অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాండం మొక్కల ద్వారా దొండ సాగు – సస్యరక్షణ

కూరగాయల పంటలలో దొండకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దొండలో విటమిన్లు (విటమిన్ బి-1, విటమిన్-బి2), పోషకాలు (ఐరన్, కాలియం), పీచు పదార్థాలు లభ్యమవుతాయి. dondaదొండ ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. మధుమేహం (డయాబెటిస్), శ్వాస నాళముల వాపు (బ్రాంక్రెటిస్), రక్తపోటు లాంటి వ్యాధుల నివారణ లక్షణాలను దొండ కలిగి ఉంటుంది. చూర్ణంగా చేసిన దొండకాయ గుజ్ఞను తలపై రుద్దడం వలన జట్టు రాలడం, చుండ్రును నివారించవచ్చు. దొండ ఆకులను చూర్ణంగా చేసి నుదుట రుద్దడం వలన తలనొప్పిని కూడా అరికట్టవచ్చు.

దొండ కాండం ముక్కలను ఒక్కసారి పొలంలో నాటుకొని పందిరి సహాయంతో సాగుచేస్తే మూడు సంవత్సరాల వరకు పంట దిగుబడిని అధికంగా పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పందిరి కూరగాయలను 20,041 హెక్టార్లలో సాగు చేస్తుండగా సంవత్సరానికి 3,00,615 టన్నుల దిగుబడి వస్తోంది. ఒక ఎకరం పొలంలో శాశ్వత పందిరి నిర్మాణానికి అంచనా వ్యయం సుమారుగా రూ.2,00,000 వరకు అవుతోంది.

శాశ్వత పందిరి నిర్మాణానికి అంచనా వ్యయం (ఒక ఎకరాకు)

 

వివరాలు

పరిమాణం

ధర (రూ.)

మొత్తం (రూ.)

రాతిస్థూపం

10 అడుగుల ఎత్తు

15 13 అ. అంతరంలో నిర్మాణం

155

350

64,750

స్టీల్ వైర్ (అల్లిక కోసం)

15 క్వి.

7,500

1,12,500

లేబర్ ఖర్చు

(గుంతలు తీయడం, రాళ్ళను పాతడం, స్టీల్ వైర్ అల్లడం)

-

-

40,000

సబ్సిడీ

50 శాతం (ఒక యూనిట్ వ్యయానికి రూ. 1, 00, 000/- ఎకరాకు)

గరిష్ట సబ్సిడీ పరిమితి

ఒక హెక్టారు మేరకు రూ. 2,50,000/-

వాతావరణం

దొండ సాగుకు తేమతో కూడిన పొడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే దొండ పెరుగుదల బాగుండి పూత, పిందె బాగా వస్తుంది.

నేలలు

నీటిని నిలుపుకొనే బంకమట్టి నేలలు దొండ సాగుకు అనుకూలంగా ఉంటాయి. మరుగు నీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలల్లో కూడా సాగుచేయవచ్చు. నేల ఉదజని సూచిక 6-7 మధ్య ఉండాలి.

నాటే సమయం

నీటి కొరత లేనంత వరకు సంవత్సరం పొడవునా అన్ని రుతువుల్లో సాగుచేయవచ్చు. ముఖ్యంగా మే, జూన్, జూలై, ఫిబ్రవరిలో నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది.

నాటటం

దొండను కాండం ముక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. చూపుడు వేలు మందంతో (2-3 ఇంచులు), 20 సెం.మీ. పొడవు కలిగి నాలుగు కణుపులు ఉన్న కాండం ముక్కలను పొలంలో నాటుకోవడానికి ఎన్నుకోవాలి. ఒక ఎకరానికి సుమారుగా 2,000 కాండం ముక్కలు అవసరమౌతాయి. కాండం ముక్కలను ఒక లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణంలో మంచి ప్రధాన పొలంలో వరుసల మధ్య 2 మీ., మొక్కల మధ్య 1 మీ. దూరం ఉండేలా నాటుకోవాలి.

కాండం ముక్కలను నాటడానికి ఒక అడుగు గుంతను తయారు చేసుకొని అందులో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. మట్టి, కంపోస్టు కొద్దిగా ఇసుక కలిపి నాటడానికి ముందు గుంతలలో వేసుకోవాలి. ప్రతి గుంతలో 100 గ్రా. ఎరువును 7:10:5 ఎన్.పి.కె. నిష్పత్తిలో వేసుకోవాలి. జీవ ఎరువులైన పేడ, వేవ గింజల నూనెను ఉపయోగించవచ్చు.

కలుపు నివారణ, అంతర కృషి

కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2-3 తడులు తర్వాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీ. 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 24-48 గంటలలోపు పిచికారీ చేయాలి. మొక్కలు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ను కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సి.సి.సి. 250 మి.గ్రా. లేదా మాలిక్ హైడ్రజైడ్ 50 మి.గ్రా. లీటరు నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేయవచ్చు. పంటను పందిరిపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి, మంచి మార్కెట్ రేటు లభిస్తుంది.

నీటి యాజమాన్యం

మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుటూ నిలవ ఉండకూడదు. వేసవి కాలంలో నాలుగైదు రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి.

దొండ కాండం ముక్కలను నాటిన 45-60 రోజులకు పూత, 85-100 రోజులకు కోత ప్రారంభమవుతుంది. మూడు సంవత్సరాల వరకు పంట దిగుబడిని పొందవచ్చు.

దిగుబడి

ఒక ఎకరాకు అత్యధికంగా 60 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది.

సస్యరక్షణ

దొండ పంటను తెగుళ్ళు పరుగులు ఆశిస్తాయి. సరైన సమయంలో చర్యలు తీసుకోవాలి. లేకపోతే పంటకు నష్టం వచ్చి దిగుబడి తగ్గుతుంది.

పురుగులు

పండు ఈగ

పంట పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. పూత, పిందెలలోకి చేరి కాయలను తిని పంటను నష్టపరుస్తాయి. దీని నివారణకు పూత, పిందె దశలలో మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పైరుపై పిచికారీ చేయాలి. 100 మి.లీ. మలాథియాన్ కు 100 గ్రా. చక్కెర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలపాలి. ఈ ద్రావణాన్ని మట్టి ప్రమిదలలో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది విషపు ఎరగా పనిచేస్తుంది.

గాల్ఫై

ఇది పంట తొలి దశలోనే ఆశిస్తుంది. కావున 5 శాతం వేప కషాయం తొలి దశలోనే పిచికారీ చేయడం వలన ఈ పరుగు విచక్షణ శక్తిని కోల్పోయి పంటను ఆశించకుండా ఉంటుంది. గాల్ఫై ఆశించిన తీగలను కత్తిరించుకొని ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి, లేదా క్లోరోఫైరిఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ పురుగు ఆశించకుండా నివారించవచ్చు.

తెగుళ్ళు

వేరుకుళ్ళ తెగులు

దొండ కాండం ముక్కలను భూమిలో నాటినప్పుడు ఒక్కోసారి వేరుప్రాంతం కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిన ప్రాంతం మొత్తం పొలుసులుగా మారుతుంది.

వేరుకుళ్ళ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేసిన కాండం ముక్కలను వాడాలి. మొక్కల చుటూ లీటరు నీటికి 2 గ్రా. మెటలాక్సిల్ కలిపి నేలంతా తడిసేలా పోయాలి. తెగులు ఆశించిన మొక్క చుటూ దాదాపు ఒక మీటరు దూరంలో ఈ ద్రావణాన్ని పోయాలి.

వెర్రి తెగులు

వెర్రి తెగులు పంటకు సోకినట్లయితే ఆకు, ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడతాయి. ఆకులు పెళుసుగా గీసబారిపోతాయి. దీంతో పూత, పిందెలు కాయడం ఆగిపోతుంది.

దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను తీసి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు 2 మి.లీ. డైమిధోయేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎండాకాలంలో దుక్కిని లోతుగా దున్నాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున వదలాలి. వరి పంటతో పంట మార్పిడి చేసుకోవాలి.

గంధకం సంబంధిత పురుగు, తెగుళ్ళ మందులను వాడకూడదు. వాడినట్లయితే ఆకులు మాడిపోతాయి.

తగిన సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate