অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చేమ దుంప

పేరు

ఆరం లిలీ (Arum lily) లేదా ఆరేసీ (Araceae) కుటుంబానికి చెందిన చేమ మొక్క శాస్త్రీయ నామం కోలొకేషియా ఎస్కులెంటా (Colocasia esculenta). దీనిని కో. యాంటీకోరం (C. antiquorum) అని కూడ అంటారు. ఎస్కులెంటా అంటే "ఆహారంగా పనికొచ్చేది అని అర్థం." యాంటీకోరం అంటే "ప్రాచీనులు ఉపయోగించినది" అని అర్థం. ఆరేసీ కుటుంబానికి చెందినది కనుక దీనిని "ఆరం" (arum) అని కూడ అంటారు. హిందీ లోనూ, ఉర్దూ లోను దీనిని "ఆర్వీ" అనడానికి మూలం ఇదే. హిందీలో ఖుయ్యా అని కూడ అంటారు. ఇంగ్లీషులో టేరో (taro) అని కాని టేరో రూట్ (taro) అని కాని అంటారు.

మొక్క

చేమ మొక్క ఆకులు ఏనుగు చెవుల్లా పెద్దగా ఉంటాయి. అందుకనే ఇంగ్లీషులో ఈ మొక్కని Elephant ear అంటారు. చేమ మొక్కకి కాండం అంటూ ఉండదు; ఆకులు, కాడలు పొడుగ్గా పెరుగుతాయి. ఇది బహువార్షిక మొక్క. ఇది చిత్తడి నేలల్లోనూ, కాలవల వెంట పెరుగుతుంది. దుంపలు గుత్తులు గుత్తులుగా పెరుగుతాయి. మధ్యలో ఒక పెద్ద దుంప (corm) దాని చుట్టూ పిల్ల దుంపలు (cormels) ఉంటాయి.

జన్మ స్థలం

పేరు లోని యాంటీకోరం ని బట్టి చేమ ప్రాచీన కాలం నుండీ ఉపయోగంలో ఉందని తెలుస్తోంది. దీని జన్మస్థానం మూడొంతులు ఆగ్నేయ ఆసియా ప్రాంతం (అనగా, ప్రస్తుతం ఇండేనేసియా, ఫిలిప్పిన్ దీవులు, వియత్నాం, వగైరా). ఇది భారతదేశం లోనికి ప్రాచీన కాలంలోనే వచ్చి ఉంటుందని పెద్దలు అంచనా వేస్తున్నారు.

ఆహారంగా చేమ

కంద, పెండలం మాదిరే ఈ దుంపలలో కూడ కేల్సియం ఆగ్జలేట్ ఉండడం వల్ల పచ్చివి తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టుకుని తినాలి. హవాయి దీవులలో చేమ చాల ముఖ్యమైన వంటకం. దీనిని ఉడకబెట్టి, ముద్ద చేసి, ఊరబెట్టి "పోయ్" (poi) అనే పదార్థాన్ని చేసి ఆ ద్వీపవాసులు ఎంతో ఇష్టంగా తింటారు. ఉడకబెట్టిన ముక్కల్ని ఎర్రగా పెనం మీద వేయించిన (stir fry) చేమ వేపుడు తెలుగు దేశంలో ప్రసిద్ధమైన వంటకమే. ఉడకబెట్టిన దుంపలకి ఆవ పెట్టి వండిన కూర కూడ బాగుంటుంది కాని కొంచెం జిగురుగా ఉంటుందని కొంతమంది ఇష్టపడరు. పోషక విలువల పరంగా, 100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి. సంశ్లిష్ట కర్బనోదకాలు (కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్) ఉండడం వల్ల, పోషక నార (డయటరీ ఫైబర్‌) ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రాణ్యములు (ప్రోటీన్లు) కొద్దిగానే ఉంటాయి.

వైద్యంలో చేమ

విటమిన్‌ " సి," "బి-6 ," "ఇ," మేంగనీస్, కేల్సియం, ఇనుము, భాస్వరం తోపాటు పోషక నార (dietary fiber), ఏంటీ ఆక్సిడేంట్లు వంటి పోషక పదార్థాలు చేమ దుంపలలో ఉన్నాయి.

మరీ ఎక్కువగా తినడము వలన కడుపులో వికారము , అసౌకర్యము , విరోవనాలు వంటివి కలుగవచ్చును.

చేమ సాగు

తెలుగు రాష్ట్రాలలో పండించే దుంప కూరలలో చేమ ముఖ్యమైనది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసాయం ఇస్తుంది. అందువలన అన్ని కోస్తా ఆంధ్ర జిల్లాలలో మరియు కొన్ని రాయలసీమ, తెలంగాణా జిల్లాలలోను సాగు చేయుచున్నారు. భూసారం తక్కువగా కలిగిన తేలికపాటి భూములలో కూడా సాగు చేయవచ్చు.

చేమ విత్తనోత్పత్తి, నిల్వ పద్ధతి, సాగు పద్ధతులు మొదలగునవి ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉంటాయి.

పి.డి.ఎఫ్. ఫైల్ ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విషయ రచన భాగస్వామి :వందనం మద్దు

ఆధారముఆంధ్రప్రదేశ్ ఉధ్యాన విశ్వవిద్యాలయము మరియు వికీపీడియా© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate