অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మిరప సాగులో మెళకువలు

mirapaభారత దేశంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. దీనిని కూరలో పచ్చికాయలుగా, ఎండు కాయలను పొడి చేసుకొని కారం కోసం వినియోగిస్తారు. మిరప పంట పండించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్తానంలో ఉంది. ఇండియాలో పండించే 13 లక్షల టన్నులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు 50 శాతం వాటా అంటే 6.5 లక్షల టన్నులు ఉచ్పత్తి అవుతుంది. దీనిలో ఒక్క గుంటూరు జిల్లా నుండే 3.20 లక్షల టన్నులు అంటే 50 శాతం వాటా పండుతున్నాయి. భారతదేశంలో మిరప పంటను సుమారు 7.9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 1.31 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతుంది. దీనిలో ఒక్క గుంటూరు జిల్లా నుంచే సుమారు 50 శాతం విస్థీర్ణం అఁటే 64,000 హెక్టార్లలో మిరప సాగు చేస్తున్నారు.

మన దేశంలో మిరప సాగుకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ క్రమంలోనే దీనిలో చాలా రకాల జన్యుక్రమాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిలో ఉత్తరప్రదేశ్ లో ఉరగాయగా లేదా పచ్చళ్ళ తయారీకీ వినియోగించే మిరప, కర్ణాటకలో స్వాష్, బ్యాగది మిరప, తమిళనాడులో మందు రకం, గుంటూరులో సన్న మిరప, వరంగల్ లో టమాటలో మిరప చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి.

నేలలు

వర్షాధారపు పంటకు నల్ల నేలలు, నీటి ఆధారపు పైర్లకు నల్ల నేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6-6.5 ఉన్న నేలలు అనుకూలం. నీటి ఎద్దడికి కొంత వరకు తట్టుకుంటుంది.

వాతావరణం

మిరప 10-35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప కోసం వేసే పంటను ఖరీఫ్ లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప కోసం సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.

వేల తయారీ

మిరపకు మెత్తటి దుక్కికావాలి. 3-4 సార్లు దుక్కి దున్ని 2 సార్లు గుంటకతోలాలి.

విత్తన మోతాదు

నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రా. (ఒక ఎకరానికి సరిపడే) నారు విత్తనం, ఎద బెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాలి.

విత్తనశుద్ధి

కిలో మిరప విత్తనానికి మెదలుగా వైరస్ తెగుళ్ళు నివారణకు గాను విత్తనశుద్ధి 150 గ్రా. ట్రైసోడియం అర్థోఫాస్ఫేట్ తర్వాత రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ ను, చివరగా ఇతర తెగుళ్ళ నివారణకు గాను 3 గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

మిరప ఎగుమతులు

మన దేశం నుండి మిరప కాయలు పచ్చి మిర్చి గాను, ఎండు మిరప కా.లు, తొడిమెలు తీసేసి మిరపకాయలు, నలగ కొట్టిన మిరప కాయలు, మిరప పొడి ఒలియోరెజిన్ వంటి రూపాలలో ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.గుంటూరు నుండి వివిధ దేశాలకు 1.25 లక్షల టన్నులు ఎగుమతి అవుతున్నాయి.

ఎగుమతి చేసే మిరపను 3 రకాలుగా విభజించవచ్చు.

 1. ఎక్కువ కారం ఉన్న రకాలు (80 వేల నుండి 11 లక్షల ఎస్.ఎచ్.యు. వరకు) – తేజ, వండర్ హాట్, యు.ఎస్ – 4884, బర్డ్స్ ఐ చిల్లీ – 1 నుండి 2 లక్షల ఎన్.ఎచ్.యు.
 2. నాగా చిల్లీ – 10 లక్షల ఎన్.ఎచ్.యు.

 3. మధ్యస్త కారం ఉన్న రకాలు (15 వేల నుండి 80 వేల ఎస్.ఎచ్.యు. వరకు) – ఎల్.సి.ఎ-334, ఎల్.సి.ఎ-341, 273, సూపర్ 10 వంటి రకాలు.
 4. తక్కువ కారం గల రకాలు:(15 వేల ఎస్.ఎచ్.యు. కంటే తక్కువ) – దేవనూరు డీలక్స్, బ్యాడిగి, వరంగల్ చపట (టమాటో చిల్లీ)

మిరప రకాలు

 1. mirapatwoఅర్క లోహిత :ఇవి ఐ.ఐ.ఎచ్.ఆర్. బెంగళూరు విడుదల చేసిన ఓపెన్ పాలినేటెడ్ రకం. మొక్కలు పొడవుగా నిటారుగా, కాయలు సూటిగా, నునువుగా మధ్యరకం పొడవుగా కొనలు మెనదేలి ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, పక్వదశలో ముదురు ఎరుపు రంగులోకి మారుతాయి. కారం అధికంగా ఉంటుంది. పంటకాలం – 180 రోజులు,
 2. దిగుబడి : పచ్చికాయలు – 25 టన్నులు/హెక్టారు. ఎండు కాయలు – 3 టన్నులు/హెక్టారు.

 3. అర్కమేఘన :ఐ.ఐ.ఎన్.ఆర్. విడుదల చేసిన హైబ్రిడ్ పచ్చి కాయలలో, ఎండు కాయలలో దిగుబడులను ఇస్తుంది. కాయ పొడవు 8-10 సెం.మీ., కాయ పందం 1-1.2 సెం.మీ. కలిగి ఉంటుంది.
 4. దిగుబడి – పచ్చివి  : 30-35 టన్నులు/హెక్టారు, ఎండు మిరప – 5 టన్నులు/హెక్టారు, పంట కాలం-180 రోజులు.

 5. అర్క సఫల్ :ఇవి ఐ.ఐ.ఎచ్.ఆర్. విడుదల చేసిన ఓపెన్ పాలినేటెడ్ రకం. కాయలు ఆకుపచ్చగా, నునులుగా మధ్యరకం పొడవుగా క1నలు మెండుబోయి కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి.
 6. దిగుబడి :25 టన్నులు/హెక్టారు, పంటకాలం : 160-180 రోజులు.

 7. అర్క అబ్హీర్ : ఐ.ఐ.ఎచ్.ఆర్. విడుదల చేసిన రకం. మొక్కలు పొడవుగా నిటారుగా కాయలు లేత ఆకుపచ్చ రంగులో ముడతలుగా ఉండి పక్వదశలో ముదురు ఎరువుగా మారుతాయి. పంటకాలం 160-180 రోజులు,
 8. దిగుబడి :2 టన్నులు/హెక్టారు

 9. జి-3: పొడవు కాయలు, వర్షాధారపు పైరుకు అనుకూలం. దిగుబడి వర్షాధారంగా 6-7 క్వి/ఎ, నీటి వసతి కింద 15-18 క్వి/ఎ.
 10. జి-4 (భాగ్యలక్ష్మీ): కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి. పచ్చికాయకు, ఎండుకాయకు అనుకూలం. వైరస్ ను తట్టుకుంటుంది. 40-50  క్వి/ఎ.
 11. జి-5 (ఆంధ్రజ్యోతి): కాయలు పొట్టిగా, లావుగా ఉంటాయి. నెల్లూరుకు, చిత్తూరుకు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో నీటి వసతి కింద సాగుకి నుకూలం. దిగుబడి 40-50 క్వి/ఎ.
 12. సి.ఎ.960 (సింధూర్): కాయలు పొడవుగా, లావుగా ఉంటాయి. పచ్చిమిరప, ఎండు మిరపకు అనుకూలం. నీటి వసతి కింద వేయ దగిన రకం. త్వరగా కాపుకొస్తుంది. కారం తక్కువ. వేసవి పైరుకు అనుకూలమైన రకం. దిగుబడి 50-55 క్వి/ఎ.
 13. ఎల్.సి.ఎ.235 (భాస్కర్): కాయలు పొడవు తక్కువ. కారం ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాధారంగాను, నీటి వసతి కింద సాగుకు అనుకూలం. వైరస్ ను బాగా తట్టుకుంటుంది. అన్ని జిల్లాలకు అనుకూలం. దిగుబడి 50-60 క్వి/ఎ.

విత్తడం

ఖరీఫ్ – జులై, ఆగస్టు

రబీ – అక్టోబర్, నవంబర్

నారుమడి యాజమాన్యం

ఒక మీటరు వెడల్పు 15 సెం.మీ. ఎత్తు ఉండేటట్లు నారునడులు చేసి మధ్యలో 30 సెం.మీ. కాలువలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రా. విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రోనిల్ గులికలను వాడితే రసం పీల్చే పురుగులను (నల్లి తప్ప) నివారించవచ్చు. సెంటుకు 1 కిలో వేపపిండి వేయాలి. ఒక శాతం బోర్డోమిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ ను లీటరు నీటిలో కలిపిన నీళ్ళతో నారుమడిని 2వ రోజు తడపాలి. ఆరు వారాల వయస్సు గల మొక్కలు నాటుకోవాలి.

నాటడం

ఆరు వారాల వయస్సు గల మొక్కలు నాటడానికి అనుకూలం. వర్షాధరపు పైరుకు 60 x 15 సెం.మీ. దూరంలో పాదుకు ఒక మొక్క చొప్పున నీటి వసతి కింద 60 x 60 లేదా 75 x 60 లేదా 90 x 60 సెం.మీ.ల చొప్పున పాదుకు 2 మొక్కల చొప్పున నాటుకోవాలి.

కలుపు నివారణ, అంతరకృషి

నాటిన 48 గంటల లోపు పెండిమిధాలిన్ 30 శాతం, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఎరువులు

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడితే లేదా పచ్చిరొట్ట పైరును పెంచి కలియదున్నాలి. వర్షాధారపు పైరుకు 24-16-20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను ఒక ఎకరానికి వాడాలి. ఆరుతడి పైరుకు 120-24-48 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని 3 సమపాళ్ళుగా చేసి నాటిన 30,45, 60 రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి.

మిరపలో సమగ్ర యాజమాన్యం

ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో రైతులు విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. అందువలన నేల నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోతుంది. మనం పండించే కాయలలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వలన విషపూరితంగా తయారవుతాయి. దీనివలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో నేలలు నిర్ణీవమై ఏ పంటలు పండించడానికి పనికిరాకుండా పోతాయి. అందువలన రైతులందరు సమగ్ర సస్యరక్షణ, సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి.

 • సాగుచేయబోయే పొలం మట్టి నమూనాలను సేకరించి, మట్టి పరీక్ష చేయించి ఫలితాలను బట్టి ఎరువులు వాడాలి.
 • పిల్లిపెసర, జనుము లాంటి పప్పుజాతి పచ్చిరొట్ట పంటలను సాగుచేసి పొట్ట దశలో రోటోవేటర్ తో పొలంలో కలియదున్నాలి. పురుగులు, తెగుళ్ళను నివారించడానికి విత్తనశుద్ధి చేయాలి.
 • ఎత్తు నారుమళ్ళలో నారు పెంచాలి. లేదా షేడ్ నెట్లలో పెంచిన వైరస్ సోకని నారుని నాటాలి.
 • పశువుల ఎరువు, వేపపిండితో ట్రైకోడెర్మా విరిడి మిశ్రమం తయారు చేసి పొలంలో వేయాలి.
 • పంట మార్పిడి విదానాన్ని అవలంబించాలి.
 • మిరప చేను చుట్టూ రక్షణ పంటలుగా హైబ్రిడ్ జొన్న లేదా మొక్కజొన్నను రెండు లేదా మూడు సాళ్ళలో వేయాలి.
 • కీటక ఆకర్షణ (ఎర) పంటలుగా బంతి, ఆముదాన్ని పొలంలో అక్కడక్కడా వేయాలి.
 • సకాలంలో అంతరసేద్యం చేసి కలుపు నివారించాలి.
 • నిషేధించబడిన పురుగు మందులను కూడా అవసరం మేరకే సకాలంలో మార్చి మార్చి వాడాలి.
 • ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టి పురుగుల ఉనికి గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate