অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నిజామాబాదు

నీటి పారుదల

రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లాకు అన్నపూర్ణ అన్న పేరుంది. జిల్లా జనాభా 25.31 లక్షలు కాగా, ఇందులో 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం భౌగోళిక వైశాల్యం 7.674 లక్షల హెక్టార్లు. ఇందులో నీటిపారుదల భూభాగం 1.683 లక్షల హెక్టార్లు. వ్యవసాయ భూభాగం 2.487 లక్షల హెక్టార్లు. భౌగోళికంగా నీటి వనరులకు ఇక్కడ కొదవలేదు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌, జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌తోపాటు పలు చిన్న ప్రాజెక్టులు నిర్మించారు. జలయజ్ఞం పథకంలో రాష్ట్రంలోనే తొలిఫలం అయిన అలీసాగర్‌ ఎత్తిపోతలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

జిల్లాలో వర్షపాతం

జిల్లాలో ఎక్కువ వర్షపాతం రుతుపవనాల వల్ల కురుస్తుంది. జిల్లాలో సగటు వర్షపాతం 1081 మి.మీ..

బేసిన్‌ పరిధి

జిల్లా మూడు బేసిన్ల పరిధిలో ఉంది. అవి...

 1. జీ4 మంజీర సబ్‌ బేసిన్‌
 2. జీ5 మధ్య గోదావరి సబ్‌ బేసిన్‌
 3. జీ6 మానేర్‌ సబ్‌ బేసిన్‌

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు

ప్రాజెక్టు పేరు ఆయకట్టు లక్ష్యం సాగవుతున్న ఆయకట్టు
నిజాంసాగర్‌ 2,31,339 2,31,339
శ్రీరాంసాగర్‌ 28,166 17,482

మధ్యతరహా ప్రాజెక్టులు

ప్రాజెక్టు పేరు ఆయకట్టు లక్ష్యం సాగవుతున్న ఆయకట్టు
పోచారం 10,545 10,545
రామడుగు 5,000 5,000
కౌలాస్‌నాల 7,000 6,000

చిన్ననీటి తరహా ప్రాజెక్టులు

జిల్లాలో 321 చిన్ననీటి తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ద్వారా 80,743 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

ఆధారము: ఈనాడు

ప్రధాన పంటలు

వ్యవసాయపరంగా నిజామాబాద్‌ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం ఉంది. జిల్లాలో మొత్తం 36 మండలాలు, మూడు రెవెన్యూ డివిజన్‌లుండగా, వ్యవసాయశాఖకు వచ్చేసరికి 12 ఏడీఏ డివిజన్‌లు ఉన్నాయి. ఇక్కడ పండించే పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఆసియా ఖండంలో అతిపెద్ద చక్కెర కర్మాగారంగా బోధన్‌ నిజాం షుగర్‌ కర్మాగారం పేరుపొందింది. ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌, వర్ని మండలంలో ఉంది. ఇక్కడే వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జిల్లా రైతాంగానికి క్షేత్రస్థాయిలో సూచనలు, సలహాలను అందించి, సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు జిల్లా ఏరువాక సమన్వయ కేంద్రం పనిచేస్తోంది. పసుపుపై ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తలకు మంచి అనుభవం ఉండటంతో, ఇతర జిల్లాల నుంచి రైతులు ఫోన్‌ ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నారు. నిజామాబాద్‌ పసుపు శ్రీలంక, దుబాయ్‌, దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. గుమ్మిర్యాల్‌ గ్రామంలో పండించే పంటకు సాంగ్లీ మార్కెట్‌లో అత్యధిక ధర పలుకుతోంది. పంటలను పండించడంలో ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. జిల్లాలో హైబ్రిడ్‌ విత్తనోత్పత్తి ఇక్కడి నుంచే ప్రారంభమైంది. తెలంగాణ జిల్లాల్లోని అతిపెద్ద మార్కెట్‌ యార్డులో నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఒకటి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇక్కడి మార్కెట్‌కు పసుపు, ఆమ్‌చూర్‌(మామిడిపొడి) విక్రయించడానికి తీసుకొని వస్తారు. కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సామాన్య సౌలభ్య పసుపు కేంద్రం వేల్పూర్‌ మండలంలో ఏర్పాటు చేశారు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 2,68,770 హెక్టార్లలో, రబీ సీజన్‌లో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 1,46,533 హెక్టార్లలో ఉంటుంది. ప్రధానంగా వరి, సోయాబీన్‌, మొక్కజొన్న, పసుపు, పత్తి, చెరకు, పప్పు దినుసుల పంటలు సాగవుతాయి.

రుద్రూర్‌ వరి, చెరకు పరిశోధన కేంద్రం

రైతుల ప్రగతికి, పంటపొలాల అధిక దిగుబడికి వర్ని మండలంలోని అక్బర్‌నగర్‌లో ఉన్న రుద్రూర్‌ వరి, చెరకు పరిశోధన స్థానం ఎంతో తోడ్పడుతోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, ఎప్పటికప్పుడు కొత్తరకం వంగడాలను రైతులకు పరిచయం చేస్తూ అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తోంది. 1928లో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ నిర్మాణంతో జిల్లాలో వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మెట్టభూములను మాగాణి భూములుగా చేయడానికి, నేలలను బట్టి వివిధ పంటలను పండించేందుకు అనువైన యాజమాన్య పద్ధతులు రూపొందించడానికి వర్ని మండలం అక్బర్‌నగర్‌లో వ్యవసాయ పరిశోధన స్థానాన్ని 1932లో ప్రభుత్వం స్థాపించింది. ఈ పరిశోధన స్థానం క్రమంగా అభివృద్ధి చెందడంతో పాటు రైతుల ప్రగతికి అండగా నిలిచింది. 1964లో విస్తృతమైన పరిశోధన ఏర్పాటుతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంగా, 1981 నుంచి ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానంగా స్థిరపడింది. తొలి పరిశోధనల ద్వారా నేలల గుణగణాలు నిర్ణయించి తగిన సేద్య విధానాలను సిఫారసు చేసింది. దీంతో వరి దిగుబడులను హెక్టారుకు 1000 కిలోల నుంచి 3000 కిలోల వరకు పెంచింది. 1950 కంటే ముందు ఎకరాకు 15 టన్నులున్న సగటు చెరకు దిగుబడిని మేలైన రకాలు, యాజమాన్య పద్ధతులు రూపొందించి రైతులతో ఆచరింప చేసింది. ఫలితంగా ఎకరాకు 30 టన్నుల నుంచి 40 టన్నుల వరకు దిగుబడి పెరిగేలా చేసింది.

చెరకు పంటలో రకాలు

ఇప్పటివరకు ఈ పరిశోధన స్థానం నుంచి సాగుకు ఇచ్చిన 17 చెరకు రకాలలో కో-6907, కో-7219, కో ఆర్‌. ఏ001, కో-8011, 85ఆర్‌186, 83ఆర్‌23 రకాలు రాష్ట్రమంతా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం 97ఆర్‌129, 97ఆర్‌272, 97ఆర్‌401 వంటి మధ్యకాలిక రకాలు రైతుల పంటపొలాల్లో ప్రయోగిస్తూ శాస్త్రవేత్తలు రౖౖెతుల మన్ననలు పొందుతున్నారు. చెరకులో ఆచరణీయ పరిశోధనతో పాటు దశల వారీగా విత్తనం ఉత్పత్తి చేసి పరిశోధన స్థానం రైతులకు అందజేస్తుంది.

వరి రకాలు

1981లో జాతీయ వ్యవసాయ పథకం పరిశోధన స్థానంలో ఏర్పాటు చేశారు. దీంతో సన్నని నాణ్యమైన గింజ కలిగిన స్వల్ప, మధ్యకాలిక వరి పంట రకాలను పరిశోధించారు. ఈ పరిశోధన ఫలితంగా ఆర్‌.డి.ఆర్‌ 7555, ఆర్‌.డి.ఆర్‌ 355, ఆర్‌.డి.ఆర్‌ 763, ఆర్‌.డి.ఆర్‌ 8702, ఆర్‌.డి.ఆర్‌ 836, ఆర్‌.డి.ఆర్‌ 73905 అనే రకాలను సృష్టించారు. ఈ రకాలు జిల్లాలోని పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలుగా గుర్తింపబడ్డాయి. ఆర్‌.డి.ఆర్‌763 అనే వరి రకము ఇందూరు సాంబగా 1966లో, ఆర్‌.డి.ఆర్‌8702 అను రకము పేలాల వడ్లు పేర్లతో 1999లో ఈ పరిశోధన స్థానం నుంచి రైతులకు అందాయి.

నాణ్యమైన విత్తనోత్పత్తి

వరి, చెరకు పంటలకు ప్రత్యామ్నాయంగా వర్షాధార, ఆరుతడి పంటలపై పరిశోధన స్థానంలో పరిశోధనలు సాగాయి. ఈ పంటలపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో 2007-2008 నుంచి చెరకు, వరి, జొన్న, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము తదితర పంటల్లో మూల, బ్రీడర్‌ విత్తనం పరిశోధన స్థానం ఉత్పత్తి చేసింది. 1010, సాంబమసూరి, జగిత్యాల సన్నాలు, కందిలో పి.ఆర్‌.జి-158, పెసరలో ఎల్‌.జి.జి-450 రకాలలో విత్తనోత్పత్తి చేయడం జరిగింది.

ఉద్యానవనంపై అవగాహన

పంట పొలాలతో పాటు ఉద్యానవన పంటలపై రైతులకు పరిశోధన స్థానం చైతన్యం కలిగిస్త్తోంది. మామిడి, సపోట, జామ, పనస తదితర అంటు మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇవికాక వివిధ రకాల పూల మొక్కలతో పాటు అలంకరణ మొక్కలు కూడా అందజేస్తున్నారు.

సి-టెక్నాలజి కళాశాల

ఈ పరిశోధన స్థానం ఆవరణలో దేశంలోనే ఏకైక విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌ కళాశాల 2005లో ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఐదు బ్యాచ్‌ల విద్యార్థులు రెండు సంవత్సరాల డిప్లొమా పూర్తిచేసుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో స్థిరపడ్డారు. ఇదే ఆవరణలో విత్తనశుద్ధి కర్మాగారం కూడా స్థాపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శాస్త్రవేత్తల కృషి

పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు రైతులకు సదస్సులు, వ్యవసాయ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వివిధ పంటల యాజమాన్యంపై అవగాహన కల్పిస్తారు. పంటపొలాల్లో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి పరిశోధన ఫలితాలను రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఖరీఫ్‌, రబీ పంటల కాలంలో సాగు చేస్తున్న వివిధ పంటలపై రైతులకు అందుబాటులో ఉంటూ దిగుబడులు పెరిగేలా చర్యలు చేపడుతున్నారు.

ఆదర్శ గ్రామం అంకాపూర్‌

ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌ గ్రామం ఆదర్శ గ్రామంగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉంటూ అభివృద్ది కమిటీని ఏర్పాటుచేసుకొని గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నారు. సొంతంగా ప్రజావిరాళం సమకూర్చి గ్రామంలో సిమెంట్‌ రోడ్లను నిర్మించుకున్నారు. ఇతర అభివృద్ది పనులు చేసుకున్నారు. జాతీయరహదారినుంచి గ్రామంవరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేశారు. గ్రామ రైతులు శ్రమజీవులు. చక్కని యాజమాన్య పద్దతులు పాటిస్తారు. ఏటా మూడు పంటలు పండిస్తారు. సజ్జ, ఎర్రజొన్న ఇతర సంకరజాతి విత్తనాలను పండించి ఉత్తర భారతదేశంలోని కంపెనీలకు విక్రయిస్తారు. కూరగాయలను విరివిగా సాగుచేస్తారు. గ్రామంలో దాదాపు 20 విత్తన కంపెనీలు ఉన్నాయి. వ్యవసాయాభివృద్దిలో మహిళల పాత్ర కీలకం. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలనుంచి ఎంతోమంది సందర్శకులు, వ్యవసాయాధికారులు, రైతులు గ్రామానికి వచ్చి వ్యవసాయాభివృద్ది గురించి అధ్యయనం చేస్తుంటారు. గ్రామంలోని గురడిరెడ్డి రైతుసంఘం జాతీయస్థాయి ఉత్తమ రైతుసంఘంగా ఎంపికైంది. గ్రామపంచాయతీ పలుమార్లు జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. మాజీ సర్పంచి రాజన్న రాష్ట్రస్థాయి ఉత్తమ రైతుగా పురస్కారం పొందారు. కొంతమంది గ్రామంలో రుచికరమైన నాటు కోడికూర వండి ఇస్తారు. అంకాపూర్‌ చికెన్‌ పేరిట నాటు కోడికూరకు ఎంతో గుర్తింపు ఉంది. గ్రామంలో ఎన్నికల సమయంలోనే పార్టీల హడావిడి ఉంటుంది. ఆ తర్వాత గ్రామస్తులంతా ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసి ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలను అంతా కలిసి చర్చించి ఏకగ్రీవం చేస్తారు. జిల్లా రాజకీయాలలో గ్రామస్తులు కీలక భూమిక నిర్వహిస్తున్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం భాజపా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మార చంద్రమోహన్‌ జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. గ్రామానికి చెందిన దాదాపు 50మందికి పైగా విదేశాలలో చదువుతున్నారు. కొంతమంది విదేశాలలో ఉద్యోగాలు సాధించి అక్కడే స్థిరపడ్డారు. వ్యవసాయంలో ఆర్థికాభివృద్ది సాధించిన రైతులు పలువురు ఆధునాతన భవంతులు నిర్మించుకున్నారు. ఖరీదైన వాహనాలను వినియోగిస్తున్నారు.

పసుపు సాగు

జిల్లాలో పసుపు సాగుకు ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో సింహాభాగం పసుపు జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. ఏటా దాదాపు 40వేల ఎకరాలలో రైతులు పసుపును సాగుచేస్తారు. ఆర్మూర్‌ సబ్‌డివిజనులో పసుపు సాగు ఎక్కువ. పసుపుకు మార్కెట్‌లో మంచి ధర ఉన్న సమయంలో రైతులు భారీ ఆదాయం సాధించారు. ఈమధ్య పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నారు. ఇక్కడ పండించిన పసుపును మహారాష్ట్రలోని సాంగ్లీ, నిజామాబాద్‌ మార్కెట్‌యార్డులో విక్రయిస్తారు. రైతుల ఉద్యమఫలితంగా కేంద్రప్రభుత్వం కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని, డీఆర్‌డీఏద్వారా వేల్పూరులో మరో కేంద్రాన్ని మోర్తాడ్‌, ధర్పల్లిలో కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆర్మూర్‌ ప్రాంతంలో పసుపుశుద్ది కర్మాగారం ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నా ఏర్పాటుకాలేదు. ఆహారశుద్దిశాఖద్వారా పసుపు పార్కును ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఆధారము: ఈనాడు

ప్రాజెక్టులు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

రాష్ట్ర రాజధానికి సుమారు 200 కిలోమీటర్లు, జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో పోచంపాడు వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ను నిర్మించారు. స్థానికంగా శ్రీకోదండరామస్వామి ఆలయం ఉండడంతో ఈ ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌గా పేరుపొందింది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలకు జీవనాధారమైంది. నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట, ఆర్మూర్‌, నవీపేట, బాల్కొండ మండలాలతోపాటు ఆదిలాబాద్‌ జిల్లాలోని లోకేశ్వరం, దిలావల్‌పూర్‌, నిర్మల్‌ మండలాల్లో పలుగ్రామాల ప్రజలు సర్వస్వం త్యాగం చేయగా రూపుదాల్చిన ఈ ప్రాజెక్టుకు 1963లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రు అంకురార్పణ చేశారు. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించారు. 1978లో నిర్మాణం పూర్తయి అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి చేతులమీదుగా ప్రారంభమైంది. మొత్తం 18 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఖరీఫ్‌కు 9.5 లక్షల ఎకరాలు, రబీలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తోంది. వరదకాలువ పూర్తిచేసుకుని మరో 2.20 లక్షల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరు అందిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ, వేల్పూర్‌, మోర్తాడ్‌ మండలాలకు లక్ష్మీకాలువ ద్వారా 16 వేల ఎకరాలు, అదిలాబాద్‌ జిల్లాకు సరస్వతి కాలువ ద్వారా 35వేల ఎకరాలు, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు కాకతీయ కాలువ ద్వారా 8.5లక్షల ఎకరాలకు నీరందిస్తోంది. అంతేగాకుండా నాలుగు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి జరుగుతోంది. ప్రాజెక్టుకు 42 గేట్లున్నాయి. ప్రాజెక్టు నుంచి నీటిని ఆయకట్టుకు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల నిర్మాణం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా వరదకాలువను నూతనంగా నిర్మించారు.

 • ప్రాజెక్ట్ కు అనుమతి : 23.03.1963
 • శంకుస్థాపన : 26.07.1963
 • ప్రారంభం : 05.11.1978
 • నిర్మాణ వ్యయం : రూ.1600 కోట్లు
 • నీటి నిలువ సామర్థ్యం : నిర్మాణ సమయంలో 112 టీఎంసీలు, ప్రస్తుతం 90 టీఎంసీలు
 • ఆయకట్టు విస్తీర్ణం : 16.865 లక్షల ఎకరాలు
 • లబ్ధిపొందే జిల్లాలు : నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ

నిజాంసాగర్‌

రాష్ట్ర రాజధానికి 145 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో మంజీర నదిపై నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మితమైంది. 1923లో అప్పటి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ నేతృత్వంలో బంజపల్లి వద్ద పరిసర 40 గ్రామాలను ఖాళీ చేసి ప్రాజెక్టును చేపట్టారు. మంజీర నది వద్ద సింగూరు మిగులు జలాలను ఆధారంగా చేసుకుని ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మూడు కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించారు. నవాబ్‌ ఆలీ నవాజంగ్‌ బహదూర్‌ పర్యవేక్షణలో 1931లో నిర్మాణం పూర్తయింది. మొత్తం 1405 అడుగుల లోతు ఉన్న ప్రాజెక్టు పూడికవల్ల నీటినిల్వ 1376కు తగ్గిపోయింది. 58 టీయంసీల సామర్ధ్యంతో 2.75 లక్షల ఎకరాలకు నీరందించడం లక్ష్యం. ప్రస్తుతం 2.31 లక్షల ఎకరాలకు అందించగలుగుతోంది. నిజాం పాలనలో కట్టించినందుకు ఈ ప్రాజెక్టును నిజాంసాగర్‌గా నామకరణం చేశారు. ప్రాజెక్టులో బోటింగ్‌ సౌకర్యంతోపాటు పర్యాటకులను అలరించే ఆహ్లాదకరమైన సుందరమైన వనం ఉంది.

 • ప్రారంభం : 31.10.1931
 • నిర్మాణ వ్యయం : రూ.3.15 కోట్లు
 • నీటి నిలువ సామర్థ్యం : నిర్మాణ సమయంలో 29.72 టీఎంసీలు, ప్రస్తుతం 17.80 టీఎంసీలు
 • ఆయకట్టు విస్తీర్ణం : 2.75 లక్షల ఎకరాలు
 • లబ్దిపొందే మండలాలు : కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌ మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలు
 • ప్రధాన కాలువ పొడవు : 155 కిలోమీటర్లు
 • పంపిణీ కాలువల సంఖ్య : 82
 • ఉపకాలువల సంఖ్య : 283
 • పంపిణీ, ఉపకాలువల పొడవు : 1771 కిలో మీటర్లు

ప్రాణహిత-చేవెళ్ల

జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. శంకుస్థాపన చేశారు. పథకం కింద జిల్లాలో 3,04,500 ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. నిర్మాణ అంచనా వ్యయం రూ.3,484 కోట్లుగా ప్రతిపాదనలు జరిగాయి. నిజామాబాద్‌, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఆర్మూర్‌, మాక్లూర్‌, బాల్కొండ, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, వేల్పూర్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, సదాశివనగర్‌, భిక్కనూర్‌, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, గాంధారి మండలాల రైతాంగం లబ్ధి పొందనుంది.

అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం

జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం అలీసాగర్‌. నవీపేట మండలం కోస్లి వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌హౌస్‌ నిర్మించారు. రెండో పంప్‌హౌస్‌ రెంజల్‌ మండలం తాడ్‌బిలోలిలో, మూడో పంప్‌హౌస్‌ ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లో నిర్మించారు. జాన్కంపేట్‌ నుంచి ఎత్తిపోతల నీటిని కాల్వల ద్వారా తీసుకువచ్చి నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో కలిపారు.

 • ప్రారంభం : 28.10.2007
 • ప్రారంభోత్సవం చేసిన వారు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌
 • నిర్మాణ వ్యయం : రూ.261.31 కోట్లు
 • ఆయకట్టు విస్తీర్ణం : 53,793 ఎకరాలు
 • లబ్ధి పొందే మండలాలు : నవీపేట, రెంజల్‌, ఎడపల్లి, నిజామాబాద్‌, డిచ్‌పల్లి, మాక్లూర్‌

గుత్ప ఎత్తిపోతల పథకం

జిల్లా కేంద్రానికి 45 కిలోమిటర్ల దూరంలో నందిపేట మండలం ఉమ్మెడ శివారులోని గోదావరి నది ప్రవాహం వద్ద దీనిని నిర్మించారు. మధ్యతరహా ప్రాజెక్టుగా జలయజ్ఞంలో భాగంగా నిర్మించారు.

అర్గుల్‌ రాజారాం ఎత్తిపోతల పథకం

నందిపేట మండలం ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై మొదటి పంప్‌హౌస్‌ నిర్మాణం జరిగింది. రెండో పంప్‌హౌస్‌ను మోర్తాడ్‌ మండలం ధర్మోర గ్రామం వద్ద నిర్మించారు. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన రెండో పథకం ఇది.

 • ప్రారంభం : 18.03.2008
 • నిర్మాణ వ్యయం : రూ.204 కోట్లు
 • ఆయకట్టు విస్తీర్ణం : 38,792 ఎకరాలు
 • లబ్ధిపొందే మండలాలు : ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్‌, మాక్లూర్‌, నందిపేట.

లెండి ప్రాజెక్ట్‌

 • నిర్మాణ ప్రదేశం : గొంజెగాం గ్రామం, ముఖేడ్‌ తాలుక నాందేడ్‌ జిల్లా
 • నిర్మించు రాష్ట్రాలు : ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర
 • నిర్మాణ ఒప్పందం తేదీ : 18.11.2003
 • నిర్మాణ అంచనా వ్యయం : రూ.554.55 కోట్లు
 • అంచనా వ్యయంలో మహారాష్ట్ర వాటా : రూ.318.45 కోట్లు
 • అంచనా వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా : రూ.236.10 కోట్లు
 • నీటి నిలువ సామర్థ్యం : 6.36 టీఎంసీలు
 • మహారాష్ట్ర వాడుకునే నీటి సామర్థ్యం : 3.93 టీఎంసీలు
 • ఆంధ్రప్రదేశ్‌ వాడుకునే నీటి సామర్థ్యం : 2.43 టీఎంసీలు
 • ఆయకట్టు విస్తీర్ణం : 49 వేల ఎకరాలు
 • ఆంధ్రప్రదేశ్‌ ఆయకట్టు విస్తీర్ణం : 22 వేల ఎకరాలు
 • మహారాష్ట్ర ఆయకట్టు విస్తీర్ణం : 27 వేల ఎకరాలు

చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం

 • నిర్మాణ స్థలం : మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లిలో లక్ష్మీకెనాల్‌ డిస్ట్రిబ్యూటర్‌-4 వద్ద నిర్మించారు.
 • నిర్మాణ వ్యయం : రూ.55 కోట్లు
 • ఆయకట్టు విస్తీర్ణం : 11,625 ఎకరాలు
 • లబ్ధిపొందు మండలాలు : కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌

నల్ల వాగు మత్తడి

మెదక్‌ జిల్లా నల్లవాగు ప్రాజెక్టు నీటి వృథాను అరికట్టేందుకు నిర్మించారు. నల్లవాగు మత్తడి పొంగి పొర్లినప్పుడు నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో కలుస్తుంది. ఇది 4 కిలోమీటర్లు ఉంది.

సింగీతం ప్రాజెక్టు

పెద్దగుట్ట, హన్మాజీపేట, గాంధారి ప్రాంతాల నుంచి సింగీతం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. పెద్దగుట్టవాగు 24 కిలో మీటర్ల దూరం ప్రవహించి మంజీరాలో కలుస్తుంది. దీనిపై సింగీతం ప్రాజెక్టును నిర్మించారు.

కల్యాణి ప్రాజెక్టు

తిమ్మారెడ్డి శివారులో నిర్మించారు. ఈ ప్రాజెక్టులోకి చుట్టుపక్కల ఉన్న తిమ్మారెడ్డి, కళ్యాణి వాగుల నుంచి నీరు వస్తుంది. ఈ రెండు వాగులు 5 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తాయి. ఇవి కూడా మంజీరాలో కలుస్తాయి.

ఆధారము: ఈనాడు

నదులు

భౌగోళికంగా నిజామాబాద్‌ జిల్లా దక్కను పీఠభూమిలో ఉంది. దీనికి ఉత్తరభాగంలో గోదావరి, మంజీరా నదులు ప్రవహిస్తున్నాయి. సముద్రమట్టానికి 1000-1650 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతంలో ఈ రెండు నదుల వల్ల ప్రధానంగా నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులు ప్రజలకు జీవనాధారమయ్యాయి. ధాన్యాగారంగా పేరొందిన నిజామాబాద్‌ జిల్లాకు ఈ నదులు ఆయువుపట్టు అయ్యాయి. వీటి ఆధారంగానే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు నిర్మితమయ్యాయి. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, చెరుకు, మొక్కజొన్న తదితర పంటలకు ఈ నీరే ఆధారమైంది. విశేషమేమంటే మంజీరా ఉపనది జిల్లాలో అంతమవుతుండగా, మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరి అక్కడి నుంచే జిల్లాలోకి ప్రవేశిస్తుండడం. ఈ ప్రదేశంలో హరిద్రా, గోదావరి, మంజీర మూడు నదుల సంగమం త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రదేశం రెంజల్‌ మండలం కందకుర్తి వద్ద ఉంది.

గోదావరి

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రెంజల్‌ మండలంలో త్రివేణిసంగమంగా పేరొందిన కందకుర్తి వద్ద జిల్లాలోకి గోదావరి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి నవీపేట, నందిపేట మండలాలను అనుకొని ప్రవహిస్తూ శ్రీరాంసాగర్‌ జలాశయంలో కలుస్తుంది. అటుపిమ్మట బాల్కొండ మండలం పోచంపాడు నుంచి మోర్తాడ్‌ మండలం తడపాకల వరకు వచ్చి ఆదిలాబాద్‌ జిల్లాలో చేరుతుంది. ఇది జిల్లాలో సుమారు 96 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో 95.16 మీటర్లు (312అడుగులు) నుంచి 40 మీటర్లు (130అడుగులు) ఎత్తులో ప్రవహిస్తుంది. సాగయ్యే భూమి 100-600 మీటర్ల ఎత్తులో ఉండి దక్కను పీఠభూమిలో భాగంగా ఉంది. ఉన్న భూముల్లో ఎక్కువ ప్రవాహభాగం రాతిభూమి అవడంవల్ల అది కూడ ఎగుడు, దిగుడుగా ఉండడంతో వర్షం, వరద నీరు భూమిలోకి ఇంకకుండానే వాగులు, వంకలద్వారా దిగువకు వెళ్తోంది. గోదావరి నది ఆధారంగా తెలంగాణకు వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్‌కు 112 శతకోటి ఘనపుటడుగుల నీటిసామర్థ్యంతో కనీసం 81 శతకోటి ఘనపుటడుగుల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత దశాబ్దకాలంగా గోదావరి నదిని ఆధారంగా చేసుకుని సిహెచ్‌.కొండూర్‌, తల్వేద, మారంపల్లి, డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌, వన్నెల్‌(కె), జలాల్‌పూర్‌, తదితర ఎత్తిపోతల పథకాలు నిర్మితమయ్యాయి. మరో పది ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

మంజీరా

కర్ణాటక ప్రాంతం నుంచి జిల్లాలోకి మంజీరా నది ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణిసంగమం వద్ద గోదావరితో కలుస్తుంది. ఈ నది ద్వారా 58 శత కోటి ఘనపుటడుగుల నీరు లభ్యమవుతుంది. మంజీరా నది ఆధారంగా బుడ్మి, దామరాంచ, హన్సా, కారేగావ్‌, కిష్టాపూర్‌, పోతంగల్‌, కుర్తి, పైడిమాల, సంగోజీపేట తదితర ఎత్తిపోతల పథకాలు నిర్మితమయ్యాయి. మంజీరా నదితో ఇటు సాగునీటితోపాటు తాగునీరు, ఇసుక వంటి సహజవనరులు జిల్లాకు లభిస్తున్నాయి.

ఆధారము: ఈనాడు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate