పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

కృష్ణా

ఈ పేజిలో కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

నీటి పారుదల

కృష్ణాజిల్లాలో నీటవనరులకు కొదవ లేదు. కృష్ణానదిలో జిల్లా ప్రవహిస్తుండటంతో దాదాపు ఏడాది అంతా (ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలు మినహా) కాలువలు, చెరువులు నీటితో కళకళలాడుతుంటాయి. జిల్లా వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులు కాలువలు. కృష్ణానది తూర్పు ప్రధాన కాలువ కింద ఏలూరు, రైవన్‌, బందర్‌, కృష్ణా తూర్పు బ్రాంచి(కరవు) కాల్వల ద్వారా ఖరీఫ్‌, రీబీలకు నీరందతోంది. దీనితో పాటు భూగర్భ నీటి వనరులు కొదవలేదు. ఎక్కువ మంది రైతులు విద్యుత్‌ పంపు సెట్లను వినియోగిస్తున్నారు. విజయవాడలో కృష్ణా జిల్లా ఇంద్రకీలాద్రి, గుంటూరు జిల్లా తాడేపల్లి కొండల నడుమ 1852లో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నేతృత్వంలో, కెప్టెన్‌ ఓర్‌ పర్యవేక్షణలో నిర్మించిన ఆనకట్ట ద్వారా డెల్టా నీటిపారుదల వ్యవస్థకు రూపకల్పన జరిగింది. 1856లో పూర్తయిన ఆనకట్ట ద్వారా 5.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నిర్దేశించారు. తదుపరి 1923లో 8 లక్షల ఎకరాలకు, 1952 నాటికి 11 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. ప్రస్తుతం 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు విస్తరించింది. 1952లో ఆనకట్టకు గండిపడగా, 1954లో కొత్త ఆనకట్ట ప్రారంభించి 1957కి పూర్తి చేశారు. ఇదే ఇప్పటి ప్రకాశం బ్యారేజీ. దీని వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూములు సస్యశ్యామలమై వర్థిల్లుతున్నాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ద్వారా జోన్‌ 2, జోన్‌ 3 కింద పశ్చిమ కృష్ణాలో మరో 2.30 లక్షల హెక్టార్లు ఆరుతడి పంటల కింద సాగవుతున్నాయి. మునేరు, తమ్మిలేరు, కట్టలేరు, పాలేరు వాగుల ద్వారా మరికొంత భూమి సాగులో ఉంది.

మొత్తం సాగునీటి వనరుల కింద ఉన్న నికర భూమి

 • కాల్వలు: 2.51 లక్షల హెక్టార్లు
 • చెరువులు: 0.38 ,, ,,
 • బావులు : 0.30 ,, ,,
 • ఇతరం : 0.15 ,, ,,

సాగునీటి వనరులు

కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ కింద ఏలూరు, రైవస్‌, బందరు, కృష్ణా తూర్పు బ్రాంచి (కరవు) కాల్వల కింద నీరందుతుంది. కృష్ణా ఎడమ ప్రధాన కాల్వ కింద జోన్‌ 2లో జగ్గయ్యపేట, నందిగామ, జోన్‌ 3లో నూజివీడు, మైలవరం కాల్వలు ఉన్నాయి.

 • చిన్న నీటిపారుదల చెరువులు :696
 • ఎత్తిపోతల పథకాలు: 74
 • చిన్న తరహా నీటిపారుదల పథకాలు: 664
 • మధ్యతరహా నీటిపారుదల పథకాలు: 3

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

రాష్ట్రంలో ప్రధాన ఆహార ధాన్యాగారాల్లో ఒకటిగా కృష్ణా జిల్లా పేరొందింది. ఈ జిల్లాల్లో దాదాపు 70 శాతం ప్రజలు వ్యవసాయాధారంగానే జీవనం సాగిస్తున్నారు. జీవనది కృష్ణా వల్ల సాగునీటి సమస్యలేనందున పంటలు పుష్కలంగా పండుతాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన 30 మండలాలను డెల్టా మండలాలుగా, ఎగువన పశ్చిమకృష్ణాలో ఉన్న మిగిలినవి మెట్ట ప్రాంతానికి చిహ్నంగా నీటి సమస్యతో కనిపిస్తాయి. డెల్టాలో వరి, చెరకు ప్రధాన పంటలు. పసుపు, అరటి, తమలపాకు, కూరగాయల సాగు కూడా జరుగుతోంది. ఎగువ మండలాల్లో ప్రధానంగా పత్తి, మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటలు సాగవుతుంటాయి.

కృష్ణా జిల్లాలో మొత్తం 5.24 లక్షల మంది వ్యవసాయదారులు ఉన్నారు. ఇందులో సన్న, చిన్న కారు రైతులు 4.51 లక్షల మంది.

 • వ్యవసాయం మీద ఆధారపడి 6.73 లక్షలమంది కూలీలు జీవనం సాగిస్తున్నారు.
 • కృష్ణా జిల్లాలో సాగు యోగ్యమైన నికర భూమి 4.49 లక్షల హెక్టార్లు.
 • ఒకసారి కంటే ఎక్కువ సార్లు పండించే భూమి: 2.47 లక్షల హెక్టార్లు
 • జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో పంటలు వర్షాధారంగా పండుతాయి.

భూములు

 • నల్లరేగడి భూములు: 2.6 లక్షల హెక్టార్లు(57.6 శాతం)
 • ఒండ్రుభూములు: 60వేల హెక్టార్లు (22.3 శాతం)
 • ఎర్రని సారవంతమైన భూములు 76వేల హెక్టార్లు(22.3 శాతం)
 • ఇసుక, ఇతరత్రా నేలలు 0.7 శాతం
 • క్షార భూములు 3వేల హెక్టార్లు,
 • చవుడు భూములు 11వేల హెక్టార్లు

జిల్లాలో ప్రధాన పంటల సాగు వివరాలు(హెక్టార్లలో)

పంట ఖరీఫ్‌ రబీ
వరి 45,480 1,10,000
జొన్న 2162 1370
మొక్కజొన్న 6934 8895
కంది 8244 484
మినుము 5591 1,23,165
పెసర 15352 20560
శనగ ..... 2,000
వేరు శనగ 2059 7917
మిరప. 10,000 1.000
చెరకు. .... 16759.
పొగాకు ... 4,550
పత్తి 47,000 ......

ఉద్యాన పంటలు (హెక్టార్లలో)

 • మామిడి: 62,793
 • నిమ్మ: 1028
 • అరటి: 1549
 • సపోటా : 235
 • జామ: 1549
 • జీడి మామిడి: 930
 • ఆయిల్‌పాం: 4168
 • కూరగాయలు: 9434
 • సుగంధ పంటలు: 14805
 • పువ్వులు: 177

లక్ష ఎకరాల్లో ఆక్వా!

జిల్లాలో 1980-90 మధ్య తీరప్రాంతంలో నీలి విప్లవం ప్రారంభమైంది. బందరు, బంటుమిల్లి, కైకలూరు, కృత్తివెన్ను, నాగాయలంక మండలాల్లో రొయ్యలసాగుతో రైతులు లాభాలు గడించారు. దాదాపు 12వేల హెక్టార్లలో టైగర్‌ రొయ్యలు, ఉప్పునీటి రొయ్యల సాగు చేపట్టారు. అనతికాలంలోనే తెల్ల మచ్చల వ్యాధితో పరిశ్రమ దెబ్బతింది. నీలి విప్లవం చతికిలపడింది. తదుపరి మంచినీటి చేపల చెరువులు ప్రారంభమయ్యాయి. డెల్టాలో ఈ చెరువులు క్రమేపీ విస్తరిస్తున్నాయి. కొల్లేరు సరస్సును కూడా వదలకుండా విస్తరించిన చేపల చెరువులు సుమారు లక్ష ఎకరాలకు మించి ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయం తరువాత గ్రామాల్లో పాడి పరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కోళ్ల పరిశ్రమ కూడా విస్తరించింది.

నూజివీడు మామిడి

వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానంగా చెప్పుకోదగినది నూజివీడు మామిడి(చిన్న రసాలు). సుమారు 62,793 హెక్టార్లలో మామిడిని సాగుచేస్తున్నారు. నూజివీడు మామిడికి దేశవాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం విపరీతమైన డిమాండ్‌ ఉంది.

చక్కెర

చక్కెర ఎగుమతికి కూడా కృష్ణాజిల్లా పేరుగాంచింది. డెల్టా, కేసీపీ చక్కెర కర్మాగారాల ద్వారా పెద్ద ఎత్తున దేశ విదేశాలకు చక్కెరను ఎగుమతి చేస్తున్నారు. సుమారు 17,000 హెక్టార్లలో చెరకు పంట పండుతోంది.

నున్న మామిడి మార్కెట్‌ యార్డు

విజయవాడ గ్రామీణ మండలంలోని నున్న శివారులో మామిడి మార్కెట్‌ను 1999లో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. దీనికి ముందు నగరంలోని కేదారేశ్వరిపేటలో పండ్ల మార్కెట్‌లో మామిడి వ్యాపారాలు జరిగేవి. ఈ మార్కెట్‌కు జిల్లా నుంచి కాకుండా ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, ఖమ్మం జిల్లాలో పండిన మామిడికాయలను తరలించే వాహనాలు రాకపోకలతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురయ్యేవి. దీనిపై స్పదించిన అప్పటి జిల్లా కలెక్టర్‌ మీనా నున్న శివారుకు మార్కెట్‌ను తరలించారు. ఈ క్రమంలో మ్యాంగో గ్రోయర్స్‌ (మామిడి రైతుల) సంఘంగా ఏర్పడ్డారు. వీజీటీఎం పట్టాణాభివృద్ధి సంస్థ (ఉడా) ఆధ్వర్యంలో నున్న శివారులో భూ సేకరణ చేసి వారికి స్థలాలు కేటాయించారు. మామిడి మార్కెట్‌ తొలి రోజుల్లో పాకలు ఉండేవి. ఆ పాకలు అగ్ని ప్రమాదానికి గురవడంతో భారీ మొత్తంలో వ్యాపారులకు నష్టం వాటిల్లింది. అనంతరం బ్యాంకు రుణాలు తీసుకుని భవన నిర్మాణాలను చేపట్టారు. మార్కెట్‌లో రహదారులను అభివృద్ధి చేశారు. రూ.1.70 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు. ప్రతి ఏటా రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.40 నుంచి 50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నగరంలో మార్కెట్‌ ఉన్నప్పుడు అన్ని రకాల మామిడికాయలు వచ్చేవి. నున్న మామిడి మార్కెట్‌కు బంగినపల్లి, తోతాపురి రకాల మామిడికాయలను మాత్రమే రైతులు తీసుకువస్తున్నారు. రసాలు, నీలం తదితర మామిడికాయలు నగరంలోని కాళేశ్వరావు హోల్‌సేల్‌ మార్కెట్‌కు తీసుకువెళుతున్నారు. ఈ మార్కెట్‌లో వేసవి మూడు నెలల పాటు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఆ రోజులు మినహా మిగిలిన తొమ్మిది నెలల పాటు ఖాళీయే. ప్రస్తుతం కేదారేశ్వరిపేటలోని పండ్ల మార్కెట్‌ను పూర్తిగా నున్న మామిడి మార్కెట్‌కు తరలించాలని మార్కెటింగ్‌ అధికారులు సూచిస్తున్నారు.

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

ప్రకాశం బ్యారేజీ

కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌ దిగువున 180 కి.మీ వద్ద విజయవాడ నగరాన్ని ఆనుకుని 1854లో నిర్మితమైన ఆనకట్ట స్థానే ప్రకాశం బ్యారేజీ నిర్మితమైంది. 1952లో పురాతన ఆనకట్ట కూలిపోగా 1954-57 మధ్య ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా డెల్టా రెండుగా విభజించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పశ్చిమ ప్రధాన కాల్వను తాడేపల్లి సీతానగరం వైపు నిర్మించారు. ఈ కాల్వతో గుంటూరులో 2.30 లక్షల హెక్టార్లు, ప్రకాశం జిల్లాలో 29 వేల హెకార్లకు సాగునీరందుతుంది. ప్రకాశం బ్యారేజీ ఎడమ వైపు విజయవాడను ఆనుకుని కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నిర్మితమైంది. కృష్ణాలో 2.42 లక్షల హెక్టార్లు పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 23వేల హెక్టార్లకు ఈ కాల్వ నీరందిస్తుంది.

మునేరు ఆనకట్ట

బ్రిటిషు ప్రభుత్వ హయాంలో 1860 ప్రాంతంలో పోలంపల్లి వద్ద మునేటిపై ఆనకట్ట నిర్మాణం జరిగింది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాకు చెందిన 16.5 వేల ఎకరాలు దీని ఆయకట్టులో ఉన్నాయి. అప్పట్నించి దాదాపు వందేళ్ళపాటు ఎటువంటి మరమ్మతులు లేకుండా ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందించింది. 2004లో ముఖ్యమంత్రిగా వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తొలిసారిగా పల్లెబాట పేరుతో ఈ జిల్లా పర్యటనకు వచ్చి ఇక్కడ రాజీవ్‌ ప్రాజెక్టు పేరున కొత్త ఆనకట్టకు శంకుస్థాపన చేశారు. ఈ జిల్లాలో జలయజ్ఞం కింద మంజూరైన తొలి ఆనకట్ట ఇది. ఇది పూర్తయితే 5-6వేల ఎకరాలకు కొరత లేకుండా నీరు అందుతుంది. ఈ ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాకు రవాణా మార్గం ఏర్పడుతుంది.

ఆధారము: ఈనాడు

నదులు

ద్వీపకల్పం పడమర నుంచి తూర్పు చివరి వరకు సాగే ప్రస్థానంలో 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది కృష్ణమ్మ. మహేబలేశ్వరంలో పుట్టిన నదీమ తల్లి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను సస్యశ్యామలం చేసి మహబూబ్‌నగర్‌ జిల్లా తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేస్తోంది. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామానికి మూడు కిలోమీటర్ల ఎగువన కృష్ణాజిల్లాలోకి అడుగిడుతోంది. మొత్తం 125 కి.మీ. మేర ప్రవహించి దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఆనకట్ట ద్వారా సుమారు 14లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతోంది. జిల్లాకు తాగు, సాగు నీటి వనరు కృష్ణానదే. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణాడెల్టాను రెండుగా విభజించారు. గూంటూరు ప్రకాశం జిల్లాలకు పశ్చిమ ప్రధాన కాల్వను తాడేపల్లి సీతానగరం వద్ద నిర్మించగా, ఎడమ వైపు విజయవాడను ఆనుకుని కృష్ణా తూర్పు ప్రధాన కాల్వను నిర్మించారు. వీటిద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాలే కాకుండా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంతమేర లబ్ధిపొందుతున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాలకు మధ్య హద్దుగా ప్రవహించే కృష్ణా ఇరు జిల్లాల మధ్య రవాణా మాధ్యమంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, తోట్లవల్లూరు, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలను తాకతూ కృష్ణానది ప్రవహిస్తుంది. విజయవాడ వద్ద, గుంటూరు జిల్లాలోని అమరావతి క్షేత్రం వద్ద కిలోమీటర్ల వెడల్పున అత్యంత విశాలంగా ప్రవహిస్తుంది. జిల్లాలోని వివిధ పరిశ్రమలకు ముఖ్యంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఈ కృష్ణానది నీరే ఆధారం. కృష్ణా, గుంటూరులను కలిపే మూడు ప్రధాన వంతెనలు నదిపై ఉన్నాయి. అవి ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి, పులిగడ్డ-పెనుమూడి వారధి. ప్రకాశం బ్యారేజీ తర్వాత కృష్ణా నీటిని నిల్వ చేసే సౌలభ్యం లేకపోవడం ఎక్కువ నీరు సముద్రం పాలవుతోంది.

పశ్చిమ కృష్ణాలోని ముల్లేరు, పాలేరు, మునేరు, వైరా ఏరుతో పాటు పలు చిన్నచిన్న వాగులు కృష్ణా నదికి ఉపనదులుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా న్టుంచి వచ్చే పాలేరు, వైరా ఏరు, మునేరుతోపాటు జగ్గయ్యపేట ప్రాంతంలో షేర్‌మహ్మద్‌పేట గిన్నెచెరువు వచ్చే ముల్లేరుతో పాటు తాళ్లవాగు, చంద్రమ్మకయ్య, చీకటి వాగు వంటి పలువాగులు కలుస్తాయి.

కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ ఆధ్యాత్మిక క్షేత్రమే కాక, వ్యాపారానికి కూడా ప్రసిద్ధిగాంచింది. ప్రఖ్యాతి గాంచిన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం(కనకదుర్గ) ఈ నది ఒడ్డునే ఉంది. ఇంకా తోట్లవల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం, ఐలూరు రామేశ్వరం(దక్షిణకాశి), శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వరస్వామి, ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జునస్వామి, మోపిదేవిలోని సుబ్రమణ్యస్వామి ఆలయం, వేదగిరి నారసింహ క్షేత్రం, ముక్త్యాల ముక్తేశ్వరస్వామి ఆలయం, సంగమేశ్వరాలయం తదితర ఆలయాలు ఉన్నాయి.

ఆధారము: ఈనాడు

3.0058910162
p sivaprasad Jul 16, 2015 11:45 PM

Sir nalla regadi nelalo mulberyy cultivation cheyochaa

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు