నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడం మన బాధ్యత. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కోసం, నేల జీవ శక్తిని కొనసాగించే ఉద్దేశంతోనూ ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకుంటున్నాము. విపరీతమైన ఎరువులు, పురుగు మందులు, ఇతర రసాయన ఉత్పాదకాల వాడకంతో నేల స్వభావమే మారిపోతోందని శాస్రవేత్తలు అంతటా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన శాస్రవేత్త మాట్లాడుతూ - తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయన్నారు. నల్ల, ఎర్ర నేలల్లోనే అనేక రకాలు ఉన్నాయన్నారు. నీటి నిలువ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో అక్కడక్కడా చౌడు భూములు ఉన్నాయని వాటిని కూడా సాగులోకి తేగలమని అన్నారు. మన నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందన్నారు. దీనిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలన్నారు. మన నేలల్లో సూక్ష్మపోషకాల లోపాలు కూడా ఉన్నాయన్నారు. నత్రజని వాడకాన్ని సగానికి తగ్గించవచ్చాన్నారు. దీని వలన ఖర్చు తగ్గడమేకాక నేలను పరిరక్షించవచ్చని అన్నారు. ఒక ఇంచు నేల ఏర్పడడానికి వందల సంవత్సరాలు పడుతుందన్నారు. 60 శాతం బోరుబావులు చాలా లోతునుండి నీళ్ళు తోడడం వల్ల లవణాలు పైకి వచ్చి నేలపై పొరగా ఏర్పడి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. నేలపై మంచి మార్పు అయినా, చెడ్డ మార్పు అయినా చాలా నెమ్మదిగా వస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి నేలను అందించాల్సిన బాధ్యత మనమీదే ఉందన్నారు.
ఆధారము: పాడి పంటలు