రాబోయే ఖరిఫ్ సీజనులో వివిధ పంటలు పండించడానికి రైతాంగం సిద్ధమవుతున్న తరుణంలో వేసవిలో సమయం వృధా కాకుండా కొన్ని వ్యవసాయ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కింది సూచించిన ప్రకారం పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వేసవి లో ముఖ్యంగా వర్షాధారపు పొలాల్లో దుక్కి చేసి ఉంచాలి. ఈ వేసవి దుక్కుల వలన చాలా లాభాలు పొందవచ్చు.
సాంద్ర వ్యవసాయ ఫలితంగా క్రమేణా నేలలో పోషక నిల్వలు తగ్గిపోయి, గడిచిన రెండు శాతాబ్దాలుగా పంటలలో సుక్ష్మధాతు లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పోషకాలను పట్టిఉంచే శక్తి, గాలి, నీరు చొచ్చుకొని వెళ్ళే లక్షణం, మురుగు తీత మొదలైన గుణాలే కాకుండా, రసాయనిక లక్షణాలైన ఉదజని సూచిక, లవణ పరిమాణం, లభ్య పోషకాలు, సుక్ష్మజీవుల చర్య మొదలైనవి మొక్క పెరుగుదల, దిగుబడుల పై అధిక ప్రభావం చూపిస్తాయి. ఈ నేపధ్యంలో ప్రతి రైతు భూసార పరిక్షలు చేయించడం ఎంతైనా అవసరం. సంవత్సరానికి ఒక్కటి లేదా రెండు పంటలు పండించే భూముల్లో ఫెబ్రవరి నుండి మే నేలలో నమూనాలు సేకరించి అందుబాటులో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలలో తమ వివరాలతో అందిం స్తే., వారిచ్చే పరీక్షా నివేదిక ఆధారంగా ఖరిఫ్ లో సరైన పోషక యాజమాన్య పద్ధతులు పాటించి భూసార పరిరక్షణ అధిక దిగుబడులు పొందవచ్చు.
యాజమాన్యం లో తగు జాగ్రత్తలు పాటించక పొలాలు చౌడు భుములగా మారుతున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో భూగర్భ జలాలను విరివిగా వాడటం వలన నీటిలోని క్లోరైడ్స్ ద్వారా పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయి. వివిధ భూసార పరీక్షలను అనుసరించి, వివిధ రకాలైన చౌడు భూములను గుర్తించి బాగు చేసుకోవడానికి, వేసవి అనువైన సమయం,.
ఎండాకాలంలో నేల పైకి పొంగి ఉన్న ఉప్పు చౌడు పొరను పారలతో గికివేయాలి.
ప్రతి ఖరిఫ్ పంటకు ముందు అంటే తొలకరిలో జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద మొదలైన పైర్లు పండించి భూమిలో కలియడున్నినట్లయితే ఎకరానికి 25-30 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. అంతే కాక నేల భౌతికస్ధితి మెరుగుపడుతుంది. ఈ పైర్లు ముఖ్యంగా చెరువులు, కుంటల కింద, నీరు ఆలస్యంగా విడుదల చేసే నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నిజంసాగర్ లాంటి ప్రాజెక్టుల కింద పెంచవచ్చు. జనుము, పిల్లి పెసర పైర్లు సేంద్రియ ఎరువులుగా మాత్రమే కాక పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. నీరు మరింత ఆలస్యంగా విడుదల చేసే ప్రాంతాలలో పెసరను పండించి, కాయను కోసుకొని, రోట్టను సేంద్రియ ఎరువుగా ఉపయోగించవచ్చు. కావున రైతులు అవకాశాన్ని, అవసరాలను బట్టి ఈ పచ్చిరోట్ట పైర్లను పండించుకోవాలి.
పచ్చిరోట్ట పైరు పెంచే అవకాశాలు లేనిచోట కంపోస్టు ఎరువు లేదా పశువుల ఎరువును వేయవచ్చు. కావున ప్రతి రైతు తప్పనిసరిగా కంపోస్టు ఎరువును తయారు చేయడానికి ఆసక్తి చూపాలి. దీనికై 1.5 మీ. వెడల్పు, 5 మీ. పొడవు, 1 మీ. లోతుగల గుంతలను తవ్వి అందులో గడ్డి, చెత్త చెదారం, పిచు, ఆకులు, వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చే వ్యర్ధ, శేష పదార్దాలను ఒక అడుగు వరకు నింపి ఒక కిలో సూపర్ఫాస్ఫేట్, వేడినీళ్ళు కలిపి ప్రతి అడుగుకు చల్లాలి. ఇలా నింపిన గుంటపైన, మట్టితోగానీ, పెడతోగానీ గాలిపోకుండా కప్పాలి. 3 నెలల తరువాత మెత్తని కంపోస్టు తయారవుతుంది. గుంటకు సుమారు 3-4 ట్రాక్టర్లు కంపోస్టు పంటలు చేయడానికి 20-25 రోజుల ముందు భూమి పై సమానంగా చల్లి కలియడున్నితే, భూసారం పెరిగి, తగినంత తేమను నిలుపుకోవచ్చు.
ప్రతి రైతు పండించే పంటల విషయంలో తీసుకునే శ్రద్ధాసక్తులు పొలం గట్లు, మురుగు కాల్వలు, పరిసరాల విషయాలలో కూడా వహించాలి. పొలం గట్లు, మురుగు కాల్వలలో వివిధ రకాలైన కలుపు మొక్కలు ముఖ్యంగా నీరు గొబ్బి, గుంటగలగరాకు, వయ్యారిభామ, ముళ్ళమతంగి, సాంబ్రాణి మొక్క, బొక్కినాకు, గిరిక, రాకాసి తుంగ మొదలైనవి మొలిచి అవి పంటలతో పాటు పెరిగి వివిధ రకాలైన వ్యాధులు, పురుగులను చేయడానికి కారకమవుతున్నాయి. కావున తప్పనిసరిగా వేసవిలో పొలం గట్లు మురుగు కాల్వలు కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
నల్లరేగడి నేలల్లో ప్రత్యేకించి మురుగు పోనీ మాగాణి వరి పొలాల్లో సల్ఫేడ్ ప్రభావం వచ్చే అవకాశాలు ఎక్కువ. దానిని నివారించడానికి మురుగు పోయే సౌకర్యం ఏర్పాటు చేయడం ఏకైక మార్గం. పొలం చుట్టూ 1-1.5 అడుగుల లోతు మురుగు కాల్వలు ఏర్పాటు చేసి మురుగు పోయే మార్గం చేయాలి. వరి పంటకు మాత్రమే కాక, ఇతర పంటలకు కూడా అధిక వర్షాలు పడినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా పంట కాల్వలు మురుగు కాల్వలు బాగుచేసుకోవాలి.
విత్తనంలో తాలు గింజలు, సగం నిండని గింజలు, కలుపు విత్తనాలు వేరుచేసి ఎంపిక చేయాలి. సర్టిఫైడ్ విత్తనం గానీ, పరిశోధన స్ధానాల నుండి సెదరించిన విత్తనం గాని ఎంపిక చేసుకోవాలి. విత్తన మొలకశాతం తెలుసుకోకుండా నరుపోయకూడదు / విత్తకూడదు. అందుకొరకు ఒక మట్టి ప్రాత్రలో సన్న ఇసుక వేసి 100 గింజలు లెక్కపెట్టి 10 వరుసలలో విత్తాలి. 4-5 రోజులకు విత్తనం మొలకెత్తుతుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు 7 రోజులు పట్టవచ్చు. 1 సెం. మీ. పొడవుగల మొలకలు మాత్రమే లెక్కపెట్టాలి. మొలకశాతం సుమారు 80 శాతం ఉండాలి. ఈ విధంగా మంచి విత్తనం ఎంపిక పొలాల్లో నిర్ణీత మొక్కల సంఖ్య ఉండడానికి దోహదపడుతుంది.
ఒక కుండలోగని, డబ్బాలోగని, ప్లాస్టిక్ సంచిలోగానీ, విత్తనం పోసి కావలసిన మందు మోతాదు (కిలో విత్తనానికి 3 గ్రా.) మంకోజేబ్ లేదా కాప్టాన్ వేసి పైన మందమైన గుద్దకట్టి బాగా కుదపాలి. విత్తనశుద్ది చేసిన 12 గంటల తరువాత విత్తడానికి వాడాలి.
ఈ విధంగా పైన ఉదాహరిచిన వివిధ పనులను వేసవిలో సమయం వృధా కాకుండా చేపట్టడం ద్వారా లాభదాయకమైన, నాణ్యమైన ఖరీఫ్ పంటను రైతులు పొందవచ్చు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక