పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నల్గొండ

ఈ పేజిలో నల్గొండ జిల్లాకి సంబంధించిన వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంటుంది.

నీటి పారుదల

కృష్ణా నదిపై నాగార్జున సాగర్‌, మూసీ ప్రాజెక్టు శాలిగౌరారం, అసఫ్‌ నహర్‌ ప్రాజెక్ట్‌, డిండి భీమనపల్లి, పెండ్లిపాకల ప్రాజెక్టులు ముఖ్య నీటివనరులు. ఇవికాక కుంటలు, బావులు, చెరువులు, గొట్టపు బావులు, పర్రె, ఏటి కాలువలు వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారా 3.22 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్నారు. సాగర్‌ ఆయకట్టు అంతర్భాగంగా ఉన్న 42 ఎత్తిపోతల పథకాల కింద 25వేల ఎకరాలు సాగవుతుంది.

జిల్లాలో సగటు వర్షపాతం 753 మి.మీ. భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో ఎటువంటి సాగునీటి వనరులు లేకపోవడంతో పాటు వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువే. దీంతో చౌటుప్పల్‌, చిట్యాల ప్రాంతాల్లో 18మీటర్ల లోతులోకి భూగర్భ నీటి మట్టం ఉంది.

జిల్లాలో వంద ఎకరాల సాగు విస్తీర్ణం పైబడిన చెరువులు 556 ఉన్నాయి. వీటి పరిధిలో 1.38 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. వంద ఎకరాలు లోబడి ఉన్న చిన్ననీటి చెరువులు 4,076 ఉన్నాయి. వీటి కింద 79,800ఎకరాలు సాగుచేస్తున్నారు.

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

వ్యవసాయం

నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఎర్రనేలలున్నాయి. ఇవి ఎక్కువగా ఇసుక కలిసిన అడుసుభూములు. కొన్నిచోట్ల బంక మన్నుతో కలిసిన నేలలున్నాయి. పల్లపుప్రాంతాలలో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఎర్రనేలలు లవణ క్షారరహితమై ఉంటాయి. నల్ల భూముల్లో క్షారాలతోపాటు త్వరగా కరిగిపోయే లక్షణాలు గల లవణాలుంటాయి. ఎర్రనేలలు వరిపంటకు అనుకూలంగా ఉంటాయి. నల్లభూముల్లో ఎర్రనేలల కంటే సారం ఎక్కువగా ఉంటుంది.ఈ భూములు రబీ, ఖరీఫ్‌ పంటలకు అనువుగా ఉంటాయి. సాగు కింద ఉన్న విస్తీర్ణంలో 65.68 శాతం ఆహార పంటలకు ఉపయోగిస్తున్నారు. సగటున 6.82లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతోంది.

ప్రధాన పంటలు..

జిల్లాలో ముఖ్యంగా వరి, పత్తి, ఆముదం పంటలు సాగుచేస్తున్నారు. వీటితో పాటు పండ్ల తోటల పెంపకంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా బత్తాయి, నిమ్మ, మామిడి తోటల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టులు, బోరుబావుల కింద వరి పంటలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఆయకట్టేతర ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. సూర్యాపేట మార్కెట్‌యార్డుకు అవసరాల పంటల ఉత్పత్తులు ఎక్కువగా వస్తాయి. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరి ఎక్కువగా తీసుకొస్తారు.

ఇదీ పంటల విస్తీర్ణం

 • ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 4.92లక్షల హెక్టార్లు
 • రబీలో సాధారణ విస్తీర్ణం 1.52లక్షలు
 • జిల్లాలో 2.08లక్షల హెక్టార్లలో వరిసాగవుతుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఉండటంతో దాదాపు 2.78లక్షల ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 2లక్షల ఎకరాల్లో వరిసాగవుతుంది.
 • పత్తి 1.65లక్షల హెక్టార్లలో సాగవుతోంది. నల్లరేగడి నేలలతో పాటు ఎర్రనేలల్లో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వర్షాధారంపై కూడా పత్తి సాగుచేసుకుంటున్నారు.
 • బత్తాయి: 81వేల హెక్టార్లు
 • మామిడి: 15వేల హెక్టార్లు
 • నిమ్మ: 20వేల హెక్టార్లు
 • కంది: 48వేల హెక్టార్లలో సాగవుతుంది. అంతర పంటగా ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు.
 • పెసర: 33వేల హెక్టార్లలో సాగవుతుంది. వర్షాధారంగా సాగుచేస్తున్నారు. పప్పు ధాన్యాల అభివృద్ధి కోసం జిల్లాలో ప్రయోగాత్మకంగా సూర్యాపేట డివిజన్‌లోని చివ్వెంల, మోతె మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు ద్వారా ఉచితంగా విత్తనాలు అందించి సాగు ప్రోత్సహించారు.
 • వేరుశెనగ: 12వేల హెక్టార్లలో సాగుచేస్తారు.
 • కూరగాయలు: హైదరాబాద్‌ జిల్లాకు సమీపంలో ఉండటం వల్ల 10వేల హెక్టార్లలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు.

వరి సాగు అత్యధికం

జిల్లాలో మొత్తం ఆహార ధాన్యం ఉత్పత్తిలో వరి ధాన్యం 93.65శాతం కాగా జొన్నలు 2.39, సజ్జలు 0.49శాతం పండుతున్నాయి. సాగవుతున్న విస్తీర్ణంలో కాలువల ద్వారా 42.77శాతం, చెరువుల ద్వారా 5.78శాతం, గొట్టపు బావుల ద్వారా 2.89శాతం, బావుల ద్వారా 44.51శాతం, ఇతరవాటి ద్వారా 4.05శాతం నీటిపారుదల సౌకర్యం లభిస్తోంది.

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

నాగార్జునసాగర్‌ చరిత్ర

జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబరు 10న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 45వేల కార్మికులు నిత్యం కష్టపడుతూ 12 ఏళ్ళ పాటు శ్రమించి నిర్మించారు. ప్రాజెక్టు నిర్మిణానికి మొత్తం రూ.5 కోట్ల మంది శ్రమించారు. 1967 ఆగస్టు 4న ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేశారు.

డ్యామ్‌ నిర్మాణానికి ఆలోచన... కృష్ణానది జలాలను వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో 1903లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించారు. అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మద్రాస్‌ ప్రెసిడెన్సీతో ఒక సంయుక్త పథకం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం నియమించిన వి.ఎస్‌. ఖోస్లా కమిటీ సముద్ర మట్టానికి 590 అడుగుల ఎత్తున జలాశయం ఏర్పాడేలా 408 అడుగుల డ్యామ్‌ నిర్మాణానికి పథకం తయారు చేసింది. మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఇందుకు సహకరించలేదు. 1948లో నిజాం ప్రభుత్వం అంతరించి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడింది. 1952లో విజయపురి వద్ద సముద్ర మట్టానికి 546 అడుగుల ఎత్తులో జలాశయం ఏర్పాటుకు గల ఆనకట్టను ప్రతిపాదించారు. ఈస్థలాన్ని మొదటి సారి సందర్శించిన ఖ్యాతి అలీనవాబ్‌జంగ్‌ అనే ఇంజనీరుకు దక్కుతుంది. 1953 అక్టోబరు 2న టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర-హైదరాబాద్‌ సంయుక్త రాష్టాల ప్రాజెక్టుగా నందికొండ బోర్డు ఏర్పడింది. 1955 డిసెంబరు 10వ తేదీన నెహ్రూ శంకుస్థాపన చేసిన తర్వాత 1956 నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాథమిక చర్యలు ప్రారంభమయ్యాయి. రోజుకు 45వేల మంది కార్మికులు 12ఏళ్ళ పాటు శ్రమించి, నిర్మించిన నాగార్జున సాగర్‌ డ్యామ్‌ను 1967 ఆగస్టు4న ఇందిరాగాంధీ కాల్వలకు నీరు వదిలి జాతికి అంకితం చేశారు. 1970 నాటికి డ్యామ్‌ను పూర్తి స్థాయిలో నిర్మించగా, 1974 నాటికి క్రస్ట్‌గేట్ల అమరిక పూర్తయింది.

సాగర్‌ డ్యామ్‌ విశేషాలు...

 • మొత్తం రాతి కట్టడం పొడవు - 4,756 అడుగులు
 • ఎడమ వైపు మట్టికట్ట పొడవు - 8,400 అడుగులు
 • కుడి వైపు మట్టి కట్ట పొడవు - 2,800 అడుగులు
 • మొత్తం ఆనకట్ట పొడవు - 15,956 అడుగులు
 • రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు - 26
 • ఒక్కొక్క దాని ఎత్తు, పొడవు - 4,445 అడుగులు
 • గరిష్ఠ నీటి మట్టం - 590 అడుగులు
 • డెడ్‌ స్టోరేజీ లెవల్‌ - 490 అడుగులు
 • సాగర్‌ వద్ద సముద్ర మట్టం - 246 అడుగులు
 • స్పిల్‌వే వరకు డ్యామ్‌ ఎత్తు - 546 అడుగులు
 • రిజర్వాయరు వైశాల్యం - 110 చదరపు మైళ్ళు

జల విద్యుదుత్పాదన కేంద్రాలు..

 • ప్రధాన జలవిద్యుదుత్పానకేంద్రం - 1
 • 110 మెగావాట్లు - 7
 • 100 మెగావాట్లు
 • సగటున ఏడాదికి విద్యుదుత్పాదన - 1,230 మిలియన్‌ యూనిట్లు
 • కుడి కాల్వ జలవిద్యుదుత్పాదన కేంద్రం 3130 మెగావాట్లు
 • సగటున ఏడాదికి విద్యుదుత్పాదన - 292 మిలియన్‌ యూనిట్లు
 • ఎడమ కాల్వ జలవిద్యుదుత్పాన కేంద్రం – 230 మెగావాట్లు
 • సగటు విద్యుదుత్పాదన - 127 మిలియన్‌ యూనిట్లు

డ్యామ్‌ నిర్మాణంలో ముఖ్యమైన సంఘటనలు...

 • 1903 - కృష్ణానదిపై డ్యామ్‌ నిర్మాంచాలన్న ఆలోచన
 • 1-4-1954 - ఆలోచనకు తుదిరూపం
 • 10-12-1955 - ప్రాజెక్టుకు శంకుస్థాపన
 • 10-2-1956 - డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది.
 • 5-1967 - స్పిల్‌వే వరకు డ్యామ్‌ నిర్మాణం పూర్తి
 • 4-8-1967 - ఎడమ కుడి కాల్వలకు నీటి విడుదల
 • 15-5-1968 - రాతి కట్టడానికి ఆఖరి రాయి వేసిన రోజు
 • 17-10-1974 రిజర్వాయరు 590 అడుగుల వరకు నింపిన తేదీ

డ్యామ్‌ నిర్మాణంలో నమ్మలేని నిజాలు...

 • నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 73 కోట్ల రూపాయలు మాత్రమే
 • రోజుకు 45వేల మంది కార్మికులు 12 ఏళ్ళపాటు శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.
 • సుమారు 10వేల మంది కార్మికులు మృతి చెంది ఉండవచ్చని అంచనా
 • జలాశయం విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడవ స్థానం ఆక్రమించింది. రాతి కట్టడాలలో ప్రపంచంలోనే మొదటి స్థానం
 • నీటి విడుదలలో సాగర్‌ కుడి కాల్వ ప్రపంచంలో మొదటిది
 • పురావస్తు తవ్వకాలలో బుద్దుని ధాతువు(శరీరంలో ఒక భాగం) సాగర్‌ రిజర్వాయరు ప్రాంతంలో లభించింది. ప్రస్తుతం నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరిచారు.

జిల్లా చరిత్రనే మార్చేసిన సాగర్‌ జలాలు

జిల్లాలో 16 మండలాలకు సాగర్‌ జలాలు అందిస్తూ సాగర్‌ కాలువలు ఏర్పాటు చేశారు. ఆయకట్టు స్థిరీకరణలో జిల్లాకు కొంత అన్యాయం జరిగిందని గుర్తించిన ప్రభుత్వం, అధికారులు మరో లక్ష ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా నీరందించేలా ఎత్తిపోతలను నిర్మించారు. జిల్లాలో కాలువల ద్వారా వరి ఆయకట్టుగా 3.24లక్షల ఎకరాలను, ఆరుతడి ఆయకట్టుగా 57 వేల ఎకరాలను స్థీరీకరించారు. మొత్తం 3.81 లక్షల ఎకరాలను గుర్తించారు. క్రమంగా సాగునీరు అందుతుండడంతో అతివేగంగా జిల్లా అభివృద్ధి పుంతలు తొక్కింది.

ఇది నదీ లోయ ప్రాజెక్టు. 1955లో ప్రారంభించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలు ప్రవహిస్తున్నాయి. 202 కి.మీ పొడవు కలిగిన కాలువను జవహర్‌ కాలువ అని, 179 కి.మీ పొడవుగల ఎడమ కాలువను లాల్‌బహదూర్‌ కాలువ  అని వ్యవహరిస్తారు. కుడి కాల్వ ద్వారా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాల్వ ద్వారా నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తోంది. 26 క్రస్ట్‌గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో తెలంగాణా, కోస్తా పరిధిలో దాదాపు 22.11లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తు, నిడివిగల రాతి నిర్మాణపు ఆయకట్టల్లో ఇదొకటి. కృష్ణానదిపై నిర్మించిన తొలి బహుళార్థ సాధక ప్రాజెక్టు. ప్రపంచంలోని మానవ నిర్మిత జలాశయాల్లో ఇది మూడోది. కుడి కాల్వ పరిధిలో 12.5లక్షలు, ఎడమకాల్వ పరిధిలో 9.25 లక్షల ఎకరాల సాగవుతోంది. 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతోంది. ప్రతి ఏడాది రూ.400కోట్లు విలువైన పంటలు పండుతున్నాయి.

 • శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎ.ఎం.ఆర్‌.పి.)
 • నాగార్జునసాగర్‌ కుడికాలువ (జవహర్‌ కెనాల్‌)
 • నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ (లాల్‌ బహుదూర్‌ కెనాల్‌)

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లా నీటిపారుదల సౌకర్యాల్లో కొంత వెనుకబడి ఉంది. రాజుల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు, నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే సాగు నీరు అందిస్తున్నాయి. స్వాతంత్ర్ అనంతరం  నాగార్జునసాగర్‌ డ్యాం నిర్మాణం తరువాత మూడు లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. ఈ ప్రాజెక్టు జిల్లాలో ఉన్నా లబ్ధిపొందుతున్న ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పోలిస్తే విస్తీర్ణం చాలా తక్కువ.

సాగర్‌ కుడికాలువ

అసఫ్‌ నహర్‌ ప్రాజెక్టు: రామన్నపేట తాలుకాలోని నెమలికాల్వ గ్రామ సమీపంలోని మూసీనదిపై ఉదయరాజు నిర్మించారు. 1907-1908 మధ్యన నిజాం ప్రభుత్వం ఆధునీకరించింది. 93 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 24 గ్రామాలలోని 31 చెరువులలు నింపటానికి, 15వేల ఎకరాలకు సాగనీరు అందించడానికి దోహదపడుతుంది.

శాలిగౌరారం ప్రాజెక్టు: మూసీనదిపై నిర్మించిన రెండో ప్రాజెక్టు ఇది. రామన్నపేటలోని పల్లివాడ వద్ద అసఫ్‌ నహర్‌ ప్రాజెక్టుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. 1907-1908 ప్రాంతంలో ఆధునీకరించారు. ఈ కాల్వ ద్వారా రామన్నపేట, నల్గొండ తాలూకాలలోని దాదాపు పన్నెండు గ్రామాల ద్వారా 26 కిలోమీటర్ల పొడవునా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

శాలిగౌరారం ప్రాజెక్టు

పెండ్లిపాకల ప్రాజెక్టు: దేవరకొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెండ్లిపాకల వద్ద ఉప్పువాగుపై ఈ ప్రాజెక్టు నిర్మించారు. 1933-39 వరకు నిర్మించిన ఈ కాలువ 8 గ్రామాల ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సుమారు 4000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

పెండ్లిపాకల ప్రాజెక్టు

డిండి ప్రాజెక్టు: కృష్ణానదికి ఉపనది అయిన డిండి నదిపై ఈ ప్రాజెక్ట్‌ను 1940-43 కాలంలో మహబూబ్‌నగర్‌ సరిహద్దుల్లో నిర్మించారు. కుడి ఎడమల ఉన్న కాలువతో దాదాపు 20 గ్రామాలను కలుపుతూ 12500 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

మూసీ ప్రాజెక్టు: సూర్యాపేట తాలుకాలోని మూసీ నదిపై 1954లో ప్రారంభించి 1961లో పూర్తిచేశారు. ప్రధాన కాలువ 64 కిలోమీటర్ల పొడవుంది. టేకుమట్ల వంతెన  వరకు ప్రవహిస్తుంది. కుడి కాల్వ 31 కి.మీ, ఎడమ కాలువ 34 కి.మీ సాగి 61 గ్రామాలలోని పొలాలకు నీరందిస్తుంది. దాదాపు 30 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతోంది.

ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు- ఉదయసముద్రం) ద్వారా జిల్లాలో 21 మండలాల్లో 2.70లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో 1995లో ప్రారంభించారు. కాల్వలు తవ్వకపోవడంతో ప్రస్తుతం 50వేల ఎకరాలకు మించి నీరందడంలేదు. కృష్ణానది నీటితోనే ఈ ప్రాజెక్టు నడుస్తోంది.

బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం: నల్గొండ, నకిరేకల్‌ నియోజక వర్గాల్లో సేద్యం ద్వారా సుమారు లక్ష ఎకరాలకు నీరందించాలనే ఉద్దేశంతో రూ.699 కోట్లు కేటాయించారు. ఉదయ సముద్రం నుంచి మునుగోడు మీదుగా నీటిని మళ్లించనున్నారు.

బి.వెల్లంల ప్రాజెక్టు

మూసీనదిపై 1759లో నిర్మించిన ఆసిఫ్‌ నహార్‌ ప్రాజెక్టు ప్రాచీనమైంది. 1907-08లో దీని మరమ్మతులు చేశారు. నల్గొండకు వాయువ్యంగా 48కి.మీ దూరంలో రామన్నపేట మండలంలోని నెమలి కలువ గ్రామ సమీపంలో ప్రాజెక్టు ఉంది. నల్గొండ, రామన్నపేట మండలాల్లో 24 గ్రామాలలోని 3,880 హెక్టార్ల వరకు సాగవుతోంది. పానగల్లులోని పెద్దచెరువులో కలిసే ముందు 18 చిన్న చెరువులకు నీరందిస్తోంది.

కృష్ణా నదికి మరో ఉపనది అయిన డిండిపై డిండి ప్రాజెక్టు నిర్మించారు. దేవరకొండ మండలం గుండ్లపల్లి వద్ద ఈ ప్రాజెక్టు ఉంది. దేవరకొండ నుంచి 38కి.మీ దూరంలో డిండి, కృష్ణానది సంగమ స్థలానికి 64కి.మీ ఎగువన 1943లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 19 గ్రామాలకు చెందిన 6,575 హెక్టార్లకుసాగునీరందిస్తోంది.

జిల్లాలో మూసీ నదిపై మరో ప్రాజెక్టును నిర్మించారు. సూర్యాపేట మండలం సోలిపేట గ్రామ సమీపంలో ఉంది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్న టేకుమట్ల వంతెనకు 10కి.మీ ఉత్తరాన మూసీ కృష్ణా నదుల సంగమ స్థలానికి 64కి.మీ ఎగువన నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 16,600 హెక్టార్ల సాగు భూమి ఉంది.

పెద్దఅడిశర్లపల్లి మండలంలో 20 ఏళ్ల కిందట పేర్వాల ప్రాజెక్టు నిర్మించారు. చిన్నతరహా ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది. దీన్ని 1980-90లో నిర్మించారు. 2500 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా ఎంచుకున్నారు.

కాలువలు

శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగ మార్గం కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) రూ.2,813 కోట్ల వ్యయంతో 2004లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 60 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా నత్తనడకన పనులు నిర్వహిస్తున్నారు.

పిలాయిపల్లి కాలువ మూసీ జలాల తరలింపు కాలువ. దీని ద్వారా జిల్లాలో చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, చిట్యాల మండలాల్లోని 38 చెరువులను మూసీ జలాలతో నింపి సాగునీరందించాలనేదే ఉద్దేశ్యం. దీని పొడవు 65కి.మీ, కాలువ వెడల్పు 5మీటర్లు, లోతు 1.5 మీ. దాదాపు 23 గ్రామాలకు లబ్ధిపొందే అవకాశం. సాగులోకి వచ్చే బీడు భూములు 4,500 ఎకరాలు.

ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో 2.57 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాలకుఉపయోగపడుతోంది.

ఆధారము: ఈనాడు

నదులు

జిల్లా దక్షిణ సరిహద్దు నుంచి ప్రవహించే కృష్ణా నది ముఖ్యమైనది. ఈ నది దేవరకొండ మండలంలోని పత్నేశ్వరం వద్ద జిల్లాలో ప్రవేశించింది. తూర్పువైపుగా 85కి.మీ ప్రవహించి కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది.

మూసీ నది కృష్ణాకు ఉప నది. ఇది వాయువ్య దిశ నుంచి జిల్లాలో ప్రవహించి తూర్పు వైపు 64కి.మీ ప్రవహించి 153కి.మీ తర్వాత ఆలేరు నదిలో కలిసి వాడపల్లి వద్ద కృష్ణా నదితో సంగమిస్తుంది. పెద్దవాగు, దిండి నదులు దేవరకొండ మండలంలో ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తాయి. ఈ నదికి చిన్నయేరు, ఆలేరు, బిక్కేరు నదులు ఉపనదులు. జిల్లాలో ప్రవహించే నదులలో మూసీ ముఖ్యమైంది.

అహల్య నది: చండూరు తాలుకాలోని నారాయణపురం పశ్చిమ ప్రాంతంలో ప్రారంభమై ఆగ్నేయ దిశగా 72 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. తరువాత కనగల్‌ వాగులో కలిసి 132 కి.మీ ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది.

ఆలేరు నది: ఆలేరు, మోత్కూరు, మండలాల్లో ప్రవహించి బిక్కేరును కలుపుకుని వర్ధమానుకోట ప్రాంతంలో మూసీలో కలుస్తోంది.

పాలేరు నది: సూర్యాపేట, కోదాడ మండలాలను ఖమ్మం జిల్లా నుంచి వేరుచేస్తోంది.

హాలియా వాగు: నల్గొండ ప్రాంతంలోని నారాయణపూర్‌కు పశ్చిమాన ఉన్న కొండల్లో పుట్టి ఆగ్నేయ దిశగా 132కి.మీ ప్రవహించి కనగల్‌ వద్ద కొంగల్‌ నదితో పాటు కృష్ణాలో కలుస్తుంది.

ఆలేరు నది: భువనగిరి మండలంలో ప్రవేశించి మూసీ నదిలో కలుస్తోంది.

బిక్కేరు నది మెదక్‌ జిల్లా నుంచి ప్రవేశించి జిల్లాలో తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, గుండాల, మోత్కూరు, తిరుమలగిరి, యాదగిరిగుట్ట ద్వారా మూసీలో కలుస్తోంది.

ఆధారము: ఈనాడు

3.01200300075
గ్రామీణ ఉపాధి హామీ పథకం Mar 22, 2018 05:32 PM

ప్రాజెక్ట్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు