অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చెరువు మట్టి ఏర్పడే విధానం – ప్రాముఖ్యత మరియు తెలంగాణ లోని ప్రధాన నేలలు

తెలంగాణ రాష్ట్ర దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతం సరాసరి సముద్ర మట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగి ఉండి ఆగ్నేయానికి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చ.కి.మీ. (114.84 లక్షల హెక్టార్లు). ఈ రాష్ట్రంలో భౌగోళికంగా మహబూబునగర్ (ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం)పెద్ద జిల్లా కాగా హైదరాబాద్ చిన్నది.

నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. మన దేశం వంటి వ్యవసాయాధారిత దేశానికీ చాలా ముఖ్యమైనది. ప్రజల సౌభాగ్యానికి సారవంతమైన నేలలు మూలాధారం. అట్టి నేలలను సంరక్షించడానికి సరైన యాజమాన్య పద్ధతులను విధిగా పాటించవలసిన అవసరం ఉంది. పంటలు పండటానికి ముఖ్యమైన సహజ వనరులు మాత్రమే కాక, పైరు నిలబడటానికి కావాల్సిన ఆధారం కల్పిస్తుంది. తేమను, అవసరమైన పోషకాలను తనలో ఇముడ్చుకొని మొక్కలకు అందిస్తుంది.

నేల ఏర్పడే విధానం

ప్రకృతిలో శిలలు శైధిల్యం చెందడం వలన నేలలు ఏర్పడతాయి. శిలలు క్రమంగా క్షీణించి రెండు రకాలుగా శిధిలత చెందుతాయి. భౌతికంగా జరిగే మార్పుల వల్ల అఖండత్వాన్ని కోల్పవడం (disintegration), రసాయనికంగా జరిగే మార్పుల వల్ల మూల పదార్థాలుగా విడిపోవడం (decomposition) జరుగుతుంది. వాతావరణంలో జరిగే మార్పుల వలన ఎండకు వేడెక్కడం, చలికి ఉష్ణోగ్రత తగ్గడం, మానవులు, జంతు సంచారం బోరియలు చేయడం, మొక్కల వేర్లు చొచ్చుకొనిపోవడం తదితర కారణాల వలన శిలలు పగిలి, అవి మరింతగా ముక్కలై, క్రమంగా చివరికి మట్టిగా రూపాంతరం చెందుతుంది. ఇది అతి నిదానంగా, నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక అంగుళం నేల తయారవడానికి సుమారు వెయ్యి సంవత్సరాలకు పైన పడుతుంది.

వ్యవసాయ పరంగా భూమి ఉపరితలంలో సుమారు ఒక అడుగు లేదా నాగలి సాలు వరకు ఉన్న మట్టిని నేల అని చెప్పడం జరుగుతుంది. భౌతికంగా నేలలో ఖనిజ పదార్థాలైన బంకమన్ను ఒండ్రు, ఇసుక రేణువులతో పాటు సేంద్రియ పదార్ధం ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఇవి నల్లరేగడి భూముల్లో ఒక విధంగాను, ఎర్ర చల్క, ఇసుక భూముల్లో వేరే విధంగాను ఉంటాయి. ఇవే కాక గాలి, నీరు, సూక్ష్మజీవులు, నాచు, బూజు, నేలలో నివసించే వానపాములు, క్రిమి కీటకాలు, పరుగులు కూడా నేలలో భాగంగానే నేల అభివృద్ధికి పాటుపడుతుంటాయి.

మనం చూసే నేల మట్టిలో 2 మి.మీ. నుండి 0.2 మి.మీ. లోపు వ్యాసం గల మట్టి రేణువులను గండు ఇసుక, 0.2 నుండి 0.02 మి.మీ. వ్యాసం గల రేణువులను సన్న ఇసుక, 0.02 నుండి 0.002 మి.మీ. లోపు వ్యాసం గల రేణువులను ఒండ్రు, 0.002 మి.మీ. కంటే తక్కువ వ్యాస్తం గల రేణువులను బంకమన్నుగా విభజించారు. నేలలో ఉండే రేణువుల శాతాన్ని బట్టి ఇసుక నేలలు, ఎర్ర గరప, చల్క నేలలు, నల్లరేగడి నేలలుగా వర్ణిస్తారు.

పోషకాలను పట్టి ఉంచే శక్తి, గాలి, నీరు చొచ్చుకొని వెళ్ళే లక్షణం మురుగుతీత మొదలైన గుణాలు మట్టి రేణువుల పరిమాణపు పాళ్ళు నేల అమరిక లేదా నిర్మాణం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. నేల భౌతిక లక్షణాలతో పాటు రసాయన లక్షణాలలో ఉదజని సూచిక (పి.ఎచ్), లవణ పరిమాణం, లభ్యపోషకాలు, సూక్ష్మజీవుల చర్య మొదలైనవి మొక్క పెరుగుదల, దిగుబడులపై అధిక ప్రభావం చూపిస్తాయి. ఈ లక్షణాలు అన్ని అనుకూలంగా ఉన్న నేలలను మంచి అధిక దిగుబడినిచ్చే నేలలు /సారవంతమైన నేలలు అని అంటాం.

తెలంగాణ నేలలు

నల్ల నేలలు

నల్ల నేలలు గోదావరి, కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ నల్ల రేగడి నేలలు అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఈ నేల విస్తరించిన ప్రాంతాలలో పత్తి, చెరకు, వరి లాంటి పంటలను అధికంగా పండిస్తారు.

ఎర్రనేలలు

ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో పెసర, కంది, ఉలవ, వివిధ పప్పుదినుసు వంగడాలను, నూనె గింజలను అధికంగా పండిస్తారు. ఈ నేల పండ్ల తోటలకు అనుకూలం.

చల్క నేలలు

చల్క నేలలు తెలంగాణలో గుట్టల మధ్య వాలు భూముల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో లభ్య భాస్వరం, లభ్య నత్రజని పోషకాల శాతం తక్కువగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో - ఇలాంటి భూములను మనం అధికంగా చూడవచ్చు.

దుబ్బ నేలలు

ఈ నేలలు ఎండాకాలంలో బీడు భూములుగా ఉంటాయి. ఈ నేలల మందంలోతు తక్కువగా ఉంటుంది. ఇవి బూడిద ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలపైన క్రమక్షయం అధికంగా ఉంటుంది. ఈ నేలపైన దున్నటం కష్టంగా ఉంటుంది.

లాటరైట్ నేలలు

ఈ నేలలను ఎర్ర రాతి నేలలని, జిగురు నేలలని అంటారు. ఈ నేలలకు అధిక వర్షపాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. ఈ నేలలు పీత (ఎండ్రకాయ) రంగులో ఉంటాయి. బంకమట్టిని కలిగి ఉంటుంది. ఈ నేలలను మనం మెదక్ జిల్లా, జహీరాబాద్ డివిజన్ పరిధిలో అధికంగా చూడగలం.

పైన పేర్కొనబడిన నేలలో ఎర్ర నేలలు, చల్క నేలలు, దుబ్బ నేలలు తేలిక లేదా మధ్యస్థ నేలలుగా ఉండి సుమారు 30 నుండి 100 సెం.మీ. లోతు కలిగి ఉంటాయి.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు భాగస్వామ్యంతో చేపడితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒకటి లేదా రెండు గ్రామానికి కనీసం ఒక చెరువు ఉంది. సాధారణంగా అధిక వర్షపాతం ఉన్నప్పుడు పై పేర్కొన్న నల్ల, ఎర్రగరప, చల్క, దుబ్బ నేలలు కోతకు గురవడం మూలంగా క్రమక్షయం ఏర్పడి నేల పైభాగంలో సేంద్రియ పదార్థంతో కలిసి ఉన్న మట్టి (ముఖ్యంగా ఒండ్రు) చిన్న కాలువల ప్రవాహం ద్వారా కొట్టుకొని వచ్చి పెద్ద వాగులు ద్వారా చెరువులోకి చేరుతుంది. ఈ విధంగా చేరిన మట్టి ఒంద్రు, బంకమట్టి, సేంద్రియ పదార్ధాన్ని (బాగా మాగిన పేడను) కలిగి ఉంటుంది. ఇది చెరువు అడుగు భాగంలో చేరి స్థిరంగా (డిపాజిట్) ఉంటుంది. తద్వారా చెరువలో ఉన్న నీటిని ఇంకిపోకుండా, నీరు నిల్వ ఉండటానికి దోహదం చేస్తుంది. కానీ అధిక పరిమాణంలో మట్టి చెరువు అడుగుభాగంలో చేరినప్పుడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇందుకు ఉదాహరణ మన నిజాంసాగర్ ప్రాజెక్ట్ మంజీర నదీ పరీవాహక ప్రాంతంలో ఎక్కువ అడవుల విస్తీర్ణం లేనందువలన, సహజ నీటి వారధులైన గడ్డి మొక్కలు అధికంగా లేనందువలన, అధిక వర్షం పడినప్పుడు, ఉపరితల మట్టి రేణువులు వర్షపు నీటిలో కొట్టుకురావడం వలన ఈ రోజు నిజాంసాగర్ చెరువు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చెరువు ఉంది. ప్రతి గ్రామ పౌరుడికి తన గ్రామ చెరువుతో సహజ అనుబంధం కాకతీయుల కాలం నుండి పెనవేసుకుని ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ (మన ఊరు మన చెరువు) చెరువులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా, అమ్మలాంటి చెరువులను కాపాడుకోవడం తెలంగాణ బిడ్డలుగా ప్రతి పౌరుని బాధ్యత.

ఈ కారణాల వలన తెలంగాణ గ్రామాలలో ప్రతి చెరువు నుండి మట్టిని బయటికి తీయాల్సిన అవసరముంది. ఈ చెరువు మట్టిని ముఖ్యంగా, ఎర్ర , చల్క, దుబ్బ, లాటరైట్ నేలలు కలిగిన రైతులు తమ పొలాలకు ప్రభుత్వ భాగస్వామ్యంతో వేసుకుంటే అధిక పంట దిగుబడిని సాధించవచ్చు.

చెరువు మట్టి వలన కలిగే ప్రయోజనాలు

  • చెరువు మట్టిలో అధికంగా ఒండ్రు మట్టి రేణువులు, బంక మట్టి రేణువులు ఉండడం చేత సూల రంధ్రాల పరిమాణం తక్కువగా ఉండి సూక్ష్మరంధ్ర పరిమాణం ఎక్కువగా ఉండడం వలన నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువ. ఇందుమూలంగా నీరు ఈ నేలలో త్వరగా ఇంకదు.
  • కానీ మన తెలంగాణ జిల్లాలలోని నేలలు అయినటువంటి ఎర్ర, చల్క, దుబ్బు, లాటరైట్ నేలలో సూలరంధ్ర పరిమాణం ఎక్కువగా ఉండి సూక్ష్మరంధ్రం తక్కువగా ఉండుట చేత నేలల్లో నీరు త్వరగా ఇంకిపోవటమే కాక, నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వరాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎర్ర, చల్క, దుబ్బ, ఎర్ర లాటిరైట్ నేలల్లో వేసిన ఆరుతడి పంటలు వడలిపోయి, ఎండిపోయి ఉంటాయి. వర్షం పడ్డ తర్వాత కూడా పైరు నిలదొక్కుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత ఆరుతడి పంటలలో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఇలాంటి పరిస్థితి ఉన్న నేలల్లో ఎండాకాలంలో రైతులు చెరువు మట్టిని (ఒండ్రును) తమ పొలంలోకి తోలడం ద్వారా నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్నిఘనంగా పెంచుకోవచ్చు.
  • చెరువులో ఉండే మట్టి క్రమక్షయం ద్వారా ఎత్తు, వాలు ఉండే ప్రాంతం నుండి లోతట్టు ప్రాంతంలోకి కొటుకొని రావడంతో పాటు సేంద్రియు పదార్ధాలైనటువంటి ఆకులు, జంతు కళేబరాలను కూడా చెరువు మట్టిలో సమ్మిళితంచేస్తుంది. దీని ప్రభావం వలన మన చెరువు మట్టి నల్లని గోధుమ బూడిద రంగులోకి మారుతుంది.
  • చెరువు మట్టిలో సేంద్రియ పదార్థం కర్బనం 0.77 శాతం నుండి 2.0 శాతం వరకు ఉంటుందని తేలింది. సాధారణంగా అటవీప్రాంతంలో ఉండే చెరువులలో అధిక కర్బన శాతం (2 శాతం) ఉంది.
  • చెరువు మట్టిలో 0.3 శాతం నత్రజని, 0.2 శాతం భాస్వరం, 0.4 శాతం పొటాషియం ఉంటుంది.
  • చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం మొక్కలకు కావాల్సిన నత్రజనిని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలను అందిస్తుంది.
  • చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం సూక్ష్మ ఇతర పోషక పదార్ధాలను సమతూకంగా మొక్కలకు అందిస్తుంది.
  • చెరువు మట్టి ఎర్ర, చల్క, దుబ్బ నేలల్లో నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి, నేలల్లో సమపాళ్ళలో గాలి, నీరు ఉండేటట్లు చేస్తుంది.
  • తేలికపాటి నేలలైనటువంటి ఎర్రగరప, చల్క దుబ్బ, ఎర్ర లాటరైట్ నేలల్లో సూక్ష్మ రంధ్రాలను పెంచి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంట వడలిపోయే స్థితికి రాకుండా చేస్తుంది.
  • చెరువు మట్టి ఉదజని సూచిన (పి.ఎచ్.) మా పరిశోధనల్లో 7.0 నుండి 7.5 వరకు ఉందని నిరూపించడం జరిగింది. ముఖ్యంగా ఉదజని సూచిక తటస్థ స్థాయిలో ఉండటానికి ముఖ్య ఫున అయాను అయినటువంటి పొటాషియం, కాలియం, మెగ్నిషియం ఉండడం చేత ఉదజని సూచిక తటస్థంగా ఉంటుంది.తద్వారా అన్ని పోష పదార్థాలు మొక్కలకు అందుబాటులోకి ఉండే అవకాశం ఎక్కువ అవుతుంది.
  • చెరువు మట్టిని చేనులో వేసినట్లయితే నేలను కలుషితం చేసే భారీ లోహాలను పీల్చుకొని భూగర్భ జలాలు కలుషితం కాకుండా చేస్తుంది. (ఇవి మనకు ఎస్.ఎస్.పి. డి.ఎ.పి ఎరువుల నుండి అధికంగా మన పొలాలకు చేరుతాయి.
  • ఎండాకాలంలో నేల ఉష్ణోగ్రతను సమతుకంగా ఉంచుతుంది.
  • మా పరిశోధనల్లో 20 టన్నుల చెరువు మట్టి, సిఫారుసు చేయబడిన రసాయన ఎరువులతో కలిసి వేసినప్పుడు కందిలో సుమారు 2300 కిలోలు/హె (28 క్వింటాళ్ళు) దిగుబడి వచ్చింది. అదే విధంగా మొక్కజొన్నలో చెరువు మట్టి, సిఫారుసు చేసిన ఎరువులు వేసినప్పుడు 5500 కిలోలు/హెక్షారుకు (55 క్వింటాళ్ళు)మొక్కజొన్నదిగుబడి వచ్చింది.
  • చెరువు అడుగు భాగంలో, ఆనకట్టల వద్ద పేరుకుపోయిన ఒండ్రు మట్టిని రైతుల పొలంలో ఎక్కువగా వేయటం వలన నీటి, పోషక పదార్ధాల సామర్థ్యం పెరగడం మా పరిశోధనలో గమనించాం. అదే విధంగా మొక్కజొన్న కంది పంటల్లో చెరువు మట్టి వేసినప్పుడు సుమారు 10 నుండి 15 శాతం వరకు అధిక దిగుబడి వచ్చింది.

స్థూలంగా చెప్పాలంటే చెరువు మట్టితో మంచి భూసారం పెరుగుతుంది కాబట్టి చెరువు మట్టిని ప్రతి తెలంగాణ బిడ్డ తమ పొలాలకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా పుష్కలంగా భూగర్భ జలవనరులు పెరిగే అవకాశం కూడా ఉంది.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate