హోమ్ / వ్యవసాయం / పంట సాగు మరియు యాజమాన్య పద్ధతులు / పంటల సాగు / వేసవి కూరగాయల సాగులో సమస్యలు - నివారణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేసవి కూరగాయల సాగులో సమస్యలు - నివారణ

మన ఆహారంలో కూరగాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

మన ఆహారంలో కూరగాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. నిత్యం కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు తమకు లభించే పరిమితి వనరులతో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి కూరగాయలు పండించినట్లయితే రైతులు మంచి దిగుబడులను పొందవచ్చు. కానీ వేసవిలో వీచే పొడి గాలులు, క్రమంగా పెరిగే ఉష్ణోగ్రతలు, తగ్గిపోయే నీటి వనరులు, విద్యుత్ సరఫరాలలో అంతరాయం ఇలా అనేక కారణాలు కూరగాయల సాగుకు ప్రతికూలంగా ఉంటాయి. కావున రైతులు వేసవిలో సాగు మెళకువలు తెలుసుకొని పాటించడం అవసరం.

వేసవిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసే కూరగాయ పంటలలో టమాట, వంగ, బెండ, మిరప, తీగజాతి కూరగాయలు ముఖ్యమైనవి. దోస, గుమ్మడి, కాకర, ఆనప వంటి తీగజాతి కూరగాయలను తక్కువ నీటితో సాగుచేసుకోవచ్చు. వేసవిలో కూరగాయల సాగులో వచ్చే సమస్యలను గమనించినట్లయితే ప్రధానంగా నీటి ఎద్దడి, పూత, పిందె రాలడం, పంటలను ఆశించే చీడపీడలు.

నీటి ఎద్దడి

కూరగాయలలో సుమారు 80 నుండి 95 శాతం వరకు నీరు ఉంటుంది. కావున కూరగాయల సాగులో నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడితో పాటు నాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కూరగాయలలో నీటి ఎద్దడి ప్రభావం దశను బట్టి ఉంటుంది. మొక్కలు తొలి దశలో నీటి ఎద్దడి ఏర్పడినట్లయితే మొక్కల పెరుగుదల, పక్వదశకు వచ్చే కాలపరిమితి పెరుగుతుంది. అదే పంట పక్వదశలో నీటి ఎద్దడి ఏర్పడినట్లయితే పూత, పిందె రాలి పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా దెబ్బతింటుంది. కాబట్టి రైతులు నీటి ఆవశ్యకత, ఎప్పుడు నీరు అందించాలి, నాలుగు అంశాలపై దృష్టిసారించాలి.

వేసవిలో నేలలోని తేమను సంరక్షించే పద్ధతులు పాటించాలి. ఎక్కువ మోతాదులో పశువుల ఎరువు వాడటం వలన భూమిలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

మల్చింగ్ పద్ధతి ద్వారా నేలలోని తేమ ఆవిరి రూపంలో పోకుండా ఉంచి, కలుపు పెరుగుదలను అదుపులో ఉంచుతుంది. మ రెండు రకాలు. సేంద్రియ మల్చ్ లు కత్తిరించిన గడ్డి, పంట వ్యర్థాలు వంటివి. ఇవి అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ మల్చ్ వాడుకోవచ్చు.

సాధారణంగా వేసవిలో ఎంత నేల మొక్కలు లేకుండా ఖాళీగా ఉంటుందో అంత ఎక్కువ నీరు ఆవిరి రూపంలో పోతుంది. కావున వేసవిలో మొక్కలు ఎక్కువ సాంద్రతలో ఉండేటట్లు చూసుకోవాలి. వరుసల మధ్య, మొక్కకి మొక్కకి మధ్య దూరం తగ్గించుకోవాలి. విత్తనాలు విత్తేటప్పుడు 2 నుండి 3 సెం.మీ. లోతులో విత్తుకొని రోజు విడిచి రోజు తక్కువ మోతాదులో నేలలో తేమ ఉండేటట్లు చూసుకుంటే, అధిక మొలక శాతం వచ్చి మొక్కల సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

నీటి తడులు

నీటి ఎద్దడి ఏర్పడే ప్రాంతాల్లో నీటి వనరులు సరిపోవు అనుకున్నప్పుడు,కూరగాయల్లో సున్నిత దశను తెలుసుకొని, పంట, నేల స్వభావాన్ని బట్టి నీరు అందించాలి. టమాటకు ప్రతి 5-6 రోజులకు ఒక తడి ఇస్తూ పూత, పిందె దశలో శ్రద్ధ చూపాలి. క్రమ పద్ధతిలో నీరు ఇవ్వకుంటే కాయు పగిలే అవకాశముంది. వంగకు 4-5 రోజులకొక తడివ్వాలి. నీటి ఎద్దడి వస్తే కాయ రంగు, పరిమాణం తగ్గి, కాయల్లో చేదు వచ్చి నాణ్యత కోల్పోతుంది.

బెండకు ప్రతి 4 రోజులకు ఒకసారి తడి అవసరం. పూత, పిందె దశల్లో కాక కాయ పెరుగుదల దశలో నీటి ఎద్దడి వస్తే దిగుబడి తగ్గిపోతుంది. బీర, సౌర, కాకర, గుమ్మడి పొదలకు వారం రోజులకొక తడివ్వాలి. పూత, కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి వస్తే కాయలు రాలిపోవడమే కాక కాయలు డొల్లపోయి నాణ్యత తగ్గుతుంది.

నీటి ఆదా పద్ధతులు

మనకు అందుబాటులో ఉన్న ఆధునిక నీటి పద్ధతుల్లో బిందు సేద్యం ముఖ్యమైనది. బిందుసేద్యం పద్ధతి ద్వారా నీరు అందించడం వలన 70-80 శాతం నీరు ఆదా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మొక్కల అడుగు భాగాన ఎక్కువ తేమ ఉండదు కాబట్టి, తెగుళ్ళు కూడా తక్కువగా ఆశిస్తాయి. వేసవిలో ఆకుకూరల సాగులో తుంపర్ల పద్ధతి (స్ప్రింక్లర్) ూలూ లాభదాయకం. అధిక దిగుబడికి, ఎక్కువ కోతలకు రోజు విడిచి రోజు నీరు అందించాలి.

నీటి ఎద్దడిలో ఎరువుల యాజమాన్యం

వేసవి నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఎరువుల యాజమాన్యంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా అన్ని రసాయనిక ఎరువులు లవణ గుణాలు కలిగి ఉంటాయి. అంటే రసాయనిక ఎరువులు నీటిని పీల్చుకొని కరిగి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. కావున వేసవిలో కూరగాయలకు రసాయనిక ఎరువులు మొక్కలకు దగ్గరగా వేయకుండా 5 సెం.మీ. దూరంలో వేసుకోవాలి. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఇచ్చి తడులు అందించాలి. మార్కెట్లో నీటిలో కరిగే ఎరువులను (ఉదా : 14–14-14, 13-0-45, 19-19-19) నీటితో పాటుగా (ఫెర్టిగేషన్ పద్ధతి ద్వారా) లేదా మొక్కలపై పిచికారీ పద్ధతిలో కూడా అందించవచ్చు.

నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను వాడడం

వేసవిలో సాగుకు అనుకూలంగా ఉన్న రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా సంకర జాతి రకాలకన్నా సూటి రకాలు ఎక్కువ బెట్టను తట్టుకోగలుగుతాయి. కావున నీటి ఎద్దడిని తట్టుకొనే రకాలు వేసుకుంటే రైతులు అధిక దిగుబడులను పొందవచ్చు.

పూత, పిందె రాలడం

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల పూత, పిందె రాలుతుంది. దీనిని నివారించడానికి నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. టమాట, వంగ పంటలకు ప్లానోఫిక్స్ (ఎన్.ఎ.ఎ) 2.5 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మిరప పూత దశలో టైకాంటినాల్ 20 మి.గ్రా. లేదా ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి రెండుసార్లు పిచికారీ చేసే పిందె నిలుస్తుంది. తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతలు మగపూలు ఎక్కువగా వచ్చి లింగ నిష్పత్తి తగ్గి, దిగుబడి తగ్గుతుంది. నివారణకు పూతదశలో సైకోసిల్ 25 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

సస్యరక్షణ

వేసవిలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, పిండి పురుగు, నల్లి వంటివి పొడి వాతావరణం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు వ్యాప్తి జరుగుతుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుటూ జొన్న లేదా సజ్ఞ పంటలను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని కొంత వరకు తగ్గించవచ్చు. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు డబ్బాలు లేదా రేకులను ఆముదం, గ్రీజు పూసి పెట్టాలి. తెల్లదోమలు దీనికి ఆకర్షింపబడతాయి.

మొక్క పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుంచి పూత వరకు 5 శాతం వేప కషాయాన్ని 15 రోజుల తేడాతో పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిధోయేట్ లేదా మెటాసిస్టాక్ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తీగజాతి కూరగాయల్లో పండు ఈగ బెడద నుండి నివారణకు మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఈ విధంగా పై పద్ధతులను అనుసరిస్తూ రైతులు వేసవిలో కూరగాయల సాగు ద్వారా మంచి దిగుబడు తద్వారా రాబడిని పొందవచ్చు.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

3.00698324022
సాయి కిరణ్ May 12, 2018 06:52 PM

బీరకాయ సాగులో పాటించవలసిన సస్యరక్షణ పద్ధతులు మరియు కొత్తిమీర సాగులో మెళకువలు తెలపండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు