పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఎరి పట్టుపురుగుల పెంపకం

మల్బరీ మరియు మల్బరేతర (వన్య) పట్టును ఉత్పత్తి చేయటంలో మన దేశానికి ప్రత్యేక స్థానం వుంది. మన దేశంలో పెంచబడుతున్న వివిధ పట్టు రకాలలో మల్బరీ, టస్సార్ తర్వాత 'ఎరి' పట్టు అధికంగా సాగులో వుంది.

మల్బరీ మరియు మల్బరేతర (వన్య) పట్టును ఉత్పత్తి చేయటంలో మన దేశానికి ప్రత్యేక స్థానం వుంది. మన దేశంలో పెంచబడుతున్న వివిధ పట్టు రకాలలో మల్బరీ, టస్సార్ తర్వాత 'ఎరి' పట్టు అధికంగా సాగులో వుంది. ఎరి పట్టును 'అహింస' పట్టు లేదా వన్య పట్టు అని కూడా పిలుస్తారు.

వన్య పట్టు రకాల్లో ఎరి పట్టు పురుగు (సామియా రెసిని డోనవాన్) మాత్రమే మల్బరీ పట్టు పురుగు (బోంబిక్స్ మోరి) లాగా ఇంటిలో సంవత్సరమంతా పెంచగలిగిన మల్టీ వోల్టైన్ రకం. ఎరి పట్టు పురుగులు అనేక రకాలైన ఆకులను తిని గూళ్ళను అల్లుతాయి. ఎరి పట్టు పురుగులు మన ప్రాంతంలో ప్రధానంగా ఆముదం (రెసినస్ కమ్యూనిస్), కర్ర పెండలం (మానిహాట్ ఎస్కులెంటా) ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.

వర్షాధారంగా పండించే ఆముదం పంట పూర్తిగా వర్షాల మీదే ఆధారపడటం వల్ల అతివృష్టి, అనావృష్టి కారణంగా ఆముదపు గింజల దిగుబడులు హెచ్చు తగ్గులకు లోనవడం ద్వారా రైతు తగిన ఆదాయం పొందలేక పోతున్నాడు. కాని, కొంత మేర (30-35%) ఆముదం ఆకుని ఉపయోగించి ఆముదం గింజల దిగుబడిలో ఎటువంటి తగుదల లేకుండా ఇంటి మనుషులతో 'ఎరి' పట్టు పురుగులు పెంచడం ద్వారా ఎకరాకు రూ. 2,000/- నుండి 2,500/- వరకు అదనపు ఆదాయం పొందవచ్చునని పరిశోధనల ద్వారా తేటతెల్లమైనది.

ఎరి పట్టు పరుగులు రోగ నిరోధక శక్తిని కలిగి వుండటం వల్ల వీటి పెంపకం చాలా తేలిక. పురుగులను పెంచడానికి కావాల్సిన వసతులు, పరికరాలు, పెంపకంలో పాటించాల్సిన సాంకేతిక పద్ధతులు, సరియైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన గూళ్ళను కలిగిన అధిక దిగుబడిని సాధించడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చును.

ఎరి పట్టు పరుగుల పెంపకం

వ్యాధి నిరోధక చర్యలు

ఎరి పట్టు పరుగుల పెంపకంలో పరుగులు, రోగాలు సోకకుండా వ్యాధి నిరోధకం చేయడం ఉత్తమమైన పద్ధతి. రోగాలను కలిగించే క్రిములను చంపే పద్ధతిని వ్యాధి నిరోధకం (డిసిన్ఫెక్షన్) అంటారు. పట్టు పురుగుల పెంపకంలో అతి ముఖ్యమైన అంశం రోగ నిరోధక చర్యలు చేపట్టుట మరియు పరిశుభ్రతను పాటించుట. కావున రైతు సోదరులు ప్రతి పంట పూర్తి అయిన వెంటనే మరియు పంట పెట్టుటకు 6 రోజుల ముందు తప్పనిసరిగా పరుగుల పెంపక గృహాలను, పరికరాలను రోగ నిరోధకం చేయాలి.

రేరింగ్ గది డిసిన్ఫెక్షన్

పంట అయిపోయిన తరువాత రేరింగ్ గది నుండి చనిపోయిన మరియు జల్లి గూళ్ళను, వ్యర్థపదార్థాలను తీసివేసి గదిని శుభ్రం చేసుకోవాలి. రేరింగ్ గదిని 0.2% సున్నము మరియు 2% బ్లీచింగ్ పౌడరు ద్రావణంతో (అనగా ఒక లీటరు నీటికి 2 గ్రా. కాల్చిన సున్నపు పొడి మరియు 20 గ్రా. బ్లీచింగ్ పౌడరును కలపాలి) శుభ్రంగా కడగాలి. రేరింగ్ గదిని తరువాత 1% సెరిగోల్డ్ ద్రావణంతో (100 లీటర్ల నీటికి ఒక కిలో సెరిగోల్డ్ కలపాలి) స్ప్రేయర్ ద్వారా పిచికారి చేయవలెను.

 • స్పేయర్ ద్వారా పిచికారి చేస్తున్నప్పడు డిసిన్ ఫెక్షన్ ద్రావణం కారుతున్నట్లుగా చేయవలెను.
 • రేరింగ్ స్లాండ్ ను చాలా నిశితంగా డిసిన్ ఫెక్షన్ చేసుకొనవలెను.
 • రేరింగ్ పరికరాలను శుభ్రం చేసుకొన్న తరువాతనే రేరింగ్ గదిని డిసిన్ ఫెక్షన్ చేసుకోవాలి.
 • గ్రుడ్లను పొదిగించినప్పటి నుండి చాకీ, పెద్ద పరుగులు పెంచే గదులకు, చంద్రికలు ఉంచు ప్రదేశానికి కసువు దిబ్బలు దూరంగా ఉండేలా చూడాలి.

రేరింగ్ పరికరాల డిసిన్ఫెక్షన్

పట్టు పురుగుల పెంపకంలో రేరింగ్ కు ఉపయోగించే తట్టలు, స్టాండ్లు, వలలు మరియు ఇతర వస్తువులు శుభ్రం చేసుకొని, డిసిన్ఫెక్షన్ చేసుకున్న తరువాత మాత్రమే వాటిని వాడవలసి ఉంటుంది.

 • రేరింగ్ పరికరాలను అన్నింటినీ డిసిన్ఫెక్షన్ ద్రావణంలో మంచి అరగంట ఉంచాలి. తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి రేరింగ్ గదిలో ఉంచుకోవాలి.
 • వెదురు తట్టలకు పేడ కాని మరియు ఏ ఇతర పదార్ధములను పూయరాదు.
 • పరికరాలను డిసిన్ఫెక్షన్ చేసుకోవడానికి ప్రతి రైతుకు రెండు మూడు రోజులు పడుతుంది.

పట్టు గ్రుడ్ల ఉపరితల డిసిన్ఫెక్షన్

పట్టు పరుగుల చిలకలు గ్రుడు పెట్టిన తరువాత వాటి ఉపరితలాన్ని శుద్ధి చేసుకోవాలి. పట్టు గ్రుడ్ల ఉత్పత్తి కేంద్రంలో గ్రుడు పెట్టిన వెంటనే పట్టు గ్రుడ్లను శుద్ధి చేయడం జరుగుతుంది. తరువాత నీలి రంగు దశలో ఉన్న పట్టు గ్రుడ్లను రైతు తన ఇంటిలో పట్టు గ్రుడ్ల ఉపరితల డిసిన్ఫెక్షన్ చేసుకుంటే చాకీ దశలోను మరియు పెద్ద పరుగులకు ఎటువంటి రోగాలు కలుగకుండా కాపాడుకొనవచ్చును. పట్టు గ్రుడ్ల ఉపరితలాన్ని రోగ రహితం చేయడానికి ఇంతకు మునుపు 2 శాతం ఫార్మలిన్ ద్రావణంను ఉపయోగించేవారు. ఫార్మలిన్ ద్రావణం ఘాటుగా ఉండి కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుంది. తరువాత చేతుల చర్మం గట్టిపడి ఊడి పోతుంది. అంతేకాకుండా ఫార్మలిన్ క్యాన్సరు కారకం కావడంతో దానిని ఉపయోగించడం క్షేమము కాదు. అందువలన సెరిప్లస్ ద్రావణం ఉపయోగిస్తే పట్టు గ్రుడ్లను శుద్ధి చేయడమే కాకుండా దాని వలన రైతులకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగవు, అలాగే పట్టుపురుగుల పిండాభివృద్ధికి మరియు చాకీ దశలో కూడా సమస్యలు ఉండవు.

విధానము

 • 5 గ్రా. సెరిప్లస్ పొడిని 3 లీటర్ల నీటిలో బాగుగా కరుగునట్లు కలిపి ద్రావణముగా చేసుకొనవలెను.
 • పట్టు గ్రుడ్లను గ్రైనేజి నుంచి తెచ్చిన తరువాత సెరిప్లస్ ద్రావణంలో పది నిమిషాలు మంచి శుద్ధి చేసుకోవాలి.
 • పట్టు గ్రుడ్లను డిసిన్ఫెక్షన్ చేసిన తరువాత బ్లాక్ బాక్సింగ్ చేసుకోవాలి. పట్టు గ్రుడ్లను 48 గంటల తర్వాత తట్టలలో ఉంచుకొని చాకీ కట్టుకోవాలి.

చంద్రికలను డిసిన్ఫెక్షన్ చేయడం

మాగిన పురుగులను గూళ్ళు కట్టుట కొరకు చంద్రికల మీద వేసినపుడు కొన్ని పురుగులు గూళ్ళు కట్టకుండా చనిపోతాయి. అటువంటి పురుగులు ఉన్న చంద్రికల ద్వారా పెట్టపోయే పంటకు రోగాలు సోకే అవకాశం ఉంది. అందువలన చంద్రికలు శుభ్రం చేసుకొని డిసిన్ఫెక్షన్ చేసుకోవడం చాలా ముఖ్యం. చంద్రికలు వుండే ప్రదేశం చాకీ మరియు పురుగులు పెంచే గదికి దూరంగా వుండటం చాలా మంచిది. చంద్రికల మీద గూళ్ళు అల్లని పరుగులను, చనిపోయిన పురుగులను మరియు జల్లి గూళ్ళను, గూళ్ళు విడిపించే 2 రోజుల ముందుగానే తీసివేసి వాటిని కాల్చి వేయాలి.

1. ప్లాస్టిక్ చంద్రికలు లేదా నేత్రికలు

 • గూళ్ళ తీసివేసిన తరువాత వెంటనే వీటిని 5% బ్లీచింగ్ పౌడర్ ద్రావణం కల తొట్టిలో 6 గంటల పాటు మంచి డిసిన్ఫెక్షన్ చేసుకొనవలెను.
 • తరువాత నేత్రికలను ఆరబెట్టి, జతగా కట్టి చంద్రికలు ఉంచుకొనే ప్రదేశములో నిలువ వుంచాలి.

2. వెదురు చంద్రికలు

 • గూళ్ళు తీసివేసిన తరువాత వెంటనే వీటిని 2% ఫార్మాలిన్ ద్రావణంతో కాని 1% సెరిగోల్డ్ ద్రావణంతో కాని డిసిన్ఫెక్షన్ చేసుకోవాలి.
 • తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి చంద్రికలను వాటి ప్రదేశంలోకి మార్చుకోవాలి.

3. రోటరీ చంద్రికలు

 • గూళ్ళు తీసివేసిన తరువాత వెంటనే వీటిని 2% ఫార్మాలిన్ ద్రావణంతో కాని 1% సెరిగోల్డ్ ద్రావణంతో కాని డిసిన్ఫెక్షన్ చేసుకోవాలి.
 • తరువాత వాటిని ఎండలో ఆరబెట్టి చక్కగా జత పరచుకొని వాటిని నిలువుంచే ప్రదేశంలోకి మార్చుకోవాలి.
 • ఫార్మాలిన్తో డిసిన్ఫెక్షన్ చేసినపుడు ప్లాస్టిక్ పేపర్ తో కప్పి ఉంచవలెను.
 • చంద్రికల (వెదురు మరియు రోటరీ చంద్రికలు) మీద వుండే పోగు పోయేటందుకు వాటిని జాగ్రత్తగా బర్నర్ లేదా ప్లేమ్ గన్ సహాయంతో కాల్చుకొనవలెను.

ఎరి చాకీ పురుగుల పెంపకము

‘ఎరి' పట్టు పరుగుల పెంపకంలో రెండో దశ వరకు చాకీ దశ అంటారు (సుమారు 10 రోజులు). పంట విజయవంతం కావడంలో చాకీ పురుగుల దశ కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర దశలలోని పరుగుల పెరుగుదలతో పోలిస్తే చాకీ దశ పురుగుల పెరుగుదల శాతం అధికంగా ఉంటుంది. చాకీ పురుగులు అధిక తేమను మరియు ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యమును కలిగి ఉన్నప్పటికీ, అంటు వ్యాధులను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి చాకీ పురుగుల పెంపకానికి పూర్తిగా శుద్ధి చేసిన గది, పరికరాలు ఉండాలి. అంతేకాకుండా తేమ, ఉష్ణోగ్రతలను నియంత్రించే సౌకర్యం, వసతి గల చిన్న గది చాకీ పరుగుల పెంపకానికి

అనువుగా ఉంటుంది. చాకీ దశలో పురుగుల అత్యుత్తమ పెరుగుదలకు 27-28o సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80-90 శాతం తేమ అవసరం.

చాకీ పురుగుల పెంపకంలో ఉన్నవారు పెద్ద పురుగులు లేదా గూళ్ళు కట్టే దశలలో ఉన్నచోటుకు వెళ్ళరాదు. చాకీ మరియు పెద్ద పురుగుల పెంపక పరిసరాలలోను మరియు ప్రవేశ ద్వారము వద్ద కాల్చిన సున్నం మరియు బ్లీచింగ్ పొడిల (1:19) మిశ్రమాన్ని చల్లాలి. చాకీ దశలో మెత్తని అధిక తేమ గల లేత ఆకులను వేసినచో పరుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఆకులలో ఎక్కువ తేమ ఉండటం కోసం, చాక్రీ కట్టటానికి ఒక రోజు ముందు మరియు మొదటి జ్వరం రోజు పంటకు నీరు కట్టాలి.

పురుగులు జ్వరంలో ఉన్నప్పడు కొంచెం పొడి వాతావరణం మరియు తగినంత గాలి ప్రసరణ అవసరమవుతుంది. చాకీ పురుగుల పెంపకంలో బెడ్ పొడిగా ఉండునట్లు చూసుకొనవలెను. దీని వలన రోగ క్రిముల వృద్ధిని అరికట్టడమే కాకుండా పడకలలోని విష వాయువులు కూడా బయటకు వస్తాయి.

చాకీ తోటలోని ఆకును, రసాయనిక ఎరువులు వేసిన 15-20 రోజుల తర్వాతనే మేతగా వాడాలి. రసాయనిక ఎరువులు వేసిన వెంటనే ఆకులలో రసాయనిక పదార్థాలు సమ నిష్పత్తిలో ఉండవు. కాబట్టి పురుగులపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. చాకీ ఆకులు కోసేటపుడు, రవాణా చేసేటప్పుడు మరియు నిలువ చేయు సమయంలో తేమ శాతం తగ్గిపోకుండా తగిన మెళకువలు పాటించాలి. పడకలలో పురుగులు ఒత్తుగా క్రిక్కిరిసి ఉన్నచో, పురుగుల పెరుగుదల తగ్గటంతోపాటు రోగాల బారిన పడే అవకాశం ఉంది. కావున సిఫారసు చేసిన సమయంలో పడకలను విస్తరిస్తూ, తగిన స్థలావకాశమును కలిగించాలి.

చాకీ పురుగుల పెంపకంలో పడకలలో శుభ్రతను పెంపొందించడానికి క్రమం తప్పకుండా పాటించాల్సిన పద్ధతులు

 • ప్రతి మేత వేయడానికి గంట ముందుగా పడక ఆరేలా గదిలో గాలి ప్రసరించేలా చేయాలి.
 • రెండవ రోజు, మొదటి మేత వేయడానికి ముందుగా ఈకల సహాయంతో పడకను విదిలించి సుమారుగా 1 నుండి 2 గంటల పాటు పడక ఆరేలా, గాలి ప్రసరించేలా చేయాలి.
 • మొదటి దశ మూడవ రోజు కూడా పైవిధంగా చేసి, ఎక్కువ ట్రేలలోకి విస్తరించాలి.
 • పురుగులు జ్వరమునకు కూర్చున్న తర్వాత కాల్చిన సున్నమును చల్లి గదిలో గాలి ప్రసరించేలా చూడాలి.
 • పురుగులు ఒకటవ జ్వరం నుండి లేచిన వెంటనే విజేత పొడి చల్లి, గంట తర్వాత మేతను ఇవ్వాలి. తట్టలపై మైనపు కాగితమును కప్పి తగిన తేమను, ఉష్ణోగ్రతను నియంత్రించాలి.
 • రెండవ దశలోని రెండవ రోజు తిరిగి ట్రేలను పెంచి గదిలో గాలి ప్రసరించేలా చేసి 1-2 గంటలు పడకలను ఆరనివ్వాలి.
 • పురుగులు రెండవ జ్వరమునకు సన్నద్దమౌతున్నప్పుడు, ఆకుమేతను పలుచగా ఇవ్వాలి.
 • పరుగులు రెండవ జ్వరంలో నిలిచిన తర్వాత కాల్చిన సున్నమును చల్లి గదిలో గాలి ప్రసరించేలా చూడాలి, జ్వరము నుండి లేచిన వెంటనే ఔషధాల పొడిని చల్లి, అరగంట తర్వాత ఆకు మేతను ఇవ్వాలి.

వెలుతురు

పట్టపరుగులు ప్రకాశవంతమైన వెలుతురును గాని లేదా పూర్తి చీకటిని గాని ఇష్టపడవు. కాని తక్కువ తీవ్రత గల (15 నుండి 30 లక్స్ లు) మసక వెలుతురును ఇష్టపడతాయి. పట్టు పురుగులకు రోజుకు 16 గంటల వెలుతురు మరియు 8 గంటల చీకటి అవసరము. పట్టు పురుగుల ఆరోగ్యంపైనా మరియు వాటి పెరుగుదల పైనా వెలుతురు కొద్దిపాటి ప్రభావాన్ని మాత్రమే చూపినప్పటికి, రేరింగ్ బెడ్లో పట్టుపురుగుల విస్తరణపై చెప్పకోదగ్గ ప్రభావాన్ని చూపుతుంది. పూర్తి చీకట్లో రేరింగ్ బెడ్లలో పురుగులు గుంపులుగా అనేక పొరలుగాను, మసక వెలుతురులో సమానంగా ఒకే పొరగా విస్తరించి ఉంటాయి. సరియైన వెలుతురులో పెంచిన పట్టుపురుగులు పూర్తి చీకట్లో పెంచిన పట్టుపురుగుల కంటే ఎక్కువ బరువు గల గూళ్ళను అల్లుతాయి.

వెలుతురు రేరింగ్ బెడ్ల పైభాగాన పడేటట్లు చేసి, రేరింగ్ బెడ్ల అడుగు భాగాన చీకటిగా ఉంచాలి. అట్లు చేయనిచో నిదానంగా పెరిగే పురుగుల సంఖ్య మరియు తప్పిపోయే పురుగుల సంఖ్య ఎక్కువ అవుతుంది.

గాలి ప్రసరణ

వట్టు పురుగులు వాటి శరీరాలకు ఇరువైపులా పార్శ్వభాగాన గల 9 జతల స్పైరకిల్ ల (శ్వాస రంధాలు) ద్వారా గాలిని పీల్చుకొని వదులుతాయి. ఆ విధంగా వీల్చుకొన్న గాలిలోని ప్రాణవాయువు స్పైరకిల్ లతో కలుపబడి శరీరమంతా వ్యాపించిన సన్నటి కేశనాళికల ద్వారా రక్తానికి అందజేయబడుతుంది.

రేరింగ్ గదిలోని వాతావరణం అక్కడ పనిచేసే మనుషులు, పటు పురుగులు వదిలే బొగ్గుపులుసు వాయువు, పురుగుల పెంట నుండి వెలువడే అమ్మోనియా వాయువు, రోగ నిరోధక చర్యకు వాడే ఫార్మాలిన్ నుండి వెలువడే ఫార్మాల్డిహైడ్ వాయువు వలన కలుషితమౌతుంది. ఈ వాయువులన్నీ రేరింగ్ గదిలో సురక్షితమైన హద్దుల్లో అనగా బొగ్గు పులుసు వాయువు 1% – 2%, ఫార్మాల్డిహైడ్ 1%, అమ్మోనియా 0.01% ఉన్నంత వరకు మాత్రమే పట్టు పురుగులు భరించగలవు.

చాకీ పురుగులు చెడు వాయువులను తట్టుకోగలవు. అయినప్పటికీ ప్రతిసారీ మేత వేయడానికి కనీసం అరగంట ముందు తట్టలపై కప్పిన పారాఫిన్ పేపర్లను తీసివేసి రేరింగ్ బెడ్లను విస్తరింపజేయాలి. అట్లు చేయడం వలన రేరింగ్ బెడ్లలో ఉన్న చెడు వాయువులు బయటికి తరిమివేయబడి పురుగులకు స్వచ్ఛమైన గాలి అందడమే కాక రేరింగ్ బెడ్లు తొందరగా ఆరుతాయి.

జ్వరానికి పోయే పట్టుపురుగులను గుర్తించుట

పరుగులన్నీ ఒకేసారి జ్వరానికి పోవడం వలన వాటిలో పెరుగుదల సమానంగా ఉండి ఒకే బ్యాచ్ గా పెంచడానికి వీలు కల్లుతుంది. తద్వారా పంట సఫలీకృతం అవుతుందీ.

జ్వరానికి పోయే పట్టపరుగుల లక్షణాలు

 • పట్టు పరుగుల్లో ఆకలి మందగించి, చురుకైన కదలిక ఉండదు.
 • పురుగుల శరీరాలు ఉబ్బి, లావెక్కి కుంచించుకొనిపోయి ఉండడం వలన ఖండితాలు స్పష్టంగా కన్పిస్తాయి. వీటి శరీరాలు మెరుస్తుంటాయి.
 • పురుగులు, తల మరియు రొమ్ము భాగాలను పైకెత్తుకొని ఉంటాయి.
 • పురుగుల నోటి భాగాలు నల్లగా, చిన్నవిగా మారి మొనదేలి ఉంటాయి.
 • సాధారణంగా జ్వర కాల పరిమితి 20 నుండి 24 గంటల పాటు ఉంటుంది. కానీ అది పట్టుపురుగుల జాతి, పరుగుల దశ, ఉష్ణోగ్రత, తేమాంశాలను బట్టి మారుతుంది.

పట్టపురుగులు జ్వరానికి పోయేటప్పడు తీసికోవాల్సిన జాగ్రత్తలు

రేరింగ్ బెడ్లలోని కొన్ని పురుగుల్లో జ్వరానికి పోయే లక్షణాలు కన్పించగానే, రేరింగ్ బెడ్లను శుభ్రపరచి, పడకల్లో పురుగులకు ఎక్కువ స్థలావకాశాన్ని కల్పించాలి. పురుగులకు మేతగా వేసే ఆముదం ఆకు మోతాదును కూడా తగ్గించాలి. సన్నని పొడుగాటి, తీగెల్లాగా తరిగిన ఆకు ముక్కలను చివరి మేతగా వేయడం వలన రేరింగ్ బెడ్లు తొందరగా ఆరిపోతాయి. అందువలన జ్వరం నుండి ముందుగా లేచిన పురుగులు ఆకును తినే అవకాశం ఉండదు.

100 పరుగులకు, 70 నుండి 80 పరుగులు జ్వరానికి పోగానే తట్టలపై కప్పే పారాఫిన్ కాగితాలను తీసివేసి, మేతను వేయడం ఆపివేయాలి. ఆఖరి మేత వేసిన 3 నుండి 4 గంటల తర్వాత పురుగులపైనా, రేరింగ్ బెడ్ పైన కాల్చిన సున్నపు పొడిని చల్లాలి. సున్నపు పొడిని చల్లుట వలన రేరింగ్ బెడ్లు త్వరగా వాడిపోతాయి. అందువలన పరుగులు సులభంగా వాటి పాత చర్మాలను వదిలించుకొని, ఒకేసారి జ్వరం నుండి బయటికి వస్తాయి.

ఎరి పెద్ద దశ పురుగుల పెంపకం

పట్టు పురుగులు మూడవ జ్వరం నుంచి లేచినప్పటి నుండి గూళ్ళు అల్లుకొనే సమయం వరకు పెద్ద పరుగుల పెంపకం అంటారు. ఈ దశ సుమారు 1-16 రోజులు ఉంటుంది. ఈ దశలో పురుగులకు తగినంత స్థలావకాశము, మంచి గాలి ప్రసరణ, తగినంత నాణ్యమైన ఆకు చాలా అవసరము. పెంపక గదిలో 25-26 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 65 నుండి 70 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. పరుగుల పెంపక గది చుట్టూ 10 అడుగుల వరకు వరండా వేయటం వలన తీవ్రమైన శీతోష్ణస్థితులను నియంత్రించుటయే గాక గూళ్ళ అల్లిక సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

జ్వరంతో ఉన్న పురుగులను గుర్తించుట

పట్టుపురుగులు ఆయా దశలలో పూర్తిగా ఎదిగిన తర్వాత జ్వరమునకు సిద్ధమవుతాయి. అప్పడు వాటి శరీరము గట్టిగా, మెరుపులను కలిగి ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చినచో తల చిన్నదిగా ఉండి, మూతి సన్నగా నలుపు రంగులో ఉంటుంది. జ్వరములో ఉన్న పరుగులు ఆకు తినకుండా, కదలకుండా తలపైకి ఎత్తి ఉంటాయి. జ్వరము నుండి లేచిన పురుగు

శరీరము ముతక బారి పాలిపోయి ఉంటుంది. మూతి వెడల్పుగా కాఫీ రంగులో ఉంటుంది. మధ్య దశలో పురుగులు ఆకులను తింటూ చాలా చురుకుగా కనిపిస్తాయి.

పురుగులు జ్వరానికి సిద్ధమైనపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

పురుగులు పడకలలో పలుచగా ఉండునట్లు తగినంత స్థలావకాశం కల్పించాలి. 100 గుడ్లకు గాను 5వ దశలో పరుగులకు 800 చదరపు అడుగుల విస్తీర్ణము కావలెను. పురుగులు జ్వరానికి సిద్ధమైనపుడు పడకలను శుభ్రం చేసి, తుది మేతగా చిన్న చిన్న ఆకు ముక్కలను వేయాలి. దీని వలన పడక త్వరగా ఆరుతుంది. పరుగులన్నీ జ్వరానికి కూర్చున్న తరువాత పల్చగా సున్నపు పొడిని పడక మీద వాడుట వలన పడకలలోని తేమను తగ్గించటమేకాక వాటి నుండి విడుదల అయ్యే విషవాయువులను పీల్చి పడకలను శుభ్రంగా ఉంచును.

పట్టుగూళ్ళ అల్లిక

పక్వానికి వచ్చిన (మాగిన) పురుగులు ఆకులు తినటం వూనివేసి తట్టల అంచులకు ఎగబాకుతాయి. ఇవి మెత్తటి విసర్జకాలను వదులుతాయి. వీటి శరీరము పారదర్శకంగా ఉంటుంది. పురుగులు గూళ్ళు అల్లుకోవడానికి 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 65-70 శాతం తేమాంశం కల్పించాలి. గాలి ప్రసరణ తప్పనిసరి. వీటిలో తేడాల వల్ల గూళ్ళ నాణ్యత తగ్గుతుంది. పక్వానికి వచ్చినపుడు గూళ్ళను చదరపు అడుగుకు 25 పరుగుల చొప్పన వెదురు చంద్రికలపై గాని నేత్రికలలో గాని వేసి గాలి, వెలుతురు సోకే ప్రదేశాలలో 4-5 గం.లు ఉంచి పరుగులు స్థిరపడిన తరువాత నైలాన్ వల లేదా కాగితంను కప్పి ఉంచవలెను. గూళ్ళ పూర్తిగా అల్లుకొని ప్యూపాగా మారిన తర్వాత మాత్రమే (6-8 రోజుల తర్వాత) గూళ్ళను విడిపించాలి.

చంద్రికలు

పట్టుగూళ్ళను కట్టించడానికి వివిధ రకాల చంద్రికలు అందుబాటులో వున్నప్పటికీ, వెదురు చంద్రికలు ఎక్కువగా వాడుకలో వున్నాయి.

వెదురు చంద్రికలు

ఇవి ఎన్నో సంవత్సరాల నుండి వాడుకలో వున్నాయి. ఇప్పటికీ 90 శాతం మంది పట్టు రైతులు వీటినే ఉపయోగిస్తున్నారు. మాగిన పటు పరుగులను పడకల నుండి ఏరి చంద్రికలలో సమానంగా వేస్తారు. ఇటీవల కాలంలో పట్టు సాగు ఎక్కువగా గల ప్రదేశాలలో కమ్యూనిటీ మౌంటింగ్ హాల్స్ వాడుకలోకి వచ్చాయి. ఇవి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, పారిశుద్ధ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరమున్నది.

మంచి గూళ్ళను, జల్లి గూళ్ళను వేరుచేసి గాలి బాగా సోకే వెదురు గంపలలో గాని లేదా గాలి బాగా తగిలేటట్లు వదులుగా కట్టిన పలుచటి గోనె సంచులు లేదా నైలాన్ వలతో కట్టిన సంచులలో గాని ఉంచి దగ్గర ఉన్న పట్టు గూళ్ళ విక్రయ కేంద్రానికి చల్లటి సమయంలో తరలించాలి. మార్కెట్టు లోనికి తరలించిన వెంటనే సంచుల నుండి గూళ్ళను తీసి గాలి బాగా ఆడే ప్రదేశంలో పలుచగా ఉండాలి.

స్పిన్నింగ్కు తగిన వాతావరణ పరిస్థితులు

 • 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 60-65 శాతం తేమ మరియు మంచి గాలి ప్రసరణ తప్పనిసరి. వీటిలో తేడాల వల్ల గూళ్ళ నాణ్యత తగ్గుతుంది.
 • గూళ్ళు అల్లు గదిలో పచ్చటి కాంతి సమానంగా వుండాలి. వెలుతురు ఒక ప్రక్కనే ఎక్కువగా ఉంటే పరుగులన్నీ ఒక ప్రక్క చేరి డబుల్ గూళ్ళు, మరకలు గల గూళ్ళు ఎక్కువగును.
 • పురుగులను చంద్రికలలో వేసినప్పటి నుండి స్పిన్నింగ్ పూర్తికావడానికి 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అయితే 60 గంటలు, 25 డిగ్రీల వద్ద అయితే 50 గంటల సమయం పడుతుంది.
 • సరిగా మాగని పురుగులను చంద్రికలలో వేసినప్పడు, మాగిన పురుగులను చాలా ఆలస్యంగా చంద్రికలలో వేసినప్పడు డబుల్ గూళ్ళు, మలినమైన గూళ్ళు ఎక్కువగా ఏర్పడతాయి.
 • ఎదుగుదల హెచ్చుతగ్గులుగా ఉన్న లార్వాలను కలిపి చంద్రికలలో వేయడం వల్ల మలినమైన గూళ్ళు ఎక్కువగా వస్తాయి.

పెద్ద పరుగులను క్రింద తెల్పిన పద్ధతుల్లో పెంచుతారు

 • తట్టల్లో లేదా అరలల్లో పెంచడం
 • అంచెల పద్ధతి లేదా స్టాండ్ పద్ధతి
 • కొమ్మ మేత పద్దతి

తట్ట పద్ధతి లేదా అరలలో పెంచడం

ఈ పద్ధతిలో 3 నుండి 5 అడుగుల వ్యాసం గల వెదురు తట్టల్లో పెద్ద పరుగులను పెంచుతారు. పటు పరుగుల దశలకు అనువైన ఆముదం ఆకులను తోట నుండి తెంపి మేతగా వేస్తారు. వలలు లేకుండా లేదా వలలను ఉపయోగించికాని ప్రతి రోజు పడకలను శుభ్రపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో కూలీలు అవసరమగును. కానీ కొమ్మ మేత పద్ధతిలో కంటే ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ పురుగులను పెంచవచ్చు. చిన్న సైజు రేరింగ్ గదులున్న వారు మామూలుగా ఈ పద్ధతిలోనే పట్టు పురుగులను పెంచుతారు.

అంచెల పద్ధతి లేదా స్టాండ్ పద్ధతి

రైతు సోదరులు తమ ప్రాంతంలో దొరికే సరివి లేదా వెదురు బొంగులతో 3 అంచెల స్టాండులు తయారు చేసుకోవాలి. స్టాండు సైజు వారు పెంచే గుడ్లను బట్టి వారికి ఉండే వసతి గృహాన్ని బట్టి అనుగుణంగా నిర్మించుకోవాలి. స్టాండు పద్ధతిలో పరుగులను పెంచడం వలన

 • 50 శాతం కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
 • 20 శాతం ఆకు విుగులుదల ఉంటుంది. ఆకు వృధాకాదు.
 • పురుగులను తక్కువగా చేతితో తాకడం వలన అంటు వ్యాధులు సోకకుండా ఉంటాయి.

కొమ్మమేత పద్ధతి

ఈ పద్ధతిలో అరలపై పట్టు పరుగులను ఉంచి ఆముదం కొమ్మలను మేతగా వేసి పెంచడానికి అనుకూలంగా ఉండటమేకాకుండా ఖర్చు కూడా తగుతుంది. కొమ్మ మేత పద్ధతి వలన పురుగుల పెంపకానికి అవసరమయ్యే కూలీల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పురుగుల పెంపకానికి అనుకూలంగా ఉండడం చేత మరియు తక్కువ మంది కూలీల చేత పంటను పెంచే అవకాశమున్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ పద్ధతినే పాటిస్తున్నారు.

మూమూలుగా 35 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల ఒక్కో అరపైన గూళ్ళు అల్లే దశ వరకు 20,000 పరుగులను ఉంచి పెంచవచ్చు. సాధారణంగా మూడవ దశ పురుగులను (రెండవ జ్వరం నుండి లేచిన పరుగులు) అరలపై గూళ్ళు అల్లే దశ వరకు ఉంచి పెంచుతారు. పురుగులు క్రింద పడకుండా కాపాడుటకు మరియు మేతగా వేసిన ఆముదం ఆకును పూర్తిగా తినుటకుగాను ప్రతి అరకు నాలుగు ప్రక్కలా కాగితముతో అర అడుగు అంచును కట్టాలి. ప్రతి రెండు అరల మధ్య 2 నుండి 2.5 అడుగుల అంతరం ఉండేటట్లు నిర్మించుకోవాలి. అరల అడుగు భాగాలను నైలాన్ దారము లేదా వలతో అల్లి వాటి పైభాగాన పాత న్యూస్ పేపర్లను పరచి పురుగులకు పడకలను ఏర్పాటు చేయాలి. ప్రతి రెండు అరల మధ్య 2 నుండి 2.5 అడుగుల అంతరం వుంచడం వలన స్టాండుపై మేతగా ఆముదం కొమ్మలను పరచడానికి మరియు పురుగులను గమనించుటకు అనుకూలంగా ఉంటుంది. ఊజీ ఈగల బారి నుండి పట్టు పరుగులను కాపాడుటకు రేరింగ్ స్టాండ్ మొత్తాన్ని 2 నుండి 3 అడుగుల దూరంతో నైలాన్ వలను కప్పాలి.

మేత మోతాదు

నాలుగు, ఐదు దశల పట్టు పరుగులు ఎక్కువ శాతం ఆముదం ఆకును (సుమారు 94%) తింటాయి. ఈ దశల్లో పరుగులకు అధిక మోతాదులో మేతను వేయడం వలన పరుగులు గరిష్ట స్థాయికి పెరిగి నాణ్యమైన పటు గూళ్ళను అల్లుతాయి.

కొమ్మమేత పద్ధతిలో ప్రయోజనాలు

 • ఆకులు కొమ్మలకు అతుక్కొని ఉంటాయి కాబట్టి ఎక్కువసమయం తాజాగా ఉంటాయి.
 • పురుగులను చేతులతో తాకే అవసరం చాలా తక్కువ కావడం చేత పరుగుల్లో రోగ వ్యాప్తి తగ్గుతుంది.
 • పడకల్లో పరుగులకు గాలి ప్రసరణ బాగుంటుంది.
 • అధిక శాతం పురుగులు గూళ్ళు అల్లే దశ వరకు బ్రతికి నాణ్యమైన పట్టుకాయల్ని అల్లుతాయి. అ ఆకును ఎక్కువగా (దాదాపు 20%) పొదుపు చేయవచ్చు.
 • పడకల్లో పరుగులు సమానంగా విస్తరించి ఉంటాయి.

ఇబ్బందులు

 • ప్రత్యేకమైన రేరింగ్ గది అవసరము
 • పురుగులను పెంచడానికి ఎక్కువ విస్తీర్ణం గల గది అవసరము.

గూళ్ళు అల్లేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు

 • వాతావరణ పరిస్థితులను బట్టి నాల్గవ జ్వరం నుండి లేచిన తర్వాత 6 నుండి 7 రోజుల్లో పట్టుపురుగులు వూగి (వరిపక్వత చెంది) గూళ్ళు అలుటకు సంసిద్ధమౌతాయి.
 • మాగిన పట్టుపురుగుల శరీరాలు కుంచించుకొనిపోయి, పాక్షికంగా పారదర్శకంగా మారుతాయి.
 • పురుగులు మేత తినడం తగ్గించి, మెత్తని పెంటను వేస్తాయి.
 • మాగిన పరుగులు తల, రొమ్ము భాగాలను పైకెత్తుకొని తట్టలు లేదా రేరింగ్ అరల అంచులకు చేరి గూళ్ళు అల్లుటకు అనువైన స్థలం కోసం వెదుకుతుంటాయి.
 • పండిన పరుగులను పట్టు పరుగుల పడకల నుండి ఏరి గూళ్ళు అల్లుటకు వెదరు చంద్రికలు, ప్లాస్టిక్ నేత్రికలు లేదా తిరిగే చంద్రికలపై వదిలే ప్రక్రియను మౌంటింగ్ అంటారు.
 • అల్లిన పటుపురుగుల పంట ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఉపయోగించే చంద్రికలు సరైనవి కాకపోయినా, చంద్రికలపై వేసే పురుగుల సంఖ్యను క్రమబద్ధం చేయకపోయినా, పరిపక్వత చెందని పురుగులను మౌంటింగ్ చేసినా, నాణ్యమైన పట్టుకాయల దిగుబడిని పొందలేము.
 • నాణ్యమైన పట్టు దారాన్ని గూళ్ళ నుండి సునాయాసంగా రాబటుకోవడానికి పటుపురుగులు గూళ్ళు అల్లే సమయంలో అనువైన వాతావరణ పరిస్థితులను కల్పించుట చాలా ಮಿಖ್ಯಮಿ. అన్ని వైపుల తెరచి ఉండి గాలి సమృద్ధిగా ప్రసరించడానికి వీలు గల గది గూళ్ళు అల్లించుటకు అనువుగా ఉంటుంది.
 • ఒక చదరపు అడుగు విస్తీర్ణం గల చంద్రికపై 40 నుండి 50 పండిన పరుగులను వదలాలి. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు గల ఒక్కో వెదురు చంద్రికపై 900 నుండి 1000 పురుగులను, 11 ముడతలు గల ఒక్కో ప్లాస్టిక్ చంద్రికపై దాదాపు 400 పురుగులను, ఒక్కో తిరిగే చంద్రికపై (10 అట్ట చంద్రికలు గల ఒక యూనిట్) 1250 నుండి 1300 పండిన పరుగులను మౌంటింగ్ చేయవచ్చు.
 • గూళ్ళు అల్లే సమయంలో గదిలోని ఉష్ణోగ్రత 24 – 25o డిగ్రీల సెంటిగ్రేడ్, తేమాంశం 60 నుండి 70% మరియు మంచి గాలి ప్రసరణ ఉండాలి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అల్లిన గూళ్ళు, రకరకాల ఆకారాలను కల్లి ఉండడమే కాక వాటి నుండి దారాన్ని తీయడం కష్టంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలో పరుగులు గూళ్ళను నిదానంగా అల్లుతాయి. తద్వారా అల్లిన గూళ్ళు ఎక్కువ మందం గల దారపు పోగులతో నాసిరకంగా ఉంటాయి. ఎక్కువ తేమ శాతంతో అల్లిన గూళ్ళలో మూత్రపు మరకలు గల గూళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండి, సునాయాసంగా దారాన్ని రాబట్టుకోలేని విధంగా ఉంటాయి.
 • గూళ్ళు అల్లే సమయంలో గదిలో మసక వెలుతురు అనువుగా ఉంటుంది.
 • గూళ్ళను అల్లడం మొదలు పెట్టిన రోజు నుండి మల్టీవోల్టిన్ జాతుల్లో 3 నుండి 4 రోజుల్లోను, బ్రెవోల్టిన్ జాతుల్లో 4 నుండి 5 రోజుల్లో పటు లార్వాలు ప్యూపాలుగా రూపాంతరం చెందుతాయి. ప్యూపా చర్మం బాగా గట్టిపడి ముదురు గోధుమ రంగులోకి మారిన తర్వాత మాత్రమే చంద్రికల నుండి పట్టు గూళ్ళను విడిపించాలి. పూర్తిగా ప్యూపాలుగా మారక ముందే పట్టు గూళ్ళను చంద్రికల నుండి విడిపించినట్లయితే గూళ్ళ నాణ్యత దెబ్బతిని వాటి నుండి దారం తీయడం కష్టమౌతుంది. అనువైన వాతావరణ పరిస్థితుల్లో అల్లిన మల్టీవోల్డెన్ జాతి పట్టు గూళ్ళను చంద్రికలపై వదిలిన రోజు నుండి 5వ రోజున, బ్రైవోల్డెన్ జాతి పట్టు గూళ్ళను 6వ రోజున విడిపించాలి.
 • విడిపించిన గూళ్ళ నుండి చెడు గూళ్ళను వేరుచేసిన తర్వాత ධීරාංරඩ් గూళ్ళపై గల పురుగుల పెంట, చెత్త, చెదారాన్ని తీసివేయాలి. తరువాత గాలి బాగా ప్రసరించే గోనె సంచుల్లో లేదా నైలాన్ వలల్లోనికి తక్కువ మోతాదుల్లో నింపి అమ్మకానికి చల్లని వేళల్లో మార్కెట్కు తీసికొని పోవాలి.
 • ఎరి పటుపురుగుల వ్యాధులు, నివారణ గురించి మల్బరీ సాగు మరియు పట్టుపురుగుల పెంపకం శీర్షికలో వివరించడమైనది.

పరిశోధనా ఫలితాలు

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెంలో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్, హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో " ఎరి పట్టు పురుగుల పెంపకము - అదనపు ఆదాయ వనరు" అనే ప్రాజెక్టును 2011, సెప్టెంబరు నుండి 2014 వరకు నిర్వహించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆముదం రకాలైన హరిత, క్రాంతి, కిరణ్, డిపిసి-9 మరియు పిసిఎస్-262, అదేవిధంగా సంకర రకాలైన పిసిహెచ్-111, పిసిహెచ్-222. జిసి హెచ్-4 మరియు డిసి హెచ్-177ల ఆకులను (30%, 40%, 50%) ఉపయోగించి ఆంబగాన్ మరియు లభీంపూర్ అనే ఎరి పట్టు పురుగుల జాతులను పెంచడం జరిగింది.

పిసి హెచ్-111 యొక్క ప్రతి ఆముదం మొక్క నుండి 45-60 రోజులకొకసారి, 90-105 రోజులకు మరొకసారి మరియు 135-150 రోజులకు మూడోసారి 35% ఆముదం ఆకులను ఉపయోగించి ఎకరానికి 100 లభీంపూర్ జాతి పటుగ్రుడ్లను పెంచి తద్వారా ఒక హెక్టారుకు అధిక నికర ఆదాయం మరియు అధిక ఆదాయ వ్యయ నిష్పత్తి నమోదు చేయడం జరిగింది.

గమనిక

ప్రతి కోత తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా, 10కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా మొక్కకు అందించాలి.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.01353965184
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు