অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రేగు

రేగు పూర్తిగా వర్షాధారంపై పెరగగలదు. గాలిలో తేమ తక్కువగా ఉన్నఉష్ణమండలాల్లో కూడా పెరగగలదు. మన రాష్ట్రంలో రేగు సుమారుగా 5,000 ఎకరాల్లో సాగుచేయబడి 50 వేల టన్నుల దిగుబడినిస్తుంది.

నేలలు

తక్కువ లోతైన నేలల నుండి అతిలోతైన మరియు గరప నుండి ఇసుక రేగడి వరకు అన్ని నేలల్లో రేగును సాగుచేయవచ్చు. ఆమ్ల, క్షార లక్షణాలున్న నేలలు, ఉదజని సూచిక 6-8 వరకువున్న నేలలు, గరప, ఎర్రని, నల్లని, తేలికపాటి లోతైన క్షార భూములందు సాగుచేయవచ్చు.

వాతావరణం

రేగు తీవ్రమైన చలికితట్టుకొని, వేసవిలో ఆకులు రాల్చి బ్రతుకుతుంది. మార్చి నుండి మే నెల వరకు నిద్రావస్థలోనికి పోయి, ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకొంటుంది. సముద్రమట్టము నుండి 1000 మీటర్ల ఎత్తువరకు భూముల్లో పెరుగుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువైన కొద్ది దీని పెరుగుదలకు ఆటంకం కలుగుతూ వుంటుంది. కాబట్టి గాలిలో తేమ తక్కువగల ప్రాంతాలు సాగుకు అనుకూలం.

రకాలు

 • గోల : వర్బాధారంగా సాగుచేస్తున్నప్పడు 6 - 10 సంవత్సరాల వయస్సులో చెట్టుకి 45-50 కిలోల పండ్ల దిగుబడి నిస్తుంది. అదే నీటి వసతితో అయితే 80 - 100 కిలోల దిగుబడినిస్తుంది. పండ్లు గుండ్రంగా, పసుపు రంగుతో కూడిన మృదువైన తోలు కలిగి ఉంటాయి. కాయ బరువు 28 - 35 గ్రా, వరకు ఉంటుంది.
 • కైథిలి : కోత దశలో నారింజరంగుకు మారి రుచిగా ఉంటుంది. 6 - 10 సం.ల వయస్సులో వర్బాధారంగా 40 - 45 కిలోల దిగుబడి నిస్తుంది. కాయ బరువు 30 గ్రా. ఉంటుంది. పండు అండాకారంలో లేక అండాకారంగా కోలగా ఉండి మృధువైన తోలు కలిగి ఉంటాయి.
 • ఉమ్రాన్ : పండ్లు కోలగా పెద్దవిగా ఉండి, పైన చిన్న చిన్న బుడిపెలుంటాయి. వరాధారంగా చెట్టుకి 40 కిలోల దిగుబడినిస్తుంది. పండు బరువు 26 – 32 గ్రా. ఉంటుంది.
 • సెబ్ : పండు ఆపిల్ ఆకారం కల్లి యుంటాయి. చెట్టు నిటారుగా పెరుగుతుంది. వరాధారంగా దాదాపు 40 - 45 కిలోల దిగుబడినిస్తుంది. పండు బరువు 30 గ్రా. ఉంటుంది.
 • ముందియా : పండుకోలగా, పరిమాణము చిన్నదిగా ఉంటుంది. దిగుబడి 30 నుండి 35 కేజీలు ఉండును దీర్ఘకాలపు పంట. పండు బరువు దాదాపు 14 నుంచి 18 గ్రాములు ఉండును.
 • టికడి : పండ్లు అండాకారంగా కోలగా వుండి పండుకొన భాగంలో మొనతేలి వుంటుంది. పక్వానికి వచ్చినపుడు ఎరుపు రంగుకు మారుతుంది. పండ్లు చాలా రుచిగా వుంటాయి (టి.యస్.యస్. 25 – 27o). వర్బాధారం క్రింద చెట్టుకి 20 - 25 కిలోల దిగుబడినిస్తుంది. ఈ రకం పండు ఈగను సమర్థవంతంగా తట్టుకొంటుంది. కాయ బరువు 5-10 గ్రా.
 • గంగ రేగు : పై తెలిపిన 5 రకములు ఉత్తర భారతదేశంలో అభివృద్ధిపరచినవి. మన రాష్ట్రంలో లభ్యమయ్యే గంగరేగు అధిక దిగుబడినిస్తుంది. దీనిలో కండకన్నా విత్తనశాతం అధికం. ధర మరియు తీపి తక్కువ.

పైన తెలిపిన రకాలే కాకుండా గోమకీర్తి, కర్కి బనారసి కర్కి, పొండ, చమేలి, కెటకి రకాలను సాగు చేసుకోవచ్చు.

మొగ్లంట్ల ద్వారా వ్యాప్తి చేసిన పైరకాలన్నీ మూడవ సంవత్సరం నుండి కాపునిస్తాయి. కాని లాభదాయకమైన దిగుబడిన 5 - 6 సంత్సరాల నుండి ఇస్తాయి. కాపుని నాలుగవ సంవత్సరం నుండి ఆపుకోవటం మంచిది. అంతకు ముందు సంవత్సరాలలో పూతకు వచ్చినా తీసివేయడం మంచిది. ఒకే పొలంలో 2, 3 రకాలను సాగుచేయటం వలన ఫలదీకరణం జరిగి మంచి దిగుబడులు రావటానికి అవకాశం కల్పించాలి.

వ్యాప్తి

రేగు మొగ్గంట్ల ద్వారా వ్యాప్తి జరుగుతుంది.

నాటటం

వరుసకు వరుసకు మరియు మొక్కకు మొక్కకు మధ్య 6 x 6 మీ. దూరంలో నాటుకోవాలి. 60 x 60 x 60 సెం.మీ. గోతులను మే - జూన్ నెలల్లో తీసి, నెల రోజులు ఎండనివ్వాలి. గోతులందు 15 కిలోల మక్కిన పశువుల పెంట, 1 కిలో సూపర్ఫాస్ఫేట్, 100 గ్రా, ఫ్యూరడాన్ గుళికలను పైమెత్తటి మట్టితో కలిపి గోతులను పూడ్చాలి. తర్వాత మొగ్లంట్లను గుంతల మధ్యలో అంటుభాగం భూమిపైకి ఉండేట్లుగా నాటుకోవాలి. జూలై నుండి అక్టోబర్ వరకు నాటటానికి అనువైన సమయం.

నీటి యాజమాన్యం

వర్షాధారంగా సాగు చేసేటప్పుడు మొదటి 2 - 3 సంవత్సరాలు పిచ్చరు పద్ధతిలో నీరు పెట్టాలి. ఈ పద్ధతిలో 20 లీటర్ల నీరు పట్టే మట్టికుండలు లేదా కడవలను డ్రిప్ సర్కిల్లో భూమిలో పాతిపెట్టాలి. ఈ విధంగా కుండలను ప్రతి చెట్టుకు అమర్చాలి. కుండకు క్రింద భాగాన రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుడ్డ బత్తిని అమర్చి కుండనిండా నీరుపోసి, నీరు ఆవిరి అయిపోకుండా పైన మూతపెట్టాలి. ఇట్లా చేయడం వలన తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను బ్రతికించుకోవచ్చు. నీటి వసతి వున్నప్పడు డ్రిప్ విధానంలో నీటిని పారించటం ద్వారా 50-60 శాతం నీరు ఆదా అవుతుంది. అంతేకాకుండా 20-30 శాతం ఎరువులు కూడా ఆదా అవుతాయి. పూత దశలో వున్నప్పడు నీరు ఎక్కువగా పెట్టరాదు. కాయలు పెరిగే దశలో నీటివసతిని కల్పించాలి. వేరుశనగ పొట్టు లేదా వరిపొట్టు తో 8 సెం.మీ. మందంతో చెట్టు పాదులందు మల్చింగ్ చేయాలి.

కత్తిరింపులు

వేరు మూలంపై వచ్చే చిగుళ్ళను ఎప్పటికపుడు కత్తిరించాలి. కాండం నిటారుగా పెరిగేందుకు కర్రపాతి ఊతమిచ్చి 1 మీ. పెరిగిన తర్వాత 4 - 5 కొమ్మలు నాలుగు వైపుల పెరిగేటట్లు చూడాలి. పెరిగిన చెట్లను ప్రతి సంవత్సరం తప్పక మార్చి, ఏప్రిల్ మాసాల్లో కత్తిరింపు చేయాలి. ప్రతి కొమ్మ 15 - 20 కణపుల నుండి కత్తిరించాలి. కత్తిరింపులకు ముందు 10 గ్రా. పొటాషియం నైట్రేట్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయటం ద్వారా మొగ్లంట్లు త్వరగా యిగురిస్తాయి. కత్తిరింపు అయిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి కత్తిరించిన కొమ్మల చివర్లపై పిచికారి చేయాలి.

కలుపు నివారణ

కలుపు నివారణకు కలుపును ఒకసారి తీసివేసి అట్రజిన్ మందును నేలపై పిచికారి చేసిన తర్వాత గైఫోసేట్ 5 మి.లీ./లీటరు కలిపి కలుపుపై పిచికారి చేసుకొని నిర్మూలించాలి.

పత్ర విశ్లేషణ

పత్ర విశ్లేషణకు ఆకులను కత్తిరింపులు అయిన రెండు నెలల తర్వాత సేకరించాలి. ఆరవ ఆకును చివరనుండి, రెండవదశ లేదా మూడవదశ కొమ్మల నుండి 40 ఆకులను సేకరించాలి.

ఎరువులు

ప్రతి సంవత్సరం పశువుల ఎరువుతో బాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని వాడాలి. నత్రజనిలో సగం, మొత్తం భాస్వరం, మొత్తం పొటాష్ కత్తిరించిన వెంటనే పాదుల్లో వేసి, మట్టిని తిరుగ కొట్టాలి. మిగిలిన సగం నత్రజని కత్తిరింపు అయిన 3 నెలల తర్వాత వేయాలి.

ఫర్టిగేషన్

అంటే సిఫార్పు చేసిన ఎరువులను డ్రిప్ ద్వారా వివిధ దశలలో పంపించాలి. దీనివల్ల ఎరువులు వ్యర్థమవకుండా మొక్కకు తగిన పాళల్లో పోషకాలు అందుతాయి. ఫర్టిగేషన్ విధానంలో ఎరువులు ఇచ్చేటప్పడు నీటిలో కరిగే ఎరువులను వాడాలి మరియు ఇచ్చే ఎరువును పంటకాలంలో విభజించుకొని వారానికి లేక 10 రోజుల కొకసారి అవసరాన్ని బట్టి నీటి ద్వారా యివ్వాలి. దీని కొరకు మొదటగా ఒక గంట, డ్రిప్ ద్వారా నీటిని పారించి తర్వాత ఎరువులను డ్రిప్ ద్వారా పంపించాలి. తర్వాత మరలా ఒక అరగంట నీటిని డ్రిప్ ద్వారా వదలాలి. ఈ ఫర్దిగేషన్ ద్వారా ఎరువులు ఆదా అవటమే కాకుండా మంచి నాణ్యమైన పండ్లు మరియు అధిక దిగుబడులు పొందవచ్చు.

సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫార్సు చేసిన ఎరువులలో 50 శాతం సేంద్రియ ఎరువుల రూపంలో యిస్తూ మిగతా 50 శాతం వేపచెక్క పశువుల ఎరువు, జీవన ఎరువులైన అజటోబ్యాక్టర్ (50 - 250 గ్రా.) ఫాస్పోబ్యాక్టీరియా 100 గ్రా. చెట్టుకి వేయటం ద్వారా మంచి దిగుబడి వస్తుంది.

సంవత్సరం

పశువుల ఎరువు (కిలోల్లో)

నత్రజని (గ్రా.)

భాస్వరం (గ్రా.)

పొటాష్ (గ్రా.)

1.

10

100

50

50

2.

20

200

100

100

3.

30

300

150

150

4.

40

400

200

200

5.

50

500

250

250

ఆ తర్వాత

60

750

300

300

అంతర పంటలు

మొదటి మూడు సంవత్సరాలు రేగులో వేరుశనగ, పెసర, అలసంద మొదలైన పంటలను అంతర పంటలుగా వరాధారంతో పండించవచ్చు.

సస్యరక్షణ

 1. కాయతొలుచు పురుగు : రేగు పంట ఎక్కువగా 50 శాతంపైన ఈ పురుగు వలన నష్టపోతుంది. దీని తల్లి పురుగులు ముదురు గోధుమ రంగు రెక్కలు కలిగి వుంటాయి. లార్వాలు తొలిదశలో పసుపు రంగులో వుండి తరువాత గులాబి లేదా ఎరుపు రంగులోకి మారుతాయి. లార్వాలు రేగు పండుని తొలచి లోపల గుజ్జును తింటాయి. ఇలా తొలచిన డొల్లలు విసర్జించిన రెట్టతో నింపుతాయి. ఈ కాయలను తెరచి చూస్తే విత్తనము దగ్గర మలినము వుంటుంది. ఈ పురుగు ఆశించిన కాయలు కుళ్ళిపోతాయి. దీని నివారణకు పాలిట్రిన్ సి 1 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డెల్టామెత్రిన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 2-3 దఫాలుగా బరాణి గింజ సైజు నుండి 10 రోజుల వ్యవధిలో అవసరం మేరకు మందులను కాయ పక్వానికి రావటం మొదలయ్యే ముందు నుంచి పిచికారి చేయాలి. వేసవి కాలంలో చెట్టు పాదుల దగ్గర మట్టిని తిరగ త్రవ్వినటైతే నిద్రావస్థ దశలో నున్న ఈ పురుగును నాశనం చేయవచ్చు. పరుగు ఆశించిన కాయలన్నింటిని ఏరినాశనం చేయాలి.
 2. పండు ఈగ : పండు ఈగ రేగుని చాలా ఎక్కువగా ఆశిస్తుంది. ఎక్కువగా అక్టోబర్ నుంచి ఈ ఈగ ఉధృతి పెరుగుతుంది. పండు ఈగలో రెండు రకాల ఈగలు వున్నాయి. (1) కార్పోమియా వెసువియానా (2) బెక్టోరోసెర.
 3. కార్పొమియా వెసువియానా తల్లి పురుగు గోధుమ పసుపు పచ్చరంగులో ఉంటుంది. మెడమీద గోధుమ రంగు చారలు, నల్లని చుక్కలు ఉంటాయి. వీటి రెక్కలపై నాలుగు పసుపు రంగు గీతలుంటాయి. పిల్ల పురుగులు కాళ్ళు లేకుండా మీగడ తెలుపురంగుతో ముందు భాగం సూదిగా ఉన్న గొట్టపు ఆకారంలో ఉంటాయి. పండు ఈగ పక్వానికి దగ్గర పడినపుడు కాయతొక్క కింద గుడ్లు పెడుతుంది. గుడ్లనుండి వచ్చిన పిల్ల పురుగులు కాయలోని గుజజ్జను తింటాయి. పురుగు ఆశించిన కాయలు ఆకారం చెపోయి ముదురు గోధుమ రంగులో మారి, కుళ్ళి చెడువాసనిస్తాయి. పెరిగిన లార్వాలు చిన్న రంధ్రం ద్వారా కాయనుండి బయటకు వచ్చి క్రిందపడి భూమిలో కోశస్థదశ గడుపుతాయి. భూమిలో 6 – 15 సెం.మీ. లోపల వుంటాయి.

  బెక్టరొసిరా పండు ఈగ రేగు, దోమతోపాటు ఇతర పండ్లను కూడ ఆశిస్తాయి. ఈ ఈగలు గోధుమ రంగులో వుండి, నల్లగా లేదా ఎర్రగా మెడ కలిగి దాని మీద పసుపుపచ్చని చారలు కూడా కన్పిస్తాయి. దీని నివారణకు పండుఈగ ఆశించి రాలిపోయిన పండ్లను ఏరి నాశనము చేయాలి. రేగు చెట్టుక్రింద పాదులోని మట్టిని వీలైనన్ని సార్లు త్రవ్వడం వలన కోశస్థదశ బయటపడుతుంది. పాదులో ప్రతి చెట్టుకు 100 గ్రాముల కార్బరిల్ పొడిమందును మట్టిలో కలిపితే కోశస్థ దశను నివారించవచ్చును.

  ఒక లీటరు నీటికి మలాథియాన్ 1 మి.లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా 5 శాతం వేప కషాయం కలిపి మొదటి దశగా గోలీకాయ దశలో, రెండో విడత 15 రోజుల తర్వాత, మడో విడత కాయ పక్వానికి వచ్చిన తరువాత పిచికారి చేయాలి. పైన తెలిపిన మందులను మార్చి మార్చి పిచికారి చేయడం చాలా ముఖ్యం. మరియు ఆకర్షణ ఎర ద్వారా 1 మి.లీ. మిథైల్యూజెనాల్ + 2 మి.లీ. మలాథియాన్ ఒక లీటరు నీటిలో కలిపి ఇందులోంచి 100 మి.లీ. ఎర మందును పళ్ళెంలో వుంచితే పండు ఈగను సమర్థవంతంగా నివారించవచ్చును. ఒక ఎకరానికి 4 ఎరట్రాప్లు సరిపోతాయి.

 4. కాయ మక్కు పురుగు (అబుకాని హిమాలయాస్) : పెద్ద పురుగులు 5 మి.మీ. పొడవు, ముదురు గోధుమ రంగులోను వుంటాయి. లార్వాలు 4 మి.మీ. పొడవుతో మీగడ తెలుపు రంగుతో వుంటాయి. లార్వాలు చిన్న కాయలలోని గింజలు తింటాయి. ఆశించిన కాయలు పెరగక గుండ్రంగా తయారయి కాయ తొడిమ విపరీతంగా పెరుగుతుంది. ముక్కపురుగు కొన్ని రోజులు కాయలోపల వుండి చిన్న రంధ్రము చేసుకొని బయటకు వస్తుంది. ఈ కాయలు పసుపు పచ్చగా మారి రాలిపోతాయి. కాయతొలిచే పురుగుకు వాడే మందులను ఈ పరుగుకు కూడా వాడి నివారించవచ్చు.
 5. గొంగళి పురుగు : లార్వా దశలో ఈ పురుగులు గుంపులుగా గుంపులుగా పూర్తిగా వెంట్రుకలతో కప్పబడి ఆకుల క్రింది భాగంలో పత్రహరితాన్ని గోకి తింటాయి. పెద్ద గొంగళి పురుగులు ఆకులను, పండ్లను, లేత కొమ్మలను తిని విపరీత నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 6. చెదులు : సాధారణంగా ఎర్రనేలల్లో ఎక్కువగా చెట్లను ఆశిస్తాయి. కాండం పైపొరను తొల్చి తిని చెట్లకు హాని చేస్తాయి. వీటి నివారణకు పాదులో తేమ వుండేటట్లు చూసుకోవాలి. కాండాన్ని గోనె సంచితో రుద్ది 4 మి.లీ. క్లోరిపైరిఫాస్ టి.సి. లీటరు నీటిలో కలిపి కాండం మీద, మొదళ్ళ మీద చెట్టుచుటూ పిచికారి చేయాలి.
 7. ఆకులు తినే పెంకు పురుగులు : పెద్ద పురుగులు లేత గోధుమ వర్ణంలో వుంటాయి. ఈ పురుగులు రాత్రి సమయంలో ఆకులను మరియు లేత కొమ్మలను తినటం ద్వారా విపరీత నష్టం కలుగజేస్తాయి. పగటి సమయంలో కనిపించవు. వీటి నివారణకు పాదులను తిరగ త్రవ్వి నీటిని పారించాలి. కార్బరిల్ 3 గ్రా. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
 8. బూడిద తెగులు : లేత ఆకులపైన, కాయలపైన తెల్లటి మచ్చలు ఏర్పడి తర్వాత అంతా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా చలి ఎక్కువగా వున్నప్పడు నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. ఆకులపై తెల్లగా వ్యాపిస్తుంది. అదే కాయల పైభాగం సున్నం కొట్టినట్లు తెల్లగా మారి కాయల సైజు పెరగక కృశించి రాలిపోతాయి. దీని నివారణకు డైనోకాప్ 1 మి.లీ. లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా టైడేమార్చ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి ఉధృతిని బట్టి 2 - 3 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

దిగుబడి

మొగ్గంట్లు నాటిన మూడవ సంవత్సరం నుండి కాపుకొచ్చినప్పటికి మంచి దిగుబడులు 5 - 6 సంవత్సరాల నుండి వచ్చును. చెట్టుకి వర్షాధారంగా 40 - 50 కిలోల వరకూ, నీటి ఆధారంగా అయితే 80 - 100 కిలోల వరకు వసుంది.

కాపుదల

మార్చి – ఏప్రిల్ వ నెలల్లో కత్తిరింప చేయాలి. పూత నుండి కాయల నెక్కువగా పొందడానికి జిబ్బరిలిక్ యాసిడ్ 20 పి.పి.యమ్. (20 మి.గ్రా. లీటరు నీటికి కలిపి) పూత వున్న సమయంలో పిచికారి చేయాలి. 2, 4-డి 10 పి.పి.యమ్. (10 మి.గ్రా. లీటరు నీటికి కలిపి) పిచికారి చేసి పిందె రాలటాన్ని నివారించవచ్చు. కాయలను కోయటానికి ముందు 1 శాతం (10 గ్రా. ఒక లీటరు నీటికి) కాలియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారి చేసిన తర్వాత కాయలను కోసి 500 పి.పి.యమ్. క్యాష్ట్రఫాల్ ద్రావణంలో మంచటం ద్వారా పండ్లు ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.

రేగుతో చేయగల నిల్వపదార్థాలు

రేగు పండ్లను తాజాగా గాని, ఎండబెట్టిగాని అమ్ముకోవచ్చు సోలార్ డైయర్స్ తో గాని, సూర్యరశ్మితో గాని 10 - 20 శాతం తేమ వుండేటట్లు ఎండబెట్టి చైనీస్ డేట్స్గా అమ్మవచ్చు. రేగు పండ్ల నుండి నిలువ వుండే క్యాండి, చిప్స్, జ్యూస్, పౌడర్ లాంటి పదార్థాలను తయారు చేసుకోవచ్చును.

రేగు గురించి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్, ఉద్యాన పరిశోధనా స్థానం, అనంతపురం. ఫోన్ నెం. : 08554-261388 (మరియు) మెట్ట ఉద్యాన పరిశోధనా స్థానం, కొడమల్లేపల్లి - 508 243 నల్లగొండ జిల్లా, ఫోన్ నెం. : 08691-200338

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/17/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate