অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కంది

కంది మనరాష్ట్రంలో దాదాపు 7.30 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 1.80 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ఎకరాకు 212 కి. సరాసరి దిగుబడినిస్తుంది. ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే, పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ, సజ్జ, జొన్న మొక్కజొన్న లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్లో పండించవచ్చు. మహబూబ్నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. రబీలో కూడా కందిని ఏక పంటగ మరియు వేరుశనగతో అంతరపంటగా పండించవచ్చు.

కందిలో అధిక దిగుబడులు సాధించడంలో అడ్డంకులు

  1. కంది పంట చివరి దశలో బెట్టకు గురికావడం.
  2. తెగుళ్ళు (ఎండు, వెర్రితెగుళ్లు) పురుగులు కాయతొలుచు పురుగు, శనగపచ్చ పురుగు, చీడపీడల వలన పంటకు నష్టం కలుగుతుంది.
  3. కంది పైరును సహ పంటగాను, మిశ్రమ పంటగాను పండించినప్పడు అంతర పంటను కోసిన తరువాత కందిని అశ్రద్ద చేయడం ప్రధాన పైరు (కంది)కు, అంతర పంటలకు వేరువేరుగా ఎరువులు వేయకపోవడం.
  4. మొక్కల సాంద్రత తక్కువగా ఉండడం, వరుసల మధ్య దూరం సిఫారసు చేసిన దానికన్నా ఎక్వువగా వుండటం, పైరుకు సరిపడిన ఎరువులు వేయకపోవడం.
  5. అధిక వరాలు, బెట్టను తట్టుకునే రకాలను ఎంచుకోకపోవడం.

రకాలు

రకం

పంటకాలం (రోజుల్లో)

దిగుబడి (క్వి/ఎ.)

గుణగణాలు

ఎల్.ఆర్.జి. 41

ఖరీఫ్ – 180

రబీ 120 - 130

8 - 10

పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును బాగా తట్టుకొంటుంది. నల్లరేగడి భూములకు అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు.

లక్ష్మీ (ఐ.సి.పి.ఎల్ 85063)

ఖరీఫ్/రబీ 160 – 170

7 - 8

చెట్లు గుబురుగా వుండి ఎక్కువ కొమ్మలు కలిగి వుంటాయి. ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది. రబీలో విత్తినపుడు, ప్రధానమైన కొమ్మలు విడిగా ఎక్కువగా ఉంటాయి. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.

ఎం.ఆర్.జి. 66

ఖరీఫ్ – 180

రబీ 120 - 130

8 - 9

నల్లరేగడి భూములకు అనువైనది. గింజలు మధ్యస్థంగా వుంటాయి. మాక్రోఫోమినా ఎండు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.

ఆశ (ఐ.సి.పి.ఎల్ 87119)

ఖరీఫ్ 170 – 180

 

7 - 8

మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. ఎండు మరియు వెర్రి తెగుళ్ళను తట్టుకొంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి.

మారుతి (ఐ.సి.పి. 8863)

ఖరీఫ్ 155 – 160

 

7 - 8

మొక్క నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులును తట్టుకొంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. వరి మాగాణి గట్ల మీద పెంచటానికి అనువైనది.

డబ్ల్యూ.ఆర్.జి. 27

ఖరీఫ్ – 180

రబీ 120 - 130

7 - 8

మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపుగా ఉంటాయి. కాయలు ఆకుపచ్చగా ముదురు గోధుమరంగు చారలు కలిగి ఉంటాయి. గింజలు గోధుమ వర్ణంలో ఉంటాయి.

పి. ఆర్. జి-100

ఖరీఫ్ 145 – 150

6 - 7

ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది. తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలలోని తేలిక పాటి, ఎర్ర చల్కా నేలల్లో వరాధారంగా సాగుచేయటానికి అనువైనది.

పాలెం కంది (పి.ఆర్.జి 158)

ఖరీఫ్/రబీ 150 - 155

6 - 7

దక్షిణ తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలకు అనువైనది. ప్యుజేరియమ్ ఎండు తెగులును తట్టుకొనును.

దుర్గ (ఐ.సి.పి.ఎల్. 84031)

ఖరీఫ్ 115 – 125

 

4 –s 5

అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకం. కాయతొలుచు పురుగు బారి నుండి తప్పించుకొంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఖరీఫ్ పంటగా అనువైనది.

సూర్య (ఎం.ఆర్.జి. 1004)

ఖరీఫ్ 165 – 180

రబీ 120 - 130

8 – 9

మొక్క నిటారుగా, గుబురుగా, పెరుగుతుంది. పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు లావుగా గోధుమ రంగులో రబీ ఉంటాయి. ఎండు తెగులు (మాక్రోఫోమినా) ను కొంతవరకు తట్టుకొనును.

వరంగల్ కంది 53  (డబ్ల్యు.ఆర్.జి. 53)

ఖరీఫ్/రబీ - 160

6 – 8

కాయతొలుచు పరుగును కొంతవరకు తట్టుకుంటుంది.

ఆర్.జి.టి-1 (తాండూరు తెల్లకంది)

ఖరీఫ్ 145 – 155

రబీ 120 - 130

5 – 6

ఎండు తెగులును తట్టుకొనును తేలిక పాటి మరియు నల్లభూములకు అనువైనది. అంతరపంటలకు అనుకూలము.

డబ్ల్యు.ఆర్.జి. -65 (రుద్రేశ్వర)

ఖరీఫ్ 160 – 180

రబీ 120 - 130

8 - 10

ఎండుతెగులు మరియు శనగపచ్చ పరుగు కొంతవరకు తట్టుకొని, నల్లరేగడి భూములకు అనువైనది.

విత్తే సమయం

ఖరీఫ్ లో జూన్-జులై వరకు మరియు రబీలో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు.

నేలలు

నీరు త్వరగా ఇంకిపోయే గరప నేలలు, ఎర్రరేగడి నేలలు, చల్మనేలలు మరియు మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం. నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. చౌడు నేలలు పనికిరావు.

నేల తయారి

భూమిని ఒకసారి నాగలితో దున్ని తరువాత గొర్రుతో రెండుసార్లు చదును చేసుకోవాలి.

విత్తన మోతాదు

ఖరీఫ్ 2-3 కిలోలు, రబీలో 6-8 కిలోలు ఎకరానికి

విత్తేదూరం

  • ఖరీఫ్ : నల్లరేగడి భూమిలో 150 లేదా 180 x 20 సెం.మీ. ఎర్ర భూమిలో:120 లేదా 90 x 10 సెం.మీ.
  • రబీ : మధ్యస్థ భూముల్లో, ఎర్ర భూముల్లో 45 లేదా 60 x 10 సెం.మీ. నల్లరేగడి భూముల్లో 75 లేదా 90 x 10 సెం.మీ.

విత్తన శుద్ది

మొదటగా విత్తనాలకు ధైరామ్ లేదా కాప్లాన్ ఒక కిలో విత్తనానికి 3 గ్రా, చొప్పన పట్టించాలి. ఆ తర్వాత విత్తుకొనే ముందు 200 నుండి 400 గ్రాముల రైజోబియంను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి.

విత్తే పద్దతి

నాగలి వెంబడి గాని, సాళ్ళలో గొర్రుతో లేదా ట్రాక్టర్తో గాని విత్తుకోవాలి.

ఎరువులు

చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, ఖరీఫ్లో 8 కిలోలు, రబీలో 16 కిలోల నత్రజని ఈ రెండు కాలాల్లోను 20 కిలోల చొప్పన భాస్వరం వేసుకోవాలి. అంతరపంట వేసినప్పడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. మొక్కకు తొలి రోజుల్లో ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది. కావున పూర్తి నత్రజని మరియు భాస్వరం ఎరువులను తప్పని సరిగా ఆఖరి దుక్మిలో వేసుకోవాలి.

కలుపు నివారణ

విత్తే ముందు పూక్టోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పన 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై పిచికారి చేయాలి లేదా పెండిమిధాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమాన్ని విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని నేలలో తేమ ఉన్నప్పడు పిచికారి చేయాలి. అంతర కృషి చేయడానికి వీలుగా లేనప్పడు లేదా వరాలు అధికంగా కురిసి కలుపు తీయడానికి వీలు కాని సమయంలో వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నప్పడు ఎకరాకు 250 నుండి 300 మి.లీ. ఇమాజిథా ఫైర్ కలుపు మందును లేదా గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నప్పడు క్విజాల్ఫాప్-పి-ఇథైల్ మందును 400 మి.లీ. లేదా ప్రాపిక్విజాఫాప్ మందును 250 మి.లీ. ఎకరాకు పంట విత్తిన 20 రోజుల తరువాత నేలలో తేమ ఉన్నప్పడు పిచికారి చేయాలి. విత్తిన 30 నుండి 60 రోజులలో గుంటకతో లేదా గొర్రుతో లేదా దంతితో గాని లేదా బాగా ఎడంగా విత్తిన పైర్లలో ట్రాక్టర్తో అంతర కృషి చేయాలి.

అంతర పంటలు

తక్కువ కాలపరిమితి గల మినుము, పెసర, జొన్న మొక్కజొన్న వేరుశనగ, సోయాచిక్కుడు, నువ్వులు, ప్రత్తి పంటలను అంతర పంటగా వేసుకోవాలి. కంది+జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్ఞ 1 : 2 లేదా 1 : 4 ( 1 : 2 ఒక సాళ్ళ కంది రెండు సాళ్ళ అంతర పంటలు) కందిలో అంతరపంటగా పెసర లేదా మినుము లేదా సోయాచిక్కుడు లేదా వేరుశనగ 1 : 7గా వేసుకోవచ్చు)

కంది + నువ్వులు - 1 : 4

కంది + పత్తి - 1 : 4 లేదా 1 : 6

నీటి యాజమాన్యం

ఖరీఫ్ లో వర్షాధారంగా పండిస్తారు. అవకాశమున్నచో పూత కాత తయారయ్యే దశలో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. రబీలో 2 లేదా 3 తడులు ఇవ్వాలి. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయలు రాకముందు మరోసారి ఇవ్వాలి. నీరు ఎక్కువైనా లేదా బెట్టకు గురైన పూత, కాత రాలిపోతుంది.

గమనిక : బెట్టకు గురైనప్పడు యూరియా 20 గ్రా. లేదా 10 గ్రా, మల్టి-కె లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలి. పూత, కాత రాలిపోకుండా కాపాడవచ్చు మరియు బెట్ట నుండి కొంత మేర ఉపశమనం పొందవచ్చు. చేనులో నీరు ఎక్కువైనప్పడు లేదా వరుసగా వరాలు పడుతున్నప్పడు ఇనుము ధాతు లోపం కనిపిస్తుంది. లేద ఆకులు పసుపు రంగులో కనిపిస్తాయి. 5 గ్రా, అన్నబధి ని 1 గ్రా నిమ్మ ఉప్ప ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే ఇనుము ధాతు లోపంను నివారించవచ్చు.

రబీ కంది సాగుకి అవకాశాలు

  1. కారణాంతరాల వలన తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు.
  2. అధిక వర్షాలకు, బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్నప్పుడు.
  3. తొలకరిలో స్వల్పకాలిక పంటలు (పెసర, మినుము) వేసుకొని రెండవ పంటగా కంది వేసుకోవచ్చు.
  4. ఖరీఫ్ లో స్వల్పకాలిక వరి రకాలను పండించిన తర్వాత లేదా ఎడగారు వరి తర్వాత కూడా కందిని అక్టోబర్ చివరి వరకు వేసుకునే అవకాశముంది.
  5. రబీ కంది తక్కువ ఎత్తులో ఉండడం వలన కాయతొలుచు పరుగు, శనగపచ్చ పురుగు మరియు మచ్చల పురుగు నివారణ తేలికవుతుంది.
  6. రబీ కంది జనవరిలో పూతకు వస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది.
  7. 2 నుండి 3 నీటి తడులు ఇవ్వగలిగితే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు.
  8. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ మరియు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో మరియు గోదావరి నది వరద తాకిడికి గురయ్యే వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో వరదపోయిన తర్వాత రబీ కంది సాగుచేయవచ్చు.
  9. తొలకరిలో 170 నుండి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక రకాలైన ఐ.సి.పి.యల్ - 85063, డబ్ల్యు.ఆర్.జి. - 27, యల్.ఆర్.జి. - 41, ఐ.సి.పి.యల్ - 87119, ఐ.సి.పి.యల్ - 8863, యమ్.ఆర్.జి. 66 మరియు యం.ఆర్.జి. 1004 (సూర్య)లను రబీకాలంలో కూడా వేసుకోవచ్చు.

ఖరీఫ్, రబీ కంది పైరుల తేడా

లక్షణాలు

ఖరీఫ్

రబీ

విత్తే కాలం

జూన్, జులై

సెప్టెంబర్ 15 అక్టోబర్ 15

విత్తనం (ఎకరానికి)

2 – 3 కిలోలు

6 – 8 కిలోలు

విత్తేదూరం (సెం.మీ)

150 x 20 లేక 180 x 20

45 – 90 X 10 సెం.మీ.

కాలపరిమితి (రోజులలో)

160 - 180 రోజులు

120 - 125 రోజులు

మొక్కల ఎత్తు (మీటర్లలs

2

1.2

కొమ్మలు

బాగా వస్తాయి

తగ్గుతాయి

కాయగింజల పరిమాణం

బాగుంటుంది

తగ్గుతాయి

చీడపీడలు

ఎక్కువ

తక్కువ

పంటలు

సహపంటగా

ఏకపంటగా / సహపంటగా

దిగుబడి (క్వి.ఎ)

6 - 8 క్వింటాళ్లు

5 - 6 క్వింటాళ్లు

సస్యరక్షణ

పురుగులు

  1. ఆకుచుట్టు పురుగు : కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  2. కాయ తొలుచు పరుగు : ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సమస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి.
  3. సమగ్ర సస్యరక్షణ (కంది, శనగ)

    • వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలవుతుంది.
    • ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి.
    • ఖరీఫ్లో అంతర పంటగా 7 సాళ్ళు రబీలో 3 సాళ్లు పెసర/మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడుతాయి. పొలం చుటూ 4 సాళ్ళు జొన్న రక్షిత పైరుగా విత్తాలి.
    • పచ్చ పురుగును తట్టుకునే యల్.ఆర్.జి. 41 రకాన్ని సాగు చేయాలి.
    • పైరు విత్తిన 90-100 రోజుల్లో చిగుళ్ళను ఒక అడుగు మేరకు కత్తిరించాలి.
    • ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
    • పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
    • పురుగు గ్రుడ్లను, తొలి దశ పురుగులను గమనించిన వెంటనే 5% వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందు (అజారిడిక్టిన్)లను పిచికారి చేయాలి.
    • ఎకరాకు 200 లార్వాలకు సమానమైన యన్.పి.వి. ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో రెండు సార్లు సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
    • బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి.
    • రసాయనిక పరుగు మందులను విచక్షణా రహితంగా వాడరాదు.
    • పైన చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ / తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెషన్ స్పేయర్తో పిచికారి చేయాలి.
    • ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగ పచ్చ పురుగును నివారించలేక పోతే ఇండాక్సాకార్చ్ 1.0 మి.లీ. లేదా స్పైనోసాద్ 0.3 మి.లీను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

  4. మరుకా మచ్చల పురుగు : దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ/ఎసిఫేట్ 1 గ్రా./ ధయోడికార్చ్ 1 గ్రా/ నొవోల్యూరాన్ 0.75 మి.లీ/ స్పైనోసాడ్ 0.3 మి.లీ/ల్యాండా సైహలోత్రిన్ 1 మి.లీ/ ఫబెండిఎమైడ్ 0.3 మి.లీ తో పాటు డైక్లోరోవాస్ 1 మి.లీలీటరు నీటికి కలిపి మందులు మార్చి వారము రోజులకొకసారి పిచికారి చేయాలి.
  5. కాయ ఈగ : కాయ ఈగ ఆశించినప్పడు నష్టం బయటకు కనిపించదు. దీని వల్ల పరుగు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తుంది. ఈ పరుగు అన్ని దశలనూ కాయలోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గ్రుడు పెడుతుంది. కావున పిందె దశలో 5% వేప గింజల కషాయము పిచికారీ చేసినట్లయితే గ్రుడు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిధోయేట్ 2.0 మి.లీ లేక ప్రొఫెనోపాస్ 2 మి.లీ/ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్ళు

  1. ఎండుతెగులు : ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంత భాగం గాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువ చారలు కనిపిస్తాయి. తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐ.సి.పి.యల్ 87119 మరియు ఐ.సి.పి.యల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకొంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ వుండే భూముల్లో కందిని సాగు చేయకూడదు.
  2. గొడ్డుమోతు తెగులు (స్టెరిలిటీ మొజాయిక్) : ఇది వైరస్ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది, పూత పూయదు. ఈ తెగులు నల్లి (మైట్స్) ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మి.లీ. డికోఫాల్ కలిపి వారినికొకసారి రెండు దఫాలు పిచికారీ చేయాలి. ఈ తెగులును తట్టుకోగల ఐ.సి.పి.యల్ 87119, ఐ.సి.పి.ఎల్. 85063, బి.యస్.యం.ఆర్ 853, బి.యస్.యం.ఆర్. 736 రకాలను సాగుచేయాలి.
  3. పైటోఫ్లోరా ఆకు ఎండు తెగులు : ఈ తెగులు అధిక వర్షపాతము, నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా సోకుతుంది. ఆకులు, కొమ్మలు, కాండంపై నీటి చుక్కల మాదిరిగా ఏర్పడి తరువాత గోధుమ రంగుకు మారుతాయి. తెగులు తీవ్రమైనచో కొమ్మలు, కాండము విరిగిపోతాయి. నీరు నిలువ ఉండని భూములలో పండించుట ద్వారా, బోదెలపై నాటుట ద్వారా ఈ తెగులు రాదు. తెగులు పంటపై గమనించినచో మాంకోజెబ్ 3 గ్రా/లీటరు నీటికి లేక మెటలాక్సిల్ 2 గ్రా./లీటరు నీటికి పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
  4. మాక్రోఫోమినా వేరు కుళ్ల తెగులు : ముదురు మొక్కల కాండంపైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుటూ గోధుమ వర్ణంలోనూ మధ్య భాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎంజిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండిపోతాయి. యం.ఆర్.జి. 66 అనే కంది రకం ఈ తెగులును తట్టుకొంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు.

పంటకోత-నిల్వ

అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి. ఎందుకనగా పూత 2 నెలల వరకు పూస్తునే ఉంటుంది. ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. కందులను బూడిద కలిపిగాని, వేప ఆకులు కలిపి గాని నిల్వ చేస్తారు. నిల్వ చేసేటప్పడు పరుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి.

కంది, పెసర, మినుము, శనగ, ఉలవలు పంటల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ సైంటిస్ట్ (పప్పధాన్యాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్-506007, వరంగల్ జిల్లా ఫోన్ నెం. 9849133493

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate