অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

హరిత గృహాలలో టమాట సాగు

tamatoహరిత గృహాలలో కూరగాయలు పండించే రైతులకు విభిన్న అవకాశాలు ఉన్నాయి. పంటనాణ్యతలో, ఉత్పాదకతలో, అనుకూలమైన గిట్టుబాటు ధరలు ఉన్నాయి. రైతులు రుతు సంబంధంగా పండించే కూరగాయలలో ఎక్కువ పంట దిగుబడులు సాధించినప్పటికి ఒకేసారి ఎక్కువ మోతాదుల్లో అవే కూరగాయలు మార్కెట్కి రావడం వలన సరైన గిట్టుబాటు ధరలు లభించక లాభాలను పొందలేకపోతున్నారు. హరిత్ర గృహాలలో రుతువులతో సంబంధం లేకుండా ఆ పంటకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు కల్పించి వివిధ కూరగాయలను పండించుకోవచ్చు. ఇలా వచ్చిన వాటికి మార్కెట్లో అధిక గిట్టుబాటు ధరలు లభించి రైతులు లాభాలు పొందడానికి అవకాశం ఉంది. అమెరికా, కెనడా, యూరోప్ దేశాలలో హరిత గృహాలలో సాగు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సాగులో ఖచ్చితత్వం ఉండి ప్రతికూల వాతావరణ పరిస్థితులను, స్థలభావ పరిస్థితులను అధిగమించవచ్చు. ఈ విధమైన రక్షిత పరిస్థితులలో గాలి, ఉష్ణోగ్రత తేమ మొదలైన వాతావరణ కారకాలను నియంత్రించవచ్చు.

పంట ఎంపిక

హరిత గృహాల కింద సాగుచేసే కూరగాయల పంటల ఎంపిక అనేది ఆ హరిత గృహాల నిర్మాణం, పరిమాణం, ఆ పంట దిగుబడి ఆర్థిక అంశాలు, లాభాలపై ఆధారపడి ఉంటుంది.

హరిత్ర గృహాలు ముఖ్యంగా 8 రకాలుగా ఉంటాయి. 1. అధిక ధర కలిగిన హరిత గృహాలు, 2. మధ్యస్త ధర కలిగిన హరిత గృహాలు, 3. తక్కువ ధర కలిగిన హరిత గృహాలు. పైవాటిలో అధిక ధర కలిగిన హరిత గృహాలలో ఎలాంటి కూరగాయలైనా ఏ కాలంలోనైనా సాగు చేయవచ్చు. ఇలాంటి సౌకర్యం మధ్యస్త తక్కువ ధర కలిగిన హరిత గృహాలలో చాలా తక్కువగా ఉంటుంది. హరిత గృహాలలో సాగుచేసే కూరగాయలలో టమాట, వంకాయ, కూరమిరప, మిరప చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

బయటి పరిస్థితులలో సాగుచేసే పంటలతో పోల్చినప్పుడు హరిత గృహాలలో సాగుచేసే పంటలకు కూలీలు, ఇతర కారకాలు ఎక్కువగా అవసరం అవుతాయి. తాజా కూరగాయలకు పెద్ద పెద్ద పట్టణాలలో సంవత్సరం పొడవునా నిరంతరం అధిక డిమాండ్ కలిగి ఉంది. ఈ కూరగాయలన్నింటిలో రక్షిత పరిస్థితులలో హరిత గృహాల కింద ప్రపంచంలో మొదటి సారిగా టమాటను సాగుచేశారు.

విత్తన రకాల ఎంపిక

హరిత గృహాలలో టమాట సాగు విజయవంతం కావాలంటే సరైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. ముఖ్యంగా కాయ పరిమాణం, ఆకారం, రంగు లక్షణాలు, చీడపీడల నిరోధకత కలిగిన, ఎక్కువ కాపుకు వచ్చి అధిక దిగుబడులను ఇచ్చే ఉన్నత రకాలను లేట్ హైబ్రిడ్స్ను ఎంచుకోవాలి.

డి.ఎ.ఆర్.ఎల్-303, ఎచ్.టి-6, సన్-764, ఎన్.ఎన్-1237, నవీన్, ఎన్.ఎస్-4130, అభిమాన్, సి.ఒ. టి.ఎచ్-1, ఎన్.డి.టి -5, ఎన్.డి.టి-120, పూసా దివ్య మీనాక్షి లక్ష్మీ ముఖ్యమైనవి.

వాతావరణం

కాయలు ఏర్పడటం, రంగు, పోషక విలువలు అనేది ఉష్ణోగ్రత, కాంతి ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. టమాటలో కాయలు ఏర్పడటానికి 16-22 డిగ్రీల సెంటీగ్రేడ్ రాత్రి ఉష్ణోగ్రతలు అనుకూలం. అంతకంటే ఉష్ణోగ్రతలు తగ్గితే కాయలు ఏర్పడవు. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీల సెంటీగ్రేడ్, 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. కాయలు మంచి రంగు ఉండాలంటే 18-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉషోగ్రతలు అనుకూలమైనవి. వేసవిలో హరితగృహాలను చల్లబరచడం ద్వారా, శీతాకాలంలో వేడిని కల్పించడం ద్వారా టమాట పంటను 10 మాసాల నుండి 12 మాసాల వరకు సాగు చేయవచ్చు.

నారుమడి యాజమాన్యం

చీడపీడలు లేని ఆరోగ్యకరమైన నారు ఎదుగుదలకు నారును కీటక నిరోధక హరిత గృహాలలో, ప్లాస్టిక్ ట్రేలలో మట్టి బదులు కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఉపయోగించి పెంచుకోవాలి. ఇలా పెంచుకున్న ఆరోగ్యవంతమైన నారును 25-30 రోజుల వ్యవధిలో 60X45 సెం.మీ. ఎడంతో నాటుకోవాలి. నాటును ఉదయం వేళల్లో లేచి సాయంత్రం సమయంలో వేసుకోవాలి.

నీటి యాజమాన్యం

హరితగృహాల్లో సాగుచేసే పంటలకు నీటి పారుదల బిందు సేద్యం పద్ధతిని కల్పించాలి. ఈ పద్ధతిలోనే ఎరువులను సరైన మోతాదులో వేయవచ్చు. మొక్కలు నీటిని, ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని దీర్ఘకాలం సాగులో ఉంటాయి. బిందుసేద్యం పద్ధతిన నీటి పారుదల కల్పించినప్పుడు పీడనం తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

కత్తిరింపులు, శిక్షణ

హరిత గృహాలలో పండించే పంటను ఎప్పటికప్పుడు చక్కబెడుతూ ఉండాలి. ప్రధాన కాండం నిలబడటానికి పక్కకు వచ్చిన కొమ్మలను లేదా చిగుర్లను ఎప్పటికప్పుడు తీసివేయాలి. లేత కొమ్మలను తుంచి వేయాలి. కొమ్మలను కత్తితో లేదా బ్లేడుతో లేదా కత్తెరతో గానీ తుంచకూడదు. ఇలా చేయడం ద్వారా టమాట మోజాయిక్ వైరస్ ఒక మొక్కనుండి వేరే మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఎదిగే కొమ్మల మొదళ్ళకు ప్లాస్టిక్ దారాన్ని కట్టి దారం రెండవ కొన కప్పు కింది భాగంలో భూమికి సమాంతరంగా కట్టబడిన జి.ఐ. తీగకు బిగించాలి. మొక్క మొత్తం తీగను సవ్యదిశలో 3 ఆకులకు ఒక చుటూ తిప్పాలి. ఇలా చేయడం వలన తీగనుండి మొక్కకు ఆధారం కల్పించబడుతుంది. క్రమం తప్పకుండా మొక్కలను వాటి జీవితకాలం పూర్తయ్యే వరకు చక్కబెడుతూ, సవరిసూ ఉండాలి. ఇలా చేయడం వలన మొక్కలు 30-35 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి. మొక్క కింది భాగంలో పండు బారిన పత్రాలను తుంచి వేయాలి. ఇలా చేయడం వలన గాలి ప్రసరణ బాగా జరిగి చీడపీడల నుండి రక్షణ కలిగి మందులు పిచికారీ చేయడానికి, కాయలు సులభంగా కోత కోయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యల వలన కాయలు నాణ్యంగా ఉండి అధిక దిగుబడులు వస్తాయి.

పరాగ సంపర్కం

టమాటలో ఎక్కువగా స్వపరాగ సంపర్కం జరుగుతుంది. కానీ హరిత గృహాలలో రక్షిత పరిస్థితుల వలన గాలి ప్రసరణ తక్కువగా, తేమ తక్కువగా ఉండడం వలన వాటి సహజ సిద్ధ సంపర్కం జరగడానికి కూలీలతో చేతితో గానీ, వైబ్రేటర్ల సహాయంతో మొక్కలను కదిలించడం చేయాలి. కొన్ని దేశాలలో హరితగృహాలలో పరాగ సంపర్కం జరగడానికి కొన్ని రకాల కందిరీగలను ఉపయోగిస్తున్నారు. ఇలా రోజుకు 2 సార్లు చేయడం వలన మొక్కలకు కావాల్సిన పరిమాణంలో పరాగరేణువులు విడుదలై సంపర్కం జరుగుతుంది.

ఎరువుల యాజమాన్యం

ఒక హెక్టారుకి 350 కిలోల నత్రజని, సూపర్, పొటాష్లను 1:1:1 నిష్పత్తిలో వారంలో ఒకసారి నీటిలో కరిగించి మొక్కలకు అందచేయాలి.

హరిత గృహాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నియంత్రణ

tamatotwoచాలా హరిత గృహాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను నియంత్రించడానికి భాష్పీభవన శీతలీకరణ వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా తేవు శాతాన్ని, అది క ఉషోగ్రతలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో హరిత గృహాల కప్పు కింది భాగంలో ఉన్న షేడ్ నెట్ను ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. వరకు కప్పి ఉంచాలి. మడుల మధ్య గల కాలి బాటలపై ఇసుకను 2 అంగుళాల మందంగా పరిచి వాటిపై నీటిని చల్లడం ద్వారా కూడా వేడిని కొంత వరకు నియంత్రించవచ్చు. డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు హరిత గృహాలలో ఉష్ణోగ్రతలను పెంచడం ద్వారా మొక్కల పెరుగుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు.

కాయలు కోయడం, కోత అనంతరం చేపట్టవలసిన చర్యలు

హరిత గృహాలలో పండించే కాయలు కోయడం ఒక నిరంతర ప్రక్రియ. నారు నాటిన 75-80 రోజుల తర్వాత పంట మొదటి కోతకు వస్తుంది. కోసిన తర్వాత కాయ పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ చేసుకోవాలి. వేసవి కాలంలో కాయ కోత అనంతర నష్ట నివారణకు కాయలను ఉదయం లేదా సాయంత్రం వేళలో కోసుకోవాలి.

సస్యరక్షణ

సాధారణంగా హరిత గృహాలను నిర్మించేటప్పుడు పంటలకు చీడపీడల నుండి రక్షణ పొందేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ కారణంగా ఎటువంటి వరిస్థితుల్లోనైనా రసాయనాలను పిచికారీ చేయవలసిన అవసరం రాదు. వీటిని నాలుగు మూలల 40-50 మెష్గల కీటక నిరోధక నైలాన్ వలతో కప్పడం ద్వారా రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక మొదలగు వాటి నుండి రక్షించవచ్చు. ఈ పురుగులను నిరోధించడం ద్వారా వీటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్ళు కూడా నియంత్రణలో ఉంటాయి. రసం పీల్చే పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి 1-2 సార్లు రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి. నాటు వేసిన 10 రోజుల తర్వాత మెటాసిస్టాక్స్ 1.5 ఎం.ఎల్ / లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

నల్లి పురుగుల నివారణకు డైకోఫాల్ 2 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ, తామర పురుగుల నివారణకు జిగురు పూసిన పసుపుపచ్చ లేదా నీలిరంగు అట్టలను అక్కడక్కడ పెట్టుకోవాలి. నులి పురుగుల నివారణకు, నేల ద్వారా వ్యాపించే వ్యాధికారకాలను నియంత్రించడానికి నేలను ఒక నెల ముందు 37 శాతం ఫార్మాల్డిహైడ్తో సూక్ష్మజీవి రహితం (స్టెరిలైజేషన్) చేయాలి. మొజాయిక్ వైరస్ బారిన పడిన మొక్కలను వెంటనే పీకి పారేయాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate