూలమైన రకము.

చిరుసంచుల పధకములో ఉన్న రకము:

  • యల్.సి.ఎ. 436 : ఇది పాప్రికా రకపు మిరప కారం లేకుండా ఎక్కువ రంగు కల్గి ఉంటుంది. మొక్కలు మధ్యస్త పొడవుతో కొద్దిగా ప్రక్కలకు పెరుగుతుంది. కాయలు 8 - 9 సెం.మీ.పొడవు కలిగి లేత ఆకుపచ్చ రంగులో వుంటాయి. పండిన కాయలు ఆకర్షణీయమైన ఎరుపు రంగు కల్లి వుంటాయి. కాయ దిగుబడి హెక్టారుకు 45 - 46 క్వింటాళ్ళు వసుంది.

విత్తటం

ఖరీఫ్ : జులై, ఆగష్టు. రబీ : అక్టోబరు, నవంబరు.

నాటటం

6 వారాల వయస్సుగల మొక్కలు నాటటానికి అనుకూలం . వర్బాధారపు పైరుకు 60 x 15 సెం.మీ. దూరంలో పాదుకు ఒక మొక్క చొప్పన, నీటి వసతి కింద 60 x 60 లేదా 75 x 60 లేదా 90 x 60 సెం.మీ.ల ఎడం చొప్పన పాదుకు 2 మొక్కల చొప్పన నాటుకోవాలి.

కలుపు నివారణ, అంతర కృషి

నాటే 1, 2 రోజుల ముందు ఫక్లోరాలిన్ 45% ఎకరాకు ఒక లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీ. లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% 200 మి.లీ. చొప్పున ఏదో ఒకదానిని 200 లీ. నీటిలో కలిపి నాటే 1, 2 రోజుల ముందు పిచికారి చేయాలి. నాటిన 25, 30 రోజుల తర్వాత 15, 20 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి.

ఎరువులు

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి లేదా పచ్చిరొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి. వర్బాధారపు పైరుకు 60 - 40 - 50 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చు ఎరువులను ఒక హెక్టారుకు వాడాలి. ఆరుతడి పైరుకు 300 - 60 - 120 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి.

సస్యరక్షణ

కీటకాలు నివారణ

  1. తామర పురుగులు : రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగమున చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకొంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచి పోతుంది. దీని నివారణకు ఎకరానికి కార్బరిల్ 600 గ్రాములు లేదా ఫాసలోన్ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా ఫిప్రానిల్ 400 మి.లీ. లేదా స్పెనోసాడ్ 75 మి.లీ. లేదా పెగాసస్ 300 గ్రాములు ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. నాటిన 15 మరియు 45వ రోజు ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పన భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యగా ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. రసాయన, సేంద్రియపు టెరువుల సమతుల్యత పాటించాలి. పై మడతతో బాటు క్రింది ముడత(తెల్లనల్లి) కూడా ఉంటే కార్బరిల్ మరియు ఎసిఫేట్ మందులు వాడకూడదు.
  2. కింది ముడుత (తెల్లనల్లి) : తెల్లనల్లి పురుగులు ఆకులరసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి. దీని నివారణకు ఎకరాకు డైకోఫాల్ ఒక లీటరు లేదా నీళ్ళలో కరిగే గంధకం 600గ్రా, పిచికారీ చేయాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ మందులు వాడరాదు. నత్రజని ఎరువులు తగ్గించాలి. పైముడత, క్రింద ముడత ఉధృతి ఒకేసారి గమనించినచో ఉధృతిని బట్టి ఎకరానికి జోలోన్ 400 మి.లీ. లేదా పెగాసస్ 300గ్రా. లేదా ఇంట్రిపిడ్ 400 మి.లీ. పిచికారీ చేసుకోవాలి.
  3. పేను బంక : పేనుబంక లేత కొమ్మల, ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వలన పెరుగుదల తగ్గుతుంది. తియ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు, నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. దీని నివారణకు ఎకరానికి మిధైల్ డెమెటాన్ 400 మి.లీ. లేదా ఎసిఫేట్ 300 గ్రా. పిచికారీ చేయాలి.
  4. పూత పురుగులు : పూత పురుగు దోమ జాతికి చెందినది. పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బతుంది. అండాశయం తొలిచి చూస్తే ఈ ఈగ యొక్క పిల్ల పురుగులను, ప్యూపాలను గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే దాదాపు 40 శాతం వరకు మిరప పూత రాలిపోతుంది. ఈ పురుగు సోకిన ఎడల పూత ఎండి రాలిపోవడం వల్ల కాయలు ఏర్పడవు. ఏర్పడినా కాయలు గిడసబారి పరిమాణము మారిపోయి వంకరలు తిరిగి వుండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్ లో ధర పలకదు. దీని నివారణకు టైజోఫాస్ ఎకరానికి 250 మి.లీ. లేదా మార్షల్ 400 మి.లీ. పిచికారి చేసి వారం రోజుల తర్వాత మరల క్లోరి పైరిఫాస్ 500 మి.లీ. పిచికారీ చేసి ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును.
  5. కాయతొలుచు పురుగు (పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, పచ్చ రబ్బరు పురుగు) : లద్దె పురుగులు మొదటి దశలో ఆకులను నష్టపరచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి. పంటకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి థయోడికార్చ్ 200గ్రా. లేదా ఎసిఫేట్ 300గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. లేదా స్పెనోసాడ్ 75 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 400 మి.లీ. పిచికారీ చేయాలి. సమగ్ర సస్యరక్షణ అవలంభించాలి. పెరుగుదల నియంత్రణ కారులు నవల్యూరాన్ 150 మి.లీ. లేదా డైపూబెంజురాన్ 200 గ్రాములు లాంటి మందులతో గ్రుడ్ల నుండి అప్పడే బయటకు వచ్చే పిల్ల పురుగులను అరికట్టవచ్చును. విషపు ఎరల ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను నివారించవచ్చును. విషపు ఎరను 5 కిలోల తవుడు, 500 గ్రా. కార్బరిల్ లేదా 500 మి.లీ. క్లోరిపైరిఫాస్, 500 గ్రాముల బెల్లంతో తగినంత నీటిని కలిపి తయారు చేయాలి. ఈ విధంగా తయారుచేసిన చిన్న చిన్న గుళికలను సాయంత్రం చేలో సమానంగా చల్లితే నెర్రలలో దాగి ఉన్న పురుగులను రాత్రులందు బయటకు వచ్చి తినటం వలన చనిపోతాయి.
  6. కాయతొలుచు పురుగుల ఉధృతి, ఉనికిని గుర్తించటానికి ఎకరానికి కనీసం 4 లింగాకర్షణ బుట్టలు అమర్చాలి. ఎరలను మాత్రం 25 రోజుల కొకసారి మార్చాలి. వేసవిలో నిద్రావస్థలో ఉన్న పురుగులు బయట పడేలా లోతు దుక్కులు దున్నాలి. విచక్షణా రహితంగా పురుగు మందులు వాడరాదు. ఆకర్షణ పైర్లుగా, ఆముదం, బంతి మొక్కలు చేలో వేసుకోవాలి. జీవనియంత్రణద్వారా శనగపచ్చ పురుగు నివారణకు హెచ్.ఎన్.పి.వి.ని, పొగాకు లద్దె పురుగు నివారణకు ఎస్.ఎన్.పి.వి.ని వాడాలి.

తెగుళ్ళు

  1. నారుకుళ్ళ తెగులు : లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. దీని నివారణకు విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, మరల వారంరోజులకు ఒకసారి, 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటిలో కలిపి లేదా ఒక శాతం బోర్లోమిశ్రమంతో పిచికారి చేయాలి. ఎత్తయిన నారుమడుల్లో నారును పెంచాలి. విత్తనం వత్తుగా విత్తకూడదు. నారుకుళ్ళ తెగులు కనపడిన వెంటనే తడులను ఆపివేయాలి.
  2. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు : వాతావరణం మబ్బుగా ఉండి, ముసురు వరాలు పడినపుడు, ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు పండుబారి రాలి పోవడం జరుగుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. + ఒక గ్రాము స్టెప్లోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  3. సెర్కోస్పారా ఆకుమచ్చ తెగులు : ఆకులపై బూడిదరంగు మచ్చలు ఏర్పడి, ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 500 గ్రా. లేదా కార్బండైజిమ్ 200 గ్రాములు పిచికారి చేయాలి.
  4. కానోఫోరా కొమ్మకుళ్ళు తెగులు : లేత చిగుళ్ళు మాడిపోయి, కొమ్మల కణుపుల వద్ద కుళ్ళు కనపడి కొమ్మలు విరిగి పోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. +1 గ్రా. సైప్లోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి.
  5. కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు : ముదురుకొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొమ్మలు పై నుండి క్రిందకు ఎండుతాయి. పండు కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళి పోతాయి. ప్రాపికొనజోల్ 200 మి.లీ. లేదా డైఫెనకొనజోల్ 100 మి.లీ. పూత సమయంలో, కాయలు పండు బారే సమయంలో పిచికారి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా, కాష్ట్రాన్ లేదా 3 గ్రా. మాంకోజెబ్తో విత్తనశుద్ధి చేయాలి. కాయకుళ్ళు తెగులు సోకిన మొక్కల నుండి విత్తనం సేకరించరాదు.
  6. మొక్కల ఎండు తెగులు : మొక్కలు వడలిపోయి, ఎండిపోయి, పూతపిందె, ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణంతో వడలిపోయిన చెట్ల మొదళ్ళు, చుట్టు ప్రక్కల చెట్ల మొదళ్ళు తడిపి నత్రజని మరియు నీటి తడులు తగ్గించాలి.
  7. బూడిద తెగులు : ఆకుల అడుగున తెల్లటి బూడిద కలిగిన మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి, ఆకులు, కాయలు రాలిపోతాయి. దీని నివారణకు ఎకరానికి నీటిలో కరిగే గంధకం 600 గ్రాములు లేదా కెరాథేన్ 200 మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి.
  8. వైరస్ తెగులు : మొక్కలు గిడసబారతాయి. ఆకులు చిన్నవిగా తయారయి, కుచ్చులుగా మారి, పండు బారతాయి. పూత, పిందె ఆగిపోతుంది. పీనట్ బడ్ నెక్రోసిన్ వైరస్ ఆశించడం వల్ల మొవ్వ భాగం కుళ్ళి ఎండిపోతుంది. వైరస్ తెగులుకు మందులు లేవు. వైరస్ సోకకుండా జాగ్రత్త వహించాలి. వైరస్ను తట్టుకొనేరకాలైన జి 4, యల్.సి.ఎ. 235, 334 రకాలను సాగు చేసుకోవాలి. పేనుబంక, ఆకు ముడుత పురుగులు సోకకుండా ఫిప్రోనిల్/కార్బోఫ్యురాన్ గుళిక మందులు వాడాలి. వైరస్ సోకిన మొక్కల నుండి విత్తనం సేకరించకూడదు. విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వాడకూడదు. విత్తనాన్ని లీటరు నీటికి 150 గ్రా. టైసోడియం ఆర్లోఫాస్ఫేటుతో విత్తన శుద్ధి చేయాలి. చేనుచుటూ జొన్న మొక్కజొన్న మొదలైన ఎత్తైన పైరులు పెంచాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.

మిరప కోతలు

పంట దిగుబడి అధికంగా పొందటానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు క్రోసి పట్టాలపై కాని, సిమెంట్ కళ్ళాలపైనగాని ఆరబెట్టడం శ్రేష్టం. వరాధారపు పైరుకు 3 - 4 కోతలు, నీటి ఆధారపు పైరుకు 6 - 8 కోతలు చేయాలి.

ఎగుమతి కొరకు మిరప నాణ్యతను పెంచటానికి సూచనలు

  1. మొక్కల మీద మిరపకాయలను పండనీయరాదు. ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది. తరుచుగా ఎప్పటికప్పుడు పండిన కాయలు కోయటం వలన దిగుబడులు పెరుగుతాయి.
  2. కాయకోసే ముందు సస్యరక్షణ మందులు పిచికారి చేయరాదు. పిచికారి చేసిన ఎడల మిరప కాయలమీద అవశేషాలుండే ప్రమాదముంటుంది.
  3. అప్లోటాక్సిన్ వృద్ధి కాకుండా మిరప కాయలను పాలిథీన్ పట్టాల మీద లేదా సిమెంట్ గచ్చుమీద ఎండబెట్టాలి.
  4. రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి.
  5. మిరపలో 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా ఎండబెట్టాలి.
  6. ఎండబెట్టేటప్పడు దుమ్ము ధూళి, చెత్త, చెదారం చేరకుండా కాయలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.
  7. కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు, పిల్లులు కోళ్ళు ఎలుకలు మరియు పందికొక్కులు రానీయకుండా చూసుకోవాలి.
  8. తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరుచేయాలి. 9. నిల్వచేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచుల్లో కాయలు నింపాలి.
  9. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్క బల్లల మీద గోడలకు 50-60 సెం.మీ. దూరంలో నిల్వ ఉంచాలి.
  10. అవకాశమున్నచోట శీతల గిడ్డంగుల్లో నిల్వచేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.
  11. కాయలు నిగనిగ లాడుతూ మంచి రంగు రావాలని ఏ విధమైన రసాయనాలను, రంగులను వాడకూడదు. అవి ప్రమాదకరమేకాక నిషేధింపబడ్డాయి.
  12. అకాల వరాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, రంగుకోల్పోకుండా ఆధునిక ద్రయ్యర్లలోగాని లేదా టొబాకో బారన్లలోగాని ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొందవచ్చు.

అంతర్జాతీయ మిరప వాణిజ్యంలో వివిధ దేశాలు

భారతదేశం నుండి మిరప దిగుమతి చేసుకునే దేశాలు

శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండు, సౌదీఅరేబియా, సింగపూర్, మలేసియా, జర్మనీ

మిరప ఉత్పత్తి చేసే దేశాలు

భారత్, చైనా, పాకిస్థాన్, మొరాకో, మెక్సికో, టర్కీ బంగ్లాదేశ్

ఎగుమతిలో భారతదేశానికి ముఖ్య పోటీదారులు

చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్

ఎగుమతికి అనుకూలమైన మిరప రకాలు

  • అధిక మిరప గుజజ్ఞనిచ్చే రకాలు : పూసాజ్వాల, బాడిగడబ్బీ ఎల్.సి.ఎ. - 235, 334, 324, సింధూర్
  • అధిక రంగునిచ్చే రకాలు : ఎల్.సి.ఎ. -206, 304, 305, 357, 424, సింధూర్
  • అధిక ఘాటు కలిగిన రకాలు : ఎల్.సి.ఎ. - 235, 324, 334, పూసాజ్వాల, అపర్ణ, పి.కె.ఎమ్.-1

అమెరికా సుగంధ ద్రవ్యాల వాణిజ్యసంస్థ మిరప దిగుమతికి నిర్దేశించిన పరిశుభ్రత ప్రమాణాలు

పౌండు బరువుకు 4 చనిపోయిన కీటకాల అవశేషాలు, 1 మి.గ్రా. క్షీరజాల మలం, 3% బూజు బరువు, 2.5% కీటకాలు ఆశించి నష్టపడ్డ భాగం, 0.5% ఇతర కలుపబడిన పదార్ధాలు ఈ పరిమితికి మించి ఉండరాదు.

మిరపలో ఎగుమతికి పాటించవలసిన నాణ్యతాప్రమాణాలు

భాగం

పదార్థం

పరిమితి

మిరప కాయలు

ఇతర పదార్థాలు

5 శాతం వరకు

కీటకాల నష్టం

5 శాతం వరకు

మిరప పొడి

బూడిద

1.3 శాతం వరకు

పీచు పదార్థం

3.0 శాతం వరకు

నూనె

2 శాతం వరకు

కాప్సిసిన్ ఆధారంగా మిరపరకాల వర్గీకరణ

పరిధి (%)

కేటగిరి

రకాలు

> 1.00

ఎక్కువ

సీమమిరప, తెల్లసీమమిరప, నైజీరియన్ చిల్లీ (ఆఫ్రికన్)

0.76 – 1.00

మధ్యస్థం నుండి ఎక్కువ

కె2, జవహర్

0.51 – 0.75

మధ్యస్థం

జి4, జ్వాల, మసత్వాడి

0.26 – 0.50

తక్కువ నుండి మధ్యస్థం

యల్.సి.ఎ. -235, జి-4, జి-5, యల్.సి.ఎ 334, యల్.సి.ఎ 353

0.10 – 0.25

తక్కువ

సింధూర్, ఎల్.సి.ఎ. - 206. యల్.సి.ఎ 424, యల్.సి.ఎ 436.

మిరప సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ సైంటిస్ట్ (హార్టికల్చర్), ఉద్యాన పరిశోధనా స్థానం, లాం ఫారం, గుంటూరు - 522 034, ఫోన్ నెం. : O863-2524017

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/4/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate