অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తొలకరి పలకరించింది – పుడమితల్లి పులకరించింది

రోహిణిలో రోళ్ళ పగిలే అన్న సామెతను నిజం చేస్తూ, వేసవి (ఎండాకాలం) వెళ్ళిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భానుడు భగ్గుమని 50 డిగ్రీల ఉష్ణవ్రతాపాన్ని చూపాడు. వర్యావరణం అతలాకుతలమై భూతాపం ఏ స్థాయికి చేరిందో మనం అనుభవించాం. అంతలోనే ప్రతీ చినుకు ముత్యంగా మెరుస్తూ కొంగొత్త ఆశల ఊసులను మోసుకొచ్చింది. ప్రకృతి మాత పచ్చని పచ్చిక బయళ్ళ చీరలో సింగారించుకొని రైతుల ముగింట్లో దర్శనమిచ్చింది. యాసంగి ముగిసీ ముగియగానే కాస్త కునుకుపాటు తీస్తున్న రైతన్న ఒక్కసారి మళ్ళీ భూమాతకు భూరి దండాలు పెట్టుకొని వానాకాలం పంటల సాగుకు సర్వసన్నద్దమయ్యాడు. వేసవి దుక్కుల వలన చేలల్లో, చెలకల్లో నీరు ఇంకి తేమ నిలువ ఉండి విత్తనం విత్తడానికి, మొలకెత్తడానికి అనువుగా మారింది.

నాణ్యమైన విత్తనం విత్తి, నమ్మకమైన దిగుబడి సాధించే దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వరి, మొక్కజొన్న జొన్న పెసర, కంది, సోయాచిక్కుడు విత్తనాలను సుమారు 6 లక్షల క్వింటాళ్ళు రాయితీపై పంపిణీ చేసింది.

వివిధ పంటల సాగు వివరాలు

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం మొత్తం 280 లక్షల ఎకరాలు. అందులో సాగు విస్తీర్ణం మొత్తం 155 లక్షల ఎకరాలు. నికర సాగు విస్తీర్ణం మొత్తం 110 లక్షల ఎకరాలు. ఈ వానాకాలం సీజనులో వరి 25 లక్షల ఎకరాలు, పత్తి 38 లక్షలు, మొక్కజొన్న 14 లక్షల, సోయాచిక్కుడు 7 లక్షలు, పెసర 3 లక్షలు, కంది 8 లక్షలు, ఆముదం 1.80 లక్షలు, జొన్న 2 లక్షలు, మిరప 1.70 లక్షలు, పసుపు 1.20 లక్షలు, చెరకు 1.0 లక్ష మిగతా ఉద్యాన పంటలు, కూరగాయలు సాగవుతాయని అంచనా.

సగటున కురిసే వర్షపాతం వివరాలు

ప్రతీ ఏడు వానాకాలంలో నైరుతీ రుతుపవనాల ద్వారా సుమారు 713.5 మి.మీ. 79 శాతం, యాసంగి సీజనులో ఈశాన్య రుతుపవనాల ద్వారా సుమారు 129.5 మి.మీ. 14 శాతం, చలికాలంలో సుమారు 11.5 మి.మీ. 7 శాతం, ఎండాకాలంలో ద్వారా సుమారు 50.8 మి.మీ. 7 శాతం, సంవత్సర కాలంలో 905.3 మి.మీ. సరాసరి లెక్కన వర్షపాతం నమోదవుతుంది. కానీ 1000 మి.మీ. వరకు ప్రతీ ఏడు కురిస్తే యూసంగిని కలుపుకొని రెండు పంటలు పండించడానికి కాలం కలిసి వస్తుంది.

కమతాలు కలిగి ఉన్న రైతుల వివరాలు

చిన్న కారు రైతులు 40,44,012 - వీరు కలిగి ఉన్న భూమి 78, 79,785 ఎకరాలు; సన్నకారు రైతులు 14, 94, 195 - వీరు కలిగి ఉన్న భూమి 69, 90, 280 ఎకరాలు. పెద్ద రైతులు మొత్తం 15, 775 - వీరు కలిగి ఉన్న భూమి 6,21,998 ఎకరాలు. మొత్తం 55,53,982 మంది రైతులు 154 లక్షల 92 వేల 63 ఎకరాలు మొత్తం సాగు భూమిని కలిగి ఉన్నారు.

వరి

వానాకాలంలో వరిపంట అధికంగా సాగయ్యే సూచనలు ఉన్నాయి. అనుకూలమైన కాలం, మద్దతు ధర రూ.1540 క్వింటాళుకు ఉండటం. దిగుబడులు ఎకరాకు 24 నుండి 28 క్వింటాళ్ళ వరకు రావడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. వరి సాగులో రారాజుగా పిలిచే బి.పి.టి-5204 (సాంబమసూరి) అత్యంత నాణ్యమైనదిగా ప్రసిద్ధికెక్కింది. మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం పైగా విస్తీర్ణంలో సాగుచేస్తారని అంచనా. అలాగే ఎం.టి.యు -1010 (కాటన్ దొర సన్నాలు) ఎకరాకు 28 క్వింటాళ్ళు దిగుబడి రావడం, ముఖ్యంగా దోవును సమర్థవంతంగా తట్టుకోవడం వలన గత 16 సంవత్సరాల నుండి రైతుల మన్ననలను పొందింది. ఇది పైన పైన ముంపుకు గురయినప్పటికీ మొలకరాదు. మొత్తం సాగులో ఈ రకం 50 శాతం వరకు సాగవుతోంది. దీని స్థానంలో బతుకమ్మ (జె.జి.ఎల్-18047), కూనారం సన్నాలు (కె.ఎన్.ఎం.-118) కూడా రైతులు సాగు చేస్తున్నారు. ఈ స్వల్పకాలిక రకాలు మంచి మద్దతు ధరను పొందినప్పటికీ కోత సమయంలో రాలేగుణం ఉన్నందున, దీనిని అది గవించడానికి జె.జి.ఎల్-24423 రకం మినికిట్ల పరిశోధనలో ఉన్నది. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇటీవల రెండు సీజన్లలోను రైతుల మన్నలను పొందుతున్న తెలంగాణ సోనా (ఆర్.ఎన్.ఆర్. -15048) సన్నగింజ రకం. ఆలస్యంగా నాటినప్పటికీ 125 రోజులలో కోతకు రావడం, కాండం ధృడంగా ఉండి, ఎత్తు పెరిగినప్పటికీ వరదలకు, గాలులకు పడిపోకపోవడం, ఎకరాకు 40 బసాల పైన దిగుబడులు రావడం వలన రైతులు ఉత్సాహంతో సాగుకు ముందుకు వస్తున్నారు. గైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున చక్కెర వ్యాధిగ్రస్తులు తినడానికి అనువుగా ఉంటుందని శాస్రవేత్తల అభిప్రాయం. మిగతా విస్తీర్ణంలో ప్రైవేటు కంపెనీల రకాలు ఉన్నాయి.

సోయాచిక్కుడు

రాష్ట్రంలో 90 శాతం పంటను జె.ఎస్-355 రకాన్నే రైతులు సాగు చేస్తున్నారు. ఈ విత్తనాన్ని ప్రభుత్వం 33 శాతం రాయితీపై అందిస్తోంది. 10 సంవత్సరాలుగా సాగుచేస్తున్నందున కాండం ఈగ, ఎండు తెగులు, వేరుకుళ్ళ తెగుళ్ళు ఆశించి దిగుబడులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. రైతులు కాండం ఈగ నివారణ చర్యలు తీసుకుంటూ, నూతన వంగడాలైన బాసర ఇతర రకాల సాగు చేపడితే దిగుబడులు పొందవచ్చు. ఆ దిశగా శాస్రవేత్తల ప్రయోగాలు ఫలిస్తాయని ఆశిద్దాం. వర్బాధారంగా సాగుచేస్తున్నప్పుడు కందిని అంతర పంటగా విత్తుకోవడం మంచిది.

మొక్కజొన్న

రాష్ట్రంలో 90 శాతం పైన విస్తీర్ణంలో ప్రైవేటు కంపెనీల హైబ్రిడ్లను మాత్రమే సాగు చేస్తున్నారు. ఇందులో దిగుబడులు వచ్చినప్పటికీ ఎండు తెగులు వలన ఒక్కోసారి చాలా ప్రాంతాల్లో దిగుబడులు పూర్తిగా రాక రైతులు నష్టాలను చవిస్తున్నారు. ఒకే పంటగా విత్తకపోవడం, జీవన ఎరువుల వాడడం మంచిది.

పత్తి

తెల్ల బంగారంగా పిలిచే ఈ పంట ఇటు భూమిని అటు రైతును శాసించే దిశగా సాగుతోంది. ఏకంగా 38 లక్షల ఎకరాలలో సాగయ్యే సూచనలు ఉన్నాయి. బి.టి.రకాలనే రైతులు సాగుచేస్తున్నప్పటికీ తెల్లదోమ తాకిడి, కాయతొలిచే పరుగు బారిన పడుతున్నట్లు సమాచారం. కొంత మేరకైనా ఈ పంటను తగ్గించి అపరాల సాగువైపు రైతును మళ్ళించడం మంచిదని శాస్రవేత్తలు సూచిస్తున్నారు.

ఏది ఏమైనా సకాలంలో వానలు రావడం, రైతులు సాగుకు సన్నద్ధం కావడం, వ్యవసాయశాఖ అందుకు సిద్దం కావడం అంటే తొందరలోనే తొలకరి పలకరించింది - పుడమితల్లి పలకరించిందనే చెప్పాలి.

pathi.jpg

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate