జనాభా వేగంగా పెరగడం వలన ఆహార అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఉత్పత్తిని మరింత పెంచాల్సిన ఒత్తిడి వ్యవసాయరంగంపై ఉంది. అందువల్ల ఎరువులు, నీరు అధికంగా వినియోగించడం సమస్యగా పరిణమించింది. ఈ పరిస్థితిలో అధిక ఉత్పత్తినిచ్చే పంటలు, వ్యవసాయ విధానాలపై ఆలోచించాల్సి ఉంది. మిశ్రమ పంటలు, అంతర పంటల వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించడం ఉపయోగకరం. వీటివలన భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. పంట దిగుబడి తగ్గకుండా ఉండటానికి దీనిని ఒక పరిష్కారంగా భావించవచ్చు.
ఉన్నది అర ఎకరం పొలమే అయినా దానిలో సజ్జలు, జొన్నలు, రాగులు, వరి, కందులు, పెసలు, కూరగాయలు, పూలు, పండ్లు ఇలా రకరకాల పంటలను పండించుకోవాలి. ఒకే పంటను పండించినపుడు దానికి ఏదైనా తెగులు వస్తే అది పొలమంతా వ్యాపిస్తుంది. అందువల్ల పంట మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుంది. ఇలా రకరకాల పంటలు వేసుకోడం వల్ల తెగుళ్ళ బారినుండి తప్పించుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి తగ్గుతుంది. పురుగు మందుల వాడకం తగ్గుతుంది. అందువల్ల పర్యావరణం కలుషితం కాదు. రైతులు సాంప్రదాయకంగా పండిస్తున్న పంటల విత్తనాలను నిల్వచేసుకొని వాటిని వాడుకోడం వలన స్థానిక పంటలను కాపాడుకోవచ్చు. స్థానిక పంటలు, జాతులకు తెగుళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి.
మీ పరిశీలనలు, సేకరించిన వివరాల ప్రకారం నివేదికను రూపొందించండి. ఏ ఏ ప్రత్యామ్నాయ పద్ధతులు ఏ ఏ పంటల దిగుబడులను పెంచడానికి ఉపయోగపడ్డాయో పట్టిక రూపంలో నివేదికలో పొందుపరచండి.
ఆధారము: http://apscert.gov.in/