హోమ్ / వ్యవసాయం / రైతు ఆత్మహత్యకు గల కారణాలు-నివారణ మార్గాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రైతు ఆత్మహత్యకు గల కారణాలు-నివారణ మార్గాలు

రైతు ఆత్మహత్య నివారణకొరకు వ్యవసాయ సంస్కరణలు

ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు.

హైదరాబాద్, నవంబర్ 22 : ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ఎరువు బరువై… కూలీలు కరువై. నీరు కన్నీరై… విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, కనికరించని ప్రకృతి… రైతులను జంట కోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా… బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి.
ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే… బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు. 1995 నుంచి 2010 మధ్య… అంటే 16 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏకంగా 31,120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం! దీనికి కారణాలను సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు సురాజ్య వేదిక, యాక్షన్ ఎయిడ్, జయతీ ఘోష్ కమిటీ తదితర సంస్థలు, సంఘాలు విశ్లేషించాయి.
‘కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పట్టించుకోవడంలేదు. ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేయడంతప్ప… వాటి నివారణపై చిత్తశుద్ధి కనిపించడమే లేదు” అని తెలిపాయి. రైతుకు అండగా నిలిచే వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్య సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేర్కొన్నాయి. వీటన్నింటి ఫలితమే… రైతుల ఆత్మహత్యలు అని వివరించాయి.

రాలుతున్న రైతులు

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానం మన పొరుగునే ఉన్న మహారాష్ట్రది. ఆ తర్వాతి స్థానం… ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడేళ్లుగా… కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుండగా… మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’ అని చెప్పుకొన్న కాలంలోనూ పెద్ద సంఖ్యలో రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1995-2002 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో 12,716 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
2003-2010 మధ్యకాలంలో బలవన్మరణం పాలైన అన్నదాతల సంఖ్య ఏకంగా 18,404కు చేరింది. ఒకవైపు రైతుల వారసులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాలు చూసుకుంటుండగా… మరోవైపు హలం బాట పట్టిన యువ రైతులు మధ్యలోనే జీవితమనే కాడిని పారేస్తున్నారు. యువ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యమిస్తూ… అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతి, పెట్టుబడులూరాక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
2010లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న 728 మంది యువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో… యువకులు 563 మందికాగా, మహిళలు 165 మంది. ఇక అదే సంవత్సరం 30-44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో 824 మంది పురుషులు, 137 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం 2525 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ అధికారికంగా తెలిపింది.

ఇవీ కారణాలు

 • వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి.
 • బోర్లపై ఆధారపడటం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది.
 • ధరలు గిట్టుబాటు కావడంలేదు. కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.
 • రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడంలేదు.
 • చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు.
 • వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు.
 • బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు.
 • వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.
 • ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

దిగదుడుపు

మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ… రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించదు. 2010-11, 2011-12లో ధరలను పరిశీలిస్తే… అప్పుడు క్వింటాలు పత్తి ధర రూ.6500. అదే పత్తి ఇప్పుడు రూ.3600. అప్పుడు క్వింటాలు పసుపు రూ.14 వేలు. ఇప్పుడు రూ.4 వేలు. అప్పటికీ, ఇప్పటికీ మిర్చి రూ. 12 వేల నుంచి రూ.5500కు తగ్గింది. కందులు రూ.5 వేల నుంచి రూ. 3500లకు, మినుములు 5200 నుంచి రూ.3500కు తగ్గాయి, జొన్న 2500 నుంచి రూ.1800కు తగ్గాయి. పెట్టుబడులు మాత్రం భారీగా పెరిగాయి.

జయతీ ఘోష్ సిఫార్సులివి

 • అందరికీ సాగునీరందేలా చేయాలి.
 • కౌలుదారులతోసహా రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.
 • మెట్ట భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి.
 • సుస్థిరమైన, చౌకగా లభించే ఉత్పాదకాలను ఉపయోగించాలి.
 • గిట్టుబాటు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
 • గ్రామీణులు ఆర్థికంగాఎదిగేలా వ్యవసాయేతరకార్యకలాపాలను ప్రోత్సహించాలి.

ఆత్మహత్యలు నివారించాలంటే

 • పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
 • రైతులనుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి.
 • ఎగుమతి, దిగుమతి విధానాలను మన రైతులకు అనుగుణంగా మార్చాలి.
 • ప్రభుత్వం సకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, రుణ చెల్లింపునకు సహకరించాలి.
 • మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు పెట్టుబడి వ్యయంతో పాటు అదనంగా 50 శాతం ధర చెల్లించాలి.

ఆధారము: అగ్రేరియన్ క్రైసిస్

వ్యవసాయ సంస్కరణలు అత్యవసరం

మనదేశంలో అధిక ప్రజలకు ప్రధానవృత్తి వ్యవసాయం. పల్లెలోని వారందరికీ వ్యవసాయమే ముఖ్య వృత్తి. పల్లెలో పట్టణ మూలాధారం. రైతు దేశానికి వెన్నెముక. 'భారతదేశం అభివృద్ధి చెందాలంటే పల్లెలు అభివృద్ధిచెందాలని' గాంధీమహాత్ముడు చెప్పారు. భారతదేశంలో మొత్తం శ్రామిక శక్తిలో 64శాతం వ్యవసాయ మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామాల్లో నివసించే వారిలో నాల్గింట మూడో వంతు మందికి వ్యవసాయమే ఆధారం. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశజనాభాలో 70 శాతం వ్యవసాయరంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. అప్పటి జాతీయ ఆదాయంలో 55 శాతం వాటా వ్యవసాయరంగం నుంచి వస్తుంది.  ప్రస్తుతం ఇది 6 శాతానికి తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ 58 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
నూతన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగమే మూలాధారం. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు ఆ వ్యవస్థ బలోపేతం చేయడం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, నిల్వసామర్థ్యం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేదీ గిట్టుబాటు ధర కానీ మార్కెట్లో ధరలు పడి పోయి రైతు తీవ్రంగా నష్టపోతే పరిస్థితుల్లో ప్రభుత్వం రైతు లకు కొంత సహాయం లేదా వెసులుబాటు కల్పించే నిమిత్తం మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఇది గిట్టుబాటు ధర కాదు. రైతులు గిట్టుబాటు ధర కోరుతున్నా ఇచ్చేది లేదా ప్రకటించేది కనీస మద్దతు ధర మాత్రమే. కనీస మద్దతు ధర కనీసంగానే నిర్ణయిస్తుంది. దీనివల్ల రైతులకు లాభం చేకూరడం లేదు. ప్రజలకు ఆహారాన్ని అందించడానికి రైతు శ్రమపడుతున్నాడు. రైతు శ్రమను, రిస్క్‌ను ప్రభుత్వం, సమాజం గుర్తించాలి. వ్యవ సాయం రైతుకు గిట్టుబాటు కావాలి. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయరంగానికి పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. దేశంలో అన్ని రకాలుగా వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులు  అష్టకష్టాలు పడుతున్నారు వారిని అన్ని రంగాల్లోనూ సంపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వ విధానాలు, చట్టాల్లో సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయ అభివృద్ధిరేటు పెరుగుతుందని అనుకున్నా అదే దామాషాలో రైతుల ఆదాయాలు పెరగలేదు. ఉత్పత్తి పెరుగు దలకు అనుగుణమైన గిరాకీ ఉంటేనే వ్యవసాయోత్పత్తులకు వాస్తవ ధరలు నిలకడగా ఉంటాయి. వ్యవసాయం ద్వారా లభిచే  ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడంతోపాటు, వైవిద్య మైన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయాలి. దేశంలో మార్కెటింగ్‌ వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్నది. దానిని పటిష్టపరచాలి. రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు ప్రభుత్వం నుండి సకాలంలో లభించడం లేదు. అందుచేత రైతు వడ్డీ వ్యాపారులనుండి అప్పుతెచ్చి పెట్టుబడిపెట్టి పంటను అప్పుతీర్చడానికి సరిపెట్టి చివరకు బీదవాడవుతున్నాడు. రైతు లు సాధారణంగా పేదలు, నిరక్షరాస్యులు కావడంతో ఆధునిక పద్ధతులను అనుసరించడానికి వెనుకాడుతున్నారు. పశువుల పెంపకాన్ని తగ్గించడంలో పొలాలకు ఆ ఎరువ్ఞ లభ్యత బాగా తగ్గింది. ఫలితంగా భూసారం తగ్గి దిగుబడి తగ్గుతుంది. కుండ పోత వర్షాలు, వరదల వల్ల భూమిపై ఉన్న సారవంతమైన పొరకొట్టుకు పోయి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి.  రైతులకు జీవన భద్రతవైపు, వారి ఆదాయాల పెంపుదల వైపు దృష్టి సారించకపోతే వ్యవసాయరంగం సంక్షోభాన్ని పరిషరించ డం సాధ్యంకాదు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను విస్తారంగా ఏర్పాటు చేయాలి. ఉపఉత్పత్తుల రూపకల్పనకు ప్రయత్నాలు ప్రారంభించాలి. రైతులకు విస్తారంగా ఫ్లెడ్జ్‌లోన్‌ అందించాలి. గ్రామం యూనిట్‌గా పంటలబీమా పథకాన్ని అమలు చేయాలి. వ్యవసాయానికి సమృద్ధిగా నీరు, సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక చేయూత అందించాలి.వ్యవసాయరంగానికి వాటర్‌మేనేజ్‌మెంట్‌ పటిష్టంగా అమలు చేయాలి.

ఏళ్లతరబడి ఒకే పంటసాగుచేయడం, అవగాహన లేక అవస రానికిమంచి ఉత్పత్తి ఎరువ్ఞలను ఉపయోగించడం, పురుగు మందులను విచక్షణరహితంగావాడటం వంటిచర్యలవల్ల రైతులు నష్టపోతున్నారు. పంటలబీమా, రుణాలు, పండిన పంటలను మార్కెట్‌ చేయడం, గ్రామీణ మౌలికసౌకర్యాలను మెరుగుపరచ డం వంటి చర్యల ద్వారా చిన్న రైతులకు సాయం చేయాలి. నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధిపరచాలి. రైతుల ఆత్మగౌరవంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ బతికేందుకు అనువుగా వ్యవసా యరంగాన్ని సమూలంగా సంస్కరించాలి. వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చాలి. వర్షాధార ప్రాంతాల్ల వ్యవసాయాభివృద్ధికి నీటి సంరక్షణ ముఖ్యమని గుర్తించాలి. ఎక్కడపడిన వర్షపునీటి చుక్కను అక్కడే ఇంకింపచేసేలా రైతులలో చైతన్యాన్ని పెంపొందించాలి. సేంద్రీయ ఎరువులను వృధా చేయకుండా రైతులు వాటిని నూటికినూరు పాళ్లూ సద్వినియోగపరిచేలా చూడాలి. సేంద్రీయ ఎరువ్ఞల వనరుల్ని నిర్లక్ష్యం చేస్తూ రైతులు పాలకులు రసాయన ఎరువ్ఞలవైపే మొగ్గు చూపుతున్నారు. పర్యవసానంగా భూసారం దెబ్బతింటోంది.

అతివృష్టి, అనావృష్టి కరువ్ఞకాటకాదులు, ప్రకృతివైపరీ త్యాలు మన ఆహార సమస్యను తీవ్రతరం చేసాయి. అధిక వనరులున్న మనదేశం ఇతర దేశాలనుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొంటే అది జాతికే అవమానం. ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేసి ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికే పాటుపడాలి. ప్రజలు ఆహారధాన్యాలను వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఆహారధాన్యాలను అక్రమనిల్వలు చేసి కృత్రియ కొరతను సృష్టిస్తున్న వ్యాపారు లను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. రైతులు నూతన వ్యవ సాయ పద్ధతులను అవలభించి అధికోత్పత్తి సాధించాలి.  మన దేశానికి రైతు వెన్నెముక వంటివాడు. అట్టి రైతుకు పైరుపై ఏవగింపు కలగనీయక ధాన్యానికి తగిన రేటు ఇప్పించాలి. ఎరువ్ఞలు సబ్సిడీ రేట్లకు ఇప్పించాలి. అధికరాబడి వరి వంగడా లను వారికిప్పించి ఆ పంటలు వచ్చేటట్లు చేయాలి. రైతుకూలీ లకు తగిన కూలీ ఇప్పించి వ్యవసాయానికి వారిని ఇష్టులుగా చేయాలి. ఆహార ధాన్యపు రాబడిని పెంచడానికి రైతుకు తగిన వీలు కల్పించడం, పంటమార్పిడి, మిశ్రమ వ్యవసాయపద్ధతుల ద్వారా ఆహారోత్పతులను పెంచడం, జనాభాను అరికట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులకు అవస రమైన మౌలిక వనరులన్నింటినీ సద్వినియోగంచేసుకోవాలి.
వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిం చాలి. వారికి అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలి. అవసరమైన చోట చెక్‌ డ్యాంలను నిర్మించాలి. నిర్ణీత సమయంలో రోజుకు 9 అంచల విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రకృతి బీభత్ససమయాల్లో ప్రభుత్వం వారికి అండగా నిలవాలి. వ్యవసాయదారులకు తాము పండించే పంటలకు సరియైన గిట్టుబాటు ధరలను కల్పించాలి. పల్లె ల్లోని వ్యవసాయదారులు, భూమి యాజమానులు వ్యవ సాయం మానేసి పట్టణాలలో వ్యాపారస్థులుగా స్థిరపడుతు న్నారు. దానివల్ల కూడా పంటల సాగుతుగ్గుతోంది.  ప్రభు త్వం ఆధునిక శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధికాహారోత్పత్తికి కృషి చేయాలి. అప్పుడే ఆహార సమస్య తొలగిపోతుంది. ఎరువ్ఞలను బ్లాక్‌లో అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకోవాలి. కూలీలకు, రైతులకు యాజమానులకు సమన్వయం ఉండేలా      గ్రామాధికార్లు సహకరించాలి. మానవ్ఞని ప్రాథమికావసరమైన ఆహారం సమకూర్చటం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం.వ్యవసాయరంగంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విప్ల వాత్మకమైన మార్పులు తీసుకురావాలి. వ్యవసాయ, సాగునీటి రంగాల అభివృద్ధి కోసం అధికనిధులను వెచ్చించాలి. ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలురైతులకు సక్రమంగా అందేలా చూడాలి. భూములను అవసరమైన ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి చిన్న రైతులకు చేయూతనివ్వాలి. కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసి రైతుల పంట మార్కెట్‌కు చేరేదాకా రక్షణ ఇవ్వాలి. రైతులకు కల్తీలేని విత్తనాలు, పురుగుమదులు, ఎరువ్ఞలు అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కల్తీని కఠినంగా నిరోధించడానికి అమ్మకందారుల్ని బాధ్యుల్ని చేసే విధంగా చట్టం తేవాలి. సకాలంలో స్వేచ్ఛగా రైతులకు అందు బాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు ఆస్తి ఆధా రంగా ఒవర్‌డ్రాఫ్ట్‌ పద్ధతిలో రునం అందించి కిసాన్‌ క్రెడిట్‌కార్డు వ్యవస్థ పటిష్టపరచాలి. కౌలురైతులకు పంటరుణాలు అందించే ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల్లో బయోటెక్నాలజీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చగలిగే విధంగా వ్యవసాయ విద్య, పరిశోధనలు జరగాలి. రైతాంగానికి అవస రమైన స్థాయిలో రుణపరపతి సహకారం ఉండాలి. అవినీతి, అక్రమం, అనాలోచిత లైసెన్సు విధానం, పర్మిట్‌, కోటా విధా నాలు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.

(రచయిత విశ్రాంత ఉపాధ్యాయులు)

ఆధారము: వార్త

3.04247104247
పాండు Jun 26, 2020 06:16 PM

ఎందుకు మనం ప్రాచీన వ్యవసాయము లేదా ప్రకృతి వ్యవసాయం చేయకుడదు? మన పడించిన పంటలను వేరొక విధంగా అమ్మకూడదు ex. టమోటో ధర లేదు అనుకో వాటిని కోసి ఉప్పు లో ఉంచి డ్రై వెజిటబుల్ గా లేదా టమోటో సాస్ company tho deal chysukunta koncham oorupu kavali

ఫెలిక్స్ Alex Jan 30, 2020 03:30 AM

ప్రాజెక్ట్, వ్యాపారం, పన్నులు, బిల్లులు మరియు మరెన్నో మీకు డబ్బు అవసరమా?
ఇతర కారణాలు, మా రుణాలు సరళమైనవి మరియు చౌకైనవి, ఈ రోజు మమ్మల్ని సంప్రదించండి. ది
మీకు అవసరమైన loan ణం, మేము మీకు ఏదైనా రుణాన్ని ఏర్పాటు చేయవచ్చు, అది మీకు అనుగుణంగా ఉంటుంది
బడ్జెట్, 3% వడ్డీ రేటు కంటే తక్కువ, ఇ-మెయిల్ ద్వారా ఇప్పుడే ప్రత్యుత్తరం ఇవ్వండి:
*****@gmail.com

ఆకుల సుధాకర్ గౌడ్ Apr 13, 2019 04:05 PM

ఒక కిరణం షాప్ లోకి వెళ్లి వాళ్ళు ఎంత ధర చెప్పిన ఆ వస్తువును కొంటాం. కానీ నీ రాతి పగలు కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో అమ్ముతున్న రైతులు ప్రజలుమనం ఐదు రూపాయల కిలో అమ్ముతున్న టమాటాను మూడు రూపాయలు ఇస్తామని అడుగుతాం మన రైతుల దౌర్భాగ్యం. ప్రభుత్వాలే కాదు మనము మారాలి రైతులు ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి

అగ్రికల్చర్ ఇంజినీర్ Apr 13, 2018 01:50 PM

అసలు కౌలు రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రావు.పంట పండిన లేకపోయినా ఓనర్ కి మాత్రం డబ్బులు ఇచేయాలి కౌలు రైతు పరిస్థితి ఏంటి?

mallesh Oct 03, 2017 07:12 PM

ఎక్కువమంది చిన్నకారురైతులుచనిపోతే పెద్దరైతులకుమేలుచేస్తుండ్రు చిన్నకారురైతులకుఅక్కువశాతంసబీసీడీఎవ్వాలి
కకేవలురిమితులనుఆ
దుకోవాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు