హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / పంటల సాగు / జీవ రసాయనాలు – నాణ్యతా పరమైన అంశాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జీవ రసాయనాలు – నాణ్యతా పరమైన అంశాలు

ఈ మధ్య కాలంలో జీవన ఎరువులు, జీవ రసాయనాల వాడకం క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది.

వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పరుగు మందుల వాడకం వలన నేల సారం తగ్గిపోవడం, ఉత్పత్తిలో పరుగు మందుల అవశేషాలు ఉండిపోవడం వలన ఈ మధ్య కాలంలో జీవన ఎరువులు, జీవ రసాయనాల వాడకం క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది.

జీవన ఎరువులు, జీవ రసాయనాల వాడకంపై పెరిగిన రైతులు ఆసక్తిని ఆసరాగా తీసుకొని వీటి స్థానంలో బయో ఉత్పత్తుల పేరును అక్రమంగా, అశాస్త్రీయంగా వాడుకుంటూ తమ ఉత్పత్తులతో మొక్క ఏపుగా పెరిగే రసాయనిక ఉత్ర్పేరకాలు గానీ అనుమతులు లేని హానికారక రసాయనాలను గానీ నిబంధనలకు విరుద్ధంగా కలిపి అమాయక రైతాంగానికి అంటకడుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా మార్కెట్లో లభ్యమయ్యే టైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ (తెగుళ్ళనివారణ) బి.టి. బవేరియా బాసియానా (రెక్కల జాతి పురుగులకు); మెటారైజియం (వేరునాశించే పరుగులకు); లెకానిసిల్లియం లెకాని (రసం పీల్చే పురుగులకు) శాస్త్రీయంగా ఉద్దేశించిన చీడపీడలను సమర్థవంతంగా నివారించటమే కాకుండా పాడి పశువులకు, పర్యావరణానికి, మానవాళికి ఎటువంటి హాని చేయవని నిర్ధారించబడిన తర్వాత మాత్రమే అవసరమైన ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయబడతాయి.

వీలైనంత వరకు రైతాంగం ఈ రకమైన ప్రభుత్వ అనుమతులు ఉన్న జీవ రసాయనాలు/జీవన ఎరువులు వాడుకున్నట్లయితే చాలా వరకు నాణ్యతా పరమైన సమస్యలను అరికట్టవచ్చు. ప్రభుత్వపరంగా కూడా రసాయనిక ఎరువులు, రసాయనిక పరుగు మందుల వాడకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో జీవన ఎరువులు, జీవరసాయనాల వాడకాన్ని శాస్రవేత్తల సిఫార్పుల ప్రకారం వివిధ పంటలలో విరివిగా ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి రైతు ప్రోత్సాహకర పరిస్థితుల నేపథ్యంలో అవసరాన్ని ఆసరాగా తీసుకొని బయో ఉత్పత్తుల పేరును దుర్వినియోగ పరుసూ నాసిరకం హానికారక ఉత్పత్తులను బయో ఉత్పత్తుల ముసుగులో అమాయక రైతాంగానికి అధిక ధరలకు అంటకడుతున్నారు.

చట్ట ప్రకారం జీవ రసాయనాలన్నీ పురుగు మందుల చట్టం (ఇన్సెక్టిసైడ్ ఆక్ట్ 1965)లోనికి, జీవన ఎరువులన్నీ ఎరువుల నియంత్రణ చట్టం (ఎఫ్.సి.ఒ.1985) కిందకు వస్తాయి. కానీ పైన పేర్కొన్న ఉత్పత్తులు ఏ చట్టం పరిధిలోకి రాకపోవడం వలన కొంత మంది దురుద్దేశంతో ఈ ఉత్పత్తులతో మొక్క ఏపుగా పెరగడానికి పనికి వచ్చే రసాయనిక ఉత్ర్పేరకాలు, ఎటువంటి అనుమతులు లేని హానికారక రసాయనాలను వాటిలో కలిపి రైతాంగానికి అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విధమైన ఉత్పత్తులలో నిబంధనలకు విరుద్ధంగా కలుపుతున్న రసాయనిక ఉత్ర్పేరకాల వలన తాత్కాలికంగా మొక్కలు ఏపుగా పెరగటం వలన రైతులు కూడా సులభంగా మోసపోవడం పరిపాటి అయ్యింది. ఇదే కాకుండా రసాయనిక ఉత్ర్పేరకాల వాడకం వలన మొక్కలో కొత్త చిగురు వచ్చి మామూలుకంటే ఎక్కువ రసం పీల్చే పురుగుల ఉధృతి గమనించారు. రసం పీల్చే పురుగుల వలన పంటకు జరిగే నష్టంతో పాటు వీటి వలన వివిధ రకాల వైరస్ రోగాలు మొక్కకు సంక్రమించి రైతుకు మామూలు దానికంటే ఎక్కువ పంట నష్టం జరగటం లాంటి సంఘటనలు రాష్ట్రంలో చూశాం. మరికొన్నిచోట్ల ఈ ఉత్పత్తులలో రసాయనిక ఉత్ర్పేరకాల స్థానంలో నిషిద్ధ రసాయనాలు కూడా కలుపుతున్న నేపథ్యంలో రైతులకు పంట నష్టమే కాకుండా పర్యావరణానికి, మానవాళికి అపార నష్టం వాటిల్లే ప్రమాదం పొంచిఉంది. ఎక్కువ సందర్భాలలో ఇటువంటి ఉత్పత్తులు ఆకర్షణీయమైన పేర్లతో అన్ని రకాల రోగాలను, చీడ పీడలను నివారిస్తాయనే అబద్దపు ప్రచారంతో రైతాంగాన్ని మోస పుచ్చుతున్నారు.

ఇటువంటి సందిగ్ధ పూరిత వాతావరణంలో రైతు సోదరులు జీవ రసాయనాల కొనుగోలు, భద్రపరచుకోవడం, వాడకంలో కొన్ని రకాల జాగ్రత్తలు, మెళకువలు పాటించినట్లయితే ఏ విధమైన నాణ్యతా పరమైన సమస్యలు ভ58), చట్ట ప్రకారం తగిన అనుమతులు ఉన్న జీవ రసాయనాలను సమర్థవంతంగా వాడుకుంటూ ఎటువంటి పరుగు మందుల అవశేషాలు లేని మంచి నాణ్యత గల ఉత్పత్తులను పొందవచ్చు.

రైతాంగం జీవ రసాయనాల కొనుగోలు సమయంలో గమనించవలసిన విషయాలు

 • కొనుగోలు చేసే జీవ రసాయనం ప్యాకెట్/బాటిల్ పైన భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన పంజీ కరణ సంఖ్య (రిజిస్టేషన్ నెంబర్), రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన తయారీ లైసెన్స్ సంఖ్య (మ్యానుఫాక్చరింగ్ లైసెన్స్) ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి.
 • జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ క్షమతలో తేడా రాకుండా ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు అని తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని తదనుసారంగా జీవరసాయనాన్ని కొనుగోలు చేసుకోవాలి. సాధారణంగా జీవరసాయనాలను తయారు చేసిన తేదీ నుంచి 6 నెలల వరకు క్షమతలో ఎటువంటి తేడా లేకుండా వాడుకోవచ్చు.
 • కొనుగోలు సమయంలో తప్పనిసరిగా అమ్మకం దారునుండి సరైన రశీదు పొంది దానిపై అమ్మకం దారు సంతకం ఉందని నిర్ధారించుకోవాలి. ఈ విధంగా సరైన రశీదు పొందడం వలన మున్ముందు ఏ విధమైన నాణ్యతాపరమైన సమస్య తలెత్తినా చట్ట ప్రకారం అమ్మిన వారిపై చర్యలు తీసుకొనే ఆస్కారం ఉంది.
 • పురుగుమందుల చట్టం ప్రకారం, పైన పేర్కొన్న వివరాలు తప్పనిసరిగా తయారీ దారు ప్యాకెట్ / బాటిల్ పై ముద్రించాల్సి ఉంటుంది. సరైన వివరాలు ముద్రించని, రశీదు ఇవ్వని జీవ రసాయనాలను రైతు సోదరులు నకిలీ ఉత్పత్తులుగా గుర్తించి ఎటువంటి పరిస్థితులలోను కొనుగోలు చేయరాదు, వాడరాదు.

జీవ రసాయనాలను భద్రపరచుకునే సమయంలో, వాడకం విషయంలో పాటించాల్సిన మెళకువలు

 • జీవ రసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో గానీ తేమ లేక నీరు ఉన్న ప్రదేశాలలో గానీ ఉంచకూడదు.
 • జీవ రసాయనాల ప్యాకింగ్ను వీలైనంత వరకు వాడుకునే సమయంలోనే విప్పుకోవాలి.
 • ఎన్.పి.వి. వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళలో పిచికారీ చేసుకోవాలి.
 • జీవ రసాయనాలను రసాయనిక పరుగుమందులు, తెగుళ్ళ మందులతో కలిపి వాడకూడదు.
 • టైకోడెర్మా లేక సూడోమోనాస్తో విత్తనశుద్ధి గింజ విత్తుకునే ముందు మాత్రమే చేసుకోవాలి.
 • వీలైనంత వరకు శాస్త్రీయంగా నిర్ధారించబడిన సిఫార్పు చేసిన మోతాదులు, వాడకం పద్ధతులు ఎటువంటి మార్పులు లేకుండా పాటించాలి.

జీవ రసాయనాలకు సంబంధించి కొన్ని చట్టపరమైన అంశాలు

 • జీవ రసాయనాల నాణ్యత మీద రైతాంగానికి ఎటువంటి అనుమానాల్ని రైతులుగానీ, వారి ప్రతినిధులు కానీ అ నమూనాలను ప్రభుత్వ జీవ రసాయనాల గుణనియంత్రణ ప్రయోగశాల (బయో పెస్టిసైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్) మలక్పేట్, హైదరాబాద్లో ఇచ్చి అధికారికంగా నాణ్యత పరీక్షలు చేయించుకోవచ్చు.
 • జీవ రసాయనాల పేరుమీద ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా ఉద్దేశ పూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి గానీ లేక వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (సస్యరక్షణ) లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వవచ్చు.

వ్యవసాయంలో రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తూ వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా జీవ రసాయనాలను, జీవన ఎరువుల వాడకాన్ని పెంచే దిశలో ముందుకు పురోగమిస్తున్న వ్యవసాయశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత గల జీవ రసాయనాలను రైతు సోదరులు వాడుకుంటూ నేల సారాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ మంచి నాణ్యత గల ఉత్పత్తులు పొందడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నది.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

3.00476190476
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు